55 సూరహ్ అర్‌ రహ్మాన్

 

55. అర్రహ్మాన్

ఆయతులు : 78                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 4 పరమ కృపాశీలుడు (అయిన దేవుడు) ఖురాన్బోధించాడు. ఆయనే మానవుణ్ణి సృష్టించి, అతనికి మాట్లాడటం నేర్పాడు.

5 - 9 సూర్యుడూ, చంద్రుడూ ఒక నియమావళికి కట్టుబడి ఉన్నారు. నక్షత్రాలూ, వృక్షాలూ అన్నీ సాష్టాంగపడుతూ ఉన్నాయి. ఆయన ఆకాశాన్ని పైకిలేపాడు, త్రాసును నెలకొలిపాడు. కనుక మీరు సమతూకాన్ని భంగపరచ కండి  న్యాయంగా, కచ్చితంగా తూచండి, తూకంలో తక్కువ చేయకండి.

10 - 13 ఆయన భూమిని సకల సృష్టిరాసులకై సృజించాడు. అందులో అన్నిరకాల రుచికరమైన పండ్లు పుష్కలంగా ఉన్నాయి, ఖర్జూరపు వృక్షాలు ఉన్నాయి  వాటి పండ్లు పొరలలో చుట్టబడి ఉన్నాయి. రకరకాల ధాన్యాలు ఉన్నాయి. వాటిలో పొట్టుకూడ ఉంటుంది, గింజలూ ఉంటాయి. కనుక జిన్నాతులారా! మానవులారా! మీరు మీ ప్రభువు యొక్క ఏయే అనుగ్రహాలను తిరస్కరించగలరు?

14 - 16 ఆయన మానవుణ్ణి పెంకువంటి ఎండిన మురుగుడు మట్టితో సృష్టించాడు  జిన్నాతులను అగ్ని జ్వాలలతో పుట్టించాడు. కనుక జిన్నాతులారా! మానవులారా! మీరు మీ ప్రభువు శక్తిసామర్థ్యాల ఏయే విచిత్రకార్యాలను తిరస్కరిస్తారు?

17 - 18 రెండు తూర్పు (దిక్కు)లకూ,  రెండు పడమర (దిక్కు)లకూ, అన్నింటికీ యజమాని, ప్రభువు ఆయనే. కనుక జిన్నాతులారా! మానవులారా! మీరు మీ ప్రభువు యొక్క ఏయే ప్రతిభా విశేషాలను తిరస్కరిస్తారు?

19 - 23 రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయేటందుకు ఆయన వాటిని వదలిపెట్టాడు. అయినా వాటిమధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అవి దానిని అతిక్రమించవు. కనుక జిన్నాతులారా! మానవులారా! మీరు మీ ప్రభువు శక్తి యుక్తుల ఏయే మహిమలను తిరస్కరిస్తారు? సముద్రాలలో ముత్యాలూ, పగడాలూ లభిస్తాయి. కనుక జిన్నాతులారా! మానవులారా! మీరు మీ ప్రభువు ప్రజ్ఞాపాటవాల ఏయే ఘనకార్యాలను తిరస్కరిస్తారు?

24 - 25 సముద్రంలో కొండలవలె నిలబడి ఉన్న ఎత్తైన ఓడలు ఆయనవే. కాబట్టి  జిన్నాతులారా! మానవులారా! మీరు మీ ప్రభువు యొక్క ఏయే ఉపకారాలను తిరస్కరించగలరు?

26 - 30 పుడమిపై ఉన్న ప్రతి వస్తువూ నాశనమై పోయేదే. కేవలం మహోన్నతుడూ, మహోపకారీ అయిన నీ ప్రభువు మాత్రమే మిగిలి ఉండేవాడు. కనుక జిన్నాతులారా! మానవులారా! మీరు మీ ప్రభువు ప్రజ్ఞాపాటవాల ఏయే ఘనకార్యాలను తిరస్కరిస్తారు? భూమి మీదా, ఆకాశాలలోనూ ఉన్న సమస్తమూ తమ అవసరాలు తీరే నిమిత్తం ఆయననే అర్థిస్తున్నాయి. ప్రతి క్షణం ఆయన ఒక వినూత్న వైభవంతో వెలుగుతూ ఉంటాడు. కాబట్టి జిన్నాతులారా! మానవులారా! మీరు మీ ప్రభువు యొక్క ఏయే ప్రశంసనీయ లక్షణాలను తిరస్కరిస్తారు?

31 - 36 భూమికి భారమైన వారలారా! అతి త్వరలోనే మేము తీరిక చేసుకుని మీ లెక్క తీసుకుంటాము (అప్పుడు చూసుకుందాము) మీరు మీ ప్రభువు యొక్క ఏయే ఉపకారాలను నిరాకరిస్తారో. జిన్నాతుల, మానవుల వర్గీయులారా! మీరు గనక భూమ్యాకాశాల సరిహద్దుల నుండి బయటపడి పారిపోగలిగితే, పారిపోయి చూడండి.  మీరు అలా పారిపోలేరు. దానికోసం ఎంతో శక్తి కావలసి ఉంటుంది. మీ ప్రభువు యొక్క ఏయే శక్తి సామర్థ్యాలను నిరాకరిస్తారు? (మీరొకవేళ పారిపోవటానికి ప్రయత్నం చేసినట్లయితే) మీపైకి అగ్ని జ్వాలలను, పొగను వదలటం జరుగుతుంది. దానిని మీరు ఎదుర్కోలేరు. జిన్నాతులారా! మానవులారా! మీరు మీ ప్రభువు యొక్క ఏయే శక్తిసామర్థ్యాలను తిరస్కరించగలరు?

37 - 38 తరువాత ఆకాశం బ్రద్దలై ఎర్రని చర్మం మాదిరిగా ఎర్రబడిపోయి నప్పుడు (మీ పరిస్థితి ఏమవుతుంది?) జిన్నాతులారా!  మానవులారా! (అప్పుడు) మీరు మీ ప్రభువు యొక్క ఏయే శక్తి సామర్థ్యాలను తిరస్కరించ గలరు?

39 - 45 రోజున మానవుణ్ణీ, జిన్నాతునూ అతని పాపాలను గురించి అడిగే అవసరం ఉండదు  (తరువాత) అప్పుడు (చూసుకుందాము) మీ ఇరువర్గాల వారు మీ ప్రభువు యొక్క ఏయే ఉపకారాలను తిరస్కరిస్తారో, అక్కడ నేరస్తులు తమ ముఖాలనుబట్టే గుర్తించబడతారు. వారిని  నుదుటి జుత్తు, కాళ్లూ పట్టుకొని ఈడ్చుకుపోవటం జరుగుతుంది. (అప్పుడు) మీరు మీ ప్రభువు యొక్క ఏయే శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలరు? (అప్పుడు ఇలా అనటం జరుగుతుంది). నేరస్తులు  అబద్ధమని  కొట్టిపారేస్తూ ఉండే నరకమే ఇది. అదే నరకంలో, కాగుతున్న నీళ్ల మధ్య వారు అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు మీ ప్రభువు యొక్క ఏయే శక్తి సామర్థ్యాలను తిరస్కరించగలుగుతారు?

46 - 59  తన ప్రభువు సన్నిధిలో హాజరుకావలసి ఉంటుందనే భయం కలిగి ఉండే ప్రతి వ్యక్తికీ రెండు తోటలు లభిస్తాయి. కనుక మీ ప్రభువు యొక్క ఏయే బహుమానాలను మీరు నిరాకరిస్తారు? పచ్చగా, కనుల పండువుగా ఉండే కొమ్మలతో, రెమ్మలతో నిండి ఉంటాయి  మీ ప్రభువు యొక్క ఏయే బహుమానాలను మీరు నిరాకరించగలరు? రెండు తోటలలోనూ రెండు సెలయేర్లు ప్రవహిస్తూ ఉంటాయి. మరి మీ ప్రభువు యొక్క ఏయే బహుమానాలను మీరు నిరాకరించగలరు? రెండు తోటలలోనూ ప్రతిపండూ రెండు విధాలుగా ఉంటుంది. మీ ప్రభువు యొక్క ఏఏ బహుమానాలను మీరు తిరస్కరించగలరు? స్వర్గవాసులు దళసరి పట్టు వస్త్రపు అంచుగల తివాచీలపై దిండ్లకు ఆనుకుని ఆసీనులై ఉంటారు. తోటలలోని చెట్ల కొమ్మలు పండ్లతో వంగిపోయి ఉంటాయి. మీ ప్రభువు యొక్క ఏయే బహు మానాలను మీరు తిరస్కరించగలరు? మహాభాగ్యాల మధ్య సిగ్గులొలికే చూపులు గల సుకన్యలు ఉంటారు. స్వర్గవాసులకు పూర్వం వారిని మానవుడుగానీ, జిన్నాతుగానీ తాకి ఉండలేదు. కనుక మీ ప్రభువు యొక్క ఏయే బహుమానాలను మీరు నిరాకరించగలరు? వారు కెంపుల, ముత్యాల మాదిరిగా ఎంతో అందంగా ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏయే బహు మానాలను మీరు తిరస్కరించగలరు?

60 - 77 సత్కార్యానికి ప్రతిఫలం సత్కార్యం కాక మరేమవుతుంది? కనుక జిన్నాతులారా! మానవులారా!  మీ ప్రభువు యొక్క ఏయే ప్రశంసనీయ లక్షణాలను మీరు తిరస్కరించగలరు? రెండు తోటలు కాక మరో రెండు తోటలు కూడా ఉంటాయి.  మీ ప్రభువు యొక్క ఏయే బహుమానాలను మీరు తిరస్కరించగలరు?   అవి దట్టమైన ముదురు పచ్చని తోటలు. మీ ప్రభువు యొక్క ఏయే బహుమానాలను మీరు నిరాకరించగలరు? రెండు తోటలలోనూ  రెండు  చెలమలు పొంగి పొరలుతూ ఉంటాయి. మీ ప్రభువు యొక్క ఏయే బహుమానాలను మీరు తిరస్కరిస్తారు?  వాటిలో పండ్లూ ఫలాలూ, ఖర్జూరాలూ, దానిమ్మ కాయలూ పుష్కలంగా ఉంటాయి. మీ ప్రభువు యొక్క ఏయే బహుమానాలను మీరు తిరస్కరించగలరు? మహాభాగ్యాల మధ్య శీలవతులూ, సౌందర్య వతులూ అయిన భార్యలు ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏయే బహుమానాలను మీరు నిరాకరించగలరు? గుడారాలలో సురక్షితంగా ఉంచబడిన సుందరీమణులు ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏయే బహుమానాలను మీరు తిరస్కరించగలరు? స్వర్గవాసులకు పూర్వం ఎన్నడూ మానవుడు గాని, జిన్నాతుగాని వారిని తాకివుండలేదు. మీరు మీ ప్రభువు యొక్క అనుగ్రహాలను తిరస్కరిస్తారు? స్వర్గవాసులు ఆకుపచ్చని తివాచీలపై, అందమైన, విలువైన పరుపులపై దిండ్లకు ఆనుకొని ఆసీనులై ఉంటారు. మీ ప్రభువు యొక్క ఏయే బహుమానాలను మీరు తిరస్కరిస్తారు?

78 మహామహిమాన్వితుడూ, దయామయుడూ అయిన నీ ప్రభువు పేరు ఎంతో శుభకరమైనది.

No comments:

Post a Comment