59. అల్ హష్ర్
ఆయతులు
: 24 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 2 ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్నే స్తుతి స్తోంది. ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడూను. ఆయనే గ్రంథ ప్రజలలోని తిరస్కారులను మొదటి దెబ్బలోనే వారి గృహాలనుండి గెంటివేశాడు. వారు వెళ్ళిపోతారని మీరు ఏమాత్రం ఊహించి ఉండలేదు. వారు కూడ తమను అల్లాహ్ నుండి తమ కోటలు రక్షిస్తాయని భావించారు. కాని అల్లాహ్ వారిపైకి వారు ఊహించని దిశనుండి వచ్చాడు. ఆయన వారి హృదయాలలో బెదురు పుట్టించాడు. తత్ఫలితంగా వారు తమ ఇళ్లను తమ చేతులారా కూడా నాశనం చేసుకున్నారు. విశ్వాసుల చేతుల ద్వారా కూడా నాశనం చేయించుకున్నారు. కనుక కళ్లున్న ప్రజలారా! గుణపాఠం నేర్చుకోండి.
3 - 4 ఒకవేళ అల్లాహ్ దేశబహిష్కార విషయాన్ని వారి నొసట వ్రాసి ఉండకపోతే, ప్రపంచంలోనే ఆయన వారిని శిక్షించి ఉండేవాడు. పరలోకంలో వారి కొరకు నరక శిక్ష ఉండనే ఉంది. వారు అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ వ్యతిరేకించి నందువల్లనే ఇదంతా జరిగింది. అల్లాహ్ ను ఎవడు వ్యతిరేకిం చినా, వాడిని అల్లాహ్ చాల కఠినంగా శిక్షిస్తాడు.
5 మీరు ఏ ఖర్జూరపు చెట్లను నరికివేశారో లేక ఏ ఖర్జూరపు చెట్లను వాటి వ్రేళ్లపై యథాతథంగా ఉండనిచ్చారో, ఇదంతా అల్లాహ్ ఆజ్ఞతోనే జరిగింది. (అల్లాహ్ ఈ ఆజ్ఞను) దుర్మార్గులను అవమానపరచేందుకు (ఇచ్చాడు).
6 - 10 ఏ ఆస్తులను అల్లాహ్, వారి అధీనంలో నుండి తీసుకుని తన ప్రవక్త వైపునకు తరలించాడో,
అవి మీరు మీ గుర్రాలనూ, ఒంటెలనూ పరుగెత్తించగా లభించినటువంటి ఆస్తులు కావు. అల్లాహ్ తన ప్రవక్తలకు తాను కోరిన వారిపై ఆధిపత్యాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ ప్రతిదానిపై అధికారం కలిగి ఉన్నాడు. అల్లాహ్ ఇతర వాడల ప్రజల నుండి దేనినయితే తన ప్రవక్త వైపునకు మరలిస్తాడో, అందులో అల్లాహ్ కు, ప్రవక్తకు, బంధువులకు, అనాధులకు, నిరుపేదలకు, బాటసారులకు హక్కు ఉన్నది. అది మీ ధనికుల మధ్యనే తిరగకుండా ఉండేందుకు ఇలా నిర్ణయించబడిరది. దైవప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాని జోలికిపోకండి. అల్లాహ్ కు భయపడండి, అల్లాహ్ కఠినంగా శిక్షించేవాడు.(ఇంకా ఆ ఆస్తులలో) తమ ఇళ్లనుండీ, తమ ఆస్తిపాస్తుల నుండీ తరిమివేయబడిన నిరుపేద శరణార్ధులకు కూడ హక్కు ఉంది.
వారు అల్లాహ్ అనుగ్రహాన్నీ, ఆయన ప్రసన్నతనూ కోరుకుంటున్నారు. ఇంకా వారు అల్లాహ్కూ, ఆయన ప్రవక్తకూ సహాయ పడేందుకు సదా సంసిద్ధంగా ఉంటారు. వారే ఋజువర్తనులు. (ఇంకా ఆ ఆస్తులలో) ఈ శరణార్థుల రాకకు పూర్వమే, విశ్వసించి వలస కేంద్రంలో స్థిరపడిన వారికి కూడ హక్కు ఉంది. వారు తమ వద్దకు వలస వచ్చిన వారిని ప్రేమిస్తారు. వారికి ఏది ఇవ్వబడినా, దాని అవసరం సైతం ఉన్నట్లుగా వారు తమ మనస్సులలో భావించరు. వారు స్వయంగా అగత్యం కలవారైనప్పటికీ, తమకంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వాస్తవానికి హృదయ లోభత్వం నుండి రక్షింపబడినవారే సాఫల్యం పొందేవారు. (ఇంకా ఆ ఆస్తులలో) వారి తరువాత వచ్చిన వారికి కూడ హక్కు ఉంది. వారు ఇలా అంటారు, ‘‘ఓ ప్రభూ! మమ్మల్నీ, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులంద రినీ, క్షమించు, మా హృదయాలలో విశ్వాసులపట్ల ఎలాంటి ద్వేషాన్నీ కలిగిం చకు. మా ప్రభూ! నీవు చాలా కనికరించేవాడవు, కరుణామయుడవూను.’’
11 - 17 కపట వైఖరి అవలంబించిన వారిని నీవు చూడలేదా? వీరు గ్రంథ ప్రజలలోని అవిశ్వాసులైన తమ సోదరులతో ఇలా అంటారు, ‘‘ఒకవేళ మిమ్మల్ని బహిష్కరించటం జరిగితే, మేము కూడ మీతో పాటు వస్తాము. మీ వ్యవహారంలో మేము ఎవరి మాటైనా ఎంతమాత్రం వినము. ఒకవేళ మీతో యుద్ధం జరిగితే, మీకు మేము సహాయపడతాము.’’ కాని వీరు పరమ అసత్య పరులు
దీనికి అల్లాహ్ యే సాక్షి.
వారు గనక బహిష్కరింపబడితే, వీరు వారితోపాటు ఎంతమాత్రం వెళ్లరు. ఒకవేళ వారితో యుద్ధం జరిగితే, వీరు వారికి ఏమాత్రం సహాయపడరు. ఒకవేళ వీరు వారికి సహాయపడినా, వెన్ను చూపి పారిపోతారు ఆ తరువాత ఎక్కడ నుండీ ఎలాంటి సహాయాన్నీ పొంద లేరు. వీరి హృదయాలలో అల్లాహ్ భయంకంటే మీ భయమే ఎక్కువగా ఉంది
ఎందుకంటే వీరు బుద్ధిహీనులు. వీరు ఎన్నడూ ఒకచోట గుమిగూడి (బహిరంగమైదానంలో) మిమ్మల్ని ఎదుర్కోలేరు. ఒకవేళ పోరాడినా, కోటల రక్షణగల వాడలలో కూర్చుండిగానీ లేదా ప్రాకారాల వెనుక దాగి ఉండిగానీ పోరాడతారు. వీరు పరస్పరం తీవ్రంగా కలహించుకుంటారు. వీరు కలసి కట్టుగా ఉన్నారని నీవు భావిస్తున్నావు. కాని వీరి మనస్సులు పరస్పరం చీలి పోయి ఉన్నాయి. వీరు బుద్ధిహీనులు కావటం వల్లనే వీరి స్థితి ఇలా తయా రయింది. వీరికి కొంతకాలం ముందు,
తాము చేసిన దాని ఫలితాన్ని చవిచూసిన ప్రజల మాదిరిగానే వీరూ ఉన్నారు. వీరికి బాధాకరమైన శిక్ష పడుతుంది. వీరి దృష్టాంతం షైతాన్ దృష్టాంతం మాదిరిగా ఉంది
ప్రారం భంలో వాడు మానవునితో, ‘‘సత్యాన్ని తిరస్కరించు’’ అని అంటాడు. తీరా మానవుడు సత్యాన్ని తిరస్కరిస్తే, వాడు, ‘‘నీ పట్ల నాకు ఏ విధమైన బాధ్యతా లేదు. సకల లోకాల ప్రభువైన అల్లాహ్ అంటే నాకు భయంగా ఉంది’’ అని అంటాడు. తరువాత ఆ ఇద్దరి పర్యవసానం, శాశ్వతంగా నరకానికి పోవటమే. దుర్మార్గులకు లభించే ప్రతిఫలం ఇదే.
18 - 20 విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్ కు భయపడండి. ప్రతి వ్యక్తీ తాను రేపటి కొరకు ఏమి
సమకూర్చుకున్నాడో చూసుకోవాలి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి, నిశ్చయంగా అల్లాహ్ కు మీరు చేసే పనులన్నీ తెలుసు. అల్లాహ్ ను మరచిపోయిన వారి మాదిరిగా మీరూ అయిపోకండి. (అల్లాహ్ ను మరచిపోవటం వల్ల) అల్లాహ్ వారిని తమను తాము మరచిపోయేలా చేశాడు. వారే దుర్మార్గులు. నరకానికి పోయే వారూ స్వర్గానికి పోయేవారూ ఎన్నటికీ ఒకటి కాలేరు. అసలు స్వర్గానికి పోయేవారే కృతార్థులు.
21 ఒకవేళ మేము ఈ ఖుర్ఆన్ను ఏ పర్వతంపైనైనా అవతరింపజేస్తే, అది అల్లాహ్ భయంవల్ల క్రుంగిపోయి, బ్రద్దలైపోవటాన్ని నీవు చూస్తావు. ప్రజలు (తమ స్థితిని గురించి) ఆలోచించాలని మేము ఈ దృష్టాంతాలను వారి ముందు ఉంచుతున్నాము.
22 - 24 ఆయనే అల్లాహ్
ఆయన తప్ప ఆరాధ్యుడెవ్వడూ లేడు
దృశ్యాదృశ్య విషయాలన్నీ ఎరిగినవాడు. ఆయనే కరుణామయుడు, కృపాశీలుడు. ఆయనే అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్యుడెవ్వడూ లేడు. ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతిప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, తన ఉత్తరువులను తిరుగులేని విధంగా అమలుపరచేవాడు, ఎల్లప్పుడూ గొప్ప వాడుగానే ఉండేవాడు. ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరిశుద్ధుడు అల్లాహ్, సృష్టివ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. ఆయనకు మంచి పేర్లు ఉన్నాయి. ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ ఆయనను స్మరిస్తోంది. ఆయన సర్వాధికుడు, వివేకవంతుడూను.
No comments:
Post a Comment