25. అల్
ఫుర్ఖాన్
ఆయతులు
: 77 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
25. అల్
ఫుర్ఖాన్ 1
- 3 ఎనలేని శుభాలవాడు ఈ గీటురాయిని తన దాసునిపై అవతరింప జేశాడు. సకల విశ్వవాసులకు హెచ్చరిక చేసేదిగా ఉండేటందుకు. ఆయన భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు. ఆయన ఎవరినీ కొడుకుగా చేసుకో లేదు. విశ్వసామ్రాజ్యాధిపత్యంలో ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. ఆయన ప్రతి దానినీ సృష్టించాడు.
తరువాత దానికి ఒక విధినీ నిర్ణయించాడు. ప్రజలు ఆయనను కాదని కల్పించుకున్నట్టి దేవుళ్లు ఏ వస్తువునూ సృష్టించలేరు, కాని వారే సృష్టింపబడతారు. వారు స్వయంగా తమ కొరకైనా ఏ లాభనష్టాల అధికారాన్నీ కలిగిలేరు. వారు చంపనూలేరు, బ్రతికించనూలేరు, మరణించిన వాణ్ణి మళ్లీ లేపనూ లేరు.
25. అల్
ఫుర్ఖాన్ 4
- 6 దైవప్రవక్త మాటను విశ్వసించటానికి నిరాకరించిన వారు ఇలా అంటారు, ‘‘ఈ గీటురాయి ఒక కల్పన, దానిని ఇతనే స్వయంగా కల్పించాడు. ఇతరులు కొందరు ఈ పనిలో అతనికి సాయపడ్డారు.’’ వారు ఘోర అన్యాయా నికి, పరమ అబద్ధానికి ఒడిగట్టారు. ఇంకా ఇలా అంటారు, ‘‘ఇవి పూర్వకాలం నాటి వారు వ్రాసిన విషయాలు, వాటికి ఇతను నకలు వ్రాయిస్తున్నాడు. అవి ఇతనికి ఉదయం సాయంత్రం వినిపించబడతాయి.’’ ప్రవక్తా! వారితో, ‘‘భూమియొక్క ఆకాశముల యొక్క రహస్యాన్ని ఎరిగినవాడు, దానిని అవతరింపజేశాడు’’ అని అను. యధార్థమేమిటంటే, ఆయన ఎక్కువగా క్షమించేవాడు, కరుణించేవాడూను.
25. అల్
ఫుర్ఖాన్ 7
- 10 వారు ఇలా అంటారు, ‘‘ఇతనేమి ప్రవక్త, అన్నం తింటాడు, బజారులో తిరుగుతూ ఉంటాడు? ఇతని వద్దకు ఒక దైవదూత అయినా ఎందుకు పంపబడలేదు, ఇతనితో ఉంటూ (విశ్వసించని వారిని) బెదిరించటానికి? లేదా ఏదిలేకపోయినా కనీసం ఇతని కొరకు ఒక నిధి అయినా ఎందుకు దించబడలేదు? లేదా ఇతనికి ఒక తోట అయినా
ఎందుకు లేదు,
దాని ద్వారా ఇతను (నిశ్చింతగా) ఉపాధిని పొందటానికి?’’ ఇంకా ఆ దుర్మార్గులు, ‘‘మీరు చేతబడి చేయబడిన ఒక మనిషి వెంట నడుస్తున్నారు’’ అని అంటారు. చూడు, ఎటువంటి విచిత్రమైన వాదాలను నీ ముందు పెడుతున్నారో! వారు ఎంతగా మార్గం తప్పిపోయారంటే, స్థిరమైన మాట అనేది వారికసలు తోచదు. శుభప్రదుడైన ఆయన తాను కోరితే, వారు ప్రతిపాదించిన వస్తువుల కంటే ఎంతో ఎక్కువగా నీకు ఇవ్వగలుగుతాడు. (ఒకటి కాదు) క్రింద కాలువలు ప్రవహించే ఎన్నో తోటలు, పెద్ద పెద్ద భవనాలు.
25. అల్
ఫుర్ఖాన్ 11
- 14 అసలు విషయమేమిటంటే, వారు ఆ ‘‘ఘడియ’’ను తిరస్కరించారు. ఆ ఘడియను తిరస్కరించేవాడి కోసం మేము జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. అది
వారిని దూరం నుంచి చూచినప్పుడు, వారు దాని క్రోధ ధ్వనులు, విజృంభణ ధ్వనులను వింటారు. దానిలోని ఒక ఇరుకైన స్థలంలో వారు కాళ్ళూ, చేతులూ బంధించబడిన స్థితిలో క్రుక్కబడినప్పుడు, చావును పిలవటం ప్రారంభిస్తారు. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది), ‘‘ఈనాడు ఒక చావునే కాదు, ఎన్నో చావుల కోసం అరవండి.’’
25. అల్
ఫుర్ఖాన్ 15
- 16 వారిని అడగండి, ఈ పర్యవసానం మంచిదా లేక శాశ్వతంగా ఉండే స్వర్గం మంచిదా అని. ఆ స్వర్గం దైవభక్తీ, దైవభీతి కలవారికి వాగ్దానం చేయబడిరది, అది వారి కర్మలకు ప్రతిఫలం. వారి ప్రయాణానికి చివరి గమ్యస్థానం, అందులో వారి ప్రతి కోరికా తీరుతుంది. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. దానిని ప్రసాదించటం అనేది నీ ప్రభువు తప్పనిసరిగా నెరవేర్చవలసిన ఒక వాగ్దానం.
25. అల్
ఫుర్ఖాన్ 17
- 19 అదే రోజున (నీ ప్రభువు) ఈ ప్రజలను కూడ ఒక చోటకు చేరుస్తాడు. వారు అల్లాహ్ ను కాదని ఈ రోజున పూజిస్తున్న దేవుళ్లను కూడ పిలుస్తాడు. తరువాత ఆయన ఆ దేవుళ్లను, ‘‘నా ఈ దాసులను మీరే మార్గం తప్పించారా లేక
స్వయంగా వారే ఋజుమార్గం తప్పిపోయారా?’’ అని అడుగుతాడు. అప్పుడు వారు ఇలా విన్నవించుకుంటారు, ‘‘నీవు అత్యంత పరిశుద్ధుడవు. నిన్ను తప్ప మరొకరిని మా రక్షకుడుగా చేసుకునే ధైర్యం కూడ మాకు లేదు. కాని నీవు వారికి, వారి పూర్వీకులకు జీవితావసర వస్తువులను పుష్కలంగా ఇచ్చావు. చివరకు వారు బోధనను మరచిపోయి దౌర్భాగ్య స్థితికి గురిఅయ్యారు.’’ మీరు ఈనాడు అంటున్న మాటలను ఈ విధంగా వారు (మీ దేవుళ్లు) తిరస్కరిస్తారు. ఇక మీరు మీ దౌర్భాగ్యాన్నీ ఆపలేరు, ఎక్కడ నుండీ సహాయాన్నీ పొందలేరు. మీలో ఎవడు దుర్మార్గం చేసినా, అతనికి మేము కఠిన శిక్షను రుచి చూపిస్తాము.
25. అల్
ఫుర్ఖాన్ 20
‘‘ప్రవక్తా! నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరూ అన్నం తినేవారే, బజారులలో సంచరించేవారే. అసలు మేము మిమ్మల్ని ఒకరి కొరకు మరొకరిని పరీక్షా సాధనాలుగా చేశాము. నీవు సహనంతో ఉంటావా? నీ ప్రభువు సర్వాన్నీ చూస్తున్నాడు.’’
25. అల్
ఫుర్ఖాన్ 21
- 30 మా సాన్నిధ్యంలో హాజరు కావలసి ఉన్నది అనే భయంలేని వారు ఇలా అంటారు, ‘‘దైవ దూతలు మా వద్దకు ఎందుకు పంపబడటం లేదు? మేము మా ప్రభువును ఎందుకు చూడకూడదు?’’ వారి మనస్సులలో మిక్కిలి అహంభావం ఉన్నది. వారు తమ తలబిరుసుతనంతో హద్దులు మీరిపోయారు. వారు దైవదూతలను చూసే రోజు నేరస్తులకు శుభవార్తల రోజేమీ కాదు - ‘‘అల్లాహ్ శరణు’’ అని వారు కేకవేస్తారు. అప్పుడు వారు చేసి ఉన్న దానినంతటినీ మేము తీసుకుని దుమ్ము మాదిరిగా ఎగురవేస్తాము. ఇక స్వర్గానికి అర్హులైన వారే ఆ రోజున మంచి స్థలంలో ఉంటారు. అంతేకాదు మధ్యాహ్నం విశ్రాంతి కొరకు చక్కని స్థలాన్ని పొందుతారు. ఆకాశాన్ని చీలుస్తూ ఒక మేఘం ఆ రోజున ప్రత్యక్షమవుతుంది. దైవదూతలు వరుసలు వరుసలుగా దింపబడతారు. ఆ రోజున నిజమైన రాజ్యాధికారం కేవలం కరుణామయుని చేతులలో ఉంటుంది. అది అవిశ్వాసులకు ఎంతో కఠినమైన రోజు. దుర్మార్గపు మానవుడు తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు, ‘‘అయ్యో నేను దైవప్రవక్తకు తోడుగా ఉంటే ఎంత బాగుండేది! అయ్యో నా దౌర్భాగ్యం! నేను ఫలానా వ్యక్తితో స్నేహం చేయకుండా ఉంటే ఎంత బాగుండేది! అతడి మాయలోపడి నేను నా వద్దకు
వచ్చిన హితబోధను స్వీకరించలేదు. షైతాను మానవుని విషయంలో నమ్మకద్రోహి అని తేలిపోయింది.’’ దైవప్రవక్త ఇలా అంటాడు, ‘‘నా ప్రభూ! నా జాతి వారు ఈ ఖురానును ఒక పరిహాస విషయంగా చేసుకున్నారు.
25. అల్
ఫుర్ఖాన్ 31 ప్రవక్తా! మేము ఇలానే అపరాధులను ప్రతి దైవప్రవక్తకు శత్రువులుగా చేశాము. నీ కొరకు నీ ప్రభువే మార్గదర్శకత్వం చేయటానికీ, సహాయపడటానికీ సరిపోతాడు.
25. అల్
ఫుర్ఖాన్ 32
- 34 అవిశ్వాసులు ఇలా అడుగుతారు, ‘‘ఈ వ్యక్తిపై పూర్తి ఖురాను ఒకేసారి ఎందుకు అవతరింప బడలేదు?’’ - అవును, అలా ఎందుకు చేయబడిరదంటే, మేము దానిని నీ మనస్సులో నాటుకునేలా చేస్తూ ఉండాలని. (ఈ ఉద్దేశ్యంతోనే) మేము దానిని ఒక ప్రత్యేకమైన క్రమంతో వేర్వేరు భాగాలుగా రూపొందించాము. ఇంకా (ఇందులో ఈ హేతువు కూడ ఉంది). వారు నీ ముందు
ఏదైనా వినూత్న విషయాన్ని (వింత ప్రశ్నను) తీసుకువచ్చి నప్పుడల్లా దానికి సరిjైున జవాబును మేము సకాలంలో నీకు ఇచ్చాము. ఉత్తమమైన రీతిలో విషయాన్ని విస్పష్టం చేశాము - బోర్లగా నరకం వైపునకు నెట్టబడనున్న వారి పరిస్థితి ఎంతో చెడ్డది, వారి మార్గం ఎంతో తప్పైనది.
25. అల్
ఫుర్ఖాన్ 35
- 40 మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. అతని సోదరుడు హారూన్ను అతనికి సహాయకుడుగా చేశాము. వారితో ఇలా అన్నాము, ‘‘మా ఆయతులను తిరస్కరించిన జాతి వద్దకు వెళ్లండి. చివరకు మేము ఆ జాతి ప్రజలను నాశనం చేసివేశాము. ఇదే గతి నూహు జాతి వారికీ పట్టింది
వారు దైవ ప్రవక్తలను తిరస్కరించారు. మేము వారిని ముంచివేశాము. ప్రపంచ ప్రజలం దరికీ గుణపాఠం గరపే గుర్తుగా చేశాము. ఆ దుర్మార్గుల కొరకు ఒక వ్యధా భరితమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము. ఈ విధంగానే ఆద్ జాతివారు, సమూద్జాతివారు, అర్రస్ ప్రజలు, ఇంకా ఆ మధ్యకాలంలో ఎన్నో తరాల వారు నాశనం చేయబడ్డారు. వారిలో ప్రతి ఒక్కరికీ మేము
(పూర్వం నాశన మైనవారి) దృష్టాంతాలను ఇచ్చి నచ్చజెప్పాము. చివరకు ప్రతి ఒక్కరినీ నాశనం చేశాము. వారు ఆ పట్టణం మీదుగా ప్రయాణం చేశారు. దాని మీద వినాశ కరమైన వర్షం కురిపించబడిరది. వారు దాని స్థితిని చూచి ఉండరా?
అయినా వారు మరణానంతరం మరొక జీవితం సంభవమని తలంచరు.
25. అల్
ఫుర్ఖాన్ 41
- 42 వారు నిన్ను చూచినప్పుడు నిన్ను పరిహసనీయ వస్తువుగా చేసు కుంటారు. ఇలా అంటారు, ‘‘ఈ వ్యక్తినేనా దేవుడు ప్రవక్తగా చేసి పంపినది? మేము మా దేవుళ్ల పట్ల విశ్వాసంపై స్థిరంగా ఉండకపోయినట్లయితే, ఇతను మమ్మల్ని మార్గం తప్పించి వాటికి దూరం చేసి ఉండేవాడు.’’ సరే మంచిది, శిక్షను చూచినప్పుడు మార్గభ్రష్టత్వంలో ఎవరు ఎక్కువ దూరం వెళ్ళిపోయారో స్వయంగా వారే తెలిసికొనే సమయం ఎంతో దూరంలో లేదు.
25. అల్
ఫుర్ఖాన్ 43
- 44 తన మనోవాంఛను తన దేవుడుగా చేసుకున్న వ్యక్తి యొక్క స్థితిని ఎప్పుడైనా నీవు గమనించావా? నీవు అలాంటి వ్యక్తిని రుజుమార్గానికి తెచ్చే బాధ్యతను స్వీకరించగలవా?
వారిలో చాలమంది వింటారని, అర్థం చేసుకుంటారని నీవు అనుకుంటున్నావా? వారు పశువులలాంటివారు, కాదు వాటికంటే కూడ దిగజారిపోయినవారు.
25. అల్
ఫుర్ఖాన్ 45
- 46 నీ ప్రభువు ఎలా
నీడను విస్తరింపజేస్తాడో నీవు చూడలేదా? ఒకవేళ ఆయన కోరితే, దానిని శాశ్వతమైన నీడగా చేసేవాడు. మేము సూర్యుణ్ణి దానికి మార్గదర్శి (దలీల్)గా చేశాము. తరువాత (సూర్యుడు పైకి లేస్తూ పోయేకొద్దీ) మేము ఈ నీడను క్రమక్రమంగా మా వైపునకు లాక్కుంటూ పోతాము.
25. అల్
ఫుర్ఖాన్ 47 మీ కొరకు రాత్రిని వస్త్రంగానూ, నిద్రను మృత్యు శాంతిగానూ, పగలును బ్రతికిలేచే సమయంగాను చేసినవాడు అల్లాహ్ యే.
25. అల్
ఫుర్ఖాన్ 48
- 50 తన కారుణ్యానికి ముందు గాలులను శుభవార్తలుగా చేసి పంపేవాడూ ఆయనే. తరువాత ఆకాశం నుండి పరిశుద్ధ జలాన్ని అవతరింప జేస్తాడు. దానిద్వారా ఒక మృత ప్రదేశానికి ప్రాణం పోస్తాడు. తన సృష్టిలోని ఎన్నో జంతువులకు, ఎంతోమంది మానవులకు దప్పిక తీర్చుతాడు. మేము ఈ అద్భుతాన్ని వారు గుణపాఠం నేర్చుకోవాలని మాటిమాటికీ వారి ముందు ప్రదర్శిస్తాము. కాని అధిక సంఖ్యాకులు అవిశ్వాసం, కృతఘ్నతలు తప్ప మరొక వైఖరిని అవలంబించటానికి తిరస్క రిస్తున్నారు.
25. అల్
ఫుర్ఖాన్ 51
- 52 ఒకవేళ మేము కోరినట్లయితే, ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క హెచ్చరిక చేసేవాణ్ణి ప్రభవింపజేసి ఉండేవారమే. కనుక ప్రవక్తా! అవిశ్వాసుల మాటను ఎంతమాత్రం నమ్మకు. ఈ ఖురాను ద్వారా వారితో మహత్తరమైన పోరాటం జరుపు.
25. అల్
ఫుర్ఖాన్ 53 రెండు సముద్రాలనూ కలిపి ఉంచినవాడు ఆయనే. ఒకటేమో రుచికర మైనది, మధురమైనదీను. రెండోది చేదైనది, ఉప్పైనదీను. ఆ రెంటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అది వాటిని కలసిపోకుండా ఆపి ఉంచే అవరోధం.
25. అల్
ఫుర్ఖాన్ 54 ఆయనే నీటితో మానవుణ్ణి సృష్టించాడు. తరువాత అతని ద్వారా (తన) వంశము,
అత్తవారి వంశము అనే రెండు వేర్వేరు బంధుత్వపు క్రమాలను రూపొందించాడు. నీ ప్రభువు సర్వశక్తి సంపన్నుడు.
25. అల్
ఫుర్ఖాన్ 55 అయినా, మానవులు అల్లాహ్ ను కాదని తమకు లాభంగాని, నష్టంగాని కలిగించలేని వారిని పూజిస్తున్నారు. అదీగాక, అవిశ్వాసి తన ప్రభువునకు వ్యతిరేకంగా ప్రతి తిరుగుబాటుదారుడికి సహాయపడుతున్నాడు.
25. అల్
ఫుర్ఖాన్ 56
- 57 ప్రవక్తా! నిన్ను మేము కేవలం ఒక శుభవార్తాహరునిగా, హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము.
కనుక వారితో ఇలా అను, ‘‘నేను ఈ పనికై మిమ్మల్ని ఏ ప్రతిఫలాన్నీ కోరను. ఇష్టమున్న వ్యక్తి తన ప్రభువు మార్గాన్ని అవలంబించటమే నా ప్రతిఫలం.’’
25. అల్
ఫుర్ఖాన్ 58
- 59 ప్రవక్తా! సజీవుడూ, ఎన్నడూ మరణించనివాడూ అయిన దేవునిపై నమ్మకం ఉంచు.
ఆయనను స్తుతించటంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు.
తన దాసుల పాపాలను గురించి కేవలం ఆయనకు తెలిస్తే చాలు. ఆయన ఆరుదినాలలో భూమినీ, ఆకాశాలనూ, భూమ్యాకాశాల మధ్య ఉన్న సకల వస్తుజాలన్నీ సృష్టించాడు. తరువాత ఆయనే ‘‘అర్ష్’’ (అధికార పీఠం)ను అధిష్టిం చాడు. ఆయన కరుణామయుడు, ఆయన ఘనతను గురించి ఎరిగిన వాడిని అడుగు.
25. అల్
ఫుర్ఖాన్ 60 ఆ కరుణామయునికి
సజ్దా
చేయండి అని వారితో అన్నప్పుడు వారు ఇలా అంటారు, ‘‘ఈ కరుణామయుడన్నది ఏమిటి? నీవు చెప్పిన దానికల్లా మేము సజ్దా చేయవలసిందేనా?’’ ఈ సందేశం వారి ద్వేషాన్ని మరింత అధికమే చేస్తుంది.
25. అల్
ఫుర్ఖాన్ 61
- 62 ఆకాశంలో బురుజులను నిర్మించినవాడూ, అందులో ఒక దీపాన్ని, ఒక మెరిసే చంద్రుణ్ణి వెలిగించినవాడూ ఎంతో శుభప్రదుడు. ఆయనే రేయిం బవళ్లను ఒక దాని వెంట ఒకటి వచ్చేలా చేశాడు, గుణపాఠం నేర్చుకోదలచిన లేదా కృతజ్ఞతలు తెలుపుకోదలచిన ప్రతి వ్యక్తి కోసం.
25. అల్
ఫుర్ఖాన్ 63
- 76 కరుణామయుని (అసలు) దాసులు ఎవరంటే, నేలపై అణకువతో నడిచేవారూ, మూర్ఖులు వారిని పలుకరించినప్పుడు, మీకో సలామ్ అని అనేవారూ, తమ ప్రభువు
సన్నిధిలో సాష్టాంగపడీ (సజ్దాలోను) నిలబడి రాత్రులు గడిపేవారు, ‘‘మా ప్రభూ, నరకయాతన నుండి మమ్మల్ని కాపాడు, దాని శిక్ష ప్రాణాంతకమైనది,
అది ఎంతో చెడు ప్రదేశం, ఎంతో చెడు నివాసం’’ అని ప్రార్థించేవారు. ఖర్చుపెడితే, దుబారాగానూ ఖర్చు పెట్టకుండా, లోభత్వాన్నీ ప్రదర్శించకుండా ఈ రెండు తీవ్రవైఖరుల మధ్య సమతూకాన్ని పాటించేవారు, అల్లాహ్ ను తప్ప ఏ ఇతర దేవుణ్ణీ వేడుకోనివారు, అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణాన్నీ అన్యాయంగా హతమార్చనివారు, వ్యభిచారానికి పాల్పడనివారు - ఈ పనులను చేసినవాడు ఎవడైనా తన పాపఫలాన్ని పొందితీరుతాడు తీర్పుదినంనాడు అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది. అందులోనే అతడు
శాశ్వతంగా హీనస్థితిలో పడి ఉంటాడు. (ఈ పాపాల తరువాత) పశ్చాత్తాపపడి, విశ్వసించి మంచిపనులు చెయ్యటం ప్రారంభించే వాడు తప్ప.
అటువంటి వాడి చెడులను అల్లాహ్ శుభాలుగా మారుస్తాడు. ఆయన క్షమించేవాడు, కరుణించేవాడూను. పశ్చాత్తాపపడి సద్వర్తనాన్ని అవలంబించే వ్యక్తి అల్లాహ్ వైపునకు మరలివస్తాడు. మరలిరావలసిన రీతిలో - (ఇంకా కరుణామయుని దాసులు ఎలాంటివారంటే) అబద్ధానికి సాక్షులు కానివారు, వ్యర్థమైనవాటి వైపుగా పోవటం జరిగితే, సంస్కారవంతులు మాదిరిగా దాటిపోతారు. వారికి తమ ప్రభువు ఆయతులను వినిపించి హితబోధ చేయటం జరిగితే, వారు దానిని గురించి అంధులుగా, చెవిటి వారుగా ఉండిపోరు. వారు ఇలా ప్రార్థిస్తూ ఉంటారు,
‘‘మా ప్రభూ! మాకు మా
భార్యల ద్వారానూ మా సంతానం ద్వారానూ కన్నుల చల్లదనాన్ని ప్రసాదించు,
మమ్మల్ని భయభక్తులు కలవారికి ఇమాములుగా చేయి.’’- తమ సహనానికి ప్రతిఫలంగా మహోన్నతమైన సౌధాలను పొందేవారు వారే. అక్కడ గౌరవ మర్యాదలతో, శాంతివచనాలతో వారికి స్వాగతం పలుకబడు తుంది. వారు కలకాలం అక్కడనే ఉంటారు. ఎంత మంచిది ఆ స్థలం, ఎంత మంచిది ఆ నివాసం.
25. అల్ ఫుర్ఖాన్ 77 ప్రవక్తా! ప్రజలతో ఇలా అను, ‘‘మీరు నా ప్రభువును వేడుకోకపోతే, ఆయన మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి? ఇప్పుడు మీరు నిరాకరించారు, త్వరలోనే తప్పించుకోనలవికాని శిక్షను మీరు అనుభవిస్తారు.
No comments:
Post a Comment