58 సూరహ్ అల్‌ ముజాదలహ్

 

58. అల్ముజాదలహ్

ఆయతులు : 22                                   అవతరణ : మదీనాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 4 ... తన భర్త వ్యవహారంలో నీతో వాదిస్తూ ఉన్న, అల్లాహ్ తో మొరపెట్టు కుంటూ ఉన్న స్త్రీ మాటలను అల్లాహ్ విన్నాడు. అల్లాహ్ మీ ఉభయుల సంభాషణను వింటున్నాడు  ఆయన అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడూను. మీలో ఎవరు తమ భార్యలను ‘‘జిహార్’’ ద్వారా దూరంగా ఉంచుతారో వారికి వారి భార్యలు తల్లులు కాజాలరు. వారిని కన్నవారే వారి తల్లులు, వారు ఎంతో అనుచితమైన, ఎంతో అసత్యమైన మాటను పలుకుతున్నారు. యథార్థమేమిటంటే అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, (దోషాలను) ఉపేక్షించే వాడూను.  ఎవరైనా తమ భార్యలను ‘‘జిహార్’’ ద్వారా దూరంగా ఉంచి, తరువాత తాము అన్న మాటను వారు ఉపసంహరించుకోదలిస్తే, వారు ఉభయులు ఒకరినొకరు తాకకముందే, ఒక బానిసను విడుదల చేయవలసి ఉంటుంది. దీనిద్వారా మీకు ఉపదేశం చేయబడుతోంది  మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. ఎవరికైనా బానిస లభించని పక్షంలో, ఉభయులు ఒకరినొకరు తాకకముందే, అతను వరుసగా రెండు నెలలపాటు ఉపవాస ముండాలి. పనికూడ చేసే శక్తిలేనివాడు, అరవై మంది  నిరుపేదలకు భోజనం పెట్టాలి.

... 4 - 6 మీరు అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ విశ్వసించేందుకు ఆజ్ఞ ఇవ్వబడుతోంది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. తిరస్కారులకు బాధాకరమైన శిక్షపడుతుంది. అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ వ్యతిరేకించేవారు తీవ్రంగా అవమానంపాలు చేయబడతారు,  వారికి పూర్వం గతించిన వారు అవమానంపాలు చేయబడిన విధంగా. మేము స్పష్టమైన ఆయతులను అవతరింపజేశాము, ఇక తిరస్కారులకు తీవ్ర అవమానంతో కూడుకున్న శిక్షపడుతుంది. అల్లాహ్ వారందరినీ మళ్లీ బ్రతికించి లేపి వారేమేమి చేసివచ్చిందీ వారికి తెలియజేసే రోజున (వారికి అవమానభరితమైన శిక్ష పడుతుంది). వారు మరచిపోయారు కాని, అల్లాహ్ వారు చేసినవన్నీ ఒక్కొక్క దానిని లెక్కబెట్టి భద్రంగా ఉంచాడు. అల్లాహ్ ప్రతి ఒక్కదానికీ సాక్షిగా ఉన్నాడు.

7 - 8 భూమీ, ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువును గురించి అల్లాహ్ కు తెలుసనే విషయం నీకు తెలియదా? ముగ్గురు వ్యక్తులు కలసి ఏవైనా మంతనాలు జరిపినప్పుడు, వారిమధ్య నాలుగోవాడుగా అల్లాహ్ కాకుండా ఉండటం అనేది ఎన్నడూ జరగదు. లేదా ఐదుగురు వ్యక్తులు కలసి మంతనాలు జరిపినప్పుడు, వారిలో ఆరో వాడుగా అల్లాహ్ కాకుండా ఉండటం అనేది కూడ ఎన్నడూ జరగదు. రహస్యాలోచనలు జరిపేవారు వీరికంటె తక్కువ మంది ఉన్నా లేక ఎక్కువమంది ఉన్నా, వారు ఎక్కడ ఉన్నా, అల్లాహ్ వారితో పాటు ఉంటాడు. తరువాత ప్రళయదినాన, ఆయన వారికి వారేమేమి చేసివచ్చారో అంతా తెలియజేస్తాడు. అల్లాహ్ ప్రతి విషయం తెలిసినవాడు. రహస్య సమాలోచనలు చేయవద్దని నిషేధించటం జరిగినప్పటికీ, తిరిగి, నిషేధించబడిన దానినే చేస్తున్న వారిని నీవు చూడలేదా? వారు రహస్యంగా, పాపమూ, దౌర్జన్యమూ ప్రవక్త పట్ల అవిధేయతలకూ సంబంధించిన విషయా లను పరస్పరం మాట్లాడుకుంటారు. వారు నీ వద్దకు వచ్చినప్పుడు, అల్లాహ్ నీకు సలామ్చేయని రీతిలో వారు నీకు సలామ్చేస్తారు. మనం చెప్పుకునే మాటలకు అల్లాహ్ మనల్ని ఎందుకు శిక్షించడు? అని వారు తమ మనస్సులలో అనుకుంటారు - వారికి నరకమే చాలు  వారు దానికే ఇంధన మవుతారు. వారి పర్యవసానం అత్యంత ఘోరమైనది.

9 - 10 విశ్వాసులారా! మీరు గనక పరస్పరం రహస్య విషయాలు మాట్లాడు కుంటే, పాపమూ, దౌర్జన్యమూ, దైవప్రవక్త పట్ల అవిధేయతలకూ సంబంధిం చిన విషయాలు కాకుండా, సత్యానికీ, దైవభీతికి సంబంధించిన విషయాలు మాట్లాడుకోండి. మీరు దేవునికి భయపడుతూ ఉండండి. పునరుత్థాన దినాన మీరు ఆయన సన్నిధిలో హాజరుకావలసి ఉంది. రహస్య మంతనాలు జరపటం షైతాను చేష్ట. విశ్వాసులకు మనస్తాపం కలిగించటానికే చేష్టచేయబడు తుంది. వాస్తవానికి  దైవాజ్ఞ  లేనిదే అది వారికి ఏమాత్రం నష్టం కలిగించ జాలదు, విశ్వాసులు అల్లాహ్నే నమ్ముకోవాలి.

11 విశ్వసించిన ప్రజలారా! మీ సమావేశాలలో (వచ్చే వారికి) చోటు కల్పించండని మీతో అన్నప్పుడు, మీరు జరిగి, చోటు కల్పించండి. అల్లాహ్ మీకు విశాలమైన చోటును ప్రసాదిస్తాడు. మిమ్మల్ని లేచివెళ్లండి అని అన్న ప్పుడు, లేచివెళ్లండి. మీలో విశ్వసించిన వారికి,  జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలు ప్రసాదిస్తాడు. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు.

12 విశ్వసించిన ప్రజలారా! మీరు దైవప్రవక్తతో ఏకాంతంలో మాట్లాడ దలిస్తే, మాట్లాడబోయేముందు, ఏదైనా కొంచెం దానం చెయ్యండి. ఇది మీ కొరకు ఉత్తమమైనది, ఎంతో పవిత్రమైనది. అయితే దానం చేయటానికి మీ వద్ద ఏమీ లేకపోతే, అప్పుడు అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అని తెలుసుకోండి.

13 మీరు ఏకాంతంలో మాట్లాడే ముందు, దానం చేయవలసి వస్తుందని భయపడ్డారా? సరే, ఒకవేళ మీరు అలా చేయకపోతే, పోనివ్వండి - అల్లాహ్ విషయంలో మిమ్మల్ని మన్నించాడు-  అందువల్ల (కనీసం) నమాజ్ను స్థాపిస్తూ ఉండండి, జకాత్చెల్లిస్తూ ఉండండి, అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు.

14 - 21 అల్లాహ్ ఆగ్రహానికి గురైన ఒక వర్గం వారిని మిత్రులుగా చేసుకున్న ప్రజలను మీరు చూడలేదా? వారు మీ మనుషులూకారు, వారి మనుషులూ కారు. వారు బుద్ధిపూర్వకంగా అసత్య విషయాలపై ప్రమాణం చేస్తారు.  అల్లాహ్ వారి కోసం కఠిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. వారు చేస్తున్నవన్నీ అతి చెడ్డ పనులు.  వారు  తమ  ప్రమాణాలను డాలుగా చేసుకుని, దాని చాటున ప్రజలను అల్లాహ్ మార్గం నుండి నిరోధిస్తున్నారు. దీనికిగాను వారికి అవమానభరితమైన శిక్షపడుతుంది. అల్లాహ్ (శిక్ష)నుండి వారిని కాపాడటానికి వారి సంపదలూ పనికిరావు,  వారి సంతానమూ ఉపయోగపడదు. వారు నరకవాసులు, అందులోనే వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారందరినీ లేపినరోజున, వారు ఆయన ముందుకూడ, మీ ముందు చేసినట్లే ప్రమాణాలు చేస్తారు. దీనివల్ల తమ పని కొంత నెరవేరుతుందని వారు అనుకుంటారు. బాగా తెలుసుకోండి, వారు పరమ అసత్యవాదులు. షైతాను వారిని ఆవహించి ఉన్నాడు, వారు తమ హృదయాలలో దేవుని సంస్మరణను మరచిపోయేలా జేశాడు. వారు షైతాన్పక్షానికి చెందినవారు. జాగ్రత్త! షైతాన్పక్షంవారే నష్టానికి గురిఅయ్యేవారు.  నిశ్చయంగా అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ వ్యతిరేకించేవారు నీచాతి నీచమైన సృష్టికి చెందినవారు. నేనూ, నా ప్రవక్త మాత్రమే ఆధిక్యం వహించితీరుతాము అని అల్లాహ్ వ్రాసేపెట్టాడు. నిజానికి అల్లాహ్ సర్వశక్తిమంతుడు, సర్వాధికుడూను.

22 అల్లాహ్నూ, పరలోకాన్నీ విశ్వసించేవారు, అల్లాహ్నూ ఆయన ప్రవక్తనూ వ్యతిరేకించే  వారిని  ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. వ్యతిరేకించేవారు వారి తల్లిదండ్రులైనా, వారి కుమారు లైనా, వారి సోదరులైనా సరే లేదా వారి కుటుంబీకులైనా సరే. వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు, తన తరఫునుండి ఒక ఆత్మను ప్రసాదించి వారికి బలాన్ని ఇచ్చాడు. ఆయన వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింప జేస్తాడు.   వనాలలో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు,  వారు అల్లాహ్ పట్ల సంతుష్టి చెందారు. వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. జాగ్రత్త! అల్లాహ్ పక్షం వారే సఫలీకృతులయ్యేవారు.

No comments:

Post a Comment