57. అల్ హదీద్
ఆయతులు
: 29 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 6 భూమిలోనూ, ఆకాశాలలోనూ ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతోంది. ఆయనే శక్తిమంతుడు, వివేకవంతుడూను. భూమ్యాకాశాల సామ్రాజ్యానికి ప్రభువు ఆయనే. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు, మరణాన్ని కలిగిస్తున్నాడు, ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడు. ఆయనే ఆరంభమూ, ఆయనే అంతమూ
ఆయనే బాహ్యమూ, ఆయనే గూఢమూ. ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు. ఆయనే ఆకాశాలనూ, భూమినీ, ఆరు దినాలలో సృష్టించాడు, తరువాత అధికార పీఠాన్ని అధిష్టించాడు. భూమి లోపలకు పోయేదీ, అందులో నుండి వెలుపలకు వచ్చేదీ, ఆకాశం నుండి దిగేదీ, దాని లోపలకు ఎక్కేదీ, అంతా ఆయన జ్ఞాన పరిధిలో ఉన్నది. మీరు ఎక్కడ ఉన్నా ఆయన మీతో ఉన్నాడు. మీరు ఏ పని చేస్తూ ఉన్నా, దానిని ఆయన చూస్తున్నాడు. ఆయనే భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి. సమస్త వ్యవహారాలు నిర్ణయ నిమిత్తం ఆయన వైపునకే తీసుకుపోబడతాయి. ఆయనే రాత్రిని పగలులోకి పగలును రాత్రిలోకి ప్రవేశింపజేస్తాడు. హృదయాలలో దాగి ఉన్న రహస్యాలను సైతం ఆయన ఎరుగును.
7 - 10 అల్లాహ్నూ, ఆయన ప్రవక్తనూ విశ్వసించండి. ఆయన మిమ్మల్ని ఏ వస్తువులపై ఖలీఫా (ప్రతినిధి)గా నియమించాడో, వాటిలో నుండి ఖర్చు పెట్టండి. మీలో విశ్వసించి ధనం ఖర్చుపెట్టే వారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. మీకు ఏమయింది, అల్లాహ్ ను మీరు విశ్వసించరు? వాస్తవానికి ప్రవక్త, మీ ప్రభువును విశ్వసించండని మీకు పిలుపునిస్తున్నాడు, ఆయన మీచేత ప్రమాణం చేయించుకున్నాడు, మీరు నిజమైన విశ్వాసులే అయితే. తన దాసునిపై స్పష్టమైన వాక్యాలను అవతరింపజేస్తూ ఉన్నవాడు అల్లాహ్ యే. ఆయన వాటి ద్వారా మిమ్మల్ని చీకట్ల నుండి వెలుగులోకి తీసుకురాదలచుకున్నాడు. యథార్థం ఏమిటంటే,
అల్లాహ్ కు మీరంటే ఎంతో వాత్సల్యం, ఎంతో దయ ఉన్నాయి. అసలు మీరు అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టకపోవటానికి కారణం ఏమిటి? వాస్తవానికి భూమీ,
ఆకాశముల వారసత్వం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మీలో విజయం తరువాత ఖర్చు పెట్టినవారు, జిహాద్ చేసినవారు, విజయానికి పూర్వం ఖర్చుపెట్టిన వారితో, జిహాద్ చేసిన వారితో ఎన్నటికీ సమానులు కాలేరు. వారి అంతస్తు, తరువాత ఖర్చుపెట్టిన వారికంటే, జిహాద్ చేసినవారి కంటే గొప్పది. అయినా అల్లాహ్ ఉభయులకూ మంచివాగ్దానాలు చేసి ఉన్నాడు. మీరు చేసిన దానిని అల్లాహ్ బాగా ఎరుగును.
11 - 15 అల్లాహ్ కు రుణం ఇచ్చేవాడెవడైనా ఉన్నాడా? మంచి రుణం: అటువంటి వానికి అల్లాహ్ దానిని ఎన్నోరెట్లు పెంచి తిరిగి ఇస్తాడు. అతనికి ఎంతో శ్రేష్ఠమైన ప్రతిఫలం లభిస్తుంది. విశ్వాసులైన స్త్రీ పురుషుల ముందూ, వారి కుడివైపునా వారి వెలుగు పరుగెడుతూ ఉండటాన్ని నీవు చూస్తావు. ఆ రోజున (వారితో) ‘‘ఈనాడు మీకు శుభవార్త ఉన్నది’’ అని అనబడుతుంది. క్రిందకాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయి, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇదే మహత్తరమైన సాఫల్యం. ఆనాడు కపట పురుషుల కపట స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు విశ్వాసులతో, ‘‘కొంచెం మావైపు చూడండి, మేము మీ వెలుగు ద్వారా కొంత ప్రయోజనం పొందుతాము’’ అని అంటారు. కాని వారితో, ‘‘వెనక్కి వెళ్లండి. మీ వెలుగును మరొక చోట ఎక్కడైనా వెతుక్కోండి’’ అని అనబడుతుంది. తరువాత వారి మధ్య ఒక గోడను అడ్డుగా నిలబెట్టడం జరుగుతుంది. దానికి ఒక ద్వారం కూడ ఉంటుంది. ఆ ద్వారానికి లోపల సౌఖ్యం, బయట మాత్రం యాతన. వారు విశ్వాసులతో, ‘‘మేము మీతో కలసి ఉండలేదా?’’ అని ఎలుగెత్తి మాటిమాటికీ అరుస్తూ ఉంటారు. విశ్వాసులు ఇలా సమాధానం ఇస్తారు, ‘‘నిజమే, కాని మిమ్మల్ని మీరే స్వయంగా పరీక్షకు గురిచేసుకున్నారు. అవకాశ వాదానికి పాల్పడ్డారు, సందేహంలో పడిపోయారు. లేనిపోని ఆశలు మిమ్మల్ని మోసం చేశాయి. చివరకు అల్లాహ్ నిర్ణయం వచ్చేసింది. అంతిమ క్షణం వరకూ ఆ గజమోసగాడు(షైతాన్) మిమ్మల్ని అల్లాహ్ విషయంలో మోసం చేస్తూ వచ్చాడు. కనుక ఈ రోజు మీనుండి ఎలాంటి పరిహారమూ తీసుకోబడదు. బాహాటంగా అవిశ్వాసానికి ఒడిగట్టిన వారి నుండి
కూడా పరిహారమూ తీసుకోవటం జరగదు. మీ నివాస స్థలం నరకం, అదే మీ మంచి సెబ్బరలను చూస్తుంది. ఇది చాలా చెడ్డ పర్యవసానం.
16 - 17 విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో చలించే సమయం, ఆయన అవతరింపజేసిన సత్యం ముందు వంగిపోయే సమయం ఇంకా రాలేదా? పూర్వం
గ్రంథం ఇవ్వబడిన ప్రజల మాదిరిగా వారు మారిపో కూడదు. ఒక సుదీర్ఘకాలం వారిపై గడచిపోయింది. అప్పుడు వారి హృద యాలు కఠిన మయ్యాయి. ఈనాడు వారిలో అనేకులు పరమ దుర్మార్గులు. బాగా తెలుసుకోండి, అల్లాహ్ భూమికీ, మరణం తరువాత జీవం పోస్తాడని
మేము సూచనలను మీకు స్పష్టంగా చూపించాము, బహుశా మీరు విజ్ఞతతో వ్యవహరిస్తారని.
18 - 19 స్త్రీ పురుషులలో దానధర్మాలు (సదఖా) చేసి అల్లాహ్ కు మంచి రుణం ఇచ్చేవారికి, ఎన్నో రెట్లు పెంచి దానిని తిరిగి ఇవ్వటం జరుగుతుంది
వారికి ఎంతో మంచి ప్రతిఫలం లభిస్తుంది. అల్లాహ్నూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించిన వారే తమ ప్రభువు దృష్టిలో సత్యసంధులు (సిద్దీఖ్) మరియు సాక్షులూను (షహీద్). వారికి వారి ప్రతిఫలం, వారి జ్యోతి లభిస్తాయి. అవి శ్వాసానికి ఒడిగట్టినవారు, మా వాక్యాలను నిరాకరించినవారు నరకవాసు లవుతారు.
20 - 21 బాగా తెలుసుకోండి, ఈ లౌకిక జీవితం ఒక ఆట, ఒక వినోదం, బాహ్య పటాటోపం,
పరస్పరం ప్రగల్భాలు పలకటం, సంపద, సంతానాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిక్యం పొందటానికి ప్రయత్నించటం తప్ప మరేమీ కాదు. దాని దృష్టాంతం ఇలా ఉంది: ఒక వర్షం కురిసింది. అప్పుడు దాని వల్ల మొలకెత్తి పెరిగిన చెట్లూ చేమలను చూచి, రైతులు సంబరపడ్డారు. తరువాత, అవే పండుతాయి. ఆ తరువాత అవి పసుపుపచ్చగా మారిపోవటాన్ని నీవు చూస్తావు. ఆపై అవి ఎండిపోయి పొట్టుగా మారిపోతాయి. దీనికి భిన్నంగా, పరలోకం ఇలా ఉంటుంది: అక్కడ తీవ్రమైన శిక్ష ఉంటుంది, అల్లాహ్ క్షమాభిక్ష, ఆయన ప్రసన్నత ఉంటాయి. ప్రాపంచిక జీవితం ఒక మాయ తడిక తప్ప మరేమీ కాదు. మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి, ఒకరికంటే ఒకరు ముందుకుపోయే కృషి చేయండి
ఆకాశాలంత, భూమి యంత విశాలమైన స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది అల్లాహ్నూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించిన వారి కొరకు సిద్ధం చేయబడిరది. ఇది అల్లాహ్ అనుగ్రహం
తాను కోరిన వారికి ఆయన దానిని ప్రసాదిస్తాడు. అల్లాహ్ ఎంతో అనుగ్రహం కలవాడు.
22 - 24 భూమిపై గానీ లేదా స్వయంగా మీ ఆత్మలపై గానీ అవతరించే ఏ ఆపద అయినా సరే, దానిని మేము ఉనికిలోకి తీసుకువచ్చే ముందు ఒక గ్రంథం (అంటే భాగ్యగ్రంథం)లో వ్రాసి పెట్టకుండా ఉండలేదు. అలా చేయటం అల్లాహ్ కు చాలా సులభం. (ఇదంతా ఎందుకంటే) మీకు ఎలాంటి నష్టం జరిగినా,
దానికి మీరు బాధపడకుండా ఉండాలని, అల్లాహ్ మీకు ఏదైనా ప్రసాదిస్తే, దానికి మీరు మురిసిపోకుండా ఉండాలని. తమను తాము గొప్ప వారమని
భావించి, అహంభావం ప్రదర్శించే వారిని అల్లాహ్ ప్రేమించడు. వారు స్వయంగా లోభత్వం పాటించటమే కాక, ఇతరులను కూడా లోభత్వానికి పురికొలుపుతారు. ఇక, ఒకవేళ ఎవడైనా
ముఖం త్రిప్పుకుంటే, సద్గుణ సంపన్నుడైన అల్లాహ్ అక్కరలేనివాడు.
25 మేము మా ప్రవక్తలను స్పష్టమైన సూచనలతో, హితోపదేశాలతో పంపాము. వారితో పాటు గ్రంథాన్నీ, త్రాసునూ అవతరింపజేశాము
ప్రజలు న్యాయంపై స్థిరంగా నిలబడాలని. ఇనుమునూ దింపాము. అందులో మహత్తర మైన శక్తి ఉన్నది, ప్రజలకు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇలా ఎందుకు చేయ బడిరదంటే, ఆయనను చూడకుండానే ఎవడు ఆయనకూ, ఆయన ప్రవక్తలకూ సహాయపడతాడో అల్లాహ్ కు తెలియాలని. నిశ్చయంగా అల్లాహ్ ఎంతో దృఢమైనవాడు, సర్వశక్తిమంతుడూను.
26 - 27 మేము నూహ్నూ, ఇబ్రాహీమ్నూ పంపాము. ఆ ఉభయుల సంతతిలో ప్రవక్త పదవినీ, గ్రంథాన్నీ పెట్టాము. తరువాత వారి సంతానంలో కొందరు సన్మార్గాన్ని
అవలంబించారు కాని
చాలా మంది అవిధేయులై పోయారు. వారి తరువాత మేము వరుసగా ప్రవక్తలను పంపాము. వారందరి తరువాత మర్యమ్ కుమారుడు ఈసాను ప్రభవింపజేశాము, ఆయనకు ఇన్జీల్ను ప్రసాదించాము. ఆయనను అనుసరించిన వారి హృదయాలలో మేము జాలిని, కరుణను కలిగించాము. వైరాగ్యాన్ని (రుహ్బానియత్) వారు స్వయంగా కనిపెట్టారు. మేము దానిని వారిపై విధించలేదు. కాని అల్లాహ్ ప్రసన్నతను పొందటానికి వారే స్వయంగా ఈ దురాచారాన్ని సృష్టించారు. తరువాత దానిని
పాటించే విషయంలో,
న్యాయం చేకూర్చలేకపోయారు. వారిలో విశ్వసించిన వారికి మేము వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో పలువురు అవిధేయులు.
28 - 29 విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కు భయపడండి, ఆయన ప్రవక్త (ముహమ్మద్ - సఅసమ్)ను విశ్వసించండి. అల్లాహ్ మీకు తన కారుణ్యంలో నుంచి రెట్టింపు భాగాన్ని ప్రసాదిస్తాడు, మీకు జ్యోతిని ప్రసాదిస్తాడు, దాని వెలుగులో మీరు నడుస్తారు, మీ పొరపాట్లను క్షమిస్తాడు. అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, కనికరించేవాడూను. అల్లాహ్ అనుగ్రహంపై వారికి ఏ విధమైన గుత్తాధిపత్యం లేదనీ, అల్లాహ్ అనుగ్రహం స్వయంగా ఆయన చేతులలోనే ఉన్నదనీ, తాను కోరిన వారికి ఆయన దానిని ప్రసాదిస్తాడనీ, ఆయన గొప్ప అనుగ్రహశాలి అనీ గ్రంథ ప్రజలు తెలుసుకోవాలని.
No comments:
Post a Comment