52. అత్ తూర్
ఆయతులు
: 49 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 16 తూర్ పర్వతం సాక్షిగా! మృదువైన చర్మపు కాగితంపై వ్రాయబడిన స్పష్టమైన గ్రంథం సాక్షిగా! సందర్శనాలయం (కాబా గృహం) సాక్షిగా! ఎత్తైన కప్పు సాక్షిగా! అల్లకల్లోలపు సముద్రం సాక్షిగా! నీ ప్రభువు శిక్ష తప్పకుండా సంభవించనున్నది. దానిని ఎవ్వడూ అడ్డుకోజాలడు. ఆకాశం భయంకరంగా కనిపించే రోజున పర్వతాలు ఎగురుతూ తిరిగే రోజున అది సంభవిస్తుంది. ఈనాడు ఒక ఆటగా వితండవాదనలు చేస్తున్న సత్యతిరస్కారులకు ఆనాడు వినాశం కలుగుతుంది. ఆ రోజున వారిని కొట్టుతూ, నెట్టుతూ నరకం వైపునకు తీసుకువెళ్లటం జరుగుతుంది. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది, ‘‘మీరు తిరస్కరిస్తూ ఉండిన నరకాగ్ని ఇదే. ఇప్పుడు చెప్పండి, ఇది మంత్రజాలమా లేక మీకేమీ స్ఫురించటం లేదా? ఇక వెళ్లండి, అందులో కాలిపోతూ ఉండండి. మీరు సహనం వహించినా, వహించకపోయినా, మీకు ఒకటే. మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రకారమే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతోంది.’’
17 - 28
భయభక్తులు కలవారు అక్కడ ఉద్యానవనాలలో, భోగభాగ్యాలతో ఉంటారు. వారి ప్రభువు వారికి ఇచ్చే వాటిని హాయిగా అనుభవిస్తూ ఉంటారు. వారి ప్రభువు వారిని నరకశిక్ష నుండి రక్షించుకుంటాడు. (వారితో ఇలా అనబడుతుంది): ‘‘హాయిగా తినండి, త్రాగండి, మీరు చేస్తూ ఉండిన కర్మలకు ప్రతిఫలంగా, వారు వేయబడిన ఆసనాలపై దిండ్లకు ఆనుకుని ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. మేము వారికి అందమైన కళ్లుగల సుందరాంగులనిచ్చి వివాహం చేస్తాము. విశ్వాసుల సంతానం కూడ, విశ్వాసం విషయంలో దాదాపు వారి అడుగుజాడలలో నడిచి ఉంటే, వారి ఈ
సంతానాన్ని కూడా మేము (స్వర్గంలో) వారితో కలుపుతాము. ఇంకా వారి కర్మలలో వారికి ఏమాత్రం నష్టం కలుగజేయము. ప్రతి వ్యక్తీ తాను సంపాదించిన దానికి తాకట్టుగా ఉన్నాడు. మేము వారు కోరిన విధంగా వారికి అన్ని రకాల పండ్లు, మాంసం పుష్కలంగా ఇస్తూ ఉంటాము. వారు ఒకరి నుండి ఒకరు మధుపాత్రలను అమితోత్సాహంతో అందుకుంటూ ఉంటారు. దానిని సేవించటం వల్ల ప్రేలాపనలూ ఉండవు, చెడు నడతా ఉండదు. వారి (సేవ) కొరకే ప్రత్యేకించబడిన, దాచబడిన ఆణిముత్యాలవంటి అందమైన బాలురు వారి సేవలో పరుగెడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. వారు పరస్పరం (ప్రపంచంలో జరిగిన) పరిస్థితులను గురించి అడిగి తెలుసుకుంటారు. వారు, ‘‘మేము మొదట మా కుటుంబం వారి మధ్య (దేవునికి) భయపడుతూ జీవితం గడిపేవారం. చివరకు అల్లాహ్ మాపై కనికరం చూపాడు, మమ్మల్ని
తీవ్రమైన వడగాలి శిక్ష నుండి రక్షించాడు. మేము గత జీవితంలో ఆయననే వేడుకుంటూ ఉండేవారము. ఆయన నిజంగానే మహోపకారి మరియు అనంత కరుణామయుడు.
29 కనుక ప్రవక్తా! నీవు హితోపదేశం చేస్తూ ఉండు. నీ ప్రభువు దయవల్ల నీవు జ్యోతిష్యుడవూ కావు, పిచ్చివాడవూ కావు.
30 - 32 ‘‘ఈయన కవి, ఈయన వినాశకాలం కోసం మేము ఎదురు చూస్తున్నాము’’ అని వారు అంటున్నారా? సరే, ఎదురు చూడండి, నేను కూడా మీతోపాటు ఎదురుచూస్తాను, అని వారికి చెప్పు. వారి బుద్ధులు వారిని ఇలాంటి మాటలే పలుకండి అని ప్రేరేపిస్తున్నాయా? లేక వారసలు దుర్మార్గంలో హద్దులు మీరినవారా?
33 - 34 ఈయన ఈ ఖురాన్ను స్వయంగా కల్పించాడని వారు అంటున్నారా? అసలు విషయం ఏమిటంటే, వారు విశ్వసించదలచుకోలేదు. ఒకవేళ వారు తమ ఈ మాటలో సత్యవంతులే అయితే, ఇలాంటి ఔన్నత్యం గల వాణినే రచించి తీసుకురావాలి.
35 - 36 వారు సృష్టికర్త లేకుండా తమంతట తామే పుట్టారా? లేక వారు తమకు తామే సృష్టికర్తలా? లేక వారు భూమినీ, ఆకాశాలనూ సృష్టించారా? అసలు విషయం ఏమిటంటే, వారికి నమ్మకం లేదు.
37 - 39 నీ ప్రభువు నిక్షేపాలు వారి అధీనంలో ఉన్నాయా? లేక వాటిపై వారి అధికారమే చలామణీ అవుతుందా? వారి దగ్గర నిచ్చెన ఏదైనా ఉందా, దానిపై ఎక్కి వారు పై లోకం మాటలు వినిరావటానికి. వారిలో ఎవడైనా విని ఉంటే, వాడు ఏదైనా స్పష్టమైన ప్రమాణం తీసుకురావాలి. అల్లాహ్ కేమో కూతుళ్లా, మీకేమో కొడుకులా?
40 - 41 నీవు ప్రతిఫలమేదైనా ఇవ్వండి అని వారిని అడుగుతున్నావా, బలవంతంగా పడే ఋణభారం క్రింద వారు అణిగిపోవటానికి? అగోచర సత్యాలేమైనా వారికి తెలుసా, వాటి ఆధారంగా వారు వ్రాయటానికి?
42 - 47 వారేదైనా పన్నాగం పన్నదలచారా? (ఇదే గనక నిజం అయితే) అవిశ్వాసుల పన్నాగం స్వయంగా వారికే బెడిసికొడుతుంది. వారికి అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు ఉన్నాడా? వారు చేసే షిర్క్ నుండి అల్లాహ్ పరిశుద్ధుడు. వారు ఆకాశపు తునకలు సైతం రాలిపడటం చూసినా, ఇవి దట్టమైన మేఘాలు అని అంటారు. కనుక ప్రవక్తా! వారి మానాన వారిని వదలిపెట్టు, వారిని కొట్టి పడవేసే రోజు వచ్చేవరకు. అప్పుడు వారు దెబ్బలు తిని క్రిందపడిపోతారు. ఆ రోజున వారి పన్నాగాలేవీ వారికి ఏమాత్రమూ పనికిరావు. వారిని ఆదుకోవటానికి కూడా ఎవడూ రాడు. ఇంకా ఆ సమయం రావటానికి ముందు కూడా దుర్మార్గులకు ఒక శిక్ష ఉంది. కాని వారిలో చాలామంది ఎరుగరు.
48 - 49 ప్రవక్తా! నీ ప్రభువు ఉత్తరువు వచ్చేవరకు ఓర్పు వహించు. నీవు మా దృష్టిలో ఉన్నావు. నీవు లేచినప్పుడు, నీ ప్రభువు స్తోత్రం చేయటంతో పాటు, ఆయన పవిత్రనామాన్ని జపించు. రాత్రివేళ కూడా ఆయన పవిత్రనామాన్ని జపించు, నక్షత్రాలు అస్తమిస్తున్నవేళ కూడా.
No comments:
Post a Comment