54 సూరహ్ అల్‌ ఖమర్

 

54. అల్ఖమర్

ఆయతులు : 55                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 3 ప్రళయ గడియ దగ్గరకు వచ్చేసింది. చంద్రుడు చీలిపోయాడు. కాని వారి పరిస్థితి ఎలా ఉందంటే, వారు సూచనను చూచినా తమ ముఖాలను తిప్పుకుంటున్నారు. ఇది నడుస్తున్న మంత్రజాలమే అని అంటున్నారు. వారు (దీనిని కూడా) తిరస్కరించారు, తమ మనోవాంఛలను అనుసరించారు. ప్రతి వ్యవహారం చివరకు ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది.

4 - 8 వారి ముందుకు (పూర్వపు జాతుల స్థితిగతులు వచ్చాయి  తలబిరుసు తనం నుండి వారిని దూరంగా ఉంచటానికి వాటిలో కావలసినంత గుణపాఠం ఉంది   హితబోధ లక్ష్యం చాల వరకు నెరవేరటానికి కావలసిన వివేకమూ ఉంది.  కాని హెచ్చరికలు వారి మీద పనిచేయటం లేదు. కనుక ప్రవక్తా! వారినుండి ముఖం త్రిప్పుకో. పిలిచేవాడు దుర్భరమైన, భయంకరమైన ఒక విషయం వైపునకు పిలిచే రోజున, ప్రజలు బిక్కచచ్చిన చూపులతో తమ సమాధుల నుండి, చెల్లా చెదరైపోయిన మిడుతల మాదిరిగా బయల్పడతారు  పిలిచే వాని వైపునకు పరుగెత్తుతూ ఉంటారు. ( విషయాన్ని ప్రపంచంలో నిరాకరిస్తూ ఉండిన) తిరస్కారులే అప్పుడు, ‘‘ రోజుమటుకు చాల కఠినమైన రోజు’’ అని అంటారు.

9 - 17  వారికి పూర్వం నూహ్ జాతి వారు తిరస్కరించారు. వారు మా భక్తుణ్ణి అసత్యవాదిగా నిర్ణయించి, ఇతడు పిచ్చివాడు అని అన్నారు. అతను దారుణంగా కసిరికొట్టబడ్డాడు. చివరకు అతను తన ప్రభువును ఇలా వేడు కున్నాడు, ‘‘నేను ఓడిపోయాను. ఇక నీవే వారికి ప్రతీకారం చేయి.’’ అప్పుడు మేము కుంభవృష్టి కురిసేలా  ఆకాశద్వారాలు తెరిచాము. భూమిని చీల్చి చెలమలుగా మార్చివేశాము. విధి నిర్ణయించిన పనిని పూర్తి చేయటానికి నీరంతా ఏకమైపోయింది. మేము నూహ్ ను పలకలు,  మేకులు గల దానిపైకి ఎక్కించాము. అది మా పర్యవేక్షణలో నడుస్తూ ఉండేది. ఇది విలువ ఇవ్వబడిన వ్యక్తి కోసం చేయబడిన ప్రతీకారం. నావను మేము ఒక సూచనగా చేసి వదలిపెట్టాము. మరి హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, నా శిక్ష ఎలా ఉండినదో, నా హెచ్చరికలు ఎలా ఉండినవో. మేము ఖురాన్ను హితబోధకొరకు సులభమైన మార్గంగా చేశాము. అయితే హితబోధను స్వీకరించేవాడు ఎవడైనా ఉన్నాడా?

18 - 22 ఆద్జాతి ప్రజలు తిరస్కరించారు. అప్పుడు నా శిక్ష ఎలా ఉండి నదో, నా హెచ్చరికలు ఎలా ఉండినవో చూడండి. పూర్తిగా అరిష్టదాయకమైన ఒక దుర్దినాన మేము ప్రచండమైన ఒక తుఫాను గాలిని వారిపైకి పంపాము. అది ప్రజలను వ్రేళ్లు తెగిపోయిన ఖర్జూరపు బోదెల మాదిరిగా ఎత్తి ఎత్తి విసిరిపడవేస్తుండేది. కనుక చూడండి, ఎటువంటిదో నా శిక్ష, ఎటువంటివో నా హెచ్చరికలు. మేము ఖురాన్ను హితబోధకై సులభమైన మార్గంగా చేశాము. కాబట్టి హితబోధను స్వీకరించేవాడెవడైనా ఉన్నాడా?

23 - 32 సమూద్జాతి వారు హెచ్చరికలను తిరస్కరించి ఇలా అన్నారు, ‘‘అతను ఒక్కడు, అందులోనూ మనలోనివాడు. మనం అలాంటి వ్యక్తి వెనుక నడవాలా?  మనం  గనక  అతని యెడల విధేయతను ఒప్పుకుంటే, దాని అర్థం, మనం మార్గం తప్పిపోయామన్నమాట, మన మతిపోయిందన్నమాట. మన మధ్య కేవలం అతను ఒక్కడిపైనేనా దేవుని ప్రస్తావన అవతరింపజేయ బడిరది? కాదు, కాని ఇతడు పెద్ద అబద్ధాలరాయుడు, డంబాలు పలికేవాడు. (మేము మా ప్రవక్తతో ఇలా అన్నాము), ‘‘అబద్ధాలరాయుడు, డంబాలు పలికేవాడు ఎవడో రేపే వారికి తెలిసిపోతుంది. మేము ఆడ ఒంటెను వారి కొరకు ఒక పరీక్షగా చేసి పంపుతున్నాము. ఇక కొంచెం ఓపికతో చూడు, వారి గతి ఏమవుతుందో. వారికీ, ఒంటెకూ మధ్య నీరు పంచబడాలనీ, ప్రతి ఒక్కరూ తమ  వంతు  రోజున నీటి వద్దకు రావాలనీ వారికి తెలుపు.’’ చివరకు వారు తమ మనిషిని పిలిచి చెప్పారు. అతడు కార్యభారాన్ని తన నెత్తిపై వేసుకుని ఆడ ఒంటెను చంపేశాడు. చూడండి, ఆపైన నా శిక్ష ఎలా ఉండినదో, నా హెచ్చరికలు ఎలా ఉండినవో. మేము వారిపైకి ఒకే ఒక ప్రేలుడును వదిలాము. అప్పుడు వారు త్రొక్కబడిన పశువుల దొడ్డి కంచె మాదిరిగా నుగ్గునుగ్గు అయిపోయారు. మేము ఖురాన్ను హితబోధకై సులభమైన మార్గంగా చేశాము. ఇక హితబోధను స్వీకరించేవాడెవడైనా ఉన్నాడా?

33 - 40 లూత్జాతి హెచ్చరికలను తిరస్కరించింది. మేము దానిపైకి రాళ్లు విసరివేసే గాలిని పంపాము, కేవలం లూత్ఇంటివారు మాత్రమే దానినుండి సురక్షితంగా ఉన్నారు. మేము వారిని మా అనుగ్రహంతో రాత్రివేళ వేకువ జామున రక్షించాము. కృతజ్ఞతలు తెలిపే ప్రతి మనిషికీ మేము ఇలా ప్రతిఫలం ఇస్తాము. లూత్తన జాతి ప్రజలను మా పట్టును గురించి హెచ్చరిం చాడు. కాని వారు హెచ్చరికలనన్నింటినీ సందేహాస్పదమైనవిగా భావించి మాటలతో ఎగరగొట్టేశారు. తరువాత అతనిని వారు తన అతిధులను రక్షించుకోకుండా దూరంగా ఉంచటానికి ప్రయత్నించారు. చివరకు మేము వారి కళ్లుపోగొట్టాము. (వారితో ఇలా అన్నాము), ‘‘ఇక నా శిక్షను, నా హెచ్చరికలను రుచి చూడండి. ఉదయం పెందలకడనే ఒక తిరుగులేని శిక్ష వారిని పట్టుకుంది. ఇప్పుడు నా శిక్షను,  నా హెచ్చరికలను రుచి చూడండి.’’ మేము ఖురాన్ను హితబోధకై సులభమైన మార్గంగా చేశాము. కనుక హితబోధను స్వీకరించే వాడెవడైనా ఉన్నాడా?

41 - 42 ఫిరౌన్ప్రజల వద్దకు కూడా హెచ్చరికలు వచ్చాయి. కాని వారు మా సూచనలు అన్నింటినీ తిరస్కరించారు. చివరకు మేము వారిని పట్టుకున్నాము, మహత్తర శక్తి సంపన్నుడు పట్టుకునే విధంగా.

43 - 48 మీ అవిశ్వాసులు వారికంటే ఏమైనా శ్రేష్ఠులా? లేక ఆకాశ గ్రంథాలలో మీ కొరకేదైనా మినహాయింపు వ్రాయబడి ఉన్నదా? లేకపోతే వారు, ‘‘మాది ఒక శక్తిమంతమైన వర్గం, మమ్మల్ని మేము రక్షించుకోగలం’’ అని అంటారా? త్వరలోనే వర్గం పరాజయం పాలవుతుంది, వారంతా వెన్ను చూపి పారిపోతూ కనిపిస్తారు.  కాని వారి పీచం అణచటానికి అసలు వాగ్దానం చేయబడిన సమయం ప్రళయమే. అది ఎంతో విపత్కరమైన, అత్యంత జుగుప్సాకరమైన సమయం. అసలు నేరస్తులు అపార్థానికి గురి అయ్యారు, వారికి మతిపోయింది. వారు బోర్లా పడవేయబడి, అగ్నిలోకి ఈడ్చబడే రోజున వారితో, ‘‘ఇప్పుడు చవి చూడండి నరకం తాకిడిని’’ అని చెప్పబడుతుంది.

49 - 53 మేము ప్రతి వస్తువునూ ఒక విధి నిర్ణయంతో పాటు సృష్టించాము. మా ఆజ్ఞ కేవలం ఒకే ఆజ్ఞ అవుతుంది  రెప్పపాటులోనే అది అమలులోకి వస్తుంది. మీవంటి చాలా మందిని మేము నాశనం చేశాము. మరి హితబోధను స్వీకరించే వాడెవడైనా ఉన్నాడా? వారు చేసినదంతా గ్రంథాలలో నమోదు చేయబడి ఉంది. ప్రతి విషయం చిన్నదీ, పెద్దదీ వ్రాయబడి ఉంది.

54 - 55 అవిధేయతకు దూరంగా ఉండేవారు, నిశ్చయంగా తోటలలో, కాలువలలో ఉంటారు, నిజమైన గౌరవ స్థానం, మహత్తరమైన అధికారాలు కల చక్రవర్తికి సమీపంలో.

No comments:

Post a Comment