79. సూరహ్ అన్‌ నాజిఆత్

 

79.అన్నాజిఆత్

ఆయతులు : 46                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 9 మునిగి లాగి తీసే, నెమ్మదిగా బయటికి తీసుకుని వెళ్లేవారు (దైవదూతలు) సాక్షిగా, విశ్వంలో వేగంగా తేలియాడేవారు (దైవదూతలు) సాక్షిగా, (వారు ఆజ్ఞాపాలనలో) ఒకరినొకరు మించిపోతారు  (దైవాజ్ఞల ప్రకారం) సృష్టి వ్యవహారాలను నడుపుతారు. భూకంపం కుదిపివేసే రోజున, కుదుపు తరువాత మరొక కుదుపు  రోజున కొందరి హృదయాలు భయంతో వణుకుతూ ఉంటాయి, వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి.

10 - 14 వీరు, ‘‘నిజంగానే మేము మరలించబడి మళ్ళీ తీసుకురాబడతామా? ఎముకలు కుళ్ళి శిథిలమయిన తరువాత కూడానా?’’ అని అంటారు.  ఇంకా ‘‘ తిరిగి రావటమనేది చాల నష్టంతో కూడుకున్నదే’’ అని కూడ అంటారు.  వాస్తవానికి ఒకే ఒక తీవ్రమైన గద్దింపు దెబ్బ పడుతుంది, అంతే, వీరు ఒక్క సారిగా బహిరంగ మైదానంలో చేరి ఉంటారు.

15 - 26  నీకు మూసా వృత్తాంతం ఏమైనా అందిందా? అతని ప్రభువు పవిత్రమైన ‘‘తువా’’లోయకు పిలిచి అతనితో ఇలా అన్నాడు, ‘‘ఫిరౌన్వద్దకు వెళ్ళు. అతడు హద్దులుమీరి ప్రవర్తిస్తున్నాడు  అతనికి ఇలా బోధించు, పరిశుద్ధ జీవితం అవలంబించటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? నేను నీ ప్రభువు మార్గాన్ని నీకు చూపితే, నీలో ఆయన పట్ల భయభక్తులు కలుగుతాయా?’’ తరువాత మూసా (ఫిరౌన్వద్దకు వెళ్ళి) అతనికి గొప్ప సూచనను చూపాడు. కాని అతడు తిరస్కరించాడు, అంగీకరించలేదు. ఆపైన పన్నాగాలు పన్నటానికి వెళ్ళిపోయాడు. ప్రజలను సమావేశపరచి, అతడు, ‘‘మీకు నేను అందరికంటే గొప్ప ప్రభువును’’ అని ఎలుగెత్తిచాటాడు. చివరకు అల్లాహ్ అతడిని ప్రపంచంలోను, పరలోకంలోను శిక్షించటానికి పట్టుకున్నాడు. భయపడే ప్రతి వ్యక్తి కొరకు నిశ్చయంగా ఇందులో గుణపాఠం ఉంది.

27 - 33 మిమ్మల్ని సృష్టించటం కష్టమయిన పనా లేక ఆకాశాన్ని సృష్టిం చటమా? అల్లాహ్ దానిని నిర్మించాడు, దాని కప్పును బాగా పైకి లేపాడు, తరువాత దానికి సమతూకాన్ని ఏర్పరచాడు  దాని రాత్రిని చీకటిగా చేశాడు, దాని పగటిని బహిర్గతం చేశాడు. దీని తరువాత ఆయన భూమిని పరిచాడు  అందులో నుంచి దాని నీళ్ళను, గ్రాసాన్ని (మొత్తం వృక్షజాతిని) బయటకు తీశాడు  పర్వతాలను అందులో పాతాడు - మీకూ, మీ పశువులకూ జీవన సామగ్రిగా.

34 - 41 పెద్ద అల్లకల్లోలం చెలరేగి మానవుడు తాను చేసుకున్నదంతా జ్ఞాపకం తెచ్చుకున్న రోజున, చూసే ప్రతిదాని ముందు నరకాన్ని తెచ్చి పెట్టి నప్పుడు, హద్దులు మీరి ప్రవర్తించి ఐహిక జీవితానికి ప్రాధాన్యమిచ్చిన వాడికి నరకమే నివాసమవుతుంది. తన ప్రభువు ముందు నిలబడవలసి ఉంటుందని భయపడి, తన మనస్సును దుష్టవాంఛలకు దూరంగా ఉంచిన వ్యక్తి యొక్క నివాసం స్వర్గమవుతుంది.

42 - 46 వీరు నిన్ను, ‘‘అసలు గడియ ఎప్పుడొస్తుంది?’’ అని అడుగుతున్నారు. దాని సమయమేదో చెప్పటానికి నీకేంపని? విషయం అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ఆయనకు భయపడే ప్రతి మనిషికీ నీవు హెచ్చరిక చేసేవాడవు మాత్రమే. వీరు దానిని చూసిననాడు (ప్రపంచంలో గాని లేక మరణావస్థలోగాని) కేవలం ఒక దినంలో ఉదయంగాని సాయంత్రంగాని ఉన్నట్లు వీరికి అనిపిస్తుంది.

No comments:

Post a Comment