53. అన్ నజ్మ్
ఆయతులు
: 62 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 12 అప్పుడే అస్తమించిన నక్షత్రం సాక్షిగా! మీ సహచరుడు దారీ తప్పలేదు, తప్పుదారీ పట్టలేదు. అతను తన మనోవాంఛలను అనుసరించి చెప్పటం లేదు.
ఇది ఒక వహీ, అతనిపై అవతరింపజేయ బడుతుంది. గొప్ప శక్తిసంపన్నుడు అతనికి నేర్పుతున్నాడు. ఆయన గొప్ప వివేకవంతుడు. అతను దిఙ్మండలం ఎగువ భాగంపై ఉన్నప్పుడు ఆయన అతని ముందుకు వచ్చి నిలబడ్డాడు, తరువాత మరింత దగ్గరకు వచ్చి పైన ఆగిపోయాడు. ఈ విధంగా ఆయన రెండు ధనుస్సుల అంత లేదా అంతకంటే కొంచెం తక్కువ దూరంలో ఆగిపోయాడు. అప్పుడు ఆయన అల్లాహ్ భక్తునికి, చేరవేయ వలసి ఉన్న వహీని చేరవేశాడు. (అతని) కళ్లు చూచిన దానిలో (అతని) హృదయం అసత్యాన్ని కలుపలేదు. అయితే మీరు, అతను కళ్లారా చూస్తూ ఉన్నదానిని గురించి అతనితో వివాదానికి దిగుతారా?
13 - 18 తరువాత మరొకసారి అతను ‘‘సిద్రతుల్ మున్తహా’’ వద్ద ఆయనను దిగుతూ ఉండగా చూశాడు. అక్కడికి దగ్గరలోనే ‘‘జన్నతుల్ మావా’’ (స్వర్గనివాన స్థలం) ఉంది. ఆ సమయంలో ‘‘సిద్రహ్’’ను అలముకొనేది అలముకుంటూ ఉన్నది. (అతని) చూపులు తప్పిపోనూ లేదు, హద్దును దాటిపోనూ లేదు. అతను తన ప్రభువు యొక్క గొప్ప గొప్ప సూచనలను చూశాడు.
19 - 25 ఇప్పుడు చెప్పండి
ఈ లాత్, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్ల వాస్తవికతను గురించి మీరు కాస్తయినా ఆలోచించారా? ఏమిటి, మీ కోసం కుమారులున్నూ, దేవుని కోసం కుమార్తెలూనా? ఇది చాలా ఘోరమైన విభజన! అసలు ఇవి ఏమీ కావు. మీరూ, మీ తాత ముత్తాతలూ పెట్టుకున్న కొన్ని పేర్లు మాత్రమే. అల్లాహ్ వాటికై ఏ ప్రమాణాన్నీ పంపలేదు. యధార్థమేమిటంటే, వారు కేవలం ఊహలనూ, అనుమానాలనూ అనుసరిస్తున్నారు, మనోవాంఛలకు దాసులై పోయారు. వాస్తవానికి వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు సన్మార్గం వచ్చేసింది. మానవుడు కోరేదెల్లా అతనికి సత్యం అవుతుందా? ప్రపంచానికీ, పరలోకానికీ యజమాని అల్లాహ్ మాత్రమే.
26 - 28 ఆకాశాలలో ఎంతోమంది దైవదూతలు ఉన్నారు. కాని వారి సిఫారసు ఏమాత్రం ఉపయోగపడదు, అల్లాహ్ తాను ఎవరిని గురించైతే ఏదైనా విన్నపం వినదలుస్తాడో, ఎవడైతే ఆయనకు ఇష్టుడో, అటువంటి వ్యక్తి విషయంలో దానికి (సిఫారసుకు) అనుమతి ఇస్తేనేతప్ప. కాని పరలోకాన్ని విశ్వసించని వారు దైవదూతలను దేవతల పేర్లతో పిలుస్తున్నారు. వాస్తవానికి ఈ విషయంలో వారి వద్ద ఎటువంటి జ్ఞానమూ లేదు. వారు కేవలం అనుమానాలను అనుసరిస్తున్నారు. సత్యం స్థానంలో అనుమానం ఏమాత్రం ఉపయోగపడదు కదా!
29 - 32
కనుక ప్రవక్తా! మా ప్రస్తావన నుండి ముఖం త్రిప్పుకుని, భౌతిక జీవితం తప్ప మరొక తలంపు లేని వ్యక్తిని అతని మానాన అతనిని వదలిపెట్టు - వారికున్న జ్ఞానం మొత్తం ఇంతే. ఆయన మార్గం నుండి ఎవడు తప్పిపోయాడు, ఎవడు ఋజుమార్గంలో ఉన్నాడు అనే విషయాన్ని నీ ప్రభువే బాగా ఎరుగును. భూమ్యాకాశాలలోని ప్రతి వస్తువుకూ యజమాని అల్లాహ్ యే - చెడు చేసేవారికి అల్లాహ్ వారి కర్మలకు ప్రతిఫలం ఇచ్చేందుకు, సదాచరణ వైఖరి అవలంబించిన వారికి మంచి ప్రతిఫలం ప్రసాదించేందుకు. వారు పెద్ద పెద్ద పాపాలకు, స్పష్టమైన అసభ్య చేష్టలకు దూరంగా ఉంటారు, కొన్ని పొరపాట్లు తప్ప. నిస్సంశయంగా నీ ప్రభువు క్షమాగుణ పరిధి అత్యంత విశాలమైనది. ఆయన మిమ్మల్ని భూమినుండి సృష్టించినప్పటి నుండీ, మీరు మీ మాతృ గర్భాలలో ఇంకా పిండాలుగానే ఉన్నప్పటి నుండీ బాగా ఎరుగును. కనుక మీ పవిత్రతను గురించి గొప్పలు చెప్పుకోకండి. నిజమైన భయభక్తులు గల వాడెవడో ఆయనకే బాగా తెలుసు.
33 - 55 ప్రవక్తా! దైవమార్గం నుండి ముఖం త్రిప్పుకుని కొంచెం మాత్రమే ఇచ్చి ఆగిపోయిన వ్యక్తిని కూడ నీవు చూశావా? అతని వద్ద అతీంద్రియ జ్ఞానమేదైనా ఉందా అతడు యథార్థాన్ని చూసేందుకు? మూసా ప్రవక్త గ్రంథాలలోనూ, తన వాగ్దానాన్ని నెరవేర్చి తన నిజాయితీని నిరూపించుకున్న ఇబ్రాహీమ్ ప్రవక్త గ్రంథాలలోనూ వివరించబడిన విషయాల సమాచారమేదీ అతనికి అందలేదా? ఆ విషయాలు ఏమిటంటే
బరువు మోసేవాడెవడూ ఇతరుల బరువును మోయడు. దేనికై మానవుడు కృషిచేస్తాడో, అది తప్ప అతనికి మరొకటేదీ లభించదు. త్వరలోనే అతని కృషిని చూసి, దాని ప్రతిఫలం పూర్తిగా అతనికి ఇవ్వబడుతుంది. చివరకు నీ ప్రభువు వద్దకే చేరవలసి ఉంది. ఆయనే నవ్విస్తున్నాడు, ఆయనే ఏడిపిస్తున్నాడు. ఆయనే మరణం ఇచ్చాడు, ఆయనే జీవితాన్ని ప్రసాదించాడు. విడిచే ఒక బిందువు ద్వారా ఆడా మగల జంటను ఆయనే సృష్టించాడు. మరొక జీవితాన్ని ప్రసాదించటం కూడా ఆయన బాధ్యతే. సంపన్నునిగా చేసింది ఆయనే, ఆస్తిపాస్తులను ప్రసాదించిందీ ఆయనే. ఆయనే సిరియస్ (అగ్ని నక్షత్రం) నక్షత్రానికి కూడ ప్రభువు
ఆయనే ప్రాచీన ఆద్ జాతిని నాశనం చేశాడు
సమూద్ జాతిని ఒక్కడూ మిగలకుండా పూర్తిగా తుడిచిపెట్టాడు
వారికి పూర్వం నూహ్ జాతిని నాశనం చేశాడు
ఎందుకంటే వారు స్వతహాగా పరమ దుర్మార్గులు, పరమ విద్రోహులు. తలక్రిందులుగా పడిపోయిన జనపదాలను ఎత్తి విసిరిపారేశాడు. తరువాత వాటిపై దానిని ఆవరింపజేశాడు, (నీకు తెలిసే ఉంది) దేనిని ఆవరింపజేశాడో. కనుక ఓ మానవుడా! నీ ప్రభువు యొక్క ఏయే భాగ్యాలను గురించి నీవు అనుమానిస్తావు?
56 - 62 ఇదివరకు వచ్చిన హెచ్చరికలలోని ఒక హెచ్చరిక ఇది. రానున్న గడియ సమీపంలోనే ఉన్నది. అల్లాహ్ తప్ప మరెవరూ దానిని తొలగించలేరు. ఇక మీరు ఆశ్చర్యం వెలిబుచ్చే విషయాలు ఇవేనా? మీరు నవ్వుతున్నారా, ఏడ్పు రావటం లేదా మీకు? పాటలతో, ఆటలతో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారా? అల్లాహ్ ముందు మోకరిల్లండి, ఆయనకు దాస్యం చేయండి.
No comments:
Post a Comment