49. అల్ హుజురాత్
ఆయతులు
: 18 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 విశ్వాసులారా! అల్లాహ్ కు , ఆయన ప్రవక్తకూ ముందు నడవకండి. అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ సమస్తమూ వినేవాడు, సర్వమూ ఎరిగినవాడూను.
2 - 3 విశ్వాసులారా! మీ కంఠస్వరాన్ని ప్రవక్త కంఠస్వరం కంటే పెంచకండి. మీరు పరస్పరం మాట్లాడుకునే విధంగా ప్రవక్తతో బిగ్గరగా మాట్లాడకండి, దానివల్ల, బహుశా మీరు చేసినదంతా మీకు తెలియకుండానే వ్యర్థమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను
కూడా తెలియకపోవచ్చు. ప్రవక్త సన్నిధిలో తమ కంఠస్వరాన్ని తగ్గించి మాట్లాడేవారి హృదయాలనే వాస్తవానికి భయభక్తుల విషయంలో అల్లాహ్ పరీక్షించాడు. వారికి క్షమాభిక్ష, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి.
4 - 5
ప్రవక్తా! నిన్ను నీ గృహాల బయటినుండి బిగ్గరగా పిలిచేవారిలో అనేకులు బుద్ధిహీనులు. వారు గనక నీవు బయటకు వచ్చేవరకు ఓపికపట్టి ఉంటే, అది వారికే శ్రేయస్కరముగా ఉండేది. అల్లాహ్ మన్నించేవాడు, కరుణామయుడూను.
6 - 8 విశ్వాసులారా! ఎవడైనా దుర్మార్గుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే, నిజానిజాలు విచారించి తెలుసుకోండి. లేకపోతే మీకు తెలియకుండానే మీరు ఏదైనా వర్గానికి నష్టం కలిగించవచ్చు, తరువాత చేసినదానికి పశ్చాత్తాపపడవలసి రావచ్చు. మీ మధ్య అల్లాహ్ ప్రవక్త ఉన్నాడనే విషయాన్ని బాగా గుర్తు ఉంచుకోండి, ఒకవేళ ప్రవక్త గనక అనేక వ్యవహారాలలో మీ మాట విన్నట్లయితే, మీరే స్వయంగా కష్టాలలో పడిపోతారు. కాని అల్లాహ్ మీలో విశ్వాసం పట్ల ప్రేమను కలుగజేశాడు, దానిని మీకు మనోరంజకమైనదిగా చేశాడు. అవిశ్వాసం, దుర్మార్గం, అవిధేయతలపట్ల మీకు వెగటు కలిగేలా చేశాడు. అటువంటి ప్రజలే అల్లాహ్ అనుగ్రహం వల్ల, ఆయన మహోపకారం వల్ల సన్మార్గగాములయ్యారు. అల్లాహ్ సర్వజ్ఞాని, మహావివేకీను.
9 - 10 ఒకవేళ విశ్వాసులలోని రెండు వర్గాలవారు పరస్పరం పోట్లాడుకుంటే, వారి మధ్య రాజీ కుదిరించండి. తరువాత, ఒకవేళ వారిలో ఒక వర్గం వారు రెండో వర్గం వారిపై దౌర్జన్యం చేస్తే, దౌర్జన్యం చేసినవారు అల్లాహ్ ఆజ్ఞ వైపునకు మరలేవరకు వారికి వ్యతిరేకంగా పోరాడండి. తరువాత వారు గనక మరలివస్తే, వారి మధ్య రాజీ కుదర్చండి. న్యాయం చేయండి, ఎందుకంటే అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు. విశ్వాసులు పరస్పరం అన్నదమ్ములు. కనుక మీ సోదరుల మధ్య సంబంధాలను సంస్కరించండి. అల్లాహ్ కు భయపడండి, మీపై దయచూపటం జరగవచ్చు.
11 విశ్వాసులారా! పురుషులు ఇతర పురుషులను ఎగతాళి చేయకూడదు. వీరికంటే వారే శ్రేష్ఠులై ఉండవచ్చు. అలాగే స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చేయకూడదు. వీరికంటే వారే శ్రేష్ఠురాండ్రయి ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తిపొడుచుకోకండి, ఒకరినొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తరువాత చెడ్డతనంలో పేరు సంపాదించటం చాలా నీచమైన విషయం. ఈ వైఖరిని మానుకోనివారే దుర్మార్గులు.
12 విశ్వాసులారా! అతిగా అనుమానించటం మానివేయండి. కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. గూఢచారులుగా వ్యవహరించకండి. మీలో ఎవరూ ఎవరినీ పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మృత సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరే స్వయంగా దీనిని అసహ్యించుకుంటారు. అల్లాహ్ కు భయపడండి, అల్లాహ్ అత్యధికంగా పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడూను.
49. అల్ హుజురాత్ 13 మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞానం కలవాడు, సకల విషయాలూ తెలిసినవాడూను.
14 - 15 ఈ సంచార అరబ్బులు, ‘‘మేము విశ్వసించాము’’ అని అంటారు. వారితో ఇలా అను, ‘‘మీరు విశ్వసించలేదు. మేము లొంగిపోయాము’’ అని అనండి. విశ్వాసం ఇంకా మీ హృదయాలలోకి ప్రవేశించలేదు. మీరు గనక అల్లాహ్ పట్ల విధేయతనూ, ఆయన ప్రవక్త పట్ల విధేయతనూ పాటిస్తే, ఆయన మీ కర్మల ప్రతిఫలాన్ని ఏమాత్రం తగ్గించడు. నిశ్చయంగా అల్లాహ్ అత్యధికంగా మన్నించేవాడు మరియు కరుణించేవాడూను. అసలు అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ విశ్వసించి, ఇక ఎలాంటి అనుమానానికీ గురికాకుండా, తమ ప్రాణాలతో, తమ సిరిసంపదలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారే నిజమైన విశ్వాసులు. వారే సత్యసంధులు.
16 - 18 ప్రవక్తా! వారి (విశ్వసించామని చెప్పుకునేవారి)తో ఇలా అను, ‘‘మీరు అల్లాహ్ కు మీ ధర్మ స్వీకారం గురించి తెలియజేస్తున్నారా? వాస్తవానికి అల్లాహ్, భూమిలోనూ, ఆకాశాలలోనూ ఉన్న ప్రతి వస్తువునూ ఎరుగును. ఆయనకు
ప్రతి వస్తువును గురించిన జ్ఞానం ఉన్నది.’’
వారు ఇస్లామ్ను స్వీకరించి తామేదో మీకు మేలు చేసినట్లు చెబుతున్నారు. వారితో ఇలా అను,
‘‘ఇస్లామ్కు సంబంధించిన మేలును నా మీద మోపకండి. అల్లాహ్ మీకు విశ్వాసానికి సంబంధించిన మార్గం చూపి, ఆయనే మీకు ఉపకారం చేశాడు -
మీరు గనక (మీ విశ్వాస ప్రకటనలో) నిజాయితీపరులే అయితే. అల్లాహ్ కు భూమిలోనూ, ఆకాశాలలోనూ దాగి ఉన్న ప్రతి వస్తువును గురించీ తెలుసు. మీరు చేసేదంతా ఆయన దృష్టిలో ఉన్నది.
No comments:
Post a Comment