13 సూరహ్ అర్రాద్‌

 

13. అర్రాద్

ఆయతులు : 43          అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

13. అర్రాద్  1 అలిఫ్లామ్మీమ్రా. ఇవి అల్లాహ్ గ్రంథంలోని ఆయతులు. నీ ప్రభువు తరఫునుండి నీపై అవతరింపచేయబడినదంతా పూర్తిగా సత్యం. కాని (మీ జాతికి చెందిన) చాలామంది విశ్వసించటం లేదు.

13. అర్రాద్  2 మీకు కనిపించే ఆధారాలు లేకుండా ఆకాశాలను నిలిపిన వాడు అల్లాహ్ యే. తరువాత ఆయన తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. ఆయన సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ ఒక నియమానికి బద్ధులుగా చేశాడు. సమస్త వ్యవస్థకు చెందిన ప్రతి వస్తువూ ఒక నిర్ణీతకాలం వరకు పయనిస్తోంది. అల్లాహ్ యే మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నాడు. ఆయన తన సూచనలను స్పష్టంగా వివరిస్తున్నాడు, బహుశా మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్ముతారేమో అని.

13. అర్రాద్  3 ఆయనే భూమిని విశాలంగా పరచినవాడు  అందులో పర్వతాలను గుంజలవలె పాతిపెట్టినవాడు, నదులను ప్రవహింపజేసినవాడు, ఆయనే అన్ని రకాల పండ్ల జతలను పండిరచినవాడు, ఆయనే పగలుపై రాత్రిని కప్పేవాడు, అన్ని విషయాలలోనూ ఆలోచించే వారికొరకు పెద్ద సూచనలు ఉన్నాయి.

13. అర్రాద్  4 చూడండి! భూమిలో వేర్వేరు ప్రదేశాలు ఉన్నాయి. అవి ఒకదానికొకటి ప్రక్కప్రక్కన ఉన్నాయి. ద్రాక్ష తోటలూ ఉన్నాయి, పంటపొలాలూ ఉన్నాయి, ఖర్జూరపు చెట్లూ ఉన్నాయి - వాటిలో కొన్ని ఒక్కొక్కటిగానూ మరికొన్ని జంటలుగానూ ఉన్నాయి - వాటన్నింటికీ ఒకే నీరు పారుతోంది. కానీ మేము కొన్నింటిని ఎక్కువ రుచికరమైనవిగా చేశాము. మరికొన్నింటిని తక్కువ రుచికరమైనవిగా చేశాము. అన్ని విషయాలలోనూ బుద్ధిని ఉపయోగించే వారికి చాలా సూచనలు ఉన్నాయి.

13. అర్రాద్  5 ఒకవేళ మీరు ఇప్పుడు ఆశ్చర్యపడవలసివుంటే, ఆశ్చర్యపడదగిన విషయం ప్రజలయొక్క మాట : ‘‘మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు మళ్ళీ మేము సరికొత్తగా పుట్టించబడతామా?’’ వారే తమ ప్రభువును తిరస్కరించిన వారు. వారి మెడలలోనే కంఠపట్టికలు ఉండేది. వారు నరకవాసులు. నరకంలో కలకాలం ఉంటారు.

13. అర్రాద్  6 వారు మేలుకు ముందు కీడుకొరకు తొందర పెడుతున్నారు. వాస్తవానికి వారికి పూర్వం ( వైఖరినే అవలంబించిన వారిపై దేవుని శిక్ష పడిన) గుణపాఠాన్ని నేర్పే దృష్టాంతాలు ఎన్నో జరిగాయి. నిజం ఏమిటంటే ప్రజలు దుర్మార్గాలు చేసిన తరువాత కూడా, నీ ప్రభువు వారిని మన్నించి వదలివేస్తాడు. నీ ప్రభువు కఠినంగా శిక్షించే వాడనేది కూడా నిజమే.

13. అర్రాద్  7 నీ మాటను వినటానికి నిరాకరించిన వారు ఇలా అంటారు : ‘‘ వ్యక్తిపై ఇతని ప్రభువు తరఫు నుండి ఒక నిదర్శనం ఏదైనా ఎందుకు అవతరించలేదు?’’ - నీవు కేవలం హెచ్చరించేవాడివి మాత్రమే. ప్రతి జాతి కొరకూ ఒక మార్గదర్శకుడు ఉన్నాడు.

13. అర్రాద్  8 - 11 అల్లాహ్ కు ప్రతి గర్భిణి యొక్క గర్భాన్ని గురించి తెలుసు  అందులో తయారయ్యేది కూడా ఆయనకు తెలుసు  అందులో జరిగే హెచ్చుతగ్గులను గురించి కూడా ఆయనకు తెలుసు. ఆయన వద్ద ప్రతి వస్తువు కొరకు ఒక పరిమాణం నిర్ణయమై ఉన్నది. ఆయన గోప్యంగా ఉన్నటువంటి, బహిరంగంగా ఉన్నటువంటి ప్రతి వస్తువును గురించీ తెలిసిన పండితుడు. ఆయన గొప్పవాడు. సర్వకాల సర్వావస్థలలో ఆధిక్యం కలిగి ఉండేవాడు. మీలో ఎవరైనా బిగ్గరగా మాట్లాడినా లేక మెల్లగా  మాట్లాడినా  మీలో ఎవరైనా రాత్రి చీకటిలో దాగివున్నా లేక పగటి వెలుగులో నడుస్తూ ఉన్నా, ఆయనకు వారంతా సమానమే. ప్రతి మనిషికీ ముందూ వెనకా ఆయన నియమించిన కావలివాళ్ళు అంటి ఉన్నారు. వారు అల్లాహ్ ఆజ్ఞానుసారం అతనిని కాపాడుతూ ఉంటారు. యథార్థం ఏమిటంటే, ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంతవరకు అల్లాహ్ దాని స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతిని తన శిక్షకు గురిచేసే నిర్ణయం తీసుకున్నప్పుడు, దానిని ఎవరు తొలగించదలచు కున్నా అది తొలగదు  అల్లాహ్ కు ప్రతికూలంగా అటువంటి జాతిని రక్షించేవాడూ, ఆదుకునేవాడూ ఎవడూ ఉండడు.

13. అర్రాద్  12 - 13 ఆయనే మీ ముందు మెరుపులను మెరిపింపజేస్తున్నాడు. వాటిని చూసి మీలో భయాలూ చెలరేగుతాయి, ఆశలూ చిగురిస్తాయి. ఆయనే నీళ్ళతో బరువెక్కిన మేఘాలను పైకి లేపుతున్నాడు. మేఘాల గర్జన ఆయనను స్తోత్రం చేస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది. దైవదూతలు ఆయన భయంవల్ల వణికిపోతూ ఆయనను కీర్తిస్తూ ఉంటారు. ఆయన ఫెళ ఫెళమనే పిడుగులను పంపుతాడు. (తరచుగా) వాటిని తాను కోరిన వారిపై, సరిగ్గా ప్రజలు అల్లాహ్ ను గురించి ఘర్షణపడే సమయంలో పడవేస్తాడు. వాస్తవంగా ఆయన యుక్తి అతి శక్తిమంతమైనది.

13. అర్రాద్  14 - 15 ఆయనను మాత్రమే వేడుకోవటం ధర్మం. ఇక వారు ఆయనను వదలి వేడుకుంటున్న ఇతర శక్తులు - అవి వారి ప్రార్థనలకు సమాధానమూ ఇవ్వలేవు. వాటిని వేడుకోవటం ఒక మనిషి నీళ్ళవైపు చేతులుచాచి, దానిని ‘‘నీవు నా నోటిదాకా వచ్చెయ్యి’’ అని అభ్యర్థన చేసిన మాదిరిగా ఉన్నది. వాస్తవానికి నీరు అతని వద్దకు చేరటం జరగదు. కనుక ఇదేవిధంగా అవిశ్వాసుల ప్రార్థనలు కూడా గురిలేని బాణాలేతప్ప మరేమీ కావు. భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువూ ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అల్లాహ్కే సజ్దా చేస్తూ ఉన్నది. అన్ని వస్తువుల నీడలు ఉదయం, సాయంత్రం ఆయన ముందు వంగుతాయి.

13. అర్రాద్  16 ‘‘భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?’’ అని వారిని అడుగు.  ‘‘అల్లాహ్’’ అని అను. తరువాత వారితో ఇలా అను: ‘‘యధార్థం ఇదైనప్పుడు, మీరు ఆయనను వదలి, స్వయంగా తమ విషయంలో కూడా లాభనష్టాల అధికారం లేనటువంటి దేవుళ్ళనా మీరు మీ పనులు నేరవేర్చేవారుగా ఎన్నుకున్నారు?’’ ఇలా అను : ‘‘గుడ్డివారూ కళ్ళున్నవాడూ సమానులు కాగలరా? వెలుగూ చీకట్లూ ఒకటి కాగలవా? అలా కాకపోతే, వారు నిలబెట్టిన భాగస్వాములు కూడా అల్లాహ్ మాదరిగానే దేనినయినా సృష్టించారా, దాని కారణంగా సృష్టి విషయంలో వారికి అనుమానం కలగటానికి?’’ - ఇలా అను : ‘‘ప్రతి వస్తువునూ అల్లాహ్ యే సృష్టించాడు. ఆయన అద్వితీయుడు. అందరిపై ఆధిక్యం కలవాడు.’’

13. అర్రాద్  17 అల్లాహ్ ఆకాశం నుండి నీళ్ళను కురిపించాడు. ప్రతి నదీ, ప్రతి కాలువా తన శక్తికొలది దానిని గ్రహించి బయలుదేరింది. వరద వచ్చినప్పుడు నీళ్ళ ఉపరితలంపైకి నురుగులు కూడా వచ్చాయి. అటువంటి నురుగులే నగలూ, పాత్రలూ మొదలైనవి చెయ్యటానికి ప్రజలు కరిగించే లోహాలపై కూడా లేస్తాయి. ఇటువంటి ఉదాహరణ ద్వారా అల్లాహ్ సత్యమేదో,  అసత్యమేదో సుస్పష్టం చేస్తాడు. నురుగంతా ఎగిరిపోతుంది. మానవులకు లాభం కలిగించే వస్తువు భూమిలో ఉండిపోతుంది. ఈవిధంగా అల్లాహ్ ఉదాహరణల ద్వారా తన మాటలను వివరిస్తాడు.

13. అర్రాద్  18 తమ ప్రభువు సందేశాన్ని స్వీకరించిన వారికి మేలు జరుగుతుంది. దానిని స్వీకరించని వారు సమస్త భూసంపదకు యజమానులు అయినా ఇంకా అంతే సమకూర్చుకున్నా, వారు అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకోవటానికి దానినంతటినీ పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతారు. అటువంటి ప్రజల నుండి దారుణంగా లెక్క తీసుకోబడుతుంది. వారి నివాసం నరకం. అది బహుచెడ్డ నివాసం.

13. అర్రాద్  19 - 25 నీ ప్రభువు నీపై అవతరింపజేసిన గ్రంథం సత్యమని గ్రహించిన వ్యక్తీ, యధార్థం పట్ల అంధుడైన వ్యక్తీ - వారు ఉభయులూ ఎలా సమానులు కాగలరు? హితబోధను వివేకవంతులు మాత్రమే స్వీకరిస్తారు. వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే, వారు అల్లాహ్తో చేసుకున్న తమ ఒడంబడికను నెరవేరుస్తారు. దానిని దృఢపరచిన తరువాత భంగపరచరు. వారి వైఖరి ఎలా ఉంటుందంటే, స్థిరపరచండి అని అల్లాహ్ ఆదేశించిన సంబంధాలను స్థిరపరుస్తారు. తమ ప్రభువునకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్క తీసుకోబడుతుందేమో అని భయపడుతూ ఉంటారు. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తమ ప్రభువు ప్రసన్నత కోసం సహనంతో వ్యవహరిస్తారు. నమాజును స్థాపిస్తారు. మేము ప్రసాదించిన ఉపాధి నుండి బహిరంగంగా, రహస్యంగా ఖర్చు చేస్తారు. చెడును మంచి ద్వారా పారద్రోలుతారు. పరలోక గృహం వారికొరకే ఉన్నది. అంటే, వారికి శాశ్వత నివాస స్థలంగా ఉండే ఉద్యానవనములు. వారు కూడా వాటిలో ప్రవేశిస్తారు. వారి పూర్వీకులలో, వారి భార్యలలో, వారి సంతానంలో సజ్జనులైన వారు కూడా వారితో అక్కడకు పోతారు. ప్రతి వైపునుండి దైవదూతలు వారికి స్వాగతం పలకటానికి వస్తారు. వారితో ఇలా అంటారు : ‘‘మీపై శాంతి వర్షించుగాక! ప్రపంచంలో మీరు సహనంతో వ్యవహరించటం వల్ల రోజు మీరు దీనికి అర్హులయ్యారు.’’ - ఎంత మంచిది పరలోక గృహం! ఇక వారు, అల్లాహ్తో చేసుకున్న ఒడంబడికను దృఢపరచిన తరువాత భంగపరచేవారు, అల్లాహ్ కలపండి అని ఆదేశించిన సంబంధాలను త్రెంచేవారూ, ధరణిపై కల్లోలాన్ని వ్యాపింపజేసేవారూ, వారు శాపానికి అర్హులు. వారికొరకు పరలోకంలో బహుచెడ్డ నివాసం ఉన్నది.

13. అర్రాద్  26 అల్లాహ్ తన ఇష్టప్రకారం కొందరికి ఎక్కువ జీవనోపాధిని ప్రసాదిస్తాడు, మరికొందరికి తక్కువ జీవనోపాధిని ప్రసాదిస్తాడు. వారు ప్రాపంచిక జీవితంలో మునిగిపోయి ఉన్నారు. వాస్తవానికి పరలోకం ముందు ప్రాపంచిక జీవితం ఒక చిరుసంపద తప్ప మరేమీ కాదు.

13. అర్రాద్  27 - 29 (ముహమ్మద్ను ప్రవక్తగా విశ్వసించటానికి) నిరాకరించిన ప్రజలు ఇలా అంటారు: ‘‘ వ్యక్తిపై ఇతని ప్రభువు సన్నిధి నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరించలేదు?’’ ఇలా అను: ‘‘అల్లాహ్ తాను కోరినవారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు. ఆయన తన వైపునకు మరలేవారికి మాత్రమే తన వైపునకు వచ్చే మార్గాన్ని చూపుతాడు. అటువంటి ప్రజలే ( ప్రవక్త సందేశాన్ని) విశ్వసించారు. వారి హృదయాలకు అల్లాహ్ సంస్మరణం వల్ల తృప్తి కలుగుతుంది. తెలుసుకోండి! అల్లాహ్ సంస్మరణ ద్వారానే హృదయాలకు తృప్తిని పొందే భాగ్యం లభిస్తుంది. సత్య సందేశాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు సౌభాగ్యవంతులు. వారికి మంచి ఫలం లభిస్తుంది.

13. అర్రాద్  30 ప్రవక్తా! అదేవిధంగా మేము నిన్ను ప్రవక్తగా నియమించి ఒక జాతివద్దకు పంపాము. దానికి పూర్వం ఎన్నో జాతులు గతించాయి, జాతి ప్రజలకు మేము నీపై అవతరింపజేసిన సందేశాన్ని నీవు వినిపించేందుకుగాను. వాస్తవానికి వారు ఎంతో కరుణామయుడైన తమ దేవుణ్ణి తిరస్కరించారు. వారితో ఇలా అను : ‘‘ఆయనే నా ప్రభువు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. ఆయననే నేను నమ్ముకున్నాను. ఆయనే నా ఏకైక ఆశ్రయం.’’

13. అర్రాద్  31 - 32 పర్వతాలను నడిపించే, భూమిని బద్దలుచేసే, మృతులను గోరీల నుండి బయటికి రప్పించి మాట్లాడిరచే శక్తి కలిగిన ఖురాను దేనినైనా అవతరింపజేస్తే ఏమై ఉండేది? (ఇటువంటి సూచనలు చూపించటం పెద్ద కష్టమేమీ కాదు) ఎందుకంటే అధికారం సమస్తమూ అల్లాహ్ చేతులలోనే ఉంది. అల్లాహ్ గనక కోరితే మానవులందరికీ మార్గం చూపేవాడు అనే విషయాన్ని (తెలుసుకొని) కూడా విశ్వాసులు (అవిశ్వాసుల కోరికకు సమాధానంగా ఏదైనా సూచన ప్రత్యక్షమవుతుందనే) ఆశ వదులుకోలేదా? అల్లాహ్ పట్ల అవిశ్వాసవైఖరిని అవలంబించిన వారిపైకి వారి చేష్టలు కారణంగా ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది. లేదా వారి ఇళ్ళకు సమీపంలో ఎక్కడైనా దిగుతుంది. అల్లాహ్ వాగ్దానం నెరవేరేవరకు పరంపర సాగిపోతూనే ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగపరచడు. నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలను ఎగతాళి చెయ్యటం జరిగింది. కాని నేను ఎల్లప్పుడూ తిరస్కారులకు కొంత సడలింపు ఇచ్చాను. చివరకు వారిని పట్టుకున్నాను. చూడండి, నా శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో!

13. అర్రాద్  33 - 35 ఒక్కొక్క మనిషి సంపాదించేదానిపై నిఘావేసి ఉండేవానికి భాగస్వాములుగా నిలబెట్టే (అంతటి దుస్సాహసానికి పాల్పడుతున్నారా) ప్రజలు? ప్రవక్తా! వారితో ఇలా అను: ‘‘(నిజంగానే వారు దేవుడు స్వయంగా చేసుకున్న భాగస్వాములే అయితే) కొంచెం వారెవరో వారి పేర్లు ఏమిటో చెప్పండి?’’ - తన భూమిలో ఉన్నట్లు అల్లాహ్ కు తెలియని ఒక కొత్త విషయాన్ని గురించి మీరు ఆయనకు తెలుపుతున్నారా? లేక మీరు ఇట్టే నోటికి వచ్చినదల్లా వాగుతున్నారా? యథార్థం ఏమిటంటే, సత్యసందేశాన్ని స్వీకరించటానికి తిరస్కరించినవారికి తమ పన్నుగడలు ఆకర్షకములుగా చెయ్యబడ్డాయి. వారు సన్మార్గం నుండి నిరోధించబడ్డారు. అల్లాహ్ మార్గభ్రష్టత్వంలోకి విసిరివేసిన వాడికి మార్గం చూపే వాడెవడూ లేడు. అటువంటి వారికి ప్రాపంచిక జీవితంలోనే శిక్ష పడుతుంది. పరలోక శిక్ష దీనికంటే కూడా ఎంతో కఠినంగా ఉంటుంది. వారిని దేవుని నుండి రక్షించే వాడెవడూ లేడు. దైవభక్తిగల మానవులకు వాగ్దానం చెయ్యబడిన స్వర్గవైభవం ఇలా ఉంటుంది : దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని ఫలాలు శాశ్వతమైనవి. దాని నీడ నశించనిది. భయభక్తులు కలవారికి లభించే ప్రతిఫలం ఇలా ఉంటుంది. సత్య తిరస్కారులకు లభించే ప్రతిఫలం నరకాగ్ని.

13. అర్రాద్  36 - 37 ప్రవక్తా! మేము మునుపు గ్రంథాన్ని ఇచ్చిన వారు, మేము మీపై అవతరింపజేసిన గ్రంథంపట్ల సంతోషంగా ఉన్నారు. దానిలోని కొన్ని విషయాలను నమ్మనివారు కూడా విభిన్న వర్గాలలో కొందరు ఉన్నారు. నీవు స్పష్టంగా ఇలా అను : ‘‘అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు అని నాకు ఆజ్ఞాపించబడిరది. ఇతరులను ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టకు అని నాకు నిషేధించబడిరది. కనుక నేను మిమ్మల్ని ఆయన వైపునకే ఆహ్వానిస్తున్నాను. ఆయన వైపునకే నేను మరలుతాను.’’ మార్గదర్శ కత్వంతోనే మేము అరబ్బీ ఫర్మానాను నీపై అవతరింపజేశాము. ఇక నీవు గనక, నీవద్దకు జ్ఞానం వచ్చిన తరువాత కూడా, ప్రజల కోరికలను అనుసరిస్తే, అల్లాహ్ సమక్షంలో నిన్ను రక్షించేవాడుగానీ నీకు సహాయపడేవాడుగానీ ఎవడూ ఉండడు. మరెవడూ ఆయన శిక్ష నుండి నిన్ను తప్పించనూ లేడు.

13. అర్రాద్  38 - 39 నీకు పూర్వం కూడా మేము చాలామంది ప్రవక్తలను పంపాము. మేము వారిని ఆలుబిడ్డలు కలవారిగానే చేశాము. అల్లాహ్ అనుమతి లేకుండా సూచననూ స్వయంగా తెచ్చి చూపే శక్తి ప్రవక్తకూ లేదు. ప్రతి యుగానికీ ఒక గ్రంథం ఉన్నది. అల్లాహ్ తాను రద్దుచేయదలచుకున్న దానిని రద్దుచేస్తాడు. తాను ఉంచదలచుకున్నదానిని స్థిరంగా ఉంచుతాడు. అసలు గ్రంథం ఆయన దగ్గరే ఉన్నది.

13. అర్రాద్  40 - 42 ప్రవక్తా! చెడు పర్యవసానాన్ని గురించి మేము ప్రజలను బెదరిస్తూ వచ్చామో, అందులో ఒక భాగాన్ని మేము నీ జీవితకాలంలో చూపించినా లేదా అది సంభవించే ముందే మేము నిన్ను లేపుకున్నా పరిస్థితిలోనైనా, నీ పని కేవలం సందేశాన్ని అందజెయ్యటమే. లెక్క తీసుకోవటం మటుకు మా పని. ప్రజలు చూడటంలేదా, మేము భూభాగంపై పురోగమిస్తూ దాని పరిధిని అన్ని వైపుల నుండి తగ్గిస్తూ వస్తున్నాము? అల్లాహ్ (సృష్టిని) శాసిస్తున్నాడు. ఆయన నిర్ణయాలను పున్ణపరిశీలించగల వాడెవడూ లేడు. లెక్క తీసుకోవటం ఆయనకు ఎంతోసేపు పట్టదు. వారికి పూర్వం గతించిన ప్రజలు కూడా పెద్ద పెద్ద పన్నాగాలు పన్నారు. కాని నిర్ణయాత్మకమైన అసలు పన్నాగం పూర్తిగా అల్లాహ్ చేతులలోనే ఉన్నది. ఎవరు ఏమేమి సంపాదిస్తున్నారో ఆయనకు తెలుసు. త్వరలోనే సత్య తిరస్కారులు చూస్తారు ఎవరి పర్యవసానం మేలైనది అవుతుందో!

13. అర్రాద్  43 తిరస్కారులు ‘‘నీవు అల్లాహ్ పంపినవాడవు కావు’’ అని అంటున్నారు. ఇలా అను : ‘‘నాకూ మీకూ మధ్య అల్లాహ్ సాక్ష్యమే చాలు. ఆపై ఆకాశగ్రంథ జ్ఞానం కలవాడి సాక్ష్యం చాలు.’’




No comments:

Post a Comment