2. అల్ బఖర
ఆయతులు
: 286 అవతరణ
: మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
2. అల్ బఖర 1 - 5
అలిఫ్ లామ్ మీమ్. ఇది అల్లాహ్ గ్రంథము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకం - వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము ప్రసాదించిన దానినుండి (మా మార్గంలో) ఖర్చుచేస్తారు. మేము నీపై అవతరింపచేసిన గ్రంథాన్నీ (ఖురాను), నీకు పూర్వం అవతరింపచేసిన గ్రంథాలనూ విశ్వసిస్తారు. పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. ఇలాంటి వారు తమ ప్రభువు తరఫునుండి రుజుమార్గంలో ఉన్నారు. సాఫల్యం పొందేవారు వారే.
2. అల్ బఖర
6
- 7 (ఈ విషయాలను) తిరస్కరించిన వారిని నీవు హెచ్చరించినా, హెచ్చరించకపోయినా ఒకటే. వారు విశ్వసించేవారు కారు. అల్లాహ్ వారి హృదయాలకూ, వారి చెవులకూ ముద్రవేశాడు. వారి కన్నులపై తెరపడిరది. వారు కఠిన శిక్షకు అర్హులు.
2. అల్ బఖర
8
- 20 ‘‘అల్లాహ్ ను, అంతిమదినాన్ని మేము విశ్వసించాము’’ అని అనేవారు కూడా కొందరు ఉన్నారు. కాని వాస్తవంగా వారు విశ్వాసులు కారు. అల్లాహ్ ను, విశ్వాసులనూ వారు మోసం చేస్తున్నారు. కాని యథార్థంగా వారు తమను తాము తప్ప మరెవరినీ మోసం చెయ్యటం లేదు. అయితే ఈ విషయాన్ని వారు గ్రహించటం లేదు. వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికిగాను, వారికి వ్యధాభరితమయిన శిక్ష పడుతుంది. ‘‘అవనిలో కల్లోలాన్ని రేకెత్తించకండి’’ అని వారితో అన్నప్పుడల్లా వారు ‘‘మేము సంస్కర్తలము మాత్రమే’’ అని అంటారు - జాగ్రత్త! వాస్తవంగా వారే అసలు కల్లో లాన్ని సృష్టించేవారు. కాని వారు గ్రహించటం లేదు. ‘‘ఇతరులు విశ్వసించిన విధంగానే మీరూ విశ్వసించండి’’ అని వారితో అన్నప్పుడు వారు ‘‘మూర్ఖులు విశ్వసించిన విధంగా మేము విశ్వ సించాలా?’’ అని జవాబిస్తారు - జాగ్రత్త! వాస్తవంగా వారే మూర్ఖులు, కాని అది వారికి తెలియదు. విశ్వాసులను కలసినప్పుడు వారు ‘‘మేము విశ్వసించాము’’ అని అంటారు. కాని తమ షైతానులను ఏకాంతంగా కలసినప్పుడు వారు ‘‘అసలు మేము మీతోనే ఉన్నాము. వారిని కేవలం ఎగతాళి చేస్తున్నాము’’ అని అంటారు - అల్లాహ్ వారిని ఎగతాళి చేస్తున్నాడు. ఆయన వారికి వ్యవధినిస్తూ పోతున్నాడు. వారు తలబిరుసుతనం వల్ల అంధులై గమ్యరహితంగా తిరుగుతూ పోతున్నారు. సన్మార్గానికి
బదులుగా అపమార్గాన్ని కొనుక్కున్న ప్రజలు వారే. కాని వారి ఈ బేరం వారికి లాభదాయకమయింది కాదు. వారు ఏమాత్రం సత్యమార్గంలో లేరు. వారి ఉపమానం ఇలా వుంది : ఒక వ్యక్తి నిప్పు రాజేసినంతనే పరిసరాలన్నీ ప్రకాశించాయి. అప్పుడు అల్లాహ్ వారి కంటి వెలుగును హరింపజేసి, అంధకారంలో ఏమీ కానరాని స్థితిలో వారిని వదిలాడు. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. ఇక వారు (రుజుమార్గానికి) మరలిరారు. లేదా మరొక ఉపమానం : ఆకాశం నుండి భారీగా వర్షం కురుస్తోంది. దానికి తోడు చిమ్మచీకట్లు, ఉరుములు, మెరుపులు! ఉరుముల భీకర ధ్వని విని, మృత్యు భయంచేత వారు తమ వ్రేళ్ళను చెవులలో దూర్చుకుంటారు. అల్లాహ్ ఈ సత్యతిరస్కారులను అన్ని వైపుల నుండి పరివేష్టించి ఉన్నాడు. వారి పరిస్థితి, మెరుపులు వారి దృష్టిని ఎగర వేసుకపోతాయా అనేవిధంగా ఉంది. వెలుగును చూసినప్పుడల్లా వారు కొంత దూరం నడుస్తారు. చీకటి క్రమ్ముకోగానే ఆగిపోతారు - అల్లాహ్ కోరితే వారి వినికిడినీ, వారి చూపునూ సంపూర్ణంగా నశింపచేసేవాడే. నిశ్చయంగా ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.
2. అల్ బఖర
21
- 22 మానవులారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారినీ సృష్టించిన మీ ప్రభువును ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. మీ కొరకు భూమిని పాన్పుగాను, ఆకాశాన్ని కప్పుగాను సృష్టించినవాడూ, పైనుండి వర్షాన్ని కురిపించి, తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటుచేసి మీకు ఉపాధి కల్పించినవాడూ ఆయనే! ఇది మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్ సమానులుగా నిలబెట్టకండి.
2. అల్ బఖర
23
- 24 మేము మా దాసునిపై అవతరింపజేసిన గ్రంథం గురించి, అది మా గ్రంథం అవునో కాదో అని మీకు సందేహం ఉన్నట్లయితే దానివంటి ఒక్క సూరానైనా మీరు రచించి తీసుకురండి. మీ సహచరులందరినీ పిలుచుకోండి. ఒక్క అల్లాహ్ తప్ప మరెవరి సహాయాన్నయినా పొందండి. మీరు సత్యవంతులే అయితే
ఈ పని చేసి చూపించండి. కాని మీరు అలా చెయ్యకపోతే - నిశ్చ యంగా ఎన్నటికీ చెయ్యలేరు-భయపడండి, మానవులు, రాళ్ళు ఇంధనం కాగల ఆ అగ్నికి. అది సత్యతిరస్కారుల కొరకు తయారు చెయ్యబడిరది.
2. అల్ బఖర
25
ప్రవక్తా! ఈ గ్రంథాన్ని విశ్వసించి, (దాని బోధనలకు అనుగుణంగా) తమ నడవడికను తీర్చిదిద్దు కునే వారికి సంతోషవార్త వినిపించు : కాలువలు ప్రవహించే ఉద్యానవనాలు వారి కొరకు సిద్ధంగా ఉన్నాయి అని. ఆ వనాలలోని పండ్లు ఆకారంలో భూలోకంలోని పండ్లను పోలి ఉంటాయి. తినటానికి ఏమైనా పండ్లు ఇవ్వబడినప్పుడల్లా, వారు ‘‘ఇలాంటి పండ్లే పూర్వం భూలోకంలో మాకు ఇవ్వబడేవి’’ అని అంటారు. అక్కడ వారికొరకు పవిత్రలైన భార్యలు ఉంటారు. వారు అక్కడే శాశ్వతంగా ఉంటారు.
2. అల్ బఖర
26
- 27 అవును. దోమ లేక దానికంటే మరీ అల్పమైన వస్తువును దృష్టాంతంగా చెప్పటానికి అల్లాహ్ ఎంతమాత్రం సిగ్గుపడడు.
ఈ దృష్టాంతాన్నే సత్యస్వీకారులు చూసి, ఇది తమ ప్రభువు తరఫునుండి వచ్చిన సత్యమే అని గ్రహిస్తారు. కాని సత్యతిరస్కారులు వాటిని విని ‘‘ఈ ఉపమానాల ద్వారా అల్లాహ్ చెప్పదలచుకున్నదేమిటి?’’ అని ప్రశ్నిస్తారు. ఈ విధంగా అల్లాహ్ ఒకే విషయంతో ఎంతో మందిని అపమార్గం వైపునకు తీసుకుపోతాడు. ఎంతోమందికి రుజుమార్గం చూపుతాడు. అల్లాహ్ దీనిద్వారా అపమార్గం పట్టించేది వీరినే - అల్లాహ్ ఆజ్ఞలను ఉల్లంఘించేవారు, అల్లాహ్ తీసుకున్న ప్రమాణాన్ని దృఢపరచిన తరువాత భంగపరచేవారు, కలిపివుంచండి అని అల్లాహ్ ఆదేశించిన దాన్ని తెంచేవారు, ఇంకా భువిలో కల్లోలాన్ని రేకెత్తించేవారు - వాస్తవంగా నష్టపడేవారు వీరే.
2. అల్ బఖర
28
- 29 మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంభించగలుగుతారు? వాస్తవానికి ప్రాణంలేని మీకు ఆయన ప్రాణం పోశాడు. మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేదీ ఆయనే. తిరిగి మిమ్మల్ని బ్రతికించేదీ ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు. ఇంకా ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్నీ మీ కొరకు సృష్టించినవాడు. తరువాత తన ధ్యానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృజించినవాడూ ఆయనే. ప్రతి విషయమూ క్షుణ్ణంగ తెలిసినవాడూ ఆయనే.
2. అల్ బఖర
30
- 33 ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో : ‘‘నేను భువిలో ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను’’ అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు వారు, ‘‘భూవ్యవస్థను అస్తవ్యస్త్యం చేసి రక్తం చిందించేవాణ్ణి నియమించబోతున్నావా ప్రభూ? మేము నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్ర నామం స్మరిస్తూనే ఉన్నాము కదా!’’ అని విన్నవించుకున్నారు. దానికి అల్లాహ్, ‘‘మీకు తెలియనివన్నీ నాకు తెలుసు’’ అని సమాధానం పలికాడు. తరువాత అల్లాహ్ ఆదమ్కు అన్ని వస్తువుల పేర్లూ నేర్పాడు. వాటిని దూతలకు చూపించి, ‘‘(ప్రతినిధి నియామకం సంక్షోభానికి దారితీస్తుంది అనే) మీ అభిప్రాయమే నిజమయితే, వీటి పేర్లు కాస్త నాకు చెప్పండి?’’ అని అల్లాహ్ వారిని అడిగాడు. వారు కడు వినమ్రులై ఇలా అన్నారు: ‘‘(ప్రభూ!) దోష రహితుడవు నీవే! నీవు తెలిపినది తప్ప మాకు మరేమీ తెలియదు. వాస్తవంగా సర్వం తెలిసినవాడవూ సర్వాన్ని అర్థం చేసుకోగలవాడవూ నీవే!’’ అప్పుడు అల్లాహ్ ఆదమ్తో, ‘‘ఈ వస్తువుల పేర్లను నీవు వారికి తెలుపు’’ అని అన్నాడు. ఆదమ్ వారికి వాటి పేర్లన్నీ తెలుపగానే, అల్లాహ్ ఇలా ప్రకటించాడు : ‘‘భూమ్యాకాశాలలో మీకు గోప్యంగావున్న సత్యాలన్నీ నాకు తెలుసనీ, మీరు ప్రకటించేవీ, మీరు దాచేవీ అన్నీ నాకు తెలుసనీ నేను మీకు చెప్పలేదా?’’
2. అల్ బఖర
34
మేము దూతలకు ‘‘మీరు అందరూ ఆదమ్కు తలవంచండి’’ అని ఆదేశించినప్పుడు, వారందరూ తలవంచారు. కాని ఇబ్లీసు ధిక్కరించాడు. దురహంకారానికి గురిఅయ్యాడు. అవిధేయులలో కలసిపోయాడు.
2. అల్ బఖర
35 - 37 మళ్ళీ మేము ఆదమ్తో ఇలా అన్నాము: ‘‘నీవూ, నీ భార్య ఇద్దరూ కలసి స్వర్గంలో నివసిం చండి. ఇక్కడ మీరు మీకు ఇష్టమైన దానిని యధేచ్ఛగా తినండి. కాని ఈ చెట్టు దరిదాపులకు పోవద్దు. ఒకవేళ పోతే, మీరు అతిక్రమణదారులలో కలసిపోతారు.’’ చివరకు షైతాను వారిద్దరిని ఆ చెట్టు వైపునకు ఆకర్షించి, మా ఆజ్ఞాపాలనం నుండి దూరం చేశాడు. వారిని తమ పూర్వపు స్థితి నుండి తొలగించి వదలివేశాడు. అప్పుడు మేము ఇలా ఆజ్ఞాపించాము : ‘‘ఇక మీరంతా ఇక్కడ నుండి దిగిపొండి. మీరు ఒకరికొకరు శత్రువులు. ఒక పరిమిత కాలం వరకు మీరు భూలోకంలో ఉండి అక్కడే జీవితం గడపవలసి ఉంది.’’ అప్పుడు ఆదమ్ తన ప్రభువు నుండి కొన్ని మాటలు నేర్చుకుని, పశ్చాత్తాపపడుతూ క్షమాభిక్ష అర్థించాడు. అతని ప్రభువు అతని వేడుకోలును మన్నించాడు. ఎందుకంటే, ఆయన అమితంగా క్షమించేవాడు, కనికరించేవాడూను.
2. అల్ బఖర
38
- 39 మేము ఇలా తెలిపాము : ‘‘మీరంతా ఇక్కడి నుండి దిగిపొండి. ఇకపై నా తరఫు నుండి ఏదైనా ఉపదేశం మీ వద్దకు వచ్చినప్పుడు, నా ఈ ఉపదేశాన్ని అనుసరించేవారికి ఏ విధమైన భయంకానీ, విచారంకానీ కలిగే అవకాశం ఉండదు. దానిని స్వీకరించటానికి నిరాకరించేవారూ, మా ‘‘ఆయతులు’’ అసత్యాలని తృణీకరించేవారూ, నరకాగ్నిలోకి పోతారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.
2. అల్ బఖర
40
- 46 ఇస్రాయీలు వంశీయులారా! నేను మీకు ప్రసాదించిన కానుకను గురించి ఆలోచించండి. మీరు నాతో చేసిన వాగ్దానం నెరవేర్చండి. నేను మీతో చేసిన వాగ్దానం నెరవేరుస్తాను. నాకు మాత్రమే మీరు భయపడండి. నేను ఇప్పుడు పంపిన గ్రంథాన్ని విశ్వసించండి. ఇదివరకే మీ వద్ద ఉన్న దివ్య గ్రంథాన్ని అది ధ్రువీకరిస్తుంది. కనుక మీరే అందరికంటే ముందు దానిని తిరస్కరించేవారు అవకండి. అల్ప ధరకు నా ఆయతులను అమ్మకండి. నా ఆగ్రహానికి భయపడండి. సత్యాన్ని అసత్యంతో కలిపి దానిని కలగాపులగం చెయ్యకండి. బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చెయ్యకండి. నమాజును స్థాపించండి. జకాత్ ఇవ్వండి. నా సాన్నిధ్యంలో వినమ్రులై తలవంచే వారితో పాటు మీరూ వినమ్రులై తలవంచండి. సన్మార్గాన్ని అవలంబించండి అని మీరు ఇతరులకయితే ఉపదేశిస్తారు - కాని మిమ్మల్ని మీరు మరచిపోతారేమిటి? వాస్తవానికి మీరు ధర్మగ్రంథం పారాయణం చేస్తారు. అయినా మీరు బుద్ధిని బొత్తిగా ఉపయోగించరేమిటి? సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం పొందండి. నిస్సందేహంగా నమాజు కష్టతరమైన కార్యం. కాని అల్లాహ్ కు విధేయులైన దాసులకు అది ఎంతమాత్రం కష్టం కాదు - వారు తాము ఎట్టకేలకు తమ ప్రభువును కలుసుకోవలసి ఉందనీ, ఆయన వైపునకే మరలిపోవలసి ఉందనీ నమ్ముతారు.
2. అల్ బఖర
47
- 48 ఇస్రాయీలు వంశీయులారా! నేను మీకు చేసిన మహోపకారాన్నీ, మిమ్మల్ని ప్రపంచంలోని జాతులలోకెల్లా ఘనతగల ఒక జాతిగా ఆదరించిన విషయాన్నీ గుర్తుకు తెచ్చుకోండి. ఎవరూ ఎవరికీ ఏమాత్రం తోడ్పడలేని, ఎవరి సిఫారసూ అంగీకరించబడని, పరిహారం తీసుకుని ఎవరినీ విడుదల చెయ్యని, అపరాధులకు సహాయం ఎక్కడ నుండీ లభించని ఆ దినానికి మీరు భయపడండి.
2. అల్ బఖర
49
ఫిరౌను ప్రజల బానిసత్వం నుండి మేము మీకు విముక్తి కలిగించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి - వారు మిమ్మల్ని ఘోర హింసకు గురిచేసేవారు. మీ కుమారులను వధించి, మీ కుమార్తెలను సజీవంగా విడిచిపెట్టేవారు. ఇందులో మీ ప్రభువు తరఫు నుండి మీకు కఠినపరీక్ష ఉండినది.
2. అల్ బఖర
50
సముద్రాన్ని చీల్చి మేము మీకు మార్గం ఏర్పాటు చేసిన సంఘటనను గుర్తుకు తెచ్చుకోండి. ఆ తరువాత దానినుండి మిమ్మల్ని సురక్షితంగా ఆవలి ఒడ్డుకు చేరవేశాము. మీ కళ్ళముందే ఫిరౌను ప్రజలను మేము అందులో ముంచివేశాము.
2. అల్ బఖర
51
- 52 మేము మూసాను నలువది రేయింబవళ్ళ నిర్ణీత కాలం వరకు పిలిచినప్పుడు, మీరు అతను లేకపోవటం చూసి ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఆ విధంగా మీరు ఘోర దురాచారానికి పాల్పడ్డారు. అయినప్పటికీ మీరు కృతజ్ఞులౌతారేమో అని మేము మిమ్మల్ని క్షమించాము.
2. అల్ బఖర
53
గుర్తుకు తెచ్చుకోండి : (ఈ ఘోర పాతకంలో మీరు మునిగి వున్నప్పుడు) మీరు రుజుమార్గం పొందగలందుకు మేము మూసాకు గ్రంథాన్నీ, గీటురాయినీ ప్రసాదించాము.
2. అల్ బఖర
54
జ్ఞాపకం తెచ్చుకోండి : (అల్లాహ్ ప్రసాదించిన ఈ కానుకతో తిరిగి వచ్చిన) మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు : ‘‘జనులారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా ఎన్నుకుని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీరు మీ సృష్టికర్తను వేడుకోండి, మీలోని ఘోర పాతకులను సంహరించండి. మీ సృష్టికర్త దృష్టిలో ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది.’’ అప్పుడు మీ సృష్టికర్త మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. ఆయన ఎక్కువగా క్షమించేవాడూ, అమితంగా కరుణించేవాడూను.
2. అల్ బఖర
55
- 56 మూసాతో మీరు అన్న మాటలను జ్ఞప్తికి తెచ్చుకోండి : ‘‘మూసా! మేము అల్లాహ్ ను (నీతో మాట్లాడుతూ ఉండగా) కళ్ళారా చూడనంతవరకు, నీ మాటలను ఎంతమాత్రం విశ్వసించము.’’ అదే సమయంలో మీరు చూస్తూ ఉండగానే, ఒక భయంకరమైన పిడుగు మీపై పడిరది. మీరంతా నిర్జీవులై నేలకొరిగారు. మళ్ళీ మేము ప్రాణం పోసి మిమ్మల్ని లేపాము, కనీసం ఈ ఉపకారం తరువాతైనా మీరు కృతజ్ఞత చూపుతారేమో అని.
2. అల్ బఖర
57
మేము మీపై మేఘాల ఛాయను కల్పించాము. మన్న్, సల్వాలను మీ కొరకు ఆహారంగా దించి, ‘‘మేము మీకు ప్రసాదించిన వాటిలో పరిశుభ్రమూ, పరిశుద్ధమూ అయిన వస్తువులను తినండి’’ అని చెప్పాము. (అయినప్పటికీ మీ పూర్వీకులు మా ఆజ్ఞలను ఉల్లంఘించారు) అయితే వారు మాకు ఏమాత్రం అన్యాయం చేయలేదు. తమకు తామే అన్యాయం చేసుకున్నారు.
2. అల్ బఖర
58
- 59 గుర్తుకు తెచ్చుకోండి, మేము మీతో ఇలా అన్నాము : ‘‘(మీ ముందు ఉన్న) ఈ నగరంలో ప్రవేశించండి. అక్కడ పండే పంటలను మీ ఇష్టానుసారం తృప్తిగా తినండి. కాని వినమ్రులై తలవంచుతూ నగర ద్వారంలో ప్రవేశించాలి. ‘హిత్తతున్, హిత్తతున్’ అంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడు మేము మీరు చేసిన తప్పులను మన్నిస్తాము. సజ్జనులను అత్యధికంగా అనుగ్రహిస్తాము.’’ కాని దుర్మార్గులు మేము వారితో అన్న మాటలను సమూలంగా మార్చివేశారు. కనుక దుర్మార్గం చేసిన వారిపై మేము ఆకాశం నుండి ఆపదను దింపాము. ఇది వారు చూపుతూ వచ్చిన అవిధేయతలకు శిక్ష.
2. అల్ బఖర
60
జ్ఞాపకం తెచ్చుకోండి, మూసా తన ప్రజల కొరకు నీటికోసం ప్రార్థించినప్పుడు, మేము ‘‘నీవు ఆ కొండ రాతిని నీ చేతి కర్రతో కొట్టు’’ అని ఆదేశించాము. తదనుగుణంగా కొండరాయి నుండి పన్నెండు ఊటలు పెల్లుబికాయి. ప్రతి తెగవారు తమ నీరు త్రాగే స్థలాన్ని కనుగొన్నారు. (అప్పుడు వారికి ఈ విధంగా ఆదేశించబడిరది) ‘‘అల్లాహ్ మీకు ప్రసాదించిన దానిని తినండి, త్రాగండి. కాని ధరణిపై కల్లోలం రేకెత్తిస్తూ తిరగకండి.’’
2. అల్ బఖర
61
మీరు మూసాకు చేసిన ఫిర్యాదును జ్ఞాపకం తెచ్చుకోండి. ‘‘ఒకే రకమైన భోజనాన్ని మేము భరించలేకుండా ఉన్నాము. భూమిలో ఉత్పత్తి అయ్యే ఆకుకూరలు, కూరగాయలు, గోధుమలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పప్పు దినుసులు మొదలైనవి మా కొరకు పండిరచు అని నీవు నీ ప్రభువును ప్రార్థించు.’’ అప్పుడు మూసా ఇలా అడిగాడు : ‘‘శ్రేష్ఠమైన దానికి బదులుగా నీచమైనదానిని కోరుకుంటున్నారా? సరే, మంచిది. ఏదో ఒక పట్టణానికి మీరంతా తరలిపొండి. అక్కడ మీరు కోరేదంతా దొరుకుతుంది.’’ చివరకు వారు తీవ్ర అవమానానికీ, పరాభవానికీ, దురవస్థకూ, దుర్భర దారిద్య్రానికీ గురిఅయ్యారు. ఇంకా వారు అల్లాహ్ ఆగ్రహానికి అర్హులయ్యారు. అదంతా వారు అల్లాహ్ ఆయతులను తిరస్కరించినదాని ఫలితం
ప్రవక్తలను అన్యాయంగా చంపినదాని ఫలం
అల్లాహ్ పట్ల అవిధేయత చూపినదాని పరిణామం
షరీయత్తు హద్దులను మాటిమాటికీ అతిక్రమించినదాని పర్యవసానం.
2. అల్ బఖర
62
అరేబియా ప్రవక్త (ముహమ్మద్)ను విశ్వసించేవారుకానీ, యూదులుకానీ, క్రైస్తవులుకానీ, సాబియీలుకానీ - ఎవరైనాసరే - అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించి మంచి పనులు చేసినవారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది. వారికి ఏ విధమైన భయంకానీ, విచారంకానీ కలిగే అవకాశం లేదు.
2. అల్ బఖర
63
- 64 మేము తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీ చేత చేయించిన ప్రమాణాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడు ‘‘మేము మీకు ప్రసాదిస్తున్న గ్రంథాన్ని దృఢంగా పట్టుకోండి, అందులో ఉన్న ఆజ్ఞలను, ఉపదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి. దీని ద్వారానే మీరు భయభక్తుల బాటలో నడువగలరు’’ అని బోధించాము. కాని తరువాత మీరు ఆ ఒడంబడికను త్రోసిరాజన్నారు. అయినప్పటికీ అల్లాహ్ మిమ్మల్ని తన అనుగ్రహానికీ, కారుణ్యానికీ దూరం చెయ్యలేదు. లేకపోతే మీరు ఎప్పుడో వినాశానికి గురిఅయి ఉండేవారు.
2. అల్ బఖర
65
- 66 సబ్బత్ శాసనం ఉల్లంఘించిన మీ వారి గాధ మీకు బాగా తెలుసు. మేము వారిని ‘‘అందరూ అసహ్యంగా, నీచంగా చూసే కోతులుగా మారిపోండి’’ అని శపించాము. ఈ విధంగా మేము వారి ముగింపును ఆ కాలం వారికీ, భావితరాల వారికీ ఒక గుణపాఠంగానూ, భయభక్తులు కలవారికి ఒక హితోపదేశంగానూ చేశాము.
2. అల్ బఖర
67
- 71 ఈ సంఘటనను కూడ గుర్తుకు తెచ్చుకోండి : మూసా తన జాతివారితో, ‘‘అల్లాహ్ మిమ్మల్ని ఒక గోవును బలిగా ఇవ్వండి అని ఆజ్ఞాపిస్తున్నాడు’’ అని అన్నప్పుడు వారు ‘‘మాతో నీవు పరిహాసమాడుతున్నావా?’’ అని బదులు పలికారు. ‘‘అవివేకుల మాదిరిగా నేనూ మాట్లాడకుండా నన్ను రక్షించు అని అల్లాహ్ ను శరణు వేడుకుంటున్నాను’’ అని మూసా అన్నాడు. అప్పుడు వారు, ‘‘సరే, ఆ ఆవును గురించి వివరంగా మాకు చెప్పు అని నీవు నీ ప్రభువును అడుగు’’ అని మూసాను కోరారు. అతను ఇలా సమాధానం చెప్పాడు : ‘‘అది ముసలిదీ కాదు, లేగదూడా కాదు. మధ్య వయస్సులో ఉన్న ఆవు అయివుండాలి అని అల్లాహ్ అంటున్నాడు. కనుక ఆజ్ఞాపించిన విధంగా చెయ్యండి.’’ వారు ఇంకా అడిగారు : ‘‘దాని రంగు ఏదయి ఉండాలో నీ ప్రభువును అడిగి మాకు చెప్పు.’’ మూసా, ‘‘అది మెరిసే పసుపువన్నె కలిగి చూసేవారికి మనోహరంగా కన్పించాలి అని అల్లాహ్ ఆజ్ఞ’’ అని వారికి తెలిపాడు. మళ్ళీ వారు ఇలా అన్నారు : ‘‘అసలు ఏ విధమైన ఆవు కావాలో నీ ప్రభువును అడిగి మాకు స్పష్టంగా తెలుపు. దానిని నిర్ణయించటంలో మాకు సందేహం కలిగింది. అల్లాహ్ కోరితే మేము దానిని కనుగొంటాము.’’ మూసా, ‘‘అది ఏ కృషీ చెయ్యనిదై భూమి దున్ననిదై మోట లాగనిదై ఏ లోపమూ లేనిదై పరిపూర్ణారోగ్యము కలిగినదై ఉండాలి అని అల్లాహ్ అంటున్నాడు’’ అని వారికి జవాబు చెప్పాడు. ‘‘ఆ! అర్థమయింది. నీవు ఇప్పుడు సరిjైున గుర్తులు చెప్పావు’’ అని వారు పలికారు. అప్పుడు వారు ఆవును బలి ఇచ్చారు. లేకపోతే వారు అలా చేసేవారు కాదు.
2. అల్ బఖర 72 - 74 మరొక సంఘటనను కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి : మీరు ఒక వ్యక్తిని హత్య చేశారు. దానిని గురించి మీలో మీరు వాదులాడుకుంటూ, హత్యానేరాన్ని ఒకళ్ళపైనొకళ్ళు మోపుకోవటం ప్రారంభించారు. కాని మీరు గుప్తంగా ఉంచుతున్న దానిని బట్టబయలు చెయ్యటానికే అల్లాహ్ నిర్ణయం చేశాడు. కనుక మేము ‘‘హతుని శవాన్ని దాని ఒక భాగంతో కొట్టండి’’ అని వారిని ఆజ్ఞాపించాము. చూడండి! మృతులను అల్లాహ్ ఎలా బ్రతికిస్తాడో
మీరు అర్థం చేసుకోవాలని తన సూచనలను మీకు ఎలా చూపుతాడో. కాని, ఈ సూచనలను చూసిన తరువాత కూడా మీ హృదయాలు కఠినమైపోయాయి - పాషాణాల మాదిరిగా, కాదు వాటికంటే కూడా కఠినమైపోయాయి. ఎందుకంటే రాళ్ళల్లో కొన్నింటినుండి సెలయేళ్ళు ప్రవహిస్తాయి. కొన్ని పగలగా వాటి నుండి నీరు చిమ్ముతుంది. మరికొన్ని అల్లాహ్ కు భయపడి కంపించి నేలకొరుగుతాయి - జాగ్రత్త! మీరు చేస్తున్నదంతా అల్లాహ్ కు తెలియకుండా లేదు.
2. అల్ బఖర
75
- 82 ముస్లిములారా! వారు మీ సందేశాన్ని విశ్వసిస్తారనే ఇంకా మీరు ఆశిస్తున్నారా? వాస్తవానికి వారిలోని ఒక వర్గానికి, అల్లాహ్ ప్రవచనం విని బాగా అర్థం చేసుకుంటూనే, బుద్ధిపూర్వకంగా దానిని తారుమారు చేసే అలవాటు ఉంది. (ప్రవక్త ముహమ్మద్ను) విశ్వసించిన వారిని వారు కలసినప్పుడు, ‘‘మేమూ ఆయనను విశ్వసించాము’’ అని అంటారు. కాని వారు ఏకాంతంగా ఒకరినొకరు కలసినప్పుడు, ‘‘మీకేమన్నా బుద్ధి ఉందా? అల్లాహ్ మీకు స్పష్టంచేసిన విషయాలను వారిముందు ఎందుకు వెల్లడిచేస్తారు? మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాటిని నిదర్శనాలుగా వారు వినియోగించటానికా?’’ అని అంటారు. వారు దాచేదంతా, వెల్లడిచేసేదంతా, అల్లాహ్ కు తెలుసని వారికి నిజంగానే తెలియదా? వారిలో నిరక్షరాస్యుల వర్గం మరొకటి ఉంది. వారికి గ్రంథజ్ఞానం ఎంతమాత్రం లేదు. లేనిపోని ఆశలను, కోరికలను పెంచుకుని కేవలం వట్టి ఊహలతో జీవిస్తూ పోతున్నారు.
షరీయత్తు గ్రంథాన్ని
స్వహస్తాలతో రచించి, తద్వారా తుచ్ఛప్రయోజనం పొందే నిమిత్తం, ‘‘ఇది అల్లాహ్ వద్దనుండి వచ్చింది’’ అని ప్రజలకు చెప్పేవారికి వినాశం తప్పదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడ వారి వినాశానికి దారితీస్తుంది
వారి ఈ సంపాదన కూడ వారి సర్వనాశనానికి కారణభూతం అవుతుంది. ఇంకా వారు ‘‘నరక జ్వాలలు మమ్మల్ని ఏమాత్రం ముట్టుకోవు. ఒకవేళ మాకు శిక్ష పడినప్పటికీ అది కేవలం కొన్ని రోజులు మాత్రమే’’ అని అంటారు. వారిని అడగండి, ‘‘అల్లాహ్ నుండి మీరేమన్నా వాగ్దానం పొందారా ఆయన దాన్ని భంగం చెయ్యలేకపోవటానికి? లేక అల్లాహ్ బాధ్యత వహించినట్లు మీకు తెలియని విషయాలను మీరు అల్లాహ్ కు ఆపాదించి చెబుతున్నారా? అసలు నరకాగ్ని మిమ్మల్ని ఎందుకు ముట్టుకోదు?’’ పాపం సంపాదించి, పాపజాలంలోనే ఇరుక్కుపోయేవారు నరకవాసులు. వారు నరకంలోనే శాశ్వతంగా ఉంటారు. విశ్వసించి, మంచి పనులు చేసేవారే స్వర్గవాసులు. వారు స్వర్గంలోనే శాశ్వతంగా ఉంటారు.
2. అల్ బఖర
83
- 86 మేము ఇస్రాయీలు సంతానం నుండి మరొక వాగ్దానం తీసుకున్నాము. దానిని కూడా జ్ఞాపకం తెచ్చుకోండి : ‘‘అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రులను, బంధువులను, అనాథులను, నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో పలుకరించాలి. నమాజును స్థాపించాలి. జకాత్ ఇవ్వాలి.’’ కాని కొందరు తప్ప మీరంతా వాగ్దానభంగం చేశారు. ఇప్పటికీ మీరు దానిని లక్ష్యపెట్టటం లేదు. మేము మీ నుండి తీసుకున్న మరొక వాగ్దానాన్ని గుర్తుకు తెచ్చుకోండి: ‘‘మీరు ఒకరి నొకరు చంపుకోరాదు. గృహాల నుండి బహిష్కరించుకోరాదు.’’ దానిని మీరు అంగీకరించారు. దానికి మీరే స్వయంగా సాక్షులు. కాని మీరే నేడు మీ సోదరులను సంహరిస్తున్నారు. మీలోని ఒక వర్గం వారిని మీరు వారి ఇండ్లనుండి బహిష్కరిస్తున్నారు. దౌర్జన్యంగా, అన్యాయంగా, మీరు వారికి వ్యతిరేకంగా ముఠాలను కడుతున్నారు. వారు మీ వద్దకు యుద్ధఖైదీలుగా వచ్చినప్పుడు వారి విమోచన ధనం విషయంలో మీరు బేరం చేస్తున్నారు. అసలు మీరు వారిని ఇళ్ళనుండి బహిష్కరించటమే అధర్మం. మీరు దైవ గ్రంథంలోని ఒక భాగాన్ని విశ్వసించి, మరొక భాగాన్ని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసేవారిని ఇహలోక జీవితంలో ఘోర అవమానానికీ, పరలోకంలో తీవ్రమైన బాధకూ గురిచెయ్యటం తప్ప మరొక శిక్ష ఏముంటుంది? మీ చేష్టలు అల్లాహ్ కు తెలియకుండా లేవు, జాగ్రత్త! పరలోకాన్ని విక్రయించి దానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కొనుక్కున్నవారు వీరే! కనుక వారికి పడే శిక్షా తగ్గదు
వారికి ఏ సహాయమూ లభించదు.
2. అల్ బఖర
87
- 90 మేము మూసాకు దివ్య గ్రంథం ప్రసాదించాము. అతని తరువాత వరుసగా ప్రవక్తలను పంపాము. చివరకు మర్యమ్ కుమారుడైన ఈసాకు స్పష్టమైన సూచనలు ఇచ్చి పంపాము. పరిశుద్ధాత్మ ద్వారా అతనికి సహాయం చేశాము. మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దానిని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వచ్చినప్పుడు, మీరు ఆయన పట్ల తలబిరుసుతనంతో ప్రవర్తించారు. కొందరిని తిరస్కరించారు. మరికొందరిని చంపారు. ఇదేమి వైఖరి? - వారు, ‘‘మా హృదయాలు సురక్షితంగా ఉన్నాయి’’
అని అంటారు. కాదు, అది నిజం కాదు. అసలు విషయం ఏమిటంటే, వారి అవిశ్వాస వైఖరి కారణంగా అల్లాహ్ వారిని శపించాడు. కనుక వారు విశ్వసించటం అనేది కాని పని. అల్లాహ్ నుండి వారి వద్దకు ఇప్పుడు వచ్చిన గ్రంథం పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంది? వారి వద్ద పూర్వం నుండే ఉన్న దైవ గ్రంథాన్ని ఈ గ్రంథం ధ్రువీకరిస్తున్నప్పటికీ, దీని రాకకు ముందు అవిశ్వాసులపై విజయం ప్రసాదించు అని వారు ప్రార్థిస్తూ వచ్చినప్పటికీ, తీరా అది వచ్చిన తరువాత వారు దానిని గుర్తించి కూడా తిరస్కరించారు. అటువంటి తిరస్కారులపై అల్లాహ్ శాపం అవతరించుగాక! తమ హృదయాలను తృప్తిపరచటానికి వారు అనుసరించే మార్గం ఎంత నీచమైనది? అల్లాహ్ తన ఇష్టానుసారం తన దాసులలోని ఒకరిపై తన అనుగ్రహం అవతరింపచేశాడనే ద్వేషం వల్ల వారు అల్లాహ్ పంపిన ఆ ఉపదేశాలను తిరస్కరిస్తున్నారు. కనుక వారు ఆగ్రహంపై ఆగ్రహానికి గురి అయ్యారు. ఇటువంటి అవిశ్వాసులకు తీవ్రపరాభవంతో కూడుకున్న శిక్ష పడుతుంది.
2. అల్ బఖర
91
- 93 వారితో, ‘‘అల్లాహ్ అవతరింపచేసిన దానిని విశ్వసించండి’’ అని అన్నప్పుడు ‘‘మా (ఇస్రాయీలు వంశం లోనివారి) వద్దకు వచ్చిన దానిని మాత్రమే మేము విశ్వసిస్తాము’’ అని అంటారు. తమ గ్రంథం కానటువంటి ప్రతి దానినీ, అది సత్యమైనప్పటికీ, వారివద్ద పూర్వం నుండే ఉన్న దానిని అది ధ్రువీకరిస్తున్నప్పటికీ, వారు దానిని తిరస్కరిస్తారు. సరే, వారిని ఇలా అడుగు :
‘‘మీ వద్దకు వచ్చిన దానినే మీరు మన్ణపూర్వకంగా విశ్వసించే వారే అయితే, ఇంతకు పూర్వం (ఇస్రాయీలు వంశంలో పుట్టిన) అల్లాహ్ ప్రవక్తలను ఎందుకు హత్య చేస్తూ వచ్చారు? ఎంత స్పష్టంగా ఉన్న సూచనలను మూసా మీ వద్దకు తీసుకు వచ్చాడు! అతను కొంచెం అటుపోగానే, మీరు ఆవు దూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఎంత దుర్మార్గులు మీరు! మేము తూర్ పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీతో చేయించిన ప్రమాణాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి : ‘‘మేము మీకు చేస్తున్న ఉపదేశాలను స్థిరంగా పాటించండి, జాగ్రత్తగా వినండి’’ అని మేము నొక్కి చెప్పాము. మీ పూర్వీకులు, ‘‘మేము విన్నాము, కాని శిరసావహించేది లేదు’’ అని చెప్పారు. అసత్యారాధనవల్ల వారి హృదయాలు ఆవుదూడ మీది ప్రేమతో నిండిపోయాయి. (ముహమ్మద్!) వారితో ఇలా చెప్పు, ‘‘మీరు విశ్వాసులే అయితే, ఈ చెడు చేష్టలను చెయ్యండి అని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా విచిత్రమైనది.’’
2. అల్ బఖర
94
- 96 ఇంకా వారిని ఇలా అడుగు : ‘‘ఒకవేళ అల్లాహ్ వద్ద, పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం మీకు మాత్రమే ప్రత్యేకించబడితే, మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే మీరు మరణాన్ని తప్పక కోరాలి.’’ - వారు ఎప్పటికీ మరణాన్ని కోరరు అనే విషయాన్ని నమ్ము. ఎందుకంటే, వారు స్వహస్తాలతో సంపాదించి అక్కడకు పంపినదాని కారణంగా (వారు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడరు). ఈ దుర్మార్గుల మనస్తత్వం అల్లాహ్ కు బాగా తెలుసు. జీవితం పట్ల అందరికంటే ఎక్కువ వ్యామోహం వీరిలోనే ఉందనే విషయం నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రిక్కులనే మించిపోయారు. వారిలోని ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒక విధంగా వేయి సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు. కాని దీర్ఘాయుర్దాయం వారిని శిక్ష నుండి ఎంతమాత్రం తప్పించలేదు. వారు ఏయే పనులు చేస్తున్నారో వాటిని అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు.
2. అల్ బఖర 97 - 98 ప్రవక్తా! వారితో ఇంకా ఇలా చెప్పు : ‘‘జిబ్రీల్ పట్ల విరోధం ఉన్న ప్రతివాడూ ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లాహ్ ఆజ్ఞతోనే అతను ఈ ఖురానును నీ హృదయ ఫలకంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలనూ అది ధ్రువీకరిస్తుంది. అవి నిజమని బలపరుస్తుంది. విశ్వసించే వారికి అది హితోపదేశం
సాఫల్యం సిద్ధిస్తుందని తెలిపే శుభవార్త. (జిబ్రీలు పట్ల వారికున్న విరోధానికి కారణం ఇదే అయితే, వారికి ఇలా తెలుపు) : అల్లాహ్ కు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీలుకు, మికాయీలుకు ఎవరు శత్రువులో, అటువంటి అవిశ్వాసులకు అల్లాహ్ శత్రువు.’’
2. అల్ బఖర
99
- 103 సత్యాన్ని స్పష్టంగా ప్రకటించే వాక్యాలను మేము నీపై అవతరింపజేశాము. అవిధేయులు తప్ప మరెవ్వరూ వాటిని తిరస్కరించరు. వారు ఏదైనా వాగ్దానం చేసినప్పుడల్లా, వారిలోని ఏదో ఒక వర్గం దానిని త్రోసిపుచ్చటం ఎల్లప్పుడూ జరుగుతూ రాలేదా? అంతేకాదు, మన్ణపూర్వకంగా విశ్వసించనివారు చాలామంది వారిలో ఉన్నారు. వారివద్ద పూర్వం నుంచే ఉన్న దైవ గ్రంథాన్ని ధ్రువపరుస్తూ ఏ ప్రవక్త అయినా అల్లాహ్ తరఫు నుండి వచ్చినప్పుడు, గ్రంథ ప్రజలలోని ఒక వర్గం వారు అల్లాహ్ గ్రంథాన్ని, దానిని గురించి ఏమీ తెలియనివారుగా త్రోసిపుచ్చారు. సులైమాను రాజ్యం పేరు చెప్పి షైతానులు ప్రచారం చేసే విషయాలను వారు అనుసరించసాగారు. కాని వాస్తవంగా సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు. అసలు అవిశ్వాసానికి పాల్పడిరది ప్రజలకు చేతబడిని బోధించే షైతానులే. వారు హారూత్, మారూత్ అనే ఇద్దరు దైవదూతలపై బాబిలోనియాలో అవతరింపచేసిన దానివెంట పడ్డారు. ఎవడికైనా ఆ విద్యను నేర్పినప్పుడు ఆ దైవదూతలు స్పష్టంగా ఇలా హెచ్చరిక చేసేవారు : ‘‘జాగ్రత్త! మేము కేవలం ఒక పరీక్ష మాత్రమే! అవిశ్వాసానికి గురికాకు.’’ అయినప్పటికీ వారు భార్యాభర్తలను వేరుచేసే విద్యను ఆ దూతల వద్ద నేర్చుకునేవారు. అల్లాహ్ అనుమతి లేకుండా వారు ఈ విద్య ద్వారా ఎవరికీ ఏమాత్రం హాని కలిగించలేరనే విషయం సుస్పష్టం. కాని వారు నేర్చుకున్నది వారికి నష్టం కలిగించేదే కాని లాభం కలిగించేది ఎంతమాత్రం కాదు. ఈ విద్యను కొనేవారికి పరలోక సౌఖ్యాలలో ఏమాత్రం భాగం లేదనే విషయం వారికి బాగా తెలుసు. ఎంత తుచ్ఛమైన సొమ్ముకు బదులుగా వారు తమ ఆత్మలను అమ్ముకున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండేది! వారు విశ్వసించి, భయభక్తుల మార్గం అవలంబించి ఉన్నట్లయితే దానికి అల్లాహ్ వద్ద వారికి లభించి ఉండే ప్రతిఫలం ఎంతో శ్రేష్ఠమయినది. దీనిని వారు గ్రహిస్తే ఎంత బాగుండేది!
2. అల్ బఖర
104
- 105 విశ్వసించిన ప్రజలారా! ‘రాయినా’ అనకూడదు, ‘ఉన్జుర్నా’ అనండి. ప్రతి మాటను శ్రద్ధతో వినండి. ఈ అవిశ్వాసులు అత్యంత ఘోరమైన శిక్షకు అర్హులు. సత్య సందేశాన్ని తిరస్కరించినవారు గ్రంథ ప్రజలయినా లేక ముష్రిక్కులయినా వారికి మీపై మీ ప్రభువు తరఫు నుండి ఏ మేలూ అవతరించటం సుతరామూ ఇష్టం లేదు. కాని అల్లాహ్ తాను కోరిన వారిని తన కరుణ కొరకు ఎన్నుకుంటాడు. అల్లాహ్ అమితంగా అనుగ్రహించేవాడు.
2. అల్ బఖర
106
- 107 మేము మా ప్రవచనం ఒక దానిని రద్దు చేసినా లేక మరపింపచేసినా దాని స్థానంలో దానికంటే శ్రేష్ఠమైన దానిని లేక కనీసం దానితో సమానమైన దానిని తీసుకువస్తాము. అన్నింటిమీద అల్లాహ్ కు సర్వాధికారాలున్న విషయం మీకు తెలియదా? భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందుతుందని, ఆయన తప్ప మిమ్మల్ని సంరక్షించేవారు, మీకు సహాయం చేసేవారు మరెవ్వరూ లేరనే సంగతి మీకు తెలియదా?
2. అల్ బఖర
108 - 110 పూర్వం మూసాను అడిగిన ప్రశ్నలవంటి వాటినే మీరు మీ ప్రవక్తను అడుగుదామనుకుంటున్నారా? వాస్తవానికి విశ్వాస వైఖరిని అవిశ్వాస వైఖరిగా మార్చుకున్నవాడు సన్మార్గం తప్పుతాడు. గ్రంథ ప్రజలలోని పలువురు మిమ్మల్ని ఏదో ఒక విధంగా విశ్వాస మార్గం నుండి మరల్చి మళ్ళీ అవిశ్వాస మార్గం వైపునకు తీసుకుపోదామని కోరుతున్నారు. సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ వారి ఈ కోరికకు కారణం వారి మనస్సులలో ఉన్న అసూయ. అయితే అల్లాహ్ తన తీర్పును అమలుపరిచే వరకు మీరు సహించి వారిని క్షమించండి. మీరు నిశ్చింతగా ఉండండి. అల్లాహ్ కు అన్నింటి మీద సర్వాధికారాలు ఉన్నాయి. నమాజును స్థాపించండి. జకాత్ ఇవ్వండి. మీ భవిష్యత్తుకోసం మీరు చేసి ముందుగా పంపించే సత్కార్యాలను మీరు అల్లాహ్ వద్ద చూస్తారు. మీరు చేసేదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది.
2. అల్ బఖర
111
- 112 ‘‘యూదులు కాని వారెవ్వరూ లేక (కైస్తవుల ప్రకారం) క్రైస్తవులు కానివారెవ్వరూ స్వర్గంలో ప్రవేశించలేరు’’ అని వారు ప్రకటిస్తారు. ఇవి వారి కాంక్షలు మాత్రమే. వారిని ఇలా అడుగు : ‘‘మీరు అనేది సత్యమే అయితే, దానికి నిదర్శనాలేమిటో చూపండి.’’ (అసలు మీలోగాని, మరెవ్వరిలోగానీ ఏ విధమైన ప్రత్యేకత లేదు). వాస్తవమేమిటంటే, ఎవరు తమను తాము అల్లాహ్ పట్ల విధేయతకు అంకితం చేసుకుని, ఆచరణలో సన్మార్గం అవలంబిస్తారో, దానికి వారు తమ ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం పొందుతారు. అటువంటి వారికి భయంకాని, ద్ణుఖం కాని కలిగే అవకాశం ఎంతమాత్రం లేదు.
2. అల్ బఖర
113
క్రైస్తవుల వద్ద (సత్యమనేది) ఏమీ లేదు అని యూదులు అంటారు. యూదుల వద్ద (సత్యమనేది) ఏమీలేదు అని క్రైస్తవులు అంటారు - కాని వారు ఉభయులూ చదివేది దైవ గ్రంథమే! గ్రంథ జ్ఞానం లేనివాళ్ళు కూడ ఇదేవిధంగా ప్రగల్భాలు పలుకుతారు. వీరందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి నిశ్చయంగా అల్లాహ్ ప్రళయదినం నాడు తీర్పు చెపుతాడు.
2. అల్ బఖర
114
అల్లాహ్ ఆరాధనాలయాలలో ఆయన నామ సంస్మరణను నిషేధించి, వాటి వినాశానికి ఒడికట్టే వానికంటె పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు ఆ ఆరాధనాలయాలలో అడుగు పెట్టటానికి అర్హులు కారు. ఒకవేళ వారు వాటిలో ప్రవేశించినా, భయపడుతూ ప్రవేశించాలి. కాని వారికి ప్రపంచంలో తీవ్రపరాభవమూ, పరలోకంలో ఘోరశిక్షా తప్పవు.
2. అల్ బఖర
115
ప్రాక్పశ్చిమాలన్నీ అల్హాహ్వే. మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు త్రిప్పినా, అక్కడ మీకు అల్లాహ్ సమ్ముఖం లభిస్తుంది. అల్లాహ్ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన అంతా తెలిసినవాడు.
2. అల్ బఖర
116
- 117 అల్లాహ్ ఒకరిని తన కుమారుడుగా చేసుకున్నాడు అని వారు అంటారు. కాని అల్లాహ్ ఆ విషయాలకు అతీతుడు. ఆయన అత్యంత పవిత్రుడు. అసలు యథార్థం ఏమిటంటే, భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయన సొంతమే! అవన్నీ ఆయన యెడల విధేయతకు అంకితమైనవే! ఆయన ఆకాశాలకూ, భూమండలానికి సృష్టికర్త. తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆయన దానిని కేవలం ‘‘అయిపో’’ అని ఆజ్ఞాపిస్తాడు. అది వెంటనే అయిపోతుంది.
2. అల్ బఖర
118
- 119 ‘‘అల్లాహ్ స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు? లేక ఏదన్నా సూచన మా వద్దకు ఎందుకు రాదు?’’ అని అజ్ఞానులు అడుగుతారు. వారికి పూర్వం వారు కూడా ఇవే ప్రశ్నలను అడిగేవారు. (సన్మార్గం తప్పిన) వారందరి మనస్తత్వాలూ ఒక్కటే. నమ్మేవారికి మేము మా సూచనలను స్పష్టం చేశాము. (దీనికంటే స్పష్టమైన సూచన మరొకటి ఏముంటుంది?) సత్యజ్ఞానం ప్రసాదించి నిన్ను మేము శుభవార్త తెలిపేవానిగా, హెచ్చరిక చేసేవానిగా పంపాము. నరకవాసం ఎన్నుకున్న వారిని గురించి నీవు ఎంతమాత్రం బాధ్యుడవు, జవాబుదారుడవు కావు.
2. అల్ బఖర
120
- 121 నీవు (ముహమ్మద్!) వారి విధానాన్ని అవలంబించనంతవరకు, యూదులు, క్రైస్తవులు నీవంటే సంతోషం వ్యక్తం చెయ్యరు. అల్లాహ్ చూపిన మార్గమే సరిఅయిన మార్గం అని నీవు వారికి స్పష్టం చెయ్యి. దివ్య జ్ఞానం నీ వద్దకు వచ్చిన పిపద కూడ, ఒకవేళ నీవు వారి కోరికలకు లొంగిపోతే, నిన్ను అల్లాహ్ పట్టునుండి రక్షించే మిత్రుడూ, సహాయుడూ ఎవడూ లేడు. మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు దానిని పఠించవలసిన విధంగా పఠిస్తారు. దానిని (ఖుర్ఆన్ను) వారు హృదయపూర్వకంగా విశ్వసిస్తారు. దాని యెడల తిరస్కారభావం చూపేవారే అసలు నష్టపడేవారు.
2. అల్ బఖర
122
- 123 ఇస్రాయీలు వంశీయులారా! నేను మీకు ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చెయ్యండి. ప్రపంచంలోని అన్ని జాతుల కంటే, మిమ్మల్ని నేను ఒక అత్యుత్తమమైన జాతిగా ఆదరించాను. భయపడండి ఆ దినానికి - ఆనాడు ఎవరూ ఎవరికీ ఏమాత్రమూ ఉపయోగపడరు. ఎవరినుండీ పరిహారం స్వీకరించబడదు. ఏ సిఫారసూ ఎవరికీ లాభకరం కాదు. ఇంకా, ఈ అపరాధులకు ఎక్కడ నుండీ ఏ సహాయమూ లభించదు.
2. అల్ బఖర
124
మరొక సందర్భాన్ని కూడ గుర్తుకు తెచ్చుకోండి. ఇబ్రాహీమ్ను అతని ప్రభువు కొన్ని విషయాలలో పరీక్షించాడు. వాటన్నిటిలో అతను పూర్తిగా నెగ్గాడు. అప్పుడు అతని ప్రభువు ఇలా అన్నాడు : ‘‘నేను నిన్ను మానవులందరికీ నాయకునిగా చెయ్యబోతున్నాను.’’ ఇబ్రాహీమ్ తన ప్రభువును ఇలా అడిగాడు : ‘‘ఈ నీ వాగ్దానం నా సంతానానిక్కూడా వర్తిస్తుందా?’’ అప్పుడు అల్లాహ్, ‘‘నా వాగ్దానం దుర్మార్గులైన వారికి వర్తించదు’’ అని సమాధానం చెప్పాడు.
2. అల్ బఖర
125
ఈ గృహాన్ని (కాబా) మేము మానవులందరికీ కేంద్రంగాను, శాంతి నిలయంగానూ చేశాము. ఇబ్రాహీము ఆరాధన కొరకు నిలబడిన ప్రదేశాన్ని శాశ్వతమైన నమాజు స్థలంగా చేసుకోవలసిందని ప్రజలను మేము ఆదేశించాము. ఇంకా నా ఈ గృహాన్ని, దానికి ప్రదక్షిణం చేసేవారి కొరకు, దానిలో ఏతెకాఫ్ పాటించేవారి కొరకు, రుకూ, సజ్దాలు చేసేవారి కొరకు పరిశుద్ధంగా ఉంచవలసిందని ఇబ్రాహీమును, ఇస్మాయీలును నిర్దేశించాను.
2. అల్ బఖర
126
ఆ తరువాత ఇబ్రాహీము అల్లాహ్ ను ఇలా అర్థించాడు : ‘‘ప్రభూ! ఈ నగరాన్ని సుఖశాంతుల నగరం చెయ్యి. ఈ నగర వాసులలో అల్లాహ్ ను, పరలోకాన్నీ విశ్వసించేవారికి అన్ని రకాల పండ్లు, ఫలాలు ఆహారంగా ప్రసాదించు.’’ అప్పుడు అతని ప్రభువు ఇలా జవాబు పలికాడు : ‘‘విశ్వసించని వారికి కూడ ఇహలోకపు తాత్కాలిక జీవితావసరాలను ప్రసాదిస్తాను. కాని చివరకు వారిని నరకయాతన వైపునకు ఈడుస్తాను. అది అత్యంత దుర్భరమైన నివాస స్థలం.’’
2. అల్ బఖర
127
- 129 ఇబ్రాహీము, ఇస్మాయీలు ఈ ఇంటి గోడలను ఎత్తేటప్పుడు ఈ విధంగా ప్రార్థించేవారు : ‘‘ఓ మా ప్రభూ! మా ఈ సేవను నీవు దయతో స్వీకరించు. నీవు అందరి మొరలు ఆలకించేవాడవు. అన్నీ తెలిసిన వాడవు. ప్రభూ! మా ఇద్దరినీ నీకు విధేయులుగా చేసుకో. పూర్తిగా నీ విధేయతకే అంకితమయ్యే ఒక జాతిని మా సంతతి నుండి ఆవిర్భవింపచెయ్యి. నీ ఆరాధనా రీతులను మాకు తెలుపు. మా తప్పులను మన్నించు. నీవు అమితంగా క్షమించేవాడవు
మరియు అనంతంగా కరుణించేవాడవు. ప్రభూ! నీ వాక్యాలు వారికి వినిపించి, నీ గ్రంథాన్నీ, దివ్య జ్ఞానాన్నీ వారికి బోధించి, వారి జీవితాలను తీర్చిదిద్దే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో పుట్టించు. నీవు సాటిలేని సర్వాధికారివి. అనుపమ ప్రజ్ఞాశాలివి.’’
2. అల్ బఖర 130 - 133 ఇబ్రాహీము విధానాన్ని ఇక ద్వేషించేవాడెవడు - తనను తాను అజ్ఞానానికీ, అహంభావానికీ గురిచేసుకునేవాడు తప్ప. ప్రపంచంలో మా సేవ కొరకు మేము ఎన్నుకున్న వ్యక్తి ఇబ్రాహీము. పరలోకంలో అతను సజ్జనులతో పాటు ఉంటాడు. అతను ఎలాంటివాడంటే, ‘‘ముస్లిమ్వు అయిపో’’ అని అతని ప్రభువు అతనితో అన్నప్పుడు అతను వెంటనే, ‘‘నేను విశ్వ ప్రభువు యొక్క ‘ముస్లిమ్ను’ అయిపోయాను’’ అని జవాబు పలికాడు. ఇదే మార్గంలో నడవండి అని ఇబ్రాహీము తన సంతానానికి హితోపదేశం చేశాడు. ఈ ఉపదేశాన్నే యాఖూబ్ కూడా తన సంతానానికి చేశాడు : ‘‘నా బిడ్డలారా! ఈ ధర్మాన్నే అల్లాహ్ మీ కొరకు ఎన్నిక చేశాడు. కనుక మీరు మరణించే వరకూ ముస్లిములుగానే ఉండండి.’’ యాఖూబు మృత్యు దశలో ఉన్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? మరణించే ముందు అతను తన కుమారులను ఇలా అడిగాడు : ‘‘బిడ్డలారా! నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?’’ వారంతా ఇలా సమాధానం చెప్పారు : ‘‘మీరూ, మీ పెద్దలైన ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖ్ దేవుడుగా భావించిన ఆ ఏకైక దేవుణ్ణే మేమూ ఆరాధిస్తాము. మేము ఆయనకే ముస్లిములమై ఉంటాము.’’
2. అల్ బఖర
134
వారంతా గతించిన ఒక సంఘం, వారు సంపాదించింది వారిది. మీరు సంపాదించేది మీది. వారు చేసినదాన్ని గురించి మిమ్మల్ని అడగటం జరగదు.
2. అల్ బఖర
135
- 136 ‘‘యూదులుగా మారితేనే రుజుమార్గం లభిస్తుంది’’ అని యూదులు అంటారు. ‘‘క్రైస్తవులుగా మారితేనే ధర్మమార్గం పొందగలుగుతారు’’ అని క్రైస్తవులు అంటారు. మీరు వారితో ఇలా అనండి : ‘‘కాదు, మేము అన్ని మార్గాలను విసర్జించి, ఒక్క ఇబ్రాహీము మార్గాన్నే అనుసరిస్తాము. ఇబ్రాహీము ముష్రిక్కులలోని వాడు కాదు.’’ ముస్లిములారా! ఇలా ప్రకటించండి : ‘‘మేమంతా అల్లాహ్ ను, ఆయన మా వైపునకు పంపిన హితోపదేశాన్నీ విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాఖూబు, యాఖూబు సంతానంపై అవతరించినదానినీ మూసాకూ, ఈసాకూ ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు ప్రసాదించిన దానినీ మేము విశ్వసించాము. వారిలో ఏ ఒక్కరిపట్లా మేము భేదభావం చూపము. మమ్మల్ని మేము ముస్లిములుగా అల్లాహ్ కు సమర్పించుకున్నాము.’’
2. అల్ బఖర
137
మీరు విశ్వసించినట్లే వారూ విశ్వసిస్తే, అప్పుడు వారు ధర్మమార్గంలో ఉన్నట్లు. కాని, వారు ఒకవేళ దీనికి వైముఖ్యం చూపితే, కేవలం వైషమ్యంతో మంకుపట్టు పడుతున్నారన్నది విశదము. కనుక వారి బారినుండి మిమ్మల్ని ఆదుకునేందుకు అల్లాహ్ చాలు. మీరు నిశ్చింతగా ఉండండి. ఆయన అన్నీ వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు.
2. అల్ బఖర
138
వారితో ఇలా చెప్పండి : ‘‘అల్లాహ్ రంగును స్వీకరించండి. అల్లాహ్ రంగు కంటె మరెవరి రంగు శ్రేష్ఠతరమైనది? మేము కేవలం ఆయననే ఆరాధిస్తాము.’’
2. అల్ బఖర
139
- 141 ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘అల్లాహ్ విషయంలో మీరు మాతో వాదులాడుతారా? వాస్తవానికి ఆయనే మాకూ ప్రభువు, మీకూ ప్రభువు. మా కర్మలు మాకు, మీ కర్మలు మీకు. మేమయితే మా దాస్యాన్ని కేవలం అల్లాహ్ కే ప్రత్యేకం చేసుకున్నాము. లేకపోతే ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్హాఖు, యాఖూబు, యాఖూబ్ సంతానము - వీరంతా యూదులని లేక క్రైస్తవులని మీరు అంటారా?’’ ఇలా అడుగు : ‘‘మీకు బాగా తెలుసా లేక అల్హాహ్కా?’’ అల్లాహ్ అప్పగించిన సాక్ష్యాన్ని దాచే వ్యక్తికంటే పరమ దుర్మార్గుడు ఎవడు? మీ చేష్టలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. వారంతా గతించిన ఒక సంఘం. వారి సంపాదన వారిది. మీ సంపాదన మీది. వారి కర్మలను గురించి మిమ్మల్ని ప్రశ్నించటం సంభవించదు.
2. అల్ బఖర
142
- 143 మూర్ఖజనులు ఇలా అంటారు : ‘‘పూర్వం ఏ ఖిబ్లా వైపునకు తిరిగి వారు నమాజు చేసేవారో, దాని నుండి ఇంత అకస్మాత్తుగా మరలటానికి కారణం?’’ ప్రవక్తా! వారితో ఇలా అను : ‘‘ప్రాక్పశ్చిమాలు అన్నీ అల్హాహ్వే. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు.’’ ఈవిధంగా మేము మిమ్మల్ని ఒక ‘‘మధ్యస్థ సమాజం’’గా చేశాము. ఇకపై మీరు సమస్త మానవజాతికి సాక్షులుగా ఉంటారు. ప్రవక్త మీకు సాక్షిగా ఉంటాడు...
2. అల్ బఖర
143
.... ఎవరు ప్రవక్తను అనుసరిస్తారో, ఎవరు వెనుతిరిగి పోతారో పరీక్షించాలనే మేము పూర్వం మీరు మీ ముఖాన్ని ఏ దిక్కు వైపునకు తిప్పేవారో ఆ దిక్కునే మీ ఖిబ్లాగా నిర్ణయించాము. ఇది నిజంగా ఎంతో కఠినమైన విషయం! కాని అల్లాహ్ సన్మార్గ భాగ్యం కలుగజేసిన వారికి ఇది ఏ మాత్రం కష్టతరం కాలేదు. ఈ మీ విశ్వాసాన్ని అల్లాహ్ ఏ మాత్రం వృధాకానివ్వడు. మానవుల పట్ల అల్లాహ్ కు ఎంతో కరుణ, వాత్సల్యం ఉన్నాయనే విషయాన్ని నిశ్చయంగా నమ్మండి.
2. అల్ బఖర
144
ప్రవక్తా! నీవు మాటిమాటికీ నీ ముఖాన్ని ఆకాశం వైపునకు ఎత్తటం మేము గమనిస్తూనే ఉన్నాము. ఇదిగో, నీకు అత్యంత ప్రీతికరమైన ఖిబ్లా వైపునకే ఇప్పుడు మేము నిన్ను త్రిప్పుతున్నాము. కాబట్టి నీవు ముఖాన్ని ‘మస్జిదె హరామ్’ వైపునకు త్రిప్పు. ఇకపై మీరెక్కడున్నాసరే, ముఖాన్ని ఆ వైపునకు పెట్టి నమాజు చెయ్యండి....
2. అల్ బఖర
144
- 147 .... (ఖిబ్లా మార్పునకు సంబంధించిన) ఈ ఆదేశాన్ని వారి ప్రభువే ఇచ్చాడనీ, అది సత్యం అనీ గ్రంథ ప్రజలకు బాగా తెలుసు. కాని ఇది తెలిసిన తరువాత కూడ, వారు ఏమి చేస్తున్నారో, దానిని అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. గ్రంథ ప్రజలకు నీవు ఏ నిదర్శనం చూపినా, వారు నీ ఖిబ్లాను అనుసరించటం సంభవించదు. వారి ఖిబ్లాను అనుసరించటం నీకూ సాధ్యపడదు. వారిలోని ఏ వర్గం వారు కూడా మరొకరి ఖిబ్లాను అనుసరించటానికి తయారుగా లేరు. నీవు ఈ జ్ఞానం పొందిన తరువాత కూడ, ఒకవేళ నీవు వారి కోరికలను అనుసరిస్తే, నిశ్చయంగా దుర్మార్గులలో చేరిపోతావు. మేము ఎవరికి గ్రంథం ప్రసాదించామో, వారు తమ సంతానాన్ని ఏవిధంగా గుర్తిస్తారో అదేవిధంగా (ఖిబ్లాగా నిర్ణయింపబడిన) ఈ స్థలాన్ని గుర్తిస్తారు. కాని వారిలోని ఒక వర్గం బుద్ధిపూర్వకంగా సత్యాన్ని కప్పిపుచ్చుతోంది. నిస్సందేహంగా ఇది మీ ప్రభువు నుండి వచ్చిన సత్యం. కనుక దీని విషయంలో మీరు ఏమాత్రం సంశయంలో పడకండి.
2. అల్ బఖర 148 ప్రతి ఒక్కడికి ఒక దిక్కు ఉన్నది. దాని వైపునకు అతడు తిరుగుతాడు. కనుక మీరు మంచి పనులలో మిన్నగా ఉండటానికి ప్రయత్నించండి. మీరంతా ఎక్కడున్నాసరే అల్లాహ్ మిమ్మల్ని కనుగొంటాడు. ఆయన శక్తికి అతీతమైనది ఏదీ లేదు.
2. అల్ బఖర
149
- 152 మీరు ఏ ప్రాంతంలో ప్రయాణం చేసినా, మీ ముఖాన్ని (నమాజు సమయంలో) ‘మస్జిదె హరామ్’ వైపునకు త్రిప్పండి. ఎందుకంటే ఇది మీ ప్రభువు చేసిన న్యాయమైన నిర్ణయం. మీ కర్మలను అల్లాహ్ గమనించకుండా ఉండటం లేదు. మీరు ఏ ప్రదేశంలో ప్రయాణం చేసినా, మీ ముఖాన్ని ‘మస్జిదె హరామ్’ వైపునకే త్రిప్పండి. మీరు ఎక్కడున్నాసరే, దాని వైపునకే తిరిగి నమాజు చెయ్యండి. దీనివల్ల మీకు వ్యతిరేకంగా వాదించటానికి ప్రజలకు అవకాశం లభించదు - కాని వారిలో దుర్మార్గులైన వారి నోరు ఎట్టి పరిస్థితులలోనూ ఊరుకోదు. అందుకని వారికి భయపడకండి, నాకు భయపడండి. ఇంకా నేను మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేస్తాను. మీరు నా ఈ ఆజ్ఞాపాలన ద్వారా సాఫల్య మార్గం పొందే అవకాశం ఉంది. ఆ ప్రకారంగానే (ఈ విషయాల వల్ల మీకు సాఫల్య భాగ్యం కలిగింది.) మేము మీలో నుండే ఒకరిని ప్రవక్తగా మీ మధ్యకు పంపాము. అతను మీకు మా వాక్యాలను వినిపిస్తాడు. మీ జీవితాలను తీర్చిదిద్దుతాడు. మీకు గ్రంథాన్నీ, దివ్య జ్ఞానాన్నీ బోధిస్తాడు. మీకు తెలియని ఎన్నో విషయాలు నేర్పుతాడు. కనుక మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి. నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. నాకు కృతజ్ఞతలు తెలుపండి. చేసిన మేలును మరువకండి.
2. అల్ బఖర
153
- 157 విశ్వాసులారా! సహనం ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి. సహనం కలవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు. అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని ‘మృతులు’ అనకండి. వాస్తవానికి వారు సజీవులు. కాని మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు. భయప్రమాదాలకు, ఆకలి బాధకు ధన, ప్రాణ, ఆదాయాల నష్టానికి గురిచేసి మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము. ఈ పరిస్థితులలో మన్ణస్థైర్యంతో ఉండేవారు కష్టకాలం దాపురించినప్పుడు, ‘‘మేమంతా అల్లాహ్ కే చెందినవారము. అల్లాహ్ వైపునకే మరలిపోవలసినవారము’’ అని అనేవారికి శుభవార్తలు తెలుపు. వారిపై వారి ప్రభువు తన అపూర్వ అనుగ్రహాలను కురిపిస్తాడు. ఆయన కారుణ్యచ్ఛాయలు వారికి ఆశ్రయమిస్తాయి. వారే సన్మార్గగాములు.
2. అల్ బఖర
158
సఫా మర్వాలు నిశ్చయంగా అల్లాహ్ యొక్క చిహ్నాలు. కనుక కాబా గృహానికి హజ్ కొరకు లేక ‘ఉమ్రప్ా’ కొరకు పోయేవారు, ఈ రెండు కొండల మధ్య ‘సయీ’ చేస్తే, అది దోషం ఎంతమాత్రం కాదు. స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అది అల్లాహ్ కు తెలుస్తుంది. ఆయన దానిని ఆదరిస్తాడు.
2. అల్ బఖర 159 - 160 మేము అవతరింపచేసిన స్పష్టమైన జ్ఞానబోధలు, ధర్మోపదేశాలు వాస్తవానికి మానవులందరి మార్గదర్శకత్వం కోసం అని మేము మా గ్రంథంలో విశదం చేసిన తరువాత కూడా వాటిని దాచేవారిని అల్లాహ్ తప్పకుండా శపిస్తాడు, ఇంకా శపించే వారంతా వారిని శపిస్తారు. కాని ఎవరు పశ్చాత్తాపంతో తమ ఈ వైఖరిని మార్చుకుంటారో, తమ నడవడికను సంస్కరించుకుంటారో, తాము గోప్యంగా ఉంచుతూ వచ్చినదానిని ప్రకటిస్తారో, వారిని నేను క్షమిస్తాను. నేను అమితంగా మన్నించేవాణ్ణి, అధికంగా కరుణించేవాణ్ణి.
2. అల్ బఖర 161 - 162 అవిశ్వాస వైఖరిని అవలంబించి, అవిశ్వాసులుగానే అసువులు బాసిన వారిని అల్లాహ్, ఆయన దూతలు, ఇంకా మానవులందరూ శపిస్తారు. ఆ శాపగ్రస్త స్థితిలోనే వారు సదా ఉంటారు. వారి శిక్షను తగ్గించటం కానీ, వారికి మళ్ళీ ఏ వ్యవధీ ఇవ్వటం కానీ సంభవించదు.
2. అల్ బఖర
163
- 167 మీ దేవుడు ఒక్కడే. ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. (ఈ సత్యం గ్రహించటానికి ఏవైనా గుర్తులు, తార్కాణాలు అవసరం అయితే) వివేకం ఉన్నవారికి భూమ్యాకాశాల నిర్మాణంలో, రేయింబవళ్ళు ఒకదాని వెంట ఒకటి చేసే నిరంతరమైన పయనంలో, ప్రజాబాహుళ్యానికి ఉపయోగపడే వస్తువులు మోసుకుంటూ నదులలో, సముద్రాలలో సంచరించే ఓడలలో, పైనుండి అల్లాహ్ కురిపించే వర్షపు నీటిలో - తద్వారా ఆయన మృతభూమికి ప్రాణం పోస్తాడు. (ఈ ఏర్పాటు ద్వారా) భువిలో వివిధ ప్రాణులను వర్థిల్లజేస్తాడు - వాయువుల సంచారంలో, భూమ్యాకాశాల మధ్య అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడివున్న మేఘమాలికలలో అసంఖ్యాకమైన సూచనలు కానవస్తాయి. కాని (అల్లాహ్ ఏకత్వాన్ని స్పష్టంగా, బహిరంగంగా చాటే ఇన్ని సూచనలు ఉన్నప్పటికీ) కొందరు అల్లాహ్ ను కాదని ఇతరులను ఆయనకు సమానులుగా, ప్రత్యర్థులుగా భావిస్తారు. వారు అల్హాహ్పట్ల కలిగి వుండవలసిన ప్రేమతో వారిని ప్రేమిస్తారు - కాని విశ్వాసులు అన్నిటికంటె అధికంగా అల్హాహ్నే ప్రేమిస్తారు - సర్వశక్తులూ, సర్వాధికారాలూ అల్లాహ్ గుప్పెట్లో ఉన్నాయని, ఇంకా శిక్షించంటంలో కూడా ఆయన చాలా కఠినుడు అనీ ఈ దుర్మార్గులకు, మున్ముందు ఘోరశిక్షను ప్రత్యక్షంగా చూసిన తరువాత బోధపడేబదులు, ఇప్పుడే బోధపడితే ఎంత బాగుంటుంది! అల్లాహ్ వారిని శిక్షించే సమయాన వారు ప్రపంచంలో ఏ నాయకుల, ఏ మార్గదర్శకుల అడుగు జాడలలో నడిచేవారో, ఆ నాయకులు, ఆ మార్గదర్శకులు తమ అనుచరులతో, ఏమాత్రం సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తారు. కాని వారికి శిక్షమాత్రం తప్పదు. ఇంకా వారి సకల సాధనా సంపత్తుల పరంపర తెగిపోతుంది. అప్పుడు అనుచరులు ఇలా అంటారు: ‘‘మాకు (ప్రపంచానికి మళ్ళీ తిరిగిపోయే) మరొక అవకాశం లభిస్తే, వారు ఈ రోజు మమ్మల్ని త్యజిస్తున్న విధంగానే మేమూ వారిని అప్పుడు త్యజిస్తాము.’’ఈవిధంగా ప్రపచంలో వారు చేసిన కర్మలను అల్లాహ్ వారిముందు ఉంచుతాడు. వారు అప్పుడు నిస్పృహతో, తీవ్ర అవమాన భారంతో క్రుంగిపోతారు. అయినప్పటికీ నరకాగ్ని నుండి బయటపడటం వారికి సాధ్యపడదు.
2. అల్ బఖర
168
- 169 ప్రజలారా! భూమిలోని ధర్మసమ్మతమైన, పరిశుభ్రమైన వాటినన్నింటినీ మీరు తినండి. షైతాను చూపే మార్గాలను తొక్కకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. దుర్మార్గాన్నీ, అశ్లీలాన్నీ చెయ్యండి అని వాడు మిమ్మల్ని ఆజ్ఞాపిస్తాడు. ఏ విషయాలను గురించి అయితే (అల్లాహ్ చెప్పినట్లు) మీకు తెలియదో ఆ విషయాలను అల్లాహ్ పేరుతో చెప్పండి అని మిమ్మల్ని ప్రేరేపిస్తాడు.
2. అల్ బఖర
170
- 171 ‘‘అల్లాహ్ అవతరింపచేసిన ఆదేశాలను అనుసరించండి’’ అని వారితో అన్నప్పుడు, వారు ‘‘మా పూర్వీకులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము అనుసరిస్తాము’’ అని సమాధానం చెబుతారు. వారి పూర్వీకులు జ్ఞానం లేని వారైనప్పటికీ, సన్మార్గం పొందనివారైనప్పటికీ, వారు వారినే అనుసరిస్తూ పోతారా? అల్లాహ్ చూపిన మార్గాన్ని తిరస్కరించేవారి పోలిక ఇలా ఉంది: పశువుల కాపరి పశువులను కేకవేస్తాడు. కాని అవి ఆ కేకల, అరుపుల ధ్వనిని తప్ప దేనినీ వినలేవు. వారు చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. అందుకని ఏ విషయమూ వారి బుర్రకెక్కదు.
2. అల్ బఖర
172
- 173 విశ్వసించిన ప్రజలారా! నిజంగానే మీరు అల్లాహ్ ఆరాధకులు అయితే, మేము మీకు ప్రసాదించిన పరిశుభ్రమైన వస్తువులను నిస్సంకోచంగా తినండి. అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలుపండి. అల్లాహ్ నిషేధించినవి ఏమన్నా ఉంటే అవి ఇవి మాత్రమే : మరణించిన వాటిని తినకండి. రక్తాన్ని, పందిమాంసాన్ని ముట్టకండి. ఇంకా అల్లాహ్ కు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి. కాని ఎవరైనా గత్యంతరం లేక వాటిలోని ఏ పదార్థాన్నయినా తింటే అది పాపం కాదు. అయితే నిషేధాజ్ఞను ఉల్లంఘించే ఉద్దేశ్యం ఉండకూడదు. ఇంకా అవసరానికి మించి తినకూడదు. అల్లాహ్ క్షమించేవాడూ, కరుణించేవాడూను.
2. అల్ బఖర 174 - 176 వాస్తవమేమిటంటే, అల్లాహ్ తన గ్రంథంలో ప్రవచించిన ఆజ్ఞలను దాచేవారూ, వాటిని స్వల్ప ప్రాపంచిక ప్రయోజనాల కొరకు విక్రయించేవారూ, నిశ్చయంగా తమ ఉదరాలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయదినంనాడు అల్లాహ్ వారిని ఏమాత్రం పలుకరించడు. పవిత్రులుగా పరిగణించడు. వారికి వ్యధాభరితమైన శిక్ష కలదు. సన్మార్గానికి బదులు వక్రమార్గాన్నీ, క్షమాభిక్షకు బదులు ఘోరశిక్షనూ కొనుక్కున్న వారు వీరు. ఎంత ధైర్యం వీరికి, నరక శిక్షను సైతం భరించటానికి సిద్ధంగా ఉన్నారు! ఇదంతా ఎందుకు సంభవించిందంటే అల్లాహ్ సత్యంతో కూడుకున్న గ్రంథాన్ని అవతరింపచేశాడు, కాని ఈ గ్రంథంలో విభేదాలు కల్పించినవారు తమ తగాదాలలో పడి అసలు సత్యం నుండే చాలా దూరం వెళ్ళిపోయారు.
2. అల్ బఖర 177 సత్కార్యం అంటే మీరు మీ ముఖాలను తూర్పుకో పడమరకో త్రిప్పటం కాదు. సత్కార్యం అంటే మనిషి అల్లాహ్ ను అంతిమ దినాన్నీ, దూతలనూ, అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్నీ, ఆయన ప్రవక్తలనూ హృదయపూర్వకంగా విశ్వసించటం. ఇంకా అల్లాహ్ పట్ల ప్రేమతో తాము ఎక్కువగా ఇష్టపడేధనాన్ని బంధువుల కొరకూ, అనాధుల కొరకూ, నిరుపేదల కొరకూ, బాటసారుల కొరకూ, సహాయం చెయ్యండి అని అర్థించేవారి కొరకూ, ఖైదీలను విడుదల చెయ్యటానికి వ్యయ పరచటం. ఇంకా నమాజును స్థాపించటం, జకాత్ ఇవ్వటం, వాగ్దానం చేస్తే దానిని పాలించేవారూ, కష్టకాలంలో, లేమిలో, సత్యానికీ అసత్యానికీ మధ్య జరిగే పోరాటంలో స్థైర్యం చూపేవారూ సత్పురుషులు. వాస్తవంగా సత్యసంధులు, అల్లాహ్ ఎడల భయభక్తులు కలవారు వీరే.
2. అల్ బఖర 178 - 179 విశ్వసించిన ప్రజలారా! హత్యా వ్యవహారాలలో మీ కొరకు ప్రతీకార న్యాయం నిర్ణయించబడిరది. హత్యచేసిన వ్యక్తి స్వతంత్రుడయితే, ఆ స్వతంత్రుణ్ణే శిక్షించాలి. బానిస అయితే ఆ బానిసనే వధించాలి. స్త్రీ అయితే ఆ స్త్రీనే చంపాలి. ఒకవేళ హతుని సోదరుడు హంతకుణ్ణి కనికరించదలిస్తే, న్యాయ సమ్మతంగా రక్తశుల్క నిర్ణయం జరగాలి. హంతకుడు రక్తధనాన్ని ఉత్తమ రీతిలో అతనికి చెల్లించాలి. ఇది మీ ప్రభువు నుండి మీకు లభించే సౌకర్యం, కారుణ్యం. దీని తరువాత కూడ ఈ హద్దులను అతిక్రమించేవారు ఘోరశిక్షకు గురిఅవుతారు. బుద్ధీజ్ఞానం కల ఓ మానవులారా! ఈ ప్రతీకార న్యాయం మీ సమాజానికి ఊపిరి. ఈ శాసనోల్లంఘనానికి మీరు దూరంగా ఉంటారని ఆశించబడుతోంది.
2. అల్ బఖర
180
- 182 మీలో ఎవరికైనా మరణకాలం సమీపించినప్పుడు, వారు ఆస్తిపాస్తులు కలవారైతే, తమ తల్లిదండ్రులకు, బంధువులకు న్యాయసమ్మతంగా పంచిపెడుతూ మరణ శాసనం విధిగా వ్రాయాలి. ఇది అల్లాహ్ పట్ల భయభక్తులు కలవారి విధ్యుక్త ధర్మం. ఇంకా, మరణ శాసనం విన్నవారు, తరువాత ఒకవేళ దాన్ని మార్చితే, దాని పాపమంతా ఆ మార్చిన వారిదే. అల్లాహ్ అంతా వింటాడు. ఆయనకు అన్నీ తెలుసు. కాని మరణ శాసనం చేసిన వ్యక్తి, తెలియకపోవటంవల్లనో లేక బుద్ధిపూర్వకంగానో అన్యాయం చేశాడనే అనుమానం ఎవరికైనా కలిగితే, వారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరి మధ్య రాజీ కుదిరిస్తే, అందులో ఏమాత్రం దోషం లేదు. అల్లాహ్ క్షమించేవాడూ, కరుణించేవాడూను.
2. అల్ బఖర
183
- 184 విశ్వసించిన ప్రజలారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడిరది - ఏవిధంగా మీకు పూర్వం ప్రవక్తలను అనుసరించేవారికి కూడ విధించబడిరదో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఈ ఉపవాసం కొన్ని దినాల వరకే. కాని మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులయితే లేక ప్రయాణంలో ఉంటే, వేరే దినాలలో ఆ ఉపవాస దినాలను పూర్తిచెయ్యాలి. ఉపవాసం ఉండే శక్తి కలవారు (ఒకవేళ దానిని పాటించకపోతే) పరిహారం చెల్లించాలి. ఒక ఉపవాస దినానికి పరిహారం ఒక పేదవానికి భోజనం పెట్టడం. కాని ఎవరైనా సహృదయంతో ఇంకా ఎక్కువ పుణ్యం చేస్తే, అది వారికే మేలు. అయితే మీరు విషయాన్ని గ్రహించగలిగితే, ఉపవాసం ఉండటమే మీకు ఉత్తమం.
2. అల్ బఖర 185 పవిత్ర ఖురాను అవతరించిన నెల రమజాను నెల. మానవులందరికీ (ఆ గ్రంథం) మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇక నుండి రమజాను నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి. కాని వ్యాధిగ్రస్తులైనవారు లేదా ప్రయాణంలో ఉన్నవారు, ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తిచెయ్యాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం కలుగజెయ్యాలనే అభిలషిస్తాడు. మిమ్మల్ని కష్టపెట్టాలనే తలంపు ఆయనకు లేదు. కనుక మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తిచెయ్యగలగటానికీ, అల్లాహ్ మీకు ప్రసాదించిన మహోపదేశానికి మీరు అల్లాహ్ ఔన్నత్యాన్ని కొనియాడటానికీ, ఆయనకు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈ పద్ధతి తెలుపబడుతోంది.
2. అల్ బఖర
186
నా దాసులు నన్ను గురించి నిన్ను అడిగితే, నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును వింటాను, సమాధానం పలుకుతాను అనీ, ఓ ప్రవక్తా నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశం విని దానిని స్వీకరించాలి. నన్ను విశ్వసించాలి. (ఈ విషయం నీవు వారికి వినిపించు) వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది.
2. అల్ బఖర
187
ఉపవాసకాలంలో రాత్రి సమయాలలో మీరు మీ భార్యల వద్దకు పోవడం మీకకొరకు ధర్మ సమ్మతం చెయ్యబడిరది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు, మీరు రహస్యంగా ఆత్మద్రోహానికి పాల్పడుతున్నారనే విషయం అల్లాహ్ కు తెలిసిపోయింది. అయినప్పటికీ ఆయన మీ అపరాధాన్ని క్షమించాడు, మిమ్మల్ని మన్నించాడు. ఇకనుండి మీరు మీ భార్యలతో సంభోగం చేయవచ్చు. అల్లాహ్ మీ కొరకు ధర్మసమ్మతం చేసిన సుఖానుభవాన్ని పొందండి. ఇంకా రాత్రి నలుపు రేఖల నుండి ఉషోదయపు ధవళ రేఖలు ప్రస్ఫుటమయ్యేవరకు, మీరు తినండి, త్రాగండి. ఆ తరువాత వీటన్నింటినీ త్యజించి చీకటి పడేవరకు మీ ఉపవాసం పూర్తి చెయ్యండి. కాని మసీదులలో ‘ఏతెకాఫ్’ పాటించేటప్పుడు మీరు మీ భార్యలతో సంభోగించకండి. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు. వీటి దరిదాపులకు కూడ పోకండి. ఈ విధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను ప్రజలకు స్పష్టం చేస్తాడు. తప్పుడు మార్గాల నుండి వారు తమను తాము రక్షించుకుంటారని ఆశించబడుతోంది.
2. అల్ బఖర
188
మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా కబళించకండి. బుద్ధిపూర్వకంగా, అక్రమమైనరీతిలో ఇతరుల ఆస్తిలో కొంత భాగం కాజేసే అవకాశం లభిస్తుందేమో అనే దురుద్దేశ్యంతో దానిని న్యాయనిర్ణేతల వద్దకు తీసుకునిపోకండి.
2. అల్ బఖర
189
ప్రవక్తా! తరిగే పెరిగే చంద్రుని రూపాలను గురించి ప్రజలు నిన్ను అడుగుతుంటారు. నీవు వారికి ఇలా తెలుపు : ‘‘తేదీల లెక్కకూ, హజ్ కాల నిర్ణయానికీ అవి గుర్తులు.’’ ఇంకా వారికి ఇలా చెప్పు: ‘‘మీరు మీ ఇళ్ళల్లోకి వాటి వెనుక భాగం నుండి ప్రవేశించటం సత్కార్యం ఎంతమాత్రం కాదు. దైవాగ్రహానికి దూరంగా ఉండటమే అసలు నిజమైన సత్కార్యం. కనుక మీరు వాకిళ్ళ నుండే ఇళ్ళల్లోకి ప్రవేశించండి. అయితే అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. బహుశా మీకు వాస్తవమైన సాఫల్యభాగ్యం కలుగవచ్చు.’’
2. అల్ బఖర
190
- 192 మీతో పోరాడేవారితో మీరూ అల్లాహ్ మార్గంలో పోరాడండి. కాని హద్దులు అతిక్రమించ కండి. హద్దులు అతిక్రమించే వారిని అల్లాహ్ ప్రేమించడు. మీకు వారు ఎక్కడ ఎదురైనా, మీరు వారితో పోరాడండి. మిమ్మల్ని వారు ఎక్కడనుండి పారద్రోలారో, అక్కడి నుండి మీరూ వారిని పార ద్రోలండి. చంపటం చెడ్డదే. కాని, ‘ఫిత్నా’ (పీడన) అంతకంటే చెడ్డది. ‘మస్జిదె హరామ్’ వద్ద వారు మీతో యుద్ధం చెయ్యనంత వరకు, మీరూ వారితో యుద్ధం చెయ్యకండి. కాని వారే అక్కడ కయ్యానికి కాలుదువ్వితే, మీరు వారిని చంపటానికి వెనుదీయకండి. అవిశ్వాసులకు ఇదే తగిన శిక్ష. వారు యుద్ధం చెయ్యటం మానుకుంటే (మీరూ మానండి) అల్లాహ్ క్షమించేవాడూ, కరుణించేవాడూ అనే విషయం తెలుసుకోండి.
2. అల్ బఖర
193
పీడన (ఫిత్నా) అంతమయ్యేవరకు, దైవధర్మం స్థాపించబడేవరకు మీరు వారితో యుద్ధం చేస్తూనే ఉండండి. తరువాత వారు దానిని మానుకుంటే, దౌర్జన్యపరులను తప్ప మరెవ్వరినీ శిక్షించకూడదు.
2. అల్ బఖర
194
నిషిద్ధ మాసానికి బదులు నిషిద్ధమాసమే. నిషేధాలన్నింటినీ అందరూ సమానంగా గౌరవించవలసినదే. కనుక మీపై ఎవరన్నా దాడిచేస్తే, మీరూ వారిపై అదేవిధంగా దాడిచెయ్యండి. అయితే అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. అల్లాహ్ ఏర్పరచిన హద్దులను అతిక్రమించకుండా ఉండేవారితోనే అల్లాహ్ ఉంటాడు అనే విషయం తెలుసుకోండి.
2. అల్ బఖర
195
అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. చేతులారా మిమ్మల్ని మీరు వినాశంపాలు చేసుకోకండి. మేలు చెయ్యండి. మేలు చేసేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు.
2. అల్ బఖర
196
‘హజ్’ను, ‘ఉమ్రప్ా’ను అల్లాహ్ సంతోషం కోసం చెయ్యాలని సంకల్పించుకుంటే, దానిని నెరవేర్చండి. మార్గమధ్యంలో చిక్కుకుంటే మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని అల్లాహ్ కు సమర్పించండి. ఖుర్బానీ తన స్థానం చేరనంతవరకు మీరు శిరోముండనం చేయించుకోకండి. కాని మీలో ఎవరైనా వ్యాధిగ్రస్తులై లేదా తల బాధకులోనై (ఖుర్బానీ తన స్థానానికి చేరక మునుపే) శిరోముండనం చేయించుకుంటే దానికి పరిహారంగా ఉపవాసం ఉండాలి లేక దానధర్మాలు చెయ్యాలి లేక ఖుర్బానీ ఇవ్వాలి. తరువాత శాంతిభద్రతలు నెలకొన్నట్లయితే (మీరు హజ్కు ముందే మక్కా చేరుకున్నట్లయితే) ఈ అవకాశం వినియోగించుకుంటూ హజ్ కాలం వచ్చేవరకు మీలో ఎవరైనా ‘ఉమ్రప్ా’ చేసినట్లయితే, వారు తమ శక్తికి తగినవిధంగా ‘ఖుర్బానీ’ ఇవ్వాలి. ఖుర్బానీ ఇవ్వలేకపోతే, హజ్ కాలంలో మూడు ఉపవాసాలు, ఇంటికి తిరిగి వచ్చిన పిదప ఏడు ఉపవాసాలు, ఈ విధంగా మొత్తం పది ఉపవాసాలు ఉండాలి. ‘మస్జిదె హరామ్’కు సమీపంలో ఇల్లూ వాకిలీ లేని వారికే ఈ సౌకర్యం వర్తిస్తుంది. అల్లాహ్ ఇచ్చే ఈ ఆజ్ఞలను మీరు ఉల్లంఘించకండి. అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడని మీరు స్పష్టంగా తెలుసుకోండి.
2. అల్ బఖర
197
203 హజ్ మాసాలు అందరికీ తెలిసినవే. ఈ నిర్ణీత మాసాలలో హజ్ చేసే సంకల్పం ఉన్న వ్యక్తి అప్రమత్తుడై మెలగాలి. హజ్ సమయంలో అతడు కామచేష్టలకూ దుష్కార్యాలకూ, ఘర్షణలకూ దూరంగా ఉండాలి. మీరు చేసే ఏ పుణ్య కార్యమైనా అది అల్లాహ్ కు తెలుస్తుంది. హజ్ యాత్రకు ప్రయాణ సామగ్రిని తీసుకువెళ్ళండి. భయభక్తులు అన్నిటికంటే ఉత్తమమైన సామగ్రి. కనుక వివేకవంతులారా! నాకు అవిధేయత చూపకండి. హజ్ యాత్రతో పాటు మీరు అల్లాహ్ అనుగ్రహం అన్వేషిస్తే అందులో దోషం లేదు. ‘అరఫాత్’ నుండి బయలుదేరి, ‘మష్అరె హరామ్’ (ముజ్దల్ఫ) వద్ద ఆగి అల్లాహ్ ను స్మరించండి. అల్లాహ్ మీకు బోధించిన విధంగా ఆయనను స్మరించండి. వాస్తవానికి మీరు పూర్వం మార్గం తప్పి నడిచేవారు. తరువాత ప్రజలంతా ఏ స్థలం నుండి వెనుకకు మరలుతారో, అదే స్థలం నుండి మీరూ మరలండి. క్షమించు అని అల్లాహ్ ను వేడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడూ, కరుణించేవాడూను. మీ హజ్ విధులను ముగించిన తరువాత, మీరు మీ తాత ముత్తాతలను పూర్వం స్మరించే విధంగానే ఇంకా దానికంటే అధికంగానే అల్లాహ్ ను స్మరించండి. (కాని అల్లాహ్ ను స్మరించేవారిలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంది). వారిలో కొందరు, ‘‘మా ప్రభూ! మాకు ఈ లోకంలోనే అన్నీ ప్రసాదించు’’ అని ప్రార్థిస్తారు. అలాంటివారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. ఇంకా కొందరు ఈవిధంగా ప్రార్థిస్తారు : ‘‘మా ప్రభూ! ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మాకు మంచిని ప్రసాదించు. మమ్మల్ని నరకబాధ నుండి కాపాడు.’’ ఇలాంటి వారు తమ సంపాదనకు అనుగుణంగా ఉభయ లోకాలలో తమ వాటాను పొందుతారు. లెక్క తేల్చటం అల్లాహ్ కు ఎంతోసేపు పట్టదు. మీరు అల్లాహ్ నామ సంస్మరణలో గడుపవలసిన రోజులు లెక్కకు కొన్ని మాత్రమే. త్వరగా రెండు రోజులలోనే ఇక్కడ నుండి తిరిగి వెళ్ళితే, అది ఏమాత్రం దోషం కాదు. ఎవరైనా ఇంకా కొంతకాలం ఉండి తిరిగివెళ్ళినా తప్పులేదు. అయితే ఆ దినాలను అతడు భయభక్తులతో గడపాలి. అల్హాహ్పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. ఒకరోజు మీరంతా ఆయన సన్నిధిలో హాజరు కావలసి ఉంది అని బాగా తెలుసుకోండి.
2. అల్ బఖర 204 - 210 మానవుల్లోని ఒకడు చెప్పేమాటలు ఇహలోక జీవితంలో నిన్ను ఎంతో రంజింపచేస్తాయి. తన సంకల్పశుద్ధిని గురించి తెలుపడానికి అతడు అల్లాహ్ ను మాటిమాటికి సాక్షిగా నిలబెడతాడు. కాని వాస్తవంగా అతడు సత్యానికి బద్ధవిరోధి. అతడికి అధికారం లభించినప్పుడు అతడు లోకంలో కల్లోల వ్యాప్తికి, పంట పొలాల విధ్వంసానికీ, మానవ సంతతి వినాశానికీ నిత్యం
కృషి చేస్తాడు - (అతడు సాక్షిగా నిలబెట్టే) అల్లాహ్ కల్లోలాన్ని ఏమాత్రం సహించడు. ‘‘అల్లాహ్ కు భయపడు’’ అని అతడితో అన్నప్పుడు, అహంభావం అతడిని పాపానికే అంటుకుపోయేలా చేస్తుంది. అలాంటి వాడికి తగిన స్థలం నరకమే. అది అతి చెడ్డ నివాసం. మరో వైపు మానవుల్లోనే మరొకడు అల్లాహ్ సంతోషం పొందటానికే తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తాడు. అల్లాహ్ అటువంటి తన దాసుణ్ణి అమితంగా ప్రేమిస్తాడు. విశ్వసించిన ప్రజలారా! మీరు పూర్తిగా ఇస్లామ్లో ప్రవేశించండి. షైతాను అడుగుజాడలు త్రొక్కకండి. అతడు మీకు బహిరంగ శత్రువు. మీ వద్దకు వచ్చిన స్పష్టమైన హితోపదేశాలను మీరు స్వీకరించిన తరువాత మళ్ళీ తప్పటడుగువేస్తే, అల్లాహ్ సర్వశక్తిమంతుడూ సర్వజ్ఞుడూ అనే విషయం బాగా తెలుసుకోండి. (ఇన్ని హితోపదేశాల తరువాత కూడా ప్రజలు తమను తాము సరిదిద్దుకోకపోతే) మేఘాల షామియానాలలో దూతలు వెంటరాగా, అల్లాహ్ వారి ముందు స్వయంగా ప్రత్యక్షమై వారిని గురించి తీర్పు చెప్పే సమయం కోసం వారు నిరీక్షిస్తున్నారని దాని అర్థమా? చివరకు అన్ని వ్యవహారాలూ అల్లాహ్ ముందే పెట్టబడతాయి.
2. అల్ బఖర
211
మేము ఎన్ని స్పష్టమైన గుర్తులు వారికి చూపించామో ఇస్రాయీలు వంశీయులను అడగండి. ఇంకా, అల్లాహ్ అనుగ్రహ భాగ్యం కలిగిన తరువాత దాన్ని దౌర్భాగ్యంగా మార్చుకునే జాతిని అల్లాహ్ ఎంత కఠినంగా శిక్షిస్తాడో (కూడా వారిని అడగండి).
2. అల్ బఖర
12
అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి ఇహలోక జీవితం ప్రియమైనదిగానూ మనోహరమైనది గానూ కనిపించేలా చేయబడిరది. వారు విశ్వాస వైఖరి అవలంబించిన వారిని పరిహసిస్తారు. కాని ప్రళయదినం నాడు భయభక్తులు కలవారే వారి కంటె ఉన్నత స్థానంలో ఉంటారు. ఇక ఐహిక సంపదనైతే, తాను కోరిన వారికి లెక్కలేకుండా ఇచ్చే అధికారం అల్లాహ్ కే ఉంది.
2. అల్ బఖర 213 ప్రారంభంలో మానవులంతా ఒకే మార్గం అనుసరించారు. (కాని తరువాత పరిస్థితులు మారాయి. అభిప్రాయభేదాలు ఉత్పన్నమయ్యాయి). అప్పుడు అల్లాహ్ ప్రవక్తలను పంపాడు. వారు సత్యమార్గంలో నడిచేవారికి శుభవార్తలు తెలిపేవారు. వక్రమార్గం అనుసరిస్తే దుష్ఫలితాలు కలుగుతాయని హెచ్చరిక చేసేవారు. సత్యం గురించి ప్రజలలో పొడచూపిన విభేదాలు పరిష్కరించటానికి వారితోపాటు పరమ సత్యం వున్న గ్రంథాన్ని కూడ పంపాడు - (ఈ అభిప్రాయ భేదాలు తల ఎత్తటానికి కారణం ప్రారంభంలో ప్రజలకు సత్యం తెలుపబడకపోవటం ఎంతమాత్రం కాదు) ఈ విభేదాలను సృష్టించినవారు సత్యజ్ఞానం ప్రసాదించబడ్డవారే. స్పష్టమైన హితోపదేశాలు పొందిన తరువాత కూడ వారు కేవలం ఒకరికొకరు అన్యాయం చేసుకునే ఉద్దేశ్యంతో అసలు సత్యాన్ని వదలి విభిన్న పద్ధతులను సృష్టించుకున్నారు - అయితే ప్రవక్తలను విశ్వసించిన వారికి అల్లాహ్ తన అనుమతితో ప్రజలు వివాదపడిన సత్యాన్ని పొందేమార్గం చూపాడు. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు.
2. అల్ బఖర
214
స్వర్గ ప్రవేశం ఊరకే లభిస్తుందని మీరు అపోహపడుతున్నారా? మీకు పూర్వం విశ్వాసులకు సంభవించినవన్నీ ఇంకా మీకు సంభవించనేలేదే! వారిపై ఆపదలు, ఎనలేని వ్యధలు విరుచుకుపడ్డాయి, వారు కుదిపివేయబడ్డారు. చివరకు అప్పటి ప్రవక్త, విశ్వాసులైన అతని అనుచరులు ‘‘అల్లాహ్ సహాయం ఇంకా ఎప్పుడొస్తుంది’’ అని ఆక్రోశించారు. అప్పుడు, ‘‘అదిగో, అల్లాహ్ సహాయం సమీపంలోనే ఉంది’’ (అని వారిని ఓదార్చటం జరిగింది).
2. అల్ బఖర
215
‘‘మేము ఏమి ఖర్చు చెయ్యాలి’’ అని ప్రజలు అడుగుతారు. ‘‘మీరు ఏమి ఖర్చుచేసినా దానిని మీ తల్లిదండ్రుల కొరకూ, బంధువుల కొరకూ, అనాధులు, నిరుపేదలు, బాటసారుల కొరకూ ఖర్చు చెయ్యండి. మీరు ఏ మేలుచేసినా, దాన్ని అల్లాహ్ తెలుసుకుంటాడు’’ అని వారికి చెప్పండి.
2. అల్ బఖర 216 యుద్ధం చెయ్యండి అని మీకు ఆజ్ఞాపించబడిరది. కాని అది మీకు ఇష్టంగా లేదు. మీకు నచ్చని విషయమే మీకు లాభకరం కావచ్చు
మీకు నచ్చే విషయమే మీకు నష్టకరం కావచ్చు. ఈ విషయం అల్లాహ్ కు తెలుసు. మీకు తెలియదు.
2. అల్ బఖర
217
- 218 నిషిద్ధ మాసంలో యుద్ధం చెయ్యటాన్ని గురించి ప్రజలు నిన్ను అడుగుతారు. వారికి ఇలా సమాధానం చెప్పు : ‘‘ఆ మాసంలో యుద్ధం చెయ్యటం మహా నేరమే. కాని అల్లాహ్ మార్గంలో అవరోధాలు కల్పించటం, అల్లాహ్ ను తిరస్కరించటం, అల్లాహ్ ఆరాధకులను ‘మస్జిదె హరామ్’ను దర్శించకుండా ఆటంకపరచటం, అందులో ఉండే వారిని బయటికి గెంటివెయ్యటం అల్లాహ్ దృష్టిలో అంతకంటే గొప్ప నేరం. ఇంకా, హింస ద్వారా పరధర్మాన్ని అణచటం రక్తపాతం కంటే అత్యంత తీవ్రమైనది.’’ మిమ్మల్ని మీ ధర్మాన్నుండి మళ్ళించగలగటం వారికి సాధ్యపడితే, వారు అంతవరకు మీతో యుద్ధం చేస్తూనే పోతారు (ఈ విషయం బాగా అర్థం చేసుకోండి). మీలో ఎవరైనా తన ధర్మాన్ని పరిత్యజించి, అవిశ్వాస పరిస్థితిలో మరణిస్తే, అతడు చేసిన మంచిపనులన్నీ ఇహపరలోకాలు రెండిరటిలోనూ వృధా అవుతాయి. అటువంటి వారంతా నరకవాసులు. నరకంలోనే వారు శాశ్వతంగా ఉంటారు. కాని దీనికి భిన్నంగా విశ్వసించి, అల్లాహ్ మార్గంలో తమ ఇల్లూ వాకిలీ సహితం విడిచి జిహాద్ చేసేవారు దైవకారుణ్యం ఆశించటానికి అన్నివిధాలా అర్హులు. అల్లాహ్ వారి తప్పులను క్షమించి వారిని కరుణిస్తాడు.
2. అల్ బఖర 219 మద్యపానము గురించీ, జూదము గురించీ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు. నీవు వారికి ఇలా ఉపదేశించు : ‘‘ఈ రెంటిలోనూ కీడు ఉన్నది వాటిలో ప్రజలకు కొన్ని లాభాలు ఉన్నా, ఈ లాభాలకంటే కలిగే కీడే ఎక్కువ.’’ ‘‘మేము అల్లాహ్ మార్గంలో ఏమి ఖర్చుపెట్టాలి?’’ అని వారు అడుగుతారు. ‘‘మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది’’ అని నీవు వారికి చెప్పు. ఇహపరాల చింతన మీలో కలిగేందుకుగాను అల్లాహ్ ఈవిధంగా తన ఆజ్ఞలను విశదీకరిస్తాడు.
2. అల్ బఖర
220
అనాధులతో వ్యవహరించే తీరును గురించి వారు నిన్ను అడుగుతారు. నీవు వారికి ఇలా బోధించు : ‘‘ఏవిధంగా వ్యవహరిస్తే వారికి ఎక్కువ మేలు కలుగుతుందో, ఆ విధంగా వ్యవహరించటం ఉత్తమం. ఒకవేళ మీరూ వారూ కలసివుంటూ, ఉభయుల ఖర్చులను ఉమ్మడిగా భరిస్తే, అందులో అభ్యంతరం లేదు. ఎటొచ్చీ వారు మీకు సోదరతుల్యులే కదా! కీడు చేసే వారెవరో, మేలు చేసేవారెవరో అల్లాహ్ కు బాగా తెలుసు. అల్లాహ్ కోరితే, ఈ విషయంలో మీతో కఠినంగా వ్యవహరించి ఉండేవాడే. కాని ఆయన సర్వాధికారియేకాదు, వివేకవంతుడు కూడా.’’
2. అల్ బఖర
221
ముష్రిక్కు మహిళలు విశ్వసించనంతవరకు మీరు వారిని ఎట్టి పరిస్థితులలోనూ వివాహ మాడరాదు. ముష్రిక్కు కులీన స్త్రీ మీకు ఎంత నచ్చినా, ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలు. (అదేవిధంగా) ముష్రిక్కు పురుషులు విశ్వాసులు కానంతవరకు మీరు మీ మహిళలను వారికిచ్చి ఎన్నటికీ వివాహం చెయ్యకూడదు. ముష్రిక్కు కులీనుడు మీకు ఎంత నచ్చినా, అతడికంటె విశ్వాసి అయిన ఒక బానిస ఎంతో మేలు. ఈ ముష్రిక్కులు మిమ్మల్ని అగ్ని వైపునకు ఆహ్వానిస్తారు. కాని అల్లాహ్ తన అనుజ్ఞతో మిమ్మల్ని స్వర్గం వైపునకూ క్షమాభిక్ష వైపునకూ రమ్మని పిలుస్తాడు. గుణపాఠం గ్రహించి హితబోధను స్వీకరిస్తారని ప్రజలకు అల్లాహ్ తన ఆజ్ఞలను స్పష్టంగా తెలుపుతాడు.
2. అల్ బఖర
222
- 223 రుతుస్రావానికి సంబంధించిన ఉత్తరువు ఏమిటి అని వారు నిన్ను అడుగుతారు. నీవు వారికి ఇలా తెలుపు : ‘‘అదొక అపరిశుద్ధావస్థ. కనుక రుతు కాలంలో భార్యలకు దూరంగా ఉండండి. వారు పరిశుద్ధలు కానంతవరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధలు అయిన తరువాత, అల్లాహ్ ఆదేశించిన విధంగా మీరు వారి వద్దకు పోవచ్చు. చెడుగుకు దూరంగా ఉండేవారిని, పరిశుద్ధతను పాటించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. మీ స్త్రీలు మీ యొక్క సేద్యపు భూములు. మీ పొలాలకు మీరు కోరిన విధంగా పోవటానికి మీకు అధికారం ఉంది. కాని మీరు మీ భవిష్యత్తును గురించి తగు జాగ్రత్త వహించండి. అల్లాహ్ ఆగ్రహానికి దూరంగా ఉండండి. ఒకరోజున ఆయనను కలుసుకోవలసి వుందని బాగా తెలుసుకోండి. ప్రవక్తా! నీ ఉపదేశాలను స్వీకరించిన వారికి (సాఫల్యము, సౌభాగ్యము ఉన్నాయనే) శుభవార్త వినిపించు.
2. అల్ బఖర 224 - 225 సత్కార్యాలూ, భయభక్తులూ, మానవ సంక్షేమమూ - వీటికి దూరంగా ఉండే ఉద్దేశ్యంతో మీరు చేసే ప్రమాణాలకు అల్లాహ్ పవిత్రనామాన్ని ఉపయోగించకండి. అల్లాహ్ మీ మాటలన్నింటినీ వింటున్నాడు. ఆయనకు అంతా తెలుసు. అనాలోచితంగా మీరు చేసే అర్థరహిత ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని హృదయపూర్వకంగా మీరు చేసే ప్రమాణాలను గురించి ఆయన తప్పకుండా అడుగుతాడు. అల్లాహ్ మన్నించేవాడు, సహనశీలుడూను.
2. అల్ బఖర
226
- 227 తమ భార్యలను కలవకూడదని ప్రమాణం చేసుకునే వారికి నాలుగు మాసాల వ్యవధి కలదు. కాని వారు తమ దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించే వాడూను. కాని వారు చివరకు విడాకుల కొరకే నిర్ణయం తీసుకుంటే, అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అన్నీ తెలుసు అనే విషయం వారు తెలుసుకోవాలి.
2. అల్ బఖర
228
విడాకులివ్వబడిన స్త్రీలు మూడు రుతువుల కాలం పూర్తి అయ్యేవరకు విధిగా వేచివుండాలి. వారి గర్భాశయాలలో అల్లాహ్ సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మం కాదు. అల్లాహ్ ను, అంతిమదినాన్నీ వారు నిజంగానే విశ్వసించేవారేఅయితే, ఆ విధంగా చెయ్యటం ఎంతమాత్రం భావ్యం కాదు. వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకొనుటకు సిద్ధంగా ఉంటే, ఈ నిరీక్షణా కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మగవారికి మహిళలపై ఉన్నటువంటి హక్కులే ధర్మం ప్రకారం మహిళలకు కూడా మగవారిపై ఉన్నాయి. కాని పురుషులకు స్త్రీలపై కొంచెం ఆధిక్యం ఉన్నది. అందరిపై అల్లాహ్ కు ఆధిక్యం ఉన్నది. ఆయన సర్వాధికారి, సర్వజ్ఞాని, వివేచనాపరుడు.
2. అల్ బఖర
229
విడాకులు రెండుసార్లు ఇవ్వాలి. తరువాత భార్యను సక్రమంగా తమ వద్ద ఉండనివ్వాలి లేదా ఆమెను సహృదయంతో సాగనంపాలి. సాగనంపేటప్పుడు, మీరు వారికి పూర్వం ఇచ్చిన వాటినుండి దేన్నయినా తిరిగి తీసుకోవటం ధర్మసమ్మతం కాదు - అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం దంపతులకు కలిగిన పక్షంలో ఒక మినహాయింపు ఉంది. ఇలాంటి సందర్భంలో దంపతులిద్దరూ అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేరనే భయం మీకు కలిగితే, స్త్రీ తన భర్తకు ఏదైనా పరిహారం ఇచ్చి వేరు కావటానికి వారిద్దరూ అంగీకరిస్తే, అందులో ఏమాత్రం దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. వీటిని అతిక్రమించకండి. అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమించేవారే దుర్మార్గులు.
2. అల్ బఖర
230 ఆ తరువాత (రెండుసార్లు విడాకులిచ్చిన పిదప భర్త భార్యకు మూడవసారి) విడాకులిస్తే, ఇక ఆ స్త్రీ అతనికి హలాల్ (ధర్మసమ్మతం) కాదు. ఆమె వివాహం వేరే పురుషునితో జరిగి, అతడు ఆమెకు విడాకులిస్తే తప్ప. అప్పుడు మొదటి భర్త, ఈ స్త్రీ ఉభయులూ తాము అల్లాహ్ హద్దులకు లోబడి ఉండగలమని భావిస్తే, వారు పునర్వివాహం చేసుకోవటంలో దోషం లేదు. ఇవి అల్లాహ్ ఏర్పరచిన హద్దులు. (అల్లాహ్ హద్దులు అతిక్రమిస్తే కలిగే పర్యవసానం) ఎరిగిన వారికి మార్గదర్శకంగా ఉండటానికి వాటిని ఆయన విశదపరుస్తున్నాడు.
2. అల్ బఖర
231
మీరు మీ స్త్రీలకు విడాకులిచ్చినప్పుడు, వారికొరకు నిర్ణయింపబడిన గడువు (ఇద్దత్) దగ్గరపడగానే, వారిని
సహృదయంతో మీ వద్ద ఉంచుకోవాలి లేదా మంచితనంతో సాగనంపాలి. కేవలం పీడిరచే ఉద్దేశ్యంతో వారిని మీతో ఉంచుకోవటం అన్యాయం. ఆవిధంగా చేసేవాడు వాస్తవానికి తనకు తానే అన్యాయం చేసుకుంటున్నాడు. అల్లాహ్ వాక్యాలతో చెలగాటం ఆడకండి. అల్లాహ్ మీకు గొప్ప కానుకను ప్రసాదించిన విషయాన్ని మరువకండి. తాను మీపై అవతరింపజేసిన గ్రంథాన్నీ, దివ్య జ్ఞానాన్నీ తగువిధంగా గౌరవించండి అని అల్లాహ్ మీకు బోధిస్తున్నాడు. అల్లాహ్ కు భయపడండి. అంతా ఆయనకు తెలుసు అనే విషయం మీరు బాగా తెలుసుకోండి.
2. అల్ బఖర
232
మీరు మీ స్త్రీలకు విడాకులిచ్చివేసిన తరువాత వారు తమ నిరీక్షణా వ్యవధి (ఇద్దత్)ని పూర్తిచేసి, తమ నిశ్చిత భర్తలను ధర్మసమ్మతంగా పరస్పరం ఇష్టపడి వివాహం చేసుకోదలిస్తే, మీరు వారిని ఆటంకపరచకూడదు. మీరు నిజంగా అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించినవారే అయితే, అలా ఎంతమాత్రం చెయ్యకూడదని మీకు బోధించబడుతోంది. మీకొరకు సంస్కారవంతమూ పవిత్రమూ అయిన పద్ధతి ఏమిటంటే మీరు దానికి దూరంగా ఉండటమే. అల్లాహ్ కు అన్నీ తెలుసు, మీకు తెలియదు.
2. అల్ బఖర
233
తమ సంతానం యొక్క పాలుపట్టే గడువు పూర్తికావాలని తండ్రులు కోరినపక్షంలో తల్లులు తమ బిడ్డలకు పూర్తిగా రెండు సంవత్సరాలు పాలుపట్టాలి. అప్పుడు ఆమెకు పిల్లల తండ్రి తగురీతిగా భోజన వస్త్రాలను ఇచ్చి పోషించవలసి ఉంటుంది. కాని శక్తికి మించిన భారం ఎవరిమీదా మోపకూడదు. (అంటే) బిడ్డనుకన్న కారణంగా తల్లిమీద ఎక్కువ భారం మోపటం భావ్యం కాదు. బిడ్డకు తండ్రి కనుక తండ్రిని ఇరకాటంలో పెట్టటం కూడ సమంజసం కాదు - పాలిచ్చే తల్లిని పోషించే బాధ్యత తండ్రిపై ఉన్నవిధంగానే తండ్రి వారసులపై కూడా ఉంటుంది - కాని ఇరుపక్షాలవారు సంప్రదించుకుని పరస్పరాంగీకారంతో బిడ్డచే పాలు విడిపిస్తే అందులో దోషం లేదు. ఇంకా మీరు మీ సంతానానికి వేరే స్త్రీ ద్వారా పాలు ఇప్పించే ఏర్పాటు చెయ్యదలిస్తే, అదీ ఆక్షేపణీయం కాదు. కాని మీరు ఆమెకు ఇవ్వవలసిన దానిని న్యాయసమ్మతంగా చెల్లించాలి. అల్లాహ్ కు భయపడండి. మీరు చేస్తున్నదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది అనే విషయం తెలుసుకోండి.
2. అల్ బఖర
234
- 235 మీలో ఎవరైనా మరణించి, వారి భార్యలు సజీవంగా ఉంటే, వారు నాలుగు నెలల పదిరోజుల వరకు తమను తాము నిగ్రహించుకోవాలి. ఈ గడువు (ఇద్దత్) పూర్తి అయిన పిదప, వారు తమ కొరకు ఏది ఉచితమో దానిని యుక్తమైన రీతిలో చేసుకోవటానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు. దానికి మీరు బాధ్యులుకారు. మీరు చేసే పనులన్నీ అల్లాహ్ కు తెలుసు. ఈ వితంతువులను వివాహం చేసుకోవాలనే మీ సంకల్పాన్ని మీరు వారి నిరీక్షణాకాలం (ఇద్దత్)లో పరోక్షంగా తెలిపినా లేక దానిని మీ మనస్సులలో గోప్యంగా ఉంచినా అది దోషం కాదు. వారిని గురించిన ఆలోచన సహజంగానే మీకు కలుగుతుందని అల్లాహ్ కు తెలుసు. కాని రహస్యంగా ఎలాంటి ఒప్పందం చేసుకోరాదు. అయితే మీరేమన్నా మాట్లాడదలిస్తే గౌరవమైన రీతిలో మాట్లాడండి. నిరీక్షణా వ్యవధి (ఇద్దత్) పూర్తి కానంతవరకు వివాహ నిర్ణయం తీసుకోకూడదు. మీ మనస్సులలో ఉన్న విషయం సహితం అల్లాహ్ కు తెలుసు అని తెలుసుకోండి. కనుక ఆయనకు భయపడండి. ఇంకా ఆయన అత్యంత సహనశీలుడని (చిన్న చిన్న తప్పులను) మన్నిస్తాడని కూడా తెలుసుకోండి.
2. అల్ బఖర 236 - 237 మీరు మీ స్త్రీలను ముట్టుకోకముందే లేక వారి మహర్ (స్త్రీ ధనం) నిర్ణయం కాకపూర్వమే మీరు వారికి విడాకులిస్తే,అది పాపం కాదు. అప్పుడు మీరు వారికి ఏదో కొంత తప్పకుండా ఇవ్వాలి. ధనవంతుడైన వ్యక్తి తన శక్తికొలదీ, పేదవాడైన మనిషి తన స్థితినిబట్టి ధర్మసమ్మతమైన విధంగా చెల్లించాలి. ఇది సజ్జనులైన వారి విధి. మీరు తాకకపూర్వమే మీ స్త్రీలకు విడాకులిస్తే, ఒకవేళ అప్పటికే వారి మహర్ నిర్ణయింపబడి ఉన్నట్లయితే అప్పుడు సగం మహర్ను చెల్లించవలసి ఉంటుంది. కాని స్త్రీ గనక ఉదార బుద్ధితో వ్యవహరించి (మహర్ను క్షమించి విడిచిపెట్టి)నట్లయితే లేక నికాప్ా బంధం తన చేతిలో ఉన్న పురుషుడు ఔదార్యంతో (పూర్తి మహర్) చెల్లించినట్లయితే అది అభ్యంతరకరం కాదు. మీరు (పురుషులు) ఉదార స్వభావంతో వ్యవహరిస్తే, అది భయభక్తులకు సన్నిహితమైనది. పరస్పర వ్యవహారాలలో ఔదార్యం చూపటం మరువకండి. మీరు చేసే పనులను అల్లాహ్ చూస్తున్నాడు.
2. అల్ బఖర
238
- 239 మీరు మీ నమాజులను సంరక్షించుకోండి - ముఖ్యంగా అత్యుత్తమమైన నమాజును. అల్లాహ్ సన్నిధానంలో విధేయులైన దాసులుగా నిలబడండి. పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటే, నడుస్తూవున్నా లేక స్వారీ చేస్తూవున్నా, ఎలా సాధ్యమయితే అలా నమాజు చెయ్యండి. శాంతి భద్రతలు నెలకొన్న తరువాత, అల్లాహ్ మీకు నేర్పిన పద్ధతి ప్రకారం ఆయనను స్మరించండి. ఈ పద్ధతి పూర్వం మీకు తెలియదు.
2. అల్ బఖర
240
- 241 మీలోని వారెవరైనా మరణించి, వారి భార్యలు సజీవంగా వుంటే, వారు తమ భార్యలకు ఒక సంవత్సరం వరకు భరణపు ఖర్చులు ఇవ్వాలనీ వారిని ఇంటి నుండి బహిష్కరించరాదనీ ఒక వీలునామా వ్రాయాలి. కాని వారు తమంతట తామే వెళ్ళిపోయి, తమ విషయంలో ధర్మసమ్మతంగా ఏమి చేసినా దానికి మీరు బాధ్యులు కారు. అల్లాహ్ సర్వాధికారి, సర్వమూ తెలిసినవాడు. ఇదేవిధంగా విడాకులివ్వబడిన స్త్రీలకు కూడా సముచితరీతిని ఎంతో కొంత ఇచ్చి సాగనంపాలి. భయభక్తులు కలవారు దీనిని విధిగా పాటించాలి.
2. అల్ బఖర
242
ఈవిధంగా అల్లాహ్ తన ఆజ్ఞలను మీకు స్పష్టంగా తెలుపుతాడు. మీరు అర్థం చేసుకుని ప్రవర్తిస్తారని ఆశించబడుతోంది.
2. అల్ బఖర
243
- 245 మరణభీతితో తమ ఇళ్ళూవాకిళ్ళను విడిచివెళ్ళినవారి ఉదంతాన్ని గురించి నీవు తలపోశావా? వారు వేల సంఖ్యలో ఉండేవారు. అల్లాహ్ వారితో ‘‘చావండి’’ అని అన్నాడు. మళ్ళీ ఆయన వారిని బ్రతికించాడు. వాస్తవం ఏమిటంటే, అల్లాహ్ మానవులపట్ల అత్యంత అనుగ్రహం కలవాడు. కాని చాలామంది కృతజ్ఞతలు చూపరు. ముస్లిములారా! అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యండి. అల్లాహ్ అన్నీ వింటాడు, ఆయనకు అంతా తెలుసు అని మీరు బాగా తెలుసుకోండి. అల్లాహ్ కు మంచి రుణం ఇచ్చేవారు మీలో ఎవరైనా ఉన్నారా? దానిని ఆయన ఎన్నో రెట్లు అధికంచేసి తిరిగి ఇస్తాడు. (ఐశ్వర్యాన్ని) తగ్గించటం, అధికం చెయ్యటం - అంతా అల్లాహ్ చేతులలోనే ఉంది. ఆయన వైపునకే మీరంతా తిరిగి పోవలసివుంది.
2. అల్ బఖర
246
మూసా (నిర్యాణం) తరువాత ఇస్రాయీలు నాయకులకు ఎదురైన పరిస్థితులను గురించి నీవు ఆలోచించావా? వారు తమ ప్రవక్తను ఇలా అడిగారు : ‘‘మేము అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యటానికి నీవు మాకొరకు ఒక రాజును నియమించు.’’ అప్పుడు ప్రవక్త వారిని ఇలా అడిగాడు : ‘‘తీరా మిమ్మల్ని యుద్ధం చెయ్యండి అని ఆదేశిస్తే, అప్పుడు మీరు నిరాకరించరుకదా?’’ వారు ఇలా అన్నారు : ‘‘మేము మా ఇళ్ళనుండి గెంటివేయబడ్డాము. మా పిల్లలు మాకు దూరం చెయ్యబడ్డారు. అలాంటప్పుడు మేము అల్లాహ్ మార్గంలో యుద్ధం చెయ్యకుండా ఉండటమనేది ఎలా సాధ్యం?’’ కాని, యుద్ధం చెయ్యండి అని ఆజ్ఞాపించగానే వారిలో కొందరు తప్ప అందరూ వెన్నుచూపారు. ఈ దుర్మార్గులలో ప్రతి ఒక్కడూ అల్లాహ్ కు తెలుసు.
2. అల్ బఖర
247
- 248 వారి ప్రవక్త వారితో ఇలా అన్నాడు : ‘‘మీకు ఏలికగా అల్లాహ్ తాలూత్ను నియమించాడు.’’ ఇది విని వారు ఇలా అన్నారు : ‘‘మాపై రాజ్యం చేసే హక్కు అతనికెలా సంక్రమిస్తుంది? రాజ్యం చేసే హక్కూ, అర్హతలూ అతనికంటే మాకే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, అతడు శ్రీమంతుడు కాదు.’’ దానికి సమాధానంగా ప్రవక్త వారితో ఇలా అన్నాడు : ‘‘మీకు బదులుగా అల్లాహ్ అతనినే ఎన్నిక చేశాడు. అల్లాహ్ అతనికి బుద్ధిబలాన్నీ, కండబలాన్నీ సమృద్ధిగా ప్రసాదించాడు. తాను కోరిన వారికి తన రాజ్యం ప్రసాదించే అధికారం అల్లాహ్ కు ఉంది. అల్లాహ్ అంతా వ్యాపించి ఉన్నాడు, సర్వమూ తెలిసినవాడు.’’ వారి ప్రవక్త వారికి ఇంకా ఈవిధంగా తెలియజేశాడు : ‘‘అల్లాహ్ అతనిని మీపై రాజుగా నియమించాడు అనటానికి తార్కాణమేమిటంటే, అతని ప్రభుత్వ కాలంలో మీ పెట్టె (ఆర్క్) మీకు తిరిగి లభిస్తుంది. మీ ప్రభువు నుండి మీ కొరకు మనశ్శాంతి సామగ్రి
అందులో ఉంది. ఇంకా అందులో మూసా కుటుంబం, హారూను కుటుంబం వదలి వెళ్ళిన పవిత్ర అవశేషాలు ఉన్నాయి. దానిని ప్రస్తుతం దూతలు కాపాడుతున్నారు. మీరు విశ్వసించినవారే అయితే, ఇది నిశ్చయంగా మీకొక మహత్తరమైన చిహ్నం.’’
2. అల్ బఖర
249
తరువాత యుద్ధానికి సైన్యంతో బయలుదేరుతూ తాలూత్ ఇలా ప్రకటించాడు : ‘‘ఒక నదితీరాన అల్లాహ్ మిమ్మల్ని పరీక్షింపబోతున్నాడు. దానిలో నీళ్ళు త్రాగేవాడు నా సహచరుడు కాడు. దాని నీళ్ళతో తన దాహం తీర్చుకోనివాడే నా సహచరుడు. కాని చేతితో ఒక గుక్కెడు త్రాగితే ఫర్వాలేదు.’’ అయితే కొందరు తప్ప అందరూ ఆ నదీజలాన్ని కడుపునిండా త్రాగారు....
2. అల్ బఖర 249 - 251 ..... తాలూత్, అతని ముస్లిము సహచరులు ఆ నదిని దాటి ముందుకుపోయినప్పుడు వారు తాలూత్తో ఇలా అన్నారు : ‘‘జాలూత్ను, అతని సైన్యాలను ఎదుర్కొనే శక్తి ఈ రోజు మాలో లేదు.’’ కాని ఒక రోజున అల్లాహ్ ను కలవటం తప్పదు అని విశ్వసించినవారు ఈ విధంగా ప్రకటించారు :‘‘ఒక చిన్న వర్గం ఒక పెద్ద వర్గాన్ని అల్లాహ్ అనుమతితో జయించటం ఎన్నోసార్లు జరిగింది. అల్లాహ్ సాహచర్యం, స్థైర్యం కలవారికి లభిస్తుంది.’’ జాలూత్తో, అతని సైన్యంతో పోరాడటానికి బయలు దేరుతూ వారు ఇలా ప్రార్థించారు : ‘‘మా ప్రభూ! మాకు ధైర్యస్థైర్యాలు ప్రసాదించు. మా కాళ్ళకు నిలకడను చేకూర్చు. అవిశ్వాస వర్గంపై మాకు విజయం అనుగ్రహించు.’’ చివరకు అల్లాహ్ అనుజ్ఞతో వారు అవిశ్వాసులను ఓడిరచి పారద్రోలారు. దావూద్ జాలూత్ను సంహరించాడు. అల్లాహ్ అతనికి రాజ్యాధికారాన్నీ, బుద్ధికౌశల్యాన్నీ ప్రసాదించాడు. ఇంకా తాను కోరిన విషయాల జ్ఞానాన్ని ఆయన అతనికి ప్రదానం చేశాడు. ఈ విధంగా అల్లాహ్ మానవుల ఒక వర్గాన్ని మరొక వర్గం ద్వారా తొలగించక పోతే, భూలోక వ్యవస్థ ఛిన్నాభిన్నమై ఉండేది. కాని ప్రపంచ మానవులపై అల్లాహ్ కు ఎనలేని అనుగ్రహం. (కనుకనే ఈ విధంగా ఆయన అరాజకాన్ని, సంక్షోభాన్నీ రూపుమాపే ఏర్పాట్లుచేస్తూ ఉంటాడు).
2. అల్ బఖర
252
- 253 ఇవన్నీ అల్లాహ్ వాక్యాలు. వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. ముహమ్మద్! నిశ్చయంగా నీవు సందేశహరులుగా పంపబడిన వారిలోనివాడవు. (మానవులకు సత్య మార్గం చూపటానికి పంపబడిన) ఈ ప్రవక్తలకు ఒకరిపై మరొకరికి ఉన్నత స్థానాలు ప్రసాదించాము. వారిలోని ఒకరితో అల్లాహ్ స్వయంగా మాట్లాడాడు. మరొకరికి వేరేవిధంగా ఘనతను ఇచ్చి ఆదరించాడు. చివరన మర్యమ్ కుమారుడైన ఈసాకు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించాము, పరిశుద్ధాత్మతో అతనిని ఆదుకున్నాము. అల్లాహ్ సంకల్పించి ఉన్నట్లయితే, ప్రవక్తల తరువాత స్పష్టమైన గుర్తులు చూసిన ప్రజలు పరస్పరం కలహించుకునేవారు కాదు. కాని (ప్రజలను విభేదాలకు లోనుకాకుండా బలవంతంగా ఆపటం అల్లాహ్ ఉద్దేశం కాదు, అందుకని) వారు పరస్పరం విభేదాలకు లోనయ్యారు. కొందరు విశ్వసించారు, మరికొందరు అవిశ్వాసమార్గాన్ని అవలంబించారు. కాని అల్లాహ్ కోరితే, వారు పరస్పరం కలహించుకునే వారే కాదు. కాని అల్లాహ్ తాను కోరింది చేస్తాడు.
2. అల్ బఖర
254 విశ్వసించిన ప్రజలారా! క్రయవిక్రయాలు కూడా జరగని, మైత్రీ ఉపయోగపడని, సిఫారసు కూడా చెల్లని, ఆ (చివరి) దినము రాకపూర్వమే, మేము మీకు ప్రసాదించిన సిరిసంపదల నుండి (మా మార్గంలో) ఖర్చుపెట్టండి. వాస్తవంగా అవిశ్వాస మార్గం అవలంబించేవారే దుర్మార్గులు.
2. అల్ బఖర
255
అల్లాహ్ - ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన నిదురపోడు, ఆయనకు కునుకూ రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనదే. ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చెయ్యగల వాడెవ్వడు? ప్రజల ముందు ఉన్న దానినీ ఆయన ఎరుగును. వారికి గుప్తంగా ఉన్నదీ ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా తెలియజెయ్యాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయమూ వారి గ్రహణ పరిధిలోకి రాదు. ఆయన రాజ్యాధికారం ఆకాశాలనూ భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఎంతమాత్రం అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడూను.
2. అల్ బఖర
256
- 257 ధర్మం విషయంలో నిర్బంధంకానీ, బలాత్కారంకానీ లేవు. సత్యవాక్కు అసత్యవాక్కుల నుండి ప్రస్ఫుటం చెయ్యబడిరది. ఇకనుండి ‘తాగూత్’ను తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆశ్రయం పొందినట్లే. (అతడు ఆశ్రయించిన) అల్లాహ్ సర్వమూ వింటాడు, సమస్తమూ తెలిసినవాడు. అల్లాహ్ విశ్వాసులకు సంరక్షకుడు, సహాయకుడూను. ఆయన వారిని కటిక చీకట్లనుండి వెలికితీసి వెలుగు చూపిస్తాడు. తాగూత్ అవిశ్వాస మార్గం అవలంబించే వారికి సంరక్షకులు, సహాయకులూను. వీరు వారిని వెలుగునుండి చీకటి వైపునకు లాక్కుపోతారు. వారు అగ్ని జ్వాలలకు గురి అయ్యేవారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు.
2. అల్ బఖర
258
ఇబ్రాహీము ప్రభువు ఎవరు అనే విషయంపై అతనితో వివాదపడిన వ్యక్తి విషయాన్ని గురించి నీవు ఆలోచించలేదా? అల్లాహ్ ఆ వ్యక్తికి రాజ్యాధికారం ఇవ్వటం వల్ల ఈ వివాదం తలెత్తింది. ‘‘జీవన్మరణాలు ఎవరి అధీనంలో ఉన్నాయో, ఆయనే నా ప్రభువు’’ అని ఇబ్రాహీము అన్నప్పుడు, అతడు ఇలా జవాబు పలికాడు : ‘‘చావు బ్రతుకులు రెండూ నా అధీనంలోనే ఉన్నాయి.’’ ఇబ్రాహీము ఇలా అన్నాడు : ‘‘సరే, అల్లాహ్ సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపచేస్తాడు. నీవు కాస్త దానిని పడమర నుండి ఉదయింపజెయ్యి.’’ ఇది విన్న ఆ సత్యధిక్కారి బిత్తరపోయాడు. అయితే అల్లాహ్ దుష్టులకు రుజుమార్గం చూపడు.
2. అల్ బఖర
259
లేక ఉదాహరణకు - ఇళ్ళ కప్పులపై తలక్రిందులుగా పడివున్న పట్టణం మీదుగా ప్రయాణం చేసిన ఆ వ్యక్తిని చూడు. అతడు ఆశ్చర్యంతో ఇలా పలికాడు : ‘‘శిథిలమైపోయిన ఈ పట్టణానికి అల్లాహ్ మళ్ళీ ఏవిధంగా జీవం పోస్తాడు.’’ అప్పుడు అల్లాహ్ అతని ప్రాణాన్ని తీసేశాడు. ఆ స్థితిలో అతడు నూరేళ్ళ వరకు ఉన్నాడు. తరువాత అల్లాహ్ అతనిని మళ్ళీ బ్రతికించి ఇలా అడిగాడు : ‘‘నీవు ఇక్కడ ఎంతకాలం ఉన్నావో చెప్పు.’’ అతడు ‘‘ఒకరోజో లేక కొన్ని గంటలో’’ అని చెప్పాడు. అల్లాహ్ ఇలా తెలిపాడు : ‘‘ఇక్కడ ఈ స్థితిలో నీవు నూరు సంవత్సరాలు పడివున్నావు. నీవు కొంచెం నీ అన్నపానీయాలవైపు చూడు. వాటిలో ఏమాత్రం మార్పు లేదు. ఇంకా నీవు నీ గాడిదను కూడ చూడు. (దాని ఎముకలు సహితం కృశించి పోతున్నాయి). ప్రజలకు నిన్ను ఒక దృష్టాంతంగా చూపే ఉద్దేశ్యంతో మేము ఈ విధంగా చేశాము. ఇంకా చూడు! ఆ (గాడిద) అస్థిపంజరాన్ని మేము ఏ విధంగా లేపి, దానిని మాంసంతో నింపుతామో.’’ ఈ విధంగా సత్యం అతనికి తేటతెల్లం కాగానే, అతడు ఇలా అన్నాడు: ‘‘అల్లాహ్ సర్వశక్తిమంతుడని నాకు తెలుసు.’’
2. అల్ బఖర
260
మరొక సంఘటనను కూడ దృష్టిలో ఉంచుకో. ఇబ్రాహీము ఇలా అడిగాడు : ‘‘ఓ నా ప్రభూ! నీవు మృతులను ఏవిధంగా బ్రతికిస్తావో నాకు చూపించు.’’ అల్లాహ్ ‘‘నీకు విశ్వాసం లేదా?’’ అని అడిగాడు. ఇబ్రాహీము వినయంగా ఇలా అన్నాడు : ‘‘నాకు విశ్వాసం అయితే ఉంది. కాని మనస్సును తృప్తి పరచటం కోసం అడుగుతున్నాను.’’ అప్పుడు అల్లాహ్ చెప్పాడు : ‘‘సరే, మంచిది, నాలుగు పక్షులను తీసుకో. వాటిని బాగా మచ్చిక చేసుకో
తరువాత ఒక్కొక్కదాని భాగాన్ని ఒక్కొక్క కొండపై పెట్టి రా. మళ్ళీ వాటిని రమ్మని పిలువు. అవి నీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్ సర్వశక్తిమంతుడూ సర్వజ్ఞుడూ అని బాగా జ్ఞాపకం ఉంచుకో.’’
2. అల్ బఖర
261
- 265 తమ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చుచేసే వారి ఖర్చు ఉపమానం ఇలా ఉంటుంది: ఒక్క విత్తనాన్ని నాటితే, అది మొలిచి ఏడు వెన్నులను ఈనుతుంది. ప్రతి వెన్నుకూ నూరేసి గింజలు ఉంటాయి. ఇదేవిధంగా అల్లాహ్ తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింపచేస్తాడు. అల్లాహ్ అమితంగా ఇచ్చేవాడూ అన్నీ తెలిసినవాడూను. అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయంచేసి, ఆ తరువాత తమ దాతృత్వాన్ని మాటిమాటికీ చాటుతూ, గ్రహీతల మనస్సును గాయపరచని వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. వారికి ఏ విధమైన భయంకాని, ఖేదం కాని ఉండవు. మనస్సును గాయపరచే దానం కంటే, మృదుభాషణం, క్షమాగుణం ఎంతో మేలైనవి. అల్లాహ్ అన్నింటికీ అతీతుడు, అత్యంత సహనశీలుడూను. విశ్వసించిన ఓ ప్రజలారా!
కేవలం పరుల మెప్పును పొందటానికే తన ధనం ఖర్చుచేసేవాని మాదిరిగా అల్లాహ్ ను అంతిమదినాన్నీ విశ్వసించని వాని మాదిరిగా, మీరు దెప్పిపొడిచి, గ్రహీత మనస్సును గాయపరచి మీ దాన ధర్మాలను మట్టిలో కలపకండి. అతడు చేసిన ధన వ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు : ఒక కొండరాతిపై ఒక మట్టిపొర ఏర్పడి ఉంది. భారీవర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్తా కొట్టుకు పోయింది. చివరకు మిగిలింది ఉత్త కొండరాయి మాత్రమే. ఇలాంటి వారు తాము దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకార్యం వల్ల వారికి ఏ ప్రయోజనమూ కలుగదు. అవిశ్వాసులకు సత్యమార్గం చూపటం అల్లాహ్ సంప్రదాయం కాదు. దీనికి భిన్నంగా తమ సంపదను చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ సంతోషం పొందే ఉద్దేశ్యంతో వ్యయపరచేవారి వ్యయాన్ని మెట్టప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది. ఒకవేళ భారీవర్షం కురవక, సన్నని జల్లు పడినా అదే దానికి చాలు. మీరు చేసేదంతా అల్లాహ్ దృష్టిలో ఉంది.
2. అల్ బఖర
266
సతతం నీరు పారే పిల్లకాలువలతో, ఖర్జూరం, ద్రాక్ష మొదలైన సకల ఫలాలతో నిండి పచ్చగా అలరారే తోట మీలో ఎవరికైనా ఉండి, అతడు వయోభారంతో క్రుంగి, యోగ్యులు కానటువంటి చిన్నపిల్లలు ఉన్న సంకట సమయంలో ఆ తోట సుడిగాలికి గురిఅయి నశించిపోవటం మీలో ఎవరికైనా సమ్మతమేనా? మీరు యోచించగలందులకు ఈ విధంగా అల్లాహ్ తన హితవులను విశదపరుస్తాడు.
2. అల్ బఖర
267
- 269 విశ్వసించిన ప్రజలారా! మీరు సంపాదించిన ధనంలోని, మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలోని మేలైన భాగాన్ని దైవమార్గంలో ఖర్చుపెట్టండి. ఆయన మార్గంలో ఇవ్వటానికి పనికిరాని వస్తువులను ఏరితీసే ప్రయత్నం చెయ్యకండి. ఒకవేళ ఆ వస్తువులనే ఎవరన్నా మీకు ఇస్తే, వాటిని మీరు తృణీకార భావంతో తప్ప, మనసారా స్వీకరించరు కదా! అల్లాహ్ కు ఏదీ ఏమాత్రం అవసరం లేదనీ ఆయన మహోత్తమమైన గుణములు కలవాడనీ మీరు తెలుసుకోండి. దారిద్య్ర ప్రమాదం చూపి షైతాను మిమ్మల్ని భయపెడతాడు. నీతిబాహ్యమైన, నీచమైన మార్గం అవలంబించండి అని ప్రేరేపిస్తాడు. కాని మిమ్మల్ని క్షమిస్తానని, అనుగ్రహిస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ అత్యంత ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు. తాను కోరిన వారికి దివ్య జ్ఞానం ప్రసాదిస్తాడు, ఎవరికి దివ్య జ్ఞానం లభించిందో, వాస్తవంగా వారికి మహా భాగ్యం లభించినట్లే. విజ్ఞత ఉన్నవారే ఈ విషయాల నుండి పాఠం నేర్చుకుంటారు.
2. అల్ బఖర
270
- 271 మీరేమి ఖర్చుపెట్టినదీ, మీరు మొక్కుబడి చేసుకున్నదీ, అంతా అల్లాహ్ కు తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. మీరు మీ దానధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే. కాని రహస్యంగా నిరుపేదలకు దానమివ్వటం మీకు ఎక్కువ మేలు చేకూరుస్తుంది. మీ దుష్కార్యాలు ఎన్నో దీనివల్ల సమసిపోతాయి. మీరు ఏమి చేసినా అది అల్లాహ్ కు తెలుస్తుంది.
2. అల్ బఖర
272
ప్రవక్తా! ప్రజలను సత్యమార్గంలో నడిపించే బాధ్యత నీపై లేదు. తాను కోరిన వారిని అల్హాహ్యే సత్యమార్గంలో నడుపుతాడు. మంచిమార్గంలో మీరు ఖర్చుచేసే ధనం మీకే మేలు చేకూరుస్తుంది. అసలు మీరు ఖర్చుచేసేది అల్లాహ్ సంతోషం పొందటానికేగా! కనుక మంచిమార్గంలో మీరు ఏమి ఖర్చుచేసినా, దాని ప్రతిఫలం మీకు పూర్తిగా లభిస్తుంది. మీకు అన్యాయం ఎంతమాత్రం జరగదు.
2. అల్ బఖర
273
అల్లాహ్ కార్యంలో నిమగ్నులైన కారణంగా, తమ జీవనోపాధి కోసం భూమిపై తిరిగే అవకాశం లేనందువల్ల లేమికి గురిఅయినవారు ప్రత్యేకంగా ధన సహాయానికి అర్హులు. వారిని ఎరుగని మనిషి వారి ఆత్మాభిమానం చూసి వారు భాగ్యవంతులని భావిస్తాడు. వారి ముఖాలను చూసి మీరు వారి నిజస్థితిని గ్రహించగలరు. లోకుల వెంటపడి సహాయం చెయ్యండి అని బ్రతిమాలే మనుషులు కారు వారు. మీరు వారి సహాయార్థం ఏమి ఖర్చుచేసినా, అది అల్లాహ్ కు తెలియకుండా ఉండదు.
2. అల్ బఖర
274
- 277 తమ సంపదను రేయింబవళ్ళు బహిరంగంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసే వారు తమ ప్రతిఫలాన్ని
తమ ప్రభువువద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయంగాని, ద్ణుఖంగాని కలిగే అవకాశం లేదు.
కాని వడ్డీ తినేవారి స్థితి షైతాను పట్టటం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. ఈ స్థితికి వారు గురికావటానికి కారణం వారు ‘‘వ్యాపారం కూడ వడ్డీలాంటిదేగా’’ అని అనటమే. వాస్తవానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేశాడు. వడ్డీని నిషిద్ధం (హరామ్) చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందేవ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ వద్దకే పోతుంది. ఈ ఆదేశం తరువాత మళ్ళీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి. అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ వడ్డీని నశింపజేస్తాడు. దానధర్మాలను పెంచి అధికం చేస్తాడు. కృతఘ్నుడూ, దుష్టుడూ అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. కాని విశ్వసించి మంచిపనులు చేసేవారికి, నమాజును స్థాపించే వారికి జకాత్ను ఇచ్చేవారికి వారి ప్రభువువద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయంకానీ, శోకంకానీ కలిగే అవకాశం లేదు.
2. అల్ బఖర
278
- 281 విశ్వసించిన ప్రజలారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే, అల్లాహ్ కు భయపడండి, ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. కాని ఒకవేళ మీరు అలా చెయ్యకపోతే, మీపై అల్లాహ్ తరఫునుండి ఆయన ప్రవక్త తరఫు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపపడితే (వడ్డీని వదులుకుంటే) అసలు సొమ్ము తీసుకోవటానికి హక్కు దారులవుతారు. మీరూ అన్యాయం చెయ్యకూడదు, మీకూ అన్యాయం జరగకూడదు. మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందులలో ఉంటే, అతని పరిస్థితి మెరుగుపడే వరకు గడువు ఇవ్వండి. లేక మీరు తెలిసినవారే అయితే, ఆ బాకీని అతనికి దానం చెయ్యండి. అది మీకు ఎక్కువ శ్రేయస్కరం. అల్లాహ్ వద్దకు మీరు మరలి వెళ్ళేరోజున జరిగే పరాభవం నుండి, కలిగే ఆపద నుండి రక్షించుకోండి. అక్కడ ప్రతి ఒక్కడికి అతడు చేసిన మంచి చెడ్డలకు పరిపూర్ణ ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికీ ఏమాత్రం అన్యాయం జరగదు.
2. అల్ బఖర
282
విశ్వసించిన ప్రజలారా! మీరు పరస్పరం ఒక నిర్ణీత కాలం కొరకు అప్పు తీసుకున్నప్పుడు, ఆ వ్యవహారాన్ని వ్రాసి పదిలపరచండి. ఇరుపక్షాల మధ్య న్యాయంగా దస్తావేజును ఒక వ్యక్తి వ్రాయాలి. అల్లాహ్ ఎవడికైతే అక్షరజ్ఞానం ప్రసాదించాడో, అతడు వ్రాయటానికి నిరాకరించకూడదు. అతడు వ్రాయాలి. బాధ్యత మోపబడిన వ్యక్తి (అప్పు తీసుకునేవాడు) చెప్పి వ్రాయించాలి. అతడు తన ప్రభువైన అల్లాహ్ కు భయపడాలి. నిర్ణయమైన షరతులలో హెచ్చుతగ్గులు చెయ్యరాదు. కాని రుణం తీసుకునే వ్యక్తి అమాయకుడు లేక బలహీనుడు లేక చెప్పి వ్రాయించలేని అసమర్థుడు అయితే, అతని సంరక్షకుడు న్యాయంగా చెప్పి వ్రాయించాలి. ఇంకా మీరు మీలోని ఇద్దరు పురుషులను దానికి సాక్షులుగా పెట్టుకోవాలి. ఇద్దరు పురుషులు లభించని పక్షంలో, ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు సాక్షులుగా ఉండాలి. ఎందుకంటే వారిలో ఒకామె మరచిపోతే, రెండవ స్త్రీ ఆమెకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరి సాక్ష్యం మీ అందరికీ ఆమోదయోగ్యమో వారినుండే ఈ సాక్షులు ఎన్నుకోబడాలి. సాక్ష్యం ఇవ్వండి అని ఆహ్వానించినప్పుడు, సాక్షులు నిరాకరించకూడదు. వ్యవహారం చిన్నదైనా, పెద్దదైనా, దానిని గడువు నిర్ణయంతో దస్తావేజు రూపంలో వ్రాయించటానికి అశ్రద్ధ చెయ్యకూడదు. అల్లాహ్ దృష్టిలో ఈ పద్ధతి మీకొరకు అత్యంత న్యాయసమ్మతమైనది. సులభంగా సాక్ష్య నిర్ణయం చెయ్యటానికి ఇది తోడ్పడుతుంది. ఇంకా, మీరు అనుమానాలకు, అపోహలకు గురిఅయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాని మీరు అప్పటికప్పుడు పరస్పరం చేసుకునే (సాధారణ) వ్యాపారసంబంధమైన లావాదేవీలను వ్రాయకుండావుంటే, అందులో అభ్యంతరం లేదు. కాని వ్యాపార వ్యవహారాలు నిశ్చయించేటప్పుడు, తప్పకుండా సాక్షులను పెట్టుకోండి. దస్తావేజు వ్రాసేవానినీ, సాక్షులనూ పీడిరచరాదు. ఆ విధంగా చేస్తే అది పాపం అవుతుంది. అల్లాహ్ ఆగ్రహాన్నుండి రక్షించుకోండి. ఆయన మీకు సరిjైున పద్ధతిని బోధిస్తున్నాడు. ఆయనకు ప్రతిదీ తెలుసు.
2. అల్ బఖర
283
మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు, దస్తావేజు వ్రాసేవాడు దొరకని పక్షంలో, మీవద్ద ఉన్న వస్తువును తాకట్టుపెట్టండి. మీలో ఎవరైనా మరొకర్ని నమ్మి అతనితో ఒక వ్యవహారం చేసినట్లయితే, ఆ వ్యక్తి తనవద్ద ఉన్న అమానతును తిరిగి ఇవ్వాలి. అతడు తన ప్రభువైన అల్లాహ్ కు భయపడాలి. ఎట్టి పరిస్థితులలోనూ సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాడి హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేవన్నీ అల్లాహ్ కు తెలుసు.
2. అల్ బఖర
284
ఆకాశాలలో, భూమిపై ఉన్న సమస్తమూ అల్హాహ్దే. మీరు మీ మనస్సులలో ఉన్న విషయాలను ప్రకటించినా లేక దాచినా, వాటిని గురించి ఎట్టకేలకు అల్లాహ్ లెక్క తీసుకుంటాడు. ఇంకా, తాను కోరిన వారిని క్షమించటానికీ, తాను కోరిన వారిని శిక్షించటానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన అన్నిటిపైన అధికారం కలవాడు.
2. అల్ బఖర
285
ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించేవారు కూడా దానిని హృదయపూర్వకంగా
స్వీకరించారు. వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసిస్తారు. వారు ఇలా అంటారు : ‘‘మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసావహించాము.
స్వామీ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీదెసకే మరలి వస్తాము.’’
2. అల్ బఖర
286
ఏ ప్రాణిపైనా అల్లాహ్ దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్నీ, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్నీ ప్రతి వ్యక్తీ అనుభవిస్తాడు.
(విశ్వసించిన ప్రజలారా! మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి) : ‘‘మా ప్రభూ! పొరపాటువల్ల జరిగే మా తప్పులను పట్టబోకు. స్వామీ! మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు. ప్రభూ! ఏ బరువును మోసే శక్తి మాలో లేదో, దానిని మాపై పెట్టకు. మమ్మల్ని మన్నించు. మమ్మల్ని క్షమించు. మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయపడు.’’
No comments:
Post a Comment