4 సూరహ్ అన్‌ నిసా

4. అన్నిసా

ఆయతులు : 176                                   అవతరణ : మదీనాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

4. అన్నిసా 1 మానవులారా! మీ ప్రభువుకు భయపడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు. ఇంకా జంట ద్వారా ఎంతోమంది పురుషులను, స్త్రీలను అవనిలో వ్యాపింపజేశాడు. దేవుని పేరు చెప్పుకుని మీరు పరస్పరం మీ మీ హక్కులను కోరుకుంటారో, దేవునికి భయపడండి. బంధుత్వ సంబంధాలను తెంచటం మానుకోండి. అల్లాహ్ మిమ్మల్ని పరికిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోండి.

4. అన్నిసా 2 అనాథుల ఆస్తిని వారికి తిరిగి ఇవ్వండి. వారి మంచి వస్తువులను మీ చెడ్డ వస్తువులతో మార్చకండి. వారి ఆస్తిని మీ ఆస్తితో కలిపి కబళించకండి. ఇది మహాపాపం.

4. అన్నిసా 3 అనాథులకు న్యాయం చెయ్యలేమనే భయం మీకు కలిగితే, మీకు నచ్చిన స్త్రీలను ఇద్దరేసిగాని, ముగ్గురేసిగాని, నలుగురేసిగాని వివాహం చేసుకోండి. అయితే వారితో న్యాయంగా వ్యవహరించలేమనే భయం మీకుంటే, అప్పుడు ఒకామెనే చేసుకోండి లేదా మీ స్వాధీనంలోకి వచ్చిన స్త్రీలను దాంపత్యంలోకి తీసుకోండి. అన్యాయానికి దూరంగా ఉండేందుకు ఇది ఉత్తమ మార్గం.

4. అన్నిసా 4 స్త్రీలకు  వారి మహర్ను సంతోషంగా (విధిగా భావిస్తూ) చెల్లించండి. అయితే వారు తమంత తాము మహర్లో కొంత భాగాన్ని తమ ఇష్టపూర్వకంగా విడిచిపెడితే, దానిని మీరు సంతోషంగా అనుభవించండి.

4. అన్నిసా 5 అల్లాహ్ మీకు జీవనాధారంగా చేసిన సంపదను అవివేకులకు అప్పగించకండి. అయితే దానినుండి వారికి అన్న వస్త్రాలు కల్పించండి. వారికి హితబోధ చెయ్యండి.

4. అన్నిసా 6 అనాథులకు పెళ్ళి ఈడు వచ్చేవరకు వారిని అజమాయిషీ చేస్తూ ఉండండి. వారిలో మీకు యోగ్యత కనిపించినపుడు వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారై తమ హక్కును కోరు తారేమో అని భయపడి వారి ఆస్తిని న్యాయసీమలను అతిక్రమించి తొందర తొందరగా ఎన్నడూ తినకండి. అనాథుల సంరక్షకుడు సంపన్నుడైతే, అతడు వారి సొమ్ముకు దూరంగా ఉండాలి. ఒకవేళ అతడు పేదవాడైతే దాన్ని ధర్మసమ్మతంగా అనుభవించాలి. తరువాత వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి ఇతరులను సాక్షులుగా పెట్టండి. లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు.

4. అన్నిసా 7 తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది - అది తక్కువైనా సరే లేక ఎక్కువైనా సరే. భాగం (అల్లాహ్చే) నిర్ణయించబడిరది.

4. అన్నిసా 8 ఆస్తి పంపకం జరిగేటప్పుడు ఇతర బంధువులు, అనాథులు, నిరుపేదలు వస్తే, ఆస్తినుండి వారికి కూడ కొంత ఇవ్వండి. వారిని మంచిమాటలతో పలుకరించండి.

4. అన్నిసా 9 - 10  ప్రజలు  విషయాన్ని గురించి ఆలోచించి భయపడాలి : ఒకవేళ వారే తమ పిల్లలను నిస్సహాయులుగా విడిచిపెట్టి వెళ్ళవలసివస్తే మరణ సమయంలో వారు పిల్లలను గురించి ఎంతగా ఆందోళన చెందేవారో! కనుక వారు అల్లాహ్ కు భయపడాలి. న్యాయం పలకాలి. అనాథుల ఆస్తిని అన్యాయంగా తినేవారు వాస్తవానికి తమ పొట్టలను అగ్నితో నింపుకుంటారు. వారు తప్పకుండా మండే నరకాగ్నిలో త్రోయబడతారు.

4. అన్నిసా 11 మీ సంతానం విషయంలో అల్లాహ్ మీకు ఇలా ఆదేశిస్తున్నాడు : ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీల భాగాలకు సమానం. ఒకవేళ (మృతునికి వారసులుగా) ఇద్దరికంటే ఎక్కువమంది ఆడ పిల్లలు ఉంటే, వారికి మొత్తం ఆస్తిలో మూడిరట రెండు భాగాలు ఇవ్వాలి. ఒకే ఆడపిల్ల వారసురాలైతే, ఆస్తిలో అర్థ భాగం ఆమెకు చెందుతుంది. మృతుడు సంతానం కలవాడైతే, అతని తల్లిదండ్రులలో ఒక్కొక్కరికి మొత్తం ఆస్తిలో ఆరోభాగం లభించాలి. ఒకవేళ అతడు సంతానం లేనివాడై అతని తల్లిదండ్రులు మాత్రమే అతనికి వారసులైతే, అప్పుడు తల్లికి మూడో భాగం ఇవ్వాలి. మృతుడికి సోదరీసోదరులు కూడా ఉంటే, అప్పుడు తల్లికి ఆరోభాగం లభిస్తుంది. మృతుడు రాసిన వీలునామా అమలుజరిపి అతనిపై ఉన్న అప్పులు తీర్చిన తరువాతనే ( భాగాల పంపకం జరగాలి). మీ తల్లిదండ్రులలో,  మీ  సంతానంలో ప్రయోజనం రీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. భాగాలను అల్లాహ్ నిర్ణయించాడు. నిశ్చయంగా అల్లాహ్ యథార్థాలన్నీ తెలిసినవాడు, మర్మాలన్నీ ఎరిగినవాడు.

4. అన్నిసా 12 మీ భార్యలకు సంతానం లేనిపక్షంలో, వారు విడిచిపోయిన ఆస్తిలో మీకు అర్థభాగం లభిస్తుంది. కాని వారికి సంతానం ఉంటే అప్పుడు వారు విడిచివెళ్ళిన ఆస్తిలో మీకు నాలుగోభాగం లభిస్తుంది. ఇది వారు వ్రాసిపోయిన వీలునామా అమలు జరిపిన తరువాత, వారు చేసిపోయిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మీకు సంతానం లేనిపక్షంలో మీరు విడిచిపోయే ఆస్తిలోని నాలుగో భాగానికి వారు (మీ భార్యలు) హక్కుదారులౌతారు. కాని మీరు సంతానవంతులైతే అప్పుడు వారికి ఎనిమిదో భాగం లభిస్తుంది. ఇది మీరు వ్రాసిన వీలునామాను అమలుజరిపిన తరువాత, మీరు చేసిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి.

(మరణించిన) పురుషుడు లేక స్త్రీ సంతానహీనులై వారి తల్లిదండ్రులు కూడా జీవించి ఉండకపోతే, కాని వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉంటే అప్పుడు వారిద్దరిలో ఒక్కొక్కరికి ఆరోభాగం లభిస్తుంది. కాని సోదరీ సోదరులు ఒకరికంటే ఎక్కువమంది ఉంటే అప్పుడు మొత్తం ఆస్తిలోని మూడో భాగానికి వారంతా భాగస్వాములౌతారు. మృతుడు వ్రాసిన వీలునామా అమలు జరిపిన తరువాత, అతడు చేసిన అప్పులు తీర్చిన తరువాత పంపిణీ జరగాలి. కాని ఇది (వారసులకు) నష్టం కలిగించేది కాకూడదు. ఇది అల్లాహ్ వైపు నుండి వచ్చిన ఆదేశం. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అత్యంత మృదుస్వభావుడు.

4. అన్నిసా 13 - 14 ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. అల్లాహ్కూ ఆయన ప్రవక్తకూ విధేయత చూపేవాణ్ణి అల్లాహ్, క్రింద సెలయేళ్ళు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశింపజేస్తాడు. వనాలలో అతడు కలకాలం ఉంటాడు. అసలు ఇదే గొప్ప సాఫల్యం. అల్లాహ్కూ ఆయన ప్రవక్తకూ అవిధేయత చూపుతూ అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించే వాణ్ణి అల్లాహ్ అగ్నిలో పడవేస్తాడు. అందులో అతడు సదా ఉంటాడు. అతనికి మిక్కిలి అవమానకరమైన శిక్ష పడుతుంది.

4. అన్నిసా 15 - 16 మీ స్త్రీలలో ఎవరైనా సిగ్గుమాలిన పనికి ఒడిగట్టితే, వారికి వ్యతిరేకంగా మీలో నలుగురు మనుషుల సాక్ష్యం తీసుకోండి. నలుగురు మనుషులు గనక సాక్ష్యం ఇస్తే, వారు మరణించే వరకైనా లేదా వారికొరకు అల్లాహ్ ఏదైనా మార్గం చూపించేవరకైనా వారిని ఇళ్ళల్లో నిర్బంధించండి. మీలో అకృత్యానికి పాల్పడిన వారినిద్దరినీ బాధించండి. తరువాత వారు పశ్చాత్తాపపడి, తమ నడతను సరిదిద్దుకుంటే వారిని విడిచిపెట్టండి. అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అధికంగా అంగీకరిస్తాడు, ఎక్కువగా కనికరిస్తాడు.

4. అన్నిసా 17 - 18 అజ్ఞానం వల్ల ఏదైనా చెడ్డపని చేసి వెనువెంటనే పశ్చాత్తాపపడే వారి పశ్చాత్తాపాన్ని మాత్రమే స్వీకరించే బాధ్యత అల్లాహ్ పై ఉంది అని తెలుసుకోండి. అలాంటివారి పట్ల అల్లాహ్ కరుణాదృష్టితో తిరిగి సుముఖుడవుతాడు. అల్లాహ్ అన్ని విషయాలు తెలిసినవాడూ, వివేకసంపన్నుడూను. చావు గడియ సమీపించేవరకు ఎడతెగకుండా అకృత్యాలు చేస్తూవుండి, ‘‘ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను’’ అని అనేవారి పశ్చాత్తాపం ఎంతమాత్రం స్వీకరించబడదు. ఇదేవిధంగా, మరణించే వరకు అవిశ్వాసులుగానే ఉండేవారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు. అటువంటి వారి కొరకు మేము అత్యంత బాధాకరమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాము.

4. అన్నిసా 19 - 21 విశ్వసించిన ప్రజలారా! బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. ఇంకా, వారిని వేధించి సాధించి మీరు వారికి ఇచ్చిన మహర్లో కొంత భాగాన్ని కాజేసే ప్రయత్నం చెయ్యటం కూడా ధర్మసమ్మతం కాదు. అయితే వారు గనక బాహాటంగా చెడు నడతకు పాల్పడినట్లయితే, (అప్పుడు వారిపట్ల కఠినంగా ప్రవర్తించే అధికారం మీకు ఉంది). వారితో సద్భావంతో జీవితం గడపండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే, బహుశా మీకు ఒక వస్తువు నచ్చకపోవచ్చు. కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలును పెట్టివుండవచ్చు. ఒకవేళ మీరు ఒక భార్య స్థానంలో మరొక భార్యను తీసుకొచ్చే సంకల్పమే చేసుకుంటే, మీరు ఆమెకు ఒక పెద్ద ధనరాశిని ఇచ్చి ఉన్నాసరే దానినుండి కొంచెం కూడా తిరిగి తీసుకోవద్దు. ఆమెపై అపనిందమోపి, ఘోరమైన అన్యాయానికి పాల్పడి దాన్ని తిరిగి తీసుకుంటారా? మీరు పరస్పరం దాంపత్య సుఖం అనుభవించిన తరువాత, వారు మీ నుండి గట్టి వాగ్దానం తీసుకున్న తరువాత, మీరు దానిని ఎలా తిరిగి తీసుకుంటారు?

4. అన్నిసా 22 మీ తండ్రులు వివాహం చేసుకున్న స్త్రీలను మీరు ఎంతమాత్రమూ వివాహమాడకండి. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. వాస్తవానికి ఇది ఒక సిగ్గుమాలిన పని, జుగుప్సాకరమైనది, ఒక దుర్నడత.

4. అన్నిసా 23 మీకు స్త్రీలు (హరామ్‌) నిషేధించబడ్డారు : మీ తల్లులు, కుమార్తెలు, సోదరీమణులు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు (పినతల్లులు), మీ సోదరుల కుమార్తెలు, మేనకోడళ్ళు, మీకు పాలిచ్చిన తల్లులు, మీతోపాటు పాలు త్రాగిన సోదరీమణులు, మీ భార్యల తల్లులు, మీ సంరక్షణలో పెరిగిన మీ భార్యల కుమార్తెలు -  అంటే మీరు రమించిన భార్యల కుమార్తెలు  అయితే ఒకవేళ (వివాహం మాత్రమే అయి) రమించటం జరిగి వుండకపోతే (వారికి విడాకులిచ్చి, వారి కుమార్తెలను వివాహమాడటం) మీకు దోషం కాదు - మీ వెన్ను నుండి పుట్టిన మీ కుమారుల భార్యలు. ఇంకా ఏకకాలంలో అక్కాచెల్లెళ్ళు ఇద్దరినీ చేర్చి భార్యలుగా చేసుకోవటం కూడా నిషిద్ధమే. పూర్వం జరిగిందేదో జరిగిపోయింది. అల్లాహ్ క్షమించేవాడూ కరుణించేవాడూను.

4. అన్నిసా 24 - 25 ఇంకా ఇతరుల వివాహబంధంలో ఉండే స్త్రీలు కూడా మీకు హరామ్, మీ చేతికి (యుద్ధంలో) చిక్కిన స్త్రీలు తప్ప. ఇది అల్లాహ్ అనుశాసనం. దీనిని మీరు విధిగా పాటించాలి. వీరు తప్ప మిగతా స్త్రీలందరినీ మీరు మీ ధనం ద్వారా పొందటం మీకు హలాల్‌ (ధర్మసమ్మతం) చెయ్యబడిరది. అయితే వారికి వివాహబంధంతో రక్షణ కల్పించాలి. కాని విశృంఖలమైన కామక్రీడలకు ఒడిగట్టరాదు. తరువాత వారిద్వారా మీరు అనుభవించిన దాంపత్య సుఖానికి బదులుగా వారి మహర్ను ఒక విధిగా భావించి చెల్లించండి. కాని మహర్  ఒప్పందం జరిగిన తరువాత పరస్పరమైన అంగీకారంతో మీ మధ్య ఏదైనా రాజీ కుదిరితే, అందులో దోషం లేదు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అత్యంత వివేకసంపన్నుడు. మీలో ఎవరైనా ఒకరు ముస్లిము కుటుంబానికి చెందిన వనితలను వివాహం చేసుకునే స్తోమత లేకపోతే, మీ స్వాధీనంలో ఉన్నటువంటి ముస్లిములైనటువంటి బానిస స్త్రీలలో ఎవరినైనా అతడు వివాహం చేసుకోవాలి. మీ విశ్వాసం యొక్క స్థితిగతులు అల్లాహ్ కు బాగా తెలుసు. మీరంతా ఒకే వర్గానికి చెందినవారు. అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారిని వివాహం చేసుకోండి. న్యాయమైన పద్ధతిలో వారికి మహర్ఇవ్వండి - వారు వివాహ బంధంలో సురక్షితంగా ఉండేందుకు, స్వేచ్ఛాకామక్రీడలకు దిగకుండా ఉండేందుకు, దొంగచాటు సంబంధాలను ఏర్పరచు కోకుండా ఉండేందుకు.  వివాహబంధంలో వారు రక్షణపొందిన తరువాత ఏదైనా చెడునడతకు పాల్పడితే,  కుటుంబ స్త్రీల (ముహ్సనాత్)కు నిర్ణయించబడిన శిక్షలోని సగం శిక్ష వారికి విధించబడుతుంది. వివాహం చేసుకోక పోవటం వల్ల భయభక్తుల బంధాలు తెగిపోతాయని మీలో భయపడే వారికొరకే సౌలభ్యం అనుమతించబడిరది. మీరు నిగ్రహశక్తి కలిగివుంటే, అది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడూను.

4. అన్నిసా 26 - 28  మీకు  పూర్వం గతించిన సజ్జనులు అవలంబించిన మార్గాలను మీకు విశదపరచి మార్గాలలోనే మిమ్మల్ని కూడా నడపాలని అల్లాహ్ కోరుతున్నాడు. ఆయన తన కారుణ్యంతో మీ వైపునకు మరలాలని అభిలషిస్తున్నాడు. ఆయన సర్వమూ తెలిసినవాడు, మహావివేకి కూడా. అల్లాహ్ అయితే మీ వైపునకు కారుణ్యంతో మరలాలనే కోరుతున్నాడు. కాని తమ మనోవాంఛలను అనుసరిస్తున్నవారు మీరు సన్మార్గం తొలగి దూరంగా పోవాలని కోరుతారు. మీపై ఉన్న ఆంక్షలను అల్లాహ్ తేలిక చెయ్యాలని కోరుతున్నాడు. ఎందుకంటే మానవుడు బలహీనంగా సృష్టించబడ్డాడు.

4. అన్నిసా 29 - 31 విశ్వసించిన ప్రజలారా! ఒకరి సొమ్మును మరొకరు అధర్మంగా తినకండి. ఇచ్చి పుచ్చుకోవటం జరగవలసిందే, అయితే పరస్పర అంగీకారంతో. మిమ్మల్ని మీరు చంపుకోకండి. అల్లాహ్ కు మీరంటే ఎంతో దయ అని నమ్మండి. హింసా దౌర్జన్యాల ద్వారా అలా చేసేవాణ్ణి మేము తప్పకుండా అగ్నిలో పడవేస్తాము.  ఇది  అల్లాహ్ కు అంత కష్టమైన పని కాదు. మీకు నిషేధించబడినటువంటి మహా పాపాలకు గనక మీరు దూరంగా ఉంటే, మీ చిన్న చిన్న దోషాలను మేము మీ లెక్క నుండి తీసివేస్తాము. మిమ్మల్ని గౌరవస్థానాల్లో ప్రవేశింపజేస్తాము.

4. అన్నిసా 32 అల్లాహ్ మీలో ఎవరికైనా ఇతరులకు ఇచ్చినదానికంటే ఎక్కువగా ప్రసాదించివుంటే మీరు దానికి ఆశపడకండి. పురుషులు సంపాదించిన దానికి తగినట్లుగా వారి భాగం ఉంటుంది. స్త్రీలు సంపాదించిన దానికి తగినట్లుగా వారి భాగం ఉంటుంది. అయితే అల్లాహ్ ను ఆయన అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ సకల విషయ పరిజ్ఞానం కలవాడు.

4. అన్నిసా 33 తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచివెళ్ళే ప్రతి ఆస్తికి మేము హక్కుదారులను నిర్ణయించాము. ఇక మీరు వాగ్దానం చేసిన వారు - వారికి ఇవ్వవలసిన భాగం వారికి ఇవ్వండి. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటినీ కనిపెట్టి ఉన్నాడు.

4. అన్నిసా 34 - 35 పురుషులు స్త్రీలకు అధికారులు (ఖవ్వామ్‌), ఎందుకంటే అల్లాహ్ వారిలో ఒకరికి మరొకరిపై ఆధిక్యతను ప్రసాదించటంవల్ల, ఇంకా పురుషులు తమ సంపదను వారికొరకు ఖర్చు చేస్తున్నందువల్ల. కనుక సుగుణవతులైన స్త్రీలు విధేయత కలిగివుంటారు. పురుషులు లేనప్పుడు అల్లాహ్ రక్షణలో ఉంటూ వారి హక్కులను కాపాడుతారు. ధిక్కరిస్తారనే భయం మీకు స్త్రీల విషయంలో కలుగుతుందో వారికి నచ్చజెప్పండి. పడకగదులలో వారికి దూరంగా ఉండండి, మరియు కొట్టండి, తరువాత వారు మీకు విధేయలైతే, అకారణంగా వారిని వేధించటానికి సాకులు వెతక్కండి. గొప్పవాడూ, అధికుడూ అయిన అల్లాహ్ పైన ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోండి. భార్యభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయనే భయం మీకు కలిగితే, భర్త బంధువుల నుండి ఒక మధ్యవర్తిని, భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరు సంస్కరణను కోరితే అల్లాహ్ వారిమధ్య సమాధానం కుదరటానికి మార్గం చూపుతాడు. అల్లాహ్ సర్వజ్ఞాని, సకలమూ ఎరిగినవాడు.

4. అన్నిసా 36 - 42 మీరంతా అల్లాహ్ కు దాస్యం చెయ్యండి. ఎవరినీ ఆయనకు భాగస్వాములుగా చేయవద్దు. తల్లిదండ్రుల ఎడల సద్భావంతో మెలగండి. బంధువులూ, అనాథులూ, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులయిన పొరుగువారు, ప్రక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదారబుద్ధితో వ్యవహరించండి. గర్వాతి శయంతో కన్నూమిన్నూ కాననివారు, తమ గొప్పతనం గురించి విర్రవీగేవారు అంటే అల్లాహ్ ఇష్టపడడు అని గట్టిగా నమ్మండి. ఇంకా, పిసినారితనంతో ప్రవర్తిస్తూ ఇతరులక్కూడా పిసినారితనాన్ని గరపేవారిని కూడా అల్లాహ్ ప్రేమించడు. మా అనుగ్రహాలను తిరస్కరించే ఇటువంటి వారికొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. కేవలం ప్రజలకు చూపటానికి తమ సంపదను ఖర్చు పెట్టేవారు, అల్లాహ్ ను, అంతిమదినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించనివారు అంటే కూడా అల్లాహ్ కు అనిష్టమే. యథార్థమేమిటంటే షైతాన్ఎవడి స్నేహితుడయ్యాడో వాడికి దుస్సాంగత్యం లభించినట్లే. వారు గనక అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసిస్తే, అల్లాహ్ ఇచ్చిన దానినుండి ఖర్చుపెడితే వారిపైకి విపత్తు వచ్చిపడుతుంది? వారు ఆవిధంగా చేసి వున్నట్లయితే వారి సత్కార్యాలు అల్లాహ్ కు తెలియకుండా ఉండేవి కావు కదా! అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం కూడా చెయ్యడు. ఎవరైనా ఒక మంచి పని చేస్తే, దాన్ని అల్లాహ్ రెండిరతలు చేస్తాడు. ఇంకా తన తరఫు నుండి పెద్ద ప్రతిఫలం కూడా ప్రసాదిస్తాడు. మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని తెచ్చి నిన్ను (ముహమ్మద్‌- సఅసమ్ను) వారికి సాక్షిగా నిలబెట్టినప్పుడు వారు ఏం చేస్తారో ఆలోచించు. ప్రవక్త మాటను తిరస్కరించి, ఆయనకు అవిధేయత చూపిన ప్రజలంతా అప్పుడు భూమి బ్రద్దలై తాము భూమిలో స్థాపితమైపోతే ఎంత బాగుండును అని తలపోస్తారు. అక్కడ వారు అల్లాహ్ ముందు విషయాన్నీ దాచలేరు.

4. అన్నిసా 43 విశ్వాసులారా! మీరు నిషాస్థితిలో ఉన్నప్పుడు నమాజ్దరిదాపులకు వెళ్ళకండి. మీరు పలికేదేమిటో మీకు తెలిసినప్పుడే నమాజ్చెయ్యాలి. ఇదేవిధంగా అపరిశుద్ధ స్థితిలో కూడా, స్నానం చెయ్యనంతవరకు నమాజ్దగ్గరకు వెళ్ళకండి, దారినిపోతూ ఉన్నప్పుడు తప్ప.  మీరు  ఎప్పుడైనా అస్వస్థులైతే లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసివుంటే లేక మీరు మీ స్త్రీలను తాకివుంటే, మీకు నీరు లభ్యంకాని పక్షంలో, పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి, దానితో మీ ముఖాలను, చేతులను రుద్దుకొనండి. నిస్సందేహంగా అల్లాహ్ ఉదారస్వభావుడు, క్షమాగుణం కలవాడు.

4. అన్నిసా 44 - 46 గ్రంథ జ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడినవారిని కూడా మీరు చూశారా? వారే స్వయంగా అపమార్గాన్ని కొనితెచ్చుకున్నారు. మీరు కూడా మార్గం తప్పాలని కోరుతున్నారు. మీ శత్రువులను అల్లాహ్ బాగా ఎరుగును. మీకు సహాయం చేయటానికి, మిమ్మల్ని కాపాడటానికి అల్లాహ్యే చాలు. యూదుల పద్ధతిని అవలంబించిన వారిలో కొందరు పదాలను వాటి సందర్భాల నుండి తారుమారు చేస్తారు. సత్యధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చెయ్యటానికి, వారు తమ నాలుకలను మెలిత్రిప్పి ‘‘సమినా అసయ్నా’’ అని, ‘‘ఇస్మగైరముస్మఇన్’’ అనీ, ‘‘రాఇనా’’ అనీ పలుకుతారు. అలాకాకుండా, ‘‘సమినా అతానా’’ అని, ‘‘ఇస్’’, ‘‘ఉన్జుర్నా’’ అనీ, అని ఉంటే వారికే మేలు కలిగివుండేది. అది ఉత్తమమైన పద్ధతిగా ఉండేది. కాని వారి అసత్యానుసరణం కారణంగా, వారిపై అల్లాహ్ శాపం పడే ఉంది. కనుక వారు విశ్వసించటం అనేది చాలా తక్కువ.

4. అన్నిసా 47 - 48 గ్రంథ ప్రజలారా! మేము ఇప్పుడు అవతరింపజేసిన గ్రంథాన్ని విశ్వసించండి. అది, మీ వద్ద పూర్వం నుండే ఉన్న గ్రంథాన్ని ధ్రువపరుస్తుంది, సమర్థిస్తుంది. మేము ముఖాలను వికృతంచేసి వెనక్కి తిప్పకముందే, లేక మేము సబ్బత్వారిని శపించినట్లుగా వారినీ శపించక ముందే, దీనిని విశ్వసించండి. అల్లాహ్ ఆజ్ఞ తప్పకుండా అమలు పరచబడుతుందని గుర్తుపెట్టుకోండి. అల్లాహ్ క్షమించనిది కేవలం షిర్క్మాత్రమే. అది తప్ప పాపాన్ని అయినా ఆయన తాను ఇష్టపడిన వారికొరకు క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు, ఎంతో ఘోరమైన అబద్ధాన్ని కల్పించాడు అన్నమాట, ఎంతో తీవ్రమైన పాపపుమాట అన్నాడు అన్నమాట.

4. అన్నిసా 49 - 50 తమ ఆత్మ పరిశుద్ధతను గురించి గొప్పలు చెప్పుకునే వారిని కూడా మీరు గమనించారా? నిజానికి పరిశుద్ధతను అల్లాహ్యే తాను కోరిన వారికి ప్రసాదిస్తాడు. (వారికి పరిశుద్ధత లభించకపోతే) వారికి రవ్వంత అన్యాయం కూడా జరిగినట్లు కాదు. చూశారా! వారు అల్లాహ్ పై లేనిపోని అభాండాలు వెయ్యటానిక్కూడా జంకడం లేదు. వారు స్పష్టంగా పాపాత్ములని చెప్పటానికి ఒక్క పాపం చాలు.

4. అన్నిసా 51 - 57  గ్రంథ  జ్ఞానంలో కొంత భాగం ఇవ్వబడిన వారిని నీవు చూడలేదా? వారి పరిస్థితి ఎలా వుందంటే, వారు జిబ్త్ను, ‘‘తాగూత్’’ను నమ్ముతారు. ఇంకా వారు అవిశ్వాసులను గురించి, ‘‘విశ్వాసులకంటే వీరే చాలావరకు సరైన మార్గంలో ఉన్నారు’’ అని అంటారు. ఇటువంటి వారినే అల్లాహ్ శపించింది. అల్లాహ్ శపించినవాడికి సహాయం చేసే వాడెవ్వడూ నీకు దొరకడు. పరిపాలనలో వారికేమైనా భాగం ఉందా? ఉంటే వారు ఇతరులకు చిల్లిగవ్వకూడా ఇవ్వరు. లేక ఇతరులను చూచి వారు అసూయపడటానికి కారణం అల్లాహ్ వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదించాడనా? ఇదే నిజమయితే వారు విషయం తెలుసుకోవాలి: మేము ఇబ్రాహీము సంతతికి గ్రంథాన్ని, వివేకాన్ని ప్రసాదించాము. వారికి మహత్తరమైన సామ్రాజ్యాన్ని ప్రదానం చేశాము. కాని, వారిలో కొంతమంది గ్రంథాన్ని విశ్వసించారు, మరికొంతమంది దానికి విముఖులయ్యారు. వైముఖ్యం చూపేవారికి మండే నరకాగ్నియే చాలు. మా ఆయత్లను నిరాకరించిన వారిని మేము నిశ్చయంగా అగ్నిలో పడవేస్తాము.  ఇంకా వారి శరీర చర్మం కాలి కరిగి పోయినప్పుడల్లా, దాని స్థానంలో మేము మరొక చర్మాన్ని సృష్టిస్తాము, వారు శిక్షను బాగా రుచిచూడాలని. అల్లాహ్ సర్వశక్తిమంతుడు. తన నిర్ణయాలను అమలుపరచే విజ్ఞత ఆయనకు నిండుగా ఉంది. మా ఆయత్లను విశ్వసించి మంచి పనులు చేసేవారిని మేము, క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశపెడతాము. అక్కడ వారు కలకాలం ఉంటారు. ఇంకా, వారికి పరిశుద్ధలయిన భార్యలు లభిస్తారు. మేము వారిని దట్టమైన నీడలలో ఉంచుతాము.

4. అన్నిసా 58 ముస్లిములారా! ‘‘అమానతులను యోగ్యులైన వారికి అప్పగించండి. ప్రజల మధ్య తీర్పు చెప్పే టప్పుడు న్యాయంగా చేయండి’’ అని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. అల్లాహ్ మీకు ఎంతో చక్కని హితబోధచేస్తున్నాడు. నిశ్చయంగా ఆయన అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు.

4. అన్నిసా 59 విశ్వసించిన ప్రజలారా! విధేయత చూపండి అల్లాహ్ కు, విధేయత చూపండి ప్రవక్తకు, మీలో అధికారం అప్పగించబడిన పెద్దలకు. మీమధ్య విషయంలోనైనా వివాదం తల ఎత్తితే దాన్ని అల్లాహ్ కు, ప్రవక్తకు నివేదించండి. మీరు నిజంగానే అల్లాహ్మీద అంతిమ దినం మీదా విశ్వాసం కలవారే అయితే. ఇదే సరిjైున పద్ధతి. ఫలితాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమమైనది.

4. అన్నిసా 60 - 70 ప్రవక్తా! ‘‘నీవద్దకు పంపబడిన గ్రంథాన్ని, నీకు పూర్వం పంపబడిన గ్రంథాలను మేము విశ్వసించాము’’ అని ప్రకటన అయితే చేసి తమ వ్యవహారాల పరిష్కారం కొరకు తాగూత్వద్దకు పోవాలని కోరేవారిని నీవు చూడలేదా? వాస్తవానికి తాగూత్ను తిరస్కరించండి అని వారిని ఆదేశిం చటం జరిగింది-షైతాన్  వారిని  పెడత్రోవపట్టించి సన్మార్గానికి బహుదూరంగా తీసుకుపోవాలని చూస్తాడు. వారితో, ‘‘అల్లాహ్ పంపిన దాని వైపునకు రండి, ప్రవక్త వైపునకు రండి’’ అని చెప్పినప్పుడు, కపటులు నీ వైపునకు రాకుండా తప్పించుకోవడాన్ని నీవు చూస్తావు. అయితే వారు తమ చేజేతులా తెచ్చుకున్న ఆపద వారిపైకి వచ్చిపడినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? అప్పుడు వారు నీ వద్దకు ప్రమాణాలు చేస్తూ వస్తారు. వచ్చి, ‘‘దేవుని సాక్షిగా! మేము మంచినే కాంక్షిస్తాము. ప్రత్యర్థుల మధ్య ఏదో ఒక విధంగా రాజీ కుదరాలనేదే మా ఉద్దేశ్యం’’ అని అంటారు - వారి మనస్సులో ఏదైతే ఉందో అది అల్లాహ్ కు తెలుసు. కనుక వారితో వివాదానికి దిగకు. వారికి నచ్చజెప్పు. వారి హృదయాలలో నాటుకునే విధంగా బోధచేయి. (వారికి ఇలా తెలుపు) మేము ప్రవక్తను పంపినా అల్లాహ్ అనుజ్ఞ ప్రకారం అతనికి విధేయత చూపాలనే పంపాము. వారు తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్న తరువాత వారి కొరకు ఉత్తమమయిన పద్ధతి ఏమిటంటే, వారు నీ వద్దకు వచ్చి ఉండవల సింది, క్షమించు అని అల్లాహ్ ను అర్థించి ఉండవలసింది, ఇంకా ప్రవక్త కూడ వారికొరకు మన్నింపుకై విజ్ఞాపన చేసి ఉండేవాడు. అప్పుడు వారు నిశ్చయంగా అల్లాహ్ ను క్షమించేవాడూ, కరుణించేవాడుగా కనుగొని ఉండేవారు. కాదు, ముహమ్మద్‌! నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించబడనంతవరకు, ఇంకా నీవు నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో కూడా ఏమాత్రం సంకోచం లేకుండా దానిని యథాతథంగా శిరసావహించనంతవరకు వారు నిజమైన విశ్వాసులు కాలేరు. మేము వారిని, ‘‘మిమ్మల్ని మీరు చంపుకోండి’’ లేక ‘‘మీ గృహాలను వదలండి’’ అని ఆజ్ఞాపించివున్నట్లయితే, వారిలో కొద్దిమంది మాత్రమే దాన్ని పాటించేవారు. వారికి హితబోధ చేయబడిన విధంగా వారు గనక నడచుకొని ఉన్నట్లయితే, అది వారికి శ్రేయస్కరమైనదిగా, (విశ్వాసములో) దృఢత్వాన్ని కలిగించేదిగా ఉండేది. మేము మా తరఫు నుండి వారికి గొప్ప ప్రతిఫలం ఇచ్చివుండేవారము. ఇంకా వారికి ఋజుమార్గం చూపించి ఉండేవారము. అల్లాహ్ కు, ప్రవక్తకు విధేయత చూపేవారు అల్లాహ్ అనుగ్రహానికి పాత్రులైన వారితో ఉంటారు, అంటే ప్రవక్తలు, సత్యసంధులు, షహీదులు, సజ్జనులూను. ఎవరికి దొరికినా స్నేహితులు ఎంత మంచివారు! అల్లాహ్ నుండి లభించే అసలైన అనుగ్రహం ఇదే. యథార్థం తెలుసుకోవడానికి అల్లాహ్ పంపిన జ్ఞానమే చాలు.

4. అన్నిసా 71 - 76 విశ్వాసులారా! యుద్ధానికి ఎల్లప్పుడూ సన్నద్ధులై ఉండండి. వీలునుబట్టి వేరు వేరు జట్లుగానో లేక అంతా కలసియో బయలుదేరండి. యుద్ధమంటే తప్పించుకు తిరిగేవారు కూడా మీలో కొందరు ఉన్నారు. ఒకవేళ మీకు ఏదన్నా ఆపదవస్తే వారు, ‘‘అల్లాహ్ మాపై దయచూపాడు, కనుకనే మేము వారితో వెళ్ళలేదు’’ అని అంటారు. ఒకవేళ అల్లాహ్ మిమ్మల్ని అనుగ్రహిస్తే వారు ఇలా అంటారు - మీకూ వారికి మధ్య విధమయిన అనురాగబంధమే లేనట్లుగా అంటారు - ‘‘మేమూ వారితోపాటు వెళ్ళి ఉన్నట్లయితే మంచిఫలితం దక్కివుండేది.’’ (అటువంటి వారు తెలుసుకోవాలి) : పరలోకానికి బదులుగా ఇహలోక జీవితాన్ని అమ్మివేసినవారు అల్లాహ్ మార్గంలో పోరాడాలి. అల్లాహ్ మార్గంలో పోరాడి చంపబడేవానికి లేక విజయాన్ని పొందేవానికి మేము తప్పకుండా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. అసలు మీరు, నిస్సహాయులైన పురుషులు, స్త్రీలు, పిల్లలకొరకు అల్లాహ్ మార్గంలో పోరాడక పోవటానికి కారణం ఏమిటీ? బలహీనులవటంచేత అణచబడి, వారు, ‘‘మా ప్రభూ! దుర్మార్గులైన నగరవాసుల నుండి మాకు విమోచనం కలిగించు. మా కొరకు నీ తరఫు నుండి ఒక సహాయకుణ్ణి, ఒక రక్షకుణ్ణి పంపించు’’ అని ఫిర్యాదు చేస్తున్నారే! విశ్వాస మార్గాన్ని ఎన్నుకున్న వారు అల్లాహ్  మార్గంలో పోరాడతారు. అవిశ్వాస మార్గాన్ని ఎన్నుకున్నవారు తాగూత్మార్గంలో పోరాడతారు.  కనుక షైతాన్సహచరులతో పోరాడండి. వాస్తవంగా షైతాన్జిత్తులు ఎంతో బలహీనమైనవని నమ్మండి.

4. అన్నిసా 77 - 78 ‘‘మీ చేతులను (యుద్ధం చెయ్యకుండా) నిలిపి ఉంచండి. నమాజును స్థాపించండి. జకాత్ఇవ్వండి’’ అని చెప్పబడినవారిని కూడా నీవు చూశావా? తీరా ఇప్పుడు యుద్ధం చెయ్యండి అని వారికి ఆజ్ఞ ఇస్తే వారిలో కొందరి స్థితి ఎలా ఉందంటే, వారు దైవానికి భయపడినట్లుగా మనుషులకు భయపడుతున్నారు. కాదు, అంతకంటే అధికంగానే. ‘‘ప్రభూ! యుద్ధం చెయ్యండి అనే ఆజ్ఞను మా కొరకు ఎందుకు వ్రాసిపెట్టావు? మాకు ఇంకా కొంత వ్యవధిని ఎందుకివ్వలేదు?’’ అని అంటారు. వారితో ఇలా అను: ‘‘ఐహిక జీవిత భోగాలు అల్పమైనవి, దైవభక్తి పరాయణుడైన మనిషికి పరలోకమే ఎక్కువ మేలైనది. మీకు రవ్వంత అన్యాయం కూడా జరగదు.’’ ఇక మృత్యువు, మీరు ఎక్కడున్నాసరే అది మీకు వచ్చి తీరుతుంది, మీరు ఎంతటి ధృఢమైన భవనాలలో ఉన్నాసరే...

4. అన్నిసా 78 - 79 ... వారికి ఏదైనా లాభం కలిగితే,  ‘‘ఇది అల్లాహ్ తరఫు నుండి వచ్చింది’’ అని అంటారు. ఒకవేళ ఏదైనా నష్టం కలిగితే, ‘‘ప్రవక్తా!  ఇది నీ వల్ల జరిగింది’’ అని అంటారు. ‘‘అంతా అల్లాహ్ తరఫునుండే జరిగింది’’ అని వారికి చెప్పు.  అసలు వారికి ఏమయింది, వారు విషయాన్నీ అర్థం చేసుకోరు? మనిషీ! నీకు మేలు కలిగినా అల్లాహ్ కరుణవల్లనే కలుగుతుంది. నీకు కీడు కలిగినా అది నీవు స్వయంగా సంపాదించుకున్న దాని ఫలితమే...

4. అన్నిసా 79 - 80 ... ముహమ్మద్‌! మేము నిన్ను మానవజాతికి సందేశహరుడుగా చేసి పంపాము. దీనికి అల్లాహ్ సాక్ష్యం చాలు. ప్రవక్తకు విధేయత చూపినవాడు వాస్తవంగా అల్లాహ్ కు విధేయత చూపినట్లే. కాని ఎవడైతే విముఖుడయ్యాడో అటువంటివారిపై మేము నిన్ను కావలివానిగా చేసి పంపలేదు.

4. అన్నిసా 81 - 82 వారు నీ సమక్షంలోనయితే ‘‘మేము విధేయులం’’ అని అంటారు. కాని నీ వద్ద నుండి వెళ్ళిన తరువాత వారిలోని ఒక వర్గంవారు రాత్రివేళ సమావేశమై నీ మాటలకు వ్యతిరేకంగా సంప్రదిం పులు జరుపుతారు. వారి రహస్యాలోచనలన్నింటినీ అల్లాహ్ వ్రాస్తున్నాడు. నీవు వారిని లెక్కచేయకు. అల్లాహ్ పై భారం మోపు. భారం మోపటానికి ఆయనే చాలు. ప్రజలు ఖురానును గురించి ఆలోచన చెయ్యరా? ఇది అల్లాహ్ తరఫు నుండి కాక వేరొకరి తరఫునుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధాలైన విషయాలు ఉండేవి.

4. అన్నిసా 83 వారు ఎక్కడన్నా ఏదైనా సంతృప్తికరమైన వార్తగాని లేదా భయంకరమైన వార్తగాని విన్నప్పుడు దాన్ని వ్యాపింపచేస్తారు. అలాకాక వారు దానిని ప్రవక్తకు, సంఘంలోని బాధ్యతాయుతులైన తమ పెద్దలకు తెలిపివుంటే వారిలో, దానిని ఆధారంగా చేసుకుని సరిjైున నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యం కలవారి దృష్టికి అది వచ్చి ఉండేది. మీపై గనక అల్లాహ్ అనుగ్రహం, కారుణ్యం లేకపోయినట్లయితే, (మీ బలహీనతలు ఎలాంటివంటే) మీలో ఎవరో కొద్దిమంది తప్ప, మీరందరూ షైతానును అనుసరించి ఉండేవారు.

4. అన్నిసా 84 - 85 కనుక ప్రవక్తా! నీవు అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యి. నీవు నీ విషయంలో తప్ప మరెవరి విషయంలోనూ బాధ్యుడవు కావు. అయితే విశ్వాసులను యుద్ధం చెయ్యండి అని ప్రేరేపించు. అల్లాహ్ అవిశ్వాసుల శక్తిని అణచవచ్చు. అల్లాహ్ శక్తి అందరి శక్తికంటే ఎంతో అధికమైనది. ఆయన శిక్ష అన్ని శిక్షల కంటే తీవ్రమైనది. మంచి విషయం నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. చెడు విషయం నిమిత్తం సిఫారసు చేసేవానికి అందులో భాగం లభిస్తుంది. అల్లాహ్ ప్రతి వస్తువుపై తన దృష్టిని ఉంచుతాడు.

4. అన్నిసా 86 - 87 మీకు ఎవరైనా గౌరవభావంతో సలాము చేస్తే అతనికి మీరు అంతకంటే ఉత్తమమైన పద్ధతిలో ప్రతి సలాము చెయ్యండి. లేదా కనీసం అదేవిధంగానైనా చెయ్యండి. అల్లాహ్ ప్రతి దానికి లెక్క తీసుకుంటాడు. అల్లాహ్ - ఆయన తప్ప వేరే దైవం లేడు. ఆయన మీ అందరినీ ప్రళయదినం నాడు సమావేశపరుస్తాడు. అది రావటంలో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ మాటకంటే మరెవరి మాట నిజం కాగలదు?

88 - 91 మీకు ఏమయింది, మీ మధ్య కపటులను గురించి రెండు అభిప్రాయాలు ఉన్నాయి? వాస్తవానికి వారు సంపాదించుకున్న దుష్టకర్మల ఫలితంగానే అల్లాహ్ వారిని వెనక్కు (పూర్వపు స్థితి) మరల్చాడు. అల్లాహ్ మార్గం చూపనివానికి మీరు మార్గం చూపదలచారా? వాస్తవంగా అల్లాహ్ అపమార్గం పట్టించినవాని కొరకు మీరు మార్గాన్నీ కనుగొనలేరు. స్వయంగా వారు అవిశ్వాసులుగా ఉన్నట్లుగానే మీరు కూడా అవిశ్వాసులుగా మారి, మీరూ వారూ సమానులై పోవాలని వారు కోరుతున్నారు. కనుక అల్లాహ్ మార్గంలో వారు హిజ్రత్‌ (వలస) చెయ్యనంతవరకు, వారిలో ఎవ్వరినీ మీరు మీ మిత్రులుగా ఎన్నుకోకండి. ఒకవేళ వారు హిజ్రత్చెయ్యకపోతే, ఎక్కడ దొరికినా వారిని పట్టుకోండి, చంపండి. వారిలో ఎవ్వరినీ మీ మిత్రులుగా, సహాయకులుగా చేసుకోకండి. అయితే మీతో ఒప్పందం చేసుకున్న జాతితో కలిసిపోయిన కపటులకు ఉత్తరువు నుండి మినహాయింపు ఉంది. అదేవిధంగా మీ వద్దకు వచ్చి యుద్ధం పట్ల విముఖతను వ్యక్తం చేసి మీతోగాని, లేక స్వజాతి వారితోగాని యుద్ధం చెయ్యటానికి సమ్మతించని కపటులకు కూడా మినహాయింపు వర్తిస్తుంది. అల్లాహ్ గనక సంకల్పించి ఉంటే, వారికి మీపై ఆధిక్యాన్ని ఇచ్చి ఉండేవాడు. నిశ్చయంగా వారూ మీతో పోరాడి ఉండేవారే. కాబట్టి వారు మీ నుండి వైదొలగితే, యుద్ధం చెయ్యటం మానివేస్తే, సంధికొరకు, శాంతి కొరకు చేయిచాపితే, అప్పుడు వారిపై దాడి చెయ్యటానికి అల్లాహ్ మీ కొరకు కారణాన్నీ వదలలేదు. మరొక రకం కపటులను మీరు చూస్తారు. వారు మీతోనూ, తమ జాతి వారితోనూ శాంతియుతంగా ఉండాలని కోరుకుంటారు. కాని ఎప్పుడైనా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడినప్పుడు, అదును చూసి, వారు అందులోకి దూకుతారు. అలాంటివారు మీతో పోరాడటం మానుకోకపోతే, సంధికొరకు శాంతి కొరకు చేయిచాపకపోతే, తమ చేతులను ఆపివుంచకపోతే, అప్పుడు వారిని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోండి, సంహరించండి. వారితో యుద్ధం చెయ్యటానికి మేము మీకు స్పష్టమైన అధికారం ఇచ్చాము.

4. అన్నిసా 92 - 93 పొరపాటుగా తప్ప, ఒక విశ్వాసి మరొక విశ్వాసిని చంపటం తగనిపని. ఒక విశ్వాసిని పొరపాటుగా చంపినవాడు, దానికి పరిహారంగా ఒక ముస్లిము బానిసకు విముక్తి కలిగించాలి. ఇంకా హతుని వారసులకు రక్తపరిహారాన్ని అతడు చెల్లించాలి, వారు దాన్ని క్షమించి రద్దుచేస్తే తప్ప. కాని ముస్లిము హతుడు మీ శత్రుజాతికి చెందినవాడైతే, దానికి పరిహారం ఒక ముస్లిము బానిసకు విముక్తి కలిగించటం. ఒకవేళ అతడు మీతో ఒడంబడిక చేసుకున్న ముస్లిమేతర జాతికి చెందినవాడైతే అతని వారసులకు రక్తపరిహారాన్ని చెల్లించాలి. ఇంకా ఒక ముస్లిము బానిసను విడుదల చెయ్యాలి. బానిస దొరకనివారు వరుసగా రెండు మాసాలు ఉపవాసం ఉండాలి. అపరాధానికిగాను అల్లాహ్ ముందు పశ్చాత్తాపపడే పద్ధతి ఇదే. అల్లాహ్ అన్నీ తెలిసినవాడూ, అత్యంత వివేకవంతుడూను. ఇక బుద్ధిపూర్వకంగా ఒక విశ్వాసిని చంపేవానికి ప్రతిఫలం నరకం. అందులో అతడు సదా ఉంటాడు. అతనిపై అల్లాహ్ ఆగ్రహం, శాపం అవతరిస్తాయి. అల్లాహ్ అతడి కొరకు కఠినమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.

4. అన్నిసా 94 విశ్వసించిన ప్రజలారా! మీరు అల్లాహ్ మార్గంలో ‘‘జిహాద్’’ కొరకు బయలుదేరినప్పుడు, మిత్రులు శత్రువుల మధ్య విచక్షణ చేయండి. మీ వైపునకు సలాము చేస్తూ ముందుకు వచ్చేవాణ్ణి, ‘‘నీవు ముస్లిమువు కావు’’ అని త్వరపడి అనకండి. మీరు గనక ప్రాపంచిక ప్రయోజనాలను పొందగోరితే, అల్లాహ్ వద్ద మీకొరకు విజయధనాలు సమృద్ధిగా ఉన్నాయి. దీనికి పూర్వం స్వయంగా మీరూ ఇదేస్థితిలో ఉన్నారుకదా! తరువాత అల్లాహ్ మిమ్మల్ని కనికరించాడు. కనుక వివేచనతో వ్యవహరించండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.

4. అన్నిసా 95 - 96 కారణమేదీ లేకుండానే ఇంటివద్ద కూర్చుండిపోయే ముస్లిములు, అల్లాహ్ మార్గంలో తమ ధనప్రాణాలతో  ‘‘జిహాద్’’  చేసే ముస్లిములు ఉభయుల స్థానం సమానం కాదు. కూర్చుండి పోయేవారి స్థానం కంటే  ధనప్రాణాలతో ‘‘జిహాద్’’ చేసేవారి స్థానాన్ని అల్లాహ్ సమున్నతం చేశాడు. ప్రతి ఒక్కరికి అల్లాహ్ మేలునే వాగ్దానం చేసినమాట వాస్తవమే అయినా ఆయన వద్ద ముజాహిద్ సేవలకు లభించే ప్రతిఫలం, కూర్చుండిపోయే వారికి లభించే ప్రతిఫలంకంటే ఎంతో ఎక్కువ. వారి కొరకు అల్లాహ్ తరఫు నుండి ఉన్నత స్థానాలూ ఉన్నాయి. క్షమాభిక్ష కారుణ్యం కూడా ఉన్నాయి. అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడూ అమితంగా కరుణించేవాడూను.

4. అన్నిసా 97 - 100 తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉండేవారి ప్రాణాలను తీసి, దైవదూతలు వారిని, ‘‘ఇదేమిటి మీ స్థితి ఇలా ఉందీ?’’ అని అడిగారు. అప్పుడు వారు ఇలా సమాధానం చెప్పారు: ‘‘మేము భూమిపై బలహీనులముగా, నిస్సహాయులముగా ఉండేవారము.’’ దైవదూతలు ‘‘అల్లాహ్ భూమి విశాలంగా లేదా మీరు వలస పోవటానికి?’’ అని అడిగారు. వారి నివాసం నరకం. అది మహాచెడ్డ నివాసం. అయితే, నిజంగానే నిస్సహాయులై బయలుదేరటానికి మార్గమూ, సాధనసంపత్తీ లేని పురుషులనూ, స్త్రీలనూ, పిల్లలనూ అల్లాహ్ క్షమించవచ్చు. (ఎందుకంటే) అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడూ అధికంగా మన్నించేవాడూను. అల్లాహ్ మార్గంలో వలసపోయేవాడు ఆశ్రయం పొందటానికి పుడమిలో కావలసినంత స్థలాన్నీ, బ్రతుకు తెరువుకు ఎక్కువ అవకాశాలనూ పొందుతాడు. అల్లాహ్ వైపునకు, ఆయన ప్రవక్త వైపునకు వలసపోవటానికి తన గృహం నుండి బయలుదేరి మార్గమధ్యంలోనే మరణించినవానికి విధిగా ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్ దే. అల్లాహ్ క్షమాభిక్ష పెట్టేవాడు, కరుణించేవాడూను.

4. అన్నిసా 101 మీరు ప్రయాణానికి బయలుదేరినప్పుడు నమాజును సంక్షిప్తం చేస్తే అది తప్పుకాదు, (ముఖ్యంగా) అవిశ్వాసులు మిమ్మల్ని వేధిస్తారనే భయం మీకు కలిగినప్పుడు. ఎందుకంటే వారు మీతో బహిరంగవైరానికి పూనుకున్నారు.

4. అన్నిసా 102 - 103 ప్రవక్తా! నీవు ముస్లిముల మధ్య ఉండి (పోరాటం జరుగుతూ ఉండగా) నమాజ్చేయించటానికి వారితో నిలబడితే, వారిలోని ఒక వర్గం నీతోపాటు నిలబడాలి. వారు అస్త్రధారులై ఉండాలి. వారు తమ సజ్దాను పూర్తి చేసుకుంటే వెనక్కి వెళ్ళిపోవాలి. అప్పుడు ఇంకా నమాజ్చెయ్యని రెండోవర్గం వచ్చి నీతోపాటు నమాజ్చెయ్యాలి. వారు కూడా జాగరూకులై ఉండాలి. తమ ఆయుధాలను ధరించి ఉండాలి. ఎందుకంటే మీరు మీ ఆయుధాలపట్ల, మీ సామానుల పట్ల కొద్దిపాటి అజాగ్రత్త చూపినా మీపై ఒక్కసారిగా విరుచుకుపడాలని అవిశ్వాసులు కాచుకుని ఉన్నారు. అయితే వర్షంవల్ల మీకు ఇబ్బందిగా ఉంటే లేక మీరు అస్వస్థులైతే ఆయుధాలను దించటం తప్పు కాదు. అయినప్పటికీ మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అవిశ్వాసుల కొరకు అల్లాహ్ నిశ్చయంగా అవమానకరమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాడు. నమాజ్ను పూర్తిచేసిన తరువాత, నిలుచున్నా, కూర్చున్నా, పరుండినా స్థితిలోవున్నా, అల్లాహ్ ను మటుకు స్మరిస్తూ ఉండండి. శాంతిభద్రతలు నెలకొన్నప్పుడు పూర్తి నమాజ్చెయ్యండి. వాస్తవానికి నమాజ్విశ్వాసులు నిర్ణీత సమయాలలో విధిగా పాటించవలసిన ధర్మం.

4. అన్నిసా 104 వర్గాన్ని వెన్నాడటంలో బలహీనతను ప్రదర్శించకండి. ఒకవేళ మీరు బాధపడుతూ ఉంటే మీ మాదిరిగానే వారు కూడా బాధపడుతున్నారు. పైగా అల్లాహ్ నుండి వారు ఆశించని దానిని మీరు ఆశిస్తున్నారు. అల్లాహ్ కు అంతా తెలుసు. ఆయన అత్యంత వివేకసంపన్నుడు.

4. అన్నిసా 105 - 112 ప్రవక్తా! అల్లాహ్ నీకు చూపిన రుజుమార్గానికి అనుగుణంగా నీవు ప్రజల మధ్య తీర్పు చెయ్యటానికి మేము గ్రంథాన్ని సత్యంతో నీ వద్దకు పంపాము. నీవు నీతిలేనివారి తరఫున వాదిగా నిలబడకు. క్షమాభిక్ష కొరకు అల్లాహ్ ను ప్రార్థించు. ఆయన ఎక్కువగా క్షమించేవాడూ అధికంగా కరుణించేవాడూను. ఆత్మద్రోహం చేసుకునేవారిని నీవు బలపరచకు. నమ్మకద్రోహి, నిత్యపాపి అయిన మనిషిని అల్లాహ్ ప్రేమించడు. వారు తమ దుష్కర్మలను మానవులకు తెలియకుండా దాచగలరు. కాని అల్లాహ్ కు తెలియకుండా దాచలేరు. రాత్రులందు వారు ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా రహస్య సమాలోచనలు జరిపే సమయంలో కూడా ఆయన వారితో ఉంటాడు. వారి సకల చర్యలను అల్లాహ్ పరివేష్టించి ఉన్నాడు. మీరు అపరాధుల తరఫున ఇహలోక జీవితం లోనయితే వాదించారు. కాని ప్రళయం రోజున వారి తరఫున అల్లాహ్తో ఎవరు వాదిస్తారు? వారిని అక్కడ సమర్థించే వాడెవడు? చెడ్డపని చేసినవాడు లేదా తన ఆత్మకు అన్యాయం చేసుకున్నవాడు తరువాత క్షమాభిక్ష పెట్టు అని అల్లాహ్ ను అర్థిస్తే, అతడు అల్లాహ్ ను క్షమించేవాడుగా కరుణా మయుడుగా తెలుసుకుంటాడు. కాని ఎవడైనా చెడును సంపాదించుకుంటే, (తరువాత పశ్చాత్తాప పడకపోతే) అతని సంపాదన అతనికే విపత్తుగా పరిణమిస్తుంది. అల్లాహ్ కు అన్ని విషయాలూ తెలుసు. ఆయన వివేక సంపన్నుడు. ఎవడైనా ఏదైనా నేరంగాని లేక పాపంగాని చేసి, నిందను నిర్దోషిపైనైనా మోపితే అతడు తీవ్రమైన అపనిందను, ఘోరపాతకాన్ని మూటగట్టుకుంటాడు.

4. అన్నిసా 113 ప్రవక్తా! అల్లాహ్ అనుగ్రహం గనక నీపై ఉండివుండకపోతే, ఆయన కారుణ్యం నీకు తోడుగా ఉండివుండకపోతే, వారిలోని ఒక వర్గం నిన్ను అపార్థానికి గురిచెయ్యాలనే నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి వారు తమను తాము తప్ప మరెవ్వరినీ అపార్థానికి గురిచేసుకోలేదు. నీకు ఏమాత్రం నష్టం కలిగించివుండేవారు కాదు. అల్లాహ్ నీపై గ్రంథాన్ని, వివేకాన్ని అవతరింపజేశాడు. పూర్వం నీకు తెలియనిదంతా నీకు నేర్పాడు. నిజంగానే ఆయనకు నీమీద ఎక్కువ అనుగ్రహం ఉంది.

4. అన్నిసా 114 - 115 ప్రజలు జరిపే రహస్య సమాలోచనలలో సాధారణంగా మేలూ ఉండదు. కాని ఎవరైనా రహస్యంగా దానధర్మాలు చెయ్యండి అని బోధిస్తే లేక ఏదైనా సత్కార్యం కొరకు లేదా ప్రజల వ్యవహారాలను చక్కబరిచే ఉద్దేశ్యంతో ఎవరితోనైనా ఏదైనా రహస్యం చెబితే అది మంచి విషయమే. ఎవరైనా అల్లాహ్ సంతోషం కొరకు విధంగా చేస్తే వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము. కాని తనకు రుజుమార్గం విశదమైనప్పటికీ ఎవడైనా ప్రవక్తకు వ్యతిరేకంగా నడుంబిగిస్తే, విశ్వాసుల వైఖరి కాక మరొక వైఖరి అవలంబిస్తే, అతన్ని మేము అతడు మళ్ళిన దిక్కుకే నడిపిస్తాము. ఇంకా అతన్ని నరకంలో పడవేస్తాము. అది అతి నీచమైన నివాస స్థలం.

4. అన్నిసా 116 - 122 అల్లాహ్ దృష్టిలో కేవలం షిర్కు ఒక్కటే క్షమార్హం కానిది. అది తప్ప తాను కోరిన వారి అన్ని పాపాలను ఆయన క్షమిస్తాడు. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసినవాడు అపమార్గాన బహుదూరం వెళ్ళిపోయాడు. వారు అల్లాహ్ ను వదలి స్త్రీ దేవతలను ఆరాధ్యులుగా చేసుకుంటారు. అల్లాహ్ శాపానికి గురిఅయిన తిరుగుబాటుదారు షైతాన్ను తమ ఆరాధ్యుడుగా చేసుకుంటారు. (వారు విధేయత చూపే షైతాను) అల్లాహ్తో ఇలా అన్నాడు : ‘‘నేను నీ దాసుల నుండి ఒక నిర్ణీతమైన భాగ్యాన్ని నిశ్చయంగా తీసుకుంటాను. నేను వారిని మార్గం తప్పిస్తాను. నేను వారిలో లేనిపోని ఆశలు కల్పిస్తాను. నేను వారిని ఆజ్ఞాపిస్తాను. వారు నా ఆజ్ఞానుసారం జంతువుల చెవులు చీలుస్తారు. నేను వారిని ఆదేశిస్తాను. వారు నా ఆదేశం ప్రకారం అల్లాహ్ సృష్టిలో మార్పులు చేస్తారు. అల్లాహ్ కు బదులుగా షైతానును తన సంరక్షకుడుగా, స్నేహితుడుగా చేసుకునేవాడు స్పష్టంగా నష్టానికి గురి అవుతాడు. అతడు వారితో వాగ్దానాలు చేస్తాడు. వారికి ఆశలు చూపుతాడు. కాని షైతాను వాగ్దానాలు కేవలం మోసాలు తప్ప మరేమీ కావు. ఇటువంటి ప్రజల నివాసం నరకం. దానినుండి తప్పించుకోవటానికి వారికి మార్గమూ లభించదు. ఇక విశ్వసించి మంచిపనులు చేసేవారిని మేము క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశపెడతాము. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ చేసిన వాగ్దానం నిజమైనది. అల్లాహ్ కంటే ఎక్కువ సత్యవంతు డెవడు?

4. అన్నిసా 123 - 126 అంతిమ ఫలితం మీ కోరికలపైగాని లేక గ్రంథప్రజల కోరికలపైగాని ఆధారపడి లేదు. దుర్మార్గం చేసినవాడు దాని ఫలితం అనుభవిస్తాడు. అల్లాహ్ కు వ్యతిరేకంగా తనను సమర్థించేవాణ్ణిగాని, తనకు సహాయం చేసేవాణ్ణిగాని అతడు పొందలేడు. మంచిపనులు చేసేవారు - పురుషులైనా స్త్రీలైనా - వారుగనక విశ్వాసులైతే స్వర్గంలో ప్రవేశిస్తారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. అల్లాహ్ కు తనను తాను సమర్పించుకున్నవాడూ, సత్ప్రవర్తన కలవాడూ, అల్లాహ్ తన మిత్రునిగా ఎన్నుకున్న ఇబ్రాహీము విధానాన్ని ఏకాగ్ర మనస్సుతో అనుసరించేవాడూ అయిన వ్యక్తి జీవన విధానంకంటె మేలైనది మరెవరిది కాగలుగుతుంది? ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే. అల్లాహ్ ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నాడు.

4. అన్నిసా 127 ప్రజలు నిన్ను స్త్రీల వ్యవహారంలో ధార్మిక తీర్పు (ఫత్వా) ఏమిటో అడుగుతున్నారు. వారితో ఇలా చెప్పు - ‘‘వారి విషయంలో అల్లాహ్ మీకు ధార్మిక తీర్పు ఇస్తున్నాడు. దానితోపాటు పూర్వం నుండి మీకు గ్రంథంలో వినిపించబడుతూ వచ్చిన ఉత్తరువులను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మీరు హక్కులను నెరవేర్చని, మీరు వివాహం చేయని అనాథ బాలికలకు (దురాశతో స్వయంగా మీరే వారిని వివాహం చేసుకోదలిచారు) సంబంధించిన ఉత్తరువులు. అనాథులతో న్యాయంగా వ్యవహరించండి అని అల్లాహ్ మీకు ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు మంచిపని చేసినా అది అల్లాహ్ కు తెలియకుండా ఉండదు.

4. అన్నిసా 128 - 134 ఒక స్త్రీ తనను భర్త నిరాదరించి, వేధిస్తాడేమో అనీ లేదా విముఖుడై ఈసడిరచుకుంటాడేమో అనీ భయపడితే, భార్యాభర్తలిద్దరూ పరస్పరం (ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో) సర్దుబాటు చేసుకోవడంలో దోషం లేదు. ఏమైనప్పటికీ సర్దుబాటే అన్ని విధాలా ఉత్తమమైనది. మనస్సులు సంకుచిత భావాల వైపునకు త్వరగా మొగ్గుతాయి. అయితే మీరు ఉదారబుద్ధితో వ్యవహరిస్తే, భయభక్తులతో మెలిగితే, అల్లాహ్ కు మీ ప్రవర్తన తెలియకుండా ఉండదని నమ్మండి. భార్యల మధ్య పూర్తి న్యాయం చెయ్యటం మీ శక్తికి మించిన పని. మీరు ఎంత కోరినా దీనిని సాధించలేరు. కనుక ఒక భార్య వైపునకు ఎక్కువగా మొగ్గి మరొకామెను డోలాయమాన స్థితిలో పడవెయ్యకండి. (అప్పుడు దైవశాసనం యొక్క ఉద్దేశ్యం పూర్తవుతుంది). మీరు మీ ప్రవర్తనను సరిజేసుకుని అల్లాహ్ కు భయపడుతూ ఉంటే, అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడూను. కాని ఒకవేళ దంపతులు పరస్పరం విడిపోవటమే జరిగితే, అప్పుడు అల్లాహ్ తన అపారమైన శక్తి ద్వారా వారికి ఒకరి అవసరం మరొకరికి లేకుండా చేస్తాడు. అల్లాహ్ అనంతమైన వనరులు కలవాడు. ఆయన వివేకవంతుడు, అన్నీ తెలిసినవాడూను. ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే. అల్లాహ్ కు భయపడుతూ ప్రవర్తించండి అని మీకు పూర్వం మేము గ్రంథం ఇచ్చిన వారికి ఉపదేశించాము, ఇప్పుడు మీకూ ఉపదేశిస్తున్నాము. ఒకవేళ మీరు నిరాకరిస్తే నిరాకరించండి. భూమ్యాకాశాలలో ఉన్న సమస్త వస్తువులకూ యజమాని అల్లాహ్యే. ఆయన అక్కరలేనివాడు, ప్రతి స్తోత్రానికి అర్హుడు. అవును, అల్లాహ్యే యజమాని, ఆకాశాలలో ఉన్న సమస్తానికీ, భూమిలో ఉన్న సర్వానికీ. కార్యసాఫల్యానికి ఆయనేచాలు. ఆయన సంకల్పిస్తే మిమ్మల్ని తొలగించి, మీ స్థానంలోకి ఇతరులను తీసుకురాగలడు. ఆయన దీనిని చెయ్యగల సర్వశక్తిమంతుడు. కేవలం ఇహలోక ఫలాన్నే కోరేవ్యక్తి, అల్లాహ్ వద్ద ఇహలోక ఫలమూ ఉన్నది, పరలోక ఫలమూ ఉన్నదని తెలుసుకోవాలి. అల్లాహ్ అన్నీ వింటాడు, అన్నీ చూస్తాడు.

4. అన్నిసా 135 విశ్వసించిన ప్రజలారా! న్యాయధ్వజవాహకులుగా నిలబడండి. అల్లాహ్ కొరకు సాక్షులుగా ఉండండి. మీ న్యాయం, మీ సాక్ష్యం మీకూ, మీ తల్లిదండ్రులకూ, మీ బంధువులకూ ఎంత హాని కలిగించినా సరే. కక్షిదారులు భాగ్యవంతులయినా, నిరుపేదలయినా అల్లాహ్ వారి శ్రేయస్సును మీకంటే ఎక్కువగా కాంక్షిస్తాడు. కనుక మీ మనోవాంఛలను అనుసరిస్తూ న్యాయం నుండి వైదొలగకండి. మీరు గనక సాక్ష్యాన్ని వక్రీకరిస్తే, న్యాయాన్ని దాటవేస్తే, బాగా తెలుసుకోండి, మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు అని.

4. అన్నిసా 136 - 141 విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ, ఆయన తన ప్రవక్తపై అవతరింప జేసిన గ్రంథాన్నీ, ఇంకా ఆయన దీనికి పూర్వం అవతరింపజేసిన ప్రతి గ్రంథాన్నీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను, అంతిమదినాన్ని తిరస్కరించినవాడు నిశ్చయంగా మార్గం తప్పి అపమార్గంలో పడి చాలాదూరం పోయాడు. ఇక విశ్వసించి, తరువాత తిరస్కరించి, మళ్ళీ విశ్వసించి, మళ్ళీ తిరస్కరించి తిరస్కారంలోనే పురోగమించేవారిని అల్లాహ్ సుతరామూ క్షమించడు, వారికి ఎన్నటికీ రుజుమార్గం చూపడు. విశ్వాసులను త్రోసిరాజని, అవిశ్వాసులను తమ మిత్రులుగా చేసుకునే కపటులకు వ్యధాభరితమైన శిక్ష సిద్ధంగా ఉందనే శుభవార్తను వినిపించండి. వీరు గౌరవం పొందే ఆశతోనా వారివద్దకు పోయేది? వాస్తవానికి గౌరవం అంతా పూర్తిగా అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది. అల్లాహ్ గ్రంథంలో మీకు ఇదివరకే ఉత్తరువు ఇచ్చివున్నాడు : అల్లాహ్ ఆయతులకు వ్యతిరేకంగా తిరస్కారవచనాలు వాగటాన్ని, వాటిని పరిహసించటాన్ని మీరు విన్నట్లయితే ప్రజలు వేరే విషయాన్ని ప్రారంభించ నంతవరకు మీరు అక్కడ కూర్చోరాదు. ఇప్పుడు మీరుగనక అలా చేస్తే మీరూ వారిలాంటి వారే. అల్లాహ్ కపటులనూ, అవిశ్వాసులనూ నరకంలో ఒకచోట పోగుచెయ్యబోతున్నాడనే విషయం నిశ్చయ మని తెలుసుకోండి. కపటులు మీ విషయంలో నిరీక్షిస్తున్నారు (గాలి ఎటు వీస్తుందో అని). అల్లాహ్ తరఫునుండి విజయం గనక మిమ్మల్ని వరిస్తే మీవద్దకు వచ్చి వారు ‘‘మేము మీతో ఉండ లేదా?’’ అని అంటారు.  ఒకవేళ అవిశ్వాసులదే పైచెయ్యి అయితే, వారితో ‘‘మీకు వ్యతిరేకంగా పోరాడేశక్తి మాకు లేదా?  అయినప్పటికీ మేము మిమ్మల్ని ముస్లిముల బారినుండి కాపాడాము’’ అని అంటారు. మీ ఉభయుల వ్యవహారాన్ని అల్లాహ్ ప్రళయంనాడు పరిష్కరిస్తాడు ( పరిష్కారంలో) ముస్లిములపై విజయం పొందే మార్గాన్నీ అవిశ్వాసులకు అల్లాహ్ వదలడు.

4. అన్నిసా 142 - 143 కపటులు అల్లాహ్ ను మోసం చేస్తున్నారు. వాస్తవానికి అల్లాహ్యే వారిని మోసంలో పడవేశాడు. వారు నమాజ్కొరకు లేస్తే, బద్ధకంగా, కేవలం ప్రజలకు చూపేందుకే లేస్తారు. అల్లాహ్ ను చాలా తక్కువగా స్మరిస్తారు. వారు విశ్వాస తిరస్కారాల మధ్య ఊగిసలాడుతున్నారు. పూర్తిగా ఇటూ కాదు, పూర్తిగా అటూ కాదు. అల్లాహ్ మార్గం తప్పించినవానికి నీవు మార్గాన్నీ చూపలేవు.

4. అన్నిసా 144 - 147 విశ్వసించిన ప్రజలారా! విశ్వాసులను కాదని అవిశ్వాసులను మీ మిత్రులుగా చేసుకోకండి. మీరు, మీకే వ్యతిరేకంగా అల్లాహ్ కు స్పష్టమైన సాక్ష్యం ఇవ్వదలచుకున్నారా? బాగా తెలుసుకోండి, కపటులు నరకంలో అట్టడుగు ప్రదేశానికి పోతారు. వారికి సహాయం చేసేవాడెవడూ మీకు దొరకడు. అయితే వారిలో పశ్చాత్తాపపడి, తమ ప్రవర్తనను సంస్కరించుకునేవారూ, ఇంకా అల్లాహ్ ను గట్టిగా నమ్ముకుని తమ ధర్మాన్ని అల్లాహ్ కొరకే ప్రత్యేకించుకునేవారూ విశ్వాసులతో ఉంటారు. అల్లాహ్ విశ్వాసులకు తప్పకుండా గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. మీరు కృతజ్ఞతలు చూపేదాసులుగా ఉన్నప్పుడు, విశ్వాస మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని అల్లాహ్ నిష్కారణంగా ఎందుకు శిక్షిస్తాడు? అల్లాహ్ యోగ్యతకు ఎంతో విలువ ఇస్తాడు. ఆయన అందరిస్థితినీ ఎరిగినవాడు.

4. అన్నిసా 148 - 149 అన్యాయం జరిగితే తప్ప, మనిషి చెడు పలకటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. అల్లాహ్ అన్నీ వినేవాడూ అన్నీ తెలిసినవాడూనూ. (అన్యాయం జరిగితే చెడు పలికే హక్కు మీకు ఉంది) అయి నప్పటికీ  మీరు  బహిరంగంగానూ, చాటుగానూ మేలే చేస్తూపోతే లేదా కనీసం చెడును క్షమతో ఉపేక్షిస్తే అల్లాహ్ (గుణం కూడా ఇదే, ఆయన) క్షమించేవాడు. (వాస్తవానికి ఆయన శిక్షించే) శక్తి కలవాడు కూడ.

4. అన్నిసా 150 - 152 అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను తిరస్కరించేవారూ, అల్లాహ్ ఆయన ప్రవక్తల మధ్య భేదభావం చూపేవారూ, ‘‘మేము కొందరిని విశ్వసిస్తాము, మరికొందరిని విశ్వసించము’’ అని అనే వారూ, అవిశ్వాస విశ్వాసాలకు మధ్య ఒక (కొత్త) మార్గాన్ని కనిపెట్టాలనే ఉద్దేశ్యం కలవారు - వారు అందరూ పరమ అవిశ్వాసులే. అటువంటి అవిశ్వాసుల కొరకు మేము అత్యంత అవమానకరమైన శిక్షను సిద్ధంచేసి ఉంచాము - దీనికి భిన్నంగా అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి, వారి మధ్య భేదభావం చూపని వారికి మేము వారి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము. అల్లాహ్ అధికంగా మన్నించేవాడూ, అనన్యంగా కరుణించేవాడూను.

4. అన్నిసా 153 - 162  ప్రవక్తా! గ్రంథ ప్రజలు ఒకవేళ ఈనాడు ‘‘ఆకాశం నుండి ఏదైనా గ్రంథాన్ని మాపై అవతరింపచెయ్యి’’ అని నిన్ను కోరుతున్నట్లయితే ఇంతకంటే పరమ ఘోరమైన కోరికలనే వారు పూర్వం మూసాను కోరివున్నారు. ఆయనను వారు, ‘‘అల్లాహ్ ను మాకు ప్రత్యక్షంగా చూపించు’’ అనే కోరారు. వారి తలబిరుసుతనం కారణంగానే వారిపై అకస్మాత్తుగా పిడుగు విరుచుకుపడిరది. తరువాత వారు ఆవుదూడను తమ ఆరాధ్యదైవంగా చేసుకున్నారు. వాస్తవానికి వారు స్పష్టమైన సూచనలు చూసివున్నారు. దానిక్కూడా మేము వారిని మన్నించాము. మేము మూసాకు స్పష్టమైన ఆజ్ఞను ప్రసాదించాము. వారిపై తూర్పర్వతమెత్తి ( ఆజ్ఞకు మేము విధేయులమై ఉంటామనే) ప్రమాణాన్ని తీసుకున్నాము. సజ్దా చేస్తూ (నగర) ద్వారంలోకి ప్రవేశించండి అని మేము వారిని ఆజ్ఞాపించాము. సబ్బత్శాసనాన్ని ఉల్లంఘించకూడదని మేము వారికి చెప్పాము. దీనికిగాను వారినుండి గట్టి ప్రమాణం తీసుకున్నాము. చివరకు, వారు ప్రమాణ భంగం చెయ్యటం వల్లా, అల్లాహ్ ఆయతులను నిరాకరించటంవల్లా, ఎంతోమంది ప్రవక్తలను అన్యాయంగా హత్య చేయటం వల్లా, ఇంకా ‘‘మా హృదయాలు గలేబులలో సురక్షితంగా ఉన్నాయి’’ అని చెప్పటం వల్లా, - యథార్థం ఏమిటంటే వారు అసత్యాన్ని అనుసరించిన కారణంగా అల్లాహ్ వారి హృదయాలకు ముద్రవేశాడు. కనుకనే వారు తక్కువగా విశ్వసిస్తారు - వారు తమ అవిశ్వాసంలో ఎంత ముందుకు పోయారంటే, మర్యమ్పైనే తీవ్రమైన నిందమోపారు. స్వయంగా, ‘‘మేము మసీప్, మర్యమ్కుమా రుడైన ఈసా అనే దైవప్రవక్తను చంపాము’’ అని అన్నారు - వాస్తవానికి వారు ఆయనను చంపనూలేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు. కాని విషయంలో వారు భ్రమకు గురిచెయ్యబడ్డారు. విషయం గురించి అభిప్రాయభేదం వ్యక్తం చేసిన వారు కూడా సందేహానికి లోనయ్యారు. దీనిని గురించి వారికి అసలు ఏమీ తెలియదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. వారు అతనిని నిశ్చయంగా చంపలేదు. కాని అల్లాహ్ ఆయనను తన వైపునకు లేపుకున్నాడు. అల్లాహ్ అద్భుత శక్తి సంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. గ్రంథ ప్రజలలో ఎవ్వరూ అతనిని అతని మరణానికి పూర్వం విశ్వసించకుండా ఉండరు. ప్రళయం నాడు ఆయన వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాడు - యూదుల దుర్మార్గ వైఖరివల్లా, ఇంకా వారు ఎక్కువగా అల్లాహ్ మార్గంలో ఆటంకాలను సృష్టిస్తున్నందువల్లా, వారికి నిషేధించబడిన వడ్డీని తీసుకుంటున్నందువల్లా, అధర్మంగా ఇతరుల సొమ్మును కబళిస్తున్నందువల్లా, మేము వారి కొరకు పూర్వం ధర్మసమ్మతములైన ఎన్నో పరిశుద్ధమైన వస్తువులను నిషిద్ధాలుగా చేశాము. వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారికొరకు మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. అయితే, వారిలోని గొప్ప జ్ఞానులు, నిజాయితీపరులు అందరూ, ప్రవక్తా! నీపై అవతరింపచెయ్యబడిన దానినీ నీకు పూర్వం అవతరింపచెయ్యబడినదానినీ విశ్వసిస్తారు. విధంగా విశ్వసించే వారికి నమాజ్, జకాత్ నియమాలను పాటించే వారికి, అల్లాహ్ ను, అంతిమదినాన్ని చిత్తశుద్ధితో నమ్మేవారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.

4. అన్నిసా 163 - 169 ప్రవక్తా! మేము నీ వైపునకు వహీ (దైవవాణి)ని పంపాము, నూప్ వైపునకు ఆయన తరువాతి ప్రవక్తల వైపునకు పంపినట్లు. మేము ఇబ్రాహీము, ఇస్మాయీల్, ఇస్హాఖ్, యాఖూబ్, యాఖూబ్సంతతి, ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్, సులైమాన్ వైపునకు వహీని పంపాము. మేము దావూద్కు జబూర్ను ప్రసాదించాము. మేము ఇంతకుముందు నీతో ప్రస్తావించిన ప్రవక్తల వైపునకు కూడ వహీని పంపాము. నీతో ప్రస్తావించని ప్రవక్తల వైపునకు కూడా పంపివున్నాము. సంభాషణలో మాదిరిగా మేము మూసాతో ప్రత్యక్షంగా మాట్లాడాము. ప్రవక్తలందరూ శుభవార్తను తెలిపేవారుగా, హెచ్చరిక చేసేవారుగా పంపబడ్డారు - వారి ఆవిర్భావం తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి ప్రజలవద్ద సాకూ మిగలకూడదని. ఎట్టి పరిస్థితులలోనైనా అల్లాహ్యే ఆధిక్యం కలిగివుండేవాడు, మహా వివేకవంతుడు (ప్రజలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా). ప్రవక్తా! నీపై తాను అవతరింపజేసిన దానిని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు. దీనికి దైవదూతలు కూడ సాక్షులుగా ఉన్నారు, అల్లాహ్ సాక్షిగా ఉండటమే సరిపోయినప్పటికీ. దీనిని విశ్వసించటానికి స్వయంగా తిరస్కరిస్తూ, ఇతరులను కూడ అల్లాహ్ మార్గంలోకి రాకుండా నిరోధించే వారు నిశ్చయంగా అపమార్గంలో పడి సత్యానికి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఈవిధంగా అవిశ్వాసవైఖరిని, తిరుగుబాటు వైఖరిని అవలంబించి అన్యాయానికి, అక్రమానికి పాల్పడేవారిని అల్లాహ్ ఎన్నటికీ క్షమించడు, వారికి నరకమార్గం తప్ప మరేమార్గమూ చూపడు. అక్కడ వారు కలకాలం ఉంటారు. ఇది అల్లాహ్ కు ఏమంత కష్టమైన పనికాదు.

4. అన్నిసా 170 మానవులారా! ప్రవక్త మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి సత్యం తీసుకువచ్చాడు. అతన్ని విశ్వసించండి, మీకే మంచిది. కాని మీరు గనక తిరస్కరిస్తే, ఆకాశాలలో, భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే అనే విషయం తెలుసుకోండి. అల్లాహ్ అన్నీ తెలిసినవాడూ, అత్యంత వివేకీనూ.

4. అన్నిసా 171 గ్రంథ ప్రజలారా! మీ ధర్మ విషయాలలో అతిగా ప్రవర్తించకండి. అల్లాహ్ కు సత్యం తప్ప వేరే విషయాన్ని ఆపాదించకండి. మసీప్, మర్యమ్కుమారుడైన ఈసా, అల్లాహ్ పంపిన ఒక ప్రవక్త, అల్లాహ్ మర్యమ్వైపునకు పంపిన ఒక ఆజ్ఞ, అల్లాహ్ తరఫు నుండి వచ్చిన (మర్యమ్గర్భంలో బిడ్డ రూపం దాల్చిన) ఒక ఆత్మ తప్ప మరేమీ కాదు. కనుక అల్లాహ్ ను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. ముగ్గురుఅని అనకండి. ఇలా అనటం మానివెయ్యండి. ఇది మీకే శ్రేయస్కరం. అల్లాహ్ ఒక్కడే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనకు ఒక కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన ఆస్తియే. దాని పోషణకు, దాని రక్షణకు ఆయనే చాలు.

4. అన్నిసా 172 - 173 తాను అల్లాహ్ కు దాసుడుగా ఉండటాన్ని మసీప్ అగౌరవంగా భావించలేదు. అల్లాహ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే దూతలు కూడా దీనిని తమకు అగౌరవంగా భావించరు. అల్లాహ్ దాస్యాన్ని తనకు అగౌరవమైనదిగా భావించేవాడు, అలా భావిస్తూ విర్రవీగేవాడు, అల్లాహ్ అందరినీ పోగుచేసి తనముందు హాజరు పరచబోయే ఒక సమయం వస్తుంది (అని తెలుసుకోవాలి). అప్పుడు విశ్వసించి, సత్ప్రవర్తనా వైఖరిని అవలంబించిన వారు తమ ప్రతిఫలాన్ని పూర్తిగా పొందుతారు. అల్లాహ్ తన అనుగ్రహంతో వారికి మరింత ఎక్కువ బహుమానం ప్రసాదిస్తాడు. ఇక దాస్యాన్ని అగౌరవ మైనదిగా భావించి విర్రవీగిన వారికి అల్లాహ్ అతి బాధాకరమైన శిక్షను విధిస్తాడు. అల్లాహ్ ను కాదని వారు ఎవరెవరి సహకార సంరక్షణలను నమ్ముకున్నారో, వారిలో ఎవరినీ వారు అక్కడ పొందలేరు.

4. అన్నిసా 174 - 175 మానవులారా! మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు స్పష్టమైన నిదర్శనం వచ్చింది. మేము మీ వద్దకు మీకు స్పష్టంగా మార్గం చూపే జ్యోతిని పంపాము. ఇక అల్లాహ్ మాటను ఆలకించేవారిని, ఆయన శరణువేడుకునే వారిని అల్లాహ్ తన కరుణతో తన అనుగ్రహంతో కప్పివేస్తాడు. వారికి తన వైపునకు వచ్చే రుజుమార్గం చూపుతాడు.

4. అన్నిసా 176 ప్రవక్తా! ప్రజలు నిన్ను ‘‘కలాలా’’ విషయంలో ధార్మిక తీర్పు అడుగుతున్నారు. అల్లాహ్ మీకు ధార్మిక తీర్పు ఇస్తున్నాడు అని చెప్పు. ఒక మనిషి గనక సంతానం లేకుండా మరణిస్తే, అతనికి ఒక సోదరి ఉంటే, అప్పుడు ఆమె అతని ఆస్తిలో సగభాగం పొందుతుంది. సోదరి గనక సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమెకు వారసుడౌతాడు. ఒకవేళ మృతునికి (వారసులు) ఇద్దరు సోదరీమణులైతే, వారు అతని ఆస్తిలోని మూడిరట రెండు భాగాలకు హక్కుదారులు అవుతారు. ఒకవేళ సోదరీ సోదరులు అనేకులు ఉన్నట్లయితే, అప్పుడు స్త్రీలకు ఒక వంతు పురుషులకు రెండు వంతులు లభిస్తాయి. అల్లాహ్ మీ కొరకు తన ఆజ్ఞలను విశదపరుస్తున్నాడు - మీరు మార్గం తప్పి తిరగకుండా ఉండేందుకు. అల్లాహ్ కు ప్రతి విషయమూ తెలుసు.




No comments:

Post a Comment