17 సూరహ్ బనీ ఇస్రాయీల్‌

 

17. బనీ ఇస్రాయీల్

 

ఆయతులు : 111                    అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

17. బనీ ఇస్రాయీల్  1 కొన్ని  నిదర్శనాలను చూపటానికి తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిదె హరామ్నుండి, దూరంగా ఉన్న మసీదు వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు. మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు.  నిజానికి ఆయనే అన్నీ వినేవాడూ, అన్నీ చూసేవాడూను.

17. బనీ ఇస్రాయీల్  2 - 8 మేము ఇంతకుపూర్వం మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. దానిని ఇస్రాయీల్సంతతికి మార్గదర్శక సాధనంగా  చేశాము,  మీరు  నన్ను తప్ప మరెవరినీ సంరక్షకుడుగా చేసుకోవద్దు అనే ఆజ్ఞతో. మేము నూహ్ ప్రవక్తతో పాటు  ఓడలోకి  ఎక్కించిన వారి సంతానమే మీరు. నూహ్ ప్రవక్త ఒక కృతజ్ఞుడైన దాసుడు. మేము మా గ్రంథంలో ఇస్రాయీల్సంతతిని ‘‘మీరు భువిలో రెండుసార్లు గొప్ప సంక్షోభాన్ని సృష్టిస్తారు. దురహంకారాన్ని ప్రదర్శిస్తారు’’ అనే విషయాన్ని గురించికూడా హెచ్చరించాము. చివరకు వారిలో మొదటిసారి దురహంకారం వ్యక్తమైనప్పుడు, ఇస్రాయీలు సంతతి ప్రజలారా! మిమ్మల్ని ఎదుర్కోవటానికి మేము మహాబలాఢ్యులైన మా దాసులను లేపాము. వారు మీ దేశంలో చొరబడి అన్ని వైపులా వ్యాపించారు. ఇదొక వాగ్దానం.   అది   తప్పనిసరిగా నెరవేర్చబడవలసి ఉండిరది. దాని తరువాత మేము మీకు వారిపై ప్రాబల్యం  వహించే అవకాశాన్ని కలిగించాము. సంపదతోనూ సంతానంతోనూ  మీకు  సహాయపడ్డాము. మీ సంఖ్యాబలాన్ని ఇదివరకటికంటె పెంచాము. చూడండి,  మీరు మంచిని చేస్తే  అది  మీకే మీరు మంచిని చేసుకున్నట్లు.  చెడును చేస్తే అది మీకు మీరే చెడును చేసు కున్నట్లు. రెండో వాగ్దానం నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మేము ఇతర శత్రువులను మీపైకి పంపాము, వారు మీ ముఖాలను వికృతం చెయ్యటానికి, మసీదు (బైతుల్మఖ్దిస్‌)లోకి పూర్వం శత్రువులు చొరబడిన విధంగా చొరబడటానికి, వారి చేతికందిన ప్రతిదానినీ ధ్వంసం చేసెయ్యటానికి - బహుశా మీ ప్రభువు మీపై ఇప్పుడు కరుణ చూపవచ్చు. కాని ఒకవేళ మీరు మీ పాతవైఖరిని తిరిగి అవలంబిస్తే మేము కూడా మా శిక్షను తిరిగి విధిస్తాము. అనుగ్రహాలను పొంది కృతఘ్నులైన ప్రజలకు మేము నరకాన్ని కారాగారంగా చేసివుంచాము.

17. బనీ ఇస్రాయీల్  9 - 10 యథార్థం ఏమిటంటే ఖురాను పూర్తి సరిjైున సవ్యమైన మార్గాన్ని చూపుతోంది.  తనను విశ్వసించి మంచి పనులు చేసేవారికి గొప్ప ప్రతిఫలం ఉంది అనే శుభవార్తను అందజేస్తోంది. పరలోకాన్ని విశ్వసించని వారికి మేము వ్యధాభరితమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము అనే వార్తను వినిపిస్తోంది.

17. బనీ ఇస్రాయీల్  11 మానవుడు మేలును ఎలా అర్థించాలో కీడును అలా అర్థిస్తాడు. మానవుడు నిజంగానే తొందరపాటు కలవాడు, ఓర్పులేనివాడు.

17. బనీ ఇస్రాయీల్  12 చూడండి, మేము రాత్రినీ పగలునూ రెండు సూచనలుగా చేశాము. రాత్రి సూచనను  మేము కాంతిహీనం చేశాము, పగటి సూచనను కాంతి మంతం చేశాము,  మీరు  మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించగలగటానికి, ఇంకా నెలల, సంవత్సరాల లెక్కను తెలుసుకోగలగటానికి. ఇదేవిధంగా మేము ప్రతి విషయాన్నీ వేరువేరుగా స్పష్టపరచి ఉంచాము.

17. బనీ ఇస్రాయీల్  13 - 14 ప్రతి మనిషి జాతకాన్ని మేము అతని మెడకే వ్రేలాడగట్టాము. ప్రళయం నాడు మేము ఒక పుస్తకాన్ని అతని కొరకు బయటికి తీస్తాము. అతడు దాన్ని ఒక తెరచిన గ్రంథం వంటిదని తెలుసుకుంటాడు  -  చదువు నీ కర్మపత్రాన్ని, ఈనాడు నీ లెక్క కట్టటానికి స్వయంగా నీవే సరిపోతావు.

17. బనీ ఇస్రాయీల్  15 ఋజుమార్గాన్ని అవలంబించేవాని ఋజువర్తనం స్వయంగా వానికే ప్రయోజనకరం. మార్గం తప్పినవాడు తన మార్గభ్రష్టత్వం యొక్క దుష్ఫలితాన్ని తానే అనుభవిస్తాడు. బరువు మోసేవాడెవడూ  ఇతరుల  బరువును మోయడు. (ప్రజలకు సత్యాసత్యాల భేదాన్ని తెలియజెప్పే) ఒక సందేశహరుణ్ణి పంపనంత వరకు మేము ఎవరినీ శిక్షించము.

17. బనీ ఇస్రాయీల్  16 - 17 మేము ఒక పట్టణాన్ని నాశనం చెయ్యదలచుకున్నప్పుడు, అందలి స్థితిమంతులకు మొదట ఒక ఆజ్ఞను పంపుతాము. వారు ఆజ్ఞ విషయంలో అవిధేయతకు పాల్పడతారు. అప్పుడు శిక్షానిర్ణయానికి పట్టణం అర్హమవు తుంది. మేము దానిని సర్వనాశనం చేసివేస్తాము. చూడు, నూహ్  తరువాత  మా ఆజ్ఞ ప్రకారం నాశనమైన తరాలు ఎన్ని ఉన్నాయో. నీ ప్రభువునకు తన దాసుల పాపాలను గురించి పూర్తిగా తెలుసు. ఆయన సర్వాన్నీ చూస్తూ ఉన్నాడు.

17. బనీ ఇస్రాయీల్  18 - 21 ( లోకంలో) తక్షణ లాభాలను కోరుకునే వాడికి ఇక్కడే వాటిని మేము ఇచ్చివేస్తాము, ఎవరికి ఎంత ఇవ్వదలచుకుంటామో అంత మేరకు. తరువాత అతని జాతకంలో నరకం వ్రాసేస్తాము.  అందులో అతడు దహింప బడతాడు, దూషింపబడినవాడై కారుణ్యానికి దూరమైనవాడై. పరలోకాన్ని కోరుకుని దానికై కృషి చెయ్యవలసినవిధంగా కృషిచేసేవాడు గనక అయితే పైగా అతడు  విశ్వాసి  కూడా అయివుంటే  -  అటువంటి ప్రతి వ్యక్తి కృషీ గుర్తింపబడుతుంది. వీరికీ వారికీ, ఉభయపక్షాల వారికీ మేము (ప్రపంచంలో) జీవనసామగ్రిని ఇస్తూ పోతున్నాము.  ఇది నీ ప్రభువు ప్రసాదించినది. నీ ప్రభువు ప్రసాదించినదానిని ఆపగలిగే వాడెవడూ లేడు. కాని చూడండి, ప్రపంచంలోనే మేము ఒక వర్గానికి మరొక వర్గంపై ఎటువంటి ఆధిక్యాన్ని ప్రసాదించామో. పరలోకంలో వర్గం స్థానాలు మరింత గొప్పగా ఉంటాయి. దాని ఆధిక్యం మరింత పెరుగుతుంది.

17. బనీ ఇస్రాయీల్  22 నీవు అల్లాహ్తోపాటు మరొకణ్ణి ఆరాధ్యుడుగా చేసుకోకు. అలా చేసుకుంటే నిందలపాలవుతావు. స్నేహితుడూ, సహాయకుడూ ఎవడూ లేనివాడవై పోతావు.

17. బనీ ఇస్రాయీల్  23 - 37 నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు: మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి. తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహ రించండి.  ఒకవేళ  మీవద్ద వారిలో ఒకరు గాని ఇద్దరు గాని ముసలివారై ఉంటే, వారి ముందు విసుగ్గా ‘‘ఛీ’’ అని కూడా అనకండి.వారిని కసురుకుంటూ సమాధానం ఇవ్వకండి. వారితో మర్యాదగా మాట్లాడండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్థిస్తూ ఉండండి: ‘‘ప్రభూ! వారిపై కరుణ జూపు, బాల్యంలో వారునన్ను కారుణ్యంతో, వాత్సల్యంతో పోషించినట్లు.’’ మీ హృదయాలలో  ఉన్నది ఏమిటో మీ ప్రభువు నకు బాగా తెలుసు. మీరు గనక మంచివారుగా నడుచుకుంటే - తమ తప్పులను గ్రహించి దాస్యవైఖరి వైపునకు మరలివచ్చే ఇలాంటి వారందరినీ ఆయన మన్నిస్తాడు. బంధువుల పట్ల మీ విధులను నిర్వహించండి. పేదవారిపట్ల, బాటసారులపట్ల, మీ విధులను నిర్వర్తించండి. వృధా ఖర్చు చెయ్యకండి. వృధా ఖర్చు చేసేవారు షైతాను సోదరులు.  షైతాను తన  ప్రభువునకు కృతఘ్నుడు. మీరు ఆశించే అల్లాహ్ కారుణ్యాన్ని మీరు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల, మీరు వారిని (అంటే అవసరాలు తీరని బంధువులు, లేమికి గురిఅయినవారు,బాటసారులు) తప్పించు కోవలసి ఉంటే,  వారికి  మృదువుగా సమాధానం చెప్పండి. మీ చేతిని మెడకు బంధించీ ఉంచకండి, దానిని పూర్తిగా స్వేచ్ఛగానూ వదలి పెట్టకండి. అలాచేస్తే నిందల పాలవుతారు, దిక్కులేని వారవుతారు. నీ ప్రభువు తన ఇష్టప్రకారం కొందరి  ఉపాధిని  సమృద్ధం చేస్తాడు. కొందరి ఉపాధిని పరిమితం చేస్తాడు. ఆయన తన  దాసుల స్థితిని బాగా ఎరుగును. ఆయన వారిని పరికిస్తున్నాడు. పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చేయకండి.  మేము వారికీ ఉపాధిని ఇస్తాము, మీకూ ఇస్తాము.  వాస్తవానికి   వారిని  హత్య  చేయటం ఒక పెద్ద నేరం.  వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి.  అది  అతిదుష్ట కార్యం.  బహుచెడ్డ మార్గం.   ప్రాణాన్నీ హత మార్చకండి న్యాయంగా తప్ప. దానిని హత మార్చడాన్ని అల్లాహ్ నిషేధించాడు. అన్యాయంగా హత్య చేయబడిన మనిషి వారసునికి మేము ‘‘ఖిసాస్’’ను కోరే హక్కును ప్రసాదించాము.  కాని వారసుడు హత్యలో హద్దులు మీరకుండా ఉండాలి. అప్పుడు అతనికి సహాయం చెయ్యటం జరుగుతుంది. సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని సొమ్ము జోలికి పోకండి,  అతడు యుక్త వయస్సునకు చేరేవరకు. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి.  నిస్సందేహంగా వాగ్దానం విషయంలో  మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. కొలపాత్రతో ఇస్తే, పూర్తిగా నింపి ఇవ్వండి, తూచినట్లయితే సరైన తరాజుతో తూచండి. ఇది మంచి పద్ధతి. పర్యవసానాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమం.  మీకు   తెలియని  విషయం  వెంటపడకండి. నిశ్చయంగా కళ్ళూ, చెవులూ,   మనస్సూ  అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది. భూమిపై విర్రవీగుతూ నడవకండి. మీరు భూమిని చీల్చనూ లేరు, పర్వతాల ఎత్తుకు చేరనూలేరు.

17. బనీ ఇస్రాయీల్  38 - 39 ఆజ్ఞలలో ఒక్కదానిని అతిక్రమించినా అది నీ ప్రభువునకు అనిష్టమైనది. ఇవి వివేకంతో నిండివున్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు వహీద్వారా తెలియజేశాడు...

17. బనీ ఇస్రాయీల్  39 - 40 ... చూడు! అల్లాహ్తో పాటు మరొకరిని ఆరాధ్యుడుగా చేసుకోకు. అలా చేస్తే నిందల పాలవుతావు. ప్రతి మేలుకూ దూరమవుతావు. నరకంలో పడవెయ్యబడతావు.- మీ ప్రభువు మీకు కొడుకులను ప్రసాదించాడా, తాను మాత్రం దైవదూతలను తనకు కూతుళ్ళుగా చేసుకున్నాడా? ఎంత విచిత్రం! మీరు చెప్పే విషయం పరమ అబద్ధం.

17. బనీ ఇస్రాయీల్  41 - 44 మేము ఖురానులో ప్రజలకు రకరకాలుగా బోధించాము.  వారు స్పృహలోకి రావాలని.  కాని వారు సత్యానికి మరింత దూరంగానే పారిపోతున్నారు. ప్రవక్తా! వారితో ఇలా అను: ఒకవేళ అల్లాహ్తో పాటు, వారు అనేవిధంగా ఇతర దేవుళ్ళు కూడా ఉంటే వారు సింహాసనాధీశుని స్థానానికి చేరే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. ఆయన పరిశుద్ధుడు. వారు చెప్పే మాటలకు ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు. ఆయన పరిశుద్ధతను సప్తాకాశాలూ,  భూమీ,  భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ కొనియాడు తున్నాయి. ఆయన స్తోత్రంతో పాటు ఆయన పరిశుద్ధతను కొనియాడనటు వంటిది ఏదీ లేదు. కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. యథార్థానికి ఆయన అత్యంత సౌమ్య మనస్కుడు, మన్నించేవాడూను.

17. బనీ ఇస్రాయీల్  45 - 48 నీవు  ఖురానును  పఠించేటప్పుడు మేము నీకూ, పరలోకాన్ని విశ్వసించని వారికీ మధ్య ఒక తెరను అడ్డుగా నిలుపుతాము. వారి హృదయా లకు గలేబులు తొడుగుతాము. ఇక వారు ఏమీ అర్థం చేసుకోలేరు. వారి చెవులను మొద్దుబారజేస్తాము. నీవు ఖురాను పఠిస్తూ నీ ఏకైక ప్రభువును గురించి మాత్రమే ప్రస్తావించినప్పుడు, వారు అసహ్యించుకుంటూ ముఖాలను ప్రక్కకు త్రిప్పుకుంటారు. నీ మాటను చెవియొగ్గి విన్నప్పుడు అసలు వారు ఏమి వింటారో, కూర్చుండి పరస్పరం గుసగుసలాడుకున్నప్పుడు ఏమి చెప్పుకుంటారో మాకు తెలుసు. దుర్మార్గులు పరస్పరం ఇలా చెప్పు కుంటారు: ‘‘మీరు అనుసరిస్తున్న మనిషి మంత్రప్రభావానికి గురిఅయిన వాడు.’’ చూడు, వారు ఎటువంటి మాటలను నిన్ను గురించి కల్పిస్తున్నారో! వారు మార్గం తప్పారు. కాబట్టి వారికి సరైన మార్గం దొరకదు.

17. బనీ ఇస్రాయీల్  49 - 52 వారు ఇలా అంటారు: ‘‘మేము ఎముకలుగా, మట్టిగా మారిపోయి నప్పుడు, సరికొత్తగా సృష్టింపబడి లేపబడతామా?’’ - వారితో ఇలా అను: ‘‘మీరు రాయిగాగాని ఇనుముగాగాని మారిపోయినా లేదా తిరిగి బ్రతికింపబడి లేపబడటానికి అసాధ్యమైనదని మీరు భావిస్తున్నటువంటి వాటికంటే కూడా ఎక్కువ  కఠినమైనటువంటి  వస్తువుగా మారిపోయినాసరే (మీరు లేచి తీరుతారు).’’ వారు తప్పకుండా ఇలా అడుగుతారు: ‘‘మమ్మల్ని మళ్ళీ బ్రతికించి లేపగలవాడు ఎవడు?’’ సమాధానంగా ఇలా అను: ‘‘మిమ్మల్ని మొదటిసారి పుట్టించినవాడే.’’ వారు తలలు ఊపుతూ ‘‘సరే, ఇది ఎప్పుడు జరుగుతుంది?’’ అని అడుగుతారు. నీవు ఇలా చెప్పు: ‘‘ సమయం దగ్గరలోనే ఉందన్నా ఆశ్చర్యపడనక్కరలేదు. ఆనాడు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు. మీరు ఆయనను స్తుతిస్తూ ఆయన పిలుపునకు సమాధానంగా బయటకు వస్తారు.’’ అప్పుడు మీరు ‘‘మేము కేవలం కొంతసేపు మాత్రమే స్థితిలో పడివున్నాము’’ అని అనుకుంటారు.

17. బనీ ఇస్రాయీల్  53 - 54 ప్రవక్తా! నా దాసుల (అంటే విశ్వాసులైన దాసుల)కు, వారు తమ నోట  అత్యుత్తమమైన  మాటనే పలుకుతూ ఉండాలి అని చెప్పు. అసలు మానవుల మధ్య కలహాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేసేవాడు షైతానే. నిజానికి షైతాను మానవుడికి బహిరంగ శత్రువు. మీ ప్రభువు మీ పరిస్థితిని బాగా ఎరుగును. ఆయన తన ఇష్టప్రకారం మిమ్మల్ని కరుణిస్తాడు. తన ఇష్టం ప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాడు. ప్రవక్తా! మేము నిన్ను ప్రజలకు సంరక్ష కుడుగా నియమించి పంపలేదు.

17. బనీ ఇస్రాయీల్  55 భూమ్యాకాశాలలోని ప్రాణికోటిని నీ ప్రభువు బాగా ఎరుగును. మేము కొందరు ప్రవక్తలకు మరి కొందరు ప్రవక్తల కంటే ఉన్నత స్థానాలను ఇచ్చాము. మేమే దావూదుకు జబూర్గ్రంథాన్ని ఇచ్చాము.

17. బనీ ఇస్రాయీల్  56 - 57 వారితో ఇలా అను: ‘‘మీరు దేవుణ్ణి కాదని (మీ పనులు నెరవేర్చే వారుగా) భావించి ఆరాధించే వారిని పిలిచి చూడండి. వారు మీ ఆపదనూ మరల్చనూలేరు, మార్చనూ లేరు. ప్రజలు మొరపెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. వారు, ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిజానికి నీ ప్రభువు శిక్షే భయపడదగినటు వంటిది.

17. బనీ ఇస్రాయీల్  58 ప్రళయానికి ముందు మేము నాశనం చెయ్యని లేక కఠిన శిక్షకు గురి చెయ్యని పట్టణమంటూ ఏదీ ఉండదు. విషయం దైవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది.

17. బనీ ఇస్రాయీల్  59 - 60 నిదర్శనాలను పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు, వారికి పూర్వం ఉన్న ప్రజలు వాటిని తిరస్కరించారు అనే విషయం తప్ప. (ఉదాహ రణకు) సమూదుకు మేము ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడ ఒంటెను తెచ్చి ఇచ్చాము.  వారు  దానిపట్ల క్రూరంగా ప్రవర్తించారు. మేము నిదర్శనాలను పంపుతున్నది ప్రజలు వాటిని చూసి భయపడాలనే. జ్ఞాపకం తెచ్చుకో, ప్రవక్తా! నీ ప్రభువు ప్రజలను పరివేష్టించి ఉన్నాడని మేము నీకు ఇదివరకే చెప్పివున్నాము. మేము నీకు ఇప్పుడు చూపించిన దానినీ, ఖురానులో శపించ బడిన వృక్షాన్నీ మేము వారికి ఒక పరీక్షగా చేశాము. మేము వారికి హెచ్చరికపై హెచ్చరిక చేస్తూవున్నాము. కాని ప్రతి హెచ్చరిక వారి మూర్ఖత్వాన్ని పెంచుతూనే ఉన్నది.

17. బనీ ఇస్రాయీల్  61 - 65 జ్ఞాపకం తెచ్చుకో: మేము దైవదూతలతో ఆదమ్కు సాష్టాంగపడండి అని చెప్పాము. అప్పుడు అంతా సాష్టాంగపడ్డారు. కాని ఇబ్లీసు అలా చెయ్య లేదు. వాడు ‘‘ఏమిటి నీవు మట్టితో చేసినవాడికి నేను సాష్టాంగపడాలా?’’ అని అన్నాడు. మళ్ళీ వాడు ఇలా అన్నాడు: ‘‘కొంచెం వాణ్ణి చూడు. వాడు తగినవాడనా, నీవు వాడికి నాపై ఆధిక్యం ఇచ్చావు? నీవు గనక నాకు ప్రళయదినం వరకు వ్యవధినిస్తే నేను వాడి మొత్తం వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను. కేవలం కొందరు మాత్రమే నానుండి తప్పించుకోగలుగు తారు.’’  అల్లాహ్  ఇలా సెలవిచ్చాడు:   ‘‘సరే, పో. వారిలో నిన్ను అనుసరించే వారందరికీ నీతోపాటు నరకమే పరిపూర్ణమైన ప్రతిఫలంగా లభిస్తుంది. నీవు ఎవరెవరిని నీ సందేశంతో భ్రష్టులుగా చెయ్యగలవో చెయ్యి. వారిపైకి నీ ఆశ్వికదళాన్ని, నీ పదాతిదళాన్ని పంపు. ధనంలోనూ, సంతానంలోనూ వారితో పాటు భాగాన్ని కలిగివుండు. వారిని వాగ్దానాల వలలో బంధించు - షైతాను వాగ్దానాలు ఒక మోసం తప్ప మరేమీ కావు - నిశ్చయంగా నా దాసులపై నీకు అధికారమూ లభించదు. నమ్ముకోవటానికి నీ ప్రభువే చాలు.’’

17. బనీ ఇస్రాయీల్  66 - 72  సముద్రంలో  మీ ఓడలను నడిపేవాడే  మీ  (అసలు) ప్రభువు, తద్వారా మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషిస్తారు. వాస్తవానికి ఆయన మీపట్ల ఎంతో కనికరం కలవాడు. సముద్రంలో మీకేదన్నా ఆపద కలిగినప్పుడు ఆయన ఒక్కడు తప్ప మీరు పిలిచేవారంతా మటుమాయమైపోతారు. కాని ఆయన మిమ్మల్ని రక్షించి నేలపైకి చేర్చినప్పుడు మీరు ఆయన నుండి ముఖం తిప్పుకుంటారు.  మానవుడు  నిజంగా చాలా కృతఘ్నుడు. సరే మీరు విషయాన్ని గురించి పూర్తిగా నిర్భయంగా ఉన్నారా, దేవుడు మిమ్మల్ని ఎన్నడూ సముద్రం వెలుపలే భూమిలోనికి అణగదొక్కడనీ లేదా మీపైకి రాళ్ళను కురిపించే తుఫానును పంపడనీ మీరు నిర్భయంగా ఉన్నారా? అప్పుడు మిమ్మల్ని రక్షించే సహాయకుణ్ణీ మీరు పొందలేరు. దేవుడు మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని సముద్రంలోనికి తీసుకుపోతాడనీ, మీ కృతఘ్నతకు ఫలితంగా మీపైకి తీవ్రమైన తుఫాను గాలులను పంపి మిమ్మల్ని  ముంచివేస్తాడనీ, మీ ముగింపును గురించి ఆయనను అడిగే వాడెవ్వడూ మీకు లభించడనీ మీరు భయపడటం లేదా?-మేము  ఆదమ్సంతతికి పెద్దరికాన్ని ప్రసాదిం చాము. వారికి నేలపై,  నీటిలో నడిచే వాహనాలను ప్రసాదించాము. వారికి పరిశుద్ధమైన వస్తువులను  ఆహారంగా ఇచ్చాము. మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి స్పష్టమైన ఆధిక్యాన్ని అనుగ్రహించాము. ఇదంతా మా అనుగ్రహం. ఆరోజును గురించి ఆలోచించండి. అప్పుడు మేము ప్రతి మానవ వర్గాన్ని దాని నాయకునితో పాటు పిలుస్తాము. సమయంలో తమ కుడిచేతికి కర్మ పత్రం ఇవ్వబడినవారు, తాము చేసిన పనులను చదువుకుంటారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. ప్రపంచంలో అంధుడై మెలగేవాడు, పరలోకంలో కూడా అంధుడుగానే ఉంటాడు. అంతేకాదు మార్గాన్ని పొందటంలో అంధునికంటే కూడా అధికంగా విఫలుడౌతాడు.

17. బనీ ఇస్రాయీల్  73 - 75 ప్రవక్తా! ప్రజలు నిన్ను పరీక్షకు గురిచేసి మేము నీ వైపునకు పంపిన  వహీ  నుండి నిన్ను మరలించటానికి ప్రయత్నం చేయటంలో కొరతా చేయలేదు. నీవు మా పేరుతో నీ తరఫు నుండి ఏదైనా విషయాన్ని  కల్పించాలని వారు ఇలా చేశారు. ఒకవేళ నీవు అలా కల్పించివుంటే వారు తప్పకుండా నిన్ను తమ మిత్రుడుగా చేసుకుని ఉండేవారు. మేము గనక నీకు మనోబలాన్ని ఇచ్చివుండకపోతే నీవు వారి వైపునకు కొంతైనా మొగ్గి ఉండేవాడవు అనేది అసంభవమేమీ కాదు. కాని ఒకవేళ నీవు అలా మొగ్గి వుంటే, మేము నీకు ప్రపంచంలో కూడా రెట్టింపు శిక్షను రుచిచూపించి ఉండేవారము.  పరలోకంలో  కూడా రెట్టింపు శిక్షే. మాకు వ్యతిరేకంగా నీవు సహాయకుడినీ పొందివుండేవాడవు కాదు.

17. బనీ ఇస్రాయీల్  76 వారు నీకు భూభాగంలో నిలువనీడ లేకుండా చెయ్యటానికీ నిన్ను ఇక్కడ నుండి వెళ్ళగొట్టటానికి పూనుకున్నారు.  కాని ఒకవేళ వారు అలా చేస్తే నీ తరువాత వారు కూడా ఇక్కడ ఎంతోకాలం నిలువలేరు.

17. బనీ ఇస్రాయీల్  77 ఇది మా సనాతన సంప్రదాయం. దీనినే నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరి విషయంలోనూ అనుసరించాము. మా సంప్రదాయంలో నీవు మార్పునూ చూడలేవు.

17. బనీ ఇస్రాయీల్  78 - 79 నమాజును స్థాపించు. పొద్దు వాలినప్పటినుండి రాత్రి చీకటిపడే వరకు, ప్రాత్ణకాలంలో ఖుర్ఆన్పారాయణం పట్ల ప్రత్యేక శ్రద్ధవహించు. ఎందుకంటే ప్రాత్ణకాలపు ఖుర్ఆన్పారాయణం సాక్ష్యంగా ఉంటుంది. రాత్రిపూట ‘‘తహజ్జుద్’’ నమాజు చెయ్యి. ఇది నీకు అదనపు నమాజు. నీ ప్రభువు నిన్ను ప్రశంసనీయమైన ఉన్నత స్థానంలో ప్రతిష్ఠింపజేయటం అసంభవం ఏమీ కాదు.

17. బనీ ఇస్రాయీల్  80  ఇలా ప్రార్థించు:  ప్రభూ! నీవు నన్ను ఎక్కడకు తీసుకొనివెళ్ళినా సత్యంతో తీసుకొని వెళ్ళు. ఎక్కడ నుండి తీసినా సత్యంతో తియ్యి. నీ తరఫు నుండి ఒక అధికారాన్ని నాకు సహాయంగా పంపించు.

17. బనీ ఇస్రాయీల్  81 ఇలా ప్రకటించు:  ‘‘సత్యం వచ్చేసింది. అసత్యం నశించింది. అసత్యం నశించక తప్పదు.’’

17. బనీ ఇస్రాయీల్  82 - 84 మేము ఖురాను భాగాల అవతరణ క్రమంలో అవతరింప జేస్తున్నటువంటి ప్రతి భాగమూ విశ్వాసులకు స్వస్థత కారుణ్యమునూ, కాని దుర్మార్గులకు అది నష్టాన్ని తప్ప మరి దేనినీ పెంచదు. మానవుడు ఎలాంటి వాడంటే మేము అతన్ని అనుగ్రహించినప్పుడు విర్రవీగుతాడు. వెనక్కి మరలిపోతాడు. కొంచెం కష్టానికి గురిఅయితే చాలు, నిరాశపడిపోతాడు. ప్రవక్తా! ప్రజలతో ఇలా అను:  ‘‘ప్రతి ఒక్కడూ తన విధానాన్నే అనుసరిస్తు న్నాడు. ఇక ఋజుమార్గంలో ఎవడున్నాడో అనే విషయం నీ ప్రభువునకే బాగా తెలుసు.’’

17. బనీ ఇస్రాయీల్  85 - 88 ప్రజలు నిన్ను ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు. ఇలా అను:  ‘‘   ఆత్మ  నా ప్రభువు ఆజ్ఞానుసారం వస్తుంది. కాని మీకు ప్రసాదించబడిన జ్ఞానం బహుస్వల్పమైనది.’’ ప్రవక్తా! మేము కోరితే, వహీద్వారా మేము నీకు ప్రసాదించిన దాన్నంతా నీనుండి లాక్కోగలము. తరువాత మాకు వ్యతిరేకంగా దానిని తిరిగి ఇప్పించగలిగే సహాయకుణ్ణి ఎవణ్ణీ నీవు పొందలేవు. నీకు లభించినదంతా నీ ప్రభువు కారుణ్యం వల్లనే లభించింది. వాస్తవం ఏమిటంటే నీపై ఆయనకు ఉన్న అనుగ్రహం చాలా గొప్పది. ఇలా అను: ‘‘ఒకవేళ మానవులూ, జిన్నాతులూ, అందరూ కలసి ఖురాను వంటి దానిని దేనినయినా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు, వారందరూ ఒకరికొకరు సహాయులైనప్పటికినీ.’’

17. బనీ ఇస్రాయీల్  89 - 93 మేము ఖురానులో ప్రజలకు రకరకాలుగా హిత బోధచేశాము. కాని చాలామంది ప్రజలు అవిశ్వాస స్థితిలోనే స్థిరంగా ఉండిపోయారు. వారు ఇలా అన్నారు: ‘‘మేము నీ మాటను నమ్మము. నీవు భూమిని చీల్చి మా కోసం ఒక చెలమను పొంగింపచెయ్యాలి. ఖర్జూరపు చెట్లూ ద్రాక్షాలతలు కల తోట ఒకటి నీకోసం ఉద్భవించాలి. అందులో నీవు కాలువలను ప్రవహిం పజెయ్యాలి. నీవు ప్రకటిస్తున్న విధంగా ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాపై పడవెయ్యాలి. దేవుణ్ణీ, దైవదూతలనూ మా ఎదుటకు తీసుకు రావాలి.  నీకోసం  ఒక స్వర్ణగృహం తయారు కావాలి. నీవు ఆకాశాన్ని అధిరోహించాలి.  అంతవరకు నీ మాటను మేము నమ్మము. అంతేకాదు, మేము చదవటానికి నీవు మాపై ఒక రచన అవతరించేటట్లు చేయనంతవరకు మేము నీ అధిరోహించటాన్ని కూడా నమ్మము. ప్రవక్తా! వారితో ఇలా అను: ‘‘నా ప్రభువు! పరిశుద్ధుడు. నేను సందేశాన్ని తెచ్చే ఒక మానవమాత్రుడు తప్ప మరింకేమైనా అవుతానా?’’

17. బనీ ఇస్రాయీల్  94 - 95 ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడల్లా, దానిని విశ్వసిం చకుండా వారిని ఆపిన విషయం ‘‘ఏమిటి, అల్లాహ్ మానవుణ్ణి ప్రవక్తగా చేసి పంపాడా?’’ అనే వారి పలుకు తప్ప మరేమీ కాదు. వారికి ఇలా చెప్పు: ‘‘భువిలో దైవదూతలు నిశ్చింతగా తిరుగుతూ ఉండివుంటే, మేము తప్ప కుండా ఆకాశం నుండి దైవదూతనే వారికోసం ప్రవక్తగా పంపి ఉండేవారము.’’

17. బనీ ఇస్రాయీల్  96 ప్రవక్తా! వారితో ఇలా అను: ‘‘నాకూ మీకూ మధ్య కేవలం ఒక్క అల్లాహ్ సాక్ష్యమే సరిపోతుంది. ఎందుకంటే ఆయన తన దాసుల స్థితిని బాగా ఎరిగినవాడు. అన్నింటినీ చూస్తూ ఉన్నవాడు.’’

17. బనీ ఇస్రాయీల్  97 - 99 అల్లాహ్ మార్గం చూపినవాడే సన్మార్గాన్ని పొందుతాడు. ఆయన మార్గం తప్పించినవారికి ఆయనను తప్ప, అండగా ఉండేవాణ్ణీ, సహాయపడే వాణ్ని ఎవణ్ణీ నీవు పొందలేవు. వారిని మేము ప్రళయంనాడు గుడ్డివారుగా, మూగవారుగా, చెవిటివారుగా చేసి బోర్లాపడవేసి లాక్కువస్తాము. వారి నివాసం నరకం. దాని మంట మందగించినప్పుడల్లా మేము దానిని మరింత మండిరప జేస్తాము. ఇది ప్రతిఫలం వారి దుశ్చేష్టకు. వారు మా ఆయతులను తిరస్కరించి ఇలా అన్నారు: ‘‘మేము కేవలం ఎముకలుగా, దుమ్ముగా, ధూళిగా మారి పోయిన తరువాత సరికొత్తగా మమ్మల్ని పుట్టించి లేపి నిలబెట్టడం జరుగు తుందా?’’ భూమినీ ఆకాశాలనీ సృష్టించిన దేవుడు అటువంటివారిని పుట్టించే శక్తిని కూడా తప్పకుండా కలిగివుంటాడనే విషయం వారికి తోచనే లేదా? ఆయన వారిని తిరిగిలేపటానికి ఒక సమయాన్ని నిర్ణయించి ఉంచాడు. అది రావటం తథ్యం. కాని దుర్మార్గులు మొండిగా దానిని తిరస్కరించటానికే పూనుకున్నారు.

17. బనీ ఇస్రాయీల్  100 ప్రవక్తా! వారితో ఇలా అను:  ఒకవేళ నా ప్రభువు కారుణ్య నిధులు మీ అధీనంలో ఉండి ఉన్నట్లయితే అవి ఖర్చయిపోతాయనే భయంవల్ల, వాటిని మీరు కదపకుండా ఉంచేవారు.  యథార్థానికి మానవుడు ఎంతో సంకుచిత హృదయుడు.

17. బనీ ఇస్రాయీల్  101 - 104 మేము మూసాకు ప్రస్ఫుటంగా కనిపించే తొమ్మిది నిదర్శనాలను ప్రసాదించాము. ఇప్పుడు నీవే స్వయంగా ఇస్రాయీలు సంతతిని అడుగు. మూసా వారివద్దకు వచ్చినప్పుడు ఫిరౌను రాజు అన్నది ఇదేకదా, ‘‘మూసా! నీవు నిశ్చయంగా మంత్రజాలానికి గురిఅయిన మనిషివని నేను భావిస్తున్నాను’’ అని.  దానికి  సమాధానంగా మూసా ఇలా అన్నాడు:  ‘‘నీకు బాగా తెలుసు, గుణపాఠం నేర్పే నిదర్శనాలను భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వడూ అవతరింపజెయ్యలేదు. ఫిరౌన్‌!  నీవు  నిశ్చయంగా శాపానికి గురిఅయిన వాడవు అని నేను భావిస్తున్నాను.’’  చివరకు ఫిరౌను మూసానూ, ఇస్రాయీలు సంతతినీ భూమిపై లేకుండా చేయాలని సంకల్పించుకున్నాడు. కాని మేము అతడినీ, అతడి సహచరులనూ మూకుమ్మడిగా ముంచివేశాము. తరువాత ఇస్రాయీలు సంతతితో మేము ఇలా అన్నాము: ‘‘ఇక మీరు భూమిపై సుఖంగా నివసించండి. ప్రళయ వాగ్దాన సమయం ఆసన్నమైనప్పుడు మేము మీ అందరినీ కలిపి హాజరుపరుస్తాము.’’

17. బనీ ఇస్రాయీల్  105 - 109 ఖురానును మేము సత్యంతో అవతరింపజేశాము. సత్యంతోనే అది అవతరించింది. ప్రవక్తా! (విశ్వాసులకు) శుభవార్త అందించటానికి (అవిశ్వాసులకు) హెచ్చరిక చెయ్యటానికి తప్ప మేము నిన్ను మరొక పనికొరకు పంపలేదు. మేము ఖురానును కొద్దికొద్దిగా అవతరింపజేశాము, నీవు దానిని నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించాలని. మేము దానిని సందర్భాన్ని బట్టి క్రమక్రమంగా అవతరింపజేశాము. ప్రవక్తా! వారితో ఇలా అను: మీరు దీనిని నమ్మండి నమ్మకపోండి. ఇదివరకు జ్ఞానం ఇవ్వబడిన వారికి దానిని వినిపించినప్పుడు వారు ముఖాన్ని నేలకు ఆనించి సాష్టాంగపడి ముక్తకంఠంతో ఇలా అంటారు: ‘‘మా ప్రభువు పరిశుద్ధుడు. ఆయన వాగ్దానం పూర్తిఅయి తీరవలసిందే.’’ వారు ముఖాన్ని నేలకు ఆనించి  విలపిస్తూ పడిపోతారు. దానిని విన్న తరువాత వారి అణకువ మరింత పెరుగుతుంది.

110 - 111 ప్రవక్తా! వారితో ఇలా అను: ‘‘అల్లాహ్ అని అయినా పిలవండి. లేదా రహ్మాన్అని అయినా సరే. పేరుతో అయినా పిలవండి. ఆయనకు గల పేర్లు అన్నీ చక్కనివే. మీరు నమాజును చేసేటప్పుడు కంఠాన్ని మరీ పెంచకండి, మరీ తగ్గించకండి. రెంటికీ మధ్య సగటు స్థాయిలో ఉండే స్వరంతో నమాజు చేయండి.’’  ఇంకా ఇలా అను: ఎవరినీ తన కొడుకుగా చేసుకోనటువంటి,  తన  రాజ్యంలో ఇతరులెవ్వరూ భాగస్వాములుగా లేనటువంటి, నిస్సహాయుడు కాకపోవటం వల్ల తనకు సంరక్షకుడు ఎవడూ అవసరం లేనటువంటి దేవునికే స్తోత్రము. ఆయన గొప్పతనాన్ని, మహో న్నతమైన శ్రేణికిచెందిన గొప్పతనాన్ని చాటండి.




No comments:

Post a Comment