28 సూరహ్ అల్‌ ఖసస్

  

28. అల్ఖసస్

ఆయతులు : 88                                  అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

28. అల్ఖసస్   1 - 3 తా-సీన్‌-మీమ్‌. ఇవి స్పష్టమైన గ్రంథంలోని వాక్యాలు. మేము మూసా, ఫిరౌనుల కొంత వృత్తాంతాన్ని విశ్వసించే వారి ప్రయోజనం కోసం జరిగింది జరిగినట్లుగా మీకు వినిపిస్తున్నాము.

28. అల్ఖసస్   4 - 6 అసలు విషయం ఏమిటంటే, ఫిరౌను భూమి మీద తిరుగుబాటు వైఖరిని అవలంబించాడు. దాని ప్రజలను వర్గాలుగా విభజించాడు. వారిలోని ఒక వర్గాన్ని అతడు నీచపరచేవాడు. వారి బాలురను హతమార్చేవాడు  వారి బాలికలను మాత్రం బ్రతుకనిచ్చేవాడు. నిశ్చయంగా అతడు దుష్టులలోని వాడు. భూమిలో అణచివేయబడిన వారిని కనికరించాలనీ, వారిని నాయకులుగా చేయాలనీ, వారినే వారసులుగా చేయాలనీ, భూమిలో వారికి అధికారాన్ని ప్రసాదించాలనీ, వారి ద్వారా ఫిరౌను, హామానులకూ, వారి సైన్యాలకూ తాము భయపడుతూ వచ్చిన దానినే చూపాలనీ మేము కోరాము.

28. అల్ఖసస్   7 - 9 మేము మూసా తల్లికి ఇలా సూచించాము, ‘‘అతనికి పాలుపట్టు, అతని ప్రాణానికి ప్రమాదముందని నీకు అనిపిస్తే అపుడు అతనిని నదిలో విడిచిపెట్టు, ఏమాత్రం భయపడకు, బాధపడకు, మేము అతనిని నీ వద్దకే తిరిగి తీసుకువస్తాము, అతనిని ప్రవక్తలలో ఒకడుగా చేస్తాము.’’ చివరకు ఫిరౌను ఇంటివారు అతనిని (నదిలో నుండి) బయటికి తీశారు, అతను వారికి శత్రువై శోక కారణం అవటానికి. నిజంగానే ఫిరౌను, హామాను, వారి సైన్యాలు (తమ వ్యూహాల రీత్యా) ఎంతో పాపిష్ఠులు. ఫిరౌను భార్య (అతడితో) ఇలా అన్నది, ‘‘ఇతడు నీకూ నాకూ కంటి చలువ. ఇతనిని చంపకు. బహుశా ఇతడు మనకు ఉపయోగపడవచ్చు లేదా మనం ఇతనిని కుమారునిగానైనా చేసుకోవచ్చు.’’ కాని వారికి (పర్యవసానం) తెలియదు.

28. అల్ఖసస్   10 - 13 అటు మూసా తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. ఆమె (మా వాగ్దానం ఆధారంగా) విశ్వసించే వారిలో ఉండిపోవాలని, మేము ఆమె హృదయాన్ని ధైర్యంతో నింపాము. లేకపోతే, ఆమె అతని రహస్యాన్ని బయటపెట్టి ఉండేదే. ఆమె మూసా సోదరితో, ‘‘అతనిని వెంబడిస్తూ వెళ్ళు’’ అని అన్నది. తదనుగుణంగా ఆమె దూర దూరంగా ఉంటూ అతనిని గమనించసాగింది. కాని అది వారికి (శత్రువులకు) తెలియదు. మేము మొదట్లోనే పాలుపట్టే స్త్రీల స్తనాల నుండి పిల్లవాడు పాలు తాగకుండా నిషేధించాము. ( పరిస్థితిని చూసి) బాలిక వారితో ఇలా అన్నది, ‘‘అతనిని పెంచి పోషించే బాధ్యతను స్వీకరించే, అతని మేలును కోరే ఇంటి వారిని గురించి నేను మీకు తెలిపేదా?’’ విధంగా మేము మూసాను అతని తల్లి వద్దకు తిరిగి తీసుకువచ్చాము. ఆమె కన్నులకు చల్లదనం కలగాలని, ఆమె ద్ణుఖపడకుండా ఉండాలని. అల్లాహ్ వాగ్దానం నిజమైనదని ఆమె తెలుసుకోవాలని. కాని చాలామందికి విషయం తెలియదు.

28. అల్ఖసస్   14 - 17 మూసా తన నిండు యౌవనదశకు చేరుకున్నప్పుడు, అతని పెరుగుదల పరిపక్వతను సంతరించుకున్నప్పుడు, మేము అతనికి వివేకాన్నీ, జ్ఞానాన్నీ ప్రసాదించాము. మేము సజ్జనులకు ఇలాంటి ప్రతిఫలాన్నే ఇస్తూ ఉంటాము. (ఒకనాడు) నగరవాసులు ఏమరుపాటులో ఉన్న సమయంలో అతను నగరంలోకి ప్రవేశించాడు. అక్కడ అతను ఇద్దరు వ్యక్తులు ఘర్షణపడుతూ ఉండటాన్ని చూశాడు. ఒకడు స్వయంగా అతని జాతికి చెందినవాడు, రెండోవాడు అతని శత్రుజాతికి చెందినవాడు. అతని జాతి వ్యక్తి శత్రుజాతి వానికి వ్యతిరేకంగా సహాయపడమని అతనిని పిలిచాడు. మూసా అతనిని ఒక గుద్దుతో కడతేర్చాడు. (ఇది జరగగానే) మూసా, ‘‘ఇది షైతాను నిర్వాకం. అతడు ప్రబల శత్రువు, స్పష్టంగా దారితప్పించేవాడు’’ అని అన్నాడు. తరువాత అతను ఇలా అన్నాడు, ‘‘నా ప్రభూ! నేను నా ఆత్మకు అన్యాయం చేశాను, నన్ను క్షమించు.’’ అప్పుడు అల్లాహ్ అతనిని క్షమించాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడూను. మూసా ఇలా ప్రతిజ్ఞ చేశాడు, ‘‘నా ప్రభూ! నీవు నాకు మహోపకారం చేశావు. ఇకపై నేను ఎన్నడూ నేరస్తులకు సహాయపడబోను.’’

28. అల్ఖసస్   18 - 21 మరుసటి రోజు ఉదయం అతను భయపడుతూ, ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుందేమో అని జాగ్రత్తగా నలువైపులా పరికిస్తూ నగరంలో పోతు ఉండగా అంతకు ముందురోజు సహాయానికై తనను పిలిచిన వ్యక్తే రోజు మళ్లీ తనను పిలుస్తూ ఉండటాన్ని అకస్మాత్తుగా చూశాడు. అపుడు ‘‘నీవు పూర్తిగా మార్గం తప్పిన వాడవు’’ అని మూసా అన్నాడు. తరువాత శత్రుజాతి వ్యక్తిపై దాడి చేద్దామని మూసా అనుకున్నప్పుడు, అతడు బిగ్గరగా ఇలా అన్నాడు, ‘‘మూసా! నీవు నిన్న ఒక వ్యక్తిని చంపినట్లుగానే రోజు నన్ను కూడ చంపేస్తావా? నీవు దేశంలో దౌర్జన్యపరుడవుగా ఉండదలచు కున్నావా, సంస్కరణ చేయదలచుకోలేదా?’’ దీని తరువాత ఒక వ్యక్తి నగరం యొక్క చివరనుండి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా చెప్పాడు, ‘‘మూసా! సర్దారులు నిన్ను హత్య చేయటానికి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్లిపో, నేను నీ శ్రేయోభిలాషిని.’’ వార్త విన్నంతనే, మూసా భయపడుతూ జాగ్రత్తగా బయలుదేరాడు. అతను ఇలా ప్రార్థించాడు, ‘‘నా ప్రభూ! నన్ను దుర్మార్గుల నుండి రక్షించు.’’

28. అల్ఖసస్   22 - 25 (ఈజిప్టు నుండి బయలుదేరి) మూసా మద్యన్వైపునకు తిరిగినప్పుడు ఇలా అనుకున్నాడు, ‘‘నా ప్రభువు నన్ను సరిjైున మార్గంలో నడుపుతాడని ఆశిస్తున్నాను.’’ అతడు మద్యన్బావి వద్దకు చేరుకున్నప్పుడు చాలమంది ప్రజలు తమ పశువులకు నీరు త్రాపటాన్నీ, వారికి దూరంగా ఒక ప్రక్క ఇద్దరు స్త్రీలు తమ పశువులను ఆపుతూ ఉండటాన్నీ చూశాడు. మూసా స్త్రీలను, ‘‘మీకు వచ్చిన చిక్కు ఏమిటి?’’ అని అడిగాడు. వారు ఇలా జవాబు చెప్పారు, ‘‘ పశువుల కాపరులు తమ పశువులను తోలుకుపోవనంతవరకు మేము మా పశువులకు నీరు తాపలేము. మా తండ్రి గారు చాలా వృద్ధులు.’’ ఇది విని మూసా వారి పశువులకు నీరు త్రాపాడు. తరువాత నీడ ఉన్న ఒక స్థలంలోకి పోయి కూర్చున్నాడు, ఇలా అన్నాడు, ‘‘స్వామీ! నీవు నాపై మేలును అవతరింపజేసినా, నేను దాని అవసరం కలవాడనే.’’ (ఎంతో సేపు కాలేదు) ఇద్దరు స్త్రీలలోని ఒకామె సిగ్గుపడుతూ, బిడియపడుతూ అతని వద్దకు నడచి వచ్చి ఇలా చెప్పసాగింది, ‘‘నా తండ్రి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, మీరు మా పశువులను నీరు త్రాపించిన దానికి గాను మీకు ప్రతిఫలమీయడానికి.’’ మూసా ఆయన వద్దకు వెళ్లి తన పూర్తి వృత్తాంతాన్ని వినిపించినప్పుడు, ఆయన ఇలా అన్నారు, ‘‘ మాత్రం భయపడకు. ఇప్పుడు నీవు దుర్మార్గపు ప్రజల బారినుండి బయటపడ్డావు.’’

28. అల్ఖసస్   26 - 28 ఇద్దరు స్త్రీలలోని ఒకామె తన తండ్రితో ఇలా అన్నది, ‘‘నాన్నా వ్యక్తిని నౌకరుగా పెట్టుకొనండి. బలవంతుడూ, నమ్మకస్తుడూ అయినవాడే మీరు నౌకరుగా పెట్టుకోవటానికి అన్ని విధాలా ఉత్తముడు.’’ ఆమె తండ్రి (మూసాతో) ఇలా అన్నాడు, ‘‘నీవు నా వద్ద ఎనిమిది సంవత్సరాల వరకు నౌకరుగా ఉండే షరతుకు ఒప్పుకుంటే నా ఇద్దరు కుమార్తెలలో ఒకామెను నీకిచ్చి వివాహం చేయదలచుకున్నాను. ఒకవేళ పది సంవత్సరాలు పూర్తిచేయదలిస్తే అది నీ ఇష్టం. నేను నిన్ను బలవంతం చేయదలచుకోలేదు. అల్లాహ్ కోరితే నీవు నన్ను మంచి మనిషిగా చూస్తావు.’’ మూసా ఇలా జవాబు పలికాడు, ‘‘ విషయం మీకూ నాకూ మధ్య నిర్ణయమైపోయినట్లే. రెండు గడువులలో నేను దేన్ని పూర్తిచేసినా, దాని తరువాతమటుకు నాపై విధమైన ఒత్తిడి తీసుకు రాకూడదు. మనం ఖరారు చేసుకున్న మాటకు అల్లాహ్ యే సాక్షి.’’

28. అల్ఖసస్   29 - 35 గడువును పూర్తి చేసిన మూసా తన కుటుంబ సభ్యులను తీసుకుని ప్రయాణమైపోతూ ఉండగా, తూర్పర్వతం ఉన్న దిక్కున ఒక మంట కనిపించింది. అతను తన ఇంటివారితో ఇలా అన్నాడు, ‘‘ఆగండి, నేను ఒక మంటను చూశాను, బహుశా నేను అక్కడ నుంచి ఏదైనా సమాచారాన్నయినా తీసుకొని వస్తాను, లేదా మంట నుండి నిప్పురవ్వనైనా పట్టుకొని వస్తాను, దానితో మీరు చలి కాచుకుందురు గాని.’’ అక్కడకు చేరినప్పుడు లోయ కుడిగట్టుపై ఉన్న ఒక శుభవంతమైన స్థలంలోని ఒక చెట్టు నుండి ఒక పిలుపు వినవచ్చింది. ‘‘మూసా! నేను అల్లాహ్ ను, సకల లోకాలకు ప్రభువును.’’ తరువాత ‘‘నీ కర్రను విసురు’’ (అని ఆజ్ఞాపించబడిరది). కర్ర పాము మాదిరిగా కదలడం చూడగానే మూసా వెనక్కి తిరిగి పరుగెత్తాడు - తిరిగి కూడా చూడలేదు. (ఇలా సెలవీయబడిరది), ‘‘మూసా! తిరిగి రా, భయపడకు, నీవు సురక్షితంగానే ఉన్నావు. నీ చేతిని ఛాతీ చొక్కాలోనికి పైకి దూర్చు, నీకు విధమైన నొప్పీ కలిగించకుండానే అది ప్రకాశిస్తూ బయటికి వస్తుంది. భయం నుండి కాపాడుకోవటానికి నీ భుజాన్ని ప్రక్కకు అదుముకో. ఇవి స్పష్టమైన రెండు సూచనలు, నీ ప్రభువు తరఫు నుండి, ఫిరౌన్, అతడి దర్బారీల ముందు ఉంచటానికి. వారు పరమ అవిధేయులు.’’ మూసా ఇలా మనవి చేసుకున్నాడు. ‘‘నా ప్రభూ! నేను వారి మనిషి నొకణ్ణి హత్య చేశాను. వారు నన్ను హత్య చేస్తారేమో అని భయపడుతున్నాను. నా సోదరుడు హారూన్నా కంటే మంచి వాగ్ధాటి కలవాడు, నన్ను సమర్థించటానికి అతనిని సహాయకు డుగా నాతో పంపు. వారు నన్ను అసత్యవాదిగా తిరస్కరిస్తారేమో అని భయపడు తున్నాను.’’ ఇలా సెలవిచ్చాడు, ‘‘మేము నీ సోదరుని ద్వారా నీ చేతులకు బలాన్ని సమకూరుస్తాము. మేము మీ ఉభయులకు ఒక విశేషశక్తిని ప్రసాదిస్తాము. కాబట్టి వారు మీకు ఏమాత్రం హాని చేయలేరు. మా సూచనల బలం ఆధారంగా, ప్రాబల్యం మీదే, మీ అనుచరులదే అవుతుంది.’’

28. అల్ఖసస్   36 - 37 తరువాత మూసా, ప్రజల వద్దకు స్పష్టమైన మా సూచనలతో వెళ్లినప్పుడు, వారు ఇలా అన్నారు, ‘‘ఇది మాయాజాలం తప్ప మరేమీ కాదు. మాటలను మేము మా తాతముత్తాతల కాలంలో కూడ ఎన్నడూ వినలేదు.’’ మూసా ఇలా సమాధానమిచ్చాడు, ‘‘నా ప్రభువు తన వద్దనుండి మార్గదర్శకత్వాన్ని తీసుకొనివచ్చిన వ్యక్తి స్థితి ఎటువంటిదో బాగా ఎరుగును. ఇంకా చివర్లో ఎవరి పర్యవసానం మంచిదవుతుందో ఆయనకే బాగా తెలుసు. సత్యం ఏమిటంటే దుర్మార్గులు ఎన్నడూ సాఫల్యం పొందలేరు.’’

28. అల్ఖసస్   38 ఫిరౌను ఇలా అన్నాడు, ‘‘సభ్యులారా! నేను కాక మీకు మరొక దేవుడెవడైనా ఉన్నాడేమో నేను ఎరుగను. హామాన్‌! ఇటుకలను కాల్చి నాకై ఒక ఎత్తైన కట్టడాన్ని నిర్మాణం చేయించు. దానిపైకి ఎక్కి బహుశా నేను మూసా దేవుణ్ణి చూడగలనేమో. నేను అతణ్ణి అసత్యవాదిగా పరిగణిస్తున్నాను.’’

28. అల్ఖసస్   39 - 42 భూమిపై అతడూ, అతడి సైన్యాలూ విధమైన హక్కులేకుండానే తమ పెద్దరికపు అహంభావాన్ని ప్రదర్శించారు. మా వైపునకు తాము ఎన్నడూ మరలిరావటమనేదే ఉండదని వారు భావించారు. చివరకు మేము అతనినీ అతని సైన్యాలనూ పట్టుకుని సముద్రంలోకి విసరివేశాము. చూడు దుర్మార్గులకు గతి పట్టిందో. మేము వారిని నరకం వైపునకు ప్రజలను ఆహ్వానించే నాయకులుగా చేశాము. ప్రళయం నాడు వారు ఎక్కడ నుంచీ సహాయాన్నీ పొందలేరు. మేము ప్రపంచంలో అభిశాపం వారిని వెంటాడేలా చేశాము. ప్రళయం నాడు వారు ఘోర దురవస్థకు గురి అవుతారు.

28. అల్ఖసస్   43 - 47 పూర్వపు తరాల వారిని నాశనం చేసిన తరువాత, మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము  మానవుల కొరకు దూరదృష్టి సాధనంగా చేసి, మార్గదర్శకత్వంగా, కారుణ్యంగా చేసి, తద్ద్వారా వారు బహుశా గుణపాఠం చేర్చుకుంటారేమో అని. (ప్రవక్తా!) మేము మూసాకు షరియత్తు ఆదేశాన్ని ప్రసాదించినప్పుడు నీవు పశ్చిమ దిశలో లేవు. ఇంకా, నీవు సాక్షులలోనూ లేవు. అంతేకాదు, దాని తరువాత (నీ కాలం వరకు) మేము ఎన్నో తరాల వారిని ప్రభవింపజేశాము, వారి మీదుగా ఒక సుదీర్ఘ కాలం గడిచిపోయింది. నీవు మద్యన్వాసులలో కూడా నివసించి ఉండలేదు, వారికి మా ఆయతులను వినిపించి ఉండటానికి. కాని (అప్పటి వార్తలను) పంపేవారము మేమే. మేము (మూసాను ప్రప్రథమంగా) పిలిచినప్పుడు, నీవు తూర్పర్వతం అడుగుభాగాన కూడా లేవు. కాని ఇది నీ ప్రభువు కారుణ్యం (నీకు సమాచారం అందించబడుతోంది), నీకు పూర్వం హెచ్చరిక చేసే వాడెవ్వడూ రాని ప్రజల వద్దకు నీవు పోయి హెచ్చరించటానికి  బహుశా వారు స్పృహలోకి వస్తారేమో అని. (మేము ఇలా ఎందుకు చేశామంటే), వారు స్వయంగా తాము చేసుకున్న కర్మల ఫలితంగా ఏదైనా ఆపద వారిపైకి వచ్చినప్పుడు, వారు ‘‘ప్రభూ! నీవు మా వద్దకు ఒక ప్రవక్తను ఎందుకు పంపలేదు. మేము నీ ఆయతులను తలదాల్చి ఉండేవారము కదా, విశ్వాసులలో చేరి ఉండే వారము కదా!’’ అని అనకుండా ఉండేటందుకు.

28. అల్ఖసస్   48 - 51 కాని మా తరఫు నుండి వారి వద్దకు  సత్యం  వచ్చిన తరువాత వారు ఇలా అన్నారు, ‘‘మూసాకు ఇవ్వబడిరదే ఇతనికీ ఎందుకీయబడలేదు.’’ ఇదివరకు మూసాకు ఇవ్వబడిన దానిని వారు తిరస్కరించి ఉండలేదా? వారు, ‘‘రెండూ మాయాజాలాలే. అవి ఒకదాని కొకటి సహాయ పడతాయి’’ అని అన్నారు. ఇంకా వారు, ‘‘మేము దేనినీ విశ్వసించము’’ అని కూడా అన్నారు. (ప్రవక్తా!) వారితో ఇలా అను, ‘‘సరే మీరు నిజాయితీపరులే అయితే అల్లాహ్ దగ్గర నుండి, రెండిరటి కంటే మెరుగైన మార్గదర్శకత్వాన్ని ప్రసాదించే ఒక గ్రంథాన్ని తీసుకురండి. నేను దానిని అనుసరిస్తాను. ఇప్పుడు వారు నీ కోర్కెను తీర్చకపోతే అసలు వారు తమ మనోవాంఛలను అనుస రించేవారని తెలుసుకో. దేవుని మార్గదర్శకత్వం లేకుండా కేవలం తన కోరికలను అనుసరించే వ్యక్తి కంటే పరమ మార్గభ్రష్టుడెవడు? అటువంటి దుర్మార్గులకు అల్లాహ్ తన మార్గదర్శకత్వాన్ని ఎంతమాత్రం ప్రసాదించడు. (హితబోధ యొక్క) వచనాన్ని మేము ఎడతెగకుండా వారికి అందజేశాము, వారు ఏమరుపాటు నుండి మేల్కోవాలని.

28. అల్ఖసస్   52 - 56 ఇంతకు పూర్వం మేము గ్రంథాన్ని ఇచ్చిన ప్రజలు దీనిని(ఖురాన్ను) విశ్వసిస్తారు. ఇది వారికి వినిపించబడినప్పుడు, వారు ఇలా అంటారు, ‘‘మేము దీనిని విశ్వసించాము.  ఇది నిజంగానే మా ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. మేము మొదటి నుండీ ముస్లిములమే.’’ తాము చూపిన స్థైర్యానికి ఫలితంగా తమ ప్రతిఫలాన్ని రెండుసార్లు పొందేవారు వారే. వారు చెడును మంచితో నివారిస్తారు. మేము వారికి ఇచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు పెడతారు. వారు ఎప్పుడైనా అసహ్యకరమైన మాటను వింటే, ఇలా అంటూ దూరంగా జరిగిపోతారు, ‘‘మా కర్మలు మావి. మీ కర్మలు మీవి. మీకో సలామ్‌. మేము అజ్ఞానుల పద్ధతిని అవలంబించదలచుకోలేదు.’’ ప్రవక్తా! నీకు ఇష్టమైన వారికి నీవు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించలేవు. కాని అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదించగలడు, ఆయన తన మార్గదర్శకత్వాన్ని స్వీకరించేవారిని బాగా ఎరుగును.

28. అల్ఖసస్   57 ... వారు ఇలా అంటారు, ‘‘ఒకవేళ నీతోపాటు మేము కూడా మార్గ దర్శకత్వాన్ని అవలంబిస్తే మేము మా భూభాగం నుండి తొలగింపబడతాము.

28. అల్ఖసస్   ... 57 మేము శాంతికి నిలయమైన ఒక పవిత్ర స్థలాన్ని వారికి స్థిర నివాసంగా చేయటం, దాని వైపునకు అన్ని రకాల పండ్లూ, ఫలాలూ మా తరఫు నుండి జీవనోపాధిగా రావటం వాస్తవం కాదా?’’ కాని వారిలో చాలా మందికి తెలియదు.

28. అల్ఖసస్   58 మేము ఎన్ని జనపదాలను నాశనం చేయలేదు  వాటి ప్రజలు తమ సంపదను చూచుకుని పొంగిపోయేవారు. అవిగో చూడు, వారి నివాసాలు ఎలా పడి ఉన్నాయో, వారి తరువాత వాటిలో నివసించిన వారూ చాలా తక్కువే. చివరకు మేమే వారసులమయ్యాము.

28. అల్ఖసస్   59 నీ ప్రభువు జనపదాలను ఎంతమాత్రం నాశనం చేయడు. వాటి కేంద్రాలకు మా ఆయతులను వినిపించే ప్రవక్తలను పంపనంతవరకు. మేము జనపదాలను, వాటి ప్రజలు దుర్మార్గులయిపోతే తప్ప ఎంతమాత్రం నాశనం చేయము.

28. అల్ఖసస్   60 - 61 మీకు ఇవ్వబడిరది కేవలం ప్రాపంచిక జీవితపు సామగ్రి మరియు అలంకరణలు మాత్రమే. అల్లాహ్ వద్ద ఉన్నది దీనికంటె ఉత్తమమైనది, నిత్యమైనది. మీరు ఆలోచించరా? మేము తనకు చేసిన మంచి వాగ్దానాన్ని తప్పకుండా పొందనున్న వ్యక్తి, మేము కేవలం ఇహలోక జీవన సామగ్రి ఇచ్చిన తరువాత ప్రళయంనాడు శిక్షకై హాజరుపరచబడనున్న వ్యక్తీ ఒకటవుతారా?

28. అల్ఖసస్   62 - 64 (వారు మరచిపోకూడదు) దినాన్ని. అప్పుడు ఆయన వారిని పిలిచి, ‘‘మీరు, నా భాగస్వాములుగా భావించిన వారెక్కడున్నారు?’’ అని అడుగుతాడు.    మాట ఎవరికి వర్తిస్తుందో వారు ఇలా అంటారు, ‘‘మా ప్రభూ! నిస్సందేహంగా మేము అపమార్గం పట్టించింది వారినే. స్వయంగా మేము అపమార్గం పట్టిన విధంగానే, మేమూ వారిని అపమార్గం పట్టించాము. వారిని గురించి మాకు విధమైన బాధ్యత లేదని మేము నీ సమక్షంలో ప్రకటిస్తున్నాము. అసలు వారు మమ్మల్ని పూజించనే లేదు.’’ తరువాత వారితో, ‘‘మీరు నిలబెట్టిన భాగస్వాములను ఇప్పుడు పిలవండి,’’ అని అనబడుతుంది. వారు వారిని పిలుస్తారు   కాని  వారు వారికి సమాధానమూ ఇవ్వరు. వారు శిక్షను చూస్తారు. అయ్యో! వారు సన్మార్గాన్ని అవలంబించి ఉంటే ఎంత బాగుండేది.

28. అల్ఖసస్   65 - 67 (వారు విస్మరించకూడదు) దినాన్ని. అప్పుడు ఆయన వారిని పిలిచి, ‘‘పంపబడిన సందేశహరులకు మీరు ఏమని సమాధానమిచ్చారు?’’ అని అడుగుతాడు. సమయంలో వారికి సమాధానమూ తోచదు, వారు ఒకరినొకరు సంప్రదించుకోనూలేరు. అయితే ఎవడు ఇక్కడ పశ్చాత్తాప  పడతాడో విశ్వసించి, మంచి పనులు చేస్తాడో, అతడు అక్కడ సాఫల్యం పొందేవారి మధ్య ఉండగలను అని ఆశించగలుగుతాడు.

28. అల్ఖసస్   68 - 73  నీ ప్రభువు తాను కోరిన దానిని సృష్టిస్తాడు. (స్వయంగా ఆయనే తన పని కోసం తాను కోరిన వారిని) ఎన్నుకుంటాడు. ఎన్నిక చేయటం అనేది వారి పనికాదు. అల్లాహ్ పరిశుద్ధుడు, వారు చేసే షిర్కుకు అతీతుడు. వారు తమ మనస్సులలో దాచిన దానినీ, బహిరంగపరచే దానినీ నీ ప్రభువు ఎరుగును. ఆయనే అల్లాహ్, ఆయన ఒక్కడు. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడెవ్వడూ లేడు. లోకంలోనూ, పరలోకంలోనూ ఆయనే స్తుతింపదగిన వాడు. పరిపాలనాధికారం ఆయనదే, ఆయన వైపునకే మీరంతా మరలింప బడతారు. ప్రవక్తా! వారితో ఇలా అను,  ‘‘ విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా  ఒకవేళ అల్లాహ్ ప్రళయం వచ్చేవరకు మీపై శాశ్వతంగా రాత్రిని ఆవహింపజేస్తే, అల్లాహ్ తప్ప మీకు వెలుగును తెచ్చి ఇచ్చే దేవుడు ఎవడు? మీరు వినరా?’’ వారిని ఇంకా ఇలా అడుగు, ‘‘ విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా  ఒకవేళ అల్లాహ్ ప్రళయం వరకు మీపై పగలును శాశ్వతంగా ఉండేలా చేస్తే, మీరు విశ్రాంతి పొందటానికి అల్లాహ్ తప్ప మీకు రాత్రిని తెచ్చి ఇచ్చే దేవుడెవడైనా ఉన్నాడా? మీకేమీ గోచరించటం లేదా?’’ ఇది ఆయన కారుణ్యమే  ఆయన మీ కొరకు రాత్రినీ, పగలునూ సృష్టించాడు, మీరు (రాత్రి సమయంలో) విశ్రాంతిని పొందటానికీ, (పగటి సమయంలో) మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించటానికీ  బహుశా మీరు కృతజ్ఞులవుతారేమో అని.

28. అల్ఖసస్   74 - 75 (వారు జ్ఞాపకముంచుకోవాలి) దినాన్ని,  అపుడు ఆయన వారిని పిలిచి, ‘‘మీరు నాకు భాగస్వాములుగా కల్పించిన వారెక్కడున్నారు?’’ అని అడుగుతాడు. మేము ప్రతి సంఘం నుండి ఒక సాక్షిని తీసుకువస్తాము. తరువాత, ‘‘మీ రుజువును ఇప్పుడు తీసుకురండి’’ అని అంటాము. అపుడు వారికి తెలిసిపోతుంది,  సత్యం అల్లాహ్ వైపే ఉందని, వారు కల్పించిన అసత్యాలన్నీ మటుమాయ మైపోతాయి.

28. అల్ఖసస్   76 - 78 ఇదొక యథార్థం  ఖారూన్మూసా జాతికి చెందిన ఒక వ్యక్తి. అతడు తన జాతికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేశాడు. మేము అతనికి ఎన్నో నిధులను ఇచ్చాము. వాటి తాళపు చెవులను బలాఢ్యులైన వ్యక్తుల ఒక సమూహం కూడా చాలా కష్టంగా ఎత్తగలదు. ఒకసారి అతని జాతి ప్రజలు అతనితో ఇలా అన్నారు, ‘‘విఱ్ఱవీగకు, విఱ్ఱవీగే వారిని అల్లాహ్ ప్రేమించడు. అల్లాహ్ నీకు ఇచ్చిన సంపదతో పరలోకంలో గృహాన్ని నిర్మించుకునే యోచన చేయి. ప్రపంచంలో కూడ నీ వాటాను విస్మరించకు, అల్లాహ్ నీకు ఉపకారం చేసిన విధంగానే నీవూ ఉపకారం చేయి. భూమిపై కల్లోలాన్ని సృష్టించే ప్రయత్నం చేయకు. అల్లాహ్ కల్లోలం సృష్టించే వారిని ప్రేమించడు.’’ అపుడు అతడు ఇలా అన్నాడు, ‘‘నాకు లభ్యమైన జ్ఞానం మూలంగానే ఇదంతా నాకు ఇవ్వబడిరది’’ - అతనికి పూర్వం అతనికంటే ఎక్కువ బలాన్నీ, అనుచర వర్గాన్ని కలిగి  ఉన్న  చాలామందిని అల్లాహ్ నాశనం చేశాడనే విషయం అతనికి తెలియదా? అపరాధులను మాత్రం వారి పాపాలను గురించి అడగటం జరగదు.

28. అల్ఖసస్  79 - 80  ఒకనాడు అతడు తన జాతి ముందు తన పూర్తి వైభవంతో ప్రత్యక్షమయ్యాడు. ఐహిక జీవితం పట్ల వ్యామోహం కలవారు అతణ్ణి చూచి ఇలా అన్నారు, ‘‘ఖారూన్కు ఇవ్వబడిరది మాకూ లభిస్తే ఎంత బాగుండును. అతడు చాలా అదృష్టవంతుడు.’’ కాని  జ్ఞాన  సంపన్నులు ఇలా అన్నారు, ‘‘అయ్యో దౌర్భాగ్యులారా! అల్లాహ్ ఇచ్చే ప్రతిఫలమే విశ్వసించి మంచి పనులు చేసే వ్యక్తికి శ్రేష్ఠమైనది. మహాభాగ్యం సహనం చూపే వారికి తప్ప మరెవరికీ దొరకదు.’’

28. అల్ఖసస్   81 - 82  చివరకు మేము అతన్నీ అతని గృహాన్నీ, భూమిలోనికి అణగ ద్రొక్కాము. తరువాత అల్లాహ్ కు వ్యతిరేకంగా, అతనికి సహాయం చేయటానికి ముందుకు వచ్చే అతని మద్దతుదారుల వర్గం ఏదీ లేదు. స్వయంగా అతను కూడా తనకు తాను సహాయం చేసుకోలేకపోయాడు.   నిన్న  అతని అంతస్తు కోసం ఉవ్విళ్లూరిన వారే ఇప్పుడు ఇలా అంటున్నారు,‘‘అయ్యో, మా దౌర్భాగ్యం! మేము మరచే పోయాము,  అల్లాహ్  తన ఇష్టప్రకారం తన దాసులలో కొందరి జీవనోపాధిని విస్తరింపజేస్తాడు అని, మరికొందరికి ఆచితూచి ఇస్తాడని.  అల్లాహ్ మాపై దయచూపి ఉండకపోతే, మమ్మల్ని కూడా భూమి లోనికి అణగద్రొక్కి ఉండేవాడే. అయ్యో,  మా దౌర్భాగ్యం! అవిశ్వాసులు సాఫల్యం పొందరని మాకు జ్ఞాపకమే లేదు.’’

28. అల్ఖసస్   83 - 84 ఇక, పరలోకంలోని గృహాన్ని మేము భూమిపై తమ పెద్దరికాన్ని కోరుకోనివారికీ, కల్లోలాన్ని సృష్టించగోరని వారికీ ప్రత్యేకించి ఉంచుతాము. మేలైన పరిణామం మాత్రం భయభక్తులు కలవారికే. మంచిని తెచ్చే వాడికి దానికంటే మేలైన  మంచి  లభిస్తుంది. ఇక చెడును తెచ్చేవారి విషయం  చెడు పనులు చేసేవారికి వారు చేసిన దాని ప్రకారమే ప్రతిఫలం లభిస్తుంది.

28. అల్ఖసస్   85 - 88 ప్రవక్తా! నీపై ఖురానును  విధించినవాడు,  నిన్ను ఒక ఉత్తమ మైన ముగింపునకు చేర్చనున్నాడని విశ్వసించు.  వారితో ఇలా అను, ‘‘నా ప్రభువునకు బాగా తెలుసు, ఎవడు సన్మార్గం తీసుకువచ్చాడో, ఎవడు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనయ్యాడో.’’ నీపై గ్రంథం అవతరింప చేయబడు తుందనే విషయాన్ని నీవు ఏమాత్రం ఆశించలేదు. ఇది కేవలం నీ ప్రభువు కారుణ్యం వల్లనే (నీపై అవతరించింది).  కనుక  నీవు  అవిశ్వాసులకు సహాయకుడవు కాకూడదు. అల్లాహ్ వాక్యాలు నీపై అవతరించినప్పుడు, అవిశ్వాసులు నిన్ను వాటి నుండి వైదొలగించటం అనేది ఎన్నటికీ జరగకూడదు. నీ ప్రభువు వైపునకు ఆహ్వానించు. బహుదైవారాధకులలో ఎంతమాత్రం చేరిపోకు. అల్లాహ్తో పాటు ఇతర దేవుణ్ణి వేడుకోకు. ఆయన తప్ప మరొక ఆరాధ్యు డెవ్వడూ లేడు. ఒక్క ఆయన ఉనికి తప్ప ప్రతిదీ నశించేదే. విశ్వసామ్రాజ్యాధి కారం ఆయనదే  ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.


No comments:

Post a Comment