86 సూరహ్ అత్ తారీఖ్

 

86 అత్ తారీఖ్

ఆయతులు : 17                                                                                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 17 ఆకాశం సాక్షిగా! రాత్రివేళ ప్రత్యక్షమయ్యేది సాక్షిగా! రాత్రివేళ ప్రత్యక్షమయ్యేదేమిటో నీకు తెలుసా? అది మెరిసే నక్షత్రం - తనకు ఒక సంరక్షకుడంటూ లేని ప్రాణి ఏదీ లేదు. కనుక మానవుడు తాను ఎలాంటి వస్తువుతో పుట్టించబడ్డాడో కొంచెం ఆలోచించాలి. వెన్నెముకకు, ప్రక్కటెము కలకు మధ్య నుండి  దూకుడుగా  వెలువడే ఒక ద్రవపదార్థంతో అతడు పుట్టించబడ్డాడు. నిశ్చయంగా ఆయన (సృష్టికర్త) అతన్ని మళ్ళీ సృష్టించగల శక్తిమంతుడు.  దాగివున్న  రహస్యాలు బట్టబయలై పరీక్షించబడే  రోజున  మానవుని వద్ద స్వయంగా తనదంటూ శక్తీ ఉండదు. అతనికి సహాయం చేసేవాడు కూడ ఎవడూ ఉండడు. వర్షాన్ని కురిపించే ఆకాశం సాక్షిగా, (వృక్షజాతి మొలకెత్తేటప్పుడు) బ్రద్దలయ్యే నేల సాక్షిగా, ఇదొక నిర్ణయాత్మకమైన విషయం, నవ్వులాట కాదు. వీరు (అంటే మక్కా అవిశ్వాసులు) కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు, నేను కూడ ఒక పన్నాగం పన్నుతున్నాను. కనుక ప్రవక్తా! అవిశ్వాసులను వదిలెయ్యి, కొంతకాలం పాటు వారి మానాన వారిని వదిలెయ్యి.

No comments:

Post a Comment