37. అస్ సాఫ్ఫాత్
ఆయతులు
: 182 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
37. అస్ సాఫ్ఫాత్ 1 - 5 వరుసగా బారులు తీరి నిలబడే వారు సాక్షిగా, గద్దించేవారూ, శపించేవారూ సాక్షిగా, హితబోధ వాక్కులు వినిపించేవారు సాక్షిగా, మీ నిజమైన ఆరాధ్యదైవం కేవలం ఒక్కడే - ఆయన భూమికీ, ఆకాశాలకూ, భూమ్యా కాశాలలో ఉన్న సమస్తానికీ ప్రభువు, తూర్పు దిక్కులన్నింటికీ ప్రభువు.
37. అస్ సాఫ్ఫాత్ 6 - 10 మేము ప్రపంచాకాశాన్ని నక్షత్రాల అలంకరణతో తీర్చిదిద్దాము, ధిక్కారి అయిన ప్రతి షైతాన్ బారినుండి దానిని సురక్షితంగా ఉంచాము. ఈ షైతానులు పై లోకపు అధిష్టానపు దూతల మాటలు వినలేరు, ప్రతి దిశ నుండి కొట్టబడతారు, తరుమబడతారు, వారికి ఎడతెగని శిక్షపడుతుంది. ఒకవేళ వారిలో ఎవడైనా ఏదైనా మాటను ఎగరేసుకుపోతున్నప్పుడు, ఒక తీక్షణమైన అగ్ని జ్వాల అతడిని వెంటాడుతుంది.
37. అస్ సాఫ్ఫాత్ 11 - 18 ఇపుడు వారిని అడగండి. వారిని సృష్టించటం కష్టతరమా లేక మేము సృష్టించిన ఈ సకల చరాచరాలను సృష్టించటం కష్టతరమా అని. వారిని మేము జిగురు వంటి మట్టితో సృజించాము. మీరు (అల్లాహ్ శక్తి సామర్థ్యాల మహిమలను చూచి) ఆశ్చర్య చకితులవుతున్నారు, వారేమో పరిహసిస్తున్నారు. ఎంత నచ్చజెప్పినా వారు చెవికెక్కించుకోరు. ఏదైనా సూచనను చూస్తే, వారు దానిని ఎగతాళి చేసి ఎగురగొడతారు, ఇలా అంటారు, ‘‘ఇది పూర్తిగా మాయాజాలమే. కాకపోతే, మేము చనిపోయి, మట్టిగా మారి, అస్తిపంజరంగా మిగిలిపోయినపుడు, మళ్ళీ మమ్మల్ని బ్రతికించి లేపటం జరిగేపనేనా? పూర్వకాలం నాటి మా తాత, ముత్తాతలు సైతం లేపబడతారా?’’ వారితో, ‘‘అవును (లేపబడతారు) మీరు (దేవుని ముందు) నిస్సహాయులు’’ అని అను.
37. అస్ సాఫ్ఫాత్ 19 - 32 అది కేవలం ఒక పెద్ద గద్దింపు మాత్రమే. హఠాత్తుగా వారు (తమకు తెలుపబడుతూ ఉన్న
విషయాలనన్నింటినీ) కళ్ళారా చూస్తూ ఉంటారు. అప్పుడు వారు
‘‘మేమెంత దౌర్భాగ్యులం, ఇది తీర్పుదినం కదా! అని అంటారు - మీరు తిరస్కరిస్తూ ఉండే తీర్పుదినమే ఇది. (ఆజ్ఞ అవుతుంది) దుర్మార్గులందరినీ, వారి సహచరులను దేవుణ్ణి కాదని వారు ఆరాధిస్తూ ఉండిన దైవాలనూ చుట్టుముట్టి తీసుకురండి. తరువాత వారందరికీ నరకానికి దారి చూపండి.’’ కాస్త వారిని ఆపండి, ఒక విషయం అడగాలి. ‘‘ఏమయింది మీకు ఇపుడెందుకని ఒకరికొకరు సహాయం చేసుకోరు? అరే, ఈరోజు వారు తమను తామూ (ఒకరినొకరు) అప్పగిస్తున్నారేమిటి!’’ ఆ తరువాత వారు ఒకరి వైపునకు మరొకరు తిరిగి పరస్పరం వాదించుకోవటం ప్రారంభి స్తారు. (అనుచరులు తమ నాయకులతో ఇలా) అంటారు, ‘‘మీరు మా వద్దకు కుడివైపు నుండి వచ్చేవారు.’’ వారు సమాధానం ఇస్తారు,‘‘అది కాదు, అసలు మీరే విశ్వసించేవారు కారు, మీ మీద మాకు అధికారం లేదు, మీరు సహజం గానే తలబిరుసువాళ్ళు. చివరకు మీరు తప్పకుండా యాతనను చవిచూస్తారు’’ అని మా ప్రభువు అన్న మాటకు మేము అర్హులమైపోయాము. కనుక మేము మిమ్మల్ని మార్గభ్రష్టులుగా చేశాము, స్వయంగా మేము కూడా మార్గభ్రష్టుల మయ్యే ఉన్నాము.
37. అస్ సాఫ్ఫాత్ 33 - 39 ఈ విధంగా వారందరూ ఆ రోజు ఉమ్మడిగా శిక్ష అనుభవిస్తారు. మేము అపరాధుల విషయంలో ఇలానే చేస్తూ ఉంటాము. వారు ఎలాంటి వారంటే, ‘‘అల్లాహ్ తప్ప మరొక సత్యమైన ఆరాధ్యుడు లేడు’’ అని చెప్పినపుడు, వారు అహంకారంతో, ‘‘మేము ఒక పిచ్చి కవి కోసం మా దేవుళ్లను వదలుకో వాలా?’’ అని అనేవారు. వాస్తవానికి అతను సత్యాన్నే తెచ్చాడు, దైవప్రవక్తలను ధ్రువీకరించాడు (ఇపుడు వారితో ఇలా అనటం జరుగుతుంది) మీరు తప్పని సరిగా బాధాకరమైన శిక్ష చవిచూస్తారు. మీకు ఏ ప్రతిఫలం ఇవ్వబడుతూ ఉన్నా అది మీరు చేస్తూ ఉండిన కర్మల ఫలమే.
37. అస్ సాఫ్ఫాత్ 40 - 49 అయితే, ఎన్నుకోబడిన దైవదాసులు మాత్రం (ఈ దుష్ఫలితానికి గురికాకుండా) సురక్షితంగా ఉంటారు. వారికొరకు అందరూ ఎరిగిన ఆహారమే ఉన్నది, రుచికరమైన అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి, భోగభాగ్యాలతో విలసిల్లే ఉద్యానవనాలు ఉన్నాయి. అందు వారు సగౌరవంగా ఉంచబడతారు. సోఫాలపై ఎదురెదురుగా కూర్చుంటారు. మద్యపు చెలమల నుండి పాత్రలు మాటి మాటికీ నింపబడి వారి మధ్య త్రిప్పబడతాయి. మెరిసిపోతున్న మధువు, త్రాగేవారికి అది ఎంతో మధురం. దానివల్ల వారి శరీరానికి నష్టం ఉండదు, వారి బుద్ధీ చెడిపోదు. వారి దగ్గర తమ చూపులను నిగ్రహించుకునే అందమైన కళ్లు గల స్త్రీలు ఉంటారు. వారు గ్రుడ్డు గుల్ల క్రింద దాగి ఉండే పొరలాంటి కోమలాంగులు.
37. అస్ సాఫ్ఫాత్ 50 - 59 తరువాత వారు ఒకరి వైపునకొకరు తిరిగి పరిస్థితులను గురించి పరస్పరం అడిగి తెలుసుకుంటారు. వారిలో ఒకడు ఇలా అంటాడు : ‘‘ప్రపం చంలో నాకు ఒక మిత్రుడు ఉండేవాడు. అతను నాతో ఇలా అంటూండేవాడు, నీవు కూడా ధ్రువీకరించే వారిలో చేరిపోయావా? మనం చనిపోయి, మట్టిగా మారి, అస్థిపంజరంగా మిగిలిపోయినపుడు నిజంగానే మనకు ప్రతిఫలమూ, శిక్షా అనేవి ఉంటాయా? ఇప్పుడతను ఎక్కడున్నాడో, మీరు చూడదలచు కున్నారా?’’ ఇలా చెప్పి అతను తొంగి చూడగానే, అతనికి నరకంలోని ఒక అగాధంలో అతను కనిపిస్తాడు. అపుడు అతన్ని సంబోధిస్తూ ఇలా అంటాడు, ‘‘దేవుని సాక్షిగా, నీవు నన్ను సర్వ నాశనం చేసి ఉండేవాడివి. నా ప్రభువు అనుగ్రహం లేకపోయి ఉంటే, ఈ రోజు నేను కూడా పట్టుబడి వచ్చిన వారిలో ఒకడినై ఉండేవాణ్ణి. సరే, అయితే ఇక మేము చనిపోమా? మాకు రావలసిన చావేదో ముందు వచ్చేసిందా? ఇక మాకు ఎలాంటి శిక్షాపడదా?’’
37. అస్ సాఫ్ఫాత్ 60 - 74 నిశ్చయంగా ఇదే మహత్తరమైన విజయం. ఇలాంటి విజయం కోసమే కర్మశీలురు కర్మలు చేయాలి. చెప్పండి, ఈ ఆతిథ్యం మంచిదా లేక రాకాసి జముడు (జఖ్ఖూమ్) చెట్టు ఆతిథ్యం మంచిదా? మేము ఆ చెట్టును దుర్మార్గుల పాలిటి పరీక్షగా చేశాము. అది నరకం అడుగు భాగం నుండి మొలిచే ఒక చెట్టు. దాని మొగ్గలు షైతానుల తలలు మాదిరిగా ఉంటాయి. నరకవాసులు వాటిని తింటారు. వాటితోనే కడుపు నింపుకుంటారు. అదీగాక, త్రాగటానికి వారికి సల సల కాగే నీరు లభిస్తుంది. ఆ తరువాత వారు మళ్లీ
నరకాగ్ని వైపునకే తిరిగి వస్తారు. తమ తాత ముత్తాతలు మార్గభ్రష్టులవటాన్ని చూసినప్పటికీ, వారి అడుగు జాడలలోనే పరుగెత్తిన వారు వీరే. వాస్తవానికి వారికి పూర్వం కూడా చాలా మంది మార్గభ్రష్టులై పోయారు. వారివద్దకు మేము హెచ్చరిక చేసే సందేశహరులను పంపాము. ఇక చూడండి, హెచ్చరిం చబడిన వారి పర్యవసానం ఏమయిందో, ఈ దుష్పరిణామం నుండి అల్లాహ్ తన కొరకు ప్రత్యేకించుకున్న దాసులు మాత్రమే సురక్షితంగా ఉన్నారు.
37. అస్ సాఫ్ఫాత్ 75 - 82 మమ్మల్ని (ఇంతకు పూర్వం) నూహ్ వేడుకున్నాడు. కనుక చూడండి, మేము (ప్రార్థనలకు) ఎంత మంచి సమాధానం ఇచ్చేవారమో. మేము అతనినీ అతని కుటుంబాన్నీ పెద్ద విపత్తునుండి కాపాడాము. అతని సంతతి మాత్రమే మిగిలి ఉండేలా చేశాము. ఇంకా తరువాతి తరాల వారిలో అతని కీర్తి ప్రతిష్ఠలు నిలిచి ఉండేలా చేశాము. సమస్త ప్రపంచ వాసులలో నూహ్ కు శాంతి కలుగుగాక! మేము సత్కార్యం చేసేవారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తూ ఉంటాము. నిశ్చయంగా అతను విశ్వాసులైన మా దాసులలోని వాడు, తరువాత మేము రెండో వర్గాన్ని ముంచి వేశాము.
37. అస్ సాఫ్ఫాత్ 83 - 87 ఇబ్రాహీమ్, నూహ్ మార్గంలోనే నడిచేవాడు. అతను తన ప్రభువు సాన్నిధ్యానికి నిర్మల హృదయంతో వచ్చినప్పుడు తన తండ్రితోనూ, తన జాతి ప్రజలతోనూ ఇలా అన్నాడు, ‘‘మీరు ఆరాధిస్తున్న ఈ వస్తువులేమిటి? అల్లాహ్ ను కాదని మీరు, మిధ్యా దైవాలను కోరుకుంటున్నారా, అసలు సకల లోకాల ప్రభువు విషయంలో మీ అభిప్రాయమేమిటి?’’
37. అస్ సాఫ్ఫాత్ 88 - 98 ఆ తరువాత అతను తన దృష్టిని నక్షత్రాల వైపు సారించి, వారితో ‘‘నా ఆరోగ్యం బాగాలేదు’’ అని అన్నాడు. అందువల్ల వారు అతనిని వదలిపెట్టి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత అతను మెల్లగా వారి దేవుళ్ల ఆలయం లోకి జొరబడి, ‘‘మీరు తినరేమిటి? అసలు ఏమయింది మీకు, మీరు పలకను కూడా పలుకుటలేదే?’’ అని అడిగాడు. ఆ తరువాత అతను వాటిపై విరుచుకు పడి కుడిచేత్తో వాటిని గట్టిగా కొట్టాడు. వారు (తిరిగి వచ్చి) అతని వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చారు. అపుడు అతను ఇలా అన్నాడు, ‘‘స్వయంగా మీరే చెక్కుకున్న వస్తువులను మీరు పూజిస్తారా? వాస్తవానికి అల్లాహ్ యే మిమ్మల్నీ సృష్టించాడు, మీరు తయారు చేసే వస్తువులనూ సృష్టించాడు.’’ వారు పరస్పరం ఇలా చెప్పుకున్నారు, ‘‘ఇతని కొరకు ఒక గుండం తయారు చేసి, భగ భగ మండే అగ్నిలోకి ఇతనిని విసరివేయండి.’’ వారు అతనికి ప్రతికూలంగా ఒక చర్య తీసుకోదలచిచారు. కాని మేము వారినే మట్టి కరిపించాము.
37. అస్ సాఫ్ఫాత్ 99 - 113 ఇబ్రాహీమ్ ఇలా అన్నాడు: ‘‘నేను నా ప్రభువు వైపునకు వెళు తున్నాను, ఆయనే నాకు మార్గం చూపుతాడు. ప్రభూ! నాకు శీలవంతుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించు.’’ (ఈ ప్రార్థనకు సమాధానంగా) మేము అతనికి ఒక సహనశీలుడైన కుమారుడు కలుగుతాడనే శుభవార్తను అందజేశాము. ఆ బాలుడు అతనికి తోడుగా పనిచేసే వయస్సుకు చేరుకున్నప్పుడు (ఒకనాడు) ఇబ్రాహీమ్ అతనితో ఇలా అన్నాడు: ‘‘కుమారా! నేను నిన్ను ‘జిబహ్’ (బలి) చేస్తున్నట్లుగా కలలో చూశాను. ఇక నీ అభిప్రాయమేమిటో చెప్పు.’’ అతను ఇలా అన్నాడు: ‘‘నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించబడిన దానిని నెరవేర్చండి. అల్లాహ్ సంకల్పిస్తే మీరు నన్ను సహనశీలునిగా చూస్తారు.’’ చివరకు వారు ఉభయులూ (దైవాజ్ఞను) శిరసావహించారు. తరువాత ఇబ్రాహీమ్ తన కుమారుణ్ణి నుదుటిపై బోరగిల పరుండబెట్టాడు. అప్పుడు మేము అతనిని పిలిచి ఇలా అన్నాము: ‘‘ఇబ్రాహీమ్! నీవు కలను నిజం చేసి చూపించావు. సత్కార్యం చేసేవారికి మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా ఇది ఒక స్పష్టమైన పరీక్ష.’’ మేము ఒక పెద్ద ఖుర్బానీని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించుకున్నాము అతని కీర్తి ప్రతిష్ఠలు తరువాతి తరాల వారిలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాము. ఇబ్రాహీమ్కు శాంతి కలుగు గాక! మేము సత్కార్యాలు చేసే వారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా అతను విశ్వసించిన మా దాసులలోని వాడు. మేము అతనికి ఇస్హాఖ్ను గురించిన శుభవార్తను అందజేశాము. (అతను) ఒక దైవప్రవక్త, సజ్జనులలోని వాడు. అతనికి ఇస్హాఖ్కూ మేము శుభాలను ఇచ్చాము. ఇపుడు వారిద్దరి సంతతిలో ఒకడు సత్క్రియాశీలుడైతే మరొకడు స్పష్టంగా తన ఆత్మకు ద్రోహం చేసుకున్నవాడు.
37. అస్ సాఫ్ఫాత్ 114 - 122 మేము
మూసాకు, హారూన్కూ మేలు చేశాము. వారికీ వారి జాతి ప్రజలకూ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము. మేము వారికి సహాయం చేశాము. కనుకనే వారు ప్రాబల్యం వహించారు. మేము వారికి స్పష్టమైన గ్రంథాన్ని ప్రసాదించాము.
వారికి ఋజుమార్గం చూపాము. తరువాతి తరాల వారిలో వారిని గురించిన మంచి ప్రస్తావన మిగిలి ఉండేలా చేశాము. మూసాకూ, హారూన్కూ శాంతి కలుగుగాక! మేము పుణ్యకార్యాలు చేసేవారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా వారు విశ్వాసులైన మా దాసులలోని వారు.
37. అస్ సాఫ్ఫాత్ 123 - 132 నిశ్చయంగా
ఇల్యాస్ కూడా మా సందేశహరులలో ఒకడు. జ్ఞాపకం తెచ్చుకో, అప్పుడు అతను తన జాతివారితో ‘‘మీరు భయపడరా? సృష్టికర్తలలోకెల్లా ఉత్తముడైన సృష్టికర్తయున్నూ మీకూ, మీకు పూర్వం ఉండిన మీ తాత ముత్తాతలకూ ప్రభువున్నూ అయిన అల్లాహ్ ను వదలివేసి మీరు ‘బఅల్’ను వేడుకుంటున్నారా?’’ కాని వారు అతనిని అసత్యవాది అని తిరస్క రించారు. కనుక వారు తప్పనిసరిగా శిక్ష కొరకు హాజరు పరచబడతారు, ప్రత్యేకించుకోబడిన దైవదాసులు తప్ప. ఇల్యాస్ను గురించిన మంచి ప్రస్తావ నను మేము తరువాతి తరాలలో నిలిచి ఉండేలా చేశాము. ఇల్యాస్కు శాంతి కలుగుగాక! మేము సత్కార్యాలు చేసేవారికి ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిస్సందేహంగా అతను విశ్వాసులైన మా దాసులలో ఒకడు.
37. అస్ సాఫ్ఫాత్ 133 - 138 లూత్
కూడా దైవప్రవక్తలుగా నియమించి పంపబడిన వారిలో ఒకడు. జ్ఞాపకం తెచ్చుకో, అపుడు మేము అతనికీ, అతని కుటుంబంలోని వారికందరికీ విముక్తి కలిగించాము, ఒక వృద్ధురాలికి తప్ప
ఆమె, వెనుక ఉండిపోయిన వారిలో ఉండిపోయింది. ఆ తరువాత మిగతా వారందరినీ సర్వనాశనం చేశాము. ఈనాడు మీరు రేయింబవళ్లు వారి శిథిల ప్రదేశాల మీదుగా పోతూ ఉంటారు. (వాటిని చూచి అయినా) మీకు బుద్ధిరాదా?
37. అస్ సాఫ్ఫాత్ 139 - 148 నిశ్చయంగా
యూనుస్ కూడా దైవప్రవక్తలలోని వాడే. జ్ఞాపకం తెచ్చుకో, అపుడు అతను నిండు పడవ వైపునకు పరుగెత్తాడు. అక్కడ చీటీలో పాల్గొన్నాడు, కానీ ఓడిపోయాడు. చివరకు అతనిని చేప మ్రింగివేసింది. అతను దూషితుడయ్యాడు. అపుడు అతను దైవ నామ స్మరణం చేసేవారిలో ఒకడై ఉండకపోయినట్లయితే, ప్రళయదినం వరకు ఆ చేప కడుపులోనే ఉండిపోయేవాడు. చివరకు మేము అతనిని తీవ్ర అస్వస్థస్థితిలో ఒక తీర మైదానం మీద పడవేశాము. అతని మీద ఒక తీగల చెట్టును మొలిపించాము. ఆ తరువాత మేము అతన్ని ఒక లక్ష లేక అంతకంటె ఎక్కువ మంది ప్రజల వద్దకు పంపాము. వారు విశ్వసించారు. మేము ఒక నిర్ణీత కాలం వరకు వారు జీవించి ఉండేలా చేశాము.
37. అస్ సాఫ్ఫాత్ 149 - 157 వారిని
కొంచెం ఇలా అడుగు
నీ ప్రభువునకు కూతుళ్లున్నూ వారికి కొడుకులూనా? (వారి మనస్సుకు ఇది నచ్చే
విషయమేనా). మేము నిజంగా దైవదూతలను స్త్రీలుగానే సృష్టించామా? వారు కళ్లతో చూసిన విషయాన్నే పలుకుతున్నారా? బాగా విను, అల్లాహ్ సంతానవంతుడు అనే విషయాన్ని వారే స్వయంగా కల్పించి అంటున్నారు. వాస్తవంగానే వారు అసత్యవాదులు. అల్లాహ్ తన కొరకు కొడుకులకు బదులుగా కూతుళ్ళను కోరుకున్నాడా? ఏమయింది మీకు, ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? మీకు స్పృహలేదా? లేక మీరు చెబుతున్న ఈ మాటలకు మీ వద్ద స్పష్టమైన ప్రమాణం అంటూ ఏదైనా ఉంటే, మీ గ్రంథాన్ని తీసుకురండి, మీరు సత్య వంతులే అయితే.
37. అస్ సాఫ్ఫాత్ 158 - 166 వారు
అల్లాహ్కూ, దైవదూతలకూ మధ్య రక్త సంబంధాన్ని కల్పించారు. వాస్తవానికి వారు నేరస్తులుగా ప్రవేశపెట్టబడేవారని దైవదూతలకు బాగా తెలుసు. (ఈ దైవ దూతలు ఇలా అంటారు), ‘‘ఆయన విశుద్ధదాసులు తప్ప, ఇతరులు, తనకు ఆపాదించే గుణగణాల నుండి అల్లాహ్ పరిశుద్ధుడు. కనుక మీరూ మీ ఈ దైవాలూ అల్లాహ్ నుండి ఎవరినీ మళ్లించలేరు
భగ భగ మండే నరకాగ్నిలో కాలిపోనున్నవాణ్ణి తప్ప. మా పరిస్థితి ఇది : మాలో ప్రతి ఒక్కరికీ ఒక స్థానం అంటూ నిర్ణయమై ఉన్నది. మేము పంక్తులు తీరి ఉన్న సేవకులం, స్తోత్రం చేసేవాళ్లం.’’
37. అస్ సాఫ్ఫాత్ 167 - 179 వారు
ఇంతకు పూర్వం ఇలా అంటూ ఉండేవారు, ‘‘పూర్వపు జాతులకు లభించిన ‘జిక్ర్’ (గ్రంథం) మా వద్ద ఉండినట్లయితే, మేము నిజమైన అల్లాహ్ భక్తులమై ఉండేవారము.’’ కాని (అది వచ్చేసినపుడు) వారు దానిని నిరాకరించారు. ఇక త్వరలోనే వారికి (ఈ వైఖరికి పర్యవసానం) తెలిసిపోతుంది. మేము పంపిన మా దాసులకు మేము ఇదివరకే వాగ్దానం చేసి ఉన్నాము, తప్పకుండా వారికి సహాయం చేయబడుతుందనీ మా సైన్యమే ప్రాబల్యం వహించి తీరుతుందనీ. కనుక ప్రవక్తా! కొంతకాలం వరకు, వారిని వారి స్థితిలో వదలిపెట్టి చూస్తూ ఉండు. త్వరలోనే స్వయంగా వారు కూడా చూస్తారు. వారు మా శిక్ష రాకకోసం తొందరపెడుతున్నారా? ఆ శిక్ష వారి ఇంటి ప్రాంగణంలో దిగేరోజున హెచ్చరించబడిన వారికి అత్యంత కఠినంగా ఉంటుంది. కనుక కొంత కాలం పాటు వారిని వారి మానాన వదలివేసి చూస్తూ ఉండు, త్వరలోనే స్వయంగా వారు కూడా చూస్తారు.
37. అస్ సాఫ్ఫాత్ 180 - 182 నీ
ప్రభువు పరిశుద్ధుడు, గొప్ప గౌరవోన్నతులు కలవాడు, వారు కల్పిస్తున్న అన్ని విషయాలకూ అతీతుడు, దైవప్రవక్తలపై శాంతి వర్షించుగాక! సకల లోకాల ప్రభువే సకల స్తోత్రాలకు అర్హుడు.
No comments:
Post a Comment