66. అత్ తహ్రీమ్
ఆయతులు
: 12 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 2 ఓ ప్రవక్తా! అల్లాహ్ నీ కొరకు ధర్మసమ్మతం చేసిన దానిని నీవు ఎందుకు నిషేధించు కుంటున్నావు? (ఈ విధంగా) నీవు నీ భార్యల సంతోషం పొందగోరుతున్నావా? - అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడూను. అల్లాహ్ నీ కొరకు నీ ప్రమాణాలు పాటింపు నుండి బయటపడే పద్ధతిని నిర్ణయించాడు. అల్లాహ్ మీ యజమాని, ఆయనే అన్నీ తెలిసినవాడు, వివేచనాపరుడూను.
3 (ఈ క్రింది వ్యవహారం కూడ గమనించదగిందే) ప్రవక్త ఒక విషయాన్ని తన భార్యలలో ఒకామెకు రహస్యంగా చెప్పాడు. తరువాత ఆమె (మరొకరికి) ఆ రహస్యాన్ని వెల్లడిరచింది. ప్రవక్తకు అల్లాహ్ ఆ విషయాన్ని (ఆ రహస్యం బయటపడిరదన్న సంగతిని) తెలియజేశాడు. అప్పుడు ప్రవక్త ఆ విషయాన్ని కొంత (ఆమెకు) తెలియజేసి, కొంత తెలియజేయలేదు. ఆ తరువాత ప్రవక్త ఆమెతో (రహస్యం బయటపడిన ఈ సంగతి) ఈ విషయం ప్రస్తావించినప్పుడు ఆమె ‘‘మీకీ విషయం ఎవరు తెలియ జేశారు?’’ అని అడిగింది. అప్పుడు ప్రవక్త, ‘‘నాకీ విషయాన్ని అన్నీ తెలిసినవాడు, బాగా ఎరిగినవాడు తెలియ జేశాడు’’ అని చెప్పారు.
4 - 5 మీరు ఉభయులు పశ్చాత్తాపపడితే (అది మీకే శ్రేయస్కరం). ఎందు కంటే,
మీ హృదయాలు ఋజుమార్గం నుండి తొలగిపోయాయి. ఒకవేళ ప్రవక్తకు వ్యతిరేకంగా మీరు ముఠా కట్టితే, తెలుసుకోండి, అల్లాహ్ ఆయన యజమాని. ఇంకా జిబ్రీలు, సజ్జనులైన విశ్వాసులందరూ, దైవదూతలందరూ ఆయన సహచరులు, సహాయకులూను. ఒకవేళ మీ అందరికీ ప్రవక్త విడాకు లిస్తే, అల్లాహ్ మీకు
బదులుగా ఆయనకు మీ కంటె మంచి భార్యలను ప్రసాదిస్తాడు
వారు నిజమైన ముస్లిమ్లుగా, విశ్వాసం కలవారుగా, విధేయత చూపేవారుగా, పశ్చాత్తాపపడేవారుగా, ఆరాధన చేసేవారుగా, ఉపవాసం పాటించేవారుగా ఉంటారు, వారు భర్తృవిహీనులైనా లేదా కన్యలైనా కావచ్చు.
6 - 7 విశ్వాసులారా! మీరు మిమ్మల్నీ, మీ కుంటుంబ సభ్యులనూ మానవులు, రాళ్లు ఇంధనం కాబోయే అగ్ని నుండి కాపాడుకోండి. దానిపై ఎంతో బలిష్ఠులు, అత్యంత కఠినులు అయిన దైవ దూతలు నియమించబడి ఉంటారు
వారు ఎన్నటికీ అల్లాహ్ ఆజ్ఞను ఉల్లంఘించరు, వారు తమకు ఏ ఆజ్ఞ ఇచ్చినా, దానిని పాటిస్తారు. (అప్పుడు ఇలా అనటం జరుగుతుంది), ‘‘అవిశ్వాసులారా! ఈనాడు సాకులు చెప్పకండి, మీరు చేస్తూ ఉండిన చేతలకు తగినట్టుగానే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది.’’
8 విశ్వాసులారా! చిత్తశుద్ధితో కూడిన పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపునకు మరలండి, అప్పుడు అల్లాహ్ మీ చెడులను మీ నుండి దూరం చేసి, మిమ్మల్ని సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయవచ్చు. అల్లాహ్ తన ప్రవక్తలనూ ఆయనతో పాటు విశ్వసించిన వారినీ అవమానం పాలు చేయని రోజు అదే. వారి కాంతి వారికి అగ్రభాగంలో, వారికి కుడివైపుగా పరుగెత్తుతూ ఉంటుంది. అప్పుడు వారు ఇలా అంటారు, ‘‘ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం చెయ్యి
మమ్మల్ని మన్నించు. నీవు ప్రతి దానిపై అధికారం కలవాడవు.’’
9 ఓ ప్రవక్తా! అవిశ్వాసులతో, కపటులతో పోరాడు, వారి పట్ల కఠినంగా వ్యవహరించు, వారి నివాసం నరకమవుతుంది, అది అతి చెడ్డనివాసం.
10 - 12 అల్లాహ్ అవిశ్వాసుల విషయంలో, ప్రవక్త నూహ్, ప్రవక్త లూత్ల భార్యలను ఉదాహరణగా పేర్కొంటున్నాడు. వారు సజ్జనులైన మా ఇద్దరు దాసుల వివాహబంధంలో ఉండేవారు. కాని వారు తమ భర్తలకు ద్రోహం చేశారు.
వారు అల్లాహ్ కు ప్రతిగా ఆ స్త్రీలకు ఏమాత్రం ఉపయోగపడలేక పోయారు. వారిద్దరితో, ‘‘వెళ్లండి, అగ్నిలోకి వెళ్ళే వారితోపాటు మీరూ వెళ్లండి’’ అని చెప్పబడిరది. విశ్వాసుల విషయంలో అల్లాహ్ ఫిరౌన్ భార్యను ఉదాహరణగా పేర్కొంటున్నాడు. అప్పుడు ఆమె ఇలా ప్రార్థించారు, ‘‘ప్రభూ! నా కొరకు నీ వద్ద స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌన్ నుండీ, అతని చేష్టల నుండీ కాపాడు, దుర్మార్గపు జాతినుండి నాకు విముక్తి కలిగించు.’’ ఇంకా ఇమ్రాన్ కుమార్తె మర్యమ్ను కూడ ఉదాహరణగా పేర్కొంటున్నాడు: ఆమె తన మానాన్ని కాపాడు కున్నారు. ఆ తరువాత మేము ఆమెలోకి మా తరఫు నుండి ఆత్మను ఊదాము. ఆమె తన ప్రభువు సూక్తులను, ఆయన గ్రంథాలను ధ్రువపరచారు. ఆమె వినయవిధేయతలు గల వారిలో ఒకరు.
No comments:
Post a Comment