74 సూరహ్ అల్‌ ముద్దస్సిర్

 

74.అల్ముద్దస్సిర్

ఆయతులు : 56                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 7 వస్త్రం కప్పుకుని పడుకున్న మనిషీ! లే  లేచి హెచ్చరించు. నీ ప్రభువు ఘనతను చాటి చెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో, మాలి న్యానికి దూరంగా ఉండు. ఎక్కువగా పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు. నీ ప్రభువు కొరకు ఓర్పు వహించు.

8 - 37 సరే  శంఖం పూరించబడే రోజు చాలా కఠినమైన రోజు. సత్య తిరస్కారులకు అది తేలికగా ఉండదు. వదలిపెట్టండి నన్నూ, నేను ఒంటరిగా పుట్టించిన వ్యక్తినీ. నేను అతనికి ఎంతో ధనం ఇచ్చాను, ఎల్లప్పుడూ అతన్ని వెన్నంటి ఉండే కుమారులను ప్రసాదించాను, అతని కొరకు రాజ్యాధికార (సకల సౌకర్యాల) మార్గాన్ని సుగమం చేశాను. అయినప్పటికీ నేను అతనికి ఇంకా ఏదో ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాడు. కాదు, అలా ఎన్నటికీ కాదు, అతను మా వాక్యాల పట్ల విరోధం కలిగి ఉన్నాడు. నేను త్వరలోనే అతనిని దుర్గమమైన స్థానం పైకి ఎక్కిస్తాను. అతడు ఆలోచించి, ఏదో ఎత్తువేయటానికి ప్రయత్నిం చాడు. కనుక దేవుడు అతనిని నాశనం చేయుగాక! అతడు ఎలాంటి ఎత్తుగడ వేయటానికి ప్రయత్నించాడు! తరువాత (ప్రజల వైపు) చూశాడు. తరువాత కనుబొమలు ముడిచాడు.  ముఖం చిట్లించుకున్నాడు. ఆపై విర్రవీగుతూ తిరిగిపోయాడు, చివరకు, ‘‘ఇది పూర్వం నుండి వస్తూ ఉన్న ఒక మంత్రజాలం తప్ప మరేమీ కాదు. ఇది ఒక మానవవాక్కు మాత్రమే’’ అని అన్నాడు. త్వరలోనే నేను అతనిని నరకంలోకి తోసేస్తాను. నరకం ఏమిటో నీకేమి తెలుసు? అది మిగిలించదు,  వదలిపెట్టదు.  అది చర్మాన్ని మాడ్చివేసేది. పందొమ్మిది మంది దానిపై నియమితులై ఉన్నారు  - మేము దైవదూతలను మాత్రమే నరకానికి కార్యనిర్వాహకులుగా నియమించాము. వారి సంఖ్యను అవిశ్వాసుల కొరకు ఒక పరీక్షగా చేశాము  ఎందుకంటే గ్రంథ ప్రజలకు నమ్మకం కలగాలని, విశ్వసించే వారి విశ్వాసం అధికం కావాలని, గ్రంథ ప్రజలు, విశ్వాసులు ఎలాంటి సందేహంలో పడకుండా ఉండాలని ఇంకా మానసిక వ్యాధిగ్రస్తులు, సత్య విరోధులు ‘‘ విచితమ్రైన వాక్కుకు అర్థమేమై ఉంటుంది?’’ అని అనాలని. విధంగా అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు, తాను కోరిన వారికి మార్గం నిర్దేశిస్తాడు. నీ ప్రభువు సైన్యాలను స్వయంగా ఆయన తప్ప మరెవరూ ఎరుగరు - నరక ప్రస్తావన ప్రజలకు హితోపదేశం కావాలనే ఉద్దేశ్యంతోనే తప్ప మరి దేనికొరకూ చేయ బడలేదు. ఎంతమాత్రం కాదు, చంద్రుడు సాక్షిగా, మరలిపోయే రాత్రి సాక్షిగా, ప్రకాశించే ఉదయం సాక్షిగా నరకం కూడా గొప్ప విషయాలలోని ఒక గొప్ప విషయం, మానవులకు భీతిగొలిపే విషయం, మీలో ముందడుగు వేసే ప్రతి వ్యక్తికీ, వెనుక ఉండిపోయే ప్రతి వ్యక్తికీ భీతిగొలిపే విషయం.

38 - 48 ప్రతి వ్యక్తీ తాను సంపాదించే దానికి తాకట్టుగా ఉంటాడు, స్వర్గవనాలలో ఉండే కుడిపక్షంవారు తప్ప. వారు అపరాధులను, ‘‘మిమ్మల్ని విషయం నరకంలోకి తీసుకువెళ్ళింది?’’ అని అడుగుతారు. దానికి వారు ఇలా అంటారు, ‘‘మేము నమాజు చేసేవారిలోని వారం కాము, నిరుపేదలకు అన్నం పెట్టేవాళ్ళం కాము, సత్యానికి వ్యతిరేకంగా మాటలు కల్పించే వారితో కలిసి మేము కూడ మాటలను కల్పించేవారము మరియు తీర్పుదినం అబద్ధ మని చెప్పేవారము  చివరకు అనివార్య విషయం మాకు ఎదురయింది.’’ అప్పుడు సిఫారసు చేసే వారి సిఫారసు, వారికి ఏమాత్రం ఉపయోగపడదు.

49 - 56 అసలు వారికేమయింది, హితబోధ నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు, సింహాన్ని చూసి పారిపోయే అడవిగాడిదెల మాదిరిగా. పైగా వారిలో ప్రతి ఒక్కడూ తన పేర బహిరంగ ఉత్తరాలు పంపబడాలని కోరుతున్నాడు, ఎంతమాత్రం కాదు, అసలు విషయం ఏమిటంటే,  వారికి పరలోక భయం  మాత్రం లేదు. అలా ఎన్నటికీ కాదు  ఇదసలు ఒక హితబోధ. ఇక ఇష్టమైన వారు దీనినుండి గుణపాఠం నేర్చుకోవచ్చు. అల్లాహ్ కోరితే తప్ప వీరు గుణపాఠాన్నీ నేర్చుకోలేరు. ప్రజలు ఆయనకు భయపడాలి, దానికి ఆయన హక్కుదారుడు. (భయభక్తులు కలవారిని) ఆయన మన్నిస్తాడు, దానికి ఆయన అర్హుడు.

No comments:

Post a Comment