7.
అల్ ఆరాఫ్
ఆయతులు
: 206 అవతరణ
: మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
7.
అల్ ఆరాఫ్ 1 - 2 అలిఫ్ లామ్ మీమ్ సాద్. ఇది ఒక గ్రంథం, నీ వైపునకు అవతరింపచెయ్యబడిరది. కనుక ప్రవక్తా! దీనిని గురించి నీ మనస్సులో ఏ సంకోచమూ ఉండకూడదు. దీని అవతరణ ఉద్దేశ్యం - నీవు దీనిద్వారా (తిరస్కారులను) భయపెట్టాలనీ, ఇది విశ్వాసులకు హితోపదేశం కావాలనీ.
7.
అల్ ఆరాఫ్ 3 ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపచెయ్యబడిన దానిని అనుసరించండి. మీ ప్రభువును త్రోసిరాజని ఇతర సంరక్షకులను అనుసరించకండి - కాని మీరు హితబోధను స్వీకరించటం అరుదు.
7.
అల్ ఆరాఫ్ 4 - 5 మేము నాశనం చేసిన నగరాలు ఎన్నో ఉన్నాయి. వాటిపై మా శిక్ష రాత్రి సమయంలో హఠాత్తుగా విరుచుకుపడిరది లేక పట్టపగలు వారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వచ్చిపడిరది. వారిపై మా శిక్ష వచ్చిపడినప్పుడు, ‘‘మేము నిజంగానే దుర్మార్గులం’’ అనే రోదన తప్ప వారి నోటినుండి మరేమీ రాలేదు.
7.
అల్ ఆరాఫ్ 6 - 9 కనుక ఇది తప్పకుండా జరుగవలసి ఉంది: మేము ఎవరి వద్దకు ప్రవక్తలను పంపామో, వారిని మేము లెక్క అడుగుతాము. ఇంకా ప్రవక్తలను కూడా అడుగుతాము (వారు సందేశాన్ని అందజేసే తమ విధిని ఎంతవరకు నిర్వహించారు అనీ, దానికి లభించిన సమాధానం ఏమిటీ అనీ). తరువాత స్వయంగా మేమే జరిగిన మొత్తం గాధను పూర్తి జ్ఞానంతో వారి ముందు పెడతాము. అసలు మేము ఎక్కడా లేకుండా ఉండలేదుగదా! బరువు ఆ రోజున సత్యమే అవుతుంది. ఎవరి త్రాసు పళ్ళాలు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందేవారు. ఎవరి త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో వారే తమను తాము నష్టానికి గురిచేసుకునేవారు. ఎందుకంటే, వారు ఆయతుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉండేవారు.
7.
అల్ ఆరాఫ్ 10 మేము మిమ్మల్ని ధరణిపై అధికారాలతో వసింపజేశాము. ఇక్కడ మీకొరకు ఉపాధి వసతులను ఏర్పాటు చేశాము. కాని మీరు కృతజ్ఞులు కావటం అనేది అరుదు.
7.
అల్ ఆరాఫ్ 11 మేము మీ సృష్టిక్రియను ప్రారంభించాము. తరువాత మీ రూపాన్ని తీర్చిదిద్దాము. పిదప ఆదముకు సాష్టాంగపడండి అని దైవదూతలను ఆజ్ఞాపించాము. ఈ ఆదేశానుసారం అందరూ సాష్టాంగపడ్డారు. కాని ఇబ్లీసు సాష్టాంగపడేవారిలో చేరలేదు.
7.
అల్ ఆరాఫ్ 12 - 19 అల్లాహ్, ‘‘నిన్ను నేను ఆదేశించినప్పటికీ సాష్టాంగపడకుండా నిన్ను ఏ విషయం నిరోధిం చింది?’’ అని అడిగాడు. ఇలా పలికాడు : ‘‘నేను అతడికంటే శ్రేష్ఠుణ్ణి. నీవు నన్ను అగ్నితో సృష్టించావు. అతణ్ణి మట్టితో.’’ ఇలా సెలవిచ్చాడు : ‘‘సరే, అయితే ఇక్కణ్ణుంచి కిందకు దిగు. ఇక్కడ నీ గొప్పతనాన్ని గురించి గర్వపడే హక్కు నీకు లేదు. వెళ్ళిపో. వాస్తవానికి నీవు తమ పరాభవాన్ని తామే కోరుకునే వారిలోని వాడవు.’’ ఇలా అన్నాడు : ‘‘వారందరూ మళ్ళీ లేపబడే రోజు వరకు నాకు వ్యవధినివ్వు.’’ ఇలా సెలవిచ్చాడు : ‘‘నీకు వ్యవధి ఉంటుంది.’’ ఇలా అన్నాడు:
‘‘అలాగే, నీవు నన్ను మార్గభ్రష్టత్వానికి గురిచేసినట్లు నేను కూడా నీ రుజుమార్గంపై ఈ మానవుల కొరకు మాటువేసి కూర్చుంటాను. వెనుకా, ముందూ, కుడీ, ఎడమా అన్ని వైపుల నుండీ వారిని చుట్టుముట్టుతాను. వారిలో అధిక సంఖ్యాకులను కృతజ్ఞులుగా చూడవు.’’ ఇలా సెలవిచ్చాడు: ‘‘వెళ్ళిపో ఇక్కణ్ణుంచి, నీచుడవై, తిరస్కృ తుడవై. వారిలో నిన్ను అనుసరించే వారందరితో నిన్ను కలిపి నరకాన్ని నింపుతాను. దీనిని నమ్ము. ఆదమ్! నీవూ,
నీ భార్యా,
ఇద్దరూ ఈ స్వర్గంలో నివసించండి. ఎక్కడ ఏ వస్తువును మీ మనస్సు కోరినా దానిని తినండి.
కాని ఈ వృక్షం దరిదాపులకు కూడా పోవద్దు. ఒకవేళ పోయినట్లయితే దుర్మార్గులలో కలసిపోతారు.’’
7.
అల్ ఆరాఫ్ 20 - 25 తరువాత షైతాను వారిని మాయకు లోనుచేశాడు, ఒకరిని మరొకరికి గుప్తంగా ఉన్న వారి మర్మాంగాలను వారికి బహిర్గతం చేసేందుకు. వాడు వారితో ఇలా అన్నాడు : ‘‘మీ ప్రభువు మిమ్మల్ని ఈ వృక్షం వద్దకు పోవద్దని వారించటానికి కారణం, మీరు దైవదూతలు అయిపోతారేమో అనేదీ, లేక మీకు శాశ్వతమైన జీవితం లభిస్తుందేమో అనేదీ తప్ప మరొకటి కాదు.’’ ఇంకా వాడు ప్రమాణం చేసి వారితో ఇలా అన్నాడు:
‘‘నేను మీ నిజమైన శ్రేయోభిలాషిని.’’ ఈ విధంగా మోసంచేసి అతడు వారిద్దరినీ క్రమక్రమంగా తన పన్నుగడ వైపునకు త్రిప్పుకున్నాడు. చివరకు వారు ఆ వృక్షాన్ని రుచిచూడగానే, వారి ఆచ్ఛాదనలు వారిముందే తొలగిపోయాయి. అప్పుడు వారు తమ శరీరాలను స్వర్గంలోని ఆకులతో కప్పుకోసాగారు. తరువాత వారి ప్రభువు వారిని పిలిచి ఇలా అన్నాడు : ‘‘నేను ఆ చెట్టువద్దకు పోవద్దని మిమ్మల్ని వారించలేదా? షైతాను మీకు బహిరంగ శత్రువని చెప్పలేదా?’’ వారు ఉభయులూ ఇలా వేడుకున్నారు : ‘‘ప్రభూ! మాకు మేము అన్యాయం చేసుకున్నాము. నీవు గనక మమ్మల్ని మన్నించకపోతే, కనికరించకపోతే మేము నిశ్చయంగా సర్వనాశనం అయిపోతాము. ఇలా అన్నాడు : ‘‘దిగిపోండి, మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు మీకు భూమిలోనే నివాసమూ ఉపాధి సదుపాయాలూ ఉంటాయి.’’ ఇంకా ఇలా అన్నాడు : ‘‘మీరు అక్కడే జీవిస్తారు. అక్కడే మరణిస్తారు. అక్కడినుంచే చివరకు తీయబడతారు.’’
7.
అల్ ఆరాఫ్ 26 - 27 ఆదము సంతానమా! మేము మీపై దుస్తులను అవతరింపజేశాము. అవి మీరు సిగ్గుపడే మీ శరీర భాగాలను కప్పుతాయి. మీ శరీర రక్షణకు శోభకు సాధనంగా ఉంటాయి. భయభక్తులు అనే దుస్తులే మంచి దుస్తులు. ఇది అల్లాహ్ సూచనలలోని ఒక సూచన. బహుశా ప్రజలు దీనిద్వారా గుణపాఠం నేర్చుకుంటారేమో! ఆదము సంతానమా! షైతాను మీ మాతాపితరులను స్వర్గం నుంచి బహిష్కరింపజేశాడు. వారి మర్మాంగాలు ఒకరివి ఒకరికి బహిర్గతం కావటానికి వారి వస్త్రాలను, వారిపైనుండి తొలగింపచేశాడు. అదేవిధంగా మిమ్మల్ని మళ్ళీ వాడు ఆపదకు గురిచెయ్యటం అనేది జరగకూడదు. అతడూ, అతడి సహచరులూ, మీరు వారిని చూడలేని ప్రదేశం నుండి మిమ్మల్ని చూస్తారు. మేము ఈ షైతానులను విశ్వసించని వారికి సంరక్షకులుగా చేశాము.
7.
అల్ ఆరాఫ్ 28 - 30 ఏదైనా సిగ్గుమాలిన పనిచేసినప్పుడు, ఈ ప్రజలు ఏమంటారంటే, ‘‘ఈ పద్ధతినే మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూశాము. ఇలా చెయ్యండి అని అల్లాహ్ యే మమ్మల్ని ఆదేశించాడు.’’ వారితో ఇలా అను : ‘‘సిగ్గుమాలిన పనిని అల్లాహ్ ఎన్నటికీ ఆదేశించడు. అల్లాహ్ తరఫునుండి వచ్చాయని మీకు తెలియని ఆ విషయాలను మీరు అల్లాహ్ పేరుతో ప్రకటిస్తున్నా రేమిటి?’’ ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘నా ప్రభువు సత్యాన్నీ, న్యాయాన్నీ ఆదేశించాడు. ఇంకా ఆయన ఆజ్ఞ ఏమిటంటే, మీరు ప్రతి ఆరాధనలో మీ దిక్కును సరిగ్గా అమర్చుకోండి, ఆయననే వేడుకోండి, మీ ధర్మాన్ని ఆయన కొరకే ప్రత్యేకం చేసుకుని. ఆయన మిమ్మల్ని ఇప్పుడు పుట్టించిన విధంగానే మీరు మళ్ళీ పుట్టించబడతారు. ఒక వర్గానికి ఆయన రుజుమార్గం చూపించాడు. కాని రెండో వర్గానికి మార్గభ్రష్టత్వం బాగా సరిపోయింది. ఎందుకంటే, వారు అల్లాహ్ కు బదులుగా షైతాను లను తమ సంరక్షకులుగా ఎన్నుకున్నారు. అయినా ‘‘మేము రుజుమార్గంలో ఉన్నాము’’ అని వారు భావిస్తున్నారు.
7.
అల్ ఆరాఫ్ 31 ఆదము సంతానమా! ప్రతి ఆరాధనా సమయంలో మీ వస్త్రాలంకరణపట్ల శ్రద్ధ వహించండి. తినండి, త్రాగండి, మితిమీరకండి. అల్లాహ్ మితిమీరేవారిని ప్రేమించడు.
7.
అల్ ఆరాఫ్ 32 ప్రవక్తా! వారితో ఇలా అను:
‘‘అల్లాహ్ తన దాసుల కొరకు ఉద్భవింపజేసిన మంచి వస్త్రాలను ఎవరు నిషేధించారు? ఇంకా అల్లాహ్ ప్రసాదించిన పరిశుద్ధ వస్తువులను నిషేధించింది ఎవరు?’’ ఇలా అను : ఈ వస్తువులన్నీ ఇహలోక జీవితంలో కూడా విశ్వాసుల కొరకే, ప్రళయం నాడు ప్రత్యేకంగా వారికొరకు మాత్రమే. జ్ఞానం కలవారి కొరకు ఈ విధంగా మేము మా మాటలను స్పష్టంగా చెబుతున్నాము.
7.
అల్ ఆరాఫ్ 33 ప్రవక్తా! వారితో ఇలా అను: ‘‘నా ప్రభువు నిషేధించినవి ఇవి : సిగ్గుమాలిన పనులు - బహిరంగ మైనవికాని, లేక గుప్తమైనవికాని - పాపాలు సత్యానికి వ్యతిరేకంగా మేరమీరటం, అల్లాహ్ ఏ ప్రమాణాన్నీ అవతరింపజేయకపోయినా మీరు ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా కల్పించటం (వాస్తవంగా అల్లాహ్ యే అన్నాడని) మీకు తెలియని విషయాన్ని మీరు అల్లాహ్ పేరుతో చెప్పటం.’’
7.
అల్ ఆరాఫ్ 34 - 39 ప్రతి జాతికి ఒక గడువు నిర్ణయం అయివుంది. ఒక జాతి గడువు పూర్తి అయినప్పుడు, ఒక్క గడియకాలం కూడా అది వెనకా ముందూ అవటం సంభవించదు. (సృష్టి ప్రారంభంలోనే అల్లాహ్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు). ఆదము సంతానమా! జ్ఞాపకం ఉంచుకోండి, ఒకవేళ మీ వద్దకు స్వయంగా మీలోనుండే నా ఆయతులను వినిపించే ప్రవక్తలు వచ్చినప్పుడు, అవిధేయత నుండి తనను తాను కాపాడుకుంటూ తన వైఖరిని సంస్కరించుకునే వానికి భయంకానీ ద్ణుఖంకానీ కలిగే అవకాశం లేదు. ఇంకా మా ఆయతులు అసత్యాలని తిరస్కరించి వాటిపట్ల తలబిరుసు తనం ప్రదర్శించే వారే నరక నివాసులు అవుతారు. అక్కడే వారు శాశ్వతంగా ఉంటారు. పూర్తిగా అబద్ధాలైన విషయాలను సృష్టించి, అల్లాహ్ కు ఆరోపించి లేక సత్యమైన అల్లాహ్ ఆయతులు అసత్యాలని తిరస్కరించే వాడిని మించిన దుర్మార్గుడెవడు? అటువంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగాన్ని పొందుతూ ఉంటారు, మేము పంపే దైవదూతలు వారి ఆత్మలను బంధించటానికి వచ్చే ఆ గడియవరకు. అప్పుడు ఆ దూతలు వారిని ఇలా అడుగుతారు : ‘‘చెప్పండి, మీరు అల్లాహ్ కు బదులుగా వేడుకునే ఆ ఆరాధ్య దైవాలు ఇప్పుడెక్కడున్నారు?’’ వారు ఇలా అంటారు : ‘‘వారంతా మా నుండి తప్పుకున్నారు.’’ ఇంకా వారు ‘‘మేము నిజంగానే సత్యతిరస్కారులమే’’ అని తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యం ఇస్తారు. అల్లాహ్ ఇలా సెలవిస్తాడు: ‘‘పోండి, మీకు పూర్వం గతించిన జిన్నాతుల వర్గమూ మానవుల వర్గమూ పోయి చేరిన ఆ నరకానికే మీరూ పోండి.’’ ప్రతి వర్గమూ, అది నరకంలో ప్రవేశించేటప్పుడు తన పూర్వపు వర్గాన్ని శపిస్తూ ప్రవేశిస్తుంది. చివరకు వారంతా అక్కడకు చేరినప్పుడు, తరువాత వచ్చిన ప్రతివర్గమూ తన పూర్వపు వర్గాన్ని గురించి ఇలా అంటుంది: ‘‘ప్రభూ! మమ్మల్ని మార్గభ్రష్టులుగా చేసినవారు వీరే. కనుక వీరికి
రెట్టింపు అగ్ని శిక్ష విధించు.’’ సమాధానంగా ఇలా అనబడుతుంది : ప్రతివాడికీ రెట్టింపు శిక్షే పడుతుంది. కాని అది మీకు తెలియదు.’’ మొదటివర్గం రెండో వర్గంతో ఇలా అంటుంది: ‘‘(మేము గనక నిందార్హులమే అయితే) మీరు మాత్రం మాకంటే ఏ విషయంలో మెరుగు, ఇక మీరు మీ సంపాదనకు ఫలితంగా శిక్షను చవిచూడండి.’’
7.
అల్ ఆరాఫ్ 40 - 43 నమ్మండి! మా ఆయతులను తిరస్కరించినవారి కొరకూ వాటిపట్ల తలబిరుసుతనం ప్రదర్శించిన వారికొరకూ ఆకాశద్వారాలు ఎంతమాత్రం తెరువబడవు. సూది రంధ్రంగుండా ఒంటె పోవటం ఎంత అసంభవమో, వారు స్వర్గంలోకి పోవటం కూడా అంతే అసంభవం. అపరాధులకు మావద్ద ఇటువంటి ప్రతిఫలమే లభిస్తుంది. వారికి నరకమే పాన్పు, నరకమే దుప్పటి. మేము దుర్మార్గులకు ఇచ్చే ప్రతిఫలం ఇదే. దీనికి భిన్నంగా మా ఆయతులను విశ్వసించి మంచిపనులు చేసినవారు
- ఈ విషయంలో మేము ప్రతి వ్యక్తిపైనా అతని శక్తిసామర్థ్యాలకు అనుగుణంగానే బాధ్యతను మోపుతాము - వారు స్వర్గనివాసులు. అక్కడ వారు సదా ఉంటారు. వారి మనస్సులలో పరస్పరం ఏ కాస్త శత్రుభావం ఉన్నా దాన్ని మేము తొలగిస్తాము. వారి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారు ఇలా అంటారు: ‘‘మాకు ఈ మార్గం చూపిన అల్లాహ్ కే స్తోత్రాలు. ఆయనే గనక మాకు మార్గం చూపి ఉండకపోయినట్లయితే స్వయంగా మేము మార్గం పొంది ఉండేవారము కాదు. మా ప్రభువుచే పంపబడిన ప్రవక్తలు వాస్తవంగా సత్యాన్నే తీసుకువచ్చారు.’’ అప్పుడు వారికి ఈ వాణి వినబడుతుంది : ‘‘మీరు వారసులుగా చేయబడిన ఈ స్వర్గం మీరు చేస్తూ ఉండిన పనులకు ప్రతిఫలంగా మీకు లభించింది.’’
7.
అల్ ఆరాఫ్ 44 - 45 తరువాత స్వర్గవాసులు నరకవాసులను పిలిచి ఇలా అంటారు : ‘‘మా ప్రభువు మాకు చేసిన వాగ్దానాలను అన్నింటినీ మేము సత్యమైనవిగా కనుగొన్నాము. మరి మీరు కూడా మీ ప్రభువు చేసిన వాగ్దానాలను సత్యమైనవిగా కనుగొన్నారా?’’ వారు జవాబుగా, ‘‘అవును’’ అని పలుకుతారు. అప్పుడు ప్రకటించే వాడొకడు వారిమధ్య ఇలా ప్రకటిస్తాడు: ‘‘ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధించేవారూ, దానిని వక్రీకరించగోరేవారూ, పరలోకాన్ని తిరస్కరించేవారూ అయిన దుర్మార్గులపై అల్లాహ్ శాపం అవతరించుగాక.’’
7.
అల్ ఆరాఫ్ 46 - 49 ఈ ఉభయ వర్గాల మధ్య ఒక తెర అడ్డుగా నిలుస్తుంది. దానియొక్క ఎత్తైన ప్రదేశాల (ఆరాఫ్)పై మరికొందరు ప్రజలు ఉంటారు. వారు ప్రతి ఒకణ్ణీ అతని ముఖాకృతిని బట్టి గుర్తుపడతారు. స్వర్గవాసులను పిలిచి, ‘‘మీకు శాంతి కలుగుగాక’’ అని అంటారు. వారు స్వర్గంలోకి ప్రవేశించనేలేదు. కాని దానిని ఆశిస్తున్నారు. వారి దృష్టి నరకవాసుల వైపునకు మళ్ళినప్పుడు ఇలా అంటారు : ‘‘ప్రభూ! మమ్మల్నిమటుకు ఈ దుర్మార్గులలో చేర్చకు.’’ తరువాత ఎత్తైన ప్రదేశాలపై ఉన్న ఈ ప్రజలు నరకంలో ఉన్న
కొందరు పెద్ద మనుషులను వారి ఆనవాళ్ళ ద్వారా గుర్తుపట్టి ఇలా అంటారు : ‘‘చూశారా మీరూ, మీ అనుచరవర్గాలు గానీ, మీరు గొప్పగా భావించిన ఆస్తిపాస్తులుగానీ, ఈ రోజు మీకు ఏ విధంగానూ పనికిరాలేదు గదా! మీరు ‘వీరికి అల్లాహ్ తన కారుణ్యాన్ని ఏమాత్రం ప్రసాదించడు’ అని ప్రమాణాలు చేసి అంటూ ఉండినవారే కదా ఈ స్వర్గ నివాసులు. ఈ రోజు వారితోనే ‘స్వర్గంలో ప్రవేశించండి. మీకు భయంగాని ద్ణుఖంగాని లేదు’ అని అనటం జరిగింది.’’
7.
అల్ ఆరాఫ్ 50 - 51 నరకవాసులు స్వర్గవాసులతో ఇలా మొరపెట్టుకుంటారు : ‘‘కాస్త దయచేసి మాపైని కొద్దిగా నీళ్ళు పోయండి, లేదా అల్లాహ్ మీకు ప్రసాదించిన ఆహారంలో నుంచైనా కొంత ఇటు విసరండి.’’ వారు ఇలా సమాధానం చెబుతారు: ‘‘ఈ రెంటినీ అల్లాహ్ సత్యతిరస్కారులకు నిషేధిం చాడు. వారు తమ ధర్మాన్ని ఒక క్రీడగా, ఒక కాలక్షేపంగా చేసుకున్నారు. ఇంకా వారిని ఇహలోక జీవితం మోసానికి గురిచేసింది.’’ అల్లాహ్ ఇలా సెలవిస్తాడు: ‘‘వారు ఈనాటి సమావేశాన్ని మరచి ఉండినవిధంగానే మా ఆయతులను తిరస్కరిస్తూ ఉండిన విధంగానే మేమూ వారిని ఈనాడు మరచిపోతాము.’’
7.
అల్ ఆరాఫ్ 52 - 53 మేము ఈ ప్రజల వద్దకు ఒక గ్రంథాన్ని తీసుకువచ్చాము. దానిని మేము జ్ఞానం ఆధారంగా సవివరమైనదిగా చేశాము. అది విశ్వాసులకు మార్గదర్శకత్వం, కారుణ్యం. ఇక వీరు ఈ గ్రంథం తెలియజేసే ముగింపు కోసం కాక మరేదైనా విషయం కొరకు నిరీక్షిస్తున్నారా? ఆ ముగింపు వచ్చే రోజున దానిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చినవారే ఇలా అంటారు : ‘‘యథార్థంగానే మా ప్రభువు పంపిన ప్రవక్తలు సత్యం తీసుకుని వచ్చారు. అయితే, మా కొరకు సిఫారసు చెయ్యటానికి, సిఫారసు దారులెవరైనా మాకు లభిస్తారా? లేదా మేము మళ్ళీ తిరిగి పంపబడగలమా? పూర్వం మేము చేస్తూ ఉండిన దానికి బదులుగా,
ఇప్పుడు మరొక పద్ధతి ప్రకారం పనిచేసి చూపించటానికి?’’ - వారు తమను తాము నష్టంలో పడవేసుకున్నారు. వారు సృష్టించిన అసత్యాలు సమస్తమూ ఈ రోజు వారినుండి తప్పుకున్నాయి.
7.
అల్ ఆరాఫ్ 54 - 56 వాస్తవంగా మీ ప్రభువు అల్లాహ్ యే. ఆయన ఆకాశాలనూ, భూమినీ ఆరుదినాలలో సృష్టించాడు. తరువాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. ఆ తరువాత పగలు రాత్రివెంట పరుగుతీస్తూ ఉంటుంది. ఇంకా ఆయన సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను పుట్టించాడు. అన్నీ ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి, సృష్టి ఆయనదే. దానిపై ఆధిపత్యమూ ఆయనదే. అల్లాహ్ అనంతమైన శుభాలు కలవాడు. సకల లోకాలకు ప్రభువు, స్వామి, మీ ప్రభువును వేడుకోండి, విలపిస్తూనూ గోప్యంగానూ. నిశ్చయంగా ఆయన మితిమీరి మెలిగేవారిని ప్రేమించడు. ధరణి సంస్కరణ జరిగిన తరువాత, దానిపై సంక్షోభాన్ని సృష్టించకండి. దేవుడినే వేడు కోండి భయంతోనూ, ఆశతోనూ. నిశ్చయంగా అల్లాహ్ కారుణ్యం రుజువర్తనులకు దాపులోనే ఉంది.
7.
అల్ ఆరాఫ్ 57 - 58 తన కారుణ్యానికి ముందుగా శుభవార్తలను మోసుకుపోయే వాయువులను పంపేది అల్లాహ్ యే. తరువాత అవి నీటితో నిండిన మేఘాలను ఎత్తుకునిపోయేటప్పుడు వాటిని నిర్జీవంగా పడివున్న ఏ ప్రదేశం వైపునకైనా కదిలిస్తాడు. అక్కడ వర్షం కురిపించి (ఆ మృత భూమినుండే) రకరకాల పండ్లను వెలికి తీసుకొస్తాడు. చూడండి! ఈవిధంగా మేము మృతులను నిర్జీవస్థితినుండి ఉద్భవింపజేస్తాము, బహుశా మీరు దానిని చూసి అయినా గుణపాఠం నేర్చుకుంటారేమో అని. మంచి నేల తన ప్రభువు ఆదేశానుసారం పుష్కలంగా పంటనిస్తుంది. చెడ్డ నేలలో నాసిరకం పంట తప్ప మరేమీ పండదు. కృతజ్ఞతలు తెలిపేవారి కొరకుగాను మేము ఈ విధంగా సూచనలను మాటి మాటికీ వివరిస్తూ ఉంటాము.
7.
అల్ ఆరాఫ్ 59 - 64 మేము నూప్ాను అతని జాతివద్దకు పంపాము. అతను ఇలా అన్నాడు : ‘‘నా జాతి సోదరులారా! అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. మీ విషయంలో ఒక భయంకర దినంనాటి శిక్షను గురించి నేను ఆందోళన పడుతున్నాను.’’ ఆయన జాతి సర్దారులు ఇలా పలికారు : ‘‘నీవు స్పష్టమైన అపమార్గానికి గురిఅయినట్లు మాకు కనిపిస్తున్నది.’’ నూప్ా ఇలా అన్నాడు : ‘‘నా జాతి సోదరులారా! నేను ఏ అపమార్గంలోనూ పడలేదు. యథార్థానికి నేను సకల లోక ప్రభువునకు ప్రవక్తను. నా ప్రభువు సందేశాలను మీకు అందజేస్తాను. మీ శ్రేయోభిలాషిని. మీకు తెలియని విషయాలు నాకు అల్లాహ్ తరఫు నుండి తెలుసు. మీకు ఆశ్చర్యం కలిగిందా, మీ వద్దకు స్వయంగా మీ జాతికి చెందిన ఒక మనిషి ద్వారా మీ ప్రభువు జ్ఞాపిక వచ్చిందని - మిమ్మల్ని హెచ్చరించటానికి, మీరు చెడునడతకు దూరంగా ఉండడానికి, మీపై దయచూపటానికి?’’ కాని వారు ఆయనను తిరస్కరించారు. చివరకు మేము ఆయననూ, ఆయన సహచరులనూ ఒక పడవద్వారా విముక్తి కలిగించాము. మా ఆయతులు అసత్యాలని తిరస్కరించిన వారందరినీ మేము ముంచివేశాము. నిశ్చయంగా వారు అంధజనులు.
7.
అల్ ఆరాఫ్ 65 - 72 ఇంకా
ఆద్ జాతివద్దకు మేము వారి సోదరుడు హూద్ను పంపాము. అతను ఇలా అన్నాడు: ‘‘నా జాతి సోదరులారా! అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. అలాంటప్పుడు మీరు తప్పుడు నడతను వదులుకోరా?’’ అతని మాటలను నమ్మటానికి తిరస్కరించిన అతని జాతి సర్దారులు ఇలా సమాధానం చెప్పారు : ‘‘నీవు తెలివి తక్కువతనానికి గురిఅయినట్లు మేము భావిస్తున్నాము. నీవు అసత్యవాదివని మా అనుమానం.’’ అతను ఇలా అన్నాడు : ‘‘నా జాతి సోదరులారా! నేను తెలివితక్కువతనానికేమీ గురికాలేదు. నేను సకల లోకాల ప్రభువునకు ప్రవక్తను. మీకు నా ప్రభువు సందేశాలను అందజేస్తాను. నేను మీయొక్క నమ్మదగిన శ్రేయోభిలాషిని. మీకు ఆశ్చర్యం కలిగిందా, మీ వద్దకు మిమ్మల్ని హెచ్చరించటానికి స్వయంగా మీ జాతికి చెందిన ఒక మనిషిద్వారా మీ ప్రభువు జ్ఞాపిక వచ్చిందని? మరచిపోకండి! మీ ప్రభువు నూప్ా జాతికి తరువాత మిమ్మల్ని వారసులుగా చేశాడు. మీకు బలాధిక్యతను ప్రసాదించాడు. కనుక అల్లాహ్ శక్తి మహిమలను జ్ఞాపకం ఉంచుకోండి. మీరు సాఫల్యం పొందగలరని ఆశించవచ్చు.’’ వారు ఇలా జవాబు ఇచ్చారు : ‘‘నీవు మావద్దకు రావటానికి కారణం, మేము ఒక్క అల్లాహ్నే ఆరాధించాలనా, మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని విసర్జించాలనా? సరే, నీవు నిజం చెప్పేవాడివే అయితే నీవు మమ్మల్ని బెదరిస్తూ ఉన్న ఆ శిక్షను తీసుకురా.’’ అతను ఇలా అన్నాడు : ‘‘మీపై మీ ప్రభువు శాపం, ఆయన ఆగ్రహం ఇదివరకే విరుచుకుపడ్డాయి. అల్లాహ్ ఏ ప్రమాణాన్నీ పంపనీ, మీరూ మీ తాత ముత్తాతలూ పెట్టుకున్న పేర్ల విషయంలో మీరు నాతో ఘర్షణపడుతున్నారా? సరే, అయితే మీరూ నిరీక్షించండి, మీతోపాటు నేనూ నిరీక్షిస్తాను.’’ చివరకు మేము మా కృపతో హూద్నూ, అతని అనుయాయులనూ రక్షించుకున్నాము. మా ఆయతులు అసత్యాలని తిరస్కరించిన వారినీ విశ్వసించనివారినీ మేము సమూలంగా నాశనం చేశాము.
7.
అల్ ఆరాఫ్ 73 - 74 సమూదు జాతివద్దకు మేము వారి సోదరుడు సాలిప్ాను పంపాము. అతను ఇలా అన్నాడు: ‘‘నా జాతి సోదరులారా! అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. మీవద్దకు మీ ప్రభువు యొక్క స్పష్టమైన ప్రమాణం వచ్చింది. అల్లాహ్ యొక్క ఈ ఆడ ఒంటె, మీ కొరకు ఒక సూచన వంటిది. కనుక దానిని విడిచిపెట్టండి, అల్లాహ్ భూమిపై అది స్వేచ్ఛగా మేస్తూ తిరగటానికి. దురుద్దేశ్యంతో దాన్ని ముట్టుకోకండి. అలాచేస్తే మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష ఒకటి పట్టుకుంటుంది. జ్ఞాపకం తెచ్చుకోండి ఆ సమయాన్ని. అప్పుడు అల్లాహ్ ఆద్ జాతి తరువాత మిమ్మల్ని దానికి వారసులుగా చేశాడు. మీకు భూమిపై ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించగా, మీరు ఈ రోజు దాని చదునైన మైదానాలలో మహోన్నతమైన భవనాలను నిర్మిస్తున్నారు. దాని కొండలను గృహాలుగా చెక్కుతున్నారు. కనుక ఆయన సృష్టి మహిమలను నిర్లక్ష్యం చెయ్యకండి. ధరణిపై సంక్షోభాన్ని సృష్టించకండి.
7.
అల్ ఆరాఫ్ 75 - 76 పెద్ద మనుషులుగా చెలామణిఅయ్యే అతని జాతి సర్దారులు బలహీన వర్గాలలోని విశ్వసించిన ప్రజలను ఇలా అడిగారు : ‘‘సాలిప్ా తన ప్రభువు పంపిన ప్రవక్త అని మీకు నిజంగానే తెలుసా?’’ వారు ఇలా సమాధానం ఇచ్చారు: ‘‘నిస్సందేహంగా అతనితో పంపబడిన సందేశాన్ని మేము విశ్వసిస్తు న్నాము.’’ తమ పెద్దరికాన్ని చాటుకునేవారు ఇలా అన్నారు : ‘‘మీరు విశ్వసించిన దాన్ని మేము తిరస్క రిస్తున్నాము.’’
7.
అల్ ఆరాఫ్ 77 - 79 తరువాత వారు ఆ ఆడ ఒంటెను చంపివేశారు. పచ్చి పొగరుబోతుతనంతో తమ ప్రభువు ఆజ్ఞను ఉల్లంఘించారు. సాలిప్ాతో ఇలా అన్నారు : ‘‘నిజంగానే నీవు ప్రవక్తలలోనివాడవే అయితే నీవు మమ్మల్ని బెదిరిస్తూ వచ్చిన ఆ శిక్షను తీసుకురా.’’ చివరకు ఊపివేసే ఒక భయంకరమైన ఆపద వారిని చుట్టుముట్టింది. వారు తమ ఇళ్ళల్లోనే బోర్లాపడి, పడినట్లే ఉండిపోయారు. సాలిప్ా ఈ విధంగా అంటూ వారి నగరాల నుండి నిష్క్రమించాడు : ‘‘నా జాతి ప్రజలారా! నేను నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేశాను. నేను మీ శ్రేయస్సునే సదా అభిలషించాను. కాని నేనేం చేసేది, మీకు మీ శ్రేయోభిలాషులంటేనే ఇష్టం లేదు.’’
7.
అల్ ఆరాఫ్ 80 - 84 లూత్ను మేము ప్రవక్తగా చేసి పంపాము. జ్ఞాపకం తెచ్చుకో అతను తన జాతితో ఇలా అన్నాడు : ‘‘మీరు ఇంత సిగ్గులేనివారై పోయారేమిటి, మీకు పూర్వం ప్రపంచంలో ఎవ్వడూ చెయ్యని బూతుపని చేస్తున్నారు? మీరు స్త్రీలను వదలి పురుషులతో మీ కామాన్ని తీర్చుకుంటున్నారు? వాస్తవానికి మీరు పూర్తిగా హద్దుమీరి ప్రవర్తించేవారు.’’ కాని అతని జాతి ఇచ్చిన జవాబు ఇదే: ‘‘గెంటెయ్యండి వీళ్ళను మీ బస్తీల నుండి, మహాపవిత్రులట వీళ్ళు.’’ చివరకు మేము లూత్నూ అతని ఇంటి వాళ్ళనూ - వెనుక ఉండిపోయే వారిలో కలసిపోయిన అతని భార్యను తప్ప - రక్షించాము. ఇంకా ఆ జాతిపై కురిపించాము మేము ఒక వర్షాన్ని. చూడండి, ఆ అపరాధుల ముగింపు ఎలా జరిగిందో.
7.
అల్ ఆరాఫ్ 85 - 87 మేము మద్యన్ జాతి వారివద్దకు వారి సోదరుడు షుఐబ్ను పంపాము. అతను ఇలా అన్నాడు : ‘‘నా జాతి సోదరులారా! అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరొక దేవుడు లేడు. మీ వద్దకు మీ ప్రభువు యొక్క స్పష్టమైన మార్గదర్శకత్వం వచ్చింది. కనుక తూకాన్ని, కొలతను పూర్తిగా పాటించండి. ప్రజలకు వారి వస్తువుల విషయంలో నష్టం కలిగించకండి. భూమి సంస్కరింపబడిన తరువాత, దానిలో సంక్షోభాన్ని సృష్టించకండి. ఇందులోనే మీ శ్రేయస్సు ఉంది, మీరు (నిజంగానే) విశ్వాసులైతే. ప్రజలను భయపెట్టటానికీ, విశ్వసించేవారిని అల్లాహ్ మార్గం నుండి నిరోధించటానికీ, రుజుమార్గ వక్రీకరణకూ పాల్పడి (జీవితపు) ప్రతిమార్గంలో బందిపోటు దొంగలు మాదిరిగా పొంచి కూర్చోకండి.
జ్ఞాపకం తెచ్చుకోండి ఆ కాలాన్ని, అప్పుడు మీరు అల్పసంఖ్యలో ఉండేవారు. తరువాత
అల్లాహ్ మీ సంఖ్యను అధికం చేశాడు. కళ్ళు తెరచి చూడండి. సంక్షోభం సృష్టించిన వారి పర్యవసానం
ప్రపంచంలో ఏమయిందో! ఏ ఉపదేశాన్ని ఇచ్చి నన్ను పంపటం జరిగిందో దానిని మీలోని ఒక వర్గం విశ్వసించి, మరొక వర్గం విశ్వసించకపోతే అల్లాహ్ మన మధ్య తీర్పు చెప్పేవరకు సహనంతో నిరీక్షించండి. (ఆయనే) అందరికంటే ఉత్తమంగా తీర్పు చెప్పేవాడు.
7.
అల్ ఆరాఫ్ 88 - 89 దురహంకారులైన అతని జాతి సర్దారులు అతనితో ఇలా అన్నారు : ‘‘షుఐబ్, మేము నిన్నూ, నీతోపాటు విశ్వసించిన వారినీ మా నగరం నుండి బహిష్కరిస్తాము, లేదా మీరు మా సంఘంలో తిరిగి చేరవలసి ఉంటుంది.’’ షుఐబ్ ఇలా సమాధానం పలికాడు : ‘‘ఏమిటీ, మాకు ఇష్టం లేకపోయినా మమ్మల్ని బలవంతంగా మళ్ళిస్తారా? అల్లాహ్ మాకు మీ సంఘం నుండి విముక్తి కలిగించిన తరువాత ఒకవేళ మళ్ళీ మేము దానిలో చేరితే మేము అల్లాహ్ కు అబద్ధం ఆరోపించినవాళ్ళం అవుతాము. దానివైపునకు మళ్ళటం అనేది మాత్రం మాకు ఏ విధంగానూ సాధ్యం కాదు, మా ప్రభువైన అల్లాహ్ సంకల్పిస్తే తప్ప. మా ప్రభువు జ్ఞానం ప్రతి వస్తువునూ ఆవరించి ఉంది. ఆయననే మేము నమ్ముకున్నాము. ప్రభూ! మాకూ మా జాతికీ మధ్య సరియైన తీర్పు చెయ్యి. నీవు ఉత్తమ న్యాయనిర్ణేతవు.’’
7.
అల్ ఆరాఫ్ 90 - 93 అతని మాటలను తిరస్కరించిన అతని జాతి సర్దారులు పరస్పరం ఇలా అనుకున్నారు : ‘‘ఒకవేళ మీరు షుఐబ్ను అనుసరించటానికి అంగీకరిస్తే నాశనం అవుతారు. కాని జరిగిందేమిటంటే, ఊపివేసే ఒక పెద్ద ఆపద వారిని పట్టుకుంది. వారు తమ గృహాలలో బోర్లాపడి, పడినట్లే ఉండి పోయారు. షుఐబ్ను తిరస్కరించిన వారు ఆ గృహాలలో ఎన్నడూ నివసించని విధంగా తుడుచుకు పోయారు. షుఐబ్ను తిరస్కరించినవారే చివరకు సర్వనాశనమయ్యారు. షుఐబ్ ఇలా అంటూ వారి నగరాల నుండి నిష్క్రమించాడు : ‘‘నా జాతి సోదరులారా! నేను నా ప్రభువు సందేశాలను మీకు అందజేశాను. మీ శ్రేయోభిలాషిగా నేను నా బాధ్యతను పూర్తిగా నెరవేర్చాను. సత్యాన్ని స్వీకరించటానికి తిరస్కరించే జాతి కొరకు నేను ఇప్పుడు ఎలా బాధపడను?’’
7.
అల్ ఆరాఫ్ 94 - 99 మేము ఏ నగరానికి ప్రవక్తను పంపినా ఆ నగర ప్రజలను మొదట లేమికీ, కష్టానికీ గురిచెయ్యకుండా ఉండటం జరగలేదు, వారు వినమ్రులు కావాలనే ఉద్దేశ్యంతో. తరువాత మేము వారి దుస్థితిని సుస్థితిగా మార్చాము. చివరకు వారు బాగా అభివృద్ధిచెంది ఇలా అన్నారు : ‘‘మంచిరోజులు చెడ్డరోజులు అనేవి మా పూర్వీకులకు కూడా కలుగుతూ వచ్చాయి.’’ తుదకు మేము వారిని అకస్మాత్తుగా పట్టుకున్నాము. వారికి దానిని
గురించి ఏమాత్రం తెలియదు. నగరాల ప్రజలు విశ్వసించి, భయభక్తుల వైఖరిని అవలంబించి ఉన్నట్లయితే మేము వారికొరకు ఆకాశంలోని, భూమిలోని శుభాల ద్వారాలను తెరచి ఉండేవారము. కాని వారు ధిక్కరించారు. కనుక మేము వారిని వారు పోగుచేస్తూ ఉన్న చెడుసంపాదన కారణంగా పట్టుకున్నాము. ఏమిటీ? అయితే ఇక మా
శిక్ష రాత్రి సమయంలో వారు గాఢనిద్రలో ఉన్నప్పుడు వారిపై అకస్మాత్తుగా వచ్చి పడదని నగరాల ప్రజలు నిర్భయంగా ఉన్నారా? లేక శక్తిమంతమైన మా హస్తం, పగటివేళ వారు ఆడుకుంటున్నప్పుడు వారిపై హఠాత్తుగా ఎన్నడూ పడదనే తృప్తితో ఉన్నారా వారు? ఏమిటీ, ఈ ప్రజలు అల్లాహ్ ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉన్నారా? వాస్తవానికి నాశనం కాబోయే జాతి మాత్రమే అల్లాహ్ ఎత్తుగడ అంటే నిర్భయంగా ఉంటుంది.
7.
అల్ ఆరాఫ్ 100 - 102 ఏమిటీ, పూర్వపు భూలోకవాసుల తరువాత భూమికి వారసులయ్యే ప్రజలకు ఈ యథార్థ విషయం ఏ గుణపాఠాన్నీ నేర్పలేదా, మేము కోరితే వారి నేరాలకు వారిని పట్టుకోగలమని? (కాని వారు గుణపాఠం నేర్పే యథార్థాలను లక్ష్యపెట్టరు). మేము వారి హృదయాలకు ముద్ర వేశాము. కనుక వారు ఏదీ వినరు. ఈ జాతుల ప్రజలు, ఎవరి గాథలను మేము మీకు వినిపిస్తున్నామో (మీ ముందు ఒక దృష్టాంతంగా ఉన్నారు). వారివద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చారు. కాని వారు ఒకసారి తిరస్కరించినదానిని మళ్ళీ అంగీకరించేవారు కాదు. చూడండి! ఈ విధంగా మేము సత్య తిరస్కారుల హృదయాలకు ముద్ర వేస్తాము. మేము వారిలో చాలామందిని తమ వాగ్దానంపట్ల గౌరవం కలవారుగా చూడలేదు. చాలామందిని దుర్మార్గులుగానే చూశాము.
7.
అల్ ఆరాఫ్ 103 (పైన పేర్కొనబడిన) ఈ జాతుల తరువాత మేము మూసాను మా సూచనలతో ఫిరౌను వద్దకూ అతని జాతి సర్దారుల వద్దకూ పంపాము. కాని వారు కూడా మా సూచనలపట్ల అన్యాయంగా ప్రవర్తించారు. కనుక చూడండి, ఆ దుర్మార్గుల గతి ఏమయిందో!
7.
అల్ ఆరాఫ్ 104 - 117 మూసా ఇలా అన్నాడు : ‘‘ఫిరౌన్! నేను విశ్వప్రభువు తన తరఫున పంపగా వచ్చినవాడను. నా పని ఏమిటంటే, అల్లాహ్ పేరుతో సత్యం తప్ప మరే మాటా పలకకుండా ఉండటం. నేను మీ వద్దకు మీ ప్రభువు తరఫు నుండి నా నియామకాన్ని గురించిన స్పష్టమైన నిదర్శనం తీసుకొని వచ్చాను. కనుక నీవు ఇస్రాయీలు సంతానాన్ని నాతో పంపు.’’ ఫిరౌను ఇలా అన్నాడు : ‘‘ఒకవేళ నీవు ఏదైనా నిదర్శనాన్ని తెస్తే, నీ ప్రకటనలో సత్యవంతుడవే అయితే, దానిని తీసుకురా.’’ మూసా తన చేతికర్రను విసిరాడు. అకస్మాత్తుగా అది ఒక సజీవ సర్పంగా మారిపోయింది. అతను తన జేబునుండి చెయ్యిని పైకి తీశాడు. ప్రేక్షకులందరి ముందూ అది మెరయసాగింది. అప్పుడు ఫిరౌను జాతి సర్దారులు పరస్పరం ఇలా అనుకున్నారు : ‘‘నిశ్చయంగా ఈ వ్యక్తి మహా నైపుణ్యంగల మాంత్రికుడే. మిమ్మల్ని మీ భూమి నుండి వెళ్ళగొట్టగోరుతున్నాడు. ఇప్పుడేమంటారో చెప్పండి?’’ వీళ్ళంతా ఫిరౌనుకు ఇలా సలహా ఇచ్చారు : ‘‘అతన్నీ, అతని సోదరుణ్ణీ ఆపి ఉంచండి. అన్ని పట్టణాలకూ వేగులవాళ్ళను పంపండి, నిపుణుడైన ప్రతి మాంత్రికుణ్ణి మీ వద్దకు తీసుకురావటానికి.’’ ఆ విధంగా మాంత్రికులు ఫిరౌను వద్దకు వచ్చారు. వారు ఇలా అన్నారు : ‘‘ఒకవేళ మేము గెలిస్తే మాకు దీని ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది కదా!’’ ఫిరౌను ఇలా సమాధానం చెప్పాడు : ‘‘అవును, మీరు మా సాన్నిధ్యానికి చేరువవుతారు.’’ తరువాత వారు మూసాతో ఇలా అన్నారు : ‘‘నీవు విసురుతావా లేక మేము విసరాలా?’’ మూసా జవాబు పలికాడు: ‘‘మీరే విసరండి’’ అని. వారు తమ పాచికలను విసరి చూపులను మంత్రముగ్ధం, హృదయాలను భీతావహం చేశారు, అద్భుతమైన మాయాజాలాన్ని కల్పించారు. మేము మూసాకు, ‘‘నీ చేతి కర్రను విసరివెయ్యి’’ అని సంజ్ఞ చేశాము. అతను విసరగానే తృటిలో అది వారి బూటకపు మాయాజాలాన్ని మ్రింగేసింది.
7.
అల్ ఆరాఫ్ 118 - 122 ఈ విధంగా ఏది సత్యమో అది సత్యంగా నిరూపితమయింది. వారు దేనిని కల్పించారో అది అసత్యంగా మిగిలిపోయింది. ఫిరౌను, అతని సహచరులు పోటీరంగంలో పరాజితులయ్యారు. (విజయానికి బదులుగా) అంతా తారుమారై, అవమానం పాలయ్యారు. ఇక మాంత్రికుల పరిస్థితి, అంతరంగంలోని ఏదో విషయం వారిని సాష్టాంగపడేలా చేసింది. వారు ఇలా అన్నారు : ‘‘మేము విశ్వసించాము సకల లోకాల ప్రభువును, మూసా, హారూనులు విశ్వసిస్తున్న ప్రభువును.’’
7.
అల్ ఆరాఫ్ 123 - 124 ఫిరౌను ఇలా అన్నాడు : ‘‘నేను మీకు అనుమతినివ్వక ముందే మీరు అతన్ని విశ్వసించారా? నిశ్చయంగా ఈ రాజధాని నగరంలో దాని పాలకులను అధికారం నుండి తొలగించటానికి మీరంతా కలసి రహస్యంగా పన్నిన కుట్ర ఇది. సరే, అయితే దాని ఫలితం మీకు ఇప్పుడే తెలుస్తుంది. నేను మీ చేతులనూ మీ కాళ్ళనూ వ్యతిరేకదిశలో నరికిస్తాను. ఇంకా దాని తరువాత మీ అందరినీ సిలువనెక్కిస్తాను.’’
7.
అల్ ఆరాఫ్ 125 - 126 వారు ఇలా జవాబు పలికారు : ‘‘ఎట్టి పరిస్థితిలోనూ మేము మరలవలసింది మా ప్రభువు వైపునకే. నీవు ఏ విషయంలో మాపై పగతీర్చుకోదలచావో, అది మా ప్రభువు సూచనలు మా ముందుకు వచ్చినప్పుడు మేము వాటిని విశ్వసించామనేది తప్ప మరొకటి కాదు. ప్రభూ, మాకు ఓరిమిని అమితంగా అనుగ్రహించు. మమ్మల్ని ప్రపంచం నుండి లేపినప్పుడు మేము నీకు విధేయులుగా ఉన్న స్థితిలోనే లేపు.’’
7.
అల్ ఆరాఫ్ 127 ఫిరౌనుతో అతని జాతి సర్దారులు ఇలా అన్నారు : ‘‘మూసానూ అతని జాతివారినీ రాజ్యంలో కల్లోలం
వ్యాపింపచేయటానికీ,
వారు నీ దాస్యాన్నీ నీ దేవుళ్ళ దాస్యాన్నీ కాదనటానికి, నీవు వారిని స్వేచ్ఛగా వదలిపెడతావా?’’ ఫిరౌను ఇలా జవాబు ఇచ్చాడు : ‘‘నేను వారి కొడుకులను చంపిస్తాను. వారి స్త్రీలను బ్రతకనిస్తాను. వారిపై మా అధికారపు పట్టు పటిష్ఠంగా ఉంది.’’
7.
అల్ ఆరాఫ్ 128 - 129 మూసా తన జాతివారితో ఇలా అన్నాడు : ‘‘అల్లాహ్ ను సహాయం కొరకు అర్థించండి, ఓర్పు వహించండి. భూమి అల్లాహ్ది, తన దాసులలో తాను కోరిన వారిని దానికి వారసులుగా చేస్తాడు. అంతిమ సాఫల్యం అల్లాహ్ కు భయపడుతూ పనిచేసేవారి కొరకే.’’ అతని జాతివారు ఇలా అన్నారు : ‘‘నీవు రాకపూర్వం కూడా మేము బాధింపబడేవారము. ఇప్పుడు నీవు వచ్చిన తరువాత కూడా బాధింపబడుతున్నాము.’’ అతను ఇలా జవాబు పలికాడు : ‘‘మీ ప్రభువు మీ శత్రువులను నాశనం చేసి మిమ్మల్ని ధరణిలో ఖలీఫాలుగా చేసే సమయం సమీపంలోనే ఉంది. అప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆయన చూస్తాడు.’’
7.
అల్ ఆరాఫ్ 130 - 137 మేము ఫిరౌను ప్రజలను ఎన్నో సంవత్సరాల వరకు కరువుకూ, పంటల కొరతకూ గురిచేశాము, బహుశా వారికి తెలివి వస్తుందేమో అని. కాని వారి పరిస్థితి ఎలా ఉండేదంటే, మంచికాలం వచ్చినప్పుడు వారు, ‘‘మేము దీనికే అర్హులం’’ అని అనేవారు. గడ్డుకాలం వచ్చినప్పుడు వారు మూసానూ, అతని సహచరులనూ తమకు అపశకునంగా పేర్కొనేవారు. అసలు వాస్తవానికి వారి అపశకునం అల్లాహ్ చేతులలో ఉంది. కాని వారిలో చాలామంది జ్ఞానహీనులు. వారు మూసాతో ఇలా అన్నారు : ‘‘నీవు మంత్రజాలంగా మాపై ప్రయోగించటానికి ఏ మంత్రసూచనను తెచ్చినా మేము నీ మాటను నమ్మేవాళ్ళము కాము.’’ చివరకు మేము వారిపైకి తుఫానును పంపాము. మిడతల దండులను వదిలాము. పేలు వ్యాపింపజేశాము. కప్పలను పుట్టించాము. రక్తము కురిపించాము. ఈ సూచనలనన్నింటినీ వేర్వేరుగా చూపించాము. కాని వారు తలబిరుసుతనం ప్రదర్శిస్తూనే పోయారు. వారు మహాపరాధం చేసిన ప్రజలు. వారిపై ఆపద అవతరించినప్పుడల్లా ఇలా అనేవారు : ‘‘మూసా! నీకు నీ ప్రభువు తరఫు నుండి లభించిన పదవి ఆధారంగా మా కొరకు ప్రార్థించు. ఈసారి నీవు మానుండి ఈ ఆపదను తొలగింపజేస్తే మేము నీ మాటలను విశ్వసిస్తాము. ఇస్రాయీలు సంతానాన్ని నీవెంట పంపుతాము.’’ కాని మేము మా శిక్షను వారినుండి ఒక నిర్ణీతమైన కాలం వరకు - ఆ కాలానికి వారు ఎలాగైనా చేరుకోవలసినవారే - తొలగించినప్పుడల్లా వారు తమ వాగ్దానం నుండి ఒక్కసారిగా మరలిపోయేవారు. అప్పుడు మేము వారికి ప్రతీకారం చేశాము. వారిని సముద్రంలో ముంచివేశాము. ఎందుకంటే, వారు మా సూచనలు అసత్యాలని తిరస్కరించారు. వాటిని లెక్క చేయలేదు.
ఇంకా వారి స్థానంలో, బలహీనులుగా చెయ్యబడిన వారందరినీ మేము ఆ భూభాగపు తూర్పు పడమరలకు వారసులుగా చేశాము. ఆ భూభాగాన్ని మేము శుభాలతో నింపాము. ఈ విధంగా నీ ప్రభువు ఇస్రాయీలు సంతతికి మేలు చేస్తాను అన్న వాగ్దానం నెరవేరింది. ఎందుకంటే వారు ఓర్పుతో వ్యవహరించారు. ఇంకా ఫిరౌనూ, అతని జాతివారూ చేసిన నిర్మాణాలూ, లేపిన భవనాలూ సమస్తమూ మేము నేలమట్టం చేశాము.
7.
అల్ ఆరాఫ్ 138 - 141 మేము ఇస్రాయీలు సంతతిని సముద్రం దాటించాము. తరువాత వారు పోసాగారు, మార్గమధ్యంలో ఒక జాతి ప్రజల వద్దకు పోవడం జరిగింది. ఆ జాతివారు తాము ఆరాధించే కొన్ని విగ్రహాల పట్ల ప్రేమకు పూర్తిగా అంకితమైనవారు. (ఇస్రాయీల్ సంతతి) వారు ఇలా అన్నారు : ‘‘మూసా! వాళ్ళ దేవుళ్ళవంటి ఒక దేవుణ్ణి మాకు కూడా చేసిపెట్టు.’’ మూసా ఇలా అన్నాడు : ‘‘మీరు చాలా అజ్ఞానపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు అవలంబిస్తున్న విధానం నాశనం అయ్యేదే. ఇంకా వారు చేస్తూ ఉన్న పని పూర్తిగా అసత్యమైనది.’’ మళ్ళీ మూసా ఇలా అన్నాడు : ‘‘నేను అల్లాహ్ ను కాదని మరొక దైవాన్ని మీకొరకు అన్వేషించాలా? వాస్తవానికి ప్రపంచంలోని సమస్త జాతుల కంటే మీకు ఔన్నత్యాన్ని ప్రసాదించింది అల్లాహ్ యే.’’ (అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు) : మేము మీకు ఫిరౌన్ ప్రజల బారినుండి విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు మిమ్మల్ని ఘోర యాతనకు గురిచేసేవారు. మీ కుమారులను చంపేవారు, మీ స్త్రీలను మాత్రం బ్రతకనిచ్చేవారు. ఇందులో మీ ప్రభువు తరఫునుండి మీకు ఒక పెద్ద పరీక్ష ఉండినది.
7.
అల్ ఆరాఫ్ 142 - 144 మేము మూసాను (సినాయ్ కొండపైకి) ముప్ఫై రేయింబవళ్ళ కోసం పిలిపించాము. తరువాత ఇంకా పదిరోజులు పొడిగించాము. ఈవిధంగా అతని ప్రభువు నిర్ణయించిన గడువు మొత్తం నలభైరోజులు అయింది. మూసా పోతూపోతూ తన సోదరుడు హారూనుతో ఇలా అన్నాడు : ‘‘నా తరువాత నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిధ్యం వహించు. సక్రమంగా వ్యవహరిస్తూ ఉండు. విచ్ఛిన్నకారుల మార్గంలో నడవకు.’’ మేము నిర్ణయించిన సమయానికి సరిగ్గా అతను చేరినప్పుడు, అతని ప్రభువు అతనితో సంభాషించాడు. అప్పుడు అతను ఇలా మనవి చేశాడు : ‘‘ప్రభూ! నా చూపునకు బలాన్ని ప్రసాదించు. నిన్ను చూస్తాను.’’ ఇలా సెలవిచ్చాడు : ‘‘నీవు నన్ను చూడలేవు. కొంచెం, ముందున్న ఆ కొండవైపు చూడు. అది తన స్థానంలో స్థిరంగా ఉంటే అప్పుడు నీవు నన్ను చూడగలవు.’’ ఆ ప్రకారం అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేసి దానిని భస్మం చేసేశాడు. మూసా స్పృహతప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తరువాత ఇలా అన్నాడు: ‘‘నీవు పరిశుద్ధు డవు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాను. అందరికంటే మొదట నేనే విశ్వసిస్తున్నాను.’’ ఇలా సెలవిచ్చాడు : ‘‘మూసా, నా సందేశాన్ని అందజెయ్యటానికి, నాతో సంభాషించటానికి, ప్రజలందరికంటే నీకు ప్రాధాన్యం ఇచ్చి నేను నిన్ను ఎన్నుకున్నాను. కనుక నేనిచ్చే దానిని తీసుకో. కృతజ్ఞతలు తెలుపు.’’
7.
అల్ ఆరాఫ్ 145 - 147 తరువాత మేము జీవితానికి సంబంధించిన ప్రతి రంగానికి కావలసిన హితబోధనూ, ప్రతి
వ్యవహారానికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకత్వాన్నీ శిలాఫలకాలపై వ్రాసి మూసాకు ఇచ్చాము. అతనితో ఇలా అన్నాము : ‘‘ఈ ఉపదేశాలను నీ చేతులతో గట్టిగా పట్టుకో. వాటి ఉత్తమ భావాలను అనుసరించండి అని నీ జాతివారిని ఆజ్ఞాపించు. త్వరలోనే నేను నీకు దుర్మార్గుల గృహాలను చూపిస్తాను. ఏ హక్కూ
లేకుండా భూమిపై పెద్దలుగా చలామణీ అయ్యే వారి దృష్టిని నేను నా సూచనల నుండి మరలిస్తాను.
వారు ఏ సూచనను చూచినా దానిని ఎన్నటికీ విశ్వసించరు. ఒకవేళ సరియైన మార్గం వారి ముందుకు వచ్చినా దానిని వారు అవలంబించరు. ఒకవేళ వక్రమార్గం కనిపిస్తే, వెంటనే ఆ మార్గం మీదకు దుముకుతారు. ఎందుకంటే, వారు మా సూచనలను తిరస్కరిం చారు. వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. మా సూచనలను తిరస్కరించి పరలోకంలో హాజరు కావటాన్ని త్రోసిపుచ్చేవాడి కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. ప్రజలు మరేదైనా ప్రతిఫలాన్ని పొందగలరా, వారు ఎంతచేస్తే అంత తప్ప?’’
7.
అల్ ఆరాఫ్ 148 - 153 మూసా (వెళ్ళిన) తరువాత, అతని జాతి ప్రజలు తమ ఆభరణాలతో ఒక ఆవుదూడ విగ్రహాన్ని తయారుచేశారు. అందులో నుండి ఆవు అరుపువంటి ధ్వని వచ్చేది. అది వారితో మాట్లాడలేదనీ, మరే వ్యవహారంలోనూ వారికి మార్గం చూపలేదనీ వారికి కనిపించేది కాదా? అయినప్పటికీ వారు దానిని ఆరాధ్యదైవంగా చేసుకున్నారు. వారు పరమ దుర్మార్గులు. వారి నుండి ఆత్మ వంచనపు తెరలు తొలగిపోయినప్పుడు, వారు తాము వాస్తవానికి మార్గం తప్పామని కనుగొన్నారు. అప్పుడు ఇలా అన్నారు : ‘‘మా ప్రభువు గనక మాపై దయ చూపకపోతే, మమ్మల్ని మన్నించకపోతే, మేము సర్వనాశనం అయిపోతాము.’’ అటునుండి మూసా ఆగ్రహంతో, విచారంతో తన జాతి ప్రజల వద్దకు మరలివచ్చాడు. వచ్చిన వెంటనే ఇలా అన్నాడు : ‘‘నేను లేనప్పుడు నా స్థానంలో మీరు చాలా చెడ్డగా ప్రవర్తించారు. మీ ప్రభువు ఆజ్ఞ కొరకు నిరీక్షించే ఓపిక కూడా మీలో లేకుండా పోయిందా?’’ అతను శిలాఫలకాలను విసిరివేశాడు. తన సోదరుడు (హారూను) తలవెండ్రుకలను పట్టుకొని అతన్ని లాగాడు. హారూను ఇలా అన్నాడు: ‘‘నా తల్లి కుమారుడా! ఈ ప్రజలు నన్ను లోబరచుకున్నారు. ఇంకా కాస్తయితే నన్ను చంపేసేవారే. కనుక నీవు శత్రువులకు, నన్ను చూసి నవ్వే అవకాశం ఇవ్వకు. ఈ దుర్మార్గపు ముఠాతో నన్ను కలపకు.’’ అప్పుడు మూసా ఇలా అన్నాడు : ‘‘ప్రభూ! నన్నూ నా సోదరుణ్ణీ క్షమించు. మమ్మల్ని నీ కారుణ్యంలోకి ప్రవేశింపజెయ్యి. నీవు అందరికంటే అధికంగా కారుణ్యం చూపేవాడవు.’’ (సమాధానంగా ఇలా సెలవియ్యబడిరది) : ‘‘ఆవుదూడను ఆరాధ్యదైవంగా చేసుకున్న వారు
తప్పకుండా తమ ప్రభువు ఆగ్రహంలో చిక్కుకుని తీరుతారు. ఇహలోక జీవితంలో అవమానం పాలవుతారు. అబద్ధం సృష్టించే వారికి మేము ఇటువంటి శిక్షనే విధిస్తాము. చెడుకార్యం చేసి, పశ్చాత్తాపపడి, విశ్వసించేవారు నిశ్చయంగా ఈ పశ్చాత్తాప, విశ్వాసాల తరువాత వారు నీ ప్రభువును క్షమించేవాడుగా, కనికరించేవాడుగా చూస్తారు.’’
7.
అల్ ఆరాఫ్ 154 - 156 కోపం చల్లారిన పిమ్మట, మూసా ఆ శిలాఫలకాలను తన చేతులలోకి తీసుకున్నాడు. వాటి వ్రాతలో తమ ప్రభువుకు భయపడే వారికొరకు మార్గదర్శకత్వమూ కారుణ్యమూ ఉన్నాయి. మేము నిర్ణయించిన సమయానికి (అతనితో పాటు) హాజరుకావటానికి మూసా తన జాతి ప్రజల నుండి డెబ్భైమందిని ఎన్నుకున్నాడు. వారిని ఒక తీవ్ర భూకంపం వచ్చి పట్టుకున్నప్పుడు మూసా ఇలా మనవి చేసుకున్నాడు : ‘‘నా స్వామీ! మీరు సంకల్పించి ఉన్నట్లయితే, మొదట్లోనే వీళ్ళనూ, నన్నూ నాశనం చేయగలిగి ఉండేవారు. మాలోని కొందరు అజ్ఞానులు చేసిన తప్పునకు మీరు మా అందరినీ నాశనం చేస్తారా? ఇది మీరు పెట్టిన ఒక పరీక్ష. దానిద్వారా మీరు కోరినవారిని అపమార్గానికి గురిచేస్తారు. ఇంకా మీరు కోరిన వారికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తారు. మా సంరక్షకులు మీరే! కనుక మమ్మల్ని క్షమించండి. మాపై దయచూపండి. మీరు అందరికంటే అధికంగా క్షమించేవారు. మా కొరకు ఇహలోకపు మేలునూ వ్రాయండి, పరలోకపు మేలును కూడా వ్రాయండి. మేము మీ వైపునకే మరలాము.’’ సమాధానంగా ఇలా సెలవయింది : ‘‘శిక్షను నేను కోరినవారికి విధిస్తాను. కాని నా కారుణ్యం ప్రతి వస్తువునూ ఆవరించి ఉంది. నాపట్ల అవిధేయతకు దూరంగా ఉండేవారి కొరకూ, జకాత్ ఇచ్చేవారి కొరకూ, నా ఆయతులను విశ్వసించేవారి కొరకూ నేను దానిని వ్రాస్తాను.’’
7.
అల్ ఆరాఫ్ 157 - 158 ఈ సందేశహరుణ్ణి, చదువనూ వ్రాయనూ రాని ఈ ప్రవక్త
(సల్లల్లాహు అలైహి వ సల్లమ్)ను అనుసరించేవారు (ఈనాడు ఈ కారుణ్యానికి అర్హులు). అతని ప్రస్తావన వారికి తమ వద్ద ఉన్న తౌరాతు, ఇంజీలు గ్రంథాలలో వ్రాయబడి లభిస్తుంది. అతను వారికి మంచిని ఆజ్ఞాపిస్తాడు. చెడు నుండి నిరోధిస్తాడు. వారికొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేస్తాడు. అపరిశుద్ధమైన వాటిని నిషిద్ధం చేస్తాడు. వారిపై మోపబడివున్న బరువులను దించుతాడు. వారు బంధింపబడిన శృంఖలాలను త్రెంచుతాడు. కనుక అతనిని విశ్వసించీ సమర్థించీ అతనికి సహకరించీ అతనితో అవతరింపజెయ్యబడిన జ్యోతిని అనుసరించేవారు మాత్రమే సాఫల్యం పొందేవారు. ముహమ్మద్! ఇలా ప్రకటించు: ‘‘మానవులారా! నేను మీ అందరి
వైపునకు వచ్చిన అల్లాహ్ సందేశహరుణ్ణి. ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు.
ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఆయనే మృత్యువును ఇస్తాడు. కనుక విశ్వసించండి అల్లాహ్ ను, ఆయన పంపిన నిరక్షరాస్యుడైన ప్రవక్తను - అతను అల్లాహ్ ను, ఆయన సూక్తులను విశ్వసిస్తాడు - అతనిని అనుసరించండి, మీరు సరియైన మార్గం పొందుతారేమో.
7.
అల్ ఆరాఫ్ 159 - 160 మూసా జాతిలో సత్యం ప్రకారం హితబోధ చేసే, సత్యం ప్రకారమే న్యాయం చేసే ఒక వర్గం కూడా ఉండేది. మేము ఆ జాతిని పన్నెండు వంశాలుగా విభజించి, వాటిని శాశ్వత వర్గాలుగా తీర్చిదిద్దాము. మూసాను అతని జాతివారు నీళ్ళు అడిగినప్పుడు మేము అతనిని తన చేతికర్రతో ఫలానా కొండరాయిని కొట్టు అని సంజ్ఞ చేశాము. అప్పుడు ఆ రాయి నుండి పన్నెండు ఊటలు పెల్లుబికాయి. ప్రతి వర్గం వారు తాము నీళ్ళు పొందే స్థలాన్ని నిర్ణయించుకున్నారు. మేము వారిపై మేఘాల ఛాయను కల్పించాము. వారిపై మన్న్ సల్వాలను దింపాము - ‘‘తినండి మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను’’ అని అన్నాము. కాని తరువాత వారు ఏమి చేశారో అది మాకు అన్యాయం చేయటం కాదు, తమకు తామే అన్యాయం చేసుకున్నారు.
7.
అల్ ఆరాఫ్ 161 - 162 వారికి ఇలా ఆజ్ఞాపించటం జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో : ‘‘ఈ పట్టణంలోకి పోయి నివసించండి. దాని పంటద్వారా మీ ఇష్టప్రకారం ఆహారం పొందండి. ఇంకా ‘‘హిత్తతున్’’ ‘‘హిత్తతున్’’ అంటూ వెళ్ళండి. సాష్టాంగపడుతూ పట్టణ ద్వారంలో ప్రవేశించండి, మేము మీ తప్పులను మన్నిస్తాము. సద్వైఖరి కలిగి ఉండేవారిని అధికానుగ్రహంతో సత్కరిస్తాము.’’ కాని వారిలోని దుర్మార్గులు తమకు చెప్పిన మాటను మార్చివేశారు. పర్యవసానంగా మేము వారి దుర్మార్గానికి ఫలితంగా వారిపైకి ఆకాశం నుండి శిక్షను పంపాము.
7.
అల్ ఆరాఫ్ 163 - 166 సముద్రపు గట్టున ఉన్న ఆ పట్టణాన్ని గురించి కూడా వారిని కొంచెం అడుగు. ఆ సంఘటనను వారికి గుర్తుచేయి.
అక్కడి ప్రజలు సబ్బత్ (శనివారం) రోజున దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించేవారు. ఇంకా చేపలు సబ్బత్నాడే వారిముందు ఎగిరెగిరి నీటిపైకి వస్తూ ఉండేవి. సబ్బత్ నాడు తప్ప
మిగతా దినాలలో అవి వచ్చేవికావు. ఇలా ఎందుకు జరిగేదంటే, మేము వారి అవిధేయతలు కారణంగా వారిని పరీక్షకు గురిచేస్తూ ఉండేవారము. ఇంకా వారికి ఈ విషయం కూడా గుర్తుచేయి. వారిలోని ఒక వర్గం వారు మరొక వర్గం వారితో ఇలా అన్నారు : ‘‘మీరు హితబోధ ఎందుకు చేస్తున్నారు అల్లాహ్ నాశనం చెయ్యనున్నవారికి లేక కఠినంగా శిక్షించనున్న వారికి?’’ వారు ఇలా సమాధానం చెప్పారు : ‘‘మేము మీ ప్రభువు ముందు క్షమింపబడటానికి ఒక
కారణంగా చెప్పుకునే నిమిత్తం ఇదంతా చేస్తున్నాము. బహుశా ఈ ప్రజలు ఆయనపట్ల అవిధేయతకు దూరంగా ఉంటారనే ఆశతో చేస్తున్నాము.’’ చివరకు వారు తమకు జ్ఞాపకం చెయ్యబడిన హితబోధలను పూర్తిగా విస్మరించినప్పుడు, మేము చెడునుండి ప్రజలను వారించేవారిని రక్షించాము. దుర్మార్గులైన ఇతరులందరినీ వారి అవిధేయతలు కారణంగా కఠినశిక్షకు గురిచేశాము. తరువాత వారు, తాము నిరోధించబడిన పనినే పూర్తి తలబిరుసుతనంతో చేస్తూపోయారు. అప్పుడు మేము ఇలా అన్నాము: ‘‘కోతులై పొండి, హీనులుగా నీచులుగా!’’
7.
అల్ ఆరాఫ్ 167 జ్ఞాపకం తెచ్చుకో, నీ ప్రభువు ఇలా ప్రకటించిన సందర్భాన్ని : ‘‘ప్రళయదినం వచ్చేవరకు నేను తప్పకుండా ఇస్రాయీలు సంతతివారిని తీవ్రయాతనకు గురిచేసే ప్రజల అదుపులో ఉండేలా చేస్తూ ఉంటాను.’’ నిశ్చయంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు. నిశ్చయంగా ఆయన మన్నింపుతో కరుణతో వ్యవహరించేవాడూను.
7.
అల్ ఆరాఫ్ 168 - 171 మేము వారిని భువిలో ముక్కలు ముక్కలుగా చేసి నానా జాతులుగా విభజించాము. వారిలో కొందరు సజ్జనులు. కొందరు దానికి భిన్నమైనవారు.
మేము వారిని మంచీ చెడూ స్థితుల ద్వారా పరీక్షకు గురిచేస్తూ వచ్చాము. బహుశా వారు మరలివస్తారేమో అని. ఆపై పూర్వపు తరాల తరువాత అయోగ్యులైన వారు వారికి వారసులయ్యారు. వారు దైవగ్రంథానికి వారసులై కూడా తుచ్ఛమైన ఐహిక ప్రయోజనాలను సేకరిస్తున్నారు. పైగా ఇలా అంటారు : ‘‘మేము క్షమింపబడతామని ఆశిస్తున్నాము.’’ ఆ ఐహిక సంపదే ముందుకు వస్తే, మళ్ళీ దానిని వారు తటాలున అందుకుంటారు. సత్యమైన దానినే అల్లాహ్ పేరుతో పలకాలని వారినుండి గ్రంథప్రమాణం తీసుకోవటం జరగలేదా? గ్రంథంలో వ్రాయబడివున్న దానిని స్వయంగా వారే చదివారు. పరలోక నివాసం దైవభక్తి పరాయణులకు మాత్రమే మేలైనది. మీరు ఈమాత్రపు విషయాన్ని అర్థం చేసుకోలేరా? గ్రంథాన్ని పాటించే, నమాజును స్థాపించే సద్వర్తనుల ప్రతిఫలాన్ని మేము నిశ్చయంగా వ్యర్థం చెయ్యము. ఆ సంఘటన కూడా వారికేమైనా జ్ఞాపకం ఉందా, అప్పుడు మేము పర్వతాన్ని కదలించి దానిని ఒక గొడుగు మాదిరిగా వారిపై కప్పాము. అది తమపై పడుతుందేమో అని వారు భ్రమపడ్డారు. ఆ సమయంలో మేము వారితో ఇలా అన్నాము : ‘‘మేము మీకు ఇస్తున్న గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి. అందులో వ్రాయబడి ఉన్నదానిని జ్ఞాపకం ఉంచుకోండి. అప్పుడు మీరు చెడు నడవడికి దూరంగా ఉంటారని ఆశించబడుతోంది.’’
7.
అల్ ఆరాఫ్ 172 - 174 ప్రవక్తా! ప్రజలకు ఆ సమయాన్ని జ్ఞాపకం చెయ్యి. అప్పుడు నీ ప్రభువు ఆదము సంతతి యొక్క వీపుల నుండి వారి సంతానాన్ని తీసి ఇంకా స్వయంగా వారిని వారికే సాక్షులుగా నిలబెట్టి అడిగాడు:
‘‘నేను
మీ ప్రభువును కాదా?’’ అని.
వారు ఇలా అన్నారు : ‘‘నిశ్చయంగా మీరే మా ప్రభువు. మేము దీనికి సాక్ష్యమిస్తున్నాము.’’ మేము ఇలా ఎందుకు చేశామంటే, ప్రళయదినంనాడు మీరు, ‘‘మాకు ఈ విషయం తెలియదు’’ అని అనకుండా ఉండేటందుకు, లేదా ‘‘షిర్కును మా తాత ముత్తాతలు మాకంటే ముందే ప్రారంభించారు. తరువాత మేము వారి సంతతికి జన్మించాము. దుర్జనులు చేసిన నేరానికి మీరు మమ్మల్ని పట్టుకుంటారా?’’ అని అనకుండా ఉండేటందుకు. చూడండి, ఇలా మేము సూచనలను స్పష్టంగా వివరిస్తాము. వారు మరలిరావాలని ఇలా చేస్తాము.
7.
అల్ ఆరాఫ్ 175 - 176 ప్రవక్తా! వారికి ఆ వ్యక్తి గాధను వినిపించు.
అతనికి మేము మా ఆయతుల జ్ఞానాన్ని ప్రసాదించాము. కాని అతడు వాటిని
పాటించకుండా విముఖుడై పోయాడు. చివరకు షైతాను అతణ్ణి వెంబడిరచాడు. పర్యవసానంగా అతడు మార్గభ్రష్టులలో కలసిపోయాడు. మేము గనక కోరివున్నట్లయితే అతనికి ఆ ఆయతుల ద్వారా ఔన్నత్యాన్ని ప్రసాదించి ఉండేవారము. కాని అతడు భూమి వైపునకే మ్రొగ్గాడు. తన మనోవాంఛలనే అనుసరించాడు. కనుక అతడి పరిస్థితి కుక్క వంటిదైపోయింది. మీరు దానిపై దాడిచేస్తే అప్పుడు కూడా అది నాలుకను వెళ్ళబెట్టుతుంది. దానిని వదలిపెడితే అప్పుడు కూడా అది నాలుకను వెళ్ళబెట్టుతుంది. మా ఆయతులను తిరస్కరించే వారి దృష్టాంతం కూడా ఇదే. నీవు వారికి ఈ గాథలను వినిపిస్తూ ఉండు,
బహుశా వారు యోచిస్తారేమో.
7.
అల్ ఆరాఫ్ 177 - 179 మా ఆయతులను తిరస్కరించిన వారి దృష్టాంతం చాలా చెడ్డది. ఎందుకంటే వారు తమకు తామే అన్యాయం చేసుకుంటున్నారు. అల్లాహ్ ఎవడికి మార్గం చూపుతాడో వాడే సన్మార్గం పొందుతాడు. కాని అల్లాహ్ ఎవడిని తన మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడో, వాడే నిష్ఫలుడౌతాడు, నష్టపోతాడు. చాలామంది జిన్నాతులనూ, మానవులనూ మేము నరకం కోసమే సృష్టించాము, ఇది యథార్థం. వారికి హృదయాలున్నాయి కాని వారు వాటితో ఆలోచించరు. వారికి కళ్ళు ఉన్నాయి కాని వారు వాటితో చూడరు. వారికి చెవులు ఉన్నాయి కాని వారు వాటితో వినరు. వారు జంతువుల వంటివారు - కాదు వాటికంటే కూడా దిగజారిపోయారు. అలక్ష్యంలో మునిగివున్నవారు వీరే.
7.
అల్ ఆరాఫ్ 180 - 183 అల్లాహ్ మంచి పేర్లకు అర్హుడు. ఆయనను మంచి పేర్లతోనే వేడుకోండి. ఆయనను మంచిపేర్లతో పిలిచే విషయంలో సత్యం నుండి వైదొలగే వారిని వదలిపెట్టండి. వారు తాము చేస్తున్న దానికి ప్రతిఫలం పొంది తీరుతారు. మేము సృష్టించినవారిలో ఖచ్చితంగా సత్యం ప్రకారం ఉపదేశించే, సత్యం ప్రకారం న్యాయం చేసే ఒక వర్గం కూడా ఉంది. ఇక మా ఆయతులు అసత్యాలని తిరస్కరించిన వారు, మేము వారిని క్రమేణా వారికి ఏమాత్రం తెలియని పద్ధతి ప్రకారం వినాశం వైపునకు తీసుకుపోతాము. నేను వారికి సడలింపును ఇస్తున్నాను. నా వ్యూహానికి తిరుగు లేదు.
7.
అల్ ఆరాఫ్ 184 - 186 తమ మిత్రునిపై ఉన్మాదప్రభావం ఏదీ పడలేదు అనే విషయం గురించి వారు ఎప్పుడూ ఆలోచించలేదా? అతను హెచ్చరిక చేసేవాడు మాత్రమే. (చెడు ఫలితం కలుగకముందే) స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా వారు భూమ్యాకాశాలు పనిచేసే తీరును గురించి ఎప్పుడూ యోచిం చలేదా? అల్లాహ్ సృష్టించిన ఏ వస్తువునూ వారు కళ్ళు తెరచి చూడలేదా? బహుశా వారి జీవితపు గడువు పూర్తిఅయ్యే సమయం ఆసన్నమయిందనే విషయాన్ని గురించి కూడా వారు ఆలోచించలేదా? అయితే ప్రవక్త చేసిన ఈ హెచ్చరిక తరువాత అసలు వారు విశ్వసించే విషయం మరొకటి ఏది కాగలదు?-అల్లాహ్ తన మార్గదర్శకత్వం నుండి దూరం చేసే వ్యక్తికి మరొక మార్గదర్శకుడు ఎవడూ లేడు. అల్లాహ్ అటువంటి వారిని తమ తలబిరుసుతనంలో మార్గం తప్పి తిరగటానికి వదలిపెడతాడు.
7.
అల్ ఆరాఫ్ 187 - 188 వారు నిన్ను ‘‘అసలు ఆ ప్రళయ గడియ ఎప్పుడు అవతరిస్తుంది?’’ అని అడుగుతున్నారు. ఇలా అను : ‘‘దానిని గురించి నా ప్రభువుకే తెలుసు. దానిని దాని సమయం వచ్చినప్పుడే ఆయన ప్రత్యక్ష పరుస్తాడు. ఆకాశాలలో, అవనిలో అది అత్యంత కఠినసమయంగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగా వచ్చిపడుతుంది.’’ నీవు దాని అన్వేషణలో మునిగి వున్నట్లుగా భావించి వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. ఇలా అను: ‘‘దానిని గురించి కేవలం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. కాని చాలామందికి ఈ యథార్థం తెలియదు.’’ ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘నాకు సంబంధించిన లాభనష్టాలపై నాకు ఏ అధికారమూ లేదు. అల్లాహ్ కోరింది మాత్రమే అవుతుంది. నాకే గనక అగోచర విషయ జ్ఞానం ఉన్నట్లయితే, నేను ఎన్నో ప్రయోజనాలను నా కొరకు పొంది ఉండేవాణ్ణి. నాకు ఎన్నటికీ ఏ నష్టమూ వాటిల్లేది కాదు. నేను నా మాటను నమ్మేవారి కొరకు కేవలం హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే. శుభవార్త వినిపించేవాణ్ణి మాత్రమే.’’
7.
అల్ ఆరాఫ్ 189 - 198 అల్లాహ్ యే మిమ్మల్ని ఏకైక ప్రాణి నుండి సృష్టించాడు. ఇంకా అదే జాతినుండి అతనికి సహచరిని సృజించాడు, అతను ఆమెతో ప్రశాంత జీవితం గడపటానికి. తరువాత పురుషుడు స్త్రీని కప్పివేసినప్పుడు ఆమె ఒక తేలికైన భారాన్ని ధరించింది. ఆమె దానిని మోసుకుంటూ తిరుగుతూ ఉండేది. తరువాత ఆమె గర్భభారం అధికమయినప్పుడు, వారు ఉభయులూ కలసి తమ ప్రభువైన అల్లాహ్ ను ఇలా వేడుకున్నారు : ‘‘నీవు గనక మాకు మంచి పిల్లవాణ్ణి ఇచ్చినట్లయితే, మేము నీకు కృతజ్ఞులం అవుతాము.’’ అప్పుడు అల్లాహ్ వారికి ఒక చక్కని, ఏ లోపమూ లేనటువంటి పిల్లవాణ్ణి ప్రసాదించాడు. కాని వారు ఆయన ప్రసాదించిన ఈ కానుక విషయంలో ఇతరులను ఆయనకు భాగస్వాములుగా చేయసాగారు. వారు చేసే ఈ షిర్కు పనులకు అల్లాహ్ అతీతుడు, ఉన్నతుడూను. ఎంత మూఢులు వీళ్ళు! ఏ వస్తువునూ సృష్టించలేనివారిని, స్వయంగా తామే సృష్టించబడేవారిని, ఎవరికీ సహాయం చెయ్యలేనివారిని, స్వయంగా తమకు తామే సహాయం చేసుకోలేని వారిని వీరు అల్లాహ్ కు భాగస్వాములుగా చేస్తున్నారు. ఒకవేళ మీరు వారిని రుజుమార్గం పైకి రమ్మని ఆహ్వానిస్తే వారు మీవెంట రారు. మీరు వారిని పిలిచినా లేక మౌనం వహించినా మీకు రెండూ ఒక్కటే. అల్లాహ్ ను త్రోసిరాజని మీరు వేడుకుంటున్న వారు మీ మాదిరిగానే కేవలం దాసులు. మీరు వారిని ప్రార్థించి చూడండి. మీకు వారిపట్ల ఉన్న భావాలు నిజమే అయితే మీ ప్రార్థనలకు వారు సమాధానం ఇవ్వాలి. వారికి కాళ్ళు ఉన్నాయా వాటితో నడవటానికి? వారికి చేతులు ఉన్నాయా వాటితో పట్టుకోవటానికి? వారికి కళ్ళు ఉన్నాయా వాటితో చూడడానికి? వారికి చెవులు ఉన్నాయా వాటితో వినడానికి? ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘మీరు నిలబెట్టిన భాగస్వాములను పిలవండి. తరువాత మీరంతా కలసి నాకు వ్యతిరేకంగా వ్యూహాలు పన్నండి. నాకు ఎంతమాత్రం గడువు ఇవ్వకండి. ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన దేవుడే నాకు రక్షకుడు, సహాయకుడు. ఆయన సజ్జనులకు సహాయపడతాడు. దీనికి భిన్నంగా మీరు అల్లాహ్ ను వదలి వేడుకునేవారు మీకూ సహాయం చెయ్యలేరు, స్వయంగా తమకూ సహాయం చేసుకోలేరు. ఇంకా మీరు గనక వారిని రుజుమార్గం వైపునకు రమ్మని పిలిస్తే, వారు మీ మాటను విననైనా లేరు. పైకి వారు మీవైపు చూస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. కాని వాస్తవానికి వారు దేనినీ చూడలేరు.’’
7.
అల్ ఆరాఫ్ 199 - 202 ప్రవక్తా! మృదుత్వం, మన్నింపుల వైఖరిని అవలంబించు. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో వాదానికి దిగకు. ఒకవేళ ఎప్పుడైనా షైతాను నిన్ను ఉసిగొలిపితే అల్లాహ్ శరణు వేడు. ఆయన అన్నీ వినేవాడు. అన్నీ తెలిసినవాడు. వాస్తవానికి భయభక్తులు కలవారి స్థితి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా షైతాను ప్రభావం వల్ల
వారికి ఏదైనా చెడు ఆలోచన తట్టినప్పటికీ, వారు తక్షణం అప్రమత్తులవుతారు. తరువాత వారు అవలంబించవలసిన సరియైన మార్గమేమిటో వారికి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వారి (అంటే షైతాను) సోదరులు, వారు వారిని తమ వక్రమార్గంలోనికే లాక్కుపోతారు. వారిని భ్రష్టులుగా చెయ్యటంలో ఏమాత్రం లోపం చేయరు.
7.
అల్ ఆరాఫ్ 203 - 204 ప్రవక్తా! నీవు వారికి
ఏదైనా ఒక సూచనను (మహత్మ్యాన్ని) చూపకపోతే వారు ఇలా అంటారు : ‘‘నీవు నీకొరకు ఏదైనా సూచనను ఎందుకు ఎన్నుకోలేదు?’’ వారితో ఇలా అను : ‘‘నేను కేవలం నా ప్రభువు నా వద్దకు పంపిన వహీని మాత్రమే అనుసరిస్తాను. ఇందులో జ్ఞాన కాంతిపుంజాలు ఉన్నాయి. అవి మీ ప్రభువు తరఫు నుండి వచ్చాయి. ఇది మార్గదర్శకత్వం, కారుణ్యం, దానిని స్వీకరించే వారి కొరకు. దివ్య ఖురాను మీ ముందు పఠింపబడుతూ ఉన్నప్పుడు, దానిని శ్రద్ధతో వినండి, మౌనంగా ఉండండి. బహుశా మీరు కూడా కరుణింపబడతారేమో.
7.
అల్ ఆరాఫ్ 205 - 206 ప్రవక్తా! నీ ప్రభువును ఉదయమూ సాయంత్రమూ స్మరించు, లోలోపల వినయంతోనూ భయపడుతూనూ, మెల్లగా నోటితో కూడా. నిర్లక్ష్యం చేసేవారిలో నీవు చేరకు. నీ ప్రభువు సన్నిధిలో సన్నిహిత స్థానం కలిగివుండే దైవదూతలు ఎన్నడూ తమ గొప్పతనానికి గర్వపడి ఆయన ఆరాధనకు విముఖులు కారు. ఆయనను స్తుతిస్తూ ఉంటారు. ఆయన ముందు సజ్దాచేస్తూ వినమ్రులయి ఉంటారు.
No comments:
Post a Comment