8 సూరహ్ అల్‌ అన్‌ఫాల్‌

 

8. అల్అన్ఫాల్

ఆయతులు : 75          అవతరణ : మదీనాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

8. అల్అన్ఫాల్  1 - 6 వారు నిన్ను ‘‘అన్ఫాల్’’ను గురించి అడుగుతున్నారు. ఇలా అను : ‘‘ అన్ఫాల్అల్లాహ్కూ ఆయన ప్రవక్తకూ చెందుతాయి. కనుక మీరు అల్లాహ్ కు భయపడండి. మీ పరస్పర సంబంధాలను సంస్కరించుకోండి. అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి, మీరు గనక విశ్వాసులే అయితే.’’ నిజమైన విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావన విన్నంతనే భయంతో కంపిస్తాయి. వారి సమక్షంలో అల్లాహ్ ఆయతులు పారాయణం చెయ్యబడినప్పుడు వారి విశ్వాసం పెరుగుతుంది. వారు తమ ప్రభువు పట్ల నమ్మకం కలిగివుంటారు. వారు నమాజును స్థాపిస్తారు. వారికి మేమిచ్చిన దానినుండి (మా మార్గంలో) ఖర్చుపెడతారు. అటువంటి వారే నిజమైన విశ్వాసులు. వారికొరకు వారి ప్రభువు వద్ద ఉన్నత స్థానాలు ఉన్నాయి. తప్పులకు మన్నింపు ఉంది. శ్రేష్ఠమైన ఆహారం ఉంది. ( అన్ఫాల్వ్యవహారంలో కూడా ఇదివరకు ఉత్పన్నమైన పరిస్థితి వంటిదే ఇప్పుడూ ఉత్పన్నమౌతోంది. అప్పుడు) నీ ప్రభువు నిన్ను సత్యంతో నీ గృహం నుండి బయటకు తీసుకువచ్చాడు. విశ్వసించిన వారిలోని ఒక వర్గం వారికి ఇది ఇష్టం లేదు. వారు సత్యం విషయంలో నీతో ఘర్షణపడ్డారు, అది వాస్తవానికి సత్యమని పూర్తిగా రుజువైపోయింది. వారి పరిస్థితి తమ కళ్లముందే తాము మృత్యువు వైపునకు తరుమబడే వారి మాదిరిగా ఉంది.

8. అల్అన్ఫాల్  7 - 8  రెండు వర్గాలలో ఒక వర్గం మీకు దొరికిపోతుందని అల్లాహ్ వాగ్దానం చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు బలహీనవర్గం దొరకాలని మీరు కోరుకున్నారు. కాని తన మాటల ద్వారా సత్యం యొక్క సత్యతను నిరూపించాలనేది, అవిశ్వాసులను సమూలంగా నాశనం చెయ్యాలనేది అల్లాహ్ సంకల్పం. ఎందుకంటే, సత్యం సత్యంగా రూఢ కావాలని, అసత్యం అసత్యంగా రుజువు కావాలని, ఇది అపరాధులకు ఎంత అనిష్టమైనా సరే.

8. అల్అన్ఫాల్  9 - 10 ఇంకా మీరు మీ ప్రభువును సహాయం కొరకు ప్రార్థించిన సందర్భాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి. సమాధానంగా అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చాడు : ‘‘నేను మీ సహాయం కొరకు వెయ్యిమంది దైవదూతలను ఒకరి తరువాత ఒకరిని ఎడతెగకుండా పంపుతున్నాను.’’ మీకు శుభవార్తగానూ మీ మనస్సులు దీనివల్ల నిశ్చింతగా ఉండే నిమిత్తమూ అల్లాహ్ విషయాన్ని మీకు తెలిపాడు. సహాయమనేది ఎప్పుడు లభించినా అల్లాహ్ తరఫు నుండే లభిస్తుంది. నిశ్చయంగా అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు, అత్యంత వివేకవంతుడూను.

8. అల్అన్ఫాల్  11 ఇంకా సమయాన్ని అప్పుడు అల్లాహ్ తన తరఫు నుండి నిద్రమత్తురూపంలో నిశ్చింతనూ, నిర్భయస్థితినీ మీపై ఆవహింపచేస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశం నుండి మీపై నీళ్ళను వర్షింపచేస్తూ ఉన్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచాలని, మీకు షైతానువల్ల కలిగిన మాలిన్యాన్ని మీనుండి దూరం చెయ్యాలని, మీకు ధైర్యం కలిగించాలని, తద్వారా మీ పాదాలను సుస్థిరం చెయ్యాలని.

8. అల్అన్ఫాల్  12 - 14 ఇంకా సమయం, అప్పుడు మీ ప్రభువు దైవదూతలకు ఇలా సంజ్ఞ చేశాడు : ‘‘నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు విశ్వాసులకు ధైర్య స్థైర్యాలను కలిగించండి. నేను ఇప్పుడే అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని సృష్టిస్తాను. కనుక మీరు వారి మెడలపై కొట్టండి. వారి కీలుకీలుపై కొట్టండి. ఎందుకంటే వారు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను ఎదిరించారు. అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ ఎదిరించే వారిపట్ల అల్లాహ్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తాడు - ఇది మీ శిక్ష. ఇక దానిని రుచి చూడండి. సత్యాన్ని తిరస్కరించేవారికి నరకశిక్ష ఉంటుందనే విషయం మీరు తెలుసుకోవాలి.

8. అల్అన్ఫాల్  15 - 16 విశ్వాసులారా! మీరుగనక సైన్యం రూపంలో అవిశ్వాసులను ఎదుర్కొంటే, వారికి వెన్ను చూపకండి. ఎవడు అటువంటి సమయంలో వెన్నుచూపుతాడో - యుద్ధపుటెత్తుగడగా అలా చేస్తే తప్ప లేదా మరొక (విశ్వాసుల) సైన్యాన్ని కలిసేందుకు అలా చేస్తే తప్ప - అతడు అల్లాహ్ ఆగ్రహంలో చిక్కుకుపోతాడు. నరకం అతడి నివాస స్థలం అవుతుంది. అది అతిచెడ్డ పునరాగమన ప్రదేశం.

8. అల్అన్ఫాల్  17 - 19 కనుక యథార్థం ఏమిటంటే, వారిని మీరు చంపలేదు. వారిని అల్లాహ్ చంపాడు. ప్రవక్తా! నీవు విసరలేదు  అల్లాహ్ విసిరాడు. ఇది ( పనికొరకు విశ్వాసుల చేతులు వినియోగించబడటం) ఎందుకంటే, అల్లాహ్ ముస్లిములను ఒక మంచి పరీక్షగుండా విజయవంతంగా దాటించదలచాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ వినేవాడూ, అన్నీ తెలిసినవాడూను. వ్యవహారం మీకు సంబంధించి నంతవరకే. అవిశ్వాసుల పట్ల వ్యవహారం ఎలా ఉంటుందంటే, అల్లాహ్ వారి వ్యూహాలను బలహీన పరుస్తాడు. అవిశ్వాసులతో ఇలా అను : ‘‘మీరు గనక తీర్పును కోరితే, ఇదో, తీర్పు మీ ముందుకు వచ్చేసింది. కాబట్టి ఇక మానండి, అది మీకే మేలు. ఒకవేళ మీరు బుద్ధితక్కువ పనిని మళ్ళీ చేసినట్లయితే మేము కూడా మళ్ళీ అదే శిక్షను విధిస్తాము. మీ సైనికదళం, అది ఎంత అధికంగా ఉన్నప్పటికీ, మీకు ఏమాత్రం పనికిరాదు. అల్లాహ్ విశ్వాసులతో ఉన్నాడు.’’

8. అల్అన్ఫాల్  20 - 23 విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. ఆజ్ఞ విన్న తరువాత దాని నుండి మరలకండి. వాస్తవంగా వినకుండానే ‘‘మేము విన్నాము’’ అని అనే వారివలె మీరూ అయిపోకండి. తమ బుద్ధిని ఉపయోగించని చెవిటివారూ, మూగవారూ మాత్రమే నిశ్చయంగా అల్లాహ్ దృష్టిలో నీచాతినీచమైన కోవకు చెందిన జంతువులు. వారిలో కొద్దిపాటి మంచితనమైనా ఉందని అల్లాహ్ కు అనిపించి ఉంటే, ఆయన వారికి తప్పకుండా వినేభాగ్యం కలుగజేసి ఉండేవాడు. (కాని మంచితనం లేకుండా) ఆయన గనక వారికి వినిపించి ఉండినట్లయితే, వారు నిర్లక్ష్యంగా తమ ముఖాలను త్రిప్పుకుని ఉండేవారే.

8. అల్అన్ఫాల్  24 - 29 విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ పిలుపునకూ, ఆయన ప్రవక్త పిలుపునకూ జవాబు పలకండి, ప్రవక్త మీకు జీవితాన్ని ప్రసాదించే దానివైపునకు మిమ్మల్ని పిలిచినప్పుడు. తెలుసుకోండి, అల్లాహ్ మనిషికీ అతని హృదయానికీ మధ్య ఉన్నాడనీ, ఆయన వైపునకే మీరు పోగుచేయబడతారనీ. ఉపద్రవం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. దానివల్ల కలిగే హాని ప్రత్యేకంగా మీలో పాపం చేసిన వారికే పరిమితమై ఉండదు. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడనే విషయాన్ని తెలుసుకోండి. జ్ఞాపకం తెచ్చుకోండి సమయాన్ని, అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉండేవారు, భూమిపై మీరు దుర్బలులుగా పరిగణింపబడేవారు, మిమ్మల్ని ప్రజలు రూపుమాపుతారేమో అని మీరు భయపడుతూ ఉండేవారు, తరువాత అల్లాహ్ మీకు ఆశ్రయస్థలాన్ని సమకూర్చాడు. తన సహాయంతో మీ చేతులకు బలం చేకూర్చాడు. మీకు మంచి ఉపాధిని ఏర్పాటు చేశాడు, బహుశా మీరు కృతజ్ఞులు అవుతారేమో అని. విశ్వసించిన ప్రజలారా! బుద్ధిపూర్వకంగా అల్లాహ్కూ ఆయన ప్రవక్తకూ నమ్మకద్రోహం చెయ్యకండి. మీ అమానతుల విషయంలో ద్రోహానికి పాల్పడకండి. మీ సంపద, మీ సంతానమూ వాస్తవంగా పరీక్షాసాధనాలని, అల్లాహ్ వద్ద ప్రతిఫలంగా ఇవ్వటానికి కావలసినంత ఉందనే విషయాన్ని తెలుసుకోండి. విశ్వసించిన ప్రజలారా! మీరు గనక భయభక్తులను అవలంబిస్తే, అల్లాహ్ మీకు గీటురాయిని ప్రసాదిస్తాడు. మీనుండి మీ చెడులను దూరం చేస్తాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్ అత్యధికంగా అనుగ్రహించేవాడు.

8. అల్అన్ఫాల్  30 - 37 సమయం కూడా జ్ఞాపకం తెచ్చుకోదగ్గదే  అప్పుడు సత్య తిరస్కారులు నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ ఉన్నారు, నిన్ను నిర్బంధించాలని లేదా నిన్ను హత్యచెయ్యాలని లేదా నిన్ను దేశం నుండి బహిష్కరించాలని. వారు తమ ఎత్తులు తాము వేస్తూ ఉన్నారు. అల్లాహ్ తన ఎత్తు తాను వేస్తూ ఉన్నాడు. అల్లాహ్ అందరికంటే బాగా ఎత్తులు వేస్తాడు. మా ఆయతులు వారికి వినిపించబడినప్పుడు వారు ఇలా అనేవారు: ‘‘అవును, మేము విన్నాము. మేము గనక కోరితే, అటువంటి మాటలనే మేమూ సృష్టించగలం. ఇవి పూర్వం నుండీ ప్రజలు చెప్పుకుంటూ వస్తున్న పాత కథలే.’’ వారు అన్న మాట కూడా జ్ఞాపకం ఉంది : ‘‘దైవమా! ఇది నిజంగా నీ తరఫు నుండి వచ్చిన సత్యమే అయితే, మాపై ఆకాశం నుండి రాళ్ళను కురిపించు లేదా ఏదైనా బాధాకరమైన శిక్షను మాపైకి తీసుకురా.’’ నీవు వారిమధ్య ఉన్నప్పుడు, అల్లాహ్ వారిపై ఆపదను అవతరింపజెయ్యడు. ప్రజలు క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూ ఉంటే, వారిని శిక్షించటం అనేది అల్లాహ్ సంప్రదాయం కాదు. కాని ఇప్పుడు ఆయన వారిపై శిక్షను ఎందుకు అవతరింపచెయ్యకూడదు, వారు ‘‘మస్జిదె హరామ్’’ యొక్క మార్గాన్ని ఆటంకపరుస్తూ ఉన్నప్పుడు? వాస్తవానికి వారు మసీదుకు ధర్మసమ్మతమైన ముతవల్లీలు (ధర్మకర్తలు) కారు. దీనికి ధర్మసమ్మతమైన ముతవల్లీలు కేవలం భయభక్తులు కలవారే కాగలరు. కాని చాలామంది విషయాన్ని ఎరుగరు. బైతుల్లాహ్ (అల్లాహ్ గృహం) వద్ద వారు చేసే నమాజేమిటీ? కేవలం ఈలలు వేయటం, చప్పట్లు కొట్టటం తప్ప. కనుక, ఇదో, శిక్షను చవి చూడండి, మీరు చేస్తూ ఉండిన సత్యతిరస్కారానికి ఫలితంగా. సత్యాన్ని ఒప్పుకోవడానికి నిరాకరించిన వారు, తమ సంపదను ప్రజలు అల్లాహ్ మార్గం వైపునకు రాకుండా ఆపటానికి వ్యయపరుస్తున్నారు. ఇంకా వ్యయపరుస్తూనే పోతారు. కాని చివరకు ప్రయత్నాలే వారి ద్ణుఖానికి కారణభూతమవు తాయి. అప్పుడు వారు పరాధీనులౌతారు. తరువాత అవిశ్వాసులు పోగుచేయబడి నరకం వైపునకు తరుమబడతారు. అల్లాహ్ మాలిన్యాన్ని పరిశుద్ధత నుండి వేరుచేయటానికి, అన్ని రకాల మాలిన్యాన్ని కలిపి ఒకచోట పోగుచెయ్యటానికి, తరువాత కుప్పను నరకంలో పడవేయటానికి. అసలు దివాలా తీసినవారు వీరే.

8. అల్అన్ఫాల్  38 ప్రవక్తా! అవిశ్వాసులకు ఇలా చెప్పు:  ‘‘ఇప్పుడైనా మానుకుంటే, గతంలో జరిగినదానినంతా మన్నించటం జరుగుతుంది. కాని వారు పూర్వపు వైఖరినే మళ్ళీ అవలంబిస్తే, పూర్వపు జాతులకు ఏమి జరిగిందో, అది అందరికీ తెలుసు.’’

8. అల్అన్ఫాల్  39 - 40 విశ్వసించిన ప్రజలారా! పీడన ఏమాత్రం మిగలకుండా పోయేవరకు, అల్లాహ్ నిర్ణయించిన ధర్మం పూర్తిగా నెలకొల్పబడేవరకు అవిశ్వాసులతో యుద్ధం చెయ్యండి. తరువాత వారు పీడనను మానుకుంటే, అల్లాహ్ వారి కర్మలను తప్పకుండా గమనిస్తాడు. ఒకవేళ వారు మానకపోతే, అల్లాహ్ మీకు సంరక్షకుడు అని తెలుసుకోండి. ఆయన ఉత్తమరక్షకుడూ, సహాయకుడూను.

8. అల్అన్ఫాల్  41 మీరు విషయాన్ని తెలుసుకోవాలి: మీరు యుద్ధ సంపదగా పొందిన దానిలో ఐదవభాగం అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ, బంధువులకూ, అనాధలకూ, బీదవారికీ, బాటసారులకూ చెందుతుంది. మీరు అల్లాహ్నూ, నిర్ణయదినం నాడు అంటే ఉభయ సైన్యాలు ఢీకొన్ననాడు మేము మా దాసునిపై అవతరింపజేసిన విషయాన్నీ విశ్వసించినట్లయితే ( భాగాన్ని సంతోషంగా ఇవ్వండి) అల్లాహ్ కు అన్ని విషయాలపై అధికారం ఉంది.

8. అల్అన్ఫాల్  42 సమయాన్ని గుర్తుకు తెచ్చుకోండి : అప్పుడు మీరు లోయకు ప్రక్కన ఉన్నారు. వారు ప్రక్కన మకాము చేశారు. మీకు క్రింది (ఒడ్డు) వైపున బిడారు ఉంది. ఒకవేళ మొదటే మీకూ వారికీ మధ్య యుద్ధం చెయ్యాలి అనే తీర్మానమే జరిగి ఉండినట్లయితే, మీరు తప్పకుండా సందర్భంలో తీర్మానాన్ని పాటించకుండా దాటవేసి ఉండేవారు. కాని జరిగింది ఏదో అది అల్లాహ్ తాను తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచటానికి జరిగింది, నశించవలసినవాడు స్పష్టమైన నిదర్శనంతో నశించాలని, జీవించవలసినవాడు స్పష్టమైన నిదర్శనంతో జీవించాలని జరిగింది. నిశ్చయంగా అల్లాహ్ వినేవాడూ తెలిసినవాడూనూ.

8. అల్అన్ఫాల్  43 సమయాన్ని కూడ గుర్తుకు తెచ్చుకోండి, అప్పుడు ప్రవక్తా! అల్లాహ్ వారిని నీ కలలో కొద్దిమందిగా చూపాడు. ఒకవేళ ఆయన వారిని ఎక్కువ సంఖ్యలో చూపి ఉన్నట్లయితే, మీరు తప్పకుండా ధైర్యాన్ని కోల్పోయి ఉండేవారు. యుద్ధం విషయంలో వివాదపడి ఉండేవారు. కాని అల్లాహ్ యే మిమ్మల్ని దీనినుండి రక్షించాడు. నిశ్చయంగా ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును.

8. అల్అన్ఫాల్  44 జ్ఞాపకం తెచ్చుకోండి:  యుద్ధ  సమయంలో అల్లాహ్ మీ దృష్టికి శత్రువులను కొద్దిమందిగా చూపాడు. వారి దృష్టికి మిమ్మల్ని తగ్గించి చూపాడు, జరుగవలసి ఉన్నదానిని అల్లాహ్ అమలులోకి తీసుకురావడానికి. చివరకు అన్ని వ్యవహారాలూ అల్లాహ్ వద్దకే మరలిపోతాయి.

8. అల్అన్ఫాల్  45 - 47 విశ్వాసులారా!  మీరు  ఒక వర్గాన్ని ఎదుర్కొన్నప్పుడు స్థైర్యముతో ఉండండి. అల్లాహ్ ను అత్యధికంగా స్మరించండి, మీకు విజయభాగ్యం కలుగుతుందని ఆశించవచ్చు. అల్లాహ్కూ ఆయన ప్రవక్తకూ విధేయత చూపండి. పరస్పరం కలహించుకోకండి.  అలా జరిగితే మీలో బలహీనత ప్రవేశిస్తుంది, మీ శక్తి సన్నగిల్లిపోతుంది. సహనంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ సహనం చూపేవారితో ఉంటాడు. తమ గృహాల నుండి విర్రవీగుతూ ప్రజల ముందు తమ దర్పాన్ని ప్రదర్శిస్తూ బయలుదేరేవారి మాదిరిగా, అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధించే వైఖరిని కలిగి వున్నవారి మాదిరిగా ప్రవర్తించకండి. వారు చేస్తున్నది ఏదీ అల్లాహ్ పట్టుకు అతీతంగా లేదు.

8. అల్అన్ఫాల్  48 - 54 సమయాన్ని గురించి కొంచెం ఆలోచించండి  అప్పుడు షైతాను వారి చేష్టలను వారి దృష్టికి ఆకర్షకములుగా చేసిచూపాడు. ఇంకా వారితో ఇలా అన్నాడు : ‘‘ఈనాడు మిమ్మల్ని ఎవడూ జయించలేడు, (ఎందుకంటే) నేను మీతో ఉన్నాను.’’ కాని రెండు పక్షాలు ఒక దానికొకటి ఎదురుపడినప్పుడు, అతడు మడమతిప్పి ఇలా అన్నాడు: ‘‘మీకూ నాకూ సంబంధమూ లేదు. మీరు చూడనివి ఎన్నో నేను చూస్తున్నాను. నాకు అల్లాహ్ అంటే భయం కలుగుతోంది. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.’’ అప్పుడు కపటులూ, హృదయాలకు రోగం తగిలినవారూ, అందరూ ఇలా అన్నారు:  ‘‘వారిని వారి ధర్మం పిచ్చివారిని చేసింది.’’ వాస్తవానికి ఎవరైనా అల్లాహ్ ను నమ్ముకుంటే, నిశ్చయంగా అల్లాహ్ మహాశక్తిమంతుడూ,  మహా వివేకవంతుడూను. దైవదూతలు, హతులైన అవిశ్వాసుల ప్రాణాలను తీస్తున్నప్పటి స్థితిని నీవు గనక చూడగలిగితే ఎంత బాగుండేది! వారు వారి ముఖాలపైని, పిరుదులపైని కొట్టేవారు. ఇంకా ఇలా అనేవారు : ‘‘ఇదో, కాల్చే శిక్షను అనుభవించండి. ఇది స్వయంగా మీ చేతులే ముందుగా సేకరించి పెట్టినదానికి ప్రతిఫలం. అంతేకాని అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు మాత్రం కాదు.’’ ఇది ఫిరౌను జాతివారికీ, వారి పూర్వపు ప్రజలకూ సంభవిస్తూ వచ్చిన విధంగానే వీరికీ సంభవించింది. అంటే, వారు అల్లాహ్ ఆయతులను విశ్వసించ టానికి తిరస్కరించారు. అప్పుడు అల్లాహ్ వారిని వారి పాపాలు కారణంగా పట్టుకున్నాడు. అల్లాహ్ శక్తిగలవాడు, కఠిన శిక్షను విధించేవాడు. ఇది అల్లాహ్ యొక్క సంప్రదాయం ప్రకారం జరిగింది: ఒక జాతి తన నడవడికను మార్చుకోనంతవరకు, అల్లాహ్ తాను దానికి ప్రసాదించిన అనుగ్రహాన్నీ ఉపసంహరించడు. అల్లాహ్ అన్నీ వింటాడు. ఆయనకు అంతా తెలుసు. ఫిరౌను జాతివారికీ, వారికి పూర్వపు జాతుల వారికీ ఏమి సంభవించిందో, అది నియమం ప్రకారమే సంభవించింది. వారు తమ ప్రభువు ఆయతులను తిరస్కరించారు. అప్పుడు మేము వారిని వారి పాపాలకు ఫలితంగా నాశనం చేశాము. ఇంకా ఫిరౌను ప్రజలను (సముద్రంలో) ముంచివేశాము. వారందరూ దుర్మార్గులే.

8. అల్అన్ఫాల్  55 - 59 నిశ్చయంగా భూమిపై సంచరించే ప్రాణులన్నింటిలోకెల్లా అల్లాహ్ దృష్టిలో మిక్కిలి నీచమైనవారు సత్యాన్ని అంగీకరించటానికి తిరస్కరించి, ఇక ఎట్టి పరిస్థితులలోనూ దానిని విశ్వసించ టానికి సిద్ధంగా లేనివారు   (ముఖ్యంగా) వారిలో నీవు ఒప్పందం కుదుర్చుకున్నవారు  అవకాశం దొరికినప్పుడల్లా వారు ఒప్పందాన్ని ఉల్లంఘిస్తారు. అల్లాహ్ కు ఏమాత్రం భయపడరు. కావున ఒకవేళ మీకు వారు రణరంగంలో ఎదురైతే, వారికి ఎలా బుద్ధిచెప్పాలంటే, వారి తరువాత అదే వైఖరిని అవలంబించనున్న ప్రజలు భయభ్రాంతులై పారిపోవాలి. ఒప్పందాన్ని ఉల్లంఘించేవారి పర్యవసానాన్ని చూసి వారు గుణపాఠం నేర్చుకుంటారని ఆశించవచ్చు. ఒకవేళ మీకు ఎప్పుడైనా జాతివల్లనైనా నమ్మక ద్రోహం కలుగుతుందనే భయం ఉంటే, బాహాటంగా వారి ఒప్పందాన్ని వారి ముందు విసిరి వెయ్యండి. నిశ్చయంగా అల్లాహ్ నమ్మకద్రోహులను ప్రేమించడు. సత్య తిరస్కారులు తాము గెలిచామనే అపోహకు గురికారాదు. నిశ్చయంగా వారు మమ్మల్ని ఓడిరచలేరు.

8. అల్అన్ఫాల్  60 మీరు మీ శక్తిమేరకు అత్యధికబలాన్నీ, కట్టివేసి సిద్ధంగా ఉన్న గుర్రాలను వారిని ఎదుర్కోవటానికి సమాయత్తపరచుకోండి, తద్వారా అల్లాహ్ శత్రువులనూ మీ శత్రువులనూ, ఇంకా మీరు ఎరుగని, కాని అల్లాహ్ ఎరిగిన ఇతర శత్రువులనూ భయకంపితులుగా చెయ్యండి. అల్లాహ్ మార్గంలో మీరు ఏది ఖర్చుచేసినా, దాని పూర్తి ప్రతిఫలం మీ వైపునకు మళ్ళించబడుతుంది. మీకు ఎంతమాత్రం అన్యాయం జరగదు.

8. అల్అన్ఫాల్  61 - 64 ప్రవక్తా! శత్రువు గనక సంధీ శాంతుల వైపునకు మొగ్గు చూపితే, నీవు కూడా దానికి సిద్ధపడు. అల్లాహ్ పై భారం వెయ్యి  ఆయనే అంతా వినేవాడూ అన్నీ తెలిసినవాడూను. ఒకవేళ నిన్ను మోసం చేసే ఉద్దేశ్యమే వారికి ఉంటే, నీకు అల్లాహ్ చాలు. తన సహాయంతోనూ, ముస్లిముల ద్వారానూ నిన్ను ఆదుకున్నవాడూ, ఇంకా ముస్లిముల మనస్సులను ఒకదానితో ఒకటి కలిపినవాడూ ఆయనేకదా! నీవు సమస్త భూసంపదను ఖర్చుపెట్టినా, వారి మనస్సులను కలపగలిగి ఉండేవాడవు కాదు. కానీ అల్లాహ్ వారి మనస్సులను కలిపాడు. నిశ్చయంగా ఆయన మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. ప్రవక్తా! నీకూ, నిన్ను అనుసరించే విశ్వాసులకూ అల్లాహ్ యే చాలు.

8. అల్అన్ఫాల్  65 - 66 ప్రవక్తా! ముస్లిములను యుద్ధానికి పురికొలుపు. మీలోగనక ఇరవైమంది స్థైర్యం కలవారు ఉంటే, వారు రెండువందల మందిని జయిస్తారు. ఇంకా అటువంటి వారు వందమంది గనక ఉంటే, వేయిమంది సత్యతిరస్కారులను జయిస్తారు. ఎందుకంటే, వారు బుద్ధిహీనులైన ప్రజలు. సరే, ఇప్పుడు అల్లాహ్ మీ బరువును తేలిక చేశాడు, ఆయనకు తెలుసు, ఇంకా మీలో బలహీనత ఉందని. కనుక మీలోగనక వందమంది సహనస్థైర్యాలు కలవారు ఉంటే, వారు రెండువందల మందినీ, ఇంకా అటువంటి వారు గనక వేయిమంది ఉంటే, రెండువేల మందినీ, అల్లాహ్ ఆదేశాను సారం జయించగలరు. సహనం కలవారితో అల్లాహ్ ఉంటాడు.

8. అల్అన్ఫాల్  67 - 69 ధరణిలో శత్రువులను పూర్తిగా అణచనంతవరకు, తనవద్ద యుద్ధ ఖైదీలను ఉంచుకోవటం అనేది ప్రవక్తకూ తగదు. మీరు ప్రాపంచిక ప్రయోజనాలను కాంక్షిస్తున్నారు. కాని అల్లాహ్ (మీకొరకు) పరలోకాన్ని కాంక్షిస్తున్నాడు. అల్లాహ్ శక్తిమంతుడూ, వివేకవంతుడూను. ముందేగనక అల్లాహ్ ఫర్మానా ఒకటి వ్రాయబడి ఉండకపోతే, మీరు తీసుకున్నదానికి పర్యవసానంగా మీకు పెద్ద శిక్ష పడి ఉండేది. కనుక మీరు పొందిన సొమ్మును తినండి. అది ధర్మసమ్మతమైనదీ, పవిత్రమైనదీను. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడూ కరుణించేవాడూను.

8. అల్అన్ఫాల్  70 - 71 ప్రవక్తా! నీ అధీనంలో బందీలుగా ఉన్న వారితో ఇలా అను : ‘‘మీ హృదయాలలో ఏపాటి మంచితనమైనా ఉన్నదని అల్లాహ్ కు తెలిస్తే, ఆయన మీ వద్దనుండి తీసుకొన్న దానికంటె ఎంతో ఎక్కువగా మీకు ఇస్తాడు. మీ తప్పులను మన్నిస్తాడు. అల్లాహ్ మన్నించేవాడూ కరుణించేవాడూను.’’ కాని వారు నీకు నమ్మకద్రోహం చెయ్యాలనే ఉద్దేశం కలిగివున్నట్లయితే - ఇంతకు పూర్వం వారు అల్లాహ్ కు నమ్మకద్రోహం చేసే ఉన్నారు, అందుకుగాను శిక్షగా అల్లాహ్ వారిని నీ అదుపులోకి తెచ్చాడు - అల్లాహ్ కు అంతా తెలుసు, ఆయన వివేచనాపరుడు.

8. అల్అన్ఫాల్  72 - 73 విశ్వాసాన్ని స్వీకరించి వలసపోయినవారూ, అల్లాహ్ మార్గంలో తమ ప్రాణాలనూ తమ సంపదలనూ ఒడ్డి పోరాడిన వారూ, వలసవచ్చిన వారికి ఆశ్రయమిచ్చి సహాయం చేసినవారూ - వారే అసలు ఒకరికొకరు స్నేహితులు, సంరక్షకులూను. ఇక విశ్వసించినప్పటికీ (దారుల్ఇస్లాంలోకి) వలసపోనివారు వలస రానంతవరకు వారి సంరక్షణతో మీకు సంబంధం లేదు. ఒకవేళ వారు ధర్మ వ్యవహారాలలో మీ సహాయం కోరితే, వారికి సహాయం చెయ్యటం మీ విధ్యుక్త ధర్మం. కాని మీరు ఒప్పందం కుదుర్చుకున్న జాతికి వ్యతిరేకంగా మాత్రం కాదు. మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. సత్య తిరస్కారులు పరస్పరం సహాయం చేసుకుంటారు. ఒకవేళ మీరు పరస్పరం సహాయం చేసుకొనకపోతే భూమిపై హింసాదౌర్జన్యాలూ, అల్లకల్లోలమూ చెలరేగుతాయి.

8. అల్అన్ఫాల్  74 - 75 విశ్వసించి అల్లాహ్ మార్గంలో ఇల్లూవాకిలీ వదలిపెట్టి కృషిచేసినవారూ, వారికి ఆశ్రయమిచ్చి సహాయం చేసినవారూ, వారే నిజమైన విశ్వాసులు. వారి పాపాలకు మన్నింపూ, వారికి చక్కని ఉపాధీ లభిస్తాయి. తరువాత విశ్వసించి, వలసవచ్చినవారు మీతో కలిసి కృషిచేసిన వారు కూడా మీతోనే చేరిపోతారు. కాని అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్తసంబంధం కలవారు పరస్పరం ఎక్కువ హక్కుదారులు. నిశ్చయంగా అల్లాహ్ కు ప్రతి విషయమూ తెలుసు.




No comments:

Post a Comment