23. అల్
మూ’మినూన్
ఆయతులు
: 118 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
23. అల్
మూ’మినూన్ 1
- 11 నిశ్చయముగా సాఫల్యం పొందే విశ్వాసులు తమ నమాజులో వినమ్రతను పాటిస్తారు. వ్యర్థ విషయాల జోలికిపోరు. జకాత్ విధానాన్ని ఆచరిస్తారు, తమ మర్మాంగాలను పరిరక్షించుకుంటారు, - తమ భార్యల, తమ అధీనంలో ఉన్న స్త్రీల విషయంలో తప్ప. వీరి విషయంలో పరిరక్షించు కోని పక్షంలో వారు నిందార్హులు కారు. అయితే ఎవరైనా దీనిని మించి కోరుకుంటే వారే అత్యాచారం చేసేవారు- తమ అమానతులకు, తమ వాగ్దానా లకు కట్టుబడి ఉంటారు, తమ నమాజులను శ్రద్ధగా కాపాడుకుంటారు. వారే స్వర్గాన్ని వారసత్వంగా పొందేవారు.
అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
23. అల్
మూ’మినూన్ 12
- 16 మేము మానవుణ్ణి మట్టియొక్క సారంతో సృష్టించాము
తరువాత అతనిని ఒక సురక్షితమైన స్థానంలో పడే బిందువుగా మార్చాము, ఆ తరువాత ఈ బిందువుకు ముద్ద ఆకారాన్ని ఇచ్చాము, ఆపైన ముద్దను కండగా చేశాము, తరువాత మాంసపుకండను ఎముకలుగా చేశాము, ఆ తరువాత ఎముకలకు మాంసాన్ని తొడిగాము, ఆపైన దానిని భిన్నమైన సృష్టిగా చేసి నిలబెట్టాము. కనుక అల్లాహ్ ఎంతో శుభప్రదుడు, సృజనకారులందరిలోకెల్లా ఉత్తమ సృజన కారుడు. దాని తరువాత మీరు తప్పనిసరిగా మరణిస్తారు. మళ్లీ ప్రళయం నాడు నిస్సందేహంగా లేపబడతారు.
23. అల్
మూ’మినూన్ 17
- 20 మీపైన మేము ఏడు మార్గాలను నిర్మించాము
సృష్టిక్రియను మేము ఎరుగనివారము కాము. ఆకాశం నుండి మేము సరిగ్గా లెక్క ప్రకారం ఒక ప్రత్యేక పరిమాణంలో నీటిని దింపాము, దానిని భూమిలోపల నిలువ చేశాము. మేము దానిని ఎలా కోరితే అలా మాయం చేయగలం. తరువాత ఆ నీటి ద్వారా మేము మీ కొరకు ఖర్జూరపు తోటలనూ, ద్రాక్ష తోటలనూ సృష్టించాము. ఈ తోటలలో మీ కొరకు అత్యంత రుచికరమైన పండ్లు ఉన్నాయి
వాటి ద్వారా మీరు ఉపాధిని పొందుతారు. ఇంకా మేము తూరు సీనా ప్రాంతంలో పుట్టే చెట్టును కూడ సృష్టించాము, అది నూనెను కూడ ఇస్తుంది. ఇంకా తినేవారికి కూరగా కూడ ఉపయోగపడుతుంది.
23. అల్
మూ’మినూన్ 21
- 22 నిజంగానే పశువులలో కూడ మీకు ఒక గుణపాఠం ఉంది. వాటి గర్భాలలో ఉన్న దానినుంచే మేము ఒక వస్తువును (అంటే పాలు) మీకు త్రాపుతున్నాము. మీకు వాటిలో ఇంకా ఎన్నో ఇతర లాభాలు కూడ ఉన్నాయి. వాటిని మీరు తింటారు, వాటిపైనా, పడవలలోనూ ఎక్కుతారు కూడ.
23. అల్
మూ’మినూన్ 23
- 29 మేము నూహ్ ను అతని జాతి వారి వద్దకు పంపాము. అతను ఇలా అన్నాడు, ‘‘ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్ కు దాస్యం చేయండి, ఆయన తప్ప మీకు ఆరాధ్య దైవమెవ్వడూ లేడు. కాబట్టి మీరు ఆయనకు భయపడరా?’’ విశ్వసించటానికి తిరస్కరించిన అతని జాతిలోని సర్దారులు ఇలా అనసాగారు, ‘‘ఈ వ్యక్తి మీవంటి ఒక మానవుడే తప్ప మరేమీ కాడు. మీపై ఆధిక్యత సాధించటం ఇతని అభిమతం. అల్లాహ్ గనుక పంపదలిస్తే, దైవదూతలను పంపిఉండేవాడు. (మానవులు దైవప్రవక్తలుగా వస్తారనే) ఈ విషయాన్ని మేము మా పెద్దల కాలాలలో కూడ ఎన్నడూ వినలేదు. ఏమీలేదు, ఈ మనిషికి కొంచెం పిచ్చిపట్టింది. ఇంకా కొంతకాలం వేచి చూడండి, (బహుశా నయమవుతుందేమో). నూహ్ ఇలా అన్నాడు, ‘‘ప్రభూ! ఈ ప్రజలు నన్ను నిరాకరించారు ఇక నీవే నాకు దిక్కు.’’ మేము అతనిపైకి ఇలా వహీ పంపాము, ‘‘మా పర్యవేక్షణలో, మా వహీ ప్రకారం ఒక నావను తయారు చెయ్యి. తరువాత మా ఆజ్ఞ వచ్చినప్పుడు, పొయ్యిపొంగినప్పుడు, ప్రతి రకపు జంతుజాతి నుండి ఒక్కొక్క జంటను తీసుకుని అందులో ఎక్కు, నీ కుటుంబ సభ్యులను కూడ వెంట
తీసుకునిపో,
ఎవరికి వ్యతిరేకంగానైతే ఇదివరకే నిర్ణయం జరిగినదో వారిని తప్ప. దుర్మార్గుల విషయంలో నాతో ఏమీ చెప్ప వద్దు. ఇక వారు మునిగిపోయేవారే. తరువాత నీవు నీ సహచరులతో పాటు నావపైకి ఎక్కినప్పుడు, ‘‘దుర్మార్గుల నుండి మాకు విమోచనం కలిగించిన దేవునికి కృతజ్ఞతలు’’ అని అను. ఇంకా, ‘‘స్వామీ! నన్ను శుభప్రదమైన స్థలంలో దించు, నీవు స్థలం ఇచ్చేవారిలో ఉత్తముడవు’’ అని పలుకు.
23. అల్
మూ’మినూన్ 30 ఈ గాధలో గొప్ప సూచనలు ఉన్నాయి. మేము ప్రజలను తప్పకుండా పరీక్షకు గురిచేస్తాము.
23. అల్
మూ’మినూన్ 31
- 41 వారి తరువాత మేము మరొక తరం వారిని లేపాము. వారి వద్దకు వారి జాతికే చెందిన ఒక ప్రవక్తను పంపాము. (అతను వారికి ఇలా సందేశమిచ్చాడు) ‘‘అల్లాహ్ కు దాస్యం చెయ్యండి. మీకు ఆయన తప్ప మరొక ఆరాధ్యుడెవ్వడూ లేడు.
మీరు ఆయనకు భయపడరా?’’ విశ్వసించటానికి తిరస్కరించినటువంటి, పరలోక
సమావేశం అబద్ధమని నిరాకరించినటు వంటి, ఇహలోక జీవితంలో మేము భాగ్యవంతులుగా చేసినటువంటి అతని జాతి సర్దారులు ఇలా అనటం ప్రారంభించారు, ‘‘ఈ వ్యక్తి ఏమీకాడు, మీవంటి ఒక మానవుడు తప్ప. మీరు తినే దాన్నే ఇతడూ తింటాడు, మీరు త్రాగే దాన్నే ఇతడూ త్రాగుతాడు. ఇప్పుడు మీరు గనుక మీ వంటివాడే అయిన ఒక మానవుడికి విధేయతను చూపినట్లైతే, మీరు నష్టానికే గురిఅవుతారు. ఇతను మీకు తెలియజేసేదేమిటంటే, మీరు మరణించి మట్టిగా మారిపోయిన తరువాత, ఎముకల గూడుగా అయిపోయిన తరువాత, మీరు (గోరీల నుండి) బయటికి తీయబడతారట. అసంభవం, మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం. ఇహలోక జీవితం తప్ప మరొక జీవితం లేనేలేదు. మనం ఇక్కడే జీవిస్తాము, ఇక్కడే మరణిస్తాము. మనం ఎంతమాత్రం తిరిగి లేపబడము. ఈ వ్యక్తి దేవుని పేరుతో కేవలం అబద్ధాలు కల్పిస్తున్నాడు. మేము అతను చెప్పేదానిని ఎన్నటికీ విశ్వసించం.’’ దానిపై దైవప్రవక్త ఇలా ప్రార్థించాడు, ‘‘ప్రభూ! ఈ ప్రజలు నన్ను నిరాకరించారు. ఇక దాని విషయంలో నీవే నాకు సహాయపడు.’’ దానికి బదులుగా ఇలా సెలవీయబడిరది, ‘‘ఆ సమయం దగ్గరలోనే ఉంది. అప్పుడు వారు తాము చేసిన దానికి పశ్చాత్తాప పడతారు.’’ చివరకు సరిగ్గా సత్యం ప్రకారమే ఒక పెద్ద కల్లోలం వారిని చుట్టుముట్టింది. దుష్టులారా దూరంగా పొండి, అని మేము వారిని కసువులాగా ఊడ్చి పారవేశాము.
23. అల్
మూ’మినూన్ 42
- 44 మేము వారి తరువాత ఇతర జాతులను లేపాము. ఏ జాతి అయినా తన గడువుకు ముందు నశింపనూలేదు, తన గడువుకు తరువాత జీవింపనూ లేదు. తరువాత మేము మా ప్రవక్తలను ఒకరి తరువాత ఒకరిని పంపాము. ఏ జాతి వద్దకైనా దాని ప్రవక్త వచ్చినప్పుడల్లా అది అతనిని నిరాకరిస్తూనే వచ్చింది. మేము ఒక జాతి తరువాత మరొక జాతిని నాశనం చేస్తూనేపోయాము చివరకు వాటిని గాధలుగానే చేసి వదిలాము - విశ్వసించని వారిపై శాపం విరుచుకుపడుగాక!
23. అల్
మూ’మినూన్ 45
- 49 తరువాత మేము మూసానూ, అతని సోదరుడు హారూన్నూ మా సూచనలతో, స్పష్టమైన ఆధికారిక ప్రమాణంతోనూ, ఫిరౌను వద్దకూ అతని అధికారుల వద్దకూ పంపాము. కాని వారు అహంభావం కనబరచారు మరీ పొగరుబోతులై. ‘‘మేము మా వంటివారే అయిన ఇద్దరు మనుషులను విశ్వసిం చాలా? ఆ మనుషులైనా మా వద్ద బందీగా ఉన్న జాతికి చెందినవారు’’ అని వారు
ఆ ఇద్దరినీ తిరస్కరించారు, నాశనమయ్యే వారిలో చేరిపోయారు. ప్రజలు మార్గదర్శకత్వాన్ని పొందటానికి మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము.
23. అల్
మూ’మినూన్ 50 మర్యమ్ కుమారుణ్ణీ, అతని తల్లినీ మేము ఒక సూచనగా చేశాము, వారిని ఒక పీఠభూమిపై ఉంచాము
అది మిక్కిలి ప్రశాంతమైన స్థలం, అందులో సెలయేళ్లు ప్రవహించేవి.
23. అల్
మూ’మినూన్ 51
- 52 ఓ ప్రవక్తలారా! స్వచ్ఛమైన వస్తువులను తినండి, మంచిపనులు చేయండి. మీరు ఏది చేసినా, అది నాకు తెలియకపోదు. మీ ఈ సంఘం ఒకే సంఘం, నేను మీ ప్రభువును, కనుక మీరు నాకు మాత్రమే భయపడండి.
23. అల్
మూ’మినూన్ 53
- 54 కాని తరువాత ప్రజలు తమ ధర్మాన్ని వారిలో వారే ముక్కలు ముక్కలుగా చేసుకున్నారు. ప్రతివర్గం తన వద్ద ఉన్న దానితోనే ఆనంద పరవశమై ఉన్నది - మంచిది, వారిని విడిచిపెట్టండి, ఒక ప్రత్యేక కాలం వరకు తమ అజాగ్రత్తలోనే మునిగి ఉండనివ్వండి.
23. అల్
మూ’మినూన్ 55
- 67 మేము వారికి సంపదలూ సంతానమూ ప్రసాదించి సహాయపడుతూ ఉన్నాము అంటే, వారికి మేళ్లు చేయటంలో మేము తొందరపడుతున్నామని వారు అనుకుంటున్నారా? లేదు, అసలు విషయమేమిటో వారికి తెలియదు. యథార్థానికి, ఎవరు తమ ప్రభువు భయంవల్ల భయపడుతూ ఉంటారో, ఎవరు తమ ప్రభువు వాక్యాలను విశ్వసిస్తారో, ఎవరు తమ ప్రభువునకు ఇతరులను భాగస్వాములుగా చేయరో ఎవరు, తాము ఇవ్వగలిగినది ఇస్తుంటారో, కాని వారి హృదయాలు తమ ప్రభువు వైపునకు మరలి పోవలసి ఉన్నది అనే భావన వల్ల వణుకుతూ ఉంటాయో వారే మేళ్ల వైపునకు పరుగులు తీస్తారు, పోటీపడి వాటిని పొందుతారు. మేము ఏ వ్యక్తినీ అతని శక్తికి మించిన కష్టానికి గురిచేయము. మా వద్ద ఒక గ్రంథం ఉన్నది, అది (ప్రతి వ్యక్తిని గురించి) ఉన్నది ఉన్నట్లుగా తెలుపుతుంది. ప్రజలకు ఎట్టి పరిస్థితు ల్లోనూ అన్యాయం చెయ్యటం జరగదు. కాని వారికి ఈ విషయం గురించి తెలియదు. వారి కర్మలు కూడ (పైన ప్రస్తావించబడిన) పద్ధతికి భిన్నంగా ఉన్నాయి. (వారు తమ ఈ చేష్టలను చేస్తూనేపోతారు) చివరకు మేము వారి లోని భోగలాలసులను శిక్షించే నిమిత్తం పట్టుకున్నప్పుడు, వారు పెడబొబ్బలు పెట్టటం ప్రారంభిస్తారు - ఇక కట్టిపెట్టండి మీ ఫిర్యాదులను, మీ రోదనలను, మా తరఫు
నుండి ఇక ఏ సహాయమూ మీకు లభించటం జరగదు. నా వాక్యాలు వినిపించబడేటప్పుడు మీరు (దైవప్రవక్త కంఠం విన్నంతనే) వెనక్కి తిరిగి పరుగెత్తేవారు, మీ అహంకారం వల్ల అతనిని అసలు లక్ష్యపెట్టేవారే కాదు,
మీ చావిళ్లలో అతనిని ఎద్దేవా చేసేవారు, అతనిని గురించి వ్యర్థ ప్రలాపాలు పలికేవారు.
23. అల్
మూ’మినూన్ 68
- 71 వారు ఎన్నడూ ఈ (దైవ) వాక్కును గురించి ఆలోచించనేలేదా? లేక వారి పూర్వుల వద్దకు ఎన్నడూ రాని విషయాన్ని దేన్నయినా అతను తీసుకువచ్చాడా? లేక వారు తమ ప్రవక్తను ఇదివరకెన్నడూ ఎరుగరు కాబట్టి (కొత్త మనిషైన కారణంగా) అతనంటే బెదురుతున్నారా? లేక అతను పిచ్చి వాడని వారి అభిప్రాయమా? కాదు, పైగా అతను సత్యాన్ని తీసుకువచ్చాడు అసలు వారిలో చాలామందికి సత్యమంటేనే గిట్టదు - సత్యమే గనక వారి కోరికలను అనుసరించి ఉంటే, భూమ్యాకాశాలూ, వాటిలోని జీవరాశి వ్యవస్థా ఛిన్నాభిన్నమై ఉండేవి - కాదు,
అయితే మేమే వారి సొంత ప్రస్తావనను వారి ముందు తీసుకువచ్చాము. కాని వారు తమ ప్రస్తావన నుండి ముఖం తిప్పుకుంటున్నారు.
23. అల్
మూ’మినూన్ 72
- 74 నీవు వారిని ప్రతిఫలమేదైనా అడుగుతున్నావా? నీకు నీ ప్రభువు ఇచ్చినదే శ్రేష్ఠమైనది. ఆయన శ్రేష్ఠుడైన ఉపాధిప్రదాత. నీవు వారిని ఋజు మార్గం వైపునకు పిలుస్తున్నావు. కాని పరలోకాన్ని నమ్మనటువంటి వారు ఋజుమార్గం నుండి వైదొలగి నడువగోరుచున్నారు.
23. అల్
మూ’మినూన్ 75
- 77 ఒకవేళ మేము వారిపై దయచూపితే, వారు ఈనాడు గురిఅయిన ఆపదను తొలగిస్తే, అప్పుడు వారు తమ తలబిరుసుతనంతో పూర్తిగా అంధులై పోతారు.
అసలు వారి పరిస్థితి ఎలా ఉందంటే
మేము వారిని ఆపదకు గురిచేశాము, అయినా వారు తమ ప్రభువు ముందు వంగలేదు
అణకువనూ అవలంబించలేదు. కాని చివరకు మేము వారికై కఠిన శిక్షా ద్వారాన్ని తెరిచే టంతటి పరిస్థితి ఏర్పడినప్పుడు, వారు ప్రతిశుభం పట్ల హతాశులు కావటాన్ని నీవు అకస్మాత్తుగా చూస్తావు.
23. అల్
మూ’మినూన్ 78
- 83 మీకు వినేశక్తినీ చూసే శక్తినీ ఇచ్చినవాడు, ఆలోచించటానికి హృదయం ఇచ్చినవాడూ అల్లాహ్ యే. కాని మీరు కృతజ్ఞత చూపటం అనేది చాల అరుదు. మిమ్మల్ని ధరణిపై వ్యాపింప జేసినవాడు ఆయనే, ఆయన వైపునకే మీరు సమీకరింపబడతారు. ఆయనే జీవితాన్ని ప్రసాదిస్తాడు మరియు ఆయనే మరణాన్నీ కలిగిస్తాడు. రేయింబవళ్ల పరిభ్రమణం ఆయన అధీనంలోనే ఉన్నది. ఈ విషయం మీకు అర్థం కావటం లేదా? కాని వారు తమ పూర్వీకులు అన్నదానినే అంటున్నారు. వారు ఇలా అంటారు,
‘‘మేము చచ్చి,
మట్టిగా మారినప్పుడు, అస్థిపంజరంగా అయిపోయినప్పుడు, మమ్మల్ని మళ్లీ బ్రతికించి లేపటం అనేది జరుగుతుందా? మేము కూడ ఇటువంటి వాగ్దానాలు ఎన్నో విని ఉన్నాము
మాకు పూర్వం మా తాతముత్తాతలు కూడ వింటూనే వచ్చారు. ఇవి కేవలం పాతకాలపు కట్టుకథలే.’’
23. అల్
మూ’మినూన్ 84
- 92 వారిని ఇలా అడుగు, ‘‘మీకు తెలిస్తే చెప్పండి, ఈ భూమీ, దాని లోని ప్రాణులన్నీ ఎవరివో?’’ వారు తప్పకుండా, ‘‘అల్లాహ్ కు చెందుతాయి’’ అని అంటారు. ‘‘అలాంటప్పుడు మీరు ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోరు?’’ అని అను.
వారిని ఇంకా ఇలా అడుగు, ‘‘సప్తాకాశాలకూ, మహోన్నతమైన పీఠానికీ ప్రభువు ఎవరు?’’ వారు తప్పకుండా, ‘‘అల్లాహ్’’ అని అంటారు. ‘‘అలాంటప్పుడు మీరు ఎందుకు ఆయనకు భయపడరు?’’ అని అను.
వారితో ఇంకా ఇలా అను, ‘‘మీరు గనక ఎరిగి ఉంటే చెప్పండి,
ప్రతి దానిపై ఆధిపత్యం ఎవరికున్నదో? ఇంకా శరణు ఇచ్చేవాడెవడో చెప్పండి? ఆయనకు ప్రతిగా శరణు ఇవ్వగల వాడెవ్వడూ లేడు.’’ వారు తప్పకుండా, ‘‘ఈ శక్తిగలవాడు అల్లాహ్ యే’’ అని అంటారు. ‘‘అలాంటప్పుడు మీరు ఎలా మోసపోతున్నారు?’’ అని అను. సత్య విషయాన్ని మేము వారి ముందుకు తీసుకువచ్చాము. వారు అబద్ధం చెప్పేవారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అల్లాహ్ ఎవరినీ తన
సంతానంగా చేసుకోలేదు మరియు మరొక దేవుడెవ్వడూ ఆయనతో పాటు లేడు. ఒకవేళ అలా అయితే, ప్రతి దేవుడు తన సృష్టిని తీసుకుని వేరుపడిపోయేవాడు తరువాత వారు ఒకరిపై ఒకరు దండయాత్రలు చేసి ఉండేవారు. వారు కల్పించే విషయాలు ఏమాత్రం వర్తిం చని పరిశుద్ధుడు అల్లాహ్. గోప్యంగా ఉన్నదానినీ, బహిరంగంగా ఉన్నదానినీ ఎరిగినవాడు, దైవత్వంలో వారు ప్రతిపాదించే భాగస్వామ్యానికి ఆయన అతీతుడు.
23. అల్
మూ’మినూన్ 93
- 95 ఓ ప్రవక్తా! ఇలా ప్రార్థించు, ‘‘ప్రభూ! ఏ శిక్షను గురించి వారిని బెదిరించటం జరుగుతోందో, దానిని నేను ఉన్నప్పుడే నీవు అమలుపరచి నట్లయితే, నా ప్రభూ! నన్ను ఈ దుర్మార్గులలో చేర్చకు.’’ యథార్థమేమిటంటే, మేము దేనిని గురించి వారిని బెదిరిస్తున్నామో దానిని నీకళ్ల ముందే అమలుచేయగల సకల శక్తిని మేము కలిగి ఉన్నాము.
23. అల్
మూ’మినూన్ 96
- 98 ఓ ప్రవక్తా! చెడును ఉత్తమమైన పద్ధతి ద్వారా నివారించు. ఏ విషయాలను వారు నిన్ను గురించి కల్పిస్తున్నారో, అవి మాకు బాగా తెలుసు. ఇలా ప్రార్థించు,
‘‘ప్రభూ! షైతానుల ప్రేరణల నుండి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. నా ప్రభూ! అవి నా వద్దకు అసలు రాకుండేటట్లు నిన్ను శరణు వేడుకుంటున్నాను.’’
23. అల్
మూ’మినూన్ 99
- 115 (వారు తమ చేష్టలను మానుకోరు) చివరకు వారిలో ఎవడికైనా మరణం వస్తే
వాడు ఇలా అనటం ప్రారంభిస్తాడు, ‘‘ఓ నా ప్రభూ! నేను వదలిపెట్టివచ్చిన లోకానికే
నన్ను తిరిగి పంపెయ్యి
ఇక నేను మంచిపనులు చేస్తానని ఆశిస్తున్నాను.’’ ఇది ఎంతమాత్రమూ జరిగేది కాదు, అతడు పలికేది కేవలం ఒక మాట మాత్రమే. ఇప్పుడు ఈ (మరణించేవారి) అందరి వెనుక ఒక గోడ అడ్డంగా ఉన్నది. అది మరొక జీవితం వచ్చే రోజు వరకు ఉంటుంది. తరువాత శంఖం ఊదబడినంతనే వారి మధ్య ఏ బంధుత్వమూ ఉండదు, వారు ఒకరినొకరు పరామర్శించుకోరు. అప్పుడు ఎవరి (త్రాసు) పళ్లెములు బరువుగా ఉంటాయో వారే సాఫల్యం పొందుతారు. ఎవరి (త్రాసు) పళ్లెములు తేలికగా ఉంటాయో, వారే తమను తాము నష్టానికి గురిచేసుకునేవారు. వారు నరకంలో శాశ్వతంగా ఉంటారు, అగ్ని
వారి ముఖాల చర్మాన్ని తిని వేస్తుంది, వారి దవడలు బయటపడతాయి
- ‘‘నా వాక్యాలు మీకు వినిపించ బడేటప్పుడు వాటిని నిరాకరించినవారు మీరేకదా?’’ వారు ఇలా అంటారు, ‘‘ఓ మా ప్రభూ! మా దౌర్భాగ్యం మమ్మల్ని కప్పేసింది. నిజంగానే మేము మార్గం తప్పిన వారము. ఓ స్వామీ! ఇక మమ్మల్ని ఇక్కణ్ణుంచి బయటకు తీయి. తరువాత మేము అటువంటి పాపాలు చేస్తే, దుర్మార్గులమవుతాము.’’ అల్లాహ్ దానికి ఇలా సమాధానం పలుకుతాడు, ‘‘నా ముందునుంచి వెళ్లి పోండి, ఇందులోనే
పడి ఉండండి,
నాతో మాట్లాడకండి.’’ నా దాసులు కొందరు, ‘‘మా ప్రభూ! మేము విశ్వసించాము. మమ్మల్ని క్షమించు. మాపై దయచూపు. నీవు కరుణామయులలోకెల్లా ఉత్తమ కరుణామయుడవు’’ అని అన్నప్పుడు, వారిని పరిహసించింది మీరేకదా! చివరకు వారిపట్ల మీ మంకువైఖరి మిమ్మల్ని, ‘‘నేనూ ఒకణ్ణి ఉన్నాను’’ అనే విషయాన్ని కూడ మరచిపోయేలా చేసింది. మీరు వారిని పరిహసిస్తూనే పోయారు. ఈనాడు నేను వారి సహనానికి ఈ ప్రతిఫలం ఇచ్చాను. వారే సఫలురు. తరువాత అల్లాహ్ వారిని ఇలా అడుగుతాడు, ‘‘చెప్పండి, భూలోకంలో మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు.’’ వారు, ‘‘మేము ఒక రోజో లేక రోజులో కొంత భాగమో అక్కడ ఉన్నాము. లెక్కపెట్టేవారిని అడగండి’’ అని అంటారు. ఇలా సెలవీయబడుతుంది: ‘‘కొంతకాలమే ఉన్నారు కదా! అయ్యో మీరు ఈ విషయాన్ని అప్పుడు తెలుసుకుని ఉంటే ఎంత బాగుండేది. మేము మిమ్మల్ని వృధాగానే పుట్టించామని, మా వైపునకు మీరు ఎన్నడూ మరలిరావటమనేది జరగదని భావించారా?’’
23. అల్
మూ’మినూన్ 116
- 117 కనుక అల్లాహ్ మహోన్నతుడు, నిజమైన చక్రవర్తి. ఆయన తప్ప మరొక దేవుడు లేనేలేడు, గౌరవ పీఠానికి స్వామి. ఎవడైనా అల్లాహ్తో పాటు మరొక ఆరాధ్యుణ్ణి వేడుకుంటే, దానికి అతని వద్ద ఏ ప్రమాణమూ లేదు. అతని లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. అటువంటి అవిశ్వాసులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు.
23. అల్ మూ’మినూన్ 118 ఓ ప్రవక్తా! ఇలా అను: ‘‘నా ప్రభూ! మన్నించు, కరుణించు. కరుణా మయులందరిలో కెల్లా నీవు ఉత్తమ కరుణామయుడవు.’’
No comments:
Post a Comment