89 సూరహ్ అల్ ఫజ్ర్

 

89 అల్ ఫజ్ర్

ఆయతులు : 30                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 5  ఉదయం సాక్షిగా!  పది రాత్రులు సాక్షిగా! సరి, బేసి (సంఖ్య)లు సాక్షిగా! నిష్క్రమిస్తున్నప్పటి రాత్రి సాక్షిగా! వీటిలో విజ్ఞత కలవాని కొరకు ప్రమాణమూ లేదా?

6 - 14 ఎత్తైన స్తంభాల వారైన ఆదె ఇరమ్జాతి పట్ల మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా? దానిని పోలిన మరొక జాతి ఏదీ యావత్తు ప్రపంచ దేశాల్లోనే  సృష్టించబడలేదు. ఇంకా లోయలో కొండరాళ్లను తొలిచిన సమూద్జాతిపట్ల, మేకుల వారైన ఫిరౌన్జాతిపట్ల (మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా). ప్రపంచ దేశాల్లో దుర్మార్గానికి ఒడిగట్టి ఘోరమైన ఉపద్రవాలను సృష్టించిన వారు వీరే. చివరకు మీ ప్రభువు వారిపై శిక్ష అనే కొరడాను aళిపించాడు. యథార్థమేమి టంటే మీ ప్రభువు మాటువేసి ఉన్నాడు.

15 - 26 అయితే మానవుడు ఎలాంటి వాడంటే, అతని ప్రభువు అతనికి గౌరవాన్నీ, వరాలనూ ప్రసాదించి అతన్ని పరీక్షకు గురిచేసినప్పుడు, ‘‘నా ప్రభువు నా గౌరవ ప్రతిష్ఠలను ఇనుమడిరపజేశాడు’’ అని అంటాడు. ఆయన అతనికి లభించే ఉపాధిని తగ్గించి అతన్ని పరీక్షించినప్పుడు, ‘‘నా ప్రభువు నన్ను అవమానపరచాడు’’ అని అంటాడు. ఎంతమాత్రం కాదు, కాని అసలు మీరు అనాథులను గౌరవంగా చూడరు, నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోరు, వారసత్వపు ఆస్తి మొత్తాన్ని పోగుచేసి తినేస్తారు, ధనవ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోయారు. ఎంతమాత్రం కాదు, భూమిని ఎడాపెడా దంచి తుత్తునియలుగా చేయటం జరిగినప్పుడు, మీ ప్రభువు అవతరిస్తాడు, దైవదూతలు బారులుగా తీరి నిలబడి ఉంటారు. రోజున నరకం ముందుకు తీసుకురాబడుతుంది, ఆనాడు మానవునికి తెలిసివస్తుంది. అప్పుడు అతనికి తెలిసివచ్చినందువల్ల ప్రయోజనం ఏమిటి? అతను, ‘‘అయ్యో! నా జీవితం కొరకు నేను ముందుగానే కొంత సామగ్రిని ఏర్పాటు చేసుకుని ఉంటే ఎంత బాగుండేది!’’ అని అంటాడు. ఇక రోజున అల్లాహ్ ఎలాంటి శిక్ష విధిస్తాడో, అలాంటి శిక్షను మరెవ్వరూ విధించలేరు. ఇంకా అల్లాహ్ ఎలా బిగించి కట్టివేస్తాడో, అలా బిగించి మరెవ్వరూ కట్టలేరు.

27 - 30 (మరొకవైపు విధంగా సెలవీయటం జరుగుతుంది) తృప్తిచెందిన మనసా! పద నీ ప్రభువు సన్నిధికి,  (నీకు లభించే సత్ఫలానికి) ఆనందిస్తూ. మరియు (నీ ప్రభువునకు) ఇష్టమైన దానివై. చేరిపో (పుణ్యాత్ములైన) నా దాసులలో, ప్రవేశించు నా స్వర్గంలో.

No comments:

Post a Comment