31 సూరహ్ లుఖ్మాన్‌

 

31. లుఖ్మాన్

ఆయతులు : 34                                  అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

31. లుఖ్మాన్    1 - 5  అలిఫ్‌. లామ్‌. మీమ్‌. ఇవి వివేచనగల గ్రంథంలోని వాక్యాలు, సజ్జనులకు మార్గమును చూపేది మరియు కారుణ్యమూను. వారు నమాజును స్థాపిస్తారు. జకాత్ఇస్తారు. పరలోకం పట్ల దృఢమైన నమ్మకం కలిగి ఉంటారు. ఇటువంటి వారే  తమ ప్రభువు తరఫు నుండి లభించిన ఋజుమార్గంలో ఉన్నారు. వారే సాఫల్యం పొందేవారు.

31. లుఖ్మాన్    6 - 9 జ్ఞానం లేకుండానే ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించటానికీ, మార్గం వైపునకు పిలిచే పిలుపును ఎగతాళి చేయటానికీ మానవులలోనే మనస్సును రంజింపజేసే ప్రసంగాన్ని కొనుక్కొని తీసుకువచ్చేవాడు కూడా ఒకడు ఉంటాడు  అటువంటి వారికి తీవ్ర అవమానకరమైన శిక్ష పడుతుంది, అతనికి మా వాక్యాలు వినిపించినపుడు, అతను వాటిని అసలు విననేలేద న్నట్లుగా, అతని చెవులలో చెవుడు ఉన్నట్లుగా అహంకారంతో తన ముఖాన్ని తిప్పుకుంటాడు. సరే మంచిది,  అతి బాధాకరమైన ఒక శిక్ష ఉన్నది - అనే శుభవార్తను అతనికి వినిపించు.  అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసేవారికి వరాలతో నిండియున్న ఉద్యానవనాలు ఉన్నాయి. వాటిలో వారు శాశ్వతంగా ఉంటారు. ఇది అల్లాహ్ చేసిన సత్య వాగ్దానం. ఆయన శక్తిమంతుడు మరియు వివేకవంతుడు.

31. లుఖ్మాన్    10 - 11 ఆయన, ఆకాశాలను నీవు చూడగలిగే స్తంభాలు లేకుండానే సృష్టించాడు, ఆయన భూమిలో పర్వతాలను అమర్చాడు, మీతో పాటు దొర్లి పోకుండా ఉండేటందుకు. ఆయన అన్ని రకాల జంతువులను భూమిలో వ్యాపింపజేశాడు. ఆకాశం నుండి నీళ్లను కురిపించాడు. భూమిలో రకరకాల శ్రేష్ఠమైన పదార్థాలను పండిరచాడు.  ఇది అల్లాహ్ సృష్టి, ఇక నాకు చూపండి ఇతరులు ఏమి సృష్టించారో? - అసలు విషయమేమిటంటే, దుర్మార్గపు ప్రజలు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురి అయ్యారు.

31. లుఖ్మాన్    12 మేము లుఖ్మాన్కు వివేకాన్ని ప్రసాదించాము, అతను అల్లాహ్ కు కృతజ్ఞుడు కావాలని, ఎవడైనా కృతజ్ఞతలు తెలిపితే, అతని కృతజ్ఞతలు అతనికే లాభకరం, ఎవడైనా కృతఘ్నతకు పాల్పడితే నిజానికి అల్లాహ్ అతీతుడు తనకు తానే స్తుతిపాత్రుడు.

31. లుఖ్మాన్    13 - 15 లుఖ్మాన్తన కుమారునికి హితబోధ చేసిన విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు అతను ఇలా అన్నాడు, ‘‘కుమారా! దేవునికి భాగస్వాము లుగా ఎవరినీ చేర్చకు, నిజం ఏమిటంటే, ఇతరులను దేవునికి భాగస్వాము లుగా చేర్చటం పరమదుర్మార్గం’’ -  మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతనికి నిర్దేశించాము. అతని తల్లి బలహీనతపై బలహీనతను సహించి అతనిని తన కడుపున మోసింది. అతను పాలు విడిచిపెట్టటానికి రెండు సంవత్సరాలు పట్టింది. (ఇందుకే మేము అతనికి ఇలా బోధించాము) ‘‘నాకు కృతజ్ఞుడవై ఉండు, నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు. నా వైపునకే నీవు మరలి రావలసి ఉన్నది. ఒకవేళ నీవు ఎరుగని వారి నెవరినైనా నాకు భాగస్వామిగా చేర్చు  అని  వారు నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను ఏమాత్రం వినకు, ప్రపంచంలో వారి పట్ల సద్భావంతో మెలగుతూ ఉండు  కాని నా వైపునకు మరలిన  వ్యక్తి మార్గాన్నే అనుసరించు. తరువాత మీరందరూ నా వైపునకే మరలవలసి ఉంది. అపుడు నేను మీకు తెలుపుతాను మీరు ఎలాంటి పనులు చేస్తూ ఉండేవారో.

31. లుఖ్మాన్    16 - 19 (లుఖ్మాన్ఇలా అన్నాడు) ‘‘కుమారా!  ఒక  వస్తువు, అది ఆవగింజంతటిదైనప్పటికీ అది కొండరాయిలోగాని,  ఆకాశాలలోగాని, భూమిలోగాని, ఎక్కడ దాగి ఉన్నప్పటికీ, అల్లాహ్ దానిని బయటికి తీసుకు వస్తాడు. ఆయన సూక్ష్మగ్రాహి మరియు సర్వజ్ఞుడు. కుమారా! నమాజును స్థాపించు, మంచిని ఆజ్ఞాపించు, చెడుపనుల నుండి నిరోధించు, కష్టం కలిగినా దానికి సహనం వహించు. విషయాలు ఎంతో గట్టిగా ఆజ్ఞాపించ బడిన విషయాలు. ప్రజలతో ముఖం ప్రక్కకు త్రిప్పి మాట్లాడకు, భూమిపై నిక్కుతూ నడవకు. అహంభావి, బడాయికోరు అయిన వ్యక్తినీ అల్లాహ్ ప్రేమించడు.  నీ  నడకలో సమమైన తూకం పాటించు, నీ కంఠస్వరాన్ని కొంచెం తగ్గించు, అన్ని స్వరాల కంటే అతి చెడ్డ స్వరం గార్దభాల స్వరం.’’

31. లుఖ్మాన్    20 - 21 భూమిలోనూ, ఆకాశాలలోనూ ఉన్న సకల వస్తువులను అల్లాహ్ మీకు వశం చేసిన విషయాన్నీ తన గోచర, అగోచర వరాలను మీకు ఇచ్చిన విషయాన్నీ మీరు చూడటం లేదా? అయినా, పరిస్థితి ఎలా ఉందంటే, మానవులలో కొందరు అల్లాహ్ ను గురించి వాదులాడుతున్నారు. వారి వద్ద, జ్ఞానమూ, మార్గదర్శకత్వమూ, వెలుగును చూపే గ్రంథమూ లేకుండానే. అల్లాహ్ అవతరింపజేసిన దాన్ని అనుసరించండి అని వారితో అన్నప్పుడు, వారు, ‘‘మా పూర్వికులు దేనిపై నడుస్తూ ఉండగా మేము చూశామో, దానినే మేము అనుసరిస్తాము’’ అని అంటారు. షైతాను వారిని జ్వలించే అగ్ని వైపునకే ఆహ్వానిస్తూ ఉండినప్పటికీ వీరు వారినే అనుసరిస్తారా?

31. లుఖ్మాన్    22 - 24 వ్యక్తి అయితే తనను తాను అల్లాహ్ కు సమర్పించుకుంటాడో, ఆచరణ రీత్యా సద్వర్తనుడో, అతను నిజానికి నమ్మదగిన ఒక ఆధారాన్ని పట్టుకున్నాడు. సకల వ్యవహారాలకు సంబంధించిన చివరి తీర్పు అల్లాహ్ చేతులలోనే ఉన్నది, ఇక ఎవడైనా అవిశ్వాసానికి పాల్పడితే, అతని అవిశ్వాసం నిన్ను ద్ణుఖానికి గురిచేయకూడదు. వారు మరలిరావలసినది మా వైపునకే కదా, అప్పుడు మేము  వారికి తెలుపుతాము, వారు ఏమేమి చేసివచ్చారో. నిశ్చయంగా  అల్లాహ్  హృదయాలలో దాగి వున్న రహస్యాలను సైతం ఎరుగును. మేము వారికి కొంత కాలం ప్రపంచంలో సుఖాలను అనుభవించే అవకాశాన్ని ఇస్తున్నాము,  తరువాత వారిని అశక్తులుగా చేసి ఒక కఠోర యాతన వైపునకు లాగుకొనిపోతాము.

31. లుఖ్మాన్    25 - 28 ఒకవేళ వారిని నీవు, భూమినీ, ఆకాశాలనూ  ఎవడు సృష్టించాడు అని అడిగితే వారు ‘‘అల్లాహ్’’ అని తప్పకుండా అంటారు.  ఇలా  అను, ‘‘అల్హమ్దులిల్లాహ్’’ (అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు). కాని వారిలో చాలామంది ఎరుగరు, ఆకాశాలలోనూ భూమిపైనా ఉన్నదంతా అల్లాహ్దే. నిస్సందేహంగా అల్లాహ్ అక్కరలేనివాడు, తనకు తానే స్తోత్రాలకు అర్హుడు. భూమిపై ఉన్న వృక్షాలన్నీ కలములై, సముద్రం (సిరాబుడ్డి అయి), దానికి ఇంకా ఏడు సముద్రాల సిరాను కలిపినా, అప్పటికీ అల్లాహ్ మాటలు (వ్రాయ టానికి) పూర్తికావు. నిస్సంశయంగా అల్లాహ్ మహాశక్తిసంపన్నుడు, మహా వివేకవంతుడూను, మీ మానవులందరినీ సృష్టించటం, తరువాత మళ్లీ వారిని బ్రతికించి లేపటం అనేది (ఆయన కొరకు) కేవలం ఒక మానవుణ్ణి, (సృష్టించి, బ్రతికించి తేవటం) వంటిదే. యథార్థమేమిటంటే, అల్లాహ్ సర్వమూ వినేవాడు సర్వమూ చూసేవాడూను.

31. లుఖ్మాన్    29 - 30 అల్లాహ్ రాత్రిని పగలులోకీ, పగలును రాత్రిలోకీ చొప్పించటాన్ని నీవు చూడటం లేదా? ఆయన సూర్యచంద్రులను నియమబద్ధంగా చేసి ఉంచాడు. అన్నీ ఒక నిర్ణీత కాలం వరకు సాగిపోతున్నాయి. నీవు ఏది చేసినా అది అల్లాహ్ కు తెలుసు అని (నీవు ఎరుగవా?) ఇదంతా ఎందుచేత నంటే అల్లాహ్ యే సత్యం కాబట్టి, ఆయనను కాదని వారు పిలిచేవన్నీ అసత్యాలు కాబట్టి, ఇంకా ( కారణం చేతకూడా) అల్లాహ్ యే మహ నీయుడూ, మహోన్నతుడూ కాబట్టి.

31. లుఖ్మాన్    31 - 32 అల్లాహ్ తన అనుగ్రహంతో నావను సముద్రంలో పయనింప చేయటాన్ని నీవు గమనించటం లేదా నీకు తన సూచనలు కొన్నింటిని చూపా లని? వాస్తవంగానే ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి, సహనం, కృతజ్ఞతా భావం కల ప్రతి వ్యక్తి కొరకు. (సముద్రంలో) వారి మీదకు ఒక కెరటం కప్పుల మాదిరిగా క్రమ్ముకొని వచ్చినప్పుడు వారు అల్లాహ్ కు మొరపెట్టు కుంటారు, తమ ధర్మాన్ని పూర్తిగా ఆయనకే ప్రత్యేకం చేసుకొని.  తరువాత  ఆయన వారిని  రక్షించి నేల మీదకు చేరవేసినప్పుడు, వారిలో కొందరు మితముగా వ్యవహరిస్తారు. మా సూచనలను ద్రోహీ, కృతఘ్నుడూ అయిన వ్యక్తి తప్ప మరెవ్వడూ తిరస్కరించడు.

31. లుఖ్మాన్    33 మానవులారా! మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.  తండ్రీ తన కుమారునికి బదులుగా ముందుకు రాని, కుమారుడూ  తన తండ్రికి బదులుగా నిలబడని రోజుకు భయపడండి, నిస్సందేహంగా అల్లాహ్ వాగ్దానం సత్యం.   కనుక  ఐహిక జీవితం మిమ్మల్ని మోసానికి గురిచేయకూడదు. వంచకులు మిమ్మల్ని అల్లాహ్ విషయంలో వంచనకు గురి చేయకూడదు.

31. లుఖ్మాన్    34 గడియకు సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉన్నది. ఆయనే వర్షాన్ని కురిపిస్తాడు,  తల్లుల గర్భాలలో పెరుగుతున్నదేమిటో ఆయనే ఎరుగును. తాను రేపటి రోజున ఏమి సంపాదించ నున్నదో ప్రాణీ ఎరుగదు. భూభాగంపై తనకు మృత్యువు రానున్నదో వ్యక్తీ ఎరుగడు, అల్లాహ్ యే అంతా తెలిసినవాడూ, అన్నీ ఎరిగినవాడూను.


No comments:

Post a Comment