80 అబస
ఆయతులు
: 42 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 16 విసుగుకొని ముఖం తిప్పుకున్నాడు, ఆ అంధుడు తన వద్దకు వచ్చాడని, నీకేమి తెలుసు, బహుశా అతను దారికి రావచ్చు లేదా హితోపదేశం గురించి ఆలోచించవచ్చు, హితోపదేశం అతనికి లాభదాయకం కూడా కావచ్చు. లక్ష్యపెట్టనివాడి పట్లనైతే నీవు శ్రద్ధ చూపుతావు
వాస్తవానికి, ఒకవేళ అతడు దారికి రాకపోతే, దానికి నీపై బాధ్యత లేదుకదా? ఎవడు తనంతటతాను నీ వద్దకు పరుగెత్తుకుంటూ
వస్తాడో మరియు (దేవునికి) భయపడుతూ ఉంటాడో, అతని వైపునుండి నీవు ముఖం తిప్పుకుంటున్నావు. ఎంతమాత్రం కాదు, ఇదసలు ఒక హితబోధ, ఇష్టమైనవారు దీనిని స్వీకరించ వచ్చు. ఇది ప్రతిష్ఠాత్మకమైన, మహోన్నతమైన, పరిశుద్ధమైన పత్రాలలో ఉన్నది: ఇవి గౌరవనీయులు, సద్వర్తనులు అయిన లేఖకుల చేతులలో ఉంటాయి.
17 - 32 మానవుడు నాశనమవుగాక! ఎంత కరుడుగట్టిన సత్యతిరస్కారి ఇతడు! ఏ వస్తువుతో అల్లాహ్ ఇతన్ని సృష్టించాడు? ఒక రేతస్సు బిందువుతో అల్లాహ్ ఇతన్ని సృష్టించాడు, తరువాత ఇతని అదృష్టాన్ని నిర్ణయించాడు, ఆ తరువాత ఇతని కొరకు జీవన మార్గాన్ని సులభతరం చేశాడు, ఆపైన ఇతనికి మరణాన్నిచ్చి సమాధికి చేర్చాడు. మళ్ళీ తాను తలచినప్పుడు ఆయన ఇతన్ని రెండోసారి లేపి నిలబెడతాడు. ఎంతమాత్రం కాదు, అల్లాహ్ ఏ విధిని గురించి ఆజ్ఞాపించాడో, ఆ విధిని ఇతను నెరవేర్చలేదు. తరువాత మానవుడు తాను తీసుకునే ఆహారం గురించి కొంచెం ఆలోచించాలి. మేము పుష్కలంగా నీటిని కురిపించాము, తరువాత నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము, ఆ తరువాత అందులో ధాన్యం, ద్రాక్ష, కూరగాయలు, ఆలివ్ (జైతూన్) వృక్షాలు, దట్టమైన తోటలు, ఇంకా రకరకాల పండ్లను, మేతను మీ కొరకు, మీ పశువుల కొరకు జీవన సామగ్రిగా పండిరచాము.
33 - 42 చివరకు చెవులను చెవిటిగా చేసే ధ్వని ఉధృతమైనప్పుడు - ఆ రోజున మనిషి తన సోదరునికీ, తన తల్లికీ, తన తండ్రికీ, తన భార్యకూ, తన సంతానానికీ దూరంగా పరుగెత్తుతాడు. ఆ రోజున వారిలో ప్రతి ఒక్కరికీ తమను గురించి తప్ప ఇతరుల్ని గురించి పట్టించుకోలేని ఆపత్సమయం వస్తుంది. ఆ రోజున కొందరి ముఖాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఆనంద పారవశ్యంతో నవ్వులు చిందిస్తూ ఉంటాయి. కొందరి ముఖాలు ఆ రోజున దుమ్మూ ధూళీ కొట్టుకుని ఉంటాయి, వాటిపై నల్లని మసి ఆవరించి మాడిపోయి ఉంటాయి. వీరే సత్య తిరస్కారులు, దుర్మార్గులు.
No comments:
Post a Comment