76. అద్ దహ్ర్
ఆయతులు
: 31 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 3 అనంతమైన కాలంలో మానవుడు చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉండిన సమయం ఏదైనా అతనిపై గడిచిందా? మేము మానవుణ్ణి పరీక్షించ టానికి అతనిని ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము. ఈ లక్ష్యం కోసం మేము అతనిని వినేవాడుగా, చూసేవాడుగా చేశాము. మేము అతనికి మార్గం
చూపాము ఇక అతను కృతజ్ఞతలు తెలిపేవాడైనా కావచ్చు లేదా సత్యాన్ని తిరస్కరించే వాడైనా కావచ్చు.
4 - 22 సత్యతిరస్కారుల కొరకు మేము సంకెళ్లను, కంఠపాశాలను, మండే అగ్నిని సిద్ధపరచి ఉంచాము. సజ్జనులు (స్వర్గంలో) కర్పూర జలం కలిపిన మధుపాత్రలను సేవిస్తారు
ఇది ప్రవహించే ఒక సెలయేరు
దైవదాసులు దాని నీటితోపాటు మద్యం సేవిస్తారు. వారు తాము కోరిన చోటికి దాని పాయలను సులభంగా తీసుకుపోతారు. వారు ఎలాంటి వారంటే, (ప్రపం చంలో) మొక్కుబడి చెల్లించేవారు, నలువైపుల నుండి ఆపదలు కమ్ముకొనివచ్చే దినానికి భయపడేవారు మరియు అల్లాహ్ మీది ప్రేమతో పేదలకూ, అనాధు లకూ, ఖైదీలకూ అన్నం పెట్టేవారు. (వారు వారితో ఇలా అంటారు), ‘‘మేము కేవలం అల్లాహ్ కోసమే మీకు అన్నం పెడుతున్నాము.
మేము మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నిగానీ, కృతజ్ఞతలను గానీ ఆశించటం లేదు. దుర్భరమైన ఆపదలతో కూడుకున్న సుదీర్ఘమైన రోజున మా ప్రభువు విధించే శిక్ష గురించి మేము భయపడుతున్నాము.’’
కనుక అల్లాహ్ వారిని ఆనాటి కీడు నుండి రక్షిస్తాడు, వారికి తాజాదనాన్నీ, ఆనందాన్నీ ప్రసాదిస్తాడు. వారి సహనానికి ప్రతిఫలంగా వారికి స్వర్గాన్నీ, పట్టువస్త్రాలనూ ప్రసాదిస్తాడు. అక్కడ వారు ఎత్తైన పీఠాలపై దిండ్లకు ఆనుకుని కూర్చొని ఉంటారు. వారిని ఎండవేడీ బాధించదు. చలి తీవ్రతా వేధించదు. స్వర్గచ్ఛాయలు వారిపైకి వంగి నీడను ఇస్తూ ఉంటాయి, దాని పండ్లు ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటాయి (వారు తమ ఇష్టానుసారం వాటిని తెంచుకొని తింటారు). వారి మధ్య వెండి పాత్రలు, గాజుగ్లాసులు అటూ ఇటూ త్రిప్పబడుతూ ఉంటాయి
ఆ గాజుగ్లాసులు స్ఫటికం వలె తెల్లనైన వెండితో చేయబడినటువంటివి. వాటిని (స్వర్గ నిర్వాహకులు) కచ్చితమైన అంచనా ప్రకారం నింపి ఉంటారు. అక్కడ వారికి సొంటి కలిపిన మధుపాత్రలు ఇవ్వబడతాయి
ఇది స్వర్గంలోని ‘సల్ సబీల్’ అనే పేరుగల
ఒక సెలయేరు. వారి సేవకొరకు పరుగెత్తుతూ అటూ ఇటూ తిరిగే బాలురు ఉంటారు
వారు ఎల్లప్పుడూ బాలురుగానే ఉంటారు. మీరు వారిని చూస్తే, వెదజల్లబడిన ఆణిముత్యాలా అని అనుకుంటారు. అక్కడ మీరు ఎటు చూచినా దైవానుగ్రహాలే మీకు కనిపిస్తాయి
ఇంకా ఒక మహత్తర సామ్రాజ్య వైభవం కనిపిస్తుంది. వారి ఒంటిపై సన్నని ఆకుపచ్చని పట్టు వస్త్రాలు, ఖరీదైన జలతారు అల్లిన దుస్తులు ఉంటాయి. వారికి వెండి మురుగులు తొడుగుతారు. వారి ప్రభువు వారికి ఎంతో పరిశుద్ధమైన మద్యాన్ని ప్రసాదిస్తాడు. మీకు లభించే ప్రతిఫలం ఇది
మీరు చేసిన పనులు విలువైనవిగా గుర్తించబడ్డాయి.
23 - 31 ఓ ప్రవక్తా! మేమే ఈ ఖుర్ఆన్ను కొంచెం కొంచెంగా నీపైన అవతరింపజేశాము.
కనుక నీవు నీ ప్రభువు ఆజ్ఞ విషయంలో సహనం వహించు. వారిలోని ఏ
దుర్మార్గుని మాటలుగానీ, ఏ సత్య తిరస్కారి మాటలుగానీ వినకు. నీ ప్రభువు పేరును ఉదయం, సాయంత్రం స్మరించు. రాత్రివేళ కూడ ఆయన సన్నిధిలో సాష్టాంగపడు. రాత్రివేళ సుదీర్ఘ సమయాలు ఆయనను
స్తుతించటంలో గడుపుతూ ఉండు. వారైతే తొందరగా లభించే దానిని (ప్రపంచాన్ని) ప్రేమిస్తున్నారు. మున్ముందు రానున్న భారమైన దినాన్ని విస్మరిస్తున్నారు. మేమే వారిని సృష్టించాము, వారి కీళ్లను పట్టిష్ఠపరిచాము. మేము ఎప్పుడు కోరితే
అప్పుడు వారి రూపాలను మార్చగలము. ఇదొక హితోపదేశం. ఇప్పుడిక ఇష్టమైన వారు తమ ప్రభువు వైపునకు పోయేమార్గాన్ని అవలంబించవచ్చు. అల్లాహ్ కోరనంత వరకు, మీరు కోరినంత మాత్రాన ఏమీ కాదు. నిశ్చయంగా అల్లాహ్ గొప్ప జ్ఞాని, గొప్ప వివేకి
తాను కోరిన వారిని తన కారుణ్యచ్ఛాయలోనికి తీసుకుంటాడు. దుర్మార్గుల కొరకు ఆయన అత్యంత బాధాకరమైన శిక్షను తయారుచేసి ఉంచాడు.
No comments:
Post a Comment