64 సూరహ్ అత్‌ తగాబున్

 

64. అత్తగాబున్

ఆయతులు : 18                                   అవతరణ : మదీనాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 4 ఆకాశాలలో ఉన్న ప్రతివస్తువూ, భూమిలో ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్నే స్తుతిస్తోంది. విశ్వ సామ్రాజ్యాధిపత్యమూ ఆయనదే, స్తోత్రమూ ఆయనకే. ఆయనకు ప్రతి వస్తువుపై అధికారం ఉన్నది. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు,  అయినా మీలో కొందరు అవిశ్వాసులుగానూ, మరికొందరు విశ్వాసులుగానూ ఉన్నారు.  అల్లాహ్  మీరు చేస్తున్నదంతా చూస్తున్నాడు. ఆయన భూమినీ, ఆకాశాలనూ సత్యం ఆధారంగా సృష్టించాడు, మీకు ఒక రూపాన్ని కల్పించాడు, దానిని చాలా అందంగా రూపొందించాడు. చివరకు మీరు ఆయన వైపునకే మరలవలసి ఉన్నది. భూమిలోనూ, ఆకాశాల్లోనూ ఉన్న ప్రతి   వస్తువును  గురించి  ఆయనకు తెలుసు. మీరు దాచేదీ, మీరు వెల్లడిచేసేదీ, అంతా ఆయనకు తెలుసు. ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును.

5 - 6 పూర్వం సత్యాన్ని తిరస్కరించి, తమ కర్మల దుష్ఫలితాలను చవిచూసిన వారి వృత్తాంతం నీకు చేరలేదా?  మున్ముందు వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది. పర్యవసానానికి వారు అర్హులు కావటానికి కారణం ఏమిటంటే  వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన ప్రమాణాలనూ, సూచనలనూ తీసుకుని వచ్చినప్పటికీ, వారు, ‘‘మానవులు మాకు మార్గదర్శకత్వం ఇవ్వగలరా?’’ అని అన్నారు. విధంగా వారు విశ్వసించకుండా తిరస్కరించారు, తమ ముఖాలను తిప్పుకున్నారు. అప్పుడు అల్లాహ్ కూడ వారిని నిర్లక్ష్యం చేశాడు. అసలు అల్లాహ్ ఎవరి అవసరమూ లేనివాడు, తనకు తానే స్తోత్రానికి అర్హుడు.

7 అవిశ్వాసులు తాము మరణించిన పిదప మళ్లీ లేపబడటం అనేది ఎంత మాత్రం జరగదు అని పెద్ద సవాలు విసిరారు. వారితో ఇలా అను, ‘‘కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత, మీరు (ప్రపంచంలో) ఏమేమి చేశారో అదంతా మీకు తప్పకుండా తెలియజేయటం జరుగుతుంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాల సులభం.’’

8 - 10 కనుక అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ, మేము అవతరింపజేసిన కాంతినీ విశ్వసించండి.  మీరు  చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. సమావేశపు రోజున ఆయన మీ అందరినీ సమీకరిస్తాడు. ( రోజున మీకు సంగతి తెలిసిపోతుంది). అది ప్రజల మధ్య పరస్పర జయాపజయముల రోజు అవుతుంది. ఎవడైతే అల్లాహ్ ను విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అల్లాహ్ అతని పాపాలను ప్రక్షాళన చేస్తాడు, అతనిని సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వారు శాశ్వతంగా వాటిలోనే ఉంటారు. ఇదే గొప్ప విజయం. ఇక ఎవరు తిరస్కరించారో, మా ఆయతులను తృణీకరిం చారో, వారు నరకవాసులవుతారు. అందులోనే వారు శాశ్వతంగా ఉంటారు  అది బహుచెడ్డ నివాసం.

11 - 13 ఆపద అయినా అల్లాహ్ అనుమతి లేనిదే ఎన్నటికీ రాదు. ఎవడు అల్లాహ్ ను విశ్వసిస్తాడో, అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం ప్రసాదిస్తాడు.  అల్లాహ్ కు  ప్రతి వస్తువును గురించీ తెలుసు. అల్లాహ్ కు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి. కాని ఒకవేళ మీరు విధేయతకు విముఖులైతే, (తెలుసుకోండి) మా ప్రవక్తపై సత్యాన్ని స్పష్టంగా అందజేసే బాధ్యత తప్ప మరొకటి ఏదీ లేదు. ఆయన అల్లాహ్  ఆయన తప్ప మరొక దేవుడు లేడు. కనుక విశ్వాసులు అల్లాహ్ పైనే ఆధారపడాలి.

14 - 18 విశ్వాసులారా! మీ భార్యలలో, మీ సంతానంలో కొందరు మీకు శత్రువులు   వారి  విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ మీరు ఉపేక్షించి, మన్నిస్తే అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడూను. మీ సిరి సంపదలూ, మీ సంతానమూ మీకొక పరీక్ష. అల్లాహ్ వద్దనే గొప్ప ప్రతిఫలం ఉంది. కనుక మీకు సాధ్యమైనంతవరకు అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. వినండి, విధేయత చూపండి  మీ సంపదను ఖర్చుపెట్టండి. ఇది మీకే శ్రేయ స్కరం. తమ హృదయలోభత్వం నుండి రక్షణ పొందినవారే సాఫల్యం పొందేవారు. మీరు గనక అల్లాహ్ కు మంచి రుణాన్ని ఇస్తే, ఆయన మీకు దానిని ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు  మీ పొరపాట్లను మన్నిస్తాడు. అల్లాహ్ ఎంతో విలువనిచ్చేవాడు, సౌమ్యుడూను  గోచర అగోచరాలను ఎరిగినవాడూ, శక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడూను.

No comments:

Post a Comment