12.
యూసుఫ్
ఆయతులు
: 111 అవతరణ
: మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
12.
యూసుఫ్ 1 - 3 అలిఫ్ లామ్ రా. ఇవి తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా ప్రకటించే
గ్రంథంలోని ఆయతులు. మేము దానిని ఖురానుగా చేసి అరబ్బీ భాషలో అవతరింపజేశాము, మీరు (అరేబియా వాసులు) దానిని చక్కగా అర్థం చేసుకోగలందులకు. ప్రవక్తా! మేము ఈ ఖురానును వహీద్వారా నీ వద్దకు పంపి అత్యుత్తమమైనరీతిలో సంఘటనలనూ యథార్థాలనూ నీకు వివరిస్తున్నాము. ఇంతకుముందు (ఈ విషయాలు) నీకు ఎంతమాత్రం తెలియవు.
12.
యూసుఫ్ 4 - 6 ఇది యూసుఫ్ తన తండ్రితో ఇలా అన్నప్పటి ప్రస్తావన : ‘‘తండ్రీ! నేను ఒక కలగన్నాను
అందులో పదకొండు నక్షత్రాలనూ, సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ చూశాను. అవి నాముందు సాష్టాంగపడ్డాయి.’’ సమాధానంగా అతని తండ్రి ఇలా అన్నాడు: ‘‘కుమారా! నీ స్వప్నాన్ని గురించి నీ సోదరులకు చెప్పకు. ఎందుకంటే వారు నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారు. వాస్తవం ఏమిటంటే షైతాను మనిషికి బహిరంగ శత్రువు. ఆ విధంగానే జరుగుతుంది (నీవు కలలో చూసిన విధంగా). నీ ప్రభువు నిన్ను (తన పనికొరకు) ఎన్నుకుంటాడు. నీకు విషయాల లోతును అందుకోవటం నేర్పుతాడు. నీకూ యాఖూబ్ సంతతికీ తన అనుగ్రహాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు, ఇంతకు పూర్వం ఆయన నీ పెద్దలైన ఇబ్రాహీముకూ, ఇస్హాఖుకూ పూర్తిగా ప్రసాదించినట్లు. నిశ్చయంగా నీ ప్రభువు సర్వజ్ఞుడు, మహావివేకి.
12.
యూసుఫ్ 7 - 18 యథార్థానికి యూసుఫ్ అతని సోదరుల గాథలో ఈ అడిగే వారికి గొప్ప సూచనలు ఉన్నాయి. ఈ గాథ ఇలా ప్రారంభమవుతుంది. అతని సోదరులు పరస్పరం ఇలా చెప్పుకున్నారు : ‘‘వాస్తవానికి మనదొక పెద్ద బలగమైనప్పటికీ యూసుఫ్, అతని సొంత సోదరుడూ ఇద్దరూ అంటే మన తండ్రికి, మన అందరికంటే ఎక్కువ ఇష్టం. నిజంగానే మన తండ్రికి పూర్తిగా మతి భ్రమించింది. కనుక పదండి, యూసుఫ్ను చంపెయ్యండి లేదా అతణ్ణి ఎక్కడైనా పారవెయ్యండి, మీ తండ్రి ధ్యాస కేవలం మీపైనే ఉండేందుకు. ఈ పనిచేసిన తరువాత తిరిగి సజ్జనులుగా ఉండాలి.’’ అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడు: ‘‘యూసుఫ్ను చంపకండి. ఒకవేళ అతన్ని ఏదైనా చెయ్యాలనే అను కుంటే, అతన్ని ఒక చీకటి బావిలో పడవెయ్యండి. వచ్చే పోయే బాటసారుల బృందమేదైనా అతన్ని తీసుకుపోతుంది.’’ ఈ నిర్ణయం తరువాత వారు వెళ్ళి తమ తండ్రితో ఇలా అన్నారు : ‘‘నాన్నా! మీరు యూసుఫ్ విషయంలో మమ్మల్ని ఎందుకని నమ్మరు? వాస్తవానికి మేము అతని నిజమైన శ్రేయోభిలాషులం. రేపు అతనిని మాతో పంపండి. పండ్లూ ఫలాలూ స్వేచ్ఛగా మెక్కుతాడు. ఆటలతో ఆనందిస్తాడు. అతన్ని కాపాడటానికి మేము ఉన్నాము కదా!’’ తండ్రి ఇలా అన్నాడు: ‘‘మీరు అతన్ని తీసుకుపోతే నాకు బాధ కలుగుతుంది. అతని విషయంలో మీరు పరాకుగా ఉన్నప్పుడు ఏదైనా తోడేలు అతనిని తినేస్తుందేమో అని నా భయం.’’ వారు ఇలా సమాధానం ఇచ్చారు: ‘‘పెద్ద బలగమైన మేము వెంట వుండికూడా అతనిని గనక తోడేలు తినివేస్తే మేము వట్టి చేతగాని వాళ్ళము అవుతాము.’’ ఇలా ఒత్తిడి చేసి వారు అతనిని తీసుకునివెళ్ళి ఒక చీకటి బావిలో పడవేద్దామని నిర్ణయించుకున్నప్పుడు, మేము యూసుఫ్కు వహీద్వారా ఇలా తెలిపాము : ‘‘నీవు వారికి వారు చేసిన ఈ చేష్టను ఎత్తి చూపే సమయం వస్తుంది. వారు తమ ఈ దుశ్చర్య ఫలితాలను గ్రహించటం లేదు.’’ సాయంత్రం వారు నెత్తీ నోరూ బాదుకుంటూ తమ తండ్రివద్దకు వచ్చి ఇలా అన్నారు: ‘‘నాన్నా! మేము పరుగు పందెంలో మునిగిపోయాము. యూసుఫ్ను మేము మా సామానువద్ద వదిలిపెట్టాము. అంతలోనే తోడేలు ఒకటి వచ్చి అతన్ని తినివేసింది. మేము నిజం చెబుతున్నా మీరు మా మాటను నమ్మరు.’’ వారు యూసుఫ్ చొక్కాకు బూటకపు రక్తం పూసి తీసుకువచ్చారు. ఇది విని వారి తండ్రి ఇలా అన్నాడు : ‘‘మీ దుష్ట మనస్సులు మీచేత ఒక ఘోరకార్యాన్ని చాలా తేలికగా చేయించాయి. సరే, ఓర్చుకుంటాను. బాగా ఓర్చుకుంటాను. మీరు కల్పిస్తున్న మాటల విషయంలో సహాయం కోసం అల్లాహ్నే అర్థించాలి.’’
12.
యూసుఫ్ 19 - 20 అటు వైపునకు ఒక బాటసారుల బృందం వచ్చింది. వారు నీళ్ళు తోడే తన నౌకరును, నీళ్ళకొరకు పంపారు. ఆ నౌకరు చేదను బావిలోకి వదలినప్పుడు (యూసుఫ్ను చూసి) ‘‘శుభం! ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు’’ అని అరిచాడు. వారు అతనిని వ్యాపార సరకుగా భావించి దాచు కున్నారు. వాస్తవానికి వారు చేస్తూ ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. చివరకు వారు స్వల్పధరకు, కొన్ని దిర్హములకు అతనిని అమ్మివేశారు. వారు అతని ధర విషయంలో అంతకన్నా ఎక్కువ ఆశించలేదు.
12.
యూసుఫ్ 21 - 22 అతనిని కొన్న ఈజిప్టు వ్యక్తి తన భార్యతో ఇలా అన్నాడు : ‘‘ఇతనిని బాగా చూసుకో. ఇతను మనకు లాభదాయకం కావచ్చు లేదా మనం ఇతనిని కొడుకుగా చేసుకోవచ్చు.’’ ఇలా మేము యూసుఫ్కు ఆ భూభాగంపై స్థిరపడే అవకాశాన్ని కల్పించాము. అంతేకాదు అతనికి వ్యవహార జ్ఞానాన్ని నేర్చుకునే ఏర్పాటు చేశాము. అల్లాహ్ తన పనిని చేసి తీరుతాడు. కాని చాలామందికి ఈ విషయం తెలియదు. అతను తన నిండు యౌవనానికి చేరుకున్నప్పుడు, మేము అతనికి నిర్ణయ శక్తినీ, జ్ఞానాన్నీ ప్రసాదించాము. ఇలా మేము సజ్జనులను బహూకరిస్తాము.
12.
యూసుఫ్ 23 - 29 అతను ఉంటున్న ఇంటిలోని స్త్రీ అతని కోసం వల పన్నసాగింది. ఒక రోజున తలుపులు మూసి ‘‘వచ్చెయ్యి!’’ అని అన్నది. యూసుఫ్ ఇలా అన్నాడు : ‘‘నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. నా ప్రభువు నాకు మంచి స్థానం ప్రసాదించాడు. (నేను ఈ పని ఎలా చెయ్యను?) అటువంటి దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు.’’ ఆమె అతని వైపునకు రాసాగింది
యూసుఫ్ కూడా ఆమె వైపునకు పోయివుండేవాడే, ఒకవేళ తన ప్రభువు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే. మేము చెడునూ, నీతిబాహ్యతనూ అతనికి దూరంగా ఉంచటానికి అలా జరిగింది. వాస్తవానికి అతను మేము వరించిన దాసులలోని వాడు. తుదకు యూసుఫ్, ఆమె ఒకరి వెనుక ఒకరు తలుపు వైపునకు పరుగెత్తారు. ఆమె వెనుక నుండి యూసుఫ్ చొక్కాను లాగి చింపివేసింది. వాకిలివద్ద ఉభయులూ ఆమె భర్తను చూశారు. ఆయనను చూడగానే ఆ స్త్రీ ఇలా అనసాగింది: ‘‘నీ ఇల్లాలిని పాడుచేసే బుద్ధి కలవాడికి శిక్ష ఏమిటి? అతనిని జైల్లో పెట్టటమో లేక తీవ్రయాతనకు గురిచెయ్యటమో తప్ప మరొక శిక్ష ఏమవుతుంది?’’ యూసుఫ్ ఇలా అన్నాడు : ‘‘ఈమెయే నన్ను వలలో వేసుకోవటానికి ప్రయత్నం చేసింది.’’ ఆ స్త్రీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఇలా సాక్ష్యమిచ్చాడు : ‘‘యూసుఫ్ చొక్కా
గనక ముందుభాగం చినిగివున్నట్లయితే, అప్పుడు ఈ స్త్రీ చెప్పేది నిజం, అతను పలికేది అబద్ధం. కాని అతని చొక్కా గనక వెనుకభాగాన చినిగివున్నట్లయితే, అప్పుడు స్త్రీ చెప్పేది అబద్ధం, ఆయన పలికేది నిజం.’’ యూసుఫ్ చొక్కా వెనుకనుంచి చినిగి ఉండటాన్ని చూసిన భర్త ఇలా అన్నాడు: ‘‘ఇవి మీ స్త్రీల పన్నాగాలు. నిజంగా మీ పన్నాగాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. యూసుఫ్! ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలెయ్యి. ఓ స్త్రీ! నీవు నీ తప్పునకు క్షమాభిక్ష కోరుకో. అసలు తప్పుచేసినదానివి నీవే.’’
12.
యూసుఫ్ 30 - 34 నగర స్త్రీలు పరస్పరం, ఇలా చర్చించుకోసాగారు : ‘‘అజీజ్ భార్య తన పడుచు బానిసవెంట పడినది. వలపు ఆమెను అదుపులో లేకుండా చేసింది. మా దృష్టిలో ఆమె చేసినది స్పష్టంగా తప్పు.’’ వారి మోసపు మాటలను విని ఆమె వారికి ఆహ్వానం పంపింది.
వారి కొరకు దిండ్లతో అలంకరించబడిన వేదికపై సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విందులో ప్రతి ఒక్కరిముందు ఒక్కొక్క కత్తిని పెట్టింది. (తరువాత సరిగ్గా వారు పండ్లు కోసి తినే సమయంలో) ఆమె యూసుఫ్కు సైగ చేసింది ‘‘వీరి ముందుకు రా’’ అని. ఆ స్త్రీల చూపులు అతనిపై పడినప్పుడు, వారు దిగ్భ్రమచెందారు. తమ చేతులను కోసుకున్నారు. అప్రయత్నంగా ఇలా అరిచారు : ‘‘హాషాలిల్లాహ్! (అల్లాహ్ మహిమ) ఇతను మానవుడు కాదు. ఇతను ఎవరో గొప్ప దైవదూతయే.’’ అప్పుడు అజీజ్ భార్య ఇలా అన్నది: ‘‘చూశారా, ఇతనే ఆ మనిషి, ఇతనిని గురించే మీరు నాపై నిందలు వేశారు. నిస్సందేహంగా నేను ఇతనిని మోహింపచేయటానికి ప్రయత్నించాను. కాని, ఇతడు తప్పించుకున్నాడు. ఇతడు గనక నా మాట వినకపోతే చెరసాల పాలౌతాడు, తీవ్ర అవమానానికి గురిఅవుతాడు.’’ యూసుఫ్ ఇలా అన్నాడు: ‘‘నా ప్రభూ, చెరసాల నాకు ఇష్టమే, వారు కోరే పనిని చెయ్యటంకంటే, నీవు గనక వారి జిత్తుల నుండి నన్ను తప్పించకపోతే నేను వారి వలలో చిక్కుకుపోతాను. అజ్ఞానులలో కలసిపోతాను’’ - అతని ప్రభువు అతని ప్రార్థనను అంగీకరించాడు. ఆ స్త్రీల జిత్తుల నుండి అతనిని తప్పించాడు. నిస్సందేహంగా ఆయనే అందరి మొరలనూ వినేవాడు, అంతా తెలిసినవాడు.
12.
యూసుఫ్ 35 తరువాత అతనిని కొంతకాలం జైలులో పెట్టాలనే ఆలోచన వారికి (పురుషులకు) తట్టింది. వాస్తవానికి వారు (అతని నిర్దోషిత్వానికి తమ స్త్రీల దుశ్శీలతకూ సంబంధించిన) స్పష్టమైన నిదర్శనాలను కూడా చూశారు.
12.
యూసుఫ్ 36 - 41 జైలులో అతనితోపాటు ఇంకా ఇద్దరు బానిసలు కూడా ప్రవేశించారు. ఒకనాడు వారిలో ఒకడు ఇలా అన్నాడు : ‘‘నేను సారాయి పిండుతూ ఉన్నట్లు నన్ను నేను కలలో చూశాను,’’ రెండో అతను ఇలా చెప్పాడు : ‘‘నా తలపై రొట్టెలు ఉన్నాయి, వాటిని పక్షులు తింటున్నట్లు నేను చూశాను.’’ ఉభయులూ ఇలా అడిగారు: ‘‘మాకు వాటి భావం వివరించు, మేము చూస్తూ ఉన్నాము, నీవు చాలా మంచి వాడవు.’’ యూసుఫ్ ఇలా అన్నాడు : ‘‘ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం రాకముందు నేను ఈ స్వప్నాల భావాన్ని మీకు వివరిస్తాను. ఇది నా ప్రభువు నాకు ప్రసాదించిన విద్యల లోనిదే. అసలు విషయం ఏమిటంటే, అల్లాహ్ ను విశ్వసించనివారి, పరలోకాన్ని తిరస్కరించేవారి విధానాన్ని నేను వదలిపెట్టి, నా పెద్దలైన ఇబ్రాహీమ్, ఇస్హాఖ్, యాఖూబ్ల విధానాన్ని అవలంబించాను. ఎవడినైనా అల్లాహ్ కు భాగస్వామిగా చెయ్యటం మా విధానం కాదు. వాస్తవానికి ఇది అల్లాహ్ అనుగ్రహమే మనపైనా,
సమస్త మానవులపైనా (ఆయన మనలను తనకు తప్ప ఇతరులెవ్వరికీ దాసులుగా చెయ్యలేదు అనేది). కాని చాలామంది ప్రజలు కృతజ్ఞతలు చూపరు. నాతోటి ఖైదీలారా! స్వయంగా మీరే ఆలోచించండి, చాలామంది విభిన్న ప్రభువులు మేలా లేక సర్వశక్తిమంతుడు అయిన ఏకైక దేవుడు అల్లాహ్ మేలా? ఆయనను కాదని మీరు దాస్యం చేస్తున్నవారు, మీరూ మీ తాతముత్తాతలూ కల్పించుకున్న కొన్ని పేర్లు మాత్రమే తప్ప మరొకటేమీ కాదు. వారికొరకు అల్లాహ్ ఏ నిదర్శనాన్నీ అవతరింపజెయ్యలేదు. పరిపాలించే అధికారం అల్లాహ్ కు తప్ప మరొకరెవరికీ లేదు. ఆయనను తప్ప మీరు ఎవరి దాస్యాన్నీ చెయ్యకూడదని ఆయన ఆజ్ఞ. ఇదే శుద్ధమైన, సరియైన జీవిత విధానం. కాని ఇది చాలామందికి తెలియదు. తోటి ఖైదీలారా! మీ స్వప్నాలకు భావం ఇదిగో, మీలో ఒకడు తన ప్రభువు (ఈజిప్టు పాదుషా) నకు త్రాగటానికి మధువును అందిస్తాడు. ఇక రెండో అతను, అతడు శిలువ వేయబడతాడు. పక్షులు అతని తలను పొడిచి పొడిచీ తింటాయి. మీరు అడిగిన విషయం పరిష్కారమైపోయింది.’’
12.
యూసుఫ్ 42 వారిలో విడుదల అవుతాడు అని తాను భావించిన వానితో యూసుఫ్ ఇలా అన్నాడు : ‘‘నీ ప్రభువు (ఈజిప్టు రాజు) దగ్గర నా ప్రస్తావన చెయ్యి.’’ కాని షైతాను అతనిని మరుపునకు లోనుచేశాడు. అతడు తన ప్రభువు (ఈజిప్టు రాజు) దగ్గర అతనిని గురించి ప్రస్తావించటం మరచిపోయాడు. అందుచేత యూసుఫ్ జైలులోనే ఎన్నో సంవత్సరాలు ఉండిపోయాడు.
12.
యూసుఫ్ 43 - 44 ఒకరోజు రాజు ఇలా అన్నాడు : ‘‘నేను కలలో చూశాను. బలిసిన ఏడు ఆవులను బక్కచిక్కిన ఏడు ఆవులు తింటున్నాయి. ఏడు ధాన్యపు వెన్నులు పచ్చగా ఉన్నాయి. మరొక ఏడు ఎండిపోయి ఉన్నాయి. సభా సదులారా! మీకు స్వప్నాల అర్థం తెలిస్తే నాకు ఈ స్వప్నఫలాన్ని వివరించండి.’’ వారు ఇలా చెప్పారు : ‘‘ఇవి పీడ కలలకు సంబంధించిన విషయాలు. మాకు ఇటువంటి కలల భావం తెలియదు.’’
12.
యూసుఫ్ 45 ఆ ఇద్దరు ఖైదీలలో విడుదలయిపోయిన వ్యక్తికి చాలా కాలం తరువాత ఇప్పుడు విషయం గుర్తుకు వచ్చింది. అతడు ఇలా అన్నాడు : ‘‘నేను మీకు దీని ఫలాన్ని వివరిస్తాను. నన్ను కొంచెం (జైలులోని యూసుఫ్ వద్దకు) పంపండి.’’
12.
యూసుఫ్ 46 - 49 అతడు అక్కడకు పోయి ఇలా అన్నాడు : ‘‘యూసుఫ్, నిలువెల్ల సత్యమైనవాడా! నాకు ఈ స్వప్న ఫలాన్ని తెలుపు. ఏడు లావుపాటి ఆవులను, ఏడు సన్నపాటి ఆవులు తింటున్నాయి. ఏడు వెన్నులు పచ్చగా ఉంటే, మరొక ఏడు ఎండిపోయి ఉన్నాయి. బహుశా నేను వారివద్దకు తిరిగి వెళతాను. అప్పుడు వారు తెలుసుకుంటారు.’’ యూసుఫ్ ఇలా అన్నాడు : ‘‘ఏడు సంవత్సరాల వరకు మీరు ఎడతెగకుండా సేద్యం చేస్తూ ఉంటారు. ఆ కాలంలో మీరు కోసిన పంటలో కొంతభాగాన్ని మీకు ఆహారంగా పనికివచ్చేటందుకు తీసిపెట్టుకోండి. మిగతా భాగాన్ని వెన్నులలోనే ఉంచండి. తరువాతి ఏడు సంవత్సరాలు బహు గడ్డుగా ఉంటాయి. ఆ కాలంలో అప్పటికొరకు మీరు నిలువచేసి ఉంచిన ధాన్యం మొత్తం మీరు తింటారు. ఒకవేళ కొద్దిగా ఏమైనా మిగిలితే, అది మీరు దాచిపెట్టి ఉంచుకున్నదే. దాని తరువాత మరొక సంవత్సరం వస్తుంది, అప్పుడు ప్రజల మొరలను ఆలకించి పుష్కలమైన వర్షాలతో వారిని ఆదుకోవటం జరుగుతుంది. వారు రసాన్ని పిండుతారు.’’
12.
యూసుఫ్ 50 - 51 రాజు ఇలా అన్నాడు:
‘‘అతనిని నా వద్దకు తీసుకురండి.’’ కాని రాజదూత యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు : ‘‘నీ ప్రభువు వద్దకు తిరిగి వెళ్ళు. తమ చేతులను కోసుకున్న నారీమణుల వ్యవహారం గురించి అతనిని అడుగు. నా ప్రభువునకు వారి జిత్తులను గురించి బాగానే తెలుసు.’’ ఆపై రాజు ఆ స్త్రీలను ఇలా విచారించాడు : ‘‘మీరు యూసుఫ్ను మోహింపజెయ్యటానికి ప్రయత్నించినప్పుడు మీకు కలిగిన అనుభవం ఎటువంటిది?’’ వారందరూ ఏకవాక్యంగా ఇలా అన్నారు : ‘‘హాషాలిల్లాహ్! (దేవుడు మమ్మల్ని రక్షించుగాక). మేము అతనిలో దోషలేశాన్ని కూడా చూడలేదు.’’ అజీజ్ భార్య ఇలా అన్నది : ‘‘ఇప్పుడు నిజం బయటపడిరది. అతనిని మరులు గొల్చటానికి ప్రయత్నించింది నేనే. నిస్సందేహంగా అతడు పూర్తిగా సత్యవంతుడు.’’
12.
యూసుఫ్ 52 - 53 (యూసుఫ్ ఇలా అన్నాడు): ఇలా చెయ్యటంలో నా ఉద్దేశ్యం ఏమిటంటే, నేను చాటుమాటుగా అతనికి ద్రోహం చెయ్యలేదనీ, ద్రోహుల జిత్తులను అల్లాహ్ పారనీయడనీ (అజీజ్) తెలుసుకోవాలి. నేను నా మనస్సు నిర్దోషిత్వాన్ని చాటుకోవటం లేదు. మనస్సు చెడుకై ప్రేరేపిస్తూనే ఉంటుంది, నా ప్రభువు కరుణించినవారిని తప్ప. నిస్సందేహంగా నా ప్రభువు క్షమించేవాడూ, కరుణించేవాడూను.
12.
యూసుఫ్ 54 రాజు ఇలా అన్నాడు: అతనిని నా వద్దకు తీసుకురండి. నేను అతనిని ప్రత్యేకంగా నా కోసం వినియోగించుకుంటాను...
12.
యూసుఫ్ 54 - 55 ... యూసుఫ్ అతనితో మాట్లాడినప్పుడు తను ఇలా అన్నాడు : ‘‘ఇప్పుడు మీకు మా వద్ద గౌరవప్రదమైన స్థానం ఉన్నది. మీరు విశ్వసనీయులు. మాకు మీపై పూర్తి నమ్మకం ఉంది.’’ యూసుఫ్ ఇలా అన్నాడు : ‘‘దేశంలోని ఖజానాలను నాకు అప్పగించండి. వాటిని నేను రక్షించగలను. అందుకు తగిన జ్ఞానం నాకు ఉన్నది.’’
12.
యూసుఫ్ 56 - 57 ఇలా మేము ఆ భూభాగంపై యూసుఫ్ కొరకు అధికార మార్గాన్ని సుగమం చేశాము. ఆ భూభాగంపై తాను కోరినచోట తన స్థానాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు అతనికి ఉన్నది. మాకు ఇష్టమైనవారికి మా కారుణ్యభాగ్యాన్ని మేము కలుగజేస్తాము. సజ్జనుల ప్రతిఫలం మా వద్ద వృధా కాదు. విశ్వసించి భయభక్తులతో వ్యవహరించే వారికి పరలోక ప్రతిఫలమే ఎక్కువ ఉత్తమమైనది.
12.
యూసుఫ్ 58 - 62 యూసుఫ్ సోదరులు ఈజిప్టుకు వచ్చారు. అతని ముందు హాజరయ్యారు. అతను వారిని గుర్తుపట్టాడు. కాని వారు అతనిని గుర్తుపట్టలేదు. వారు బయలుదేరుతుండగా వారితో ఇలా అన్నాడు: ‘‘మీ మారు సోదరుణ్ణి నా వద్దకు తీసుకురండి. నేను ఎలా కొలపాత్రను నింపి ఇస్తున్నానో, ఎంత చక్కగా అతిథులను సత్కరిస్తున్నానో మీరు చూడటం లేదా! మీరు గనక అతనిని తీసుకురాకపోతే, మీకు నా వద్ద ధాన్యం లభించదు. మీరు నా దరిదాపులకు కూడా రావద్దు. వారు ఇలా అన్నారు : ‘‘తండ్రిగారు అతనిని పంపటానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాము. మేము అలా తప్పకుండా చేస్తాము.’’ యూసుఫ్ తన నౌకర్లకు సంజ్ఞ చేశాడు : ‘‘వారు ధాన్యానికి బదులుగా ఇచ్చిన సొమ్మును మెల్లగా వాళ్ళ సామానులోనే పెట్టెయ్యండి.’’ వారు ఇంటికి చేరి, తిరిగి పొందిన తమ సొమ్మును గుర్తిస్తారనీ, (లేక ఈ దాతృత్వానికి కృతజ్ఞులౌతారనీ) వారు తిరిగివచ్చినా ఆశ్చర్యం లేదనీ ఆశించి యూసుఫ్ ఇలా చేశాడు.
12.
యూసుఫ్ 63 - 68 వారు తమ తండ్రివద్దకు పోయి ఇలా అన్నారు : ‘‘నాన్నా! ఇకముందు మనకు ధాన్యం ఇవ్వటానికి తిరస్కరించారు. కనుక, ధాన్యం తెచ్చేందుకు మీరు మా తమ్ముణ్ణి మాతోపాటు పంపండి. అతనిని రక్షించే బాధ్యత మాది.’’ తండ్రి ఇలా సమాధానం చెప్పాడు : ‘‘నేను అతని విషయంలో మిమ్మల్ని ఇదివరకు అతని సోదరుని విషయంలో నమ్మినట్లుగానే నమ్మాలా? అల్లాహ్ యే ఉత్తమ రక్షకుడు. ఆయనే అందరికంటే అధికంగా కరుణించేవాడు.’’ తరువాత వారు తమ సామాను సంచులు విప్పగా, వారిసొమ్ము వారికి తిరిగి ఇవ్వబడినట్లు గమనించారు. ఇది చూచి వారు ఇలా అరిచారు : ‘‘నాన్నా! ఇంకా మనకేం కావాలి, చూడండి! మన సొమ్ము కూడ మనకు తిరిగి ఇవ్వబడిరది. కనుక ఇక మేము వెళ్ళుతాము. మా ఆలుబిడ్డల కొరకు ఆహారపదార్థాలను తీసుకొనివస్తాము. మా సోదరుని రక్షణ విషయం కూడా చూసుకుంటాము. అదనంగా ఒక ఒంటె మోసే బరువు ధాన్యాన్ని కూడా తీసుకువస్తాము. ఇంత అదనంగా ధాన్యం తేలికగా లభిస్తుంది.’’ వారి తండ్రి ఇలా అన్నాడు : ‘‘నేను అతనిని మీవెంట ఎంతమాత్రం పంపను, అతనిని తప్పకుండా తిరిగి నా వద్దకు తీసుకుని వస్తామని, అల్లాహ్ పేరుతో నా ముందు మీరు ప్రమాణం చేస్తే తప్ప. మీరు ముట్టడికి గురిఅయితే అది వేరే విషయం. వారు అతని ముందు తమ తమ ప్రమాణాలను చేసినప్పుడు అతను ఇలా అన్నాడు : ‘‘చూడండి! మన ఈ మాటలను అల్లాహ్ గమనిస్తున్నాడు.’’ అతను ఇలా అన్నాడు : ‘‘కుమారులారా! ఈజిప్టు రాజధాని లోనికి ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి. విభిన్న ద్వారాల గుండా పొండి. కాని నేను అల్లాహ్ సంకల్పం నుండి మిమ్మల్ని కాపాడలేను. ఆజ్ఞ ఆయనది తప్ప మరెవరిదీ చెల్లదు. ఆయననే నేను నమ్ముకున్నాను. నమ్మదలచుకున్న వారందరూ ఆయననే నమ్ముకోవాలి. జరిగింది కూడా అదే. వారు తమ తండ్రి ఆజ్ఞానుసారం నగరంలో (విభిన్న ద్వారాల గుండా) ప్రవేశించినప్పుడు, అతని ఈ ముందు జాగ్రత్త చర్య అల్లాహ్ సంకల్పం ముందు దేనికీ పనికిరాకుండా పోయింది. యాఖూబ్ తన మనస్సులో ఉన్న సంకోచాన్ని నివృత్తి చేసుకోవటానికి - తనకు తోచిన కృషి చేశాడు, అంతే. నిస్సందేహంగా అతను మేము నేర్పిన విద్యవల్ల జ్ఞాని అయ్యాడు. కాని చాలామంది వ్యవహారానికి సంబంధించిన యథార్థాన్ని ఎరుగరు.
12.
యూసుఫ్ 69 వారు యూసుఫ్ సమక్షానికి పోయినప్పుడు అతను తన వద్దకు తన సొంత సోదరుణ్ణి వేరుగా పిలిపించుకున్నాడు. అతనికి ఇలా తెలిపాడు : ‘‘నేను (తప్పిపోయిన) నీ అన్నయ్యనే. వారు చేస్తూ ఉండిన పనులకు నీవు ఇప్పుడు చింతించకు.’’
12.
యూసుఫ్ 70 - 76 తన సోదరుల సామాను బస్తాలకు ఎత్తించే ఏర్పాట్లు చేస్తూ, యూసుఫ్ తన సొంత సోదరుని సామానులో తన పాత్రను పెట్టాడు. ప్రకటనలు చేసే ఉద్యోగి ఒకడు ఎలుగెత్తి ఇలా అన్నాడు: ‘‘బిడారు జనులారా! అసలు మీరు దొంగలు.’’ వారు వెనుకకు తిరిగి ఇలా అడిగారు : ‘‘మీదే వస్తువు పోయిందేమిటీ?’’ ప్రభుత్వోద్యోగులు ఇలా అన్నారు : ‘‘రాజు గారి పాత్ర మాకు కనిపించటం లేదు.’’ (వారి జమేదారు ఇలా అన్నాడు): ‘‘దానిని తెచ్చినవారికి ఒక ఒంటె బరువు ధాన్యం బహుమానంగా లభిస్తుంది. ఆ బాధ్యత నాది.’’ ఆ సోదరులు ఇలా అన్నారు : ‘‘అల్లాహ్ మీద ఒట్టు! మీకు బాగా తెలుసు. మేము ఈ దేశంలో సంక్షోభం సృష్టించటానికి రాలేదు. మేము దొంగతనాలు చేసేవాళ్ళం కాము.’’ వారు ఇలా అన్నారు : ‘‘సరే, మీమాట అబద్ధమని తేలితే అప్పుడు దొంగకు శిక్ష ఏమిటి?’’ వారు ఇలా పలికారు : ‘‘వాడికి శిక్ష ఏమిటా? ఎవడి సామానులో వస్తువు దొరుకుతుందో అతడే తనకు శిక్షగా బానిసగా ఉంచుకోబడాలి. మావద్ద అటువంటి దుర్మార్గులను శిక్షించే పద్ధతి ఇదే.’’ అప్పుడు యూసుఫ్ తన సొంత సోదరుని సంచి వెతికేముందు మారు సోదరుల సంచులను వెతకటం ప్రారంభించాడు. తరువాత, తన సోదరుని సంచి నుండి పోయిన వస్తువును బయటకు తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్కు మా యుక్తిద్వారా సహాయపడ్డాము. రాజధర్మం (అంటే ఈజిప్టు రాజ శాసనం) ప్రకారం తన సోదరుణ్ణి బంధించటం అతనికి తగదు. ఒకవేళ అల్లాహ్ యే అలా కోరితే తప్ప. మేము కోరిన వారి స్థానాలను పెంచుతాము. జ్ఞానులందరినీ మించిన జ్ఞాని ఒకడు ఉన్నాడు.
12.
యూసుఫ్ 77 సోదరులు అన్నారు: ‘‘ఇతడు గనక దొంగతనం చేస్తే ఇది అంత ఆశ్చర్యమైన విషయమేమీ కాదు. ఇదివరకు ఇతని సోదరుడు (యూసుఫ్) కూడా దొంగతనం చేసి ఉన్నాడు.’’ యూసుఫ్ వారి ఈ మాటలను విని తన భావాలను అణచివుంచాడు. యథార్థాన్ని వారిముందు బయటపెట్టలేదు. అయితే (లోలోన) మాత్రం ఇలా అనుకున్నాడు : ‘‘మీరు చాల దుర్మార్గులు. (నా ముఖం మీదే) నాపై మీరు మోపుతున్న అభియోగం యొక్క వాగ్దానాన్ని అల్లాహ్ బాగా ఎరుగును.’’
12.
యూసుఫ్ 78 - 79 వారు ఇలా అన్నారు: ‘‘అధికారం గల ఓ నాయకుడా (అజీజ్)! ఇతని తండ్రి చాలా ముసలివాడు. ఇతనికి బదులు మీరు మాలో ఒకరిని ఉంచుకోండి. మేము మిమ్మల్ని మంచి మనస్సు కలవారుగా చూస్తున్నాము.’’ యూసుఫ్ ఇలా అన్నాడు : ‘‘అల్లాహ్ రక్షించుగాక! ఎవని వద్ద మా సొమ్ము దొరికినదో అతనిని వదిలిపెట్టి మరొకరిని మేము ఎలా బంధించగలము? ఒకవేళ అలా చేస్తే మేము దుర్మార్గులమైపోతాము!’’
12.
యూసుఫ్ 80 - 82 వారు యూసుఫ్ పట్ల నిరాశచెంది, ఒక మూలకుపోయి పరస్పరం సంప్రదించుకున్నారు. వారిలో అందరికంటే పెద్దవాడు ఇలా అన్నాడు : ‘‘మీ తండ్రి అల్లాహ్ పేరు మీద మీ చేత ప్రమాణం చేయించుకున్న విషయం మీకు తెలియదా? లోగడ యూసుఫ్ విషయంలో మీరు చేసినది కూడా మీకు తెలుసు. ఇప్పుడు నేను మాత్రం ఇక్కడినుంచి వెళ్ళను, నాతండ్రి నాకు అనుమతిని ఇవ్వనంతవరకు లేదా అల్లాహ్ యే నా విషయంలో ఏదైనా తీర్పు చెయ్యనంతవరకు. ఎందుకంటే ఆయన అందరికంటే ఉత్తమముగా తీర్పు చేసేవాడు. మీరు వెళ్ళి మీ తండ్రితో ఇలా అనండి: ‘‘తండ్రీ! మీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము అతనిని దొంగతనం చేస్తూ ఉండగా చూడలేదు. మాకు తెలిసిన దానిని మాత్రమే మేము చెబుతున్నాము. రహస్యంగా జరిగే దానిని మేము చూడలేము కదా! మేము బసచేసిన నగరంలోని వారిని మీరు అడిగి తెలుసుకోండి. మేము కలసి తిరుగు ప్రయాణం చేసిన బిడారును విచారించండి. మేము చెప్పేది పూర్తిగా నిజము.’’
12.
యూసుఫ్ 83 - 87 వారి తండ్రి ఈ గాధను విని ఇలా అన్నాడు : ‘‘అసలు మీ దుష్ట మనస్సులు మీచేత మరొక ఘోర కార్యాన్ని తేలికగా చేయించాయి. సరే, దీనిని కూడా సహిస్తాను, బాగా సహిస్తాను. అల్లాహ్ చివరకు వారందరినీ తెచ్చి నాతో కలుపుట జరగవచ్చు కదా! ఆయనకు సర్వమూ తెలుసు. ఆయన పనులన్నీ వివేకంతో నిండివుంటాయి.’’ తరువాత అతను వారివైపు నుండి తన ముఖాన్ని తిప్పుకుని కూర్చుండిపోయాడు. ‘‘అయ్యో! యూసుఫ్’’ అంటూ వాపోయాడు. అతను లోలోన ద్ణుఖంతో క్రుంగి పోసాగాడు. అతని నేత్రాలు తెలుపెక్కాయి - కొడుకులు ఇలా అన్నారు : ‘‘అయ్యో దైవమా! మీరు ఒక్క
యూసుఫ్నే
జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చివరకు అతని పట్ల ద్ణుఖంతోనే మీరు కృశించిపోతారు లేదా మీ ప్రాణాన్ని తీసుకుంటారు.’’ అతను ఇలా అన్నాడు : ‘‘నేను నా ఆందోళనను గురించి, నా ఆవేదనను గురించి అల్లాహ్ కు తప్ప మరెవరికి ఫిర్యాదు చెయ్యను. అల్లాహ్ ను నేను ఎరిగినట్లు మీరు ఎరుగరు. కుమారులారా! వెళ్ళి, యూసుఫ్ను గురించీ అతని సోదరుని గురించీ దర్యాప్తు చెయ్యండి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. ఆయన కారుణ్యం పట్ల కేవలం అవిశ్వాసులే నిరాశ చెందుతారు.’’
12.
యూసుఫ్ 88 - 93 వారు ఈజిప్జుకు పోయి యూసుఫ్ దర్బారులో ప్రవేశించి ఇలా విన్నవించుకున్నారు : ‘‘అధికారం గల ఓ నాయకుడా! మేమూ, మా కుటుంబమూ పెద్ద ఆపదకు గురిఅయ్యాము. మేము కొద్దిసొమ్మును మాత్రమే తీసుకుని వచ్చాము. కనుక మీరు దయచేసి మాకు ధాన్యాన్ని పూర్తిగా ఇప్పించండి. మాకు దానం చెయ్యండి. దానం చేసేవారికి అల్లాహ్ ప్రతిఫలం ఇస్తాడు.’’ (ఇది విని యూసుఫ్ ఉండబట్టలేకపొయ్యాడు). అతను ఇలా అన్నాడు : ‘‘అజ్ఞానంలో పడి మీరు యూసుఫ్ పట్లా అతని సోదరునిపట్లా ఎలా వ్యవహరించారో మీకు తెలుసా?’’ వారు ఉలిక్కిపడి ఇలా అన్నారు: ‘‘ఆ! ఏమిటీ నీవు యూసుఫ్వా?’’ అతను ఇలా చెప్పాడు : ‘‘అవును, నేను యూసుఫ్ను. ఇతడు నా సోదరుడు. అల్లాహ్ మాపై దయచూపాడు. వాస్తవం ఏమిటంటే భయభక్తులతో, ఓర్మితో వ్యవహరించే సత్పురుషుల ప్రతిఫలం అల్లాహ్ వద్ద వృధా కాదు.’’ వారు ఇలా అన్నారు : ‘‘అల్లాహ్ తోడు! అల్లాహ్ మాకంటే నీకు ఎక్కువ ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. మేము నిజంగానే దోషులం.’’ అతను ఇలా జవాబు పలికాడు : ‘‘ఈ రోజు మిమ్మల్ని నిందించటం జరగదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక, ఆయన అందరికంటే అధికంగా కరుణించేవాడు. వెళ్ళండి, ఈ నా చొక్కాను తీసుకుని వెళ్ళండి. నా తండ్రి ముఖంపై వేయండి. ఆయనకు తిరిగి దృష్టి వస్తుంది. మీ కుటుంబ సభ్యులందరినీ నా వద్దకు తీసుకురండి.’’
12.
యూసుఫ్ 94 - 95 ఇక్కడ ఆ బిడారు (ఈజిప్టు నుండి) బయలుదేరినప్పుడు, అక్కడ (కనాన్లో) వారి తండ్రి ఇలా అన్నాడు : ‘‘నాకు యూసుఫ్ పరిమళం స్ఫురిస్తోంది. ముసలితనం వల్ల నా మతి చలించిందని మీరు అనుకోవచ్చు.’’ అతని ఇంటివారు ఇలా అన్నారు : ‘‘అల్లాహ్ తోడు! మీరు ఇంకా మీ పాత పిచ్చిలోనే పడివున్నారు.’’
12.
యూసుఫ్ 96 - 98 తరువాత శుభవార్తాహరుడు వచ్చి యూసుఫ్ చొక్కాను యాఖూబ్ ముఖంపై వేశాడు. హఠాత్తుగా ఆయనకు మళ్లీ దృష్టి వచ్చింది. అప్పుడు అతను ఇలా అన్నాడు : ‘‘నేను మీకు చెబుతూ ఉండేవాణ్ణి కాదా? మీకు తెలియంది అల్లాహ్ తరఫు నుండి నాకు తెలుసు అని.’’ అంతా ఇలా అన్నారు : ‘‘నాన్నా! మా పాపాలను క్షమించవలసినదిగా మీరు అల్లాహ్ ను ప్రార్థించండి. మేము నిజంగానే దోషులము.’’ అతను ఇలా అన్నాడు : ‘‘మిమ్ములను క్షమించవలసినదిగా నేను నా ప్రభువును అర్థిస్తాను. ఆయన అమితంగా క్షమించేవాడూ, కరుణించేవాడూనూ.’’
12.
యూసుఫ్ 99 తరువాత వారు యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు, అతను తన తల్లిదండ్రులను తన వద్ద కూర్చోబెట్టుకున్నాడు. (తన కుటుంబం వారితో) ఇలా అన్నాడు : ‘‘పదండి, ఇక పట్టణంలోకి పదండి. అల్లాహ్ సంకల్పిస్తే మీరు సుఖశాంతులతో జీవిస్తారు.’’
12.
యూసుఫ్ 100 - 101 (పట్టణంలో ప్రవేశించిన తరువాత) అతను తన తల్లిదండ్రులను తన చేతులతో ఎత్తి సింహాసనం మీద తనతో కూర్చోబెట్టుకున్నాడు. అందరూ అతని ముందు అప్రయత్నంగా సజ్దాలో పడిపోయారు. యూసుఫ్ ఇలా అన్నాడు : ‘‘తండ్రీ! నేను పూర్వం కన్న కలకు ఇదీ ఫలం. నా ప్రభువు దానిని నిజం చేశాడు. అంతా ఆయన దయ! ఆయన నన్ను కారాగారం నుండి బయటకు తీశాడు. మిమ్మల్ని ఎడారి నుండి తీసుకొనివచ్చి నాతో కలిపాడు. వాస్తవానికి షైతాను నా మధ్య నా సోదరుల మధ్య కలహాన్ని సృష్టించాడు. యథార్థం ఏమిటంటే, నా ప్రభువు ప్రజలు గ్రహించలేని యుక్తుల ద్వారా తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. నిస్సందేహంగా ఆయన తెలిసినవాడూ వివేకవంతుడూను. నా ప్రభూ! నీవు నాకు అధికారాన్ని ప్రసాదించావు. మాటల లోతును అందుకోవటం నేర్పావు. భూమ్యాకాశాల నిర్మాతా! నీవే ఇహపరలోకాలలో నాకు సంరక్షకుడవు. నేను ఇస్లామ్ ధర్మంలో ఉన్న స్థితిలోనే నా జీవితాన్ని సమాప్తం చెయ్యి. చివరకు నన్ను సజ్జనులలో కలుపు.’’
12.
యూసుఫ్ 102 - 104 ప్రవక్తా! ఈ గాధ అగోచర విషయాలలోనిది. దానిని మేము నీకు వహీద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే యూసుఫ్ సోదరులు పరస్పరం కూడబలుకుకొని కుట్రపన్నిన సమయంలో నీవు లేవుకదా! కానీ ఎంతగా నీవు కోరినా వీరిలో చాలామంది విశ్వసించరు. వాస్తవానికి నీవు ఈ సేవకు వారినుండి ఏ విధమైన ప్రతిఫలాన్ని కూడా కోరటం లేదు. ప్రపంచంలోని ప్రజలందరికీ ఇది ఒక హితబోధ.
12.
యూసుఫ్ 105 - 108 భూమిలో ఆకాశాలలో ఎన్ని సూచనలు లేవు! కాని వారు వాటిని చూస్తూపోతూ ఉంటారు. కొంచెమైనా గమనించరు. వారిలో అల్లాహ్ ను విశ్వసించేవారు ఎంతమంది లేరు! కాని వారు ఆయనతోపాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతూ ఉంటారు. దైవశిక్షకు సంబంధించిన
ఆపద ఏదీ వారిని చుట్టుముట్టదనీ, తెలియకుండా వారిపైకి ప్రళయగడియ అకస్మాత్తుగా వచ్చిపడదనీ వారు నిశ్చింతగా ఉన్నారా? నీవు వారికి స్పష్టంగా ఇలా తెలియజెయ్యి : ‘‘నా మార్గం ఇది - నేను అల్లాహ్ వైపునకు పిలుస్తాను. స్వయంగా నేను కూడా నిండు వెలుగులో నా మార్గాన్ని చూస్తున్నాను. నా సహచరులు కూడా చూస్తున్నారు. అల్లాహ్ పరిశుద్ధుడు. షిర్కు చేసేవారితో నాకు ఏ సంబంధమూ లేదు.’’
12.
యూసుఫ్ 109 - 110 ప్రవక్తా! నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరు కూడా మానవులే. ఈ పట్టణవాసులలోని వారే, వారివైపునకే మేము ‘వహీ’ని పంపుతూ వచ్చాము. ఆ ప్రజలు భూమిపై సంచారం చెయ్యలేదా, తమకు ముందు గతించిన జాతుల వారి ముగింపును వారు చూడలేదా? నిశ్చయంగా పరలోక గృహం (ప్రవక్తల మాటలను విశ్వసించి) భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి (ఇహలోక గృహం కంటే) ఎంతో మేలైనది. ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోరా? (పూర్వపు ప్రవక్తల విషయంలో కూడా ఇలానే జరిగింది. వారు ఎంతోకాలం హితబోధ చేశారు. అయినా ప్రజలు వినలేదు). చివరకు ప్రవక్తలు ప్రజలను గురించి నిరాశచెందినప్పుడు, ప్రజలు కూడా తమకు అబద్ధం చెప్పబడిరదని భావించినప్పుడు, అకస్మాత్తుగా మా సహాయం ప్రవక్తలకు చేరింది. అటువంటి సమయం ఆసన్నమైనప్పుడు, మా సంప్రదాయం ఏమిటంటే, మేము కోరినవారిని రక్షించుకుంటాము. కాని మా శిక్షను దోషులపై పడకుండా తొలగించటం సాధ్యం కాదు.
12.
యూసుఫ్ 111 పూర్వపు ప్రజలకు సంబంధించిన ఈ గాథలలో బుద్ధీ, స్పృహ ఉన్న వారికి ఒక గుణపాఠం ఉన్నది. ఖురానులో చెప్పబడుతున్న ఇవన్నీ కల్పిత విషయాలు కావు. వాస్తవానికి ఇవి ఇదివరకు వచ్చిన గ్రంథాలకు ధ్రువీకరణ. ప్రతి విషయానికీ వివరణ. విశ్వసించేవారికి హితబోధా, (దేవుని) కారుణ్యమూను.
No comments:
Post a Comment