14 సూరహ్ ఇబ్రాహీమ్‌

 

14. ఇబ్రాహీమ్

ఆయతులు : 52          అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

14. ఇబ్రాహీమ్  1 - 2 అలిఫ్లామ్రా.  ముహమ్మద్‌!  ఇది ఒక గ్రంథం. మేము దీనిని నీ వైపునకు అవతరింపజేశాము, నీవు ప్రజలను వారి ప్రభువు అనుమతితో చీకట్లలో నుండి వెలికితీసి వెలుగులోకి తీసుకురావాలని- మహాశక్తిమంతుడూ, స్వతహ స్తోత్రాలకు అర్హుడూ, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తానికీ స్వామి అయిన దేవుని మార్గం మీదకు తీసుకురావాలని.

14. ఇబ్రాహీమ్  2 - 3 సత్యాన్ని స్వీకరించటానికి తిరస్కరించేవారికి కఠినమైన, వినాశకరమైన శిక్ష పడుతుంది. వారు పరలోక జీవితం కంటే ఇహలోక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారు ప్రజలను అల్లాహ్ మార్గం నుండి వారిస్తారు. వారు మార్గం (తమ కోరికలకు అనుగుణంగా) వక్రమైనదిగా కావాలని కోరుతున్నారు. వారు మార్గభ్రష్టత్వంలో చాలాదూరం వెళ్లిపోయారు.

14. ఇబ్రాహీమ్  4 మేము మా సందేశాన్ని అందజేసే నిమిత్తం ప్రవక్తను పంపినప్పుడల్లా, అతడు తన జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే మా సందేశాన్ని అందజేశాడు, వారికి అతడు విషయాన్ని చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పటానికి. అల్లాహ్ తాను మార్గభ్రష్టులుగా చేయదలచుకున్న వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు. తాను మార్గం చూపదలచుకున్నవారికి మార్గం చూపుతాడు. ఆయన శక్తిసంపన్నుడూ, వివేక సంపన్నుడూను.

14. ఇబ్రాహీమ్  5 మేము ఇంతకు ముందు మూసాను కూడా మా సూచనలను ఇచ్చి పంపివున్నాము. ఆయనను కూడా మేము ఇలా ఆజ్ఞాపించాము : నీ జాతివారిని చీకట్లలోనుండి బయటికి తీసి వెలుగులోకి తీసుకురా. దైవ చరిత్రలోని గుణపాఠంతో నిండివున్న సంఘటనలను వారికి వినిపించి హితబోధ చెయ్యి. సంఘటనలలో సహనశీలుడూ కృతజ్ఞుడూ అయిన ప్రతి మనిషికీ గొప్ప నిదర్శనాలు ఉన్నాయి.

14. ఇబ్రాహీమ్  6 - 8 సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు మూసా తన జాతివారితో ఇలా అన్నాడు : ‘‘అల్లాహ్ మీకు చేసిన మేలును జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన మీకు ఫిరౌను ప్రజల నుండి విముక్తి కలిగించాడు. వారు మిమ్మల్ని తీవ్రమైన బాధలకు గురిచేస్తూ ఉండేవారు. మీ కొడుకులను చంపేవారు. మీ కూతుళ్ళను బ్రతుకనిచ్చేవారు. ఇది మీ ప్రభువు తరఫు నుండి మీకు పెద్ద పరీక్ష! జ్ఞాపకం ఉంచుకోండి. మీ ప్రభువు ఇలా హెచ్చరిక చేశాడు : మీరు గనక కృతజ్ఞులైతే, నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అనుగ్రహిస్తాను. ఒకవేళ కృతఘ్నతకు పాల్పడితే నా శిక్ష చాలా కఠినముగా ఉంటుంది.’’ మూసా ఇలా అన్నాడు : ‘‘ఒకవేళ మీరు అవిశ్వాసానికి పాల్పడినా, భూమిపై ఉండే వారందరూ అవిశ్వాసులైపోయినా, అల్లాహ్ అక్కరలేనివాడు, స్వతహ స్తోత్రాలకు అర్హుడు.’’

14. ఇబ్రాహీమ్  9 - 12  మీకు  పూర్వం గతించిన జాతుల గాధలు మీదాకా చేరలేదా? నూహ్ జాతి, ఆద్జాతి, సమూద్జాతి,  ఇంకా వాటి తరువాత వచ్చిన అనేక జాతులూ, వాటి సంఖ్యా అల్లాహ్ కు మాత్రమే తెలుసు. వారి ప్రవక్తలు వారివద్దకు స్పష్టమైన మాటలను, ప్రస్ఫుటమైన నిదర్శనాలనూ తీసుకుని వచ్చినప్పుడు వారు తమ నోళ్ళల్లో చేతులు బిగబట్టి ఇలా అన్నారు :  ‘‘ సందేశంతో నీవు పంపబడ్డావో సందేశాన్ని మేము విశ్వసించము. విషయం వైపునకు నీవు మమ్మల్ని ఆహ్వానిస్తున్నావో, మేము విషయాన్ని గురించి కలతలో, సందేహంలో పడ్డాము. వారి ప్రవక్తలు ఇలా అన్నారు : ‘‘ఆకాశాలకూ భూమికీ సృష్టికర్త అయిన అల్లాహ్ పట్ల సందేహమా? ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీ తప్పులను మన్నించటానికి, మీకు ఒక నిర్ణీతకాలం వరకు వ్యవధినివ్వటానికి.’’ వారు ఇలా జవాబు పలికారు: ‘‘నీవు మావంటి ఒక మానవుడవు తప్ప మరేమీ కావు. మా తాత ముత్తాతల కాలం నుండీ ఆరాధించ బడుతూ వచ్చిన శక్తుల ఆరాధన నుండి నీవు మమ్మల్ని ఆపాలని అనుకుంటున్నావు. సరే, స్పష్టమైన ప్రమాణాన్ని దేనినైనా తీసుకునిరా.’’ వారి ప్రవక్తలు వారితో ఇలా అన్నారు : ‘‘నిజంగానే, మేము మీవంటి మానవులం తప్ప మరేమీ కాము. కాని అల్లాహ్ తన దాసులలో తాను అనుగ్రహించదలచిన వారిని అనుగ్రహిస్తాడు. ఏదైనా ప్రమాణాన్ని తెచ్చి మీకు ఇవ్వటం అనేది మా అధికారంలో లేదు. ప్రమాణం అనేది అల్లాహ్ అనుమతితో మాత్రమే రాగలుగుతుంది. విశ్వాసులు అల్లాహ్నే నమ్ముకోవాలి. మన జీవనమార్గాలలో అల్లాహ్ మనకు మార్గదర్శకత్వం వహించినప్పుడు మనం అల్లాహ్ ను ఎందుకు నమ్ముకోకూడదు? మీరు మమ్మల్ని పెడుతున్న బాధలను ఓర్పుతో సహిస్తాము. నమ్ముకునే వారు అల్లాహ్ ను మాత్రమే నమ్ముకోవాలి.’’

14. ఇబ్రాహీమ్  13 - 17 చివరకు తిరస్కారులు తమ ప్రవక్తలతో ఇలా అన్నారు: ‘‘మీరు మా మతంలోకి తిరిగి రావాలి. లేకపోతే మేము మిమ్మల్ని మా దేశం నుండి బహిష్కరిస్తాము.’’ అప్పుడు వారి ప్రభువు వారికి ఇలా ‘‘వహీ’’ని పంపాడు. ‘‘మేము దుర్మార్గులను నాశనం చేస్తాము. వారి తరువాత మిమ్మల్ని భూమిపై వసింపజేస్తాము. నా సాన్నిధ్యంలో సమాధానం చెప్పుకోవలసి ఉందని భయపడుతూ నా శిక్షకు భయపడే వ్యక్తికే బహుమానం.’’ వారు తీర్పును కోరారు. (అప్పుడు వారికి తీర్పు ఇవ్వబడిరది). బలమదాంధుడైన ప్రతి సత్యవిరోధి అవమానం పాలయ్యాడు.’’ దాని తరువాత మున్ముందు అతడి కొరకు నరకం ఉంది. అక్కడ అతడికి త్రాగటానికి చీము, నెత్తురు లాంటి చెడు నీరు ఇవ్వబడుతుంది. దానిని అతడు బలవంతంగా గొంతులోకి దించటానికి ప్రయత్నిస్తారు. అతి కష్టంతో దించగలుగుతాడు. మరణం అతణ్ణి అన్ని వైపుల నుండి చుట్టుముట్టి ఉంటుంది. కాని అతడు మరణించలేడు. అతని ముందు ఒక కఠినమైన శిక్ష అతడి ప్రాణానికి సంకటంగా ఉంటుంది.

14. ఇబ్రాహీమ్  18 - 20  తమ  ప్రభువును విశ్వసించనివారి పనులను తుఫాను రోజున వీచే పెనుగాలి ఎగురవేసే బూడిదతో పోల్చవచ్చు. వారు తాము చేసిన దానికి ఎటువంటి ప్రతిఫలాన్నీ పొందలేరు. ఇదే మార్గభ్రష్ట త్వానికి పరాకాష్ఠ అంటే. అల్లాహ్ భూమ్యాకాశాల సృష్టిని సత్యంపై నెలకొల్పటాన్ని నీవు చూడటం లేదా? ఆయన సంకల్పిస్తే మిమ్మల్ని తొలగించగలడు. మీ స్థానంలో మరొక క్రొత్త సృష్టిని తీసుకురాగలడు. అలా చెయ్యటం ఆయనకు ఎంతమాత్రం కష్టం కాదు.

14. ఇబ్రాహీమ్  21 ప్రజలందరినీ కలిపి అల్లాహ్ ముందు హాజరుపరచినప్పుడు, వారిలో ప్రపంచంలో బలహీను లుగా ఉన్నవారు ప్రపంచంలో పెద్ద మనుషులుగా చలామణి అయినవారితో ఇలా అంటారు: ‘‘ప్రపం చంలో మేము మిమ్మల్ని అనుసరించాము. ఇప్పుడు అల్లాహ్ శిక్షనుండి మమ్మల్ని కాపాడటానికి మీరేమైనా చెయ్యగలరా?’’ వారు ఇలా సమాధానం చెబుతారు: ‘‘అల్లాహ్ మాకు ముక్తిమార్గాన్ని దేనినైనా చూపి ఉండినట్లయితే మేము తప్పకుండా మీకూ చూపి ఉండేవారము. ఇప్పుడు మనము ఏడ్చి మొత్తుకున్నా లేక ఓర్పు వహించినా రెండూ ఒకటే. ఎట్టి పరిస్థితుల్లోనూ, మనం తప్పించుకునే మార్గం ఏదీ లేదు.’’

14. ఇబ్రాహీమ్  22 తీర్పు జరిగిపోయినప్పుడు షైతాను ఇలా అంటాడు : ‘‘వాస్తవం ఏమిటంటే, అల్లాహ్ మీకు చేసిన వాగ్దానాలన్నీ నిజమైనవే. నేను మీకు చేసిన వాగ్దానాలలో ఒక్కదానిని కూడా నేను నెరవేర్చలేదు. నాకు మీమీద ఎటువంటి అధికారమూ లేదు. నేను మిమ్మల్ని నా మార్గం వైపునకు ఆహ్వానించటం తప్ప మరేమీ చెయ్యలేదు. మీరు నా ఆహ్వానానికి అంగీకారం వ్యక్తం చేశారు. ఇప్పుడు నన్ను నిందించకండి. మిమ్మల్ని మీరే నిందించుకోండి. ఇక్కడ మీ మొరలను నేనూ ఆలకించలేను, నా మొరలను మీరూ ఆలకించలేరు. ఇంతకు పూర్వం మీరు నన్ను దైవత్వంలో భాగస్థునిగా చేసివుంచారు, దానికి నా బాధ్యత ఏమీ లేదు. అటువంటి దుర్మార్గులకు వ్యధాభరితమైన శిక్ష తథ్యం.’’

14. ఇబ్రాహీమ్  23 - 27 దీనికి భిన్నంగా, ప్రపంచంలో విశ్వసించి మంచి పనులు చేసినవారు క్రింద కాలువలు ప్రవహించే తోటలలో ప్రవేశింపజెయ్యబడతారు. అక్కడ వారు తమ ప్రభువు అనుమతితో శాశ్వతంగా ఉంటారు. అక్కడ వారికి ‘‘మీకు శాంతి కలుగుగాక’’ అని స్వాగతం పలుకబడుతుంది. పరిశుద్ధ వాక్కును అల్లాహ్ వస్తువుతో పోల్చాడో మీరు గమనించటం లేదా? దాని పోలిక ఇలా ఉంది : ఒక మేలుజాతి చెట్టు వుంది. దాని వేరు భూమిలో లోతుగా నాటుకుపోయింది. కొమ్మలు ఆకాశాన్ని అంటాయి. ప్రతిక్షణం అది తన ప్రభువు ఆజ్ఞానుసారం తన పండ్లను ఇస్తోంది. ప్రజలు గుణపాఠం నేర్చుకోవాలని అల్లాహ్ ఇటువంటి ఉపమానాలను ఇస్తున్నాడు. అపరిశుద్ధ వాక్కును ఒక చెడుజాతి చెట్టుతో పోల్చవచ్చు. అది భూమి ఉపరితలం నుండి పీకిపారవేయబడుతుంది. దానికి స్థిరత్వం అనేదే లేదు. ఒక స్థిరమైన వాక్కు ఆధారంగా ఇహలోకంలోనూ, పరలోకంలోనూ విశ్వాసులకు అల్లాహ్ నిలకడను ప్రసాదిస్తాడు. అల్లాహ్ దుర్మార్గులను మార్గభ్రష్టులుగా చేస్తాడు. తమకు ఇష్టమైన దానిని చేసే అధికారం అల్లాహ్ కు ఉన్నది.

14. ఇబ్రాహీమ్  28 - 30 అల్లాహ్ అనుగ్రహాన్ని పొంది, దానికి మారుగా కృతఘ్నతను చూపిన వారిని నీవు చూశావా? వారు (తమతో పాటు) తమ జాతిని కూడా వినాశగృహంలోకి - అంటే నరకంలోకి త్రోసివేశారు. అందులో వారు కాలిపోతారు. అది అతి ఘోరమైన నివాసస్థలం. వారు కొందరిని అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టారు - వారు ప్రజలను అల్లాహ్ మార్గం నుండి తప్పించటానికి? వారితో ఇలా అను : సరే సుఖాలను అనుభవించండి. చివరకు మీరు మరలి నరకానికేపోవాలి.

14. ఇబ్రాహీమ్  31 ప్రవక్తా! విశ్వసించిన నా దాసులకు చెప్పు: నమాజును స్థాపించండి. మేము వారికి ఇచ్చిన దానినుండి బహిరంగంగా, గుప్తంగా (మంచిపనుల కోసం) ఖర్చుపెట్టండి - క్రయ విక్రయాలు జరగటంకానీ, మిత్రుల సాయం పొందటంగానీ సాధ్యపడని రోజు రాకపూర్వమే.

14. ఇబ్రాహీమ్  32 - 34 భూమినీ, ఆకాశాలను పుట్టించినవాడూ, ఆకాశం నుండి నీళ్ళను కురిపించినవాడూ, దానిద్వారా మీ ఆహారం కొరకు రక రకాల ఫలాలను సృష్టించినవాడూ, తన ఆజ్ఞానుసారం సముద్రంలో నడవాలని పడవను మీ సేవకై మీకు లోబరచినవాడూ, నదులను మీ సేవకై మీకు లోబరచినవాడూ, నిరంతర ప్రయాణం చేస్తూపోతున్న సూర్య చంద్రులను మీ సేవకై మీకు లోబరచినవాడూ, రాత్రినీ పగలునూ మీ సేవకై మీకు లోబరచినవాడూ, మీరు అడిగిన సమస్తాన్నీ మీకు ఇచ్చినవాడూ అల్లాహ్ యే. మీరు గనక అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలిస్తే, లెక్కించలేరు. నిజముగా మానవుడు నీతి లేనివాడు, కృతఘ్నుడు.

14. ఇబ్రాహీమ్  35 - 41 ఇబ్రాహీమ్ఇలా ప్రార్థించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో : ‘‘ప్రభూ! నగరాన్ని (అంటే మక్కాను) శాంతినగరంగా చెయ్యి. నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజనుండి కాపాడు. ప్రభూ విగ్రహాలు చాలామందిని మార్గం తప్పించాయి. (నా సంతానాన్ని కూడా ఇవి మార్గం తప్పించే అవకాశం ఉంది కనుక వారిలో) నా విధానంపై నడిచేవాడు నావాడు, నాకు వ్యతిరేకంగా ఉన్న విధానాన్ని ఎవడైనా అవలంబిస్తే నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, కరుణామయుడవు. ప్రభూ! తృణకాష్ట జలరహితమైన లోయలో నా సంతానంలో కొందరిని తెచ్చి నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేశాను. ప్రభూ! వారు ఇక్కడ నమాజును స్థాపించాలని నేను ఇలా చేశాను. కనుక నీవు ప్రజల హృదయాలను ఆసక్తితో వారివైపునకు మొగ్గేలా చెయ్యి, తినటానికి వారికి పండ్లు ప్రసాదించు, బహుశా వారు కృతజ్ఞులౌతారేమో. ప్రభూ! మేము దాచేదానినీ, బహిరంగపరచే దానినీ నీవు ఎరుగుదువు.’’ నిశ్చయంగా అల్లాహ్ కు గుప్తంగా ఉన్నది ఏదీ లేదు, భూమిలోకాని, ఆకాశాలలోకాని. ‘‘నాకు ముసలితనంలో ఇస్మాయీలు, ఇస్హాఖ్వంటి కొడుకులను ప్రసాదించిన దేవునికి కృతజ్ఞతలు. యథార్థం ఏమిటంటే, నా ప్రభువు తప్పకుండా ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రభూ! నన్ను నమాజును స్థాపించేవాడుగా చెయ్యి. నా సంతతిలో కూడా ( పని చేసేవాళ్ళను లేపు). ప్రభూ! నా ప్రార్థనను స్వీకరించు. ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులనూ విశ్వసించే వారందరినీ లెక్క ఖరారు అయ్యేరోజున క్షమించు.’’

14. ఇబ్రాహీమ్  42 - 46 ఇప్పుడు దుర్మార్గులు చేస్తున్నదానిని అల్లాహ్ పట్టించుకోవటం లేదని నీవు భావించకు. అల్లాహ్ వారి విషయాన్ని ఆనాటికి వాయిదా వేస్తున్నాడు. ఆనాడు పరిస్థితి ఇలా ఉంటుంది : విచ్చుకున్న నేత్రాలు విచ్చుకున్నట్లే ఉంటాయి. వారు తలపైకెత్తి పారిపోతూ ఉంటారు. పైనే దృష్టి నిలిచి ఉంటుంది. వారు శూన్య హృదయులైపోతారు. ప్రవక్తా! శిక్ష వచ్చి వారిని పట్టుకునే రోజును గురించి నీవు వారిని భయపెట్టు. అప్పుడు దుర్మార్గులు ఇలా అంటారు : ‘‘ప్రభూ! మాకు మరికొంత వ్యవధిని ప్రసాదించు. మేము నీ సందేశాన్ని స్వీకరిస్తాము. ప్రవక్తలను అనుసరిస్తాము.’’ (కాని వారికి స్పష్టంగా ఇలా జవాబు ఇవ్వబడుతుంది) : ‘‘క్షీణదశ మాకు ఎన్నటికీ రాదు అని పూర్వం మాటిమాటికీ ప్రమాణం చేసి చెప్పినవారు మీరు కాదా? వాస్తవానికి తమకు తాము అన్యాయం చేసుకున్న జాతుల పట్టణాలలో మీరు నివసించారు. మేము వారిపట్ల వ్యవహరించిన తీరు కూడా మీరు చూశారు, వారిని ఉదాహరణగా మాటిమాటికీ ఇచ్చి మేము మీకు నచ్చజెప్పాము కూడా. వారు తమ ఎత్తులన్నీ వేసి చూశారు. కాని అల్లాహ్ వారి ప్రతి ఎత్తునూ చిత్తుచేశాడు. వాస్తవానికి వారి ఎత్తులు కొండలను సైతం కదలించేటంతటి భయంకరమైనవి.’’

14. ఇబ్రాహీమ్  47 - 51 కనుక ప్రవక్తా! అల్లాహ్ ఎన్నడూ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానాలకు భిన్నంగా వ్యవహరిస్తాడని నీవు ఎంతమాత్రం సందేహించకు. అల్లాహ్ శక్తిమంతుడు, ప్రతీకారం చెయ్యగల సమర్థుడు. భూమ్యాకాశాల రూపాలను పూర్తిగా మార్చటం జరిగే రోజును గురించి నీవు వారిని భయపెట్టు. అద్వితీయుడూ, రౌద్రుడూ అయిన అల్లాహ్ ముందు అందరూ హాజరవుతారు. రోజు నీవు దోషులను చూస్తావు. వారి చేతులూ, కాళ్ళూ బేడీలతో బంధించబడి ఉంటాయి. వారు తారు వస్త్రాలను ధరించి ఉంటారు. అగ్ని జ్వాలలు వారి ముఖాలను క్రమ్ముకుంటాయి. అల్లాహ్ ప్రతి వ్యక్తికీ అతను చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేందుకు ఇలా జరుగుతుంది. లెక్క తీసుకోవటానికి అల్లాహ్ కు ఎంతో ఆలస్యం కాదు.

14. ఇబ్రాహీమ్  52 సర్వమానవులకు ఇదొక సందేశం. వారిని హెచ్చరించాలనీ, యథార్థంగా దేవుడు కేవలం ఒక్కడేఅని వారు తెలుసుకోవాలనీ, బుద్ధి ఉన్నవారు గ్రహించాలనీ ఇది పంపబడినది.



No comments:

Post a Comment