35. ఫాతిర్
ఆయతులు
: 45 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
35. ఫాతిర్ 1 - 2 అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన ఆకాశాలనూ, భూమినీ సృష్టించాడు. ఆయన దైవదూతలను సందేశహరులుగా నియమిస్తాడు. (ఎటువంటి దైవదూతలంటే) వారికి రెండేసి, మూడేసి, నాలుగేసి బాహువులు ఉంటాయి. ఆయన తన సృష్టి స్వరూపాన్ని తన ఇష్ట ప్రకారం పెంచుతాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్యద్వారాన్ని తెరిచినా, దానిని అడ్డుకునే వాడెవ్వడూ లేడు. ఆయన మూసివేసిన దానిని అల్లాహ్ తరువాత మళ్ళీ తెరిచేవాడూ ఎవ్వడూ లేడు. ఆయన శక్తిమంతుడు, వివేచన కలవాడు.
35. ఫాతిర్ 3 - 4 మానవులారా! అల్లాహ్ మీకు చేసిన ఉపకారాలను జ్ఞాపకం ఉంచుకోండి. అల్లాహ్ కాక, భూమ్యాకాశాల నుండి మీకు ఉపాధినిచ్చే మరొక సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా - ఆయన తప్ప మరొక ఆరాధ్యుడెవ్వడూ లేడు. అసలు మీరు ఎవని వల్ల మోసపోతున్నారు? ఇప్పుడు ఒకవేళ (ప్రవక్తా) వారు నిన్ను తిరస్కరిస్తున్నారు అంటే (ఇది క్రొత్త విషయమేమీ కాదు). నీకు పూర్వం కూడా చాలామంది దైవప్రవక్తలు తిరస్కరించబడ్డారు. వ్యవహారాలన్నీ చివరకు అల్లాహ్ వైపునకే మరలనున్నాయి.
35. ఫాతిర్ 5 - 7 మానవులారా! నిశ్చయముగా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది. కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసానికి గురిచేయకూడదు. ఆ మహావంచకుడు కూడా మిమ్మల్ని అల్లాహ్ విషయంలో మోసగించగలగకూడదు. యథార్థానికి షైతాను మీకు శత్రువు. కనుక మీరు కూడా వాడు మీ శత్రువే అని భావించండి.
వాడు, తన అనుచరులు నరక వాసులలో చేరిపోవాలని వారిని తన మార్గం వైపునకు పిలుస్తున్నాడు, అవిశ్వాసానికి పాల్పడే వారికి కఠిన శిక్ష పడుతుంది. విశ్వసించి మంచిపనులు చేసేవారికి క్షమాభిక్ష గొప్ప ప్రతిఫలం లభిస్తాయి.
35. ఫాతిర్ 8 - 9 ఎవనికి తన దుష్కార్యం అందంగా కనిపించేలా చేయబడిరదో మరియు అతడు దానిని మేలైనదిగా భావిస్తున్నాడో (ఆ వ్యక్తి మార్గభ్రష్టత్వానికి అసలు హద్దు అంటూ ఏమైనా ఉందా?) యథార్థం ఏమిటంటే, అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురిచేస్తాడు. తాను కోరిన వారికి ఋజుమార్గం చూపుతాడు. కనుక (ప్రవక్తా) అనవసరంగా నీ ప్రాణం ఈ ప్రజలకోసం ద్ణుఖానికీ, బాధకూ గురిఅయి హరించిపోకూడదు. వారు చేస్తూ ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. వాయువులను పంపేవాడు అల్లాహ్ యే. తరువాత అవి మేఘాన్ని లేపుతాయి, ఆ తరువాత మేము దానిని ఒక పాడుబడ్డ నేల వైపునకు తీసుకుపోతాము, దానిద్వారా చచ్చిపడివున్న ఆ నేలనే బ్రతికిస్తాము. మరణించిన మానవులు బ్రతికి లేవటం కూడా ఇలానే జరుగు తుంది.
35. ఫాతిర్ 10 అల్లాహ్ మాత్రమే గౌరవానికి పూర్తిగా అర్హుడనే విషయాన్ని గౌరవాభిలాషి అయిన ప్రతివాడూ తెలుసుకోవాలి. ఆయన వద్దకు అధిరోహించే వస్తువు పరిశుద్ధ వాక్కు మాత్రమే, సత్కర్మ దానిని పైకి ఎక్కిస్తుంది. ఇక కుతంత్రాలు చేసేవారు, వారికైతే కఠిన శిక్ష పడుతుంది. వారి కుతంత్రం దానంతట అదే నాశనమై పోతుంది.
35. ఫాతిర్ 11 - 14 అల్లాహ్ మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తరువాత ఇంద్రియ బిందువులతో, ఆ తరువాత మిమ్మల్ని జంటలుగా చేశాడు (అంటే స్త్రీ పురుషులు). అల్లాహ్ కు తెలియకుండా ఏ స్త్రీ అయిన గర్భం దాల్చనూ లేదు, ప్రసవించనూలేదు. వయసు పెరుగుతున్న వాడెవడూ ఆయువును పొందలేడు. ఎవరి ఆయువులోనూ తగ్గింపు అనేది జరగదు, గ్రంథంలో వ్రాయబడి ఉన్న దాని ప్రకారం తప్ప. ఇది అల్లాహ్ కు చాలా సులభమైన పని. నీటి వనరులు రెండూ సమానం కావు
ఒకటేమో తియ్యనిది, దప్పికను తీర్చేది, త్రాగటానికి మధురమైనది. రెండోదేమో గొంతు మండిరచే అంత ఉప్పనిది. కాని రెండిరటి నుంచీ మీరు స్వచ్ఛమైన తాజా మాంసాన్ని పొందు తారు. ధరించటానికి అలంకరణ సామగ్రిని వెలికి తీసుకుంటారు. మీరు చూస్తూనే ఉన్నారు ఈ నీటిలోనే పడవలు దాని గుండెలను చీల్చుకుంటూ పోతూ ఉంటాయి. మీరు అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించేందుకు తద్వారా ఆయనకు కృతజ్ఞులు అయ్యేందుకు. ఆయన పగలులోనికి రాత్రినీ, రాత్రిలోనికి పగలునూ జొనుపుతున్నాడు. సూర్యచంద్రు లను ఆయన నియమబద్ధులను చేసి ఉంచాడు. ఇదంతా ఒక నిర్ణీత వ్యవధి వరకు సాగిపోతోంది. (ఈ పనులన్నీ చేసే) ఆ అల్లాహ్ యే మీ ప్రభువు. సామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయనను కాదని మీరు పిలిచే ఇతరులు కనీసం ఒక గడ్డిపోచకు కూడా యజమానులు కారు. వారిని వేడుకుంటే, వారు మీ ప్రార్థనలను వినలేరు. ఒకవేళ విన్నా, వాటికి ఏ సమాధానమూ మీకు ఇవ్వలేరు. మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు ప్రళయం నాడు తిరస్కరిస్తారు. సత్యాన్ని గురించిన ఈ సరైన సమాచారాన్ని తెలిసినవాడు తప్ప మరొకడెవ్వడూ మీకు అందజేయలేడు.
35. ఫాతిర్ 15 - 26 మానవులారా! అల్లాహ్ అవసరం కలవారు మీరే. అల్లాహ్ సర్వసంపన్నుడు. స్వయంగానే స్తుతిపాత్రుడు. ఆయన కోరితే, మిమ్మల్ని తొలగించి, మరేదైనా సృష్టిని మీ స్థానంలో తీసుకురాగలడు. అలా చేయటం అల్లాహ్ కు ఏ మాత్రమూ కష్టం కాదు. బరువు మోసే వాడెవ్వడూ మరెవరి బరువునూ మోయడు, బరువును మోసే ఆత్మ ఏదైనా తన బరువును మోయ మని ఇతరులను పిలిచినప్పుడు, దాని బరువు యొక్క రవ్వంత భాగాన్నయినా ఎత్తుకోవటానికి ఎవ్వడూ ముందుకు రాడు, అతడు ఎంత సమీప బంధువైనా సరే. (ప్రవక్తా) చూడకపోయినప్పటికీ తమ ప్రభువునకు భయపడే వారినీ, నమాజును స్థాపించేవారిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. ఏ వ్యక్తి అయినా తన మేలు కొరకే పరిశుద్ధతను అవలంబిస్తాడు. అల్లాహ్ వైపునకే అందరూ మరలవలసి ఉన్నది. గుడ్డివాడూ, కళ్ళున్నవాడూ సమానులు కాలేరు. చీకట్లూ, వెలుగూ, ఒకటి కావు.
చల్లని నీడా, ఎండతాపమూ ఒకే విధంగా ఉండవు. బ్రతికి ఉన్నవారూ, చనిపోయిన వారూ సమానులు కాలేరు. అల్లాహ్ తనకు ఇష్టమైన వారికి వినిపింపజేస్తాడు. కాని (ప్రవక్తా) సమాధులలో ఖననమైన వారికి నీవు వినిపించలేవు. నీవు కేవలం హెచ్చరిక చేసేవాడవు మాత్రమే. మేము నిన్ను సత్యంతో పంపాము. శుభవార్త ఇచ్చేవానిగా, భయపెట్టేవానిగా జేసి. హెచ్చరిక చేసే వాడెవ్వడూ రాని జాతి ఏదీ లేదు. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారంటే, వీరికి పూర్వం గతించిన వారు కూడా తిరస్కరించారు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ప్రమాణాలనూ, గ్రంథా లనూ, కాంతిమంతమైన మార్గదర్శక సూత్రాలు ఇచ్చే ఉద్గ్రంథాన్నీ తీసుకు వచ్చారు. తరువాత విశ్వసించని వారిని నేను పట్టుకున్నాను
చూడండి, నా శిక్ష ఎంత కఠినమైనదో.
35. ఫాతిర్ 27 - 28 ఆకాశం నుండి అల్లాహ్ వర్షం కురిపించటాన్ని నీవు చూడటం లేదా? తరువాత దాని ద్వారా మేము రకరకాల రంగు రంగుల పండ్లను ఉత్పత్తి చేస్తాము. కొండలలో కూడా తెల్లని, ఎఱ్ఱని, కారునలుపు చారలు కనిపిస్తాయి, వాటి రంగులు వేర్వేరుగా ఉంటాయి. ఈ విధంగానే మానవుల, జంతువుల, పశువుల రంగులు కూడా భిన్నమైనవే. యథార్థమేమిటంటే, అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. నిస్సందే హంగా అల్లాహ్ శక్తిమంతుడు, మన్నించేవాడూను.
35. ఫాతిర్ 29 - 35 అల్లాహ్ గ్రంథాన్ని పారాయణం చేసేవారూ, నమాజును స్థాపించే వారూ, మేము వారికి ఇచ్చిన ఉపాధినుండి బహిరంగంగానూ, రహస్యంగానూ ఖర్చు చేసేవారూ నిశ్చయంగా ఏమాత్రం నష్టం రాని వ్యాపారాన్ని కోరుకుం టున్నారు. (ఈ వ్యాపారంలో వారు తమ సర్వస్వాన్నీ ఎందుకు ధారపోశారంటే), అల్లాహ్ వారి ప్రతిఫలాలను పూర్తిగా వారికి ఇవ్వాలని, అదనంగా తన అనుగ్రహం నుండి ఇంకా వారికి ప్రసాదించాలని. నిస్సంశయంగా అల్లాహ్ క్షమించేవాడూ, విలువనిచ్చేవాడూను. (ప్రవక్తా) మేము వహీద్వారా నీ వైపునకు పంపిన గ్రంథమే సత్యమైనది, దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను ధ్రువీక రించేది. నిస్సందేహంగా అల్లాహ్ తన దాసుల స్థితిని బాగా ఎరిగినవాడు, ప్రతిదానిపై దృష్టిని ఉంచేవాడు. తరువాత మేము (ఈ గ్రంథ వారసత్వం కోసం) మా దాసులలో నుండి మేము ఎన్నుకున్న వారినే ఈ గ్రంథానికి వారసులుగా చేశాము. ఇప్పుడు వారిలో ఒకడు తన ఆత్మకు అన్యాయం చేసుకుంటున్నాడు. మరొకడు, మధ్యస్థంగా ఉంటున్నాడు, ఇంకొకడు అల్లాహ్ అనుమతితో పుణ్యకార్యాలలో ముందడుగు వేస్తున్నాడు.ఇదే మహా అనుగ్రహం. శాశ్వతంగా ఉండే ఉద్యాన వనాలలోకి వారు ప్రవేశిస్తారు. అక్కడ వారిని సువర్ణ కంకణాలతో, ముత్యాలతో అలంకరించటం జరుగుతుంది. అక్కడ వారు పట్టు వస్త్రాలు ధరిస్తారు. ఇలా అంటారు, ‘‘అల్లాహ్ కు కృతజ్ఞతలు. ఆయన మా ద్ణుఖాన్ని తొలగించాడు.
నిశ్చయంగా మా ప్రభువు క్షమించే వాడూ, విలువ ఇచ్చేవాడూను. ఆయన మమ్మల్ని
తన అనుగ్రహం వల్ల శాశ్వత నివాస స్థలంలో నివసింపజేశాడు. ఇక ఇక్కడ మాకు ఏ కష్టమూ ఉండదు, ఏ అలసటా కలుగదు.’’
35. ఫాతిర్ 36 - 37 అవిశ్వాసానికి పాల్పడిన వారికి నరకాగ్ని ఉన్నది. వారు చనిపోవా లనే తీర్పూ ఇవ్వబడదు, వారి నరక యాతనను ఏమాత్రం తగ్గించటమూ జరుగదు. ఇలా మేము అవిశ్వాసానికి పాల్పడే ప్రతి వ్యక్తికీ ప్రతిఫలం ఇస్తాము. వారు అక్కడ పెడబొబ్బలు పెడుతూ ఇలా అంటారు, ‘‘మా ప్రభూ! మమ్మల్ని ఇక్కడ నుండి బయటకు తియ్యి, మేము పూర్వం చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేయటానికి.’’ (వారికి ఇలా జవాబు ఇవ్వబడుతుంది) గుణపాఠం నేర్చుకోదలచినవాడు గుణపాఠం నేర్చుకోవటానికి సరిపడిన ఆయుష్షును మేము మీకు ఇవ్వలేదా? మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చి ఉన్నాడు కదా! ఇక రుచి చూడండి (యాతనను). దుర్మార్గులకు ఇక్కడ సహాయం చేసేవాడెవ్వడూ లేడు.
35. ఫాతిర్ 38 - 39 నిస్సందేహంగా అల్లాహ్ ఆకాశాలలోనూ, భూమిపైనా అగోచరముగా ఉన్న ప్రతి దానిని ఎరుగును. గుండెలలో దాగి ఉన్న రహస్యాలను సయితం ఆయన ఎరుగును. మిమ్మల్ని భూమిపై ఖలీఫాలుగా చేసినవాడు ఆయనేగా!
ఇక ఎవడైనా అవిశ్వాసానికి పాల్పడితే, అతని అవిశ్వాసం సంకటమై అతని మీదనే ఉంటుంది.
అవిశ్వాసుల అవిశ్వాసం వారి ప్రభువు యొక్క ఆగ్రహాన్ని వారిపై ఉగ్రతరం చేస్తుందే తప్ప వారికి ఏ వృద్ధినీ కలిగించదు. అవిశ్వాసులకు నష్టంలో పెరుగుదల తప్ప అభివృద్ధి ఏమీ ఉండదు.
35. ఫాతిర్ 40 - 41 (ప్రవక్తా!) వారితో ఇలా అను, ‘‘అల్లాహ్ ను కాదని మీరు వేడుకునే మీ భాగస్వాములను మీరు ఎప్పుడైనా చూశారా? వారు భూమిపై సృష్టించింది ఏమిటో నాకు చూపండి? లేక ఆకాశాలలో వారికున్న భాగస్వామ్యం ఏమిటి?’’ (ఒకవేళ వారు చూపలేకపోతే, ఇలా అడుగు) మేము వారికి ఏదైనా పత్రాన్ని వ్రాసి ఇచ్చామా, దాని ఆధారంగా వారు (తమ ఈ షిర్క్ విషయంలో) స్పష్టమైన ఒక ప్రమాణం కలిగి ఉండటానికి? లేదు. అయితే ఈ దుర్మార్గులు ఒకరినొకరు కేవలం కుయుక్తులతో మోసగించుకుంటూ పోతున్నారు. యథార్థమేమిటంటే ఆకాశాలనూ, భూమిని (తమ స్థానాల నుండి) తొలగిపోకుండా ఆపి ఉంచినవాడు అల్లాహ్ యే. ఒకవేళ అవి తొలగిపోతే, అల్లాహ్ తరువాత వాటిని నిలిపి ఉంచేవాడు మరొకడెవడూ లేడు. నిస్సందేహంగా అల్లాహ్ సహనశీలుడు, క్షమించేవాడూను.
35. ఫాతిర్ 42 - 45 ఒకవేళ హెచ్చరిక చేసేవాడు తమ వద్దకు వచ్చి ఉన్నట్లయితే, తాము ప్రపంచంలోని ప్రతి జాతికంటె మిక్కిలి సన్మార్గగాములమై ఉండేవారము అని వారు కఠోరమైన ప్రమాణాలు చేసి అంటూ ఉండేవారు. కాని హెచ్చరిక జేసేవాడు వారివద్దకు వచ్చినపుడు, అతని ఆగమనం వారిలో సత్యం నుండి పలాయనాన్ని తప్ప మరి దేనినీ అధికం చేయలేకపోయింది. వారు భూమిపై మరింత దురహంకారముతో తిరుగసాగారు, దుష్టపన్నాగాలు పన్నసాగారు. వాస్తవానికి దుష్ట పన్నాగాలు వాటిని పన్నేవారినే ముంచివేస్తాయి. ఇక పూర్వపు జాతుల పట్ల అల్లాహ్ అవలంబించిన విధానాన్నే వారిపట్ల కూడా అవలంబిం చాలని వారు నిరీక్షిస్తున్నారా?
అలా
అయితే, నీవు అల్లాహ్ విధానంలో మార్పును ఎంతమాత్రం చూడలేవు. అల్లాహ్ సంప్రదాయాన్ని దాని నిర్ణీత మార్గం నుండి ఏ శక్తి మరల్చటాన్ని కూడా నీవు ఎన్నటికీ చూడలేవు. వారు భూమిపై ఎన్నడూ సంచరించి ఉండలేదా - వారికి పూర్వం గతించిన మరియు వారికంటే అత్యంత బలవం తులైన ప్రజలు ఎదుర్కొన్న పరిణామం ఎలాంటిదో వారికి కనిపించేందుకు? అల్లాహ్ ను అశక్తుడుగా చేసే వస్తువు ఏదీ ఆకాశాలలోనూ లేదు, భూమిపైనా లేదు. ఆయన సర్వమూ ఎరిగినవాడు, సర్వమూ చేయగల సమర్థుడు. ఒకవేళ ఆయన ప్రజలను వారు చేసిన అకృత్యాలకుగాను పట్టుకుంటే, భూమిపై ఏ ప్రాణినీ సజీవంగా వదలిపెట్టేవాడు కాడు. కాని ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తున్నాడు. తరువాత వారి నిర్ణీత వ్యవధి పూర్తి అయినప్పుడు, అల్లాహ్ యే స్వయంగా తన దాసులను చూసుకుంటాడు.
No comments:
Post a Comment