5 సూరహ్ అల్‌ మాఇద

5. అల్మాఇద

ఆయతులు : 120        అవతరణ : మదీనాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

5. అల్మాఇద 1 విశ్వాసులారా! కట్టుబాట్లను పూర్తిగా పాటించండి. మీ కొరకు పశువులను పోలిన జంతువులన్నీ ధర్మసమ్మతం (హలాల్‌) చెయ్యబడ్డాయి - ముందు మీకు తెలుపబడబోయేవి తప్ప. కాని ఇహ్రామ్స్థితిలో వేటను మీ కొరకు ధర్మసమ్మతం చేసుకోకండి. నిస్సందేహంగా అల్లాహ్ తాను కోరిన ఆజ్ఞను జారీ చేస్తాడు.

5. అల్మాఇద 2 విశ్వసించిన ప్రజలారా! దైవభక్తి చిహ్నాలను అగౌరవపరచకండి-నిషిద్ధ మాసాలలో మాసాన్నీ ధర్మ సమ్మతం చేసుకోకండి. ఖుర్బానీ పశువులపై చెయ్యి చేసుకోకండి. అల్లాహ్ మొక్కుబడికి సూచనగా మెడలలో పట్టెడలు కలిగివున్న జంతువులను ముట్టుకోకండి. తమ ప్రభువు అనుగ్రహాన్ని, ఆయన సంతోషాన్ని అన్వేషిస్తూ పవిత్ర మందిరం (కాబా) వైపునకు పోయేవారి జోలికి పోకండి. అయితే ఇహ్రామ్స్థితి సమాప్తమయిన తరువాత మీరు వేటాడవచ్చు - చూడండి! మిమ్మల్ని మస్జిదె హరామ్కు పోనియ్యకుండా ఒక వర్గంవారు నిరోధించారని వారిపై ఆగ్రహించి, ఆవేశంలో మీరూ వారిపై అనుచితమైన దౌర్జన్యానికి పాల్పడకండి. కాని మంచికి, దైవభక్తికి సంబంధించిన పనులలో అందరి తోనూ సహకరించండి. పాప కార్యాలలో అత్యాచారాలలో ఎవరితోనూ సహకరించకండి. అల్లాహ్ కు భయపడండి. ఆయన శిక్ష బహు కఠినమైనది.

5. అల్మాఇద 3 మీకు ఇవి నిషేధించబడినాయి  -  మృత పశువు, రక్తము, పంది మాంసము, అల్లాహ్ పేరుతో కాక మరెవరి పేరుతోనైనా జిబప్చెయ్యబడిన పశువు, ఊపిరాడక లేక దెబ్బతిని, ఎత్తు ప్రదేశం నుండి పడి లేక దేన్నయినా ఢీకొని లేక అడవి మృగం చీల్చగా మరణించిన జంతువు - సజీవంగా ఉండి మీరు జిబప్చేసినది తప్ప - బలిపీఠంపై వధింపబడినది. ఇంకా పాచికల ద్వారా అదృష్టం తెలుసు కోవటం కూడ మీకు నిషేధించబడిరది. ఇవన్నీ పాపకృత్యాలు. ఈనాడు అవిశ్వాసులు మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులుకున్నారు. కనుక మీరు వారికి భయపడకండి. నాకు భయపడండి. ఈనాడు నేను మీ ధర్మాన్ని మీకొరకు పరిపూర్ణం చేశాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. మీ కొరకు ఇస్లామ్ను మీ ధర్మంగా అంగీకరించాను. (కనుక మీకు విధించబడిన హరామ్, హలాల్నియమాలను పాటించండి) అయితే, ఎవరైనా ఆకలివల్ల గత్యంతరం లేని పరిస్థితిలో, పాపం వైపునకు మొగ్గకుండా వీటిలోని వస్తువునైనా తిన్నట్లయితే, అల్లాహ్ క్షమించేవాడూ, కరుణించేవాడూను.

5. అల్మాఇద 4 ప్రజలు తమ కొరకు ఏది హలాల్చెయ్యబడిరది అని అడుగుతారు. ఇలా బోధించు : పరిశుభ్రమైన వస్తువులన్నీ మీ కొరకు హలాల్చెయ్యబడ్డాయి. మీరు తర్ఫీదు ఇచ్చిన వేట జంతువులు - దేవుడు మీకు ప్రసాదించిన జ్ఞానం ఆధారంగా మీరు వేటాడే తర్ఫీదును ఇచ్చినవి - అవి మీ కొరకు పట్టిన జంతువును కూడ మీరు తినవచ్చు. కాని దానిపై అల్లాహ్ పేరును ఉచ్చరించండి. అల్లాహ్ శాసనాన్ని ఉల్లంఘించేందుకు భయపడండి. లెక్క తీసుకోవాలంటే అల్లాహ్ కు ఎంతోసేపు పట్టదు.

5. అల్మాఇద 5 ఈనాడు మీ కొరకు పరిశుభ్రమైన వస్తువులన్నీ హలాల్చెయ్యబడ్డాయి. గ్రంథ ప్రజల భోజనం మీకు హలాల్   మీ భోజనం వారికి హలాల్‌. సుచరితలైన స్త్రీలు కూడ మీకు హలాల్, వారు విశ్వాసుల వర్గానికి చెందినవారైనా సరే లేక మీకు పూర్వం గ్రంథం పొందిన జాతులకు చెందినవారైనా సరే. కాని మీరు వారి మహరును చెల్లించి వివాహం చేసుకుని వారికి రక్షకులు కావాలి. అంతేగాని, వారితో స్వేచ్ఛా కామక్రీడలకు పాల్పడటంగాని లేక దొంగచాటు సంబంధాలను పెంచుకోవటంగాని చెయ్యరాదు. విశ్వాస వైఖరిని అవలంబించటానికి తిరస్కరించేవాడు తన జీవితంలో సాధించినదంతా వ్యర్థం అవుతుంది. ఇంకా అతడు పరలోకంలో దివాలా తీస్తాడు.

5. అల్మాఇద 6 విశ్వసించిన ప్రజలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు, మీ ముఖాలను, చేతులను మోచేతుల వరకు ప్రక్షాళనం చేసుకోండి  తలపై చేతులతో రాయండి, కాళ్ళను చీలమండ వరకు కడుక్కోండి. మీరు అపరిశుద్ధంగా ఉంటే, స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. మీరు గనక అస్వస్థులైతే లేక ప్రయాణస్థితిలో ఉంటే లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలను ముట్టుకుంటే, అప్పుడు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో విధిని నిర్వహించండి  దానిపై చేతులతో కొట్టి మీ ముఖాలపై, చేతులపై రాయండి. మీకు జీవితాన్ని కష్టతరం చేయటం అల్లాహ్ అభిమతం కాదు. కాని ఆయన మిమ్మల్ని పరిశుద్ధం చేయగోరుతున్నాడు, మీపై తన అనుగ్రహాన్ని పూర్తిచేయగోరుతున్నాడు మీరు కృతజ్ఞులవుతారేమో అని.

5. అల్మాఇద 7 - 10 అల్లాహ్ మీకు ప్రసాదించిన వరాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మీనుండి తీసుకున్న దృఢమైన ప్రమాణాన్ని మరువకండి. అంటే, మీరు ఇలా అన్నారు : ‘‘మేము విన్నాము, విధేయత చూపటానికి అంగీకరించాము.’’ అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ కు హృదయాలలో ఉన్న మర్మాలు కూడా తెలుసు. విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కొరకు సత్యంపై స్థిరంగా ఉండండి. న్యాయానికి సాక్షులుగా ఉండండి. (ఏదైనా) వర్గంతో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనయి న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చెయ్యండి. ఇది దైవభక్తికి సరిసమానమైనది. అల్లాహ్ కు భయపడుతూ వ్యవహరించండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు పూర్తిగా తెలుసు. విశ్వసించి మంచిపనులు చేసేవారికి అల్లాహ్ వాగ్దానం చేశాడు, వారి పాపాలకు క్షమాభిక్ష, వారికి గొప్ప బహుమానం లభిస్తాయని. ఇక అవిశ్వాసానికి పాల్పడేవారు, అల్లాహ్ ఆయతులను నిరాకరించేవారు నరకానికి పోతారు.

5. అల్మాఇద 11 విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ మీకు (మొన్న మొన్ననే) చేసిన మహోపకారాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు ఒక వర్గం వారు మీపై చెయ్యి చేసుకోవాలని సంకల్పించారు. కాని అల్లాహ్ వారి చేతులను, మీపైకి లేపకుండా ఆపాడు. అల్లాహ్ కు భయపడుతూ పనిచెయ్యండి. విశ్వాసులు అల్లాహ్నే నమ్ముకోవాలి.

5. అల్మాఇద 12 - 13 అల్లాహ్ ఇస్రాయీలు సంతతినుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. వారిలో పన్నెండు మందిని నాయకులుగా నియమించాడు. ఇంకా వారితో ఇలా అన్నాడు : ‘‘నేను మీతో ఉన్నాను. మీరు గనక నమాజును స్థాపిస్తే, జకాత్ఇస్తే, నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడితే, అల్లాహ్ కు మంచి రుణాన్ని ఇస్తూవుంటే, నమ్మండి! నేను మీలోని చెడుగులను మీనుండి తుడిచివేస్తాను. ఇంకా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే ఉద్యాన వనాలలోకి ప్రవేశింపజేస్తాను. అయితే, దీని తరువాత మీలో తిరస్కార వైఖరిని అవలంబించేవాడు వాస్తవానికి రుజుమార్గం (సవాఉస్సబీల్‌) తప్పినవాడౌతాడు.’’ వారు తమ వాగ్దానాన్ని భంగపరచిన కారణంగా మేము వారిని మా కారుణ్యానికి దూరంగా విసరివేశాము. వారి హృదయాలను కర్కశం చేశాము. ఇప్పుడు వారి స్థితి ఎలా ఉందంటే, వారు పదాలను తారుమారు చేసి వాటి అర్థాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చివేస్తారు. వారికి ఇవ్వబడిన బోధలలో ఎక్కువ భాగాన్ని వారు మరచిపోయారు. అనుదినం వారు చేసే ఏదో ఒక ద్రోహాన్ని గురించి నీకు తెలుస్తూనే ఉంటుంది. వారిలో లోపం లేకుండా ఉన్నవారు బహు తక్కువ. (వారు స్థితికి దిగజారిపోయినప్పుడు, వారు దుర్మార్గాలు చేసినా, అది పూర్తిగా అనుకున్నదే) కనుక వారిని క్షమించండి. వారి చేష్టలను ఉపేక్షించండి. ఉదార స్వభావులను అల్లాహ్ ప్రేమిస్తాడు.

5. అల్మాఇద 14 ఇదేవిధంగా, ‘మేము క్రైస్తవులంఅని చెప్పుకున్నవారి నుండి కూడా మేము దృఢమైన ప్రమాణం తీసుకున్నాము. కాని వారు తమకు బోధించబడిన విషయంలో ఒక పెద్ద భాగాన్ని విస్మరించారు. చివరకు మేము వారిమధ్య పరస్పర విరోధ, విద్వేష బీజాలను ప్రళయం వరకు ఉండేవిధంగా నాటాము. వారు ప్రపంచంలో ఏమేమి చేస్తూ ఉండేవారో, దానిని అల్లాహ్ వారికి చూపే ఒక సమయం అవశ్యం వస్తుంది.

5. అల్మాఇద 15 - 16 గ్రంథ ప్రజలారా! మా ప్రవక్త మీవద్దకు విచ్చేశాడు. మీరు కప్పిపుచ్చుతూ ఉండిన దైవగ్రంథం లోని ఎన్నో విషయాలను ఆయన మీ ముందు బహిర్గతం చేస్తున్నాడు. ఇంకా ఎన్నో విషయాలను వదిలివేస్తున్నాడు. మీ వద్దకు అల్లాహ్ తరఫు నుండి కాంతి వచ్చేసింది. సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం కూడా. దాని ద్వారా అల్లాహ్ తన సంతోషం పొందగోరేవారికి శాంతి పథా లను చూపుతాడు. తన ఇచ్ఛానుసారం వారిని చీకట్ల నుండి వెలికితీసి వెలుగు వైపునకు తీసుకువస్తాడు. ఇంకా వారిని రుజుమార్గం వైపునకు నడుపుతాడు.

5. అల్మాఇద 17 మర్యమ్కుమారుడైన మసీప్ాయే దేవుడు అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడ్డారు. ప్రవక్తా! వారితో ఇలా అను: ‘‘అల్లాహ్ గనక మర్యము కొడుకైన మసీప్ానీ, ఆయన తల్లినీ, సమస్త భూలోకవాసులనూ నాశనం చెయ్యగోరితే, ఆయన తన సంకల్పాన్ని విరమించుకునేలా చేసే శక్తి ఎవరికుంది? అల్లాహ్ భూమికీ, ఆకాశాలకూ, వాటిమధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు. తాను కోరిన దానిని సృష్టిస్తాడు. ఆయన అధికారం ప్రతి వస్తువును లోబరచుకుని ఉంది.’’

5. అల్మాఇద 18 యూదులు, క్రైస్తవులు ఇలా అంటారు : ‘‘మేము అల్లాహ్ పుత్రులం, ఆయనకు ప్రీతిపాత్రులం.’’ వారిని ఇలా అడుగు : ‘‘అయితే ఆయన మీ పాపాలకు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నాడు? వాస్తవానికి మీరు కూడా అల్లాహ్ సృష్టించిన ఇతర మానవుల్లాంటి మానవులే! ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. తాను కోరిన వారిని శిక్షిస్తాడు. భూమీ, ఆకాశాలూ వాటిలో ఉన్న సమస్తమూ ఆయన ఆస్తియే. ఆయన వైపునకే అందరూ పోవలసి ఉంది.’’

5. అల్మాఇద 19 గ్రంథ ప్రజలారా! ప్రవక్తల ఆగమన క్రమం ఎంతో కాలంగా ఆగిపోయి ఉన్నప్పుడు మా ప్రవక్త మీవద్దకు వచ్చాడు. మీకు స్పష్టమైన ధర్మోపదేశాలను అందజేస్తున్నాడు. మా వద్దకు శుభవార్త తెలిపేవాడు, హెచ్చరికలు చేసేవాడు ఎవడూ రాలేదు అని మీరు అనగలగకుండా ఉండాలని. కనుక చూడండి! శుభవార్త తెలిపేవాడు, హెచ్చరికలు చేసేవాడు ఇప్పుడు విచ్చేశాడు - అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలవాడు.

5. అల్మాఇద 20 - 26 మూసా తన జాతి వారితో ఇలా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి : ‘‘నా జాతి ప్రజలారా! అల్లాహ్ మీకు ప్రసాదించిన వరాన్ని గురించి ఆలోచించండి - ఆయన మీలో ప్రవక్తలను ఆవిర్భవింపజేశాడు. మిమ్మల్ని పాలకులుగా చేశాడు. ప్రపంచంలో ఎవరికీ ఇవ్వనిదానిని మీకు ఇచ్చాడు - నా జాతి సోదరులారా! అల్లాహ్ మీ కొరకు వ్రాసి వుంచిన పవిత్ర భూమిలో ప్రవేశించండి. వెన్ను చూపకండి. లేకపోతే విఫలులై ఘోర పరాజయంతో మరలివస్తారు.’’ వారు ఇలా జవాబు పలికారు : ‘‘మూసా! అక్కడ మహా బలవంతులైన ప్రజలు ఉంటున్నారు. వారు అక్కడి నుంచి వెళ్ళిపోనంతవరకు మేము సుతరామూ అక్కడకు పోము. ఒకవేళ వారు వెళ్ళిపోతే, మేము ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాము.’’ భయపడే వారిలో అల్లాహ్ అనుగ్రహం పొందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. వారు ఇలా అన్నారు : ‘‘ద్వారం గుండా లోపలకు జొరబడి బలవంతులను ఎదుర్కోండి. ఒకసారి మీరు లోనికి ప్రవేశించారా, మీదే పైచెయ్యి అవుతుంది. మీరు నిజంగానే ముస్లిమ్లైతే అల్లాహ్ పై భారం వెయ్యండి.’’ కాని వారు మళ్ళీ ఇలా అన్నారు : ‘‘మూసా! వారు అక్కడ ఉన్నంతవరకూ మేము అక్కడకు ఎన్నటికీ పోము. నీవూ, నీ ప్రభువూ ఉభయులూ పోయి పోరాడండి. మేము ఇక్కడే కూర్చుని ఉంటాము.’’ దానిపై మూసా ఇలా అన్నాడు : ‘‘నా ప్రభూ! నా అధీనంలో ఎవ్వరూ లేరు-నేనూ నా సోదరుడూ తప్ప. కనుక నీవు మమ్మల్ని అవిధేయుల నుండి వేరు చెయ్యి.’’  అల్లాహ్ ఇలా అన్నాడు :  ‘‘సరే, అయితే, దేశం వారికి నలభై సంవత్సరాల వరకు నిషిద్ధం. వారు ధరణిలో నిలువ నీడలేకుండా సంచరిస్తారు. అవిధేయుల స్థితికి ఎంతమాత్రం జాలి పడకండి.’’

5. అల్మాఇద 27 - 31 వారికి ఆదము యొక్క ఇద్దరు తనయుల వృత్తాంతాన్ని కూడా పొల్లుపోకుండా వినిపించు. వారిద్దరూ ఖుర్బానీ ఇచ్చినప్పుడు, ఒకరి ఖుర్బానీ స్వీకరించబడిరది. మరొకరిది స్వీకరించబడలేదు. రెండోవాడు ఇలా అన్నాడు : ‘‘నేను నిన్ను చంపివేస్తాను.’’ సమాధానంగా మొదటివాడు ఇలా అన్నాడు: ‘‘భయభక్తులు గలవారి మొక్కుబడులనే అల్లాహ్ స్వీకరిస్తాడు. నీవు నన్ను చంపటానికి చెయ్యి ఎత్తినా, నేను నిన్ను చంపటానికి చెయ్యి ఎత్తను. సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కు నేను భయ పడతాను.  నీవే నా పాపాన్నీ, నీ పాపాన్నీ రెంటినీ మూట కట్టుకోవాలని, నరకవాసివి కావాలని నేను కోరుతున్నాను.  దుర్మార్గుల దుర్మార్గానికి ఇదే తగిన ప్రతిఫలం.’’ చివరకు అతడి మనస్సు తన సోదరుని హత్యను అతడి కొరకు సులభసాధ్యం చేసింది. అతడు అతన్ని చంపి నష్టపోయేవారిలో కలిసిపోయాడు. అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది, తన సోదరుని శవాన్ని విధంగా దాచాలో అతడికి తెలుపటానికి. ఇది చూసి అతడు రోదించాడు : ‘‘అయ్యో నేను పాడుగాను! నేను కాకిపాటివాణ్ణి కూడ కాలేకపోయానే, నా సోదరుని శవాన్ని దాచే ఉపాయం వెతకలేకపోయానే!’’ తరువాత అతడు తాను చేసిన దానికి ఎంతో పశ్చాత్తాపపడ్డాడు.

5. అల్మాఇద 32 కారణం వల్లనే మేము ఇస్రాయీలు సంతతికి ఫర్మానాను వ్రాసి ఇచ్చాము : ‘‘హత్యకు బదులుగాగాని లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకుగాని కాక మరే కారణం వల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే.’’  కాని వారి పరిస్థితి ఎలా ఉందంటే, మా ప్రవక్తలు ఒకరి తరువాత ఒకరు స్పష్టమైన ఉపదేశాలు తీసుకుని వారివద్దకు వచ్చినప్పటికీ, వారిలోని ఎక్కువమంది భూమిపై అత్యాచారాలు చేసేవారే.

5. అల్మాఇద 33 - 34 అల్లాహ్తో, ఆయన ప్రవక్తతో పోరాడేవారికీ, ధరణిలో కల్లోలాన్ని సృష్టిస్తూ తిరిగేవారికీ శిక్ష ఏమిటంటే, వారిని చంపటం లేదా శిలువపైకి ఎక్కించటం లేదా చేతులను, కాళ్ళను అభిముఖ దిశలలో ఖండిరచటం లేదా దేశం నుండి బహిష్కరించటం. ఇవి వారికి ఇహలోకంలో జరిగే అగౌరవం, అవమానం. పరలోకంలో వారికి అంతకంటె ఘోరమైన శిక్ష ఉంటుంది. మీరు వారిని స్వాధీన పరచుకోకముందు పశ్చాత్తాపపడే వారికి తప్ప - అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అనే విషయం మీరు తెలుసుకోవాలి.

5. అల్మాఇద 35 - 37 విశ్వాసులారా! అల్లాహ్ కు భయపడండి. ఆయన సాన్నిధ్యానికి చేరే మార్గాన్ని అన్వేషించండి. ఆయన మార్గంలో నిరంతర కృషి చెయ్యండి. బహుశా మీకు సాఫల్య భాగ్యం లభించవచ్చు. స్పష్టంగా తెలుసుకోండి. తిరస్కారవైఖరిని అవలంబించిన వారి అధీనంలో సమస్త భూసంపద, ఇంకా అంతే సంపద దానితోపాటు ఉండి, వారు గనక ప్రళయదిన శిక్ష నుండి తప్పించుకోవడానికి మొత్తం సంపదను విమోచన ధనంగా ఇవ్వగోరినా, అది స్వీకరించబడదు. వారికి వ్యధాభరితమైన శిక్ష పడితీరుతుంది. నరకాగ్ని నుండి వారు బయటకు పారిపోవాలని కోరుకుంటారు. కాని బయటికి రాలేరు. వారికి సదా ఉండే శిక్ష విధించబడుతుంది.

5. అల్మాఇద 38 - 40 దొంగ - స్త్రీ అయినా పురుషుడైనా, ఉభయుల చేతులూ నరకండి. ఇది వారి సంపాదనకు ప్రతిఫలం. అల్లాహ్ తరఫు నుండి గుణపాఠం నేర్పే శిక్ష. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, అత్యంత వివేక సంపన్నుడు. దుర్మార్గం చేసిన తరువాత పశ్చాత్తాపపడి తనను తాను సంస్కరించుకునే వాడివైపునకు అల్లాహ్ కారుణ్య వీక్షణం మరలుతుంది. అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడు, కరుణించేవాడూను. అల్లాహ్ భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువనే విషయం మీకు తెలియదా? ఆయన తాను కోరిన వారిని శిక్షిస్తాడు. తాను కోరినవారిని క్షమిస్తాడు. ఆయన సర్వాధికారాలు కలవాడు.

5. అల్మాఇద 41 ప్రవక్తా! అవిశ్వాస మార్గంలో పరుగులు తీసే ప్రజలను చూచి నీవు ద్ణుఖపడకు. వారు ‘‘మేము విశ్వసించాము’’ అని తమ నోటితో పలికే వారిలోని వారు కావచ్చు. కాని వారి హృదయాలు మాత్రం విశ్వసించలేదు. లేదా వారు యూదుల లోనివారైనా కావచ్చు. వారి (యూదుల) పరిస్థితి ఎలా ఉందంటే, వారు అబద్ధాలను కుతూహలంతో చెవియొగ్గి వింటారు. ఇంకా నీ వద్దకు ఎన్నడూ రాని ఇతర ప్రజల కొరకు గూఢచారులుగా వ్యవహరిస్తారు. అల్లాహ్ గ్రంథంలోని పదాల సందర్భం నిర్ణయమై ఉన్నప్పటికీ వాటి అసలు అర్థాన్ని తారుమారు చేస్తారు. ప్రజలతో ఇలా అంటారు : ‘‘మీకు విధమైన ఆజ్ఞ ఇస్తే స్వీకరించండి, లేకపోతే స్వీకరించకండి. అల్లాహ్యే పరీక్షకు గురిచెయ్యాలని నిశ్చయించిన వారిని అల్లాహ్ పట్టునుండి తప్పించటానికి నీవు ఏమీ చెయ్యలేవు. ఎవరి హృదయాలను అల్లాహ్ పరిశుద్ధ పరచదలచుకోలేదో, వారు వీరే. వీరు ఇహంలో పరాభవానికీ, పరంలో కఠిన శిక్షకూ గురి అవుతారు.

5. అల్మాఇద 42 - 43 వీరు, అబద్ధం వినేవారు. నిషిద్ధమైన సొమ్ము తినేవారు. కనుక ఒకవేళ నీ వద్దకు (తమ వ్యాజ్యములను తీసుకుని) వస్తే, నీకు ఇష్టమైతే వారిమధ్య తీర్పు చెప్పే అధికారం నీకు ఇవ్వబడుతోంది లేదా తిరస్కరించు. నీవు తిరస్కరిస్తే, వారు నీకు ఏమాత్రం హాని కలిగించలేరు. నీవు గనక తీర్పు చెబితే, కచ్చితంగా న్యాయంగా చెప్పు. అల్లాహ్ న్యాయం చేసేవారిని ప్రేమిస్తాడు  - అల్లాహ్ ఆజ్ఞ వ్రాయబడివున్న తౌరాతు గ్రంథం వారివద్ద ఉన్నప్పటికీ దానిపట్ల వైముఖ్యం ప్రదర్శిస్తూనే వారు నిన్ను ఎలా న్యాయనిర్ణేతగా చేసుకుంటారు? అసలు విషయం ఏమిటంటే, వారిలో విశ్వాసమే లేదు.

5. అల్మాఇద 44 మేము తౌరాతును అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వమూ, జ్యోతీ ఉన్నాయి. ముస్లిము లైన ప్రవక్తలంతా దాని ప్రకారమే యూదుల వ్యవహారాలను పరిష్కరించేవారు. ఇదేవిధంగా రబ్బీలు, షరీయత్తువేత్తలు కూడా (దాని ఆధారంగానే తీర్పు చెప్పేవారు). ఎందుకంటే, అల్లాహ్ గ్రంథాన్ని రక్షించే బాధ్యత వారిపై మోపబడిరది. వారు దీనికి సాక్షులుగా ఉండేవారు. కనుక (యూదు లారా!) మానవులకు భయపడకండి. నాకు భయపడండి. నా ఆయతులను కొద్దిపాటి మూల్యం కొరకు  అమ్మటం మానండి.  అల్లాహ్ అవతరింపజేసిన చట్టం ప్రకారం తీర్పు చెయ్యనివారే అవిశ్వాసులు.

5. అల్మాఇద 45  తౌరాతు గ్రంథంలో మేము యూదుల కొరకు ఆజ్ఞను వ్రాశాము : ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పన్నుకు బదులు పన్ను, ఇలా సమస్త గాయాల కొరకు సమానమైన ప్రతీకారం. కాని ఎవరైనా ప్రతీకారం చెయ్యకుండా క్షమిస్తే, అది అతనికి కప్ఫారా (పాపపరిహారం) అవుతుంది. అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పుచెయ్యని వారే దుర్మార్గులు.

5. అల్మాఇద 46 - 47 ప్రవక్తల తరువాత మేము మర్యమ్కుమారుడైన ఈసాను పంపాము. ఆయన తన కాలంలో ఉన్నటువంటి తౌరాతు గ్రంథంలోని విషయాన్ని ధ్రువీకరించేవాడు. మేము ఆయనకు ఇంజీలును ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వమూ, జ్యోతీ ఉండేవి. అది కూడా కాలంలో ఉన్న తౌరాతులోని దానిని ధ్రువీకరించేది. అల్లాహ్ యందు భక్తీశ్రద్ధలు కలవారికి అది మార్గదర్శకం. అంతేకాదు, హితోపదేశం కూడా. మేము ఇంజీలు గ్రంథ ప్రజలను గ్రంథంలో అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పుచెయ్యాలని ఆజ్ఞాపించాము. అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చెయ్యని వారే హద్దులు మీరినవారు.

5. అల్మాఇద 48 - 50 ప్రవక్తా! మేము నీ వద్దకు పంపిన గ్రంథం సత్యాన్ని తీసుకొని వచ్చింది. తన కాలంలో ఉన్నటువంటి ‘‘అల్కితాబ్’’లోని భాగాలను అది ధ్రువీకరిస్తుంది, పరిరక్షిస్తుంది. కనుక నీవు అల్లాహ్ పంపిన చట్టం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. నీ వద్దకు వచ్చిన సత్యానికి విముఖుడవై వారి వాంఛలను అనుసరించకు - మేము మీ (మానవుల) లోని ప్రతి ఒక్కరికీ ఒక షరీయత్తునూ, ఒక జీవిత విధానాన్నీ నిర్ణయించాము. మీ దేవుడు కోరుకున్నట్లయితే, మీ అందరినీ ఒకే ఒక సంఘంగా కూడా రూపొందించి ఉండేవాడు. కాని ఆయన మీకు ఇచ్చిన దాని విషయంలో మిమ్మల్ని పరీక్షిం చేందుకు విధంగా చేశాడు. కనుక మంచి పనులలో ఒకరినొకరు మించిపోవటానికి ప్రయత్నించండి. చివరకు మీరంతా అల్లాహ్ వద్దకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు భేదాభిప్రాయం కలిగివున్న  దాని  అసలు యథార్థం ఏమిటో మీకు తెలుపుతాడు - కనుక ప్రవక్తా! నీవు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించు. వారి కోరికలను అనుస రించకు. మిమ్మల్ని వారు మోసంలో పడవేసి అల్లాహ్ మీ వద్దకు పంపిన ఉపదేశానికి రవ్వంత కూడా విముఖులను చెయ్యకుండా మీరు అప్రమత్తులై ఉండండి. వారు గనక దానికి విముఖులైతే, అల్లాహ్ వారు చేసిన కొన్ని పాపాలకు శాస్తిగా వారిని ఆపదకు గురిచెయ్యాలన్న నిర్ణయానికే వచ్చాడు అని తెలుసుకోండి. వారిలోని చాలామంది అవిధేయులు అనేది వాస్తవం. (వారు అల్లాహ్ శాసనానికి విముఖులై) అజ్ఞానపు (జాహిలియ్యప్) తీర్పు కావాలని కోరుకుంటున్నారా? కాని అల్లాహ్ పై నమ్మకం కలవారి దృష్టిలో అల్లాహ్ కంటే మంచితీర్పు చెయ్యగలవాడెవడు?

5. అల్మాఇద 51 విశ్వాసులారా! యూదులనూ, క్రైస్తవులనూ మీ మిత్రులుగా చేసుకోకండి. వారు తమలో తామే ఒకరికొకరు మిత్రులు. మీలో ఎవడైనా వారిని తన మిత్రులుగా స్వీకరిస్తే అతడు కూడా వారిలో ఒకడుగా పరిగణింపబడతాడు. నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులను తన మార్గదర్శకత్వానికి దూరం చేస్తాడు.

5. అల్మాఇద 52 - 53 హృదయాలలో కాపట్య రోగం ఉన్నవారు వారితోనే ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తూ తిరగటం నీవు చూస్తావు. వారు, ‘‘మేము ఏదన్నా ఆపదల వలయంలో చిక్కుకుంటామేమో అనే భయం మాకు ఉంది’’ అని అంటారు. కాని అల్లాహ్ మీకు తిరుగులేని విజయాన్ని ప్రసాదించినప్పుడు లేక తన తరఫు నుండి మరేదైనా విషయాన్ని బహిర్గతం చేసినప్పుడు, వారు తమ మనస్సులలో గుప్తంగా ఉంచిన కాపట్యానికి సిగ్గుపడటం అనేది కూడా అసంభవం కాదు. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు : ‘‘మేము మీతోనే ఉన్నాము అని అల్లాహ్ పేరుపై కఠోర ప్రమాణాలు చేసి నమ్మకం కలిగిస్తూ ఉండేవారు వీరేనా?’’ - వారు చేసిన పనులన్నీ వృధా అయ్యాయి. చివరకు వారికి మిగిలింది అపజయం, ఆశాభంగమూను.

5. అల్మాఇద 54 విశ్వాసులారా! మీలో ఎవరైనా తమ ధర్మం నుండి వైదొలగిపోతే (పోవచ్చు). అల్లాహ్ ఇంకా ఎంతోమందిని సృష్టిస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు. వారు అల్లాహ్ ను ప్రేమిస్తారు. వారు విశ్వాసులపట్ల మృదువుగానూ, అవిశ్వాసులపట్ల కఠినంగానూ ప్రవర్తిస్తారు. అల్లాహ్ మార్గంలో అవిశ్రాంత కృషి చేస్తారు. నిందించే వారి నిందలకు వారు భయపడరు. ఇది అల్లాహ్ అనుగ్రహం. ఆయన దానిని తాను కోరినవారికి ప్రసాదిస్తాడు. ఆయన అపారమైన సాధనసంపత్తికి యజమాని, సర్వమూ తెలిసినవాడు.

5. అల్మాఇద 55 - 56 వాస్తవానికి మీ మిత్రులు కేవలం అల్లాహ్, అల్లాహ్ ప్రవక్త, నమాజును స్థాపించే జకాత్ఇచ్చే, అల్లాహ్ ముందు రుకూ చేసే విశ్వాసులు మాత్రమే. అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ, విశ్వాసులనూ తమ మిత్రులుగా స్వీకరించేవారు, అల్లాహ్ పక్షమే ఆధిక్యం వహిస్తుందని తెలుసుకోవాలి.

5. అల్మాఇద 57 - 60 విశ్వాసులారా! మీకు పూర్వపు గ్రంథ ప్రజలలో మీ ధర్మాన్ని ఒక పరిహాసంగా, ఒక వినోద వస్తువుగా పరిగణించిన వారినీ, ఇతర అవిశ్వాసులనూ మీ మిత్రులుగా, సహచరులుగా చేసుకోకండి. మీరు గనక విశ్వాసులే అయితే అల్లాహ్ కు భయపడండి. మీరు నమాజు కొరకు పిలుపునిస్తే, వారు దానిని పరిహసించి వినోదిస్తారు. దీనికి కారణం వారికి బుద్ధి లేకపోవటమే. వారితో ఇలా అను : ‘‘గ్రంథ ప్రజలారా! మీరు మాపై కినుక వహించటానికి కారణం మేము అల్లాహ్నూ మా వైపునకు అవతరించిన, మాకు పూర్వం కూడా అవతరించిన ధర్మోపదేశాన్ని విశ్వసించామనే విషయమూ ఇంకా మీలో చాలామంది అవిధేయులైనవారు ఉన్నారనే విషయమూ తప్ప మరొకటేముంది?’’ ఇంకా ఇలా చెప్పు : ‘‘అల్లాహ్ వద్ద ఎవరి ముగింపు అవిధేయుల ముగింపుకంటే కూడా హీనతరంగా ఉంటుందో వారిని గురించి తెలియజేయనా? వారు అల్లాహ్ శాపగ్రస్తులు. వారిపై ఆయన ఆగ్రహం విరుచుకుపడిరది. వారు కోతులుగా, పందులుగా చెయ్యబడ్డారు. వారు తాగూత్దాస్యం చేశారు. వారు ఎంతో అధ్వాన్నస్థితిలో ఉన్నారు. వారు రుజుమార్గం తప్పి బహుదూరం పోయారు.’’

5. అల్మాఇద 61 - 63 వారు మీ వద్దకు వచ్చినప్పుడు, ‘‘మేము విశ్వసించాము’’ అని అంటారు. కాని వాస్తవానికి వారు అవిశ్వాసాన్ని మోసుకువచ్చారు. అవిశ్వాసాన్నే మోసుకుని తిరిగిపోయారు. అల్లాహ్ కు బాగా తెలుసు, వారు తమ హృదయాలలో ఏమేమి దాచివుంచారో. వారిలో చాలామంది పాప కార్యాలలో, హింసా దౌర్జన్యాలలో చురుకుగా పొల్గొంటూ తిరగటాన్నీ, హరాము సొమ్మును తినటాన్నీ నీవు చూస్తావు. వారు చేసే చేష్టలు బహుచెడ్డవి. వారి పండితులూ, మత గురువులూ పాపపు మాటలు పలక్కుండా, హరాము సంపాదన తినకుండా వారిని ఎందుకు నిరోధించరు? నిశ్చయంగా వారు సిద్ధం చేసుకుంటున్న తమ జీవిత కర్మ పత్రం చాలా చెడ్డది.

5. అల్మాఇద 64 యూదులు ఇలా అంటారు : ‘‘అల్లాహ్ చేతులు బంధింపబడివున్నాయి’’ - వాస్తవంగా బంధాలు వారి చేతులకే పడివున్నాయి. శాపం వారిపైనే పడిరది. వారి వాగుడుకు ప్రతిఫలంగా - అల్లాహ్ చేతులు విశాలంగా ఉన్నాయి. తాను కోరిన ప్రకారం ఆయన ఖర్చు చేస్తాడు. వాస్తవం ఏమిటంటే, నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరించిన గ్రంథం వారిలో చాలామంది యొక్క తలబిరుసుతనమూ, అసత్యానుసరణమూ అతిశయించటానికి కారణ భూతమయింది. ( కారణంగా) మేము వారి మధ్య విరోధ విద్వేషాలు ప్రళయం వరకూ ఉండేవిధంగా చేశాము. వారు యుద్ధజ్వాలను ప్రజ్వలింపజేసినప్పుడల్లా, అల్లాహ్ దానిని చల్లారుస్తాడు. వారు భూమిలో సంక్షోభాన్ని వ్యాపింపచెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాని అల్లాహ్ సంక్షోభం సృష్టించేవారిని ఎంతమాత్రం ప్రేమించడు.

5. అల్మాఇద 65 - 66 ( తలబిరుసుతనానికి బదులుగా) గ్రంథ ప్రజలు విశ్వసించి ఉంటే, అల్లాహ్పట్ల భయభక్తుల వైఖరిని అవలంబించి ఉంటే, మేము వారి పాపాలను వారినుండి దూరం చేసి ఉండేవారము. వారిని భోగభాగ్యాలతో నిండివున్న స్వర్గవనాలలో ప్రవేశింపజేసి వుండేవారము. వారు తౌరాతునూ, ఇంజీలునూ, వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు పంపబడిన ఇతర గ్రంథాలనూ అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది! విధంగా చేసివుంటే, వారికొరకు ఆహారం పైనుండి వర్షించి ఉండేది, క్రిందినుండి పొంగివుండేది. వారిలో కొందరు రుజువర్తనులు కూడా ఉన్నారన్నమాట నిజమే. కాని వారిలో అధిక సంఖ్యాకులు బహు దుర్మార్గులు.

5. అల్మాఇద 67 - 69 ప్రవక్తా! నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరించిన దానిని ప్రజలకు అందజెయ్యి. ఒకవేళ నీవు విధంగా చెయ్యకపోతే, ఆయన ప్రవక్తగా నీవు నీ ధర్మాన్ని నిర్వహించనట్లే. ప్రజల బారినుండి అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు. ఆయన (నీకు ప్రతికూలంగా) అవిశ్వాసులకు విజయం పొందే మార్గాన్ని ఎన్నటికీ చూపడు అని నమ్ము. స్పష్టంగా ఇలా చెప్పు : ‘‘గ్రంథ ప్రజలారా! మీరు తౌరాతునూ, ఇంజీలునూ మీ ప్రభువు తరఫు నుండి మీ వైపునకు అవతరింపచెయ్యబడిన ఇతర గ్రంథాలనూ ప్రతిష్ఠించనంత వరకు, అసలు మీరు పునాదిపైనా లేనట్లే.’’ నీపై అవతరింపచెయ్యబడిన ఫర్మానా వారిలోని అధికుల తలబిరుసుతనాన్నీ, తిరస్కారభావాన్నీ తప్పకుండా మరింత అతిశయింపచేస్తుంది. కాని తిరస్కరించేవారి స్థితికి నీవు విచారపడవద్దు. (ఇక్కడ ప్రత్యేకమైన హక్కు ఒక్కరికీ లేదు) ముస్లిములైనా, యూదులైనా, సాబియీలైనా, క్రైస్తవులైనా, ఎవరైనాసరే, వారు గనక అల్లాహ్ ను, చివరి రోజును విశ్వసించి, మంచి పనులుచేస్తే నిస్సందేహంగా వారికి భయంకాని, శోకంగాని కలిగే ఆస్కారం లేదు.

5. అల్మాఇద 70 - 71 మేము ఇస్రాయీలు సంతానం నుండి గట్టి ప్రమాణాన్ని తీసుకున్నాము. వారివద్దకు ఎంతోమంది ప్రవక్తలను పంపాము, కాని వారివద్దకు వారి మనోవాంఛలకు వ్యతిరేకమైన దానిని ప్రవక్త అయినా తెచ్చినప్పుడల్లా, వారు కొందరిని అసత్యవాదులని తిరస్కరించారు. మరికొందరిని హత్యచేశారు. విధంగా చెయ్యటం వల్ల ఉపద్రవమూ సంభవించదని వారు భావించారు. కనుక వారు గ్రుడ్డివారు, చెవిటివారు అయ్యారు. తరువాత అల్లాహ్ వారిని క్షమించాడు. అయినా వారిలో చాలామంది మరింత గ్రుడ్డివారుగా, మరింత చెవిటివారుగా అవుతూ పోయారు. అల్లాహ్ వారి చేష్టలన్నింటినీ చూస్తూనే ఉన్నాడు.

5. అల్మాఇద 72 మర్యమ్కుమారుడైన మసీప్ాయే అల్లాహ్ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినట్లే. వాస్తవానికి మసీప్ ఇలా అన్నాడు : ఇస్రాయీలు వంశీయులారా! అల్లాహ్ కు దాస్యం చెయ్యండి. ఆయన నాకూ ప్రభువే మీకూ ప్రభువే. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషిద్ధం చేశాడు. వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించే వాడెవడూ లేడు.

5. అల్మాఇద 73 - 74 ‘‘అల్లాహ్ ముగ్గురిలో ఒకడు’’ అని అన్నవారు నిశ్చయంగా అవిశ్వాసానికి పాల్పడినవారు. వాస్తవమేమిటంటే, దేవుడు ఒక్కడే. మరొక దేవుడు లేడు. వారు గనక తమ మాటలను మానుకోకపోతే, వారిలో అవిశ్వాసానికి ఒడిగట్టిన వారికి వ్యధాభరితమైన శిక్షపడుతుంది. అయితే, వారు అల్లాహ్ వైపునకు మరలరా? క్షమించు అని ఆయనను వేడుకోరా? అల్లాహ్ అమితంగా మన్నించేవాడు, కరుణించేవాడూను.

5. అల్మాఇద 75 మర్యమ్పుత్రుడైన మసీప్ ఒక ప్రవక్త తప్ప మరేమీ కాడు. ఆయనకు పూర్వం కూడా ఎంతోమంది ప్రవక్తలు గతించారు. ఆయన తల్లి సద్గుణ సంపన్నురాలు. వారు ఉభయులూ (ప్రతిరోజూ) భోజనం చేసేవారు - చూడండి! మేము వారిముందు యథార్థానికి సంబంధించిన సూచనలను ఎలా విశదీకరిస్తున్నామో చూడండి! అయినా వారు సన్మార్గం తప్పి ఎటుపోతున్నారో!

5. అల్మాఇద 76 - 77 వారితో ఇలా అను : ‘‘ఇదేమిటి, మీరు అల్లాహ్ ను వదలి, మీకు నష్టంగాని, లాభంగాని కలిగించే అధికారం లేని దానిని పూజిస్తున్నారు? అందరిదీ వినేవాడూ అంతా తెలిసినవాడూ అల్లాహ్ మాత్రమే.’’ ఇలా చెప్పు : గ్రంథప్రజలారా! మీ ధర్మం విషయంలో అన్యాయంగా హద్దులు మీరి ప్రవర్తించకండి. మీకు పూర్వం, స్వయంగా తామూ మార్గభ్రష్టులై, ఇంకా చాలామందిని మార్గభ్రష్టులుగా చేసి, రుజుమార్గం తప్పినవారి ఊహాపోహలను అనుసరించకండి.

5. అల్మాఇద 78 - 81 ఇస్రాయీలు సంతతివారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారిని దావూద్నోట, మర్యమ్కుమారుడైన మసీప్ నోట శపించటం జరిగింది. ఎందుకంటే వారు అవిధేయులయ్యారు. అత్యాచారాలు చేయసాగారు. చెడు పనులు చెయ్యకుండా వారు ఒకరినొకరు నిరోధించటం మాని వేశారు.  వారు అవలంబించిన మార్గం చాలా చెడ్డది. ఈనాడు నీవు వారిలో చాలా ఎక్కువమందిని (విశ్వాసులకు ప్రతికూలంగా) అవిశ్వాసులను బలపరచే వారుగా, వారితో మైత్రిచేసేవారుగా చూస్తావు. నిశ్చయంగా వారి మనస్సులు వారి కొరకు తయారు చేసిపెట్టిన ముగింపు బహు చెడ్డది. కారణంగా అల్లాహ్ వారిపై ఆగ్రహోదగ్రుడయ్యాడు. వారు శాశ్వత శిక్షకు గురిఅవుతారు. వారు నిజంగానే అల్లాహ్నూ, ప్రవక్తనూ, ప్రవక్తపై అవతరించినదానినీ విశ్వసించేవారే అయితే (విశ్వాసులకు ప్రతి కూలంగా) అవిశ్వాసులను ఎన్నటికీ మిత్రులుగా చేసుకొని ఉండేవారు కాదు. కాని వారిలో చాలామంది అల్లాహ్ పట్ల విధేయతకు దూరమైపోయారు.

5. అల్మాఇద 82 - 86 విశ్వాసుల పట్ల విరోధం విషయంలో, నీవు యూదులనూ, ముష్రిక్కులనూ అందరికంటే ఎక్కువ ప్రచండులుగా కనుగొంటావు. విశ్వాసులపట్ల మైత్రి విషయంలో ‘‘మేము క్రైస్తవులం’’ అని అన్నవారిని  అత్యంత  సన్నిహితులుగా చూస్తావు. దీనికి కారణం ఏమిటంటే వారిలో దైవభక్తిగల విద్వాంసులూ, ప్రపంచాన్ని పరిత్యజించిన సన్యాసులూ ఉన్నారు. ఇంకా వారిలో అహంభావం లేదు.  ప్రవక్తపై  అవతరించిన గ్రంథాన్ని వారు విన్నప్పుడు, సత్యాన్ని గ్రహించిన కారణంగా వారి కళ్ళు అశ్రువులతో చెమ్మగిల్లటం నీవు చూస్తావు. వారు ఇలా అనేస్తారు : ‘‘ప్రభూ! మేము విశ్వసించాము. మా పేర్లను సాక్ష్యం ఇచ్చేవారిలో వ్రాయి.’’ ఇంకా వారు ఇలా అంటారు : ‘‘మా ప్రభువు మమ్మల్ని సజ్జనులలో చేర్చాలనే ఆకాంక్ష మాకు ఉన్నప్పుడు మేము అల్లాహ్ ను ఎందుకు విశ్వసించకూడదు? మా వద్దకు వచ్చిన సత్యాన్ని ఎందుకు స్వీకరించకూడదు?’’ వారు ఇలా పలికిన కారణంగా అల్లాహ్ వారికి కింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలను ప్రసాదించాడు. వారు అక్కడ కలకాలం ఉంటారు. సద్వర్తనులకు లభించే ప్రతిఫలం ఇది. ఇక మా ఆయత్తులను స్వీకరించటానికి తిరస్క రించేవారూ, వాటిని అసత్యాలుగా చిత్రించి నిరాకరించేవారూ నరకానికి అర్హులు.

5. అల్మాఇద 87 - 88 విశ్వాసులారా! అల్లాహ్ మీ కొరకు ధర్మ సమ్మతం చేసిన పరిశుద్ధ వస్తువులను నిషిద్ధం చేసుకోకండి. హద్దులను అతిక్రమించకండి. మితిమీరి ప్రవర్తించేవారంటే అల్లాహ్ కు ఏమాత్రం ఇష్టం ఉండదు. అల్లాహ్ మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమూ, పరిశుద్ధమూ అయిన ఆహారాన్ని తినండి, త్రాగండి. మీరు విశ్వసించిన దైవం పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి.

5. అల్మాఇద 89 మీరు చేసే అర్థం లేని ప్రమాణాలను గురించి అల్లాహ్ మిమ్మల్ని పట్టుకోడు. కాని మీరు బుద్ధి పూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి ఆయన మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నిస్తాడు. (అటువంటి ప్రమాణభంగానికి) పరిహారం ఏమిటంటే మీరు మీ ఆలుబిడ్డలకు తినిపించే మామూలు భోజనం పదిమంది పేదలకు పెట్టటం లేదా వారికి కట్టుబట్టలు ఇవ్వటం లేదా ఒక బానిసను స్వతంత్రునిగా చెయ్యటం. స్తోమతలేనివారు మూడు రోజుల పాటు ఉపవాసం ఉండాలి. మీరు ప్రమాణం చేసి భంగపరిస్తే, మీ ప్రమాణాలకు పరిహారం ఇది. మీరు మీ ప్రమాణాలను కాపాడుకోండి. మీరు కృతజ్ఞతలు తెలుపుతారని అల్లాహ్ విధంగా తన ఆజ్ఞలను మీ కొరకు విశదం చేస్తున్నాడు.

5. అల్మాఇద 90 - 92 విశ్వాసులారా! సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం - ఇవన్నీ అసహ్యకరమైన షైతాను పనులు.  వాటిని విసర్జించండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. షైతాను సారాయి, జూదాల ద్వారా మీ మధ్య విరోధ విద్వేషాలను సృష్టించాలనీ, మిమ్మల్ని అల్లాహ్ స్మరణ నుండీ, నమాజు నుండీ వారించాలని కోర్తాడు. కనుక మీరు వీటిని మానుకుంటారా లేదా? అల్లాహ్ మాటను ఆయన ప్రవక్త మాటను వినండి. వాటిని మానుకోండి. కాని మీరు గనక ఆజ్ఞలను పాలించకపోతే, బాగా తెలుసుకోండి, మా ప్రవక్తపై ఉన్న బాధ్యత కేవలం ఆజ్ఞలను స్పష్టంగా అందచేయటమే.

5. అల్మాఇద 93 విశ్వసించి మంచి పనులు చేసేవారిని వారు పూర్వం తిన్నదానిని గురించి, త్రాగినదానిని గురించి ప్రశ్నించటం జరగదు. కాని వారు ఇక ముందు హరాము చెయ్యబడిన వస్తువులకు దూరంగా ఉండాలి. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. మంచి పనులు చెయ్యాలి. ఇంకా మానుకోవాలని ఆజ్ఞాపించబడిన వస్తువులన్నింటినీ మానుకోవాలి. అల్లాహ్ ఆజ్ఞను అంగీకరించాలి. భయభక్తులతో పాటు సద్వర్తన కూడా కలిగి ఉండాలి. అల్లాహ్ సౌశీల్యవంతులను ప్రేమిస్తాడు.

5. అల్మాఇద 94 - 95  విశ్వాసులారా! మీ చేతులకూ మీ ఈటెల దెబ్బకూ పూర్తిగా అందుబాటులో వున్న వేట వస్తువు ద్వారా అల్లాహ్ మిమ్మల్ని కఠిన పరీక్షకు గురిచేస్తాడు, తనను చూడకుండానే మీలో, ఎవరు తనకు భయపడతారో చూద్దామని. హెచ్చరిక తరువాత అల్లాహ్ నిర్ణయించిన హద్దులను అతిక్రమించేవారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. విశ్వసించిన ప్రజలారా! ఇహ్రాముస్థితిలో వేటాడకండి. ఒకవేళ మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా అలా చేస్తే, అతడు తాను చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును నజరానా (మొక్కుబడి)గా సమర్పించుకోవాలి. దానిని మీలో న్యాయస్థులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. నజరానాను కాబాకు చేర్చాలి. లేకపోతే, పాపానికి పరిహారంగా కొంతమంది పేదలకు భోజనం పెట్టాలి. లేదా దానికి సమానంగా ఉపవాసాలు ఉండాలి. ఎందుకంటే తాను చేసిన దానియొక్క ఫలితాన్ని అతడు చవిచూడాలి. పూర్వం జరిగినదానిని అల్లాహ్ క్షమించాడు. కాని ఇకముందు ఎవరైనా మళ్ళీ అలాచేస్తే, అల్లాహ్ వారికి ప్రతీకారం చేస్తాడు. అల్లాహ్ అత్యంత శక్తిసంపన్నుడు. ప్రతీకారం చేసే శక్తి ఆయనకు ఉంది.

5. అల్మాఇద 96 సముద్ర జంతువులని వేటాడటం, వాటిని తినటం మీ కొరకు ధర్మసమ్మతం చెయ్యబడ్డాయి. మీరు  మజిలీ చేసేచోట కూడా వాటిని తినవచ్చు. ఇంకా వాటిని ప్రయాణీకుల బృందం కొరకు భోజన సామగ్రిగా కూడా చేసుకోవచ్చు. అయితే మీరు ఇహ్రాముస్థితిలో ఉన్నంతవరకూ, నేలపై వేటాడటం మీకు నిషిద్ధం చెయ్యబడిరది. కనుక అల్లాహ్ అవిధేయతకు దూరంగా ఉండండి. ఆయన సమక్షంలో మీరంతా ప్రోగుచెయ్యబడి హాజరుపరచబడతారు.

5. అల్మాఇద 97 - 100 పవిత్ర గృహమైన కాబాను అల్లాహ్ మానవజాతి (సమైక్యజీవన) సంస్థాపనకు సాధనంగా చేశాడు. ఇంకా పవిత్ర మాసాన్నీ, ఖుర్బానీ పశువులనూ వాటి కంఠపట్టికలను కూడా ( కార్యసాధనలో సహాయపడేవిగా) చేశాడు, ఆకాశాలలో భూమిలో ఉన్న పరిస్థితులన్నీ అల్లాహ్ కు తెలుసనీ, ఆయన సర్వజ్ఞాని అనీ మీకు తెలియటానికి. తెలుసుకోండి! అల్లాహ్ శిక్షించటంలో కూడా కఠినుడు. దానితో పాటు ఆయన అధికంగా మన్నించేవాడు, కరుణించేవాడూను. ప్రవక్తపై కేవలం సందేశాన్ని అందజేసే బాధ్యత మాత్రమే ఉంది. తరువాత మీ బాహ్యాంతర పరిస్థితులన్నింటినీ తెలుసుకునే వాడు అల్లాహ్యే. ప్రవక్తా! వారితో ఇలా అను: పరిశుద్ధము, అపరిశుద్ధము ఎట్టి పరిస్థితులలోనూ సమానం కావు, అపరిశుద్ధం యొక్క పుష్కలత నిన్ను ఎంతగా మరులు గొలిపినప్పటికీ. వివేకంగల ప్రజలారా! అల్లాహ్ పట్ల అవిధేయతకు దూరంగా ఉండండి. మీకు సాఫల్య భాగ్యం కలిగే ఆశ ఉంది.

5. అల్మాఇద 101 - 102 విశ్వాసులారా! మీకు గనక వివరిస్తే మీకే బాధ కలిగించే విషయాలను గురించి ప్రశ్నించ కండి. కాని మీరు వాటిని ఖురాను అవతరించే సమయంలో అడిగితే, అవి మీకు విశదం చెయ్య బడతాయి. ఇంతవరకు మీరు చేసినదానిని అల్లాహ్ క్షమించాడు. అల్లాహ్ క్షమించేవాడు, సహించే వాడూను. మీకు పూర్వం ఒక వర్గంవారు ఇటువంటి ప్రశ్నలనే అడిగారు. వారు ప్రశ్నల కారణంగానే అవిశ్వాసానికి గురిఅయ్యారు.

5. అల్మాఇద 103 - 104 అల్లాహ్ బహీరానుగాని, ‘సాయిబాను గాని, ‘వశీలానుగాని, ‘హామ్నుగాని ఎంతమాత్రం నిర్ణయించలేదు. అయినా అవిశ్వాసులు అల్లాహ్ పై అపనిందను మోపుతున్నారు. వారిలో చాలామంది బుద్ధిలేనివాళ్ళు. (వారు ఇటువంటి భ్రమలను నమ్ముతున్నారు). ‘‘అల్లాహ్ అవతరింప జేసిన శాసనం వైపునకు రండి, ప్రవక్త వైపునకు రండి’’ అని వారితో చెప్పినప్పుడు, వారు ‘‘మా కొరకు మా తాతముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే చాలు’’ అని జవాబు చెబుతారు. ఏమిటి! వారు తమ తాత ముత్తాతలనే అనుసరిస్తూ పోతారా,  వారికి  ఏమీ తెలియనప్పటికీ, రుజుమార్గజ్ఞానమే వారికి లేకపోయినప్పటికీ?

5. అల్మాఇద 105 విశ్వాసులారా! మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోండి. మీరు గనక స్వయంగా సన్మార్గంలో ఉంటే, ఇతరులు మార్గభ్రష్టులైనప్పటికీ మీకు ఎంతమాత్రం హాని కలగదు. మీరందరూ అల్లాహ్ వైపునకే మరలిపోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో మీకు తెలుపుతాడు.

5. అల్మాఇద 106 - 108 విశ్వాసులారా!  మీలో  ఎవరికైనా మరణ సమయం ఆసన్నమై అతడు వీలునామా వ్రాయిస్తున్నప్పుడు, దాని సాక్ష్యానికి అనుసరించవలసిన పద్ధతి ఏమిటంటే, మీలో న్యాయవర్తనులైన ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా చెయ్యబడాలి లేక ఒకవేళ మీరు ప్రయాణ స్థితిలో ఉండి అక్కడ మీకు మృత్యు విపత్తు  సంభవిస్తే అప్పుడు ముస్లిమేతరుల నుండే ఇద్దరు సాక్షులను తీసుకోవాలి. తరువాత ఏదైనా అనుమానం కలిగితే, నమాజు చేసిన పిదప ఇద్దరు సాక్షులనూ (మసీదులో) ఆపాలి. వారిద్దరూ అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి : ‘‘మేము స్వార్థం కొరకు సాక్ష్యాన్ని అమ్మేవాళ్ళం కాదు -అతడు మాకు దగ్గర బంధువైనాసరే (మేము అతని విషయంలో పక్షపాతం చూపం). మేము అల్లాహ్ కొరకు ఇచ్చే సాక్ష్యాన్ని దాచేవారం కాము.  మేము ఆవిధంగా చేస్తే పాపాత్ములలో లెక్కింపబడతాము.’’ కాని ఉభయులు  తమను తాము పాపానికి గురిచేసుకున్నట్లు తెలిస్తే అప్పుడు వారి స్థానంలో సాక్ష్యమివ్వటానికి వారికంటే యోగ్యులైన మరో ఇద్దరు వ్యక్తులు - హక్కు విషయంలో అన్యాయం జరిగిన వారినుండి ముందుకు రావాలి. వారు అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా చెప్పాలి : ‘‘మా సాక్ష్యం వారి సాక్ష్యం కంటే ఎక్కువ సత్యమైనది. మేము మా సాక్ష్యం విషయంలో విధమైన అక్రమానికి పాల్పడలేదు. మేము విధంగా చేస్తే అన్యాయపరులలో చేరిపోతాము.’’ పద్ధతివల్ల ప్రజలు నిజమైన సాక్ష్యం ఇస్తారనీ, లేదా వారి ప్రమాణాలను, తరువాత తీసుకోబడే ఇతరుల ప్రమాణాలు ఖండిస్తాయనే భయమైనా కనీసం వారికి కలుగుతుందనీ ఎక్కువగా ఆశించ వచ్చు. అల్లాహ్ కు భయపడండి, ఆలకించండి, అవిధేయత చూపేవారిని అల్లాహ్ తన మార్గదర్శ కత్వానికి దూరం చేస్తాడు.

5. అల్మాఇద 109 - 119  అల్లాహ్, ప్రవక్తలందరినీ సమావేశపరచి, ‘‘మీకు ఏమని జవాబు ఇవ్వబడిరది?’’ అని అడిగే రోజున ‘‘మాకు ఏమీ తెలియదు. గుప్తంగా             ఉన్న యథార్థాలన్నీ మీకే తెలుసు’’ అని వారు సమాధానం చెబుతారు. ఇంకా అల్లాహ్ విధంగా అడగబోయే సమయాన్ని గురించి ఊహించండి, ‘‘మర్యమ్కుమారుడైన ఈసా! జ్ఞాపకం తెచ్చుకో, నేను నీకూ, నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని  నేను పరిశుద్ధాత్మ ద్వారా నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో సైతం ప్రజలతో మాట్లాడేవాడివి, అదేవిధంగా ఎదిగిన తరువాత కూడా. నేను నీకు గ్రంథాన్నీ, వివేకాన్నీ, తౌరాతునూ ఇంజీలునూ నేర్పాను. నీవు నా ఆదేశంతో పక్షి ఆకారంగల మట్టిబొమ్మను తయారుచేసి, దానిలో ఊదేవాడివి. అది నా ఆజ్ఞతో పక్షి అయ్యేది. నీవు పుట్టు గ్రుడ్డినీ, కుష్ఠరోగినీ నా ఆజ్ఞతో బాగుచేసేవాడివి. నీవు మృతులను నా ఆజ్ఞతో వెలికి తీసేవాడివి. నీవు స్పష్టమైన సూచనలతో ఇస్రాయీలు సంతతి వారి వద్దకు వచ్చినప్పుడు, వారిలోని సత్యతిరస్కారులు ‘‘ సూచనలు మాయ తప్ప మరేమీ కాదు’’ అని అన్నారు. అప్పుడు నేనే నిన్ను వారి బారినుండి రక్షించాను. నేను హవారీలకు, ‘‘నన్నూ నా ప్రవక్తను విశ్వసించండి’’ అని సూచించినప్పుడు వారు ‘‘మేము విశ్వసించాము, మేము ముస్లిములము అయ్యామన్న దానికి నీవే సాక్షి’’ అని అన్నారు - (హవారీల విషయంలో) మరొక సంఘటనను కూడా జ్ఞాపకం తెచ్చుకో. వారు ‘‘మర్యమ్కుమారుడైన ఈసా! నీ ప్రభువు మా కొరకు ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్ళాన్ని ఆకాశం నుండి దింపగలడా?’’  అని అడిగినప్పుడు, ఈసా, ‘‘మీరు విశ్వాసులే అయితే అల్లాహ్ కు భయపడండి’’ అని అన్నాడు.  వారు ఇలా అన్నారు : ‘‘ పళ్ళెంలో ఉన్న ఆహారాన్ని భుజించాలనీ, మా హృదయాలకు తృప్తి కలగాలనీ, నీవు మాకు చెప్పినదంతా నిజమనే విషయం మాకు తెలియాలనీ, ఇంకా మేము దానికి సాక్షులుగా ఉండాలనీ మాత్రమే మేము కోరుతున్నాము.’’ దానిపై మర్యమ్కుమారుడైన ఈసా ఇలా ప్రార్థించాడు : ‘‘అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుండి మాపై ఆహారంతో నిండిన పళ్ళాన్ని ఒక దానిని అవతరింపజెయ్యి. అది మాకూ, మా పూర్వీకులకూ, మా తరువాతి వారికీ ఒక పండుగ సమయంగా నిర్ణయింపబడాలి. నీ తరఫునుండి ఒక సూచన కాగలగాలి. మాకు ఆహారం ప్రసాదించు. నీవు ఉత్తమ ఆహారప్రదాతవు.’’ అల్లాహ్ ఇలా జవాబు పలికాడు : ‘‘నేను దానిని మీపై అవతరింపజేస్తాను. కాని దాని తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే, వారికి నేను ఇంతవరకూ ఎవరికీ విధించని శిక్ష విధిస్తాను.’’ - ( అనుగ్రహాలను గుర్తుచేసి) అల్లాహ్, ‘‘మర్యమ్కుమారుడవైన ఈసా! నీవు మనుజ జాతితో, అల్లాహ్ ను కాదని నన్నూ, నా తల్లిని దేవుళ్ళుగా భావించండి అని బోధించావా?’’ అని అడిగినపుడు అతను ఇలా మనవి చేసుకుంటాడు : ‘‘నీవు అత్యంత పవిత్రుడవు! మాటను అనే హక్కు నాకు లేదో మాటను అనటం నాకు యుక్తమైన పనికాదు. ఒకవేళ నేను ఆవిధంగా అని ఉంటే, అది నీకు తప్పకుండా తెలిసివుండేది. నా మనస్సులో ఏముందో నీకు తెలుసు. నీ మనస్సులో ఏముందో నాకు తెలియదు. నీవు గుప్తంగా ఉన్న యథార్థాలన్నీ తెలిసిన మహాజ్ఞానివి. నీవు ఆదేశించిన దానిని తప్ప దేనినీ నేను వారికి చెప్పలేదు. అది ఏమిటంటే అల్లాహ్ ను ఆరాధించండి. ఆయన నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. నేను వారిమధ్య ఉన్నంత కాలంవరకే నేను వారిని కనిపెట్టి ఉన్నాను. నీవు నన్ను తిరిగి పిలుచుకున్న తరువాత నీవే వారిని కనిపెట్టి ఉంటున్నావు. నీవు సర్వ విషయాలను కనిపెట్టి ఉండేవాడవు. ఇప్పుడు ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు, ఒకవేళ క్షమించినట్లయితే నీవు శక్తిమంతుడవు, వివేకవంతుడవు.’’ అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిస్తాడు :  ‘‘  రోజు సత్యవంతులకు వారి సత్యం లాభాన్ని ఇస్తుంది. క్రింద కాలువలు ప్రవహించే ఉద్యాన వనాలు వారికి లభిస్తాయి. అక్కడ వారు ఎల్లప్పుడూ ఉంటారు. వారు అల్లాహ్ అంటే ఇష్టపడతారు. అల్లాహ్ వారంటే ఇష్టపడతాడు. ఇదే గొప్ప విజయం.’’

5. అల్మాఇద 120 భూమి, ఆకాశాలు వాటిలో ఉన్న సమస్తం యొక్క సామ్రాజ్యాధిపత్యం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనకు ప్రతి వస్తువుపైనా అధికారం ఉంది.




No comments:

Post a Comment