68 సూరహ్ అల్‌ ఖలమ్

 

68. అల్ఖలమ్

ఆయతులు : 52                       అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 16 నూన్‌. కలం సాక్షిగా, లేఖకులు లిఖించే దాని సాక్షిగా నీవు నీ ప్రభువు దయవల్ల పిచ్చివాడవు కావు.  నిశ్చయంగా  నీకు ఎన్నటికీ తరగిపోని ప్రతిఫలం లభిస్తుంది. నీవు నిస్సందేహంగా మహోన్నతమైన శీలం కలవాడవు. మీలో ఎవరు ఉన్మాదానికి లోనయ్యారో త్వరలోనే నీవూ చూస్తావు, వారూ చూస్తారు. నీ ప్రభువుకు,  తన మార్గం నుండి తప్పిపోయిన వారెవరో బాగా తెలుసు, ఋజుమార్గంపై ఉన్నవారెవరో కూడ ఆయనకు బాగా తెలుసు. కనుక నీవు సత్యతిరస్కారుల ఒత్తిడికి ఏమాత్రం తల ఒగ్గకు. నీవు గనక రాజీపడితే, వారు కూడా రాజీపడదామని అనుకుంటున్నారు. చీటికీ మాటికీ ఒట్టువేసే నీచుడికి ఏమాత్రం లొంగకు.వాడు ఎత్తిపొడుస్తూ ఉంటాడు, చాడీలు చెబుతూ తిరుగుతూ ఉంటాడు, మంచిని నిరోధిస్తూ ఉంటాడు, దౌర్జన్యం చెయ్యటంలోనూ, అత్యాచారం చెయ్యటంలోనూ హద్దులు మీరుతూ ఉంటాడు, పరమపాతకుడు, మిక్కిలి క్రూరుడు. లోపాలన్నింటితో పాటు వాడు హీన జన్ముడు కూడ. దీనంతటికీ కారణం వాడు అత్యధికంగా సిరిసంపదలూ, సంతానమూ కలిగి ఉండటమే. మా ఆయతులు అతడికి వినిపించినప్పుడు, ఇవి పూర్వకాలం నాటి కట్టుకథలే కదా అని అంటాడు. అతి త్వరలోనే మేము అతడి మూతి మీద వాతలు పెడతాము.

17 - 33 మేము ఒక తోట యజమానులను పరీక్షకు గురిచేసిన విధంగానే వారిని (మక్కావాసులను) కూడ పరీక్షకు గురిచేశాము. తోట యజమానులు, ‘‘రేపు ఉదయం పెందలకడనే మేము వెళ్లి మా తోటలోని పండ్లు తప్పకుండా కోస్తాము’’ అని ప్రమాణం చేసి మరీ అన్నారు. వారు ఎలాంటి మినహాయిం పులకూ (భయసందేహాలకూ) తావీయలేదు. (రోజు) రాత్రి, వారు ఆదమరచి నిద్రపోతూ ఉండగా, నీ ప్రభువు నుండి ఒక ఆపదవచ్చి తోటపై విరుచుకు పండిరది. అప్పుడు  దాని  స్థితి పంట కోసివేసిన తోటమాదిరిగా అయి పోయింది. మరునాడు ఉదయం వారు లేచి,  ‘‘పండ్లు కోయదలచుకుంటే, ఉదయాన్నే మనం పొలానికి వెళదాము, బయలుదేరండి’’ అని ఒకరినొకరు పిలుచుకున్నారు. తరువాత వారు బయలుదేరారు  దారిలో నడుస్తూ, ‘‘ రోజు బీదవాళ్లెవ్వరూ తోటలో మీ వద్దకు రాకూడదు సుమా’’ అని మెల్లగా వారు పరస్పరం చెప్పుకున్నారు. దానం ఏమీ చెయ్యకూడదని నిర్ణయిం చుకుని, వారు తెల్లవారగానే తొందర తొందరగా అక్కడకు వెళ్లారు, తామె లాగైనా పండ్లు కోయగలమనే ధీమాతో. కాని తోటను చూచి వారు, ‘‘ఇదేమిటి, మనం దారి తప్పి వచ్చామా  - కాదు, కాదు మనం సర్వమూ కోల్పోయాము’’ అని అనసాగారు. వారందరిలో కాస్తంత మంచివాడు ‘‘మీరు దేవుణ్ణి ఎందుకు స్తుతించరు అని నేను మిమ్మల్ని అడగలేదా?’’ అని అన్నాడు. అప్పుడు వారు, ‘‘మా ప్రభువు పరిశుద్ధుడు. నిజంగానే మేము పాపాత్ములం’’ అని అన్నారు. తరువాత వారిలోని ప్రతి ఒక్కడూ తోటివాణ్ణి నిందించసాగాడు. చివరకు వారు పశ్చాత్తాపపడుతూ ఇలా అన్నారు,  ‘‘మన పరిస్థితి చాల శోచనీయం. నిస్సందేహంగా మనం మితిమీరి ప్రవర్తించాము. మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీనికంటె మెరుగైన తోటను ప్రసాదించటం అసంభవమేమీ కాదు. మనం మన ప్రభువు వైపునకు మరలుదాము.’’ ఇలా ఉంటుంది శిక్ష. పరలోక శిక్ష దీనికంటె కూడ ఘోరంగా ఉంటుంది. అయ్యో! వారు విషయాన్ని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది.

34 - 41 నిశ్చయంగా దైవభక్తి పరాయణుల కొరకు వారి ప్రభువు వద్ద భోగభాగ్యాలతో నిండిన స్వర్గవనాలు ఉన్నాయి. మేము విధేయుల స్థితిని అపరాధుల స్థితి మాదిరిగా చేస్తామా? ఏమయింది మీకు, ఇలాంటి నిర్ణయాలు చేస్తారు? అక్కడ మీకు తప్పకుండా మీరు మీ కోసం కోరుకునేదే లభిస్తుందని వ్రాసిపెట్టి ఉన్న గ్రంథం ఏదైనా ఉందా మీరు చదవటానికి? మీరు నిర్ణయించు కున్నదే మీకు లభిస్తుందనటానికి ఆధారంగా ప్రళయదినం వరకూ మీరు మాతో చేసుకున్న ఒడంబడిక ఏదైనా ఉందా? మీలో ఎవరు దీనికి హామీగా ఉంటారు? అని వారిని అడగండి. లేక వారు నిలబెట్టిన భాగస్వాములెవరైనా ఉన్నారా (దీనికి బాధ్యత వహించటానికి)?  అలాగైతే  తాము నిలబెట్టిన భాగస్వాము లను తీసుకురావాలి, వారు గనక సత్యవంతులే అయితే.

42 - 43 కష్టకాలం దాపురించే రోజున సజ్దా చేయటానికి ప్రజలు పిలువ బడతారు. అప్పుడు వారు సజ్దా చేయలేరు, వారి చూపులు క్రిందికి వాలి పోయి ఉంటాయి, అవమానం వారిని ఆవరించి ఉంటుంది.  వారు  నిక్షేపంగా ఉన్న కాలంలో వారిని సజ్దా చేయండి అని పిలవటం జరిగేది (కాని వారు తిరస్కరించేవారు).

44 - 45 కనుక ప్రవక్తా! నీవు గ్రంథాన్ని తిరస్కరించేవారి వ్యవహారాన్ని నాకు వదిలెయ్యి. వారికి ఏమాత్రం తెలియని విధంగా మేము వారిని క్రమేణా వినాశం వైపునకు తీసుకుపోతాము. నేను వారికి కొంత వ్యవధినిస్తున్నాను. నా పన్నాగం ఎంతో పటిష్ఠమైనది.

46 - 50 నీవు  వారి  నుండి ఏదైనా ప్రతిఫలం అడుగుతున్నావా, వారు దాని భారం క్రింద నలిగిపోతూ ఉండటానికి? వారి వద్ద ఏదైనా అతీంద్రియ జ్ఞానం ఉందా, వారు దాన్ని వ్రాస్తూ ఉండటానికి? సరే నీ ప్రభువు ఆజ్ఞ వెలువడే వరకు, సహనం వహిస్తూ ఉండు, చేపవాని (యూనుస్‌ - అస్సలామ్‌) మాదిరిగా వ్యవహరించకు. అతను మొరపెట్టుకున్నప్పుడు ద్ణుఖంలో మునిగిఉన్నాడు. ఒకవేళ అతని ప్రభువు అనుగ్రహమే అతనికి తోడ్పడకపోయి ఉంటే, అతను అవమానకరమైన స్థితిలో నిస్సారమైన మైదానంలోకి విసరి వేయబడి ఉండేవాడే. చివరకు అతని ప్రభువు అతనిని ఎన్నుకొని సజ్జనులైన దాసుల్లో చేర్చాడు.

51 - 52 అవిశ్వాసులు ప్రబోధవాణి (ఖురాన్‌)ని విన్నప్పుడు, వారు నీ కాళ్లు ఊడగొడతారా అన్నట్లు నిన్ను కొరాకొరా చూస్తారు. ఇతను తప్పకుండా పిచ్చివాడే అని అంటారు. వాస్తవానికి ఇది సకల లోకాల వారి కొరకు అవతరించిన హితోపదేశం.

No comments:

Post a Comment