21. అల్ అంబియా
ఆయతులు
: 112 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
21. అల్
అంబియా 1
- 3 మానవుల లెక్కల (పరిశీలన) సమయం సమీపించింది. అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు. వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు ఏ తాజా ఉపదేశం వచ్చినా, దానిని వారు అనాసక్తితో వింటారు
ఆటలలో మునిగిపోయి ఉంటారు.
వారి మనస్సులు (వేరే ఆలోచనలలో) లగ్నమై ఉన్నాయి.
దుర్మార్గులు పరస్పరం ఇలా గుసగుసలాడుకుంటారు, ‘‘ఇంతకూ ఈ వ్యక్తి మీలాంటి ఒక మానవుడేకదా! అయినా మీరు చూస్తూ చూస్తూ మాంత్రిక వలయంలో చిక్కుకుపోతారా?’’
21. అల్
అంబియా 4
- 6 ప్రవక్త, ‘‘నా ప్రభువు ఆకాశంలోనూ, భూమిపైనా పలుకబడే ప్రతి మాటను ఎరుగును. ఆయన సర్వం వినేవాడూ, సర్వమూ తెలిసినవాడూను అని అన్నాడు. వారు ఇలా అన్నారు, ‘‘కాదు, ఇవి అస్పష్టములైన కలలు, కాదు, ఇది అతని కల్పన, కాదు ఇతను ఒక కవి. పూర్వకాలపు ప్రవక్తలు సూచనలతో పంపబడిన విధంగా ఇతన్ని కూడ ఏదైనా ఒక సూచనను తీసుకు రమ్మనండి.’’ యధార్థం ఏమిటంటే, వారికి పూర్వం మేము నాశనం చేసిన ఏ జనవాసం కూడా విశ్వసించలేదు. ఇక వీరు మాత్రం విశ్వసిస్తారా?
21. అల్
అంబియా 7
- 9 ఓ ప్రవక్తా! నీకు పూర్వం కూడ మేము మానవులనే ప్రవక్తలుగా పంపాము. వారికి మేము వహీని అందజేశాము. ఒకవేళ మీకు ఇది తెలియకపోతే, గ్రంథ ప్రజలను అడగండి. ఆ ప్రవక్తలకు మేము అన్నం తినే అవసరం లేని శరీరాలనూ ఇవ్వలేదు, వారు చిరంజీవులు కూడ కాదు. చూడు, చివరకు మేము వారికి చేసిన వాగ్దానాలను నెరవేర్చాము, వారినీ ఇంకా మేము ఇష్టపడిన వారినీ కాపాడాము
హద్దులు మీరిన వారిని నాశనం చేశాము.
21. అల్
అంబియా 10 ప్రజలారా! మేము మీ వద్దకు ఒక గ్రంథాన్ని పంపాము, అందులో మీ ప్రస్తావనే ఉంది. అయినా మీరు అర్థం చేసుకోరేమిటీ?
21. అల్
అంబియా 11
- 15 దుష్ట జనవాసాలను ఎన్నింటినో మేము పిండి పిండిగా చేసివేశాము
వారి తరువాత మరొక జాతి వారిని ఆవిర్భవింపజేశాము. వారు మా శిక్ష (రాక)ను గ్రహించి, అక్కణ్ణుంచి పారిపోసాగారు. (అప్పుడు వారికి ఇలా చెప్పటం జరిగింది) ‘‘పారిపోకండి మీరు సుఖాలు అనుభవిస్తున్న ఆ ఇళ్లల్లోకే, ఆ విలాస వస్తువుల వైపునకే మరలిపోండి. బహుశా మీరు దానిని గురించి అడగబడతారేమో?’’ అప్పుడు వారు ఇలా అనసాగారు, ‘‘అయ్యో, మా దౌర్భాగ్యం! నిస్సందేహంగా మేము అపరాధులమే.’’ మేము వారిని నూర్పిడి చేసిన పంటవలె చేసే వరకు వారు ఇలానే అరుస్తూ ఉండిపోయారు. నిప్పు రవ్వంత ప్రాణమైనా వారిలో మిగలలేదు.
21. అల్
అంబియా 16
- 18 మేము ఈ ఆకాశాన్నీ, ఈ భూమినీ వాటిలో ఉన్న సమస్తాన్నీ కాలక్షేపం కోసం సృష్టించలేదు. ఒకవేళ మేము ఏదైనా ఆట వస్తువును చేయదలిస్తే - అసలు మేము చేయవలసింది కేవలం ఇంతే అయితే - మేము మా వద్ద ఉన్న దానినే చేసుకునేవారము. కాని మేము అసత్యాన్ని సత్యంతో దెబ్బతీస్తాము, అది దాని తలను పగలగొడుతుంది. చూస్తూ ఉండగానే అది సమసిపోతుంది. మీరు కల్పన చేస్తున్న విషయాల కారణంగా మీకు సర్వనాశనం తప్పదు.
21. అల్
అంబియా 19
- 20 భూమిపైనా, ఆకాశాలలోనూ సృజింపబడినవన్నీ అల్లాహ్వే. ఆయన వద్ద ఉండే (దైవదూతలు) వారు తమను తాము గొప్పవారుగా భావించుకుని ఆయన దాస్యాన్నీ ధిక్కరించరు, బాధపడరు కూడ. రేయింబవళ్లు ఆయన స్తోత్రం చేస్తూనే ఉంటారు, విశ్రమించరు.
21. అల్
అంబియా 21 వారు ప్రపంచంలో కల్పించుకున్న దేవుళ్లు (ప్రాణంలేని వాటికి ప్రాణం పోసి) లేపి నిలబెట్టగలరా?
21. అల్
అంబియా 22
- 23 ఒకవేళ ఆకాశంలో, భూమిలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్లు కూడ ఉంటే, అప్పుడు (భూమ్యాకాశాల) రెండిరటి వ్యవస్థ ఛిన్నాభిన్నమై ఉండేది. కనుక అధికార పీఠానికి ప్రభువైన అల్లాహ్ వారు కల్పించే విషయాల నుండి పరిశుద్ధుడు. ఆయన తాను చేసే పనులకు (ఎవరి ముందూ) జవాబుదారుకాడు. కాని అందరూ (ఆయన ముందు) జవాబుదారులే.
21. అల్
అంబియా 24
- 25 ఆయనను కాదని వారు వేరే దేవుళ్లను కల్పించుకున్నారా? ఓ ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘మీ రుజువును తీసుకురండి. ఈ గ్రంథం కూడ ఉన్నది. అందులో నా యుగపు ప్రజల కొరకు హితబోధ ఉన్నది. నాకు పూర్వం ఉన్న ప్రజల కొరకు హితబోధ గరిపిన గ్రంథాలు కూడ ఉన్నాయి.’’ కాని వారిలో చాల మందికి యధార్థమేమిటో తెలియదు. కాబట్టి వారు విముఖులై ఉన్నారు. మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా, అతనికి వహీ ద్వారా, ‘‘నేను తప్ప దేవుడు లేడు. కనుక మీరు నాకే దాస్యం చేయండి’’ అనే విషయాన్నే తెలియజేశాము.
21. అల్
అంబియా 26
- 29 వారు, ‘‘కరుణామయుడు సంతానవంతుడు’’ అని అంటారు. అల్లాహ్ ఎంతో పరిశుద్ధుడు. వారు (దైవదూతలు) దాసులు, వారికి గౌరవం ఇవ్వబడిరది. వారు ఆయన సాన్నిధ్యంలో ముందుకు వచ్చి మాట్లాడరు, కేవలం ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటారు. ఆయన వారికి ముందు ఉన్న దానినీ ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నదానినీ ఎరుగును. వారు ఎవరిని గురించీ సిఫారసు చేయరు, సిఫారసు వినటానికి అల్లాహ్ ఇష్టపడిన వాని విషయంలో తప్ప. ఆయన భయం వల్ల వారు భీతావహులై ఉంటారు. వారిలో ఎవరైనా, ‘‘అల్లాహ్తో పాటు, నేను కూడ ఒక దేవుడినే’’ అని అంటే, అతనికి మేము నరక శిక్ష విధిస్తాము. దుర్మార్గులకు మా వద్ద లభించే ప్రతిఫలం ఇదే.
21. అల్
అంబియా 30
- 33 (ప్రవక్త మాటలను విశ్వసించకుండా) తిరస్కరించిన వారు ఈ విషయాలను గురించి ఆలోచించరా
ఆకాశాలూ భూమీ పరస్పరం కలసి ఉండేవనీ, తరువాత మేము వాటిని వేరు చేశామనీ, ప్రాణం ఉన్న ప్రతిదానిని నీళ్లతో సృష్టించామనీ? వారు (సృష్టించే మా ఈ శక్తిని) అంగీకరించరా? మేము భూమిపై పర్వతాలను పటిష్ఠంగా నిలబెట్టాము, అది వాటితో దొర్లిపోకుండా ఉండాలని. మేము దానిపై విశాలమైన మార్గాలను నిర్మించాము, బహుశా ప్రజలు తమ దారిని తెలుసుకుంటారని. మేము ఆకాశాన్ని ఒక సురక్షితమైన కప్పుగా చేశాము. కాని వారేమో సృష్టి యొక్క ఈ సూచనల వైపునకు తమ దృష్టినే మళ్లించరు. రాత్రినీ, పగలునూ సృష్టించినవాడూ, సూర్యచంద్రులను పుట్టించిన వాడూ అల్లాహ్ యే. అవన్నీ తమ తమ కక్ష్యలలో తేలియాడుతూ ఉన్నాయి.
21. అల్
అంబియా 34
- 35 ఓ ప్రవక్తా! శాశ్వత జీవితాన్ని మేము నీకు పూర్వం కూడ ఏ మానవునికీ ప్రసాదించలేదు. ఒకవేళ నీవు మరణిస్తే, వారు మాత్రం శాశ్వతంగా జీవించి ఉంటారా? ప్రతి ప్రాణీ మృత్యువును తప్పకుండా చవిచూస్తుంది. మేము మీ అందరినీ మంచి పరిస్థితులకూ చెడు పరిస్థితులకూ గురిచేసి, పరీక్షిస్తున్నాము. చివరకు మీరు మా వైపునకే మరలవలసి ఉన్నది.
21. అల్
అంబియా 36 ఈ సత్య తిరస్కారులు నిన్ను చూసినప్పుడు నీ పట్ల పరిహాసంతో వ్యవహ రిస్తారు. ‘‘మీ దేవుళ్లను గురించి ప్రస్తావిస్తూ ఉండే వ్యక్తి ఇతనేనా?’’ అని అంటారు. కాని వారేమో కరుణామయుని ప్రస్తావనను తిరస్కరిస్తున్నారు.
21. అల్
అంబియా 37
- 41 మానవుడు తొందరపడే ప్రాణి. ఇప్పుడే నేను నా సూచనలను నీకు చూపిస్తాను, నన్ను తొందరపెట్టకు- వారు ‘‘నీవు సత్యవంతుడవే అయితే, అసలు ఈ బెదిరింపు ఎప్పుడు నెరవేరుతుందో చెప్పు’’ అని అంటారు. అయ్యో! ఈ అవిశ్వాసులకు ఆ సమయం గురించి కొద్దిగానైనా తెలిసివుంటే ఎంత బాగుండును! అప్పుడు వారు అగ్ని నుండి తమ ముఖాలను గానీ తమ వీపు లను గానీ కాపాడుకోలేరు. వారికి ఎక్కడ నుంచీ సహాయమూ అందదు. ఆ విపత్తు అకస్మాత్తుగా వచ్చిపడుతుంది. అది వారిని ఎంత హఠాత్తుగా చుట్టు ముట్టుతుందంటే, వారు దాన్ని వారించనూలేరు, వారికి ఒక్క క్షణం వ్యవధి కూడ దొరకదు. నీకు పూర్వం కూడ దైవప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు. కాని వారిని ఎగతాళి చేసేవారు, తాము ఎగతాళి చేసేసిన దానిలోనే చిక్కుకుపోయారు.
21. అల్
అంబియా 42
- 46 ఓ ప్రవక్తా! వారిని ‘‘రాత్రిగానీ, పగలుగానీ మిమ్మల్ని కరుణామయుని నుండి కాపాడగల వాడెవడు?’’ అని అడుగు.
కాని వారు తమ ప్రభువు హితబోధకు విముఖులవుతున్నారు. మాకు ప్రతికూలంగా వారికి సహాయం చేసే దేవుళ్లు ఎవరైనా వారికి ఉన్నారా? వారు తమకు తామే సహాయం చేసుకోనూలేరు
వారికి మా సహాయ సహకారాలూ లేవు. అసలు విషయం ఏమిటంటే, వారికీ, వారి పూర్వీకులకూ మేము జీవితావసరాలను ఇస్తూ వచ్చాము
ఇలా వారిపై చాల కాలం గడచిపోయింది. కాని మేము భూమిని విభిన్న దిశల నుండి తగ్గిస్తూ వస్తున్న విషయం వారికి కనిపించటంలేదా? వారు ఆధిక్యం వహించగలుగుతారా? వారితో, ‘‘నేను వహీ ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను’’ అని అను - కాని చెవిటివారిని హెచ్చరించి నప్పటికీ వారు పిలుపును వినలేరు. ఒకవేళ నీ ప్రభువు శిక్ష వారిని ఏమాత్రం ముట్టుకున్నా వెంటనే, ‘‘అయ్యో మా దౌర్భాగ్యం! నిస్సందేహంగా మేము దోషులమే’’ అని ఆక్రందన చేస్తారు.
21. అల్
అంబియా 47 కచ్చితంగా తూచేటటువంటి తరాజులను మేము ప్రళయం నాడు ఏర్పాటు చేస్తాము. ఏ వ్యక్తికైనా రవ్వంత అన్యాయం కూడ జరగదు. ఎవరైనా ఆవగిం జంత పనిని చేసి ఉన్నా,
దానిని మేము ముందుకు తీసుకువస్తాము. లెక్క చూడటానికి మేమే చాలు.
21. అల్
అంబియా 48
- 50 పూర్వం మేము మూసా,
హారూన్లకు గీటురాయినీ, జ్యోతినీ, జ్ఞాపికనూ ప్రసాదించి ఉన్నాము
దైవభీతి కలవారి మేలు కొరకు - వారు తమ ప్రభువుకు భయపడతారు, (లెక్క తీసుకునే) ఘడియను గురించి వారు బెదురుతూ ఉంటారు. ఇప్పుడు శుభప్రదమైన ఈ జ్ఞాపికను మేము (మీ కొరకు) అవతరింపజేశాము. అయితే మీరు దీనిని నిరాకరిస్తున్నారా?
21. అల్
అంబియా 51
- 73 దానికి పూర్వమే మేము ఇబ్రాహీమ్కు బుద్ధికుశలతను ప్రసాదించాము, అతనిని గురించి మాకు బాగా తెలుసు. అతను తన తండ్రితో, తన జాతి వారితో ఇలా అన్నప్పటి సందర్భాన్నీ జ్ఞాపకం తెచ్చుకో, ‘‘మీరు అమిత భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటీ?’’ వారు దానికి ఇలా బదులు చెప్పారు, ‘‘మా పితృపితామహులు వాటిని ఆరాధిస్తూ ఉండగా మేము చూశాము.’’ అతను, ‘‘మీరూ మార్గభ్రష్టులే, మీ పితృపితామహులు కూడా పూర్తిగా మార్గభ్రష్టులే’’ అని అన్నాడు. వారు, ‘‘నీవు మా ముందు అసలైన నీ ఆలోచనలనే ప్రకటిస్తున్నావా లేక పరిహాసమాడుతున్నావా?’’ అని అడిగారు. అతను ఇలా జవాబు పలికాడు, ‘‘లేదు, వాస్తవానికి భూమికీ, ఆకాశాలకూ ప్రభువైనవాడే, వాటిని సృష్టించిన వాడే మీ ప్రభువు. ఈ విషయం గురించి నేను మీ ముందు సాక్ష్యమిస్తున్నాను, దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను.
మీరు లేనప్పుడు తప్పకుండా మీ విగ్రహాల పని పడతాను.’’ ఆ విధంగా
అతను వాటిని ముక్కలు ముక్కలుగా చేశాడు. కేవలం వాటిలో ఒక పెద్ద విగ్రహాన్ని మాత్రం విడిచిపెట్టాడు, బహుశా వారు దాని వైపునకు మరలటానికేమో (వారు వచ్చి, విగ్రహాల ఈ స్థితిని చూసి) ఇలా అన్నారు, ‘‘మా దేవుళ్లను ఇలా చేసిందెవరు? వాడెవడో పరమ దుర్మార్గుడే.’’ (కొందరు) ఇలా అన్నారు, ‘‘ఒక యువకుడు వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము. అతని పేరు ఇబ్రాహీమ్.’’ వారు ఇలా అన్నారు, ‘‘అయితే వాణ్ణి అందరిముందుకు పట్టుకురండి (అతన్ని ఎలా శిక్షిస్తారో) ప్రజలు చూస్తారు,’’ వారు (ఇబ్రాహీమ్ వచ్చినప్పుడు) ‘‘ఏమిటి ఇబ్రాహీమ్! మా దేవుళ్లను ఇలా చేసింది నీవేనా?’’ అని అడిగారు. అతను, ‘‘వాస్తవానికి వాటి ఈ నాయకుడే ఇదంతా చేశాడు. వాటినే అడగండి, అవి మాట్లాడగలిగితే’’ అని సమాధానం చెప్పాడు. ఇది విని వారు తమ అంతరాత్మల వైపునకు మరలారు. (తమ మనస్సులలో) ఇలా అనుకోసాగారు, ‘‘వాస్తవానికి స్వయంగా మీరే దుర్మార్గులు.’’ కాని తరువాత వారి బుద్ధి తలక్రిందులైపోయింది ‘‘ఇవి మాట్లాడలేవని నీకు తెలుసుగా!’’ అని అన్నారు. ఇబ్రాహీమ్ ఇలా అన్నాడు, ‘‘అయితే, మీరు అల్లాహ్ ను కాదని మీకు లాభంకానీ, నష్టం కానీ కలిగించగల సామర్థ్యం లేని వాటిని పూజిస్తున్నారా? ధూత్కారం, మీపైనా, అల్లాహ్ ను కాదని మీరు పూజించే దేవుళ్లపైనా, మీకు ఏమాత్రం బుద్ధిలేదా?’’ వారు ఇలా అన్నారు, ‘‘మీరేదైనా చేయదలిస్తే, ఇతనిని సజీవంగా దహనం చేయండి, మీ దేవుళ్లకు అండగా నిలవండి.’’ అప్పుడు మేము ఇలా అన్నాము, ‘‘ఓ అగ్నీ! చల్లగా అయిపో ఇబ్రాహీమ్కు భద్రత అయిపో.’’ వారు ఇబ్రాహీమ్కు కీడు తలపెట్టారు. కాని మేము వారి కుతంత్రాలను వమ్ము చేశాము. మేము అతనిని, లూత్నూ కాపాడి, ప్రపంచ వాసులకు మేము శుభాలను నిక్షేపించిన భూభాగం వైపునకు వారిని తీసుకుని వెళ్లాము. మేము అతనికి ఇస్హాఖ్ను ప్రసాదించాము, అదనంగా యాఖూబ్ను కూడ ఇచ్చాము
ప్రతి ఒక్కడినీ మేము సౌశీల్యవంతుడుగా చేశాము. మా ఆజ్ఞానుసారం మార్గదర్శకత్వం నెరపేవారిని మేము నాయకులుగా చేశాము. మేము వహీ ద్వారా సత్కార్యాలు చెయ్యండి అనీ, నమాజ్ను స్థాపించండి అనీ, జకాత్ ఇవ్వండి అనీ వారికి బోధించాము. వారు మమ్మల్ని ఆరాధించేవారు.
21. అల్
అంబియా 74
- 75 మేము లూత్కు ఆజ్ఞనూ, జ్ఞానాన్నీ ప్రసాదించాము
సిగ్గుమాలిన చేష్టలు చేసే పట్టణం నుండి అతనికి విముక్తి కలిగించాము - వాస్తవంగానే అది పరమ నీచమైన, హద్దులు మీరిన పాపిష్ఠ జాతి - మేము లూత్ను మా కారుణ్యంలోకి ప్రవేశింపజేశాము. అతను నిజంగానే సజ్జనులలోని వాడు.
21. అల్
అంబియా 76
- 77 ఈ కానుకనే మేము నూహ్ కు ప్రసాదించాము. వీరందరికంటే ముందు అతను మమ్మల్ని వేడుకున్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. మేము అతని ప్రార్థనను అంగీకరించాము. అతనికీ, అతని కుటుంబానికీ తీవ్రమైన వ్యధ నుండి విముక్తి కలిగించాము. మా ఆయతులు అసత్యాలని తిరస్కరించిన జాతి వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. వారు పరమ దుష్టులు, ఆ కారణంగా మేము వారందరినీ ముంచివేశాము.
21. అల్
అంబియా 78
- 79 ఈ కానుకనే ఇచ్చి మేము దావూద్నూ, సులైమాన్నూ అనుగ్ర హించాము. వారు ఉభయులూ ఒక చేను వ్యాజ్యం విషయంలో తీర్పు చేస్తు న్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో: రాత్రివేళ ఇతరుల మేకలు ఆ చేనులో పడి తిరిగాయి.
వారు తీర్పు చేసే విధానాన్ని స్వయంగా మేము చూస్తూ ఉన్నాము. ఆ సమయంలో మేము సులైమాన్కు సరిjైున తీర్పు అవగాహననూ కలుగ జేశాము. యధార్థానికి న్యాయాన్నీ, జ్ఞానాన్నీ మేము ఉభయులకూ ప్రసాదించాము.
21. అల్
అంబియా 80
- 82 దావూద్తో పాటు పర్వతాలు, పక్షులు (మా) స్తోత్రం చేసే కట్టుబాటు మేము చేశాము. ఈ పనిని చేసినవారము మేమే. మేము మీ ప్రయోజనం కోసం అతనికి కవచాలు తయారుచేసే కళను నేర్పాము, తద్ద్వారా మిమ్మల్ని పరస్పర హాని నుండి రక్షిద్దామని. అలాంటప్పుడు మీరు కృతజ్ఞులుగా ఉన్నారా? మేము తీవ్రంగా వీచే గాలిని సులైమాన్కు లొంగేలా చేశాము. అది అతని ఆదేశం ప్రకారం మేము శుభాలను ఉంచిన భూభాగం వైపునకు పయనించేది. మేము సకల విషయ పరిజ్ఞానం కలవారము.
మేము షైతానులలో చాలా మందిని అతనికి విధేయులుగా చేశాము.
అవి అతని కొరకు సముద్రంలో మునకలు వేసేవి. ఇదేగాక అవి ఇంకా వేరే పనులు కూడ చేసేవి. వీరందరినీ కనిపెట్టి ఉండేవారం కూడ మేమే.
21. అల్
అంబియా 83
- 84 మరియు దీనినే (బుద్ధికుశలత, తీర్పు చేసే సామర్థ్యం, జ్ఞానం అనే వరాన్ని) మేము అయ్యూబ్కు ప్రసాదించాము. అతను తన ప్రభువును ఇలా వేడుకున్నప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో
‘‘నాకు వ్యాధి సోకింది. నీవు కరుణామయులలోకెల్లా గొప్ప కరుణామయుడవు.’’ మేము అతని ప్రార్థనను అంగీకరించాము మరియు అతనికున్న బాధను తొలగించాము. అతనికి
కేవలం అతని కుటుంబ సభ్యులను తిరిగి ఇవ్వటమే కాకుండా వారితోపాటు, ఇంకా అంతేమందిని కూడ ఇచ్చాము, మా నుండి ప్రత్యేక అనుగ్రహంగా. ఎందుకంటే ఇది ఆరాధకులకు గుణపాఠంగా ఉండాలని.
21. అల్
అంబియా 85
- 86 ఇదే వరాన్ని ఇస్మాయీల్కూ, ఇద్రీస్కూ, జుల్కిఫ్ల్కూ ఇచ్చాము, ఎందుకంటే వారందరూ సహనశీలురు. వారు సజ్జనుల్లోనివారు కాబట్టి మేము వారిని మా కారుణ్యంలోకి ప్రవేశింపజేశాము.
21. అల్
అంబియా 87
- 88 చేప వానిని కూడ మేము అనుగ్రహించాము. అతను కోపంతో వెళ్లిపోయినప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. దానికి మేము సంజాయిషీ అడగబోమని అతను భావించాడు.
చివరకు అతను అగాధమైన చీకట్లల్లో నుండి ఇలా మొరపెట్టుకున్నాడు, ‘‘నీవు తప్ప దేవుడు లేనే లేడు. నీవు పరిశుద్ధుడవు. నిస్సందేహంగా నేను తప్పు చేశాను.’’ అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి, అతనికి ద్ణుఖం నుండి విముక్తి కలిగించాము. ఈ విధంగానే మేము విశ్వాసులను కాపాడుతూ ఉంటాము.
21. అల్
అంబియా 89
- 90 మరియు జకరియ్యాను కూడా అనుగ్రహించాము. అప్పుడు అతను తన ప్రభువును ఇలా వేడుకున్నాడు, ‘‘ప్రభూ! నన్ను ఒంటరివాడు (సంతానహీనుడు)గా విడిచిపెట్టకు. మేలైన వారసుడవు నీవు మాత్రమే.’’ మేము అతని
ప్రార్థనను అంగీకరించాము మరియు అతనికి యహ్యాను ప్రసాదించాము. అతని భార్యను అతనికి (సంతానం కనే) యోగ్యురాలుగా సరిచేశాము.
వారు మంచి పనుల కోసం ఎక్కువగా శ్రమించేవారు. ప్రేమతోనూ, భయంతోనూ
మమ్మల్ని ప్రార్థించేవారు, మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు.
21. అల్
అంబియా 91 మరియు తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళను కూడ (అనుగ్రహిం చాము). మేము ఆమెలో
మా ఆత్మ నుండి ఊదాము. ఆమెనూ, ఆమె కుమారుణ్ణీ సర్వప్రపంచానికి ఒక సూచనగా చేశాము.
21. అల్
అంబియా 92
- 103 మీ ఈ సంఘం వాస్తవానికి ఒకే ఒక సంఘం, నేను మీ ప్రభువును. కనుక మీరు నన్ను ఆరాధించండి. కాని (ఇది ప్రజలు చేసుకున్న నిర్వాకమే) వారు తమలో తాము ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకున్నారు- అందరూ
మా వైపునకు మరలవలసినదే. తరువాత విశ్వాసిగా ఉండి సత్కార్యాలు చేసేవాడి సత్కార్యాలను నిరాదరించటం జరగదు. వాటిని మేము వ్రాస్తున్నాము. మేము నాశనం చేసిన నగరం మళ్లీ మరలి రావటం సంభవం కాని విషయం. చివరకు యాజూజ్, మాజూజ్లు వదలిపెట్టబడినప్పుడు, వారు ప్రతి ఎత్తైన ప్రదేశం నుండి బయల్పడినప్పుడు, సత్యవాగ్దానం నెరవేరే సమయం దగ్గర పడినప్పుడు, హఠాత్తుగా అవిశ్వాసుల కనుగుడ్లు విచ్చుకున్నవి విచ్చుకున్నట్లుగానే ఉండిపోతాయి. వారు ఇలా అంటారు, ‘‘అయ్యో! మా దౌర్భాగ్యం! మేము దీని విషయంలో అశ్రద్ధకు లోనయ్యాము. అంతేకాదు మేము తప్పుచేశాము.’’ నిస్సంశయంగా మీరూ, అల్లాహ్ ను కాదని మీరు పూజించే మీ దైవాలూ నరకానికి ఇంధనం అవుతారు. అక్కడికే మీరు పోవలసి ఉన్నది. వారు నిజంగానే దేవుళ్లే అయితే, అక్కడకు పోయేవారు కాదు. ఇక అందరూ శాశ్వతంగా అందులోనే ఉండాలి. అక్కడ వారు రొప్పుతూ రోజుతూ బుసలు కొడతారు. ఇంకా అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అందులో వారికి ఏ శబ్దమూ వినిపించదు. ఇక, మా తరఫునుండి మేలు కలుగుతుందని మొదట్లోనే తీర్పు ఇవ్వబడిన ప్రజల విషయానికి వస్తే వారు నిశ్చయంగా దానికి దూరంగా ఉంచబడతారు. దాని రెపరెపను సైతం వారు వినరు. వారు సదా తమ మనస్సులు కోరుకునే వస్తువుల మధ్య ఉంటారు. మిక్కిలి కలవరపెట్టే ఆ సమయం వారిని ఏమాత్రం బాధపెట్టదు. దైవదూతలు ఎదురు వచ్చి వారికి స్వాగతం పలికి, ‘‘మీకు వాగ్దానం చేయబడిన మీ దినం ఇదే’’ అని అంటారు.
21. అల్
అంబియా 104
- 106 ఆ రోజున మేము ఆకాశాన్ని చిట్టాకాగితాలను చుట్టే విధంగా చుట్టిపడేస్తాము. మేము మొదట్లో సృష్టిని చేసినట్లే మళ్లీ దానిని చేస్తాము. ఇది మాపై బాధ్యతగా ఉన్న ఒక వాగ్దానం. మేము ఈ పనిని ఎలాగైనా చేయవలసే ఉన్నది. మేము జబూర్ గ్రంథంలోనూ హితబోధ చేసిన తరువాత, సౌశీల్యవంతులైన మా దాసులే భూమికి వారసులవుతారని వ్రాసిపెట్టాము. ఆరాధనాపరుల కొరకు ఇందులో గొప్ప సమాచారం ఉన్నది.
21. అల్
అంబియా 107
- 111 ఓ ప్రవక్తా! మేము నిన్ను ప్రపంచ మానవులకు కారుణ్యంగా పంపాము. వారితో ఇలా అను, ‘‘నా వద్దకు వచ్చే వహీ ఏమిటంటే
మీ దేవుడు కేవలం ఒక్కడే. ఇకనైనా మీరు విధేయులవుతారా?’’ ఒకవేళ వారు విముఖులైతే, అప్పుడు ఇలా అను, ‘‘నేను బహిరంగంగా మిమ్మల్ని హెచ్చ రించాను. ఇక మీకు వాగ్దానం చేయబడుతూ ఉన్న విషయం దగ్గర్లో ఉందో లేక దూరంలో ఉందో నాకు తెలియదు. బిగ్గరగా పలికే మాటలను కూడ అల్లాహ్ ఎరుగును. మీరు రహస్యంగా పలికే మాటలను కూడ ఆయన ఎరుగును. బహుశా ఇది (ఆలస్యం) మీ కొరకు ఒక పరీక్షయేమో, ఒక ప్రత్యేక వ్యవధి వరకు ప్రపంచాన్ని అనుభవించటానికి మీకు అవకాశం ఇవ్వబడుతూ ఉన్నదేమో అని నేను అనుకుంటున్నాను.’’
No comments:
Post a Comment