46. అల్ అహ్ఖాఫ్
ఆయతులు
: 35 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 2 హా. మీమ్. ఈ గ్రంథం మహాశక్తిమంతుడూ, మహా వివేకవంతుడూ అయిన అల్లాహ్ తరఫు నుండి అవతరించింది.
3 మేము భూమినీ, ఆకాశాలనూ, వాటి మధ్య ఉన్న సకల వస్తువులనూ సత్యం ప్రకారం, ఒక ప్రత్యేక కాల నిర్ణయంతో సృష్టించాము. కాని ఏ యధార్థం గురించి ఈ అవిశ్వాసులకు హెచ్చరిక చేయబడిరదో, ఆ యధార్థా నికి వారు విముఖులయ్యారు.
4 - 6 ప్రవక్తా! వారితో ఇలా అను, ‘‘మీరు దేవుణ్ణి త్రోసిరాజని వేడుకుంటున్న శక్తులు అసలు ఏమిటో ఎప్పుడైనా మీరు కళ్లు తెరచి చూశారా? భూమిలో వారు సృష్టించింది ఏమిటో,
కొంచెం నాకు చూపండి? లేదా ఆకాశాల సృష్టిలో, వాటి నిర్వహణలో వాటి పాత్ర ఏమైనా ఉందా? ఒకవేళ ఇదివరకు వచ్చిన ఏదైనా గ్రంథంగానీ లేదా జ్ఞాన అవశేషంగానీ (ఈ విశ్వాసాలకు ఆధారంగా) మీదగ్గర ఉంటే, దాన్నే తీసుకురండి, మీరు సత్యవంతులే అయితే.’’ అల్లాహ్ ను కాదని, ప్రళయం వచ్చే వరకు అతనికి సమాధానమైనా ఇవ్వలేని వారిని, మొరపెట్టుకునే వారు తమకు మొరపెట్టుకుంటున్నారనే విషయం కూడ ఎరుగని వారిని వేడుకునే వాడికంటే పరమ భ్రష్టుడైన మానవుడు ఎవడు ఉంటాడు? మానవులందరినీ సమావేశపరచినప్పుడు, వారు తమను వేడుకున్న వారికి విరోధులైపోతారు, వారి ఆరాధనను తిరస్కరిస్తారు.
7 - 8 ఎంతో స్పష్టమైన మా వాక్యాలను వారికి వినిపించినప్పుడు, సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు, ఈ అవిశ్వాసులు
దానిని గురించి, ‘‘ఇది స్పష్టంగా మంత్రజాలమే’’ అని అంటారు. అయితే ప్రవక్తయే దానిని కల్పిం చాడని వారి భావమా? వారితో ఇలా అను, ‘‘ఒకవేళ నేనే దానిని కల్పించి ఉన్నట్లయితే, మీరు దేవుని శిక్ష నుండి నన్ను ఏమాత్రం కాపాడలేరు. మీరు కల్పించే విషయాలను అల్లాహ్ బాగా ఎరుగును. నాకూ మీకూ మధ్య సాక్షిగా దేవుడే సరిపోతాడు. ఆయన ఎక్కువగా మన్నించేవాడు, కరుణించేవాడూను.’’
9 - 10 వారితో ఇలా అను, ‘‘నేను కొత్తప్రవక్తనేమీ కాను. రేపు మీకు ఏమి జరుగనున్నదో, నాకు ఏమి కానున్నదో, నాకైతే తెలియదు. నేను నావద్దకు పంపబడే దైవవాణి (వహీ)ని మాత్రమే అనుసరిస్తున్నాను. నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి తప్ప మరేమీ కాను.’’
ప్రవక్తా! వారికి ఇలా చెప్పు: ‘‘ఒకవేళ ఈ గ్రంథం అల్లాహ్ తరఫు నుండి వచ్చి ఉండి, మీరు దానిని తిరస్కరిస్తూ ఉన్నట్లయితే, (అప్పుడు మీ గతి ఏమవుతుందో) అనే విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? ఇటువంటి ఒక గ్రంథాన్ని గురించి ఇస్రాయీల్ సంతతికి చెందిన ఒక సాక్షి సాక్ష్యం
కూడ ఇచ్చి ఉన్నాడు. అతడేమో విశ్వసించాడు, మీరేమో అహంభావానికి లోనయ్యారు. అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
11 - 14 విశ్వసించేందుకు తిరస్కరించినవారు, విశ్వసించే వారిని గురించి, ‘‘ఈ గ్రంథాన్ని విశ్వసించటం అనేది మంచి పనే అయితే,వారు ఈ విషయంలో మాకంటే ముందుకు పోగలిగేవారు కాదు’’ అని అంటారు. వారు దానినుండి మార్గదర్శకత్వం పొందలేదు కాబట్టి, ‘‘ఇది పాత అబద్ధమే’’ అని తప్ప కుండా అంటారు. వాస్తవానికి ఇంతకు పూర్వం మూసా గ్రంథం మార్గదర్శిగా, కారుణ్యంగా వచ్చేసింది. ఈ గ్రంథం
దానిని ధ్రువీకరిస్తూ అరబ్బీ భాషలో వచ్చింది
దుర్మార్గులను హెచ్చరించటానికి, సద్వైఖరి అవలంబించే వారికి శుభవార్తలు ఇవ్వటానికిన్నీ. నిశ్చయంగా అల్లాహ్ యే మా ప్రభువు అని ప్రక టించి, దానిపై స్థిరంగా ఉండిపోయిన వారికి ఏ భయమూ లేదు, వారు ద్ణుఖించటమూ జరగదు. అటువంటి వారే స్వర్గానికి పోయేవారు. అక్కడనే వారు శాశ్వతంగా ఉంటారు,
ప్రపంచంలో తాము చేసిన పనులకు ప్రతిఫలంగా.
15 - 20 మేము మానవునికి, అతను తన తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలని ఉపదేశించాము. అతని తల్లి అతనిని ఎంతో శ్రమతో తన గర్భంలో పెట్టుకొని మోసింది
ఎంతో శ్రమతోనే అతనిని కన్నది. అతనిని గర్భంలో పెట్టుకొని మోసేందుకు,
అతనిచే పాలు మాన్పించేందుకు ముప్ఫై మాసాలు పట్టింది. చివరకు అతను పరిపూర్ణ శక్తిని పొంది, నలభై సంవత్సరాల వయ స్సుకు చేరినప్పుడు, ఇలా అన్నాడు, ‘‘నా ప్రభూ! నాకూ, నా తల్లిదండ్రులకూ నీవు ప్రసాదించిన మహాభాగ్యాలకు గాను, నీకు కృతజ్ఞతలు తెలిపే, నీవు ఇష్టపడే సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా, నా సంతానాన్ని కూడ మంచివారుగా చేసి నాకు సుఖాన్ని ఇవ్వు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాప పడుతూ నీ వైపునకు మరలుతున్నాను. నేను విధేయు(ముస్లిమ్)లైన దాసుల లోని వాడను.’’ ఇటువంటి వారి నుండి మేము వారు చేసిన మంచి కర్మలను స్వీకరిస్తాము
వారు చేసిన చెడు కర్మలను మన్నిస్తాము. వారికి చేయబడుతూ వచ్చిన సత్యవాగ్దానం ప్రకారం, వారు స్వర్గవాసులలో చేరిపోతారు. ఏ వ్యక్తి తన తల్లిదండ్రులతో ఇలా అన్నాడో, ‘‘ఛీ, పోండి, మీరు నన్ను విసిగిస్తున్నారు. మరణించిన తరువాత
నేను సమాధి నుండి లేపబడతానని మీరు నన్ను భయపెడుతున్నారా? వాస్తవానికి నాకు పూర్వం ఎన్నో తరాలు గతించాయి (వారిలో నుండి ఎవ్వడూ లేచిరాలేదు కదా!)’’ ఆ వ్యక్తిని గురించి తల్లి దండ్రులు ఇద్దరూ సహాయం కోసం అల్లాహ్ కు మొరపెట్టుకొని ఇలా అన్నారు, ‘‘ఓరి దౌర్భాగ్యుడా! విశ్వసించు. అల్లాహ్ వాగ్దానం సత్యమైనది.’’ కాని అతడు, ‘‘ఇవన్నీ పాతకాలపు కట్టుకథలు’’ అని కొట్టిపారేశాడు. ఇటువంటి వారి మీదనే శిక్షా నిర్ణయం రూఢీ అయిపోయింది. వారికి పూర్వం గతించిన జిన్నాతులు, మానవుల గుంపులలోనే వారు కూడా పోయి చేరుతారు. నిస్సం దేహంగా వారు నష్టంలోపడి ఉండిపోయేవారు. రెండు వర్గాలలోని ప్రతి ఒక్క వర్గానికి దాని కర్మలను బట్టి దాని అంతస్తు ఉంటుంది. వారు చేసిన దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వటానికి అల్లాహ్ ఇలా చేస్తాడు. వారికి అన్యాయం ఎంతమాత్రం జరగదు. తరువాత ఈ అవిశ్వాసులను అగ్నిముందుకు తీసుకు వచ్చి నిలబెట్టినప్పుడు, వారితో ఇలా అనటం జరుగుతుంది
‘‘మీరు మీ వంతు వరాలను మీ ప్రాపంచిక జీవితంలో పొందారు. వాటిద్వారా ఆనందాన్ని మీరు అక్కడే అనుభవించారు. ఇక ఏ హక్కూ అర్హతా లేకుండా మీరు భూమిపై ప్రదర్శిస్తూ ఉండిన దురహంకారానికి, మీ అవిధేయతా చేష్టలకు పర్యవ సానంగా, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది.’’
21 - 26 వారికి
కొంచెం ఆద్ సోదరుని (హూద్) గాధను వినిపించు. అప్పుడు అతను ఇసుక గుట్టల మధ్య నివసించే తన జాతి వారిని ఇలా హెచ్చరించాడు-
అలా హెచ్చరించేవారు అతనికి పూర్వం కూడవచ్చారు, అతని తరువాత కూడ వచ్చారు- ‘‘అల్లాహ్ ను తప్ప మరెవరినీ ఆరాధించకండి. మీ విషయంలో ఒక భయంకర దినాన విధించబడే శిక్షను గురించి నేను భయపడుతున్నాను.’’ దానికి వారు ఇలా అన్నారు, ‘‘మాయమాటలు
చెప్పి మా దేవతల నుండి మమ్మల్ని దూరం చేయటానికా వచ్చింది నీవు?
సరే, మంచిది, నీవు సత్యవంతుడవే అయితే, నీవు మమ్మల్ని భయపెడుతూ ఉన్నటు వంటి ఆ శిక్షను తీసుకు రా.’’ అతను ఇలా అన్నాడు,
‘‘దానిని గురించి అల్లాహ్ కు మాత్రమే తెలుసు. ఏ సందేశాన్ని ఇచ్చి నన్ను పంపడం జరిగిందో ఆ సందేశాన్నే నేను మీకు అందజేస్తున్నాను. కాని నేను గమనిస్తున్నాను, మీరు అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నారు.’’ తరువాత వారు ఆ శిక్షను తమ లోయల వైపునకు వస్తూ ఉండగా చూసి, ‘‘ఇవి పుష్కలంగా మాకు వర్షాన్ని కురిపించే మేఘాలు’’ అని అనసాగారు- కాదు,
కాని ఇది మీరు తొందరపెడుతూ ఉన్న విషయం. ఇది తుఫాను గాలి, వ్యధాపూరితమైన శిక్షను తెస్తోంది, తన ప్రభువు ఆజ్ఞానుసారం ప్రతివస్తువునూ సర్వనాశనం చేస్తుంది. చివరకు వారి నివాస స్థలాలు తప్ప అక్కడ ఏమీ కనిపించకుండా పోయింది. ఈ విధంగా మేము నేరస్తులకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాము. మీకు ఇవ్వనివి ఎన్నో మేము వారికి ఇచ్చాము. మేము వారికి చెవులూ, కళ్లూ, మనస్సూ అన్నీ ఇచ్చాము. కాని ఆ చెవులూ వారికి
ఏ విధంగానూ పనికి రాలేదు, కళ్లూ మనస్సూ కూడా (పనికిరాలేదు). ఎందుకంటే వారు అల్లాహ్ వాక్యాలను తిరస్కరిస్తూ ఉండేవారు. వారు దేనిని గురించి వేళాకోళం చేస్తూ ఉండేవారో, దాని వలలోనే వారు చిక్కుకు పొయ్యారు.
27 - 28 మీ చుట్టుపక్కల
ప్రాంతాలలోని ఎన్నో జనపదాలను మేము నాశనం చేసివేశాము. మేము మా వాక్యాలను పంపి మాటిమాటికి రకరకా లుగా వారికి నచ్చజెప్పాము, బహుశా వారు దారికి వస్తారేమో అని. అల్లాహ్ ను వదలిపెట్టి, వారు ఏ
శక్తులను అల్లాహ్ సాన్నిధ్యాన్ని పొందటానికి సాధ నాలుగా భావించి, దైవాలుగా చేసుకున్నారో, ఆ శక్తులు వారికి ఎందుకు సహాయం చేయవు? పైగా అవి
వారికి కనుమరుగైపోయాయి. ఇది వారి అబద్ధాలకూ, వారు కల్పించుకున్న కృత్రిమ విశ్వాసాలకూ పర్యవసానం.
29 - 32 (ఆ సంఘటన కూడ ప్రస్తావించదగినదే) అప్పుడు మేము జిన్నాతుల ఒక వర్గాన్ని ఖురాన్ వినేందుకు నీ వద్దకు తీసుకువచ్చాము. నీవు ఖురాన్ పఠిస్తూ ఉండిన స్థలానికి చేరిన తరువాత,
వారు పరస్పరం ‘‘నిశ్శబ్దంగా ఉండండి’’ అని చెప్పుకున్నారు. అది చదవటం ముగిసిన పిదప, వారు హెచ్చరిక చేసేవారుగా తమ జాతి వైపునకు తిరిగి వెళ్లిపోయారు. వారు అక్కడకు వెళ్లి ఇలా అన్నారు, ‘‘ఓ మా జాతి ప్రజలారా! మేము
ఒక గ్రంథాన్ని విన్నాము. అది మూసా ప్రవక్త తరువాత అవతరించింది
తనకు పూర్వం అవతరించిన గ్రంథాలను ధ్రువీకరిస్తుంది, సత్యం వైపునకూ,
ఋజుమార్గం వైపునకూ దారిచూపుతుంది. ఓ మా జాతి ప్రజలారా!
అల్లాహ్ వైపునకు పిలిచే వాని సందేశాన్ని స్వీకరించండి, అతనిని విశ్వసించండి. అప్పుడు అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు, మిమ్మల్ని భయంకరమైన శిక్ష నుండి రక్షిస్తాడు.’’ అల్లాహ్ వైపునకు పిలిచే వాని మాటను విననివాడు భూమిలో అల్లాహ్ ను అశక్తుడుగా చేసే శక్తిని కలిగిలేడు. అతనిని అల్లాహ్ నుండి రక్షించేందుకు
ఎలాంటి మద్దతుదారులు గానీ, సంరక్షకులుగానీ ఎవరూ ఉండరు. అటువంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు.
33 - 34 ఏ దేవుడైతే ఈ భూమినీ, ఈ ఆకాశాన్నీ సృష్టించాడో, వాటిని సృష్టించటంలో అలసిపోలేదో, ఆ దేవుడు మృతులను తప్పకుండా బ్రతికించి లేపగల శక్తిని కూడ కలిగి ఉన్నాడనే విషయం వారికి తోచటంలేదా? ఎందుకు కలిగిలేడు, నిశ్చయంగా ఆయన ప్రతి దానినీ చేయగల శక్తి సామర్థ్యాలు కలవాడు. అవిశ్వాసులు అగ్ని ముందుకు తీసుకురాబడే రోజున వారిని, ‘‘ఇది సత్యం కాదా?’’
అని అడగటం జరుగుతుంది. వారు, ‘‘అవును, మా ప్రభువు సాక్షిగా! (ఇది నిజంగానే సత్యం)’’ అని అంటారు. అల్లాహ్, ‘‘సరే, ఇక మీరు తిరస్కరిస్తూ ఉండిన దాని పర్యవసానంగా, శిక్షను రుచిచూడండి’’ అని సెలవిస్తాడు.
35 కనుక ప్రవక్తా! సహనం వహించు, దృఢచిత్తులైన ప్రవక్తలు సహనం వహించినట్లుగా.
వారి విషయంలో తొందరపడకు. దేనిని గురించి వారిని ఇప్పుడు భయపెట్టటం జరుగుతోందో, దానిని వారు చూసిన రోజున, వారికి ప్రపంచంలో దినంలోని ఒక గడియకంటే ఎక్కువ కాలం కూడ ఉండ లేదు అని అనిపిస్తుంది. సందేశం అందజేయబడిరది. ఇక అవిధేయులు తప్ప మరెవరు నాశన మవుతారు?
No comments:
Post a Comment