26. అష్
షుఅరా
ఆయతులు
: 227 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
26. అష్
షుఅరా 1
- 2 తా. సీన్. మీమ్. ఇవి స్పష్టమైన గ్రంథంలోని వాక్యాలు.
26. అష్
షుఅరా 3
- 6 ప్రవక్తా! వారు విశ్వసించరు అని ద్ణుఖపడుతూ, బహుశా నీవు నీ ప్రాణాలను కోల్పోతావేమో, మేము కోరితే ఆకాశం నుండి ఒక సూచనను దించి దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం. కరుణామయుని తరఫు నుండి వారి వద్దకు ఏ కొత్త ఉపదేశం వచ్చినా, దానికి వారు విముఖులే అవుతారు.
ఇపుడు వారు తిరస్కరించారు కాబట్టి, త్వరలోనే వారికి, వారు ఎగతాళి చేస్తూ వచ్చిన విషయమందలి యధార్థమేమిటో (విభిన్న రూపాలలో) తెలుస్తుంది.
26. అష్
షుఅరా 7
- 9 వారు ఎన్నడూ తమ దృష్టిని భూమి వైపునకు మళ్లించలేదా మేము దానిపై ఎంత పుష్కలంగా శ్రేష్ఠమైన రకరకాల చక్కని వృక్ష సంపదను సృష్టిం చామో? నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది. కాని వారిలో అనేకులు విశ్వసించరు. వాస్తవం ఏమిటంటే నీ ప్రభువు శక్తిమంతుడే కాదు, కరుణా మయుడు కూడా.
26. అష్
షుఅరా 10
- 17 నీ ప్రభువు మూసాను ఇలా ఆదేశించినప్పటి గాధను వారికి విని పించు, ‘‘దుష్టులైన ఫిరౌను జాతి ప్రజల వద్దకు వెళ్ళు- వారు భయపడరా?’’ అతడు ఇలా విన్నవించుకున్నాడు, ‘‘నా ప్రభూ! వారు నన్ను అసత్యవాది అని తిరస్కరిస్తారేమో అని నా భయం. నా హృదయం కుంచించుకు పోతోంది.
నేను ధారాళంగా మాట్లాడలేను. కనుక నీవు హారూన్ను ప్రవక్త పదవిలో నియమించు. నా మీద వారు ఒక నేరాన్ని కూడ మోపారు. ఈ కారణంగా నన్ను వారు హత్య చేస్తారేమో
అని నేను భయ పడుతున్నాను.’’ ఇలా సెలవిచ్చాడు, ‘‘అలా ఎంతమాత్రం జరగదు. మీరు ఉభయులూ నా సూచన లను తీసుకుని వెళ్లండి. మేము
మీతో పాటు అంతా వింటూ ఉంటాము. ఫిరౌను వద్దకు వెళ్లి అతనితో ఇలా అనండి
- నీవు ఇస్రాయీల్ సంతతి వారిని మాతో పంపు. ఇందుకే సకల లోకాల ప్రభువు మమ్మల్ని (నీ వద్దకు) పంపాడు.’’
26. అష్
షుఅరా 18
- 31 ఫిరౌను ఇలా అన్నాడు, ‘‘మేము నిన్ను బాల్యంలో మా ఇంట్లో పెంచలేదా?
నీవు నీ వయస్సులోని ఎన్నో సంవత్సరాల కాలం మా వద్ద గడిపావు. దాని తరువాత చేసిందేదో చేశావు. నీవు మిక్కిలి కృతఘ్నుడవు.’’ మూసా ఇలా సమాధానం చెప్పాడు, ‘‘అప్పుడు నేను ఆ పనిని పొరపాటు వల్ల చేశాను. తరువాత నేను మీకు భయపడి పారిపోయాను. ఆ తరువాత నా ప్రభువు నాకు వివేకాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించాడు, నన్ను సందేశహరులలో చేర్చుకున్నాడు. పోతే ఇక నీవు నాకు ఉపకారం చేసి ఎత్తిపొడుస్తూ ఉన్న విషయం, దాని యధార్థం ఏమిటంటే, నీవు ఇస్రాయీలు సంతతి వారిని బానిసలుగా చేసుకున్నావు.’’ ఫిరౌను ఇలా అన్నాడు, ‘‘ఈ సకల లోకాల ప్రభువు ఏమిటి?’’ దానికి మూసా, ‘‘ఆకాశాలకూ, భూమికీ ప్రభువు, భూమ్యా కాశాల మధ్య ఉన్న సమస్తానికీ ప్రభువు, నీవు (దేవుణ్ణి) నమ్మేవాడివే అయితే’’ అని జవాబు చెప్పాడు. ఫిరౌను తన చుట్టూ ఉన్న వారితో, ‘‘వింటున్నారా?’’ అని అన్నాడు. మూసా ఇలా అన్నాడు, ‘‘ఆయనే మీ ప్రభువు కూడ, పూర్వం గతించిన మీ తాతముత్తాతల ప్రభువు కూడా.’’ ఫిరౌను (అక్కడి వారితో) ఇలా అన్నాడు, ‘‘మీ వద్దకు పంపబడిన మీ దైవప్రవక్త గారు పూర్తిగా పిచ్చి వారుగా కనిపిస్తున్నారు.’’ మూసా ఇంకా ఇలా అన్నాడు, ‘‘తూర్పుకూ, పడమరకూ, వాటి మధ్య ఉన్న
సర్వానికి ప్రభువు
మీరు వివేకం కలవారే అయితే.’’ ఫిరౌను ఇలా అన్నాడు, ‘‘నీవు నన్ను కాదని మరెవరినైనా ఆరాధ్యు డుగా చేసుకుంటే, నిన్ను కూడ జైళ్ళల్లో పడి మ్రగ్గిపోతున్న వారిలో చేరుస్తాను.’’ మూసా ఇలా అన్నాడు,
‘‘నేను నీ ముందుకు ఒక స్పష్టమైన విషయాన్ని తీసుకువచ్చిన తరువాత
కూడానా?’’ దానికి ఫిరౌన్, ‘‘మంచిది తీసుకురా, నీవు సత్యవాదివే అయితే’’ అని అన్నాడు.
26. అష్
షుఅరా 32
- 33 (అతడు ఈ మాట అన్నంతనే) మూసా తన చేతికర్రను విసిరాడు
వెంటనే స్పష్టంగా అదొక పెద్ద పామైపోయింది. తరువాత అతను తన చేతిని (చంకనుండి) లాగాడు. అది చూపరుల ముందు మెరిసిపోసాగింది.
26. అష్
షుఅరా 34
- 40 ఫిరౌను తన చుట్టూ ఉన్న సర్దారులతో ఇలా అన్నాడు, ‘‘ఈ వ్యక్తి నిజంగానే చేయి తిరిగిన మంత్రగాడు.
తన మంత్రబలం ద్వారా మిమ్మల్ని మీ దేశం నుడి తరిమివేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి మీ ఆజ్ఞ ఏమిటో?’’ వారు ఇలా అన్నారు, ‘‘అతనినీ, అతని సోదరుణ్ణీ ఆపి ఉంచండి, పట్టణాలలోకి వార్తాహరులను పంపండి, నేర్పరులైన మంత్రగాళ్లను మీ వద్దకు తీసుకు రమ్మనండి.’’ ఆ విధంగా ఒకనాడు నిర్ణీత సమయానికి మంత్రగాళ్లు సమావేశపరచబడ్డారు. ప్రజలకు ఇలా చెప్పబడిరది, ‘‘మీరు సభకు వస్తు న్నారా? మంత్రగాళ్లు గెలిస్తే, బహుశా మనం వారి ధర్మాన్నే అనుసరించవచ్చు.’’
26. అష్
షుఅరా 41
- 51 మంత్రగాళ్లు రంగంలోకి దిగినప్పుడు, ఫిరౌనుతో ఇలా అన్నారు, ‘‘మేము గెలిస్తే, మాకు బహుమానం దొరుకుతుంది కదా?’’ అతడు,
‘‘అవును. అప్పుడు మీరు నా సన్నిహితులలో చేరిపోతారు’’ అని అన్నాడు. అప్పుడు మూసా,
‘‘విసరండి, మీరు విసరదలచుకున్న దానిని’’ అని అన్నాడు. వారు వెంటనే తమ త్రాళ్లనూ చేతికర్రలనూ విసిరి, ‘‘ఫిరౌను ఔన్నత్యం సాక్షిగా! మేమే విజయం సాధిస్తాము’’ అని అన్నారు. తరువాత మూసా తన చేతి కర్రను విసిరినప్పుడు, అది అకస్మాత్తుగా వారి బూటకపు మహిమలను కబళింపసాగింది. అప్పుడు మాంత్రికులందరూ అమాంతంగా సజ్దాలో పడిపోయారు. ఇలా అన్నారు, ‘‘విశ్వసించాము మేము, సకల లోకాల ప్రభువును- మూసా, హారూన్ల ప్రభువును.’’ ఫిరౌను ఇలా అన్నాడు, ‘‘నేను మీకు అనుమతి ఇవ్వకముందే మీరు మూసా మాటను విశ్వసించారా? నిస్సందేహంగా ఇతడు మీకు గురువు, మీకు మంత్రవిద్యను నేర్పాడు. సరే మంచిది,
ఇప్పుడే మీరు తెలుసుకుంటారు. నేను మీ చేతులను, కాళ్లను అభిముఖదిశలలో నరికివేస్తాను, మీ అందరినీ శిలువపైకి ఎక్కిస్తాను.’’ దానికి వారు ఇలా పలికారు, ‘‘ఏమీ పర్వాలేదు, మేము మా ప్రభువు సాన్నిధ్యానికి చేరుకుంటాము. మా ప్రభువు మా పాపాలను క్షమిస్తాడని మేము ఆశిస్తు న్నాము. ఎందుకంటే, అందరికంటే ముందు మేమే విశ్వసించాము.’’
26. అష్
షుఅరా 52
- 59 ‘‘రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని వెళ్లిపో. మిమ్మల్ని తప్పక వెంటాడటం జరుగుతుంది’’ అని మేము మూసాకు వహీ పంపాము. తరువాత ఫిరౌన్ (సైన్యాన్ని సమాయత్తపరిచే నిమిత్తం) పట్టణాలలోకి వార్తాహరులను పంపి ఇలా ప్రకటన చేయించాడు, ‘‘వీరు గుప్పెడు మంది మాత్రమే, మాకు చాల కోపం తెప్పించారు. మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే లక్షణం గల జాతి ప్రజలం.’’ ఈవిధంగా మేము వారిని తమ తోటల నుండీ, చెలమల నుండీ, ఖజానాల నుండీ,
మహోన్నతమైన వారి నివాస స్థలాల నుండీ బయటికి తీసుకువచ్చాము. వారి విషయంలో ఇలా జరిగింది. (రెండో వైపు) ఇస్రాయీల్ సంతతి వారిని మేము వీటన్నిటికీ వారసులుగా చేశాము.
26. అష్
షుఅరా 60
- 66 తెల్లవారుతూ ఉండగా, వీరు వారిని వెంటాడసాగారు. ఇరు పక్షాలవారు ఒకరికొకరు ఎదురు పడినప్పుడు, మూసా సహచరులు, ‘‘మేము పట్టుబడ్డాము’’ అని కేకవేశారు. మూసా, ‘‘అలా ఎంతమాత్రం జరగదు. నా ప్రభువు నాతో ఉన్నాడు. తప్పకుండా ఆయన నాకు మార్గం చూపుతాడు’’ అని అన్నాడు. మేము మూసాను, ‘‘నీ చేతికర్రతో సముద్రాన్ని కొట్టు’’ అని వహీ ద్వారా ఆజ్ఞాపించాము. అప్పుడు హఠాత్తుగా సముద్రం చీలిపోయింది.
దాని ప్రతి భాగం ఒక మహోన్నతమైన పర్వతం మాదిరిగా అయిపోయింది.
ఆ చోటికే మేము రెండో వర్గం వారిని కూడ చేర్చాము. మూసానూ, అతనితో ఉన్న వారందరినీ మేము రక్షించాము. మిగతా వారి నందరినీ ముంచివేశాము.
26. అష్
షుఅరా 67
- 68 ఈ సంఘటనలో ఒక సూచన ఉన్నది. కాని వారిలో చాలామంది విశ్వసించరు. యధార్థమేమిటంటే, నీ ప్రభువు మహాశక్తిమంతుడు, అనంత కరుణామయుడు.
26. అష్
షుఅరా 69
- 89 ఇంకా వారికి ఇబ్రాహీము గాధను వినిపించు, అప్పుడు అతను తన తండ్రినీ, తన జాతి వారినీ, ‘‘మీరు వేటిని పూజిస్తున్నారు?’’ అని అడిగాడు. వారు, ‘‘ఇవి కొన్ని విగ్రహాలు, వాటిని మేము పూజిస్తాము. వాటి సేవలోనే మేము నిమగ్నులమై ఉంటాము’’ అని జవాబు పలికారు. అతను వారిని ఇలా అడిగాడు, ‘‘మీరు వీటిని పిలిచినప్పుడు, ఇవి మీ మొర ఆలికిస్తాయా? లేదా ఇవి మీకేమైనా లాభాన్నిగానీ, నష్టాన్నిగానీ కలిగిస్తాయా?’’ వారు ఇలా అన్నారు, ‘‘లేదు, కాని మేము మా తాతముత్తాతలు ఇలా చేస్తూ ఉండగా చూశాము.’’ అప్పుడు ఇబ్రాహీము ఇలా అన్నాడు, ‘‘మీరూ, పూర్వం మీ తాతముత్తాతలూ పూజిస్తూ వస్తున్న వాటిని ఎప్పుడైనా మీరు (కళ్లు తెరచి) చూశారా?
నాకు ఇవన్నీ శత్రువులే, ఒక్క సకల లోకాల ప్రభువు తప్ప. ఆయన నన్ను సృష్టించాడు. తరువాత ఆయనే నాకు మార్గం చూపుతున్నాడు. ఆయనే నాకు తినిపిస్తాడు, త్రాగిస్తాడు. నేను వ్యాధికి గురి అయినప్పుడు, ఆయనే నాకు స్వస్థతను చేకూరుస్తాడు. ఆయనే నాకు మృత్యువును కలిగిస్తాడు. తరువాత మళ్లీ నాకు జీవితాన్ని అనుగ్రహిస్తాడు. తీర్పు దినం నాడు నా పాపాలను క్షమిస్తాడని
నేను ఆయన మీద ఆశలు పెట్టుకున్నాను.’’ (దీని తరువాత ఇబ్రాహీమ్ ఇలా ప్రార్థించాడు): ‘‘నా ప్రభూ! నాకు వివేకాన్ని ప్రసాదించు,
నన్ను సజ్జనులలో కలుపు. తరువాత తరాల వారిలో నాకు మంచి పేరు ప్రసాదించు. నన్ను సుఖసౌఖ్యాల స్వర్గవనానికి వారుసులైన వారిలో చేర్చు. నా తండ్రిని క్షమించు. నిస్సందేహంగా ఆయన మార్గం తప్పిన వారిలోని వాడే. మానవులందరూ బ్రతికింపబడే రోజున నన్ను అవమానం పాలుజేయకు. అప్పుడు సంపదవల్లగానీ, సంతానం వల్లగానీ ఏ లాభమూ కలగదు
ఏ వ్యక్తి అయినా మంచి మనస్సుతో అల్లాహ్ సాన్ని ధ్యంలో హాజరైతే తప్ప.’’
26. అష్
షుఅరా 90
- 102 (ఆ రోజున) స్వర్గం భయభక్తులు కలవారి దగ్గరకు తీసుకు రాబడుతుంది. నరకం మార్గం
తప్పిన వారి ముందు తెరువబడుతుంది. వారిని ఇలా అడగటం జరుగుతుంది,
‘‘అల్లాహ్ ను వదలిపెట్టి, మీరు ఆరాధించేవారు ఇప్పుడెక్కడున్నారు? వారు మీకేమైనా సహాయం చేస్తున్నారా? లేదా తమను తాము రక్షించుకోగలరా?’’ తరువాత ఆ దేవుళ్లూ, మార్గం తప్పిన ఈ మానవులూ, ఇబ్లీస్ సైన్యమూ, అందరూ దానిలోకి ఒకరి మీద ఒకరు పడేటట్లుగా త్రోయబడతారు. అక్కడ వారందరూ పరస్పరం పోట్లాడు కుంటారు. మార్గం తప్పిన ఈ మానవులు (తమ దేవుళ్లతో) ఇలా అంటారు, ‘‘దేవుని సాక్షిగా! సకల లోకాల ప్రభువుతో సమానమైన స్థానాన్ని మీకు ఇచ్చి నప్పుడు మేము స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురిఅయ్యాము. మమ్మల్ని మార్గం తప్పించినవారు నిజంగానే అపరాధులు. ఇప్పుడు మాకు సిఫారసు చేసేవాడు గానీ, ప్రాణ స్నేహితుడుగానీ, ఎవడూ లేడు. అయ్యో! ఒకసారి మళ్లీ మరలివెళ్లే అవకాశం మాకు దొరికితే, మేము తప్పకుండా విశ్వాసులమవుతాము.’’
26. అష్
షుఅరా 103
- 104 నిశ్చయంగా ఇందులో ఒక గొప్ప సూచన ఉన్నది. కాని వారిలో అత్యధికులు విశ్వసించరు. యథార్థమేమిటంటే, నీ ప్రభువు అత్యంత శక్తిమంతుడు, కరుణామయుడూను.
26. అష్
షుఅరా 105
- 120 నూహు జాతి వారు దైవప్రవక్తలను తిరస్కరించారు. అప్పుడు వారి సోదరుడు నూహు వారితో (ఇలా) అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ‘‘మీరు భయపడరా? నేను మీ కొరకు ఒక విశ్వసనీయుడైన సందేశహరుడను. కనుక మీరు అల్లాహ్ కు భయపడండి, విధేయత చూపండి. నేను ఈ పనికిగాను మీ నుండి ఏ ప్రతిఫలాన్నీ కోరను. నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది సకల లోకాల ప్రభువు బాధ్యత. కనుక మీరు అల్లాహ్ కు భయపడండి, (నిస్సం కోచంగా) నాకు విధేయత చూపండి.’’ వారు ఇలా జవాబు పలికారు, ‘‘ఏమిటీ, మేము నిన్ను విశ్వసించాలా? వాస్తవానికి అధములైన వారే నిన్ను అనుసరి స్తున్నారు.’’ దానికి నూహ్ ఇలా అన్నాడు, ‘‘వారు చేసే పనులెలాంటివో నాకేమి తెలుసు? వారి లెక్క చూడటం నా ప్రభువు బాధ్యత. అయ్యో! మీరు కొంచెం
తెలివిగా వ్యవహరిస్తే ఎంత బాగుంటుంది. విశ్వసించిన వారిని గెంటివేయడం నా పని కాదు. నేను కేవలం స్పష్టంగా హెచ్చరికచేసే వ్యక్తిని మాత్రమే.’’ వారు దానికి, ‘‘ఓ నూహ్! ఒకవేళ నీవు దీనిని మానుకోకపోతే, తప్పక శాపగ్రస్తులలో చేరిపోతావు’’ అని అన్నారు. నూహ్ ఇలా ప్రార్థించాడు, ‘‘ఓ నా ప్రభూ! నా జాతివారు నేను అసత్యవాదినని నన్ను తిరస్కరించారు. ఇక నాకూ వారికీ మధ్య స్పష్టమైన తీర్పు చెయ్యి. నన్నూ, నాతోపాటు ఉన్న విశ్వాసులనూ కాపాడు.’’ చివరకు మేము అతన్నీ, అతని సహచరులనూ ఒక నిండు పడవలో రక్షించాము. దాని తరువాత మిగతా వారినందరినీ ముంచివేశాము.
26. అష్
షుఅరా 121
- 122 నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది. కాని వారిలో చాలామంది విశ్వసించరు. యథార్థమేమిటంటే, నీ ప్రభువు మహాశక్తిమంతుడు, అత్యంత కరుణామయుడు.
26. అష్
షుఅరా 123
- 139 ... ఆద్ జాతి దైవప్రవక్తలను తిరస్కరించింది. వారి సోదరుడు హూద్ వారితో ఇలా అన్నప్పటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ‘‘మీరు భయ పడరా? నేను మీ కొరకు ఒక విశ్వసనీయుడైన దైవప్రవక్తను. కనుక మీరు అల్లాహ్ కు భయపడండి, విధేయత చూపండి. నేను ఈ పనికి మిమ్మల్ని ఏ ప్రతిఫలమూ కోరను. నాకు ప్రతిఫలం ఇవ్వటం అనేది సకల లోకాల ప్రభువు బాధ్యత. ఏమిటీ మీ వ్యవహారం, ఎత్తుగా ఉన్న ప్రతి స్థలం మీదా ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తున్నారు, మీరిక్కడే శాశ్వతంగా ఉండిపోతారనే విధంగా పెద్ద పెద్ద భవనాలను కడుతున్నారు? మీరు ఎవరినైనా పట్టుకుంటే, దౌర్జన్యపరులై పట్టుకుంటారు. కనుక మీరు అల్లాహ్ కు భయ పడండి. నా యెడల విధేయత చూపండి. ఆయనకు భయపడండి. ఆయనే మీకు తెలిసినవన్నీ ప్రసాదించాడు. మీకు పశువులు ఇచ్చాడు, సంతానం అనుగ్రహించాడు, తోటలు ప్రసాదించాడు, చెలమలు ఇచ్చాడు. ఒక మహా దినపు శిక్ష మీకు పడుతుందని నేను భయపడుతున్నాను.’’ వారు ఇలా సమా ధానం చెప్పారు, ‘‘నీవు బోధించినా, బోధించకపోయినా, మాకు అంతా ఒకటే. ఈ విషయాలు పూర్వం నుండీ ఇలానే జరుగుతూ వచ్చాయి. మేము శిక్షకు గురిఅయ్యే వారం మాత్రం కాము.’’ చివరకు వారు అతనిని తిరస్కరించారు. మేము వారిని నాశనం చేశాము.
26. అష్
షుఅరా ....
139 - 140 నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది. కాని వారిలో చాలమంది విశ్వసించరు. యథార్థమేమిటంటే నీ ప్రభువు అత్యంత శక్తి మంతుడు, అపార కరుణామయుడూను.
26. అష్
షుఅరా 141
- 158 ... సమూద్ జాతి దైవప్రవక్తలను తిరస్కరించింది. వారి సోదరుడు సాలెహ్ వారికి ఇలా చెప్పిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ‘‘ఏమిటీ మీరు భయపడరా? నేను మీ కొరకు (వచ్చిన) ఒక విశ్వసనీయుడనైన దైవప్రవక్తను. కనుక మీరు అల్లాహ్ కు భయపడండి. నా యెడల విధేయత చూపండి. నేను ఈ పనికై మీ నుండి ఏ ప్రతిఫలాన్నీ కోరను. నా ప్రతిఫలం సకల లోకాల ప్రభువు బాధ్యత. ఇక్కడున్న ఈ వస్తువుల మధ్య మిమ్మల్ని ఇలానే ప్రశాంతంగా ఉండనివ్వటం జరుగుతుందను కుంటున్నారా, ఈ తోటలలో, ఈ జలధారల మధ్య? ఈ పొలాలలో మాగిన పండ్ల గుత్తులు గల ఈ ఖర్జూరపు చెట్లనడుమ? మీరు కొండలను తొలిచి విర్రవీగుతూ వాటిలో భవనాలను నిర్మిస్తారు. అల్లాహ్ కు భయపడండి, నా యెడల విధేయత చూపండి. హద్దులు మీరే వారి పట్ల విధేయత చూపకండి
వారు భూమిలో ఉపద్రవాన్ని సృష్టిస్తారు. ఏ సంస్కరణనూ చేపట్టరు.’’ వారు జవాబుగా ఇలా అన్నారు, ‘‘నీవు చేతబడి చేయబడిన ఒక వ్యక్తివి మాత్రమే. నీవు మా వంటి ఒక మానవుడవు తప్ప మరేమీ కావు. నీవు సత్యవంతుడవే అయితే, ఏదైనా సూచనను తీసుకురా.’’ సాలిహ్ ఇలా అన్నాడు, ‘‘ఇదిగో ఈ ఒంటెను చూడండి. ఒకరోజు అది నీళ్లు త్రాగుతుంది, ఒక రోజు మీరందరూ నీళ్లు తోడుకుంటారు. ఆ ఒంటెకు ఏమాత్రం హాని కలిగించకండి. అలాచేస్తే, ఒక మహాదినపు శిక్ష మిమ్మల్ని చుట్టుముట్టుతుంది.’’ కాని వారు దాని వెనుక కాలి పెద్ద నరాన్ని కోసివేశారు. చివరకు విచారపడుతూ ఉండిపోయారు. శిక్ష వారిని పట్టుకుంది.
26. అష్
షుఅరా ....
158 - 159 నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది. కాని వారిలో అధికులు విశ్వసించరు. యథార్థమేమిటంటే, నీ ప్రభువు శక్తిమంతుడు, కరుణామయుడు.
26. అష్
షుఅరా 160
- 173 లూత్ జాతి దైవప్రవక్తలను తిరస్కరించింది. వారి సోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ‘‘మీరు భయపడరా? నేను మీ కొరకు (వచ్చిన) ఒక విశ్వసనీయుడనైన దైవప్రవక్తను. కనుక మీరు అల్లాహ్ కు భయపడండి. నా యెడల విధేయత చూపండి. నేను ఈ పనికై మీ నుండి ఏ ప్రతిఫలాన్నీ కోరను. నా ప్రతిఫలం సకల లోకాల ప్రభువు బాధ్యత. మీరు ప్రపంచంలోని ప్రాణులలో పురుషుల వద్దకు పోతారేమిటి, మీ ప్రభువు మీ భార్యలలో మీకై సృష్టించిన దానిని విడిచి పెడుతున్నారేమిటి? మీరు హద్దులన్నీ అతిక్రమించారు.’’ వారు ఇలా అన్నారు, ‘‘ఓ లూత్! నీవు ఈ మాటలు మానుకోకపోతే, మా
నగరాల నుండి గెంటి వేయబడిన వారిలో నీవు కూడ తప్పక చేరిపోతావు.’’ అతను ఇలా అన్నాడు, ‘‘మీ చేష్టలకు కుమిలిపోయేవారిలో నేనూ ఉన్నాను. ఓ ప్రభూ! నన్నూ, నా కుటుంబసభ్యులనూ వారి అశ్లీల చేష్టల నుండి కాపాడు.’’ చివరకు మేము అతనినీ, అతని కుటుంబ సభ్యులందరినీ కాపాడాము. వెనుకనే ఉండిపోయిన వారిలోని ఒక ముసలి స్త్రీని తప్ప.
తరువాత మిగిలిపోయిన వారిని మేము నాశనం చేశాము, వారిపై ఒక వర్షాన్ని కురిపించాము, అతి భయంకరమైన వర్షాన్ని. అది హెచ్చరింపబడిన వారిపై అవతరించింది.
26. అష్
షుఅరా 174
- 175 నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది. అయితే వారిలో చాలామంది విశ్వసించరు. యథార్థమేమిటంటే నీ ప్రభువు మహాశక్తిమంతుడు, అనంత కరుణామయుడు.
26. అష్
షుఅరా 176
- 189 ‘అయ్కహ్’ ప్రజలు దైవప్రవక్తలను తిరస్కరించారు. అప్పుడు షుఐబ్ వారితో ఇలా అన్న విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ‘‘మీరు భయపడరా? నేను మీ కొరకు (వచ్చిన) ఒక విశ్వసనీయుడనైన దైవప్రవక్తను. కనుక మీరు అల్లాహ్ కు భయపడండి. నా యెడల విధేయత చూపండి. నేను ఈ పనికై, మీనుండి ఏ ప్రతిఫలాన్నీ కోరను. నా ప్రతిఫలం సకల లోకాల ప్రభువు బాధ్యత. కొలపాత్రలను పూర్తిగా నింపండి, ఎవరికీ తక్కువ చేసి ఇవ్వకండి. సరిjైున తరాజుతో తూయండి. ప్రజలకు వారి వస్తువులను తక్కువ జేసి ఇవ్వకండి. భూమిపై కల్లోలాన్ని వ్యాపింపజేస్తూ తిరగకండి
మిమ్మల్నీ, మీకు పూర్వపు తరాల వారినీ సృష్టించిన ఆయనకు భయపడండి. వారు ఇలా అన్నారు, ‘‘నీవు కేవలం చేతబడి చేయబడిన ఒక వ్యక్తివి. నీవు ఏమీ కావు, మా వంటి
ఒక మానవుడవు తప్ప. మేము నిన్ను అసత్యవాదిగా పరిగణిస్తున్నాము. నీవు
సత్యవంతుడవే అయితే, ఆకాశపు తునకను దేని నయినా మా మీద పడేలా చేయి.’’ షుఐబ్ ఇలా అన్నాడు, ‘‘నా ప్రభువుకు మీరు చేస్తున్నదంతా తెలుసు.’’ వారు అతనిని తిరస్కరించారు. చివరకు ఛత్రదినపు శిక్ష వారిపైకి వచ్చిపడిరది. అది అతి భయంకరమైన దినపు శిక్ష.
26. అష్
షుఅరా 190
- 191 నిశ్చయంగా ఇందులో ఒక సూచన ఉన్నది. అయితే వారిలో అత్యధికులు విశ్వసించరు. యథార్థమేమిటంటే, నీ ప్రభువు శక్తిమంతుడు కూడ, కరుణామయుడు కూడ.
26. అష్
షుఅరా 192
- 203 ఇది సకల లోకాల ప్రభువు అవతరింపజేసినది. దీనిని తీసుకుని విశ్వసనీయమైన ఆత్మ నీ హృదయ ఫలకంపై అవతరించింది. స్వచ్ఛమైన అరబ్బీ భాషలో (దేవుని తరఫున దైవసృష్టికి) హెచ్చరిక చేసేవారిలో
నీవు చేరిపోవాలని. పూర్వీకుల గ్రంథాలలో కూడ ఇది ఉన్నది. దీనిని ఇస్రాయీలు సంతతి వారి విద్వాంసులు ఎరుగుదురనే విషయం వారికి (మక్కావాసులకు) ఏ సూచనా కాదా? (వారి మంకుపట్టు ఎలా ఉందంటే) ఒకవేళ మేము దీనిని ఏ అరబ్బీయేతరుని పైనయినా అవతరింపజేసి ఉంటే, దీనిని (శిష్ట అరబ్బీ గ్రంథాన్ని) అతడు వారికి చదివి వినిపించినప్పుడు కూడ వారు విశ్వ సించేవారు కారు. ఇదేవిధంగా మేము దీనిని (ఖురాన్ను) అపరాధుల హృదయాలలోకి చొచ్చుకుపోయేలా చేశాము. వ్యధాభరితమైన శిక్షను చూడనంత వరకు వారు దీనిని విశ్వసించరు. తరువాత అనూహ్య స్థితిలో అది వారిపైకి అకస్మాత్తుగా వచ్చిపడినప్పుడు వారు, ‘‘ఇప్పుడు మాకు కొంచెం గడువేమైనా దొరుకుతుందా?’’ అని అంటారు.
26. అష్
షుఅరా 204
- 207 అయితే వారు మేము విధించే శిక్షకై తొందరపడుతున్నారా? దీనిని గురించి నీవేమైనా ఆలోచించావా? ఒకవేళ మేము వారికి ఏళ్లతరబడి విలాస జీవితం గడిపే వ్యవధిని ఇచ్చినా, వారిని దేన్ని గురించి భయపెట్టటం జరుగుతూ వచ్చిందో, అదే తరువాత వారిపైకి వచ్చిపడినపుడు, వారికి లభించిన జీవిత సామగ్రి వారికి దేనికి పనికి వస్తుంది?
26. అష్
షుఅరా 208
- 209 (చూడు) హితబోధ బాధ్యతను నిర్వహించేందుకు హెచ్చరిక చేయువారు లేకుండానే మేము ఎన్నడూ, ఏ నగరాన్నీ నాశనం చేయలేదు. మేము అన్యాయపరులము కాము.
26. అష్
షుఅరా 210
- 212 దీనిని (సుబోధకమైన గ్రంథాన్ని) తీసుకుని కిందికి దిగినవారు షైతానులు కారు, ఈ పని వాటికి యుక్తమైనదీ కాదు, అవి అలా చేయనూ లేవు. దీనిని వినే విషయంలో కూడ అవి దూరంగా ఉంచబడ్డాయి.
26. అష్
షుఅరా 213
- 220 కనుక ప్రవక్తా! అల్లాహ్తో పాటు మరొక దేవుణ్ణి ఎవడినీ వేడుకోకు. అలా చేస్తే నీవు కూడ శిక్షింపబడేవారిలో చేరిపోతావు. నీ దగ్గరి బంధువులను భయపెట్టు.
విశ్వాసులలో నిన్ను అనుసరించే వారిపట్ల మృదువుగా మెలుగు. కాని ఒకవేళ వారు నీ పట్ల అవిధేయత చూపితే, అపుడు వారితో, ‘‘మీరు చేస్తున్న దానికి నేను బాధ్యుడను కాను’’ అని అను. మహాశక్తిమంతుడైన ఆ అనంతకరుణామయుడిపై భారం మోపు. ఆయన నిన్ను, నీవు లేచినపుడు చూస్తాడు, సజ్దా చేసేవారిలో నీ రాకపోకలను గమనిస్తాడు. ఆయన అన్నీ వింటాడు, అన్నీ తెలిసినవాడు.
26. అష్
షుఅరా 221
- 223 ప్రజలారా! షైతానులు ఎవరిపై దిగుతాయో నేను మీకు తెలుపనా? అవి వంచకుడైన ప్రతి దుర్మార్గుడిపై దిగుతాయి. గాలి వార్తలను చెవులలో ఊదుతాయి
వాటిలో అబద్ధాలు చెప్పేవే ఎక్కువ.
26. అష్ షుఅరా 224 - 227 ఇక కవులు. వారి వెనుక మార్గభ్రష్టులే నడుస్తూ ఉంటారు. వారు ప్రతి లోయలో దారి తప్పటాన్నీ, తాము ఆచరించని దానిని చెప్పటాన్నీ నీవు చూడటం లేదా? - విశ్వసించి మంచి పనులు చేసేవారూ, అల్లాహ్ ను అమితంగా స్మరించేవారూ, తమకు అన్యాయం జరిగినప్పుడు, కేవలం ప్రతిగా చర్యతీసుకునే వారూ తప్ప - అన్యాయం చేసేవారికి త్వరలోనే తెలిసిపోతుంది, వారు ఏ పర్యవసానానికి గురిఅవుతారో.
No comments:
Post a Comment