22. హజ్
ఆయతులు
: 78 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
22. హజ్ 1
- 2 మానవులారా! మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించు కోండి. యధార్థం ఏమిటంటే, ప్రళయం నాటి భూకంపం మహా (భయంకర మైన) విషయం. దానిని మీరు చూచినప్పుడు దాని స్థితి ఎలా ఉంటుందంటే
పాలు పట్టే ప్రతి స్త్రీ పాలు త్రాగే తన పాపను మరచిపోతుంది, ప్రతి గర్భిణి యొక్క గర్భం పడిపోతుంది, ప్రజలు మీకు మత్తులో ఉన్నట్లు కనిపిస్తారు, వాస్తవానికి వారు త్రాగి ఉండరు.
కాని అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది.
22. హజ్ 3
- 7 ప్రజలలో కొందరు జ్ఞానం లేకపోయినా అల్లాహ్ ను గురించి వాదిస్తారు. తిరగబడిన ప్రతి షైతాన్ను అనుసరిస్తారు. వాస్తవానికి అతడి అదృష్టం ఇలా వ్రాయబడి ఉంది : వాడిని స్నేహితుడుగా చేసుకునే మనిషిని వాడు మార్గం తప్పించి మరీ వదలిపెడతాడు, నరకయాతన వైపునకు మార్గం చూపుతాడు. మానవులారా! ఒకవేళ మీకు
మరణానంతర జీవితం గురించి ఏదైనా సందేహం ఉంటే, మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి: మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము,
తరువాత వీర్య బిందువుతో, ఆ తరువాత నెత్తుటి గడ్డతో, ఆపై మాంసపు కండతో
అది రూపం కలదిగానూ, రూపం లేనిది గానూ ఉంటుంది. (మేము ఈ విషయాన్ని) మీకు యధార్థం ఏమిటో స్పష్టం చెయ్యాలని (తెలుపుతున్నాము). మేము కోరిన (వీర్య బిందువును) దానిని ఒక ప్రత్యేక కాలం వరకు మాతృగర్భాలలో నిలిపి ఉంచుతాము. తరువాత మిమ్మల్ని ఒక శిశువు రూపంలో బయటికి తీస్తాము. (ఆ తరువాత మీకు పెట్టి పోషిస్తాము) మీరు నిండు యౌవన దశకు చేరటానికి. మీలో ఒకడు ముందుగానే వెనుకకు పిలుచుకోబడతాడు, మరొకడు అతి నికృష్టమైన వయస్సు వైపునకు మరలింపబడతాడు, అంతా తెలిసిన తరువాత కూడ ఏమీ తెలియకుండా ఉండటానికి. ఎండిపోయిన నేలను మీరు చూస్తున్నారు, తరువాత మేము దానిపై వర్షం కురిపించగానే, అకస్మాత్తుగా అది పులక రిస్తుంది మరియు ఉబుకుతుంది, ఇంకా అది అన్ని రకాల మనోహరమైన మొక్కలను
మొలకెత్తించటం ప్రారంభిస్తుంది. దీనికంతటికీ కారణం, అల్లాహ్ యే సత్యం కావటం, ఆయన మృతులను బ్రతికించటం మరియు ప్రతిదానిపై అధికారం కలిగి ఉండటం
ఇంకా (ఇది మరొక విషయానిక్కూడ నిదర్శనమే) ఏమిటంటే, ప్రళయఘడియ తప్పకుండా వచ్చి తీరుతుంది, ఇందులో ఏ అనుమానానికీ ఆస్కారం లేదు, గోరీలలోకి వెళ్ళిపోయినవారిని అల్లాహ్ తప్పకుండా లేపుతాడు.
22. హజ్ 8
- 10 మానవులలో ఇంకా కొందరు ఏ జ్ఞానమూ లేకపోయినా, ఏ మార్గదర్శకత్వమూ లేకపోయినా, జ్యోతిని ప్రసాదించే ఏ గ్రంథమూ లేకుండానే, తలబిరుసుతనంతో అల్లాహ్ ను గురించి తగవులాడుతారు. తద్ద్వారా వారు ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పింపజూస్తారు. అలాంటి వ్యక్తి ప్రపం చంలో అవమానం పాలవుతాడు, ప్రళయంనాడు మేము అతనికి అగ్ని బాధను రుచి చూపిస్తాము - ఇది నీ భవిష్యత్తు
దానిని స్వయంగా నీ చేతులే నీకై సిద్ధపరచి ఉంచాయి. నిజానికి అల్లాహ్ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.
22. హజ్ 11
- 15 ప్రజలలో ఒకడు (విశ్వాసం) అంచులపై నిలబడి అల్లాహ్ కు దాస్యం చేసేవాడు ఉన్నాడు
ఒకవేళ లాభం కలిగితే తృప్తి పొందుతాడు
కాని ఏదైనా ఆపద సంభవిస్తే విముఖుడవుతాడు. అతనికి ఇహమూ దక్కదు, పరమూ దక్కదు. స్పష్టమైన నష్టం అంటే ఇదే. అతను అల్లాహ్ ను కాదని, తనకు నష్టంగాని, లాభం గాని కలిగించలేని వారిని వేడుకుంటున్నాడు. ఇది మార్గభ్రష్టత్వానికి పరాకాష్ఠ. ఎవరి నష్టమైతే వారు చేసే లాభానికి అత్యంత సమీపంలో ఉందో, వారిని అతడు వేడుకుంటున్నాడు. ఎంత నికృష్టుడు అతని సంరక్షకుడు, ఎంత నికృష్టుడు అతని సహచరుడు. (దీనికి ప్రతిగా) ఎవరు విశ్వసించారో, మరెవరు మంచిపనులు చేశారో, వారిని అల్లాహ్ నిశ్చయంగా క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాల్లో ప్రవేశింపజేస్తాడు. అల్లాహ్ తాను కోరింది చేస్తాడు. ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అల్లాహ్ తనకు ఏ
సహాయమూ చేయడని అనుమానించే వ్యక్తి ఒక తాడు ద్వారా ఆకాశాన్ని చేరి దానికి కన్నం వేయాలి, తరువాత తనకు అయిష్టమైన దానిని తన యుక్తి నిరోధించ గలుగుతుందేమో అనే విషయాన్ని ఆ కన్నం ద్వారా అతడు చూసుకోవాలి.
22. హజ్ 16 ఇటువంటి స్పష్టమైన బోధలతోనే మేము ఈ ఖుర్ఆన్ను అవతరింప జేశాము. అల్లాహ్ తాను కోరిన వారికి మార్గం చూపుతాడు.
22. హజ్ 17
- 18 విశ్వసించినవారు, యూదులుగా మారినవారు, సాబియీలు, క్రైస్తవులు, మజూసీలు (అగ్ని పూజారులు) షిర్కు చేసినవారు - వారందరిని గురించి అల్లాహ్ ప్రళయం నాడు తీర్పు చెబుతాడు. ప్రతి విషయమూ అల్లాహ్ దృష్టిలో ఉన్నది. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్తమూ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు,
పర్వతాలు,
వృక్షాలు, జంతువులు, చాలమంది మానవులు, శిక్షకు అర్హులైన చాలమంది ప్రజలు అల్లాహ్ ముందు వినమ్రులై ఉండటాన్ని నీవు చూడటంలేదా? అల్లాహ్ ఎవరినైతే అవమానం పాలుజేస్తాడో, ఇక అతనికి గౌరవం ఇచ్చేవాడెవ్వడూ ఉండడు. అల్లాహ్ తాను కోరిన దానిని చేస్తాడు.
22. హజ్ 19
- 24 అవి రెండు వర్గాలు,
వాటి మధ్య తమ ప్రభువును గురించి వివాదం తలెత్తింది. వారిలో అవిశ్వాసులైన వారి కొరకు అగ్ని వస్త్రాలు కత్తిరించబడి ఉన్నాయి, వారి శిరస్సులపై మరిగే నీరు పోయబడుతుంది. దానివల్ల వారి చర్మాలే కాదు, కడుపు లోపలి భాగాలు సైతం కరిగిపోతాయి. వారిని దండిరచటానికి ఇనుపగదలు ఉంటాయి. ఎప్పుడైనా వారు కంగారుపడి నరకం
నుండి బయటపడే ప్రయత్నం చేస్తే, వారు మళ్లీ అందులోకే నెట్టబడతారు, ‘‘ఇప్పుడు చవి చూడండి దహన శిక్షను’’ అని అనబడుతూ (మరొకవైపు) విశ్వసించి, మంచి పనులు చేసినవారిని అల్లాహ్, క్రింద సెలయేళ్లు ప్రవహించే ఉద్యానవనాలలో ప్రవేశింపజేస్తాడు. అక్కడ వారు స్వర్ణ కంకణాలతో, ముత్యాలతో అలంకరించబడతారు. వారు పట్టు వస్త్రాలు ధరిస్తారు. (దీనికి కారణం) పరిశుద్ధ వచనాన్ని స్వీకరించే మార్గం వారికి ప్రసాదించబడిరది, స్తుతింపబడే గుణ విశేషాలు గల దేవుని మార్గం వారికి చూపబడిరది.
22. హజ్ 25 ఎవరు తిరస్కరించారో, ఇంకా (ఈనాడు) అల్లాహ్ మార్గం వైపునకు రాకుండా (ప్రజలను) అడ్డగిస్తున్నారో-మేము సర్వ మానవుల కొరకు నిర్మించిన పరిశుద్ధ మసీదులో స్థానిక ప్రజల యొక్క మరియు బయటనుండి వచ్చే వారి యొక్క
హక్కులు సరిసమానంగా ఉన్నాయి - దాని సందర్శనానికి అవరోధంగా ఉన్నారో. (వారి వైఖరి నిశ్చయముగా శిక్షార్హమైనదే). దీని (పరిశుద్ధ మసీదు)లో, నిజాయితీ నుండి వైదొలగి, అన్యాయపు పద్ధతిని అవలంబించే వాడికి మేము వ్యధాభరితమైన శిక్షను రుచి చూపిస్తాము.
22. హజ్ 26
- 29 మేము ఇబ్రాహీమ్కు ఈ గృహం (కాబా గృహం) కొరకు స్థలాన్ని సూచించినప్పటి సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. (అప్పుడు మేము ఇలా ఉపదేశించాము) నాకు దేనినీ భాగస్వామిగా చేయకు, ప్రదక్షిణం చేసేవారి కొరకూ, ఖియామ్, రుకూ, సజ్దాలు
చేసేవారి కొరకూ నా గృహాన్ని పరిశుద్ధంగా ఉంచు, హజ్ కొరకై మానవులందరికీ పిలుపు ఇవ్వు, వారు నీ వద్దకు ప్రతి సుదూర ప్రాంతం నుండి కాలినడకతోనూ, ఒంటెలపైనా ఎక్కి రావాలని మరియు వచ్చి వారు తమ కొరకు ఇక్కడ ఉంచబడిన ప్రయోజ నాలను చూసుకోవాలని. అల్లాహ్ వారికి ప్రసాదించిన పశువుల మీద కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి, స్వయంగా వారూ తినాలి, లేమికి గురిఅయిన అగత్యపరులకూ పెట్టాలి. తరువాత వారు తమ మాలి న్యాన్ని దూరం చేసుకోవాలి, తమ మొక్కుబడులను చెల్లించుకోవాలి మరియు ఆ ప్రాచీన గృహానికి ప్రదక్షిణ చెయ్యాలి.
22. హజ్ 30
... (కాబా నిర్మాణ లక్ష్యం) ఇది.
ఎవడైనా అల్లాహ్ విధించిన పవిత్ర నియమాలను గౌరవిస్తే, అది అతని ప్రభువు దృష్టిలో స్వయంగా అతడికి శ్రేష్ఠమైనది.
22. హజ్ ...
30 - 31 మీ కొరకు పశువులు ధర్మసమ్మతము చేయబడ్డాయి, ఇదివరకే మీకు తెలుపబడినవి తప్ప. కనుక విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండండి, అబద్ధపు మాటలు పలక్కండి,
ఏకాగ్రతతో అల్లాహ్ కు దాసులు అవండి, దైవత్వంలో ఆయనకు ఎవరినీ భాగస్వాములుగా చేయకండి. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసేవాడు ఆకాశం నుండి క్రిందపడిపోయినట్లే. అతనిని, ఇక పక్షులైనా తన్నుకుపోతాయి లేదా గాలి అతనిని ముక్కలు ముక్కలయ్యే ప్రదేశానికైనా విసరివేస్తుంది.
22. హజ్ 32 ఇదీ అసలు విషయం. (దానిని అర్థం చేసుకో) ఎవరైనా అల్లాహ్ నిర్ణయిం చిన చిహ్నాలను గౌరవిస్తున్నారంటే అది హృదయాలలోని దైవభీతి వలననే.
22. హజ్ 33 ఒక నిర్ణీత కాలం వరకు వాటి (హదీ పశువులు) ద్వారా లాభం పొందే హక్కు మీకు ఉన్నది. ఆ తరువాత వాటిని (ఖుర్బానీ చేసే) స్థలం ఆ ప్రాచీన గృహం వద్దనే ఉన్నది.
22. హజ్ 34
- 35 ప్రతి అనుచర సంఘానికి మేము ఒక ఖుర్బానీ పద్ధతిని నిర్ణయిం చాము
(ఆ అనుచర సంఘం) ప్రజలు అల్లాహ్ వారికి ప్రసాదించిన పశువుల మీద ఆయన పేరును స్మరించటానికి. (ఈ విభిన్న పద్ధతుల ఉద్దేశ్యం ఒక్కటే). కనుక మీ దేవుడు ఒక్కడే. మీరు ఆయనకే విధేయులు అవండి. ఓ ప్రవక్తా! అణకువగల వైఖరిని అవలంబించే వారికి శుభవార్తను అందజెయ్యి. వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అల్లాహ్ ప్రస్తావన విన్నప్పుడు వారి గుండెలు అదిరిపోతాయి. వారి మీదకు ఏ ఆపద వచ్చిపడినా, దానికి వారు ఓరిమి వహిస్తారు, నమాజ్ను స్థాపిస్తారు, మేము వారికి ఇచ్చిన ఉపాధి నుండి ఖర్చు పెడతారు.
22. హజ్ 36
- 37 (ఖుర్బానీ) ఒంటెలను మేము మీ కొరకు అల్లాహ్ చిహ్నాలలో చేర్చాము. మీకు వాటిలో మేలు ఉన్నది. కనుక వాటిని నిలబెట్టి వాటిపై అల్లాహ్ పేరును స్మరించండి. (ఖుర్బానీ తరువాత) వాటి వీపులు నేలపై ఆనినప్పుడు, వాటిలో నుండి స్వయంగానూ తినండి, (యాచించని) సంతుష్టు లకూ తినిపించండి,
తమ అవసరాలకు అడిగేవారికీ తినిపించండి. ఈ విధంగా మేము ఈ జంతువులను మీకు వశపరిచాము, మీరు కృతజ్ఞతలు తెలుపుకునేందుకు. వాటి మాంసమూ అల్లాహ్ కు చేరదు, వాటి రక్తమూ చేరదు. కాని మీ భయభక్తులు ఆయనకు చేరుతాయి. ఆయన వాటిని మీకు ఈవిధంగా వశపరిచాడు
ఆయన ప్రసాదించిన మార్గదర్శకత్వానికి మీరు ఆయన గొప్పతనాన్ని చాటేందుకు. ఓ ప్రవక్తా! సత్కార్యాలు చేసే వారికి శుభవార్త అందించు.
22. హజ్ 38
- 41 నిశ్చయముగా అల్లాహ్ విశ్వసించినవారిని కాపాడతాడు. నిశ్చయ ముగా అల్లాహ్ నమ్మక ద్రోహి అయిన కృతఘ్నుణ్ణి ప్రేమించడు. ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చెయ్యబడుతూ ఉందో, వారికి (యుద్ధం చేయటానికి) అనుమతి ఇవ్వబడిరది
ఎందుకంటే వారు అన్యాయానికి గురిఅయిన వారు. నిశ్చయముగా అల్లాహ్ వారికి సహాయం చేయగల సమర్థుడు. వారు అన్యాయంగా తమ ఇళ్లనుండి తరిమివేయబడినవారు. వారి తప్పు కేవలం, ‘‘అల్లాహ్ మా ప్రభువు’’ అని అనటమే. అల్లాహ్ గనక ప్రజలను ఒకరి ద్వారా మరొకరిని తొలగిస్తూ ఉండకపోతే, ఆశ్రమాలు, చర్చీలు, యూదుల ప్రార్థనాలయాలు, మశీదులు-వేటిలో అల్లాహ్ పేరు అత్యధికంగా స్మరింప బడుతుందో - అన్నీ ధ్వంసం చేయబడి ఉండేవే. అల్లాహ్ తనకు సహాయం చేసేవారికి తప్పకుండా సహాయపడతాడు. అల్లాహ్ మహా శక్తిమంతుడు, మహాబలవంతుడూను. మేము గనక వారికి భూమిపై అధికారాన్ని ప్రసాదిస్తే, వారు నమాజ్ను స్థాపిస్తారు, జకాత్ ఇస్తారు, మంచి చేయమని ఆజ్ఞాపిస్తారు, చెడునుండి నిరోధిస్తారు.
సకల వ్యవహారాల అంతిమ నిర్ణయం అల్లాహ్ చేతులలో ఉంది.
22. హజ్ 42
- 46 ఓ ప్రవక్తా! వారు (అంటే అవిశ్వాసులు) నిన్ను నిరాకరిస్తున్నారంటే, వారికి పూర్వం నూహ్, ఆద్, సమూద్ జాతులు, ఇంకా ఇబ్రాహీమ్ జాతివారు, లూత్ జాతివారు, మద్యన్ వాసులు
కూడ (తమ తమ ప్రవక్తలను) నిరాక రించారు (అనే విషయాన్ని జ్ఞాపకముంచుకో), ఇంకా మూసా కూడ తిరస్క రించబడ్డారు. ఈ సత్య తిరస్కారులందరికీ మొదట్లో నేను వ్యవధినిచ్చాను, తరువాత పట్టుకున్నాను. ఇక చూడు నా శిక్ష ఎంత భయంకరంగా ఉండినదో! పాపాల పుట్టలైన ఎన్నో జన పదాలను మేము నాశనం చేశాము, ఈనాడు అవి తమ కప్పులపై తలక్రిందులుగా పడి ఉన్నాయి, ఎన్నో బావులు నిరుప యోగంగా పడివున్నాయి, ఎన్నో ఎత్తైన భవనాలు శిధిలాలుగా మారిపోయాయి. వారు భూమిపై సంచరించలేదా వారి హృదయాలు అర్థం చేసుకోగలవిగా, వారి చెవులు వినగలవిగా కావటానికి? యథార్థం ఏమిటంటే, కళ్లు గుడ్డివి అవవు, కాని
వక్షములలోపల ఉన్న హృదయాలు మాత్రం గుడ్డివి అయి పోతాయి.
22. హజ్ 47
- 48 వారు శిక్షకొరకై తొందరపెడుతున్నారు. అల్లాహ్ తన వాగ్దానానికి భంగకరంగా ఎంతమాత్రం వ్యవహరించడు.
కాని నీ ప్రభువు వద్ద ఒక రోజు అంటే మీ లెక్కలో వెయ్యి సంవత్సరాలకు సమానమవుతుంది. దుర్మార్గపు జనపదాలు ఎన్నో ఉండేవి, నేను మొదట వాటికి వ్యవధి ఇచ్చాను, తరువాత పట్టుకున్నాను. అందరూ తిరిగి నా వైపునకే రావలసి ఉంది.
22. హజ్ 49
- 51 ఓ
ప్రవక్తా! ఇలా అను, ‘‘మానవులారా! నేను మీకు కేవలం (కష్టకాలం రాకముందు) స్పష్టంగా హెచ్చరించే వ్యక్తిని మాత్రమే.’’ కనుక విశ్వసించి మంచి పనులు చేసేవారికి క్షమాభిక్ష లభిస్తుంది, గౌరవ ప్రదమైన ఉపాధి కూడ లభిస్తుంది. మా ఆయతులను కించపరచటానికి ప్రయత్నం చేసే వారు నరకానికి మిత్రులు.
22. హజ్ 52
- 54 ఓ ప్రవక్తా! నీకు పూర్వం, అతను కోరుకున్నప్పుడు, అతని ఆ కోరికలో షైతాన్ జోక్యం చేసుకొని ఏ సందేశహరుణ్ణీ, ఏ ప్రవక్తనూ మేము పంపి ఉండలేదు. ఇటువంటి షైతాన్ జోక్యాలను అల్లాహ్ నిర్మూలిస్తాడు మరియు తన ఆయతులను పటిష్ఠపరుస్తాడు. అల్లాహ్ సర్వజ్ఞాని, మహావివేకి. (ఆయన ఇలా ఎందుకు జరగనిస్తాడంటే) ఎవరి హృదయాలకు (కపటం) రోగం తగిలిందో, మరెవరి హృదయాలు మొద్దుబారి పోయాయో, వారికొరకై, షైతాన్ కల్పించిన చెడును, ఒక పరీక్షగా చెయ్యటానికి - యధార్థం ఏమిటంటే ఈ దుర్మార్గులు శత్రుత్వంలో చాల దూరం వెళ్లిపోయారు - జ్ఞాన సంపన్నులైన ప్రజలు ఇది
నీ ప్రభువు నుండి వచ్చిన సత్యమని తెలుసుకోవటానికీ, వారు దాన్ని విశ్వసించటానికీ, వారి హృదయాలు ఆయన ముందు వంగిపోవటానికీ. నిశ్చయంగా అల్లాహ్,
విశ్వసించే వారికి ఎల్లప్పుడూ ఋజువైన మార్గం చూపుతాడు.
22. హజ్ 55
- 60 అవిశ్వాసులు దానిని గురించి సంశయంలోనే పడి ఉంటారు, చివరికి వారిపైకి ప్రళయ ఘడియ అయినా వచ్చి పడుతుంది లేదా ఒక దౌర్భాగ్య దినపు శిక్ష అయినా అవతరిస్తుంది. ఆనాడు రాజ్యాధికారం అల్లాహ్దవుతుంది, ఆయన వారి మధ్య తీర్పు చేస్తాడు. విశ్వసించినవారు, మంచి పనులు చేసినవారు వరాలతో నిండి ఉన్న ఉద్యానవనాలలోకి పోతారు. అవిశ్వాసానికి పాల్పడి, మా ఆయతులను తిరస్కరించిన వారికి అవమానకర మైన శిక్షపడుతుంది. ఎవరు అల్లాహ్ మార్గంలో వలసపోయారో,
తరువాత చంపబడ్డారో లేక మరణించారో వారికి అల్లాహ్ మంచి ఉపాధిని ప్రసాదిస్తాడు. నిశ్చయంగా
అల్లాహ్ మాత్రమే ఉత్తమ
ఉపాధి ప్రదాత. వారు తృప్తిపడే స్థలానికి ఆయన వారిని చేరుస్తాడు.
నిస్సందేహంగా అల్లాహ్ సర్వమూ తెలిసినవాడు, సంయమనం కలవాడూను. ఇదీ వారి పరిణామం. ఇక, ఎవ రయితే తనపై జరిగినమేరకే ప్రతీకారం చేస్తాడో, పైగా అతనిపై అత్యాచారం కూడా జరిగివుంటే అల్లాహ్ అతనికి తప్పకుండా సహాయం చేస్తాడు. అల్లాహ్ క్షమించేవాడు, మన్నించేవాడూను.
22. హజ్ 61
- 66 ఇలా ఎందుకు జరుగుతుందంటే, రాత్రి నుండి పగలునూ, పగలు నుండి రాత్రినీ వెలికి తీసేవాడు అల్లాహ్ యే గనుక. ఆయన అన్నీ వినేవాడు అన్నీ చూసేవాడు గనుక. ఇలా ఎందుకు జరుగుతుందంటే, అల్లాహ్ యే సత్యం గనుక. అల్లాహ్ ను కాదని వారు వేడుకునేవన్నీ అసత్యం గనుక. అల్లాహ్ యే ఆధిక్యం గలవాడు మరియు మహోన్నతుడు. ఆకాశం నుండి అల్లాహ్ నీటిని కురిపించటాన్నీ, తద్ద్వారా భూమి సస్యశ్యామలం అయిపోవటాన్నీ నీవు చూడటం లేదా? యధార్థం ఏమిటంటే, ఆయన అత్యంత సూక్ష్మ శక్తికలవాడు, సర్వమూ ఎరిగినవాడు. ఆకాశాలలో ఉన్నదీ, భూమిపై ఉన్నదీ అంతా ఆయనదే. నిస్సందేహంగా ఆయనే నిరపేక్షాపరుడు, స్తుతింప బడేవాడు. భూమిపై ఉన్న సమస్తాన్నీ ఆయన మీకు వశపరచాడు. ఆయనే పడవను నియమబద్ధం చేశాడు, అది ఆయన ఆజ్ఞానుసారం సముద్రంలో నడుస్తుంది. ఆయనే ఆకాశాన్ని నిలిపి ఉంచాడు, అది ఆయన అనుమతి లేకుండా నేలపై పడజాలదు. ఇదంతా మీరు చూడటం లేదా? వాస్తవం ఏమిటంటే, మానవుల పట్ల అల్లాహ్ ఎంతో వాత్సల్యం కలవాడు, ఎంతో కరుణగలవాడు. ఆయనే మీకు జీవితాన్ని ప్రసాదించాడు, ఆయనే మీకు మృత్యువును కలుగజేస్తాడు
ఆయనే మిమ్మల్ని మళ్లీ బ్రతికిస్తాడు. నిజంగానే మానవుడు పరమ సత్యధిక్కారి.
22. హజ్ 67
- 70 ప్రతి అనుచర సంఘానికి మేము ఒక ఆరాధనా పద్ధతిని నిర్ణయిం చాము, అది దానిని అనుసరిస్తోంది. కనుక ఓ ప్రవక్తా!
వారు ఈ విషయంలో నీతో తగాదాపడకూడదు. నీవు
నీ ప్రభువు వైపునకు పిలువు. నిశ్చయంగా నీవు ఋజుమార్గంలో ఉన్నావు.
ఒకవేళ వారు నీతో వివాదానికి తలపడితే, ఇలా అను, ‘‘మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. ప్రళయం నాడు అల్లాహ్ మీ మధ్య మీరు విభేదించుకుంటూ వచ్చిన అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు.’’ ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్న ప్రతి వస్తువును గురించి అల్లాహ్ కు తెలుసని నీవు ఎరుగవా? అంతా ఒక గ్రంథంలో వ్రాయ బడి ఉంది. అల్లాహ్ కు ఇదేమంత కష్టమైనది కానేకాదు.
22. హజ్ 71
- 72 ఈ జనం అల్లాహ్ ను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో, వారికొరకు అల్లాహ్ కూడ ఏ ప్రమాణాన్నీ అవతరింపజేయలేదు,
వీరు కూడ వారిని గురించి ఏమీ ఎరుగరు. ఈ దుర్మార్గులకు సహాయపడే వాడెవ్వడూ లేడు. వారికి స్పష్టమైన మా ఆయతులను వినిపించినప్పుడు, సత్య తిరస్కారుల ముఖాలు మాడిపోవటాన్ని నీవు చూస్తావు.
ఇంకా వారు మా ఆయతులను వినిపించే వారిపై వెంటనే విరుచుకుపడతారేమో అనిపిస్తుంది. వారికి ఇలా చెప్పు, ‘‘దీనికంటే కూడ ఘోరమైన విషయమేమిటో నేను మీకు తెలిపేదా? అది అగ్ని. సత్యాన్ని స్వీకరించక నిరాకరించే వారి విషయంలో అల్లాహ్ దానిని గురించిన వాగ్దానమే చేశాడు. అది అతి చెడ్డనివాస స్థలం.’’
22. హజ్ 73
- 74 మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది
దానిని శ్రద్ధగా వినండి: అల్లాహ్ ను కాదని మీరు ఏ దేవుళ్లను వేడుకుంటున్నారో, వారందరూ కలసి సమైక్యంగా ఒక్క ఈగను సృష్టించదలచినా, అలా చేయలేరు. అంతేకాదు, ఒకవేళ ఈగ వారినుండి ఏదైనా వస్తువును లాక్కుపోయినా, వారు దానిని విడిపించుకురానూలేరు. సహాయాన్ని అర్థించేవారూ బలహీనులే, సహాయం కోసం అర్థింపబడేవారూ బలహీనులే. అల్లాహ్ గొప్పతనాన్నే వారు గుర్తించ వలసిన విధంగా గుర్తించలేదు. నిజానికి అల్లాహ్ మాత్రమే శక్తిమంతుడు, గౌరవనీయుడూను.
22. హజ్ 75
- 76 యధార్థం ఏమిటంటే, అల్లాహ్ (తన ఉత్తరువులను అందజేయ టానికి) సందేశహరులను
దైవదూతల నుండీ, మానవులనుండీ ఎన్ను కుంటాడు. ఆయన అన్నీ వింటాడు,
అన్నీ చూస్తాడు. ప్రజల ముందు ఉన్న దానిని ఆయన ఎరుగును, వారికి గోప్యంగా ఉన్నదాన్నీ ఆయన ఎరుగును. వ్యవహారాలన్నీ ఆయన వైపునకే మరలుతాయి.
22. హజ్ 77 - 78 విశ్వాసులారా! రుకూ చేయండి, సజ్దా చెయ్యండి, మీ ప్రభువుకు దాస్యం చెయ్యండి, మంచిపనులు చెయ్యండి. దీని ద్వారానే మీకు సాఫల్య భాగ్యం లభిస్తుందని ఆశించవచ్చు. అల్లాహ్ మార్గంలో జిహాద్ చెయ్యండి, జిహాద్ చెయ్యవలసిన విధంగా. ఆయన మిమ్మల్ని తన సేవకై ఎన్ను కున్నాడు. ధర్మంలో మీకు ఏ ఇబ్బందినీ ఉంచలేదు. మీ తండ్రి ఇబ్రాహీమ్ ధర్మంపై స్థిరంగా ఉండండి. పూర్వం కూడ అల్లాహ్ మీకు ‘‘ముస్లిమ్’’ అనే పేరునే పెట్టాడు, ఇందులో (ఖుర్ఆన్లో) కూడ (మీ పేరు ఇదే) దైవప్రవక్త మీ విషయంలో సాక్షిగా ఉండటానికి మరియు మీరు ప్రజల విషయంలో సాక్షు లుగా ఉండటానికి. కనుక నమాజును స్థాపించండి, జకాతు ఇవ్వండి, అల్లాహ్తో గట్టి సంబంధం కలిగి ఉండండి. ఆయన మీకు సంరక్షకుడు, ఎంతో మంచి సంరక్షకుడు, ఎంతో మంచి సహాయకుడు.
No comments:
Post a Comment