40. అల్ మూమిన్
ఆయతులు
: 85 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
40. అల్ మూమిన్ 1 - 3 హా. మీమ్. ఈ గ్రంథం
అల్లాహ్ తరఫు నుండి అవతరించింది. ఆయన మహాశక్తిమంతుడు, మహాజ్ఞాని, పాపాలను క్షమించేవాడూ, పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడూను కఠినంగా శిక్షించేవాడూ, ఘనంగా కరుణించేవాడూను. ఆయన తప్ప ఆరాధ్య దైవం మరెవ్వడూ లేడు. ఆయన వైపునకే అందరూ తిరిగి పోవలసి ఉన్నది.
40. అల్ మూమిన్ 4 - 6 ఒక్క అవిశ్వాసులు తప్ప మరెవ్వరూ అల్లాహ్ వాక్యాలను గురించి వివాదపడరు. కనుక ప్రపంచ దేశాలలోని వారు అట్టహాసంగా తిరగటాన్ని చూచి మీరు మోసపోకూడదు. వారికి పూర్వం నూహ్ జాతి కూడ తిరస్కరించింది. దాని తరువాత ఎన్నో ఇతర వర్గాలు కూడ ఇలానే చేశాయి. ప్రతి జాతీ తన ప్రవక్తను నిర్బంధించేందుకు అతనిపై విరుచుకుపడిరది. వారందరూ కలిసి అసత్యమనే ఆయుధంతో సత్యాన్ని ఓడిరచటానికి ప్రయత్నిం చారు. కాని చివరకు నేను వారిని పట్టుకున్నాను. చూడండి, నా శిక్ష ఎంత కఠినమో. ఇదేవిధంగా అవిశ్వాసానికి పాల్పడిన వారందరిని గురించి, వారు నరకంలో ప్రవేశిస్తారని నీ ప్రభువు చేసిన తీర్పు కూడా నెరవేరింది.
40. అల్ మూమిన్ 7 - 9 దైవ సింహాసనాన్ని మోసే దైవదూతలూ, ఆ సింహాసనం చుట్టూ ఉండే దైవదూతలూ, అందరూ తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయనను విశ్వసిస్తున్నారు, విశ్వసించేవారిని క్షమించు అని ప్రార్థనలు చేస్తున్నారు. వారు ఇలా అంటారు, ‘‘ప్రభూ! నీవు నీ కారుణ్యంతో, నీ జ్ఞానంతో ప్రతి వస్తువుపై వ్యాపించి ఉన్నావు. కనుక పశ్చాత్తాపంతో నీ వైపునకు మరలినవారిని, నీ మార్గాన్ని అనుసరించినవారిని క్షమించు. వారిని నరకయాతన నుండి కాపాడు,
ప్రభూ! ఇంకా, వారిని శాశ్వతంగా ఉండే స్వర్గవనాలలో ప్రవేశింపజెయ్యి వాటిని
గురించి నీవు వారికి వాగ్దానం చేసి ఉన్నావు. వారి తల్లిదండ్రులలో, వారి భార్యలలో, వారి సంతానంలో సజ్జనులైన వారిని కూడ (వారితో పాటే అక్కడకు చేర్చు). నిస్సందేహంగా నీవు మహాశక్తిసంపన్నుడవు, మహా వివేకవంతుడవూను. వారిని చెడుల నుండి కాపాడు. ప్రళయం నాడు నీవు చెడుల నుండి కాపాడేవాడిని నీవు ఎంతో కరుణించావన్నమాట. ఇదే గొప్ప సాఫల్యం.
40. అల్ మూమిన్ 10 - 12 అవిశ్వాసానికి పాల్పడిన వారిని ప్రళయం నాడు పిలిచి, ‘‘ఈనాడు మీకు మీ పట్ల ఎంత తీవ్రమైన కోపం వచ్చిందో, మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలువగా, మీరు నిరాకరించిననాడు అల్లాహ్ కు మీ పట్ల అంతకంటే తీవ్రంగానే కోపం వచ్చింది’’ అని అనటం జరుగుతుంది. వారు ఇలా అంటారు : ‘‘ప్రభూ! నిజంగానే నీవు మాకు రెండుసార్లు మరణాన్నీ, రెండుసార్లు జీవితాన్నీ ఇచ్చావు. ఇప్పుడు మేము మా తప్పులను ఒప్పుకుంటున్నాము. కనుక ఇక్కడ నుండి బయటపడే మార్గం కూడా ఏదైనా ఉందా?’’ (ఇలా సమాధానం వస్తుంది): ‘‘మీరు గురిjైున ఈ దుస్థితికి కారణం ఏమిటంటే, ఏకైక దేవుడు అయిన అల్లాహ్ వైపునకు మాత్రమే పిలిచినప్పుడు, మీరు విశ్వసించకుండా తిరస్కరించేవారు. ఇతరులను ఆయనకు సమానులుగా చేసినప్పుడు, మీరు వెంటనే విశ్వసించేవారు. ఇప్పుడు తీర్పు, మహనీయుడూ, మహోన్నతుడూ అయిన అల్లాహ్ చేతులలో ఉన్నది.’’
40. అల్ మూమిన్ 13 - 14 ఆయనే మీకు తన సూచనలను చూపిస్తాడు, ఆకాశం నుండి మీ కొరకు ఆహారాన్ని అవతరింపజేస్తాడు. కాని (ఈ సూచనలను చూచి) కేవలం అల్లాహ్ వైపునకు మరలే మనిషి మాత్రమే గుణపాఠం నేర్చుకుంటాడు. (కనుక అల్లాహ్ వైపునకు మరలే ప్రజలారా!) అల్లాహ్ ను మాత్రమే వేడుకోండి, మీ ధర్మాన్ని ఆయనకై ప్రత్యేకించుకొని, మీరు చేసే ఈ పని అవిశ్వాసులకు ఎంత అనిష్టంగా ఉన్నాసరే.
40. అల్ మూమిన్ 15 - 20 ఆయన మహోన్నతమైన స్థానాలు కలవాడు, విశ్వసామ్రాజ్య పీఠానికి అధిపతి. తన దాసులలో తనకు ఇష్టమైన వారిపై తన ఆజ్ఞ ప్రకారం ఆత్మను అవతరింపజేస్తాడు అతను సమావేశదినం గురించి హెచ్చరించే టందుకు. పరదాలు తొలగిపోయి అందరూ బయటకు వచ్చిన రోజున, వారికి సంబంధించిన విషయేమేదీ అల్లాహ్ కు రహస్యంగా ఉండదు. (ఆ రోజున బహిరంగంగా
ఇలా అడగటం జరుగుతుంది) ‘‘ఈనాడు విశ్వ సామ్రాజ్యాధికారం ఎవరిది?’’ అని.
(విశ్వం మొత్తం ముక్తకంఠంతో ఇలా అంటుంది), ‘‘అది ఒకే దేవుడూ, సర్వాధిక్యం కలవాడూ అయిన అల్లాహ్ది’’ అని. (ఇలా అనటం జరుగుతుంది), ‘‘ఈనాడు ప్రతి ప్రాణికీ అది సంపాదించిన దాని ప్రకారమే ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఈనాడు ఎవరికీ ఎలాంటి అన్యాయమూ జరగదు. అల్లాహ్ మిక్కిలి వేగంగా లెక్క తీసుకుంటాడు. ఓ ప్రవక్తా! దగ్గర పడిన ఆ రోజును గురించి వారిని భయపెట్టు. అప్పుడు గుండెలు
గొంతులకు అడ్డుపడుతూ ఉంటాయి. ప్రజలు ద్ణుఖాన్ని దిగమ్రింగి మౌనంగా నిలబడి ఉంటారు. దుర్మార్గులకు ఆప్తమిత్రుడుగానీ, మాట చెల్లుబడి అయ్యే సిఫారసు చేసేవాడు గానీ ఎవ్వడూ ఉండడు. అల్లాహ్, చూపుల చౌర్యాన్ని సైతం ఎరుగును. హృదయాలు దాచి ఉంచిన రహస్యాన్ని సైతం ఆయన ఎరుగును. అల్లాహ్ కచ్చితంగా, న్యాయంగా తీర్పు చేస్తాడు. ఇక అల్లాహ్ ను వదలిపెట్టి (ఈ ముష్రిక్కులు) వేడుకునేవారి విషయం, వారు ఏ విషయం గురించీ తీర్పు చెప్పగలవారు కారు. నిస్సందేహంగా అల్లాహ్ మాత్రమే అన్నీ వినేవాడు, అన్నీ చూచేవాడూను.
40. అల్ మూమిన్ 21 - 22 వారు భూమిలో ఎన్నడూ సంచరించలేదా, వారికి పూర్వం గతించిన ప్రజల ముగింపు ఎలా జరిగిందో వారికి కనిపించేందుకు? వారు వీరికంటే ఎక్కువ బలాఢ్యులు, వీరికి మించిన గొప్ప గుర్తులను భూమిపై వదలివెళ్లారు. కాని అల్లాహ్ వారి పాపాలకు గాను వారిని పట్టుకున్నాడు. అల్లాహ్ పట్టునుండి వారిని రక్షించేవాడెవడూ లేకపోయాడు. వారి ముగింపు ఇలా ఎందుకు జరిగిందంటే, వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చారు
కాని వారు విశ్వసించకుండా వాటిని తిరస్కరించారు. చివరకు అల్లాహ్ వారిని పట్టుకున్నాడు. నిశ్చయంగా ఆయన అత్యంత శక్తిమంతుడూ, శిక్షించటంలో కఠినుడూను.
40. అల్ మూమిన్ 23 - 25 మేము మూసాను ఫిరౌన్, హామాన్, ఖారూన్ల వద్దకు
మా సూచనలతో, స్పష్టమైన నియమాధికారంతో పంపాము. కాని వారు, ‘‘ఇతడు మాంత్రికుడు, అసత్యవాది’’ అని అన్నారు. తరువాత అతను మా వద్ద నుండి సత్యాన్ని వారి ముందుకు తీసుకురాగా, వారు ఇలా అన్నారు, ‘‘విశ్వసించి ఇతనితో చేరిపోయినవారందరి కొడుకులనూ చంపండి, వారి కూతుళ్లను వదలిపెట్టండి.’’ కాని అవిశ్వాసుల పన్నాగం విఫలమే అయింది.
40. అల్ మూమిన్ 26 ఒక రోజు ఫిరౌన్ తన దర్బారు జనులతో ఇలా అన్నాడు, ‘‘నన్ను వదలండి, నేను ఈ మూసాను చంపివేస్తాను. ఇతడు తన ప్రభువును పిలుచుకోనివ్వండి. ఇతడు మీ మతాన్ని మార్చివేస్తాడేమో అని, లేదా దేశంలో సంక్షోభాన్ని రేకెత్తిస్తాడేమో అని నేను భయపడుతున్నాను.’’
40. అల్ మూమిన్ 27 మూసా ఇలా అన్నాడు, ‘‘నేను లెక్కల రోజును విశ్వసించని ప్రతి దురహం కారి బారి నుండి కాపాడు అని నా ప్రభువూ, మీ ప్రభువూ శరణుకోరాను.’’
40. అల్ మూమిన్ 28 - 29 ఈ సందర్భంగా, తన విశ్వాసాన్ని గుప్తంగా ఉంచిన ఫిరౌన్ జాతికి చెందిన ఒక విశ్వాసి ఇలా అన్నాడు, ‘‘మీరు ఒక వ్యక్తిని, కేవలం అతడు, ‘నా ప్రభువు అల్లాహ్’ అని అన్నంత మాత్రాన్నే చంపేస్తారా? వాస్తవా నికి అతను మీ ప్రభువు వద్దనుండి మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకు వచ్చాడు.
ఒకవేళ అతను అబద్ధాలు చెప్పేవాడే అయితే, అతని అబద్ధం స్వయంగా అతని మీదనే తిరిగి పడుతుంది. కాని ఒకవేళ అతను సత్యమే చెబుతున్నట్లయితే, అతను మిమ్మల్ని భయపెడుతున్న భయంకరమైన పరిణామా లలో కొన్ని
అయినా మీ మీదకు తప్పకుండా వచ్చిపడతాయి. హద్దులను అతిక్రమించే, అసత్యాలు పలికే ఏ వ్యక్తికీ అల్లాహ్ సన్మార్గం చూపడు. నా జాతి ప్రజలారా! మీకు ఈనాడు రాజ్యాధికారం ఉన్నది. భూమిపై మీరు ప్రాబల్యం వహించి ఉన్నారు. కాని ఒకవేళ దైవశిక్ష మనపైకి వచ్చిపడితే, అప్పుడు మనకు సహాయం చేయగల వాడెవడైనా ఉన్నాడా?’’ ఫిరౌన్ ఇలా అన్నాడు, ‘‘నాకు సముచితంగా తోచిన సలహానే నేను మీకు ఇస్తున్నాను. సక్రమమైన మార్గం వైపునకే నేను మిమ్మల్ని నడుపుతున్నాను.’’
40. అల్ మూమిన్ 30 - 35 విశ్వసించిన ఆ వ్యక్తి ఇలా అన్నాడు, ‘‘నా జాతి ప్రజలారా! పూర్వం అనేక జన సమూహాలకు దాపురించిన దినమే, మీకు కూడా దాపురిస్తుందేమో అని నేను భయపడుతున్నాను - నూహ్ జాతి, ఆద్ జాతి, సమూద్ జాతులకూ వారి తరువాత వచ్చిన జాతులకూ దాపురించిన దినం. తన దాసులకు అన్యాయం చేయాలనే ఉద్దేశ్యం అల్లాహ్ కు ఎంతమాత్రం లేదు అనేది వాస్తవం. నాజాతి ప్రజలారా! మీరు రోదించే దినమేదైనా మీపైకి వచ్చిపడుతుందేమో అని నేను భయపడుతున్నాను
అప్పుడు మీరు ఒకరినొకరు పిలుచుకుంటారు, పరుగెత్తుతూ తిరుగుతూ ఉంటారు. కాని ఆ సమయంలో అల్లాహ్ నుండి మిమ్మల్ని రక్షించేవాడెవడూ ఉండడు. నిజం ఏమిటంటే, అల్లాహ్, మార్గం తప్పించిన వాడికి మళ్లీ మార్గం చూపేవాడెవడూ ఉండడు. పూర్వం యూసుఫ్ మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలను తీసుకువచ్చాడు. కాని మీరు అతను తెచ్చిన బోధను గురించి అనుమానానికే గురిఅయ్యారు. తరువాత అతను మరణించినప్పుడు మీరు, ‘‘ఇక అతని తరువాత అల్లాహ్ మరొక ప్రవక్తను పంపడు’’ అని అన్నారు - ఇదే విధంగా అల్లాహ్, హద్దులను అతిక్రమించేవారినీ, శంకితులనూ, తమ వద్దకు ఏ ధ్రువపత్రమూ, ఏ ఆధారమూ రాకపోయినా
అల్లాహ్ వాక్యాల విషయంలో వాదించేవారినీ మార్గభ్రష్టత్వానికి గురిచేస్తాడు. వారి
ఈ వైఖరి అల్లాహ్ దృష్టిలో, విశ్వాసుల దృష్టిలో మిక్కిలి గర్హనీయ మైనది. ఇలాగే అల్లాహ్, దురహంకారీ, నిరం కుశుడూ అయిన ప్రతి వ్యక్తి హృదయానికి ముద్రవేస్తాడు.
40. అల్ మూమిన్ 36 - 37 ఫిరౌన్ ఇలా అన్నాడు, ‘‘హామాన్! నా కోసం ఒక ఎత్తైన సౌధాన్ని నిర్మించు, నేను మార్గాల వరకు- ఆకాశాలకు వెళ్ళే మార్గం వరకు చేరగలిగేం దుకు, మూసా దేవుణ్ణి తొంగి చూసేందుకు. నాకు ఈ మూసా అబద్ధాలకోరు గానే కనిపిస్తున్నాడు- ఈ విధంగా ఫిరౌన్కు అతడి దుష్కార్యం మనోహరమైన దిగా చేయబడిరది
అతడు సత్యమార్గం వైపునకు రాకుండా ఆపబడ్డాడు. ఫిరౌన్ పన్నాగమంతా (స్వయంగా అతని) వినాశ మార్గానికే వినియోగపడిరది.
40. అల్ మూమిన్ 38 - 44 విశ్వసించిన ఆ వ్యక్తి ఇంకా ఇలా అన్నాడు,
‘‘నా జాతి ప్రజలారా! నా మాట వినండి. నేను మీకు సరైన మార్గాన్ని చూపిస్తాను. నా జాతీయులారా! ఈ ప్రాపంచిక జీవితం తాత్కాలికం,
శాశ్వత నివాస స్థలం పరలోకమే. చెడు చేసినవాడికి, అతడు చేసినంత చెడుకు మాత్రమే ప్రతిఫలం లభిస్తుంది. మంచి పనులు చేసినవ్యక్తి, పురుషుడైనా
స్త్రీ అయినా, విశ్వాసి అయితే, అటువంటి వారందరూ స్వర్గంలో ప్రవేశిస్తారు. అక్కడ వారికి అపరిమితమైన జీవన సామగ్రి ఇవ్వబడుతుంది. నా జాతీయులారా! ఇదేమి వైపరీత్యం! నేను మిమ్మల్ని ముక్తివైపునకు పిలుస్తున్నాను, మీరేమో నన్ను అగ్ని వైపునకు పిలుస్తున్నారు! నేను అల్లాహ్ ను తిరస్కరించాలనీ, నేను ఎరుగని శక్తులను ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టాలనీ మీరు నాకు పిలుపు ఇస్తున్నారు. నిజానికి నేను మిమ్మల్ని సర్వశక్తి సంపన్నుడూ, క్షమాశీలుడూ అయిన దేవుని వైపునకు పిలుస్తున్నాను. కాదు, సత్యం ఇదే, దీనికి భిన్నంగా జరగటానికి వీల్లేదు : మీరు నన్ను ఎవరి వైపునకు పిలుస్తున్నారో, వారి వైపునకు పిలుపు అనేది ఇహలోకంలోనూ లేదు
పరలోకం లోనూ లేదు. మనం అందరం అల్లాహ్ వద్దకే మరలిపోవలసి ఉంది.
హద్దులు మీరేవారే అగ్నిలోకి పోయే వారు. ఈనాడు నేను చెప్పేదాన్ని మీరు జ్ఞాపకం చేయనున్న సమయం త్వర లోనే రాబోతోంది. నా వ్యవహారాన్ని నేను అల్లాహ్ కు అప్పగిస్తున్నాను. ఆయన తన దాసులను కనిపెట్టుకుని ఉంటాడు.
40. అల్ మూమిన్ 45 - 50 చివరకు ఆ విశ్వాసికి వ్యతిరేకంగా వారు, పన్నిన అన్ని కుయుక్తుల నుండి అల్లాహ్ అతనిని రక్షించాడు. ఫిరౌన్ అనుచరులే ఒక భయంకరమైన శిక్షలో చిక్కుకున్నారు. వారు ఉదయం సాయంత్రం నరకాగ్ని ముందు ఉంచ బడుతూ ఉంటారు. ప్రళయ గడియవచ్చినప్పుడు, ‘‘ఫిరౌన్ ప్రజలను తీవ్రమైన శిక్షలోకి ప్రవేశింపజెయ్యండి’’ అని ఆజ్ఞాపించబడుతుంది. ఇంకా, వారు నరకంలో ఒకరితో ఒకరు కలహించే సందర్భం గురించి ఆలోచించు. ప్రపం చంలో బలహీనులుగా ఉన్నవారు, పెద్ద మనుషులుగా చెల్లుబడి అయిన వారితో ఇలా అంటారు, ‘‘మేము మిమ్మల్ని అనుసరిస్తూ ఉండేవారము. ఇప్పుడు మీరు ఇక్కడ నరకాగ్ని బాధ నుండి కొంతవరకైనా మమ్మల్ని కాపాడతారా?’’ ఆ పెద్ద మనుషులు ఇలా జవాబు ఇస్తారు, ‘‘ఇక్కడ మన మందరం ఒకే స్థితిలో ఉన్నాము. దాసుల మధ్య అల్లాహ్ తీర్పు చేసేశాడు.’’ తరువాత అగ్నిలో పడి ఉన్నవారు నరకభటులతో, ‘‘మా శిక్షను కనీసం ఒక్కరోజైనా తగ్గించమని మీరు మీ ప్రభువును ప్రార్థించండి’’ అని అర్థిస్తారు. భటులు ఇలా అడుగుతారు, ‘‘మీవద్దకు దైవప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకుని రాలేదా?’’ అప్పుడు వారు, ‘‘అవును, వచ్చారు’’ అని అంటారు. నరకభటులు, ‘‘అలాఅయితే, మీరే ప్రార్థించండి
సత్యతిరస్కారుల ప్రార్థన నిరర్థకమే అవుతుంది’’ అని అంటారు.
40. అల్ మూమిన్ 51 - 56 నిశ్చయంగా మేము మా ప్రవక్తలకూ, విశ్వాసులకూ ఇహలోక జీవితంలో కూడా తప్పకుండా సహాయం చేస్తాము
సాక్షులు నిలబడే రోజున కూడా సహాయం చేస్తాము. ఆ రోజున దుర్మార్గులకు వారి సాకు ఏమాత్రం ఉపయోగపడదు, వారి మీద శాపం విరుచుకుపడుతుంది, అతి నికృష్టమైన నివాసం వారి వాటాగా లభిస్తుంది. చూడండి, చివరకు మేము మూసాకు దారి చూపాము. బుద్ధీ వివేకాలు కలవారికి మార్గదర్శకత్వం, హితోపదేశం అయిన గ్రంథానికి ఇస్రాయీల్ ప్రజలను వారసులుగా చేశాము.
కనుక ఓ ప్రవక్తా! ఓర్మి చూపు. అల్లాహ్ వాగ్దానం సత్యం. నీ తప్పులకు క్షమాభిక్ష వేడుకో. ఉదయం, సాయంత్రం నీ ప్రభువును స్తుతిస్తూ, ఆయన పరిశుద్ధతను కొనియాడు. తమ వద్దకు ఏ అధికారపత్రమూ రాకుండానే అల్లాహ్ వాక్యాల విషయంలో వాదులాడే వారి మనస్సులు గర్వంతో నిండిపోయాయి. కాని తాము గర్వపడుతూ ఉన్నంత గొప్ప తనానికి వారు చేరుకోలేరు. కనుక అల్లాహ్ శరణువేడుకో
ఆయన అన్నీ చూస్తాడు, అన్నీ వింటాడు.
40. అల్ మూమిన్ 57 - 59 మానవుణ్ణి సృష్టించటం కంటే ఆకాశాలనూ, భూమినీ సృష్టించటం నిశ్చయంగా ఎంతో గొప్ప పని. కాని అనేకులు ఎరుగరు. కళ్లు లేనివాడూ, కళ్ళు ఉన్నవాడూ సమానం కావటం
విశ్వసించి సత్కార్యాలు చేసేవారూ, దుర్వర్తనులూ సరిసమానం కావటం అనేది ఎంతమాత్రం జరగదు. కాని మీరు అర్థం చేసుకోవటం చాలా తక్కువ. నిశ్చయంగా ప్రళయ గడియ తప్పకుండా వస్తుంది. అది వచ్చే విషయం గురించి ఏమాత్రం సందేహం లేదు. కాని చాలామంది నమ్మరు.
40. అల్ మూమిన్ 60 నీ ప్రభువు ఇలా అంటున్నాడు, ‘‘నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. గర్వానికి లోనై నా ఆరాధనకు విముఖులయ్యేవారు తప్పనిసరిగా అవమానానికీ, పరాభవానికి గురిఅయి నరకంలో ప్రవేశిస్తారు.’’
40. అల్ మూమిన్ 61 - 63 మీరు విశ్రాంతి తీసుకోవటానికి మీ కొరకు రాత్రిని సృష్టించిన వాడూ, పగలును వెలుగుతో నింపినవాడూ అల్లాహ్ యే కదా! వాస్తవానికి అల్లాహ్ ప్రజలపట్ల ఎంతో దయగలవాడు. కాని ఎక్కువ మంది కృతజ్ఞతలు తెలుపరు. ఆ అల్లాహ్ యే (మీ కొరకు ఇదంతా చేసినవాడు) మీ ప్రభువు, ప్రతిదాన్నీ సృజించినవాడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. అలాం టప్పుడు మీరు ఎలా మార్గం తప్పిపోతున్నారు? ఇదేవిధంగా అల్లాహ్ వాక్యా లను తిరస్కరించేవారందరూ మార్గం నుంచి తప్పించబడుతూ వచ్చారు.
40. అల్ మూమిన్ 64 - 65 మీకొరకు భూమిని నివాస స్థలంగా చేసినవాడూ, పైని ఆకాశాన్ని కప్పుగా నిర్మించినవాడూ, మీ రూపాన్ని తీర్చిదిద్దినవాడూ, దానిని ఎంతో చక్కగా మలచినవాడూ, మీకు పరిశుభ్రమైన పదార్థాలను ఆహారంగా ఇచ్చిన వాడూ, అల్లాహ్ యే కదా! ఆ అల్లాహ్ యే (ఈ పనులన్నీ చేసినవాడు) మీ ప్రభువు. ఆ విశ్వప్రభువు అసంఖ్యాకమైన శుభాలు కలవాడు. ఆయనే సజీవుడు. ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. ఆయననే మీరు వేడుకోండి, మీ ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకం చేసి. సకల ప్రశంసలూ సర్వలోకాలకూ ప్రభువైన అల్లాహ్కే చెందుతాయి.
40. అల్ మూమిన్ 66 ప్రవక్తా! వారితో ఇలా అను:
‘‘అల్లాహ్ ను కాదని మీరు వేడుకుంటున్న వారి ఆరాధన చేయకూడదని నన్ను వారించటం జరిగింది. నా ప్రభువు వైపు నుండి నా వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చాయి. (నేను ఈ పనిని ఎలా చేయగలను) సకల లోకాల ప్రభువునకు విధేయత చూపాలని నేను ఆజ్ఞాపించబడ్డాను.
40. అల్ మూమిన్ 67 - 68 ఆయనే మిమ్మల్ని మట్టితో సృజించాడు, ఆపై రేతస్సుతో, తరువాత నెత్తురు ముద్దతో, ఆ పిదప ఆయన మిమ్మల్ని శిశువు రూపంలో బయటికి తీస్తాడు. తదనంతరం మీరు పూర్తి బలం పుంజుకునే వరకు మిమ్మల్ని పోషి స్తాడు. ఆ పిమ్మట మీరు ముదిమికి చేరుకునేవరకు, మిమ్మల్ని పెంచుతాడు. మీలో కొందరు ముందే పిలువబడతారు. మీరు మీ నిర్ణీత వ్యవధికి చేరి యధార్థం ఏమిటో అర్థం చేసుకోవాలని ఇదంతా చేయబడుతోంది. ఆయనే జీవితాన్ని ఇస్తాడు, ఆయనే మరణాన్నీ ఇస్తాడు. ఆయన ఏ విషయాన్ని గురించి నిర్ణయం చేసినా,
అది అయిపోవాలని కేవలం ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు, అంతే, అది అయిపోతుంది.
40. అల్ మూమిన్ 69 - 77 అల్లాహ్ వాక్యాలను గురించి వాదులాడే వారిని నీవు చూశావా, వారు ఎలా విముఖులుగా చేయబడుతున్నారో? ఈ గ్రంథాన్నీ, మేము (ఇదివరకు) మా ప్రవక్తలతో పంపిన అన్ని గ్రంథాలనూ తిరస్కరించే వారికి త్వరలోనే తెలిసిపోతుంది
అప్పుడు వారి మెడలలో కంఠపాశాలు ఉంటాయి, సంకెళ్లు కూడ ఉంటాయి
వాటితో వారు కాగే నీటి వైపునకు ఈడ్వబడతారు, తరువాత నరకాగ్నిలోకి నెట్టబడతారు. అప్పుడు వారిని ఇలా అడగటం జరుగుతుంది: ‘‘అల్లాహ్ ను కాదని మీరు అల్లాహ్ కు భాగస్వాములుగా నిలబెట్టిన దేవుళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు?’’ వారు ఇలా సమాధానం చెబుతారు, ‘‘వారు మానుండి విడిపోయారు. దీనికి పూర్వం మేము అసలు దేనినీ ప్రార్థించేవారము కాదు.’’ ఈ విధంగా అల్లాహ్ అవిశ్వాసులు ఎలా మార్గభ్రష్టులయిందీ ఋజువు చేస్తాడు. వారితో ఇలా అనబడుతుంది: ‘‘మీ ఈ ముగింపునకు కారణం మీరు భూమిలో అసత్యాన్ని అనుసరించి ఆనందిం చటమే, దానికి గర్వపడటమే. ఇక వెళ్ళండి, నరక ద్వారాలలో ప్రవేశించండి, కలకాలం మీరు అక్కడనే ఉండవలసి ఉంది. అది దురహంకారుల నివాసం, బహుచెడ్డది.’’ కనుక ప్రవక్తా! సహనం వహించు. అల్లాహ్ వాగ్దానం సత్య మైనది. ఇప్పుడు నీ
సమక్షంలోనే మేము వారిని భయపెడుతూ వచ్చిన దుష్పరిణామాలను కొన్నింటిని వారికి చూపినా లేదా (దానికి ముందే) నిన్ను ప్రపంచం నుండి పిలిపించుకున్నా, వారు తిరిగి రావలసింది మా వైపునకే కదా.’’
40. అల్ మూమిన్ 78 - 81 ఓ ప్రవక్తా! నీకు పూర్వం మేము ఎంతోమంది ప్రవక్తలను పంపాము. వారిలో కొందరి పరిస్థితులను గురించి మేము నీకు తెలిపాము, కొందరిని గురించి తెలుపలేదు. అల్లాహ్ అనుమతిలేకుండా ఏ సూచననైనా స్వయంగా తెచ్చే శక్తి ఏ ప్రవక్తకూ లేదు. అల్లాహ్ ఆజ్ఞ వచ్చేసిన తరువాత, సత్యం ప్రకారం నిర్ణయం జరిగింది, అప్పుడు దుర్జనులు నష్టానికి గురిఅయ్యారు. అల్లాహ్ యే మీ కొరకు ఈ పశువులను సృష్టించాడు
వాటిలో కొన్నిటిపై మీరు స్వారి చేస్తారు, కొన్నిటి మాంసం తింటారు. వాటి వల్ల మీకు ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. మీరు ఎక్కడకు పోవాలని కోరుకుంటే, అక్కడకు మీరు పోగలగటానికి కూడా అవి ఉపయోగపడతాయి. వాటిపైనా, పడవల పైనా మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు. అల్లాహ్ తన ఈ సూచనలను మీకు చూపుతున్నాడు. అసలు మీరు ఆయన యొక్క ఏయే సూచనలను తిరస్కరిస్తారు?
40. అల్ మూమిన్ 82 - 85 వారు భూమిలో సంచారం చేయలేదా, వారికి పూర్వం గతించిన ప్రజల ముగింపు ఎటువంటిదో వారికి కనిపించటానికి? వారు సంఖ్యాబలంలో వీరికంటే అధికులు, వీరికంటే ఎక్కువ బలవంతులు, భూమిలో వీరికంటే అత్యంత మహోజ్వలమైన గుర్తులు విడిచివెళ్లారు. అసలు వారి సంపాదన అంతా వారికి దేనికి పనికొచ్చింది? వారి ప్రవక్తలు వారి వద్దకు స్పష్టమైన సూచనలు తెచ్చినప్పుడు, వారు తమ వద్ద ఉన్న జ్ఞానంతోనే ఆనందపరవశులై ఉన్నారు. వారు ఎగతాళి
చేస్తూ ఉండే దానిలోనే వారు తరువాత చిక్కుకు పోయారు. వారు మా శిక్షను చూచిన పిమ్మట ఇలా అన్నారు:
‘‘ఒక్కడూ, ఏ భాగస్వాములు లేనివాడూ అయిన అల్లాహ్ ను మేము విశ్వసించాము. మేము ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టిన వేల్పులనందరినీ నిరాకరిస్తున్నాము.’’ కాని
మా శిక్షను చూచిన తర్వాత వారి విశ్వాసం వారికి ఏమాత్రం లాభ దాయకం కాజాలదు. ఎందుకంటే, అల్లాహ్ నిర్ణయించిన నియమావళి ఇదే. ఆయన దాసులలో ఎల్లప్పుడూ అమలులో ఉండేది ఈ నియమావళియే. అప్పుడు అవిశ్వాసులు నష్టానికి గురిఅయ్యారు.
No comments:
Post a Comment