39. అజ్ జుమర్
ఆయతులు
: 75 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
39. అజ్ జుమర్ 1 ఈ గ్రంథం మహాశక్తి సంపన్నుడూ, మహా వివేకవంతుడూ అయిన అల్లాహ్ తరఫునుండి అవతరించింది.
39. అజ్ జుమర్ 2 - 3 (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని సత్యంతో నీపై అవతరింపజేశాము. కనుక నీవు ధర్మాన్ని అల్లాహ్కే ప్రత్యేకిస్తూ అల్లాహ్ కు మాత్రమే దాస్యం చెయ్యి. జాగ్రత్త! ధర్మం ప్రత్యేకంగా అల్లాహ్ కు చెందిన హక్కు మాత్రమే. ఇక ఆయనను వదలివేసి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్నవారు, (తమ ఈ చర్యకు కారణంగా) ‘‘వారు మమ్మల్ని అల్లాహ్ వద్దకు చేరుస్తారని మాత్రమే మేము వారిని ఆరాధిస్తున్నాము’’ అని అంటారు. అల్లాహ్ నిశ్చయంగా వారి మధ్యన వారు విభేదిస్తున్న అన్ని విషయాలను గురించి తీర్పు చెబుతాడు. అసత్యవాదీ, సత్యధిక్కారీ అయిన ఏ వ్యక్తికీ అల్లాహ్ సన్మార్గం చూపడు.
39. అజ్ జుమర్ 4 - 6 ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా తన కుమారుడుగా చేసుకోదలిస్తే, తన సృష్టిలో తాను కోరిన వారిని ఎన్నుకుని ఉండేవాడు. ఆయన పరిశుద్ధుడు. (ఆయనకు కుమారుడు ఉంటాడు అనే విషయానికి) అతీతుడు. ఆయన అల్లాహ్ ఒక్కడే, అందరిపై ఆధిక్యం కలవాడు. ఆయన ఆకాశాలనూ, భూమినీ సత్యంతో సృష్టించాడు. ఆయనే పగటిని రేయితోనూ, రేయిని పగటితోనూ చుట్టివేస్తాడు. ఆయనే సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ నియమబద్ధులుగా చేసి ఉంచాడు. వాటిలో ప్రతి ఒక్కటీ ఒక నిర్ణీతకాలం వరకు సంచరిస్తూ వుంటుంది. తెలుసు కోండి, ఆయన మహాశక్తిమంతుడు మరియు మన్నించేవాడూను. మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే, తిరిగి ఆయనే ఆ ప్రాణి నుండి దాని జంటను సృజించాడు. ఇంకా ఆయనే మీ కొరకు పశువులలో ఎనిమిది మగ, ఆడ జాతులను సృష్టించాడు. ఆయన మీ తల్లుల గర్భాలలో మూడేసి చీకటి తెరలలో మీకు ఒక రూపం తరువాత మరొక రూపాన్ని ఇస్తూపోతు న్నాడు. (ఈ కార్యాలు నిర్వహించే) ఈ దేవుడే మీ ప్రభువు, సృష్టి సామ్రాజ్యం ఆయనదే. ఆయన తప్ప మరొక దేవుడు ఎవ్వడూ లేడు. అలాంటప్పుడు మీరు ఎలా మరలింప బడుతున్నారు?
39. అజ్ జుమర్ 7 ఒకవేళ మీరు తిరస్కార వైఖరిని అవలంబిస్తే అల్లాహ్ మీ అక్కర ఎంత మాత్రం లేనివాడు. కాని ఆయన తన దాసులు తిరస్కార వైఖరిని అవలంబిం చటాన్ని ఇష్టపడడు. ఒకవేళ మీరు కృతజ్ఞతలు తెలిపితే, దాన్ని ఆయన మీ కొరకు ఇష్టపడతాడు. బరువు మోసేవాడెవ్వడూ ఇతరుల బరువును మోయడు. చివరకు మీరందరూ మీ ప్రభువు వైపునకే మరలవలసి ఉంది. అప్పుడు ఆయన మీకు మీరు ఏమేమి చేస్తూ ఉండేవారో తెలుపుతాడు. ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును.
39. అజ్ జుమర్ 8 - 9 మనిషిపైకి ఎప్పుడైనా ఏదైనా ఆపద వచ్చిపడితే, అతడు తన ప్రభువు వైపునకు మరలి ఆయనకు మొఱ పెట్టుకుంటాడు. తరువాత అతడి ప్రభువు అతడికి తన అనుగ్రహాన్ని ప్రసాదించినపుడు, అతడు గతంలో ఏ ఆపదను గురించి మొఱపెట్టుకున్నాడో, ఆ ఆపదను మరచి పోయి, ఇతరులను
అల్లాహ్ కు సమానులుగా నిలబెడతాడు. ఈ విధంగా అతడు (ప్రజలను కూడా) అల్లాహ్ మార్గం నుండి తప్పిస్తాడు. (ఓ ప్రవక్తా!) అతడితో, ‘‘కొన్నాళ్ళపాటు నీ తిరస్కార వైఖరి ద్వారా ఆనందాన్ని అనుభవించు. చివరకు నీవు తప్పకుండా నరకానికి పోయేవాడివే’’ అని చెప్పు. (ఈ వ్యక్తి వైఖరి మంచిదా లేక ఆ వ్యక్తి వైఖరి మంచిదా) ఎవడైతే విధేయుడో, రాత్రి గడియలలో (నమాజు చేస్తూ) నిలబడతాడో, సజ్దాలు చేస్తాడో, పరలోకానికి భయ పడతాడో, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తాడో? వీరిని అడుగు, తెలిసినవారూ, తెలియని వారూ ఇద్దరూ ఎప్పుడైనా సమానులు కాగలరా? బుద్ధిమంతులు మాత్రమే హితబోధను స్వీకరిస్తారు.
39. అజ్ జుమర్ 10 (ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు, ‘‘విశ్వసించిన నా దాసులారా! మీ ప్రభువునకు భయపడండి. ఈ లోకంలో సద్వర్తనను అవలంబించే వారికి మేలు జరుగు తుంది. దేవుని భూమి విశాలమైనటువంటిది. ఓర్పు వహించేవారికి లెక్క లేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది.’’
39. అజ్ జుమర్ 11 - 18 (ఓ ప్రవక్తా!) వారికి ఇలా చెప్పు, ‘‘ధర్మాన్ని అల్లాహ్కే ప్రత్యేకించి, ఆయనకు మాత్రమే దాస్యం చేయి అని నాకు ఆజ్ఞ ఇవ్వబడిరది. అందరికంటే ముందు స్వయంగా నేను ముస్లిమ్ అయిపోవాలని కూడ నాకు ఆజ్ఞ ఇవ్వ బడిరది.’’ ఇంకా ఇలా చెప్పు,
‘‘ఒకవేళ నేను నా ప్రభువునకు అవిధేయత చూపితే, నేను ఒక మహాదినం నాటి శిక్షను గురించి భయపడుతున్నాను.’’ ఇలా కూడ చెప్పు, ‘‘నేను మాత్రం నా ధర్మాన్ని అల్లాహ్కే ప్రత్యేకించి, ఆయనకు మాత్రమే దాస్యం చేస్తాను. మీరు ఆయన దాస్యం తప్ప, ఎవరెవరి దాస్యం చెయ్యదలచుకున్నారో, చేస్తూ ఉండండి.’’ ఇలా అను, ‘‘ప్రళయంనాడు తమనూ, తమ భార్యలనూ, పిల్లలనూ నష్టంలో పడవేసుకునేవారే అసలైన దివాళాకోరులు. బాగా వినండి. స్పష్టమైన దివాళా అంటే ఇదే. వారిమీద నిప్పు గొడుగులు పైనుండి కూడ క్రమ్ముకుని ఉంటాయి, క్రింద నుంచి కూడా. ఈ పర్యవసానం గురించే అల్లాహ్ తన దాసులను భయపెడుతున్నాడు. కనుక నా దాసులారా! నా ఆగ్రహం నుండి తప్పించుకోండి. దీనికి భిన్నంగా తాగూత్ దాస్యాన్ని విసర్జించి, అల్లాహ్ వైపునకు మరలేవారికి శుభవార్త ఉన్నది. కనుక (ఓ ప్రవక్తా!) మాటను శ్రద్ధగా విని, అందులోని మంచి మంచి విషయాలను అనుసరించే నా దాసులకు శుభవార్త అందజెయ్యి. అల్లాహ్ సన్మార్గం చూపిన వారు వీరే. విజ్ఞులు కూడ వీరే.
39. అజ్ జుమర్ 19 - 20 (ఓ ప్రవక్తా!)
శిక్షా నిర్ణయం రూఢ అయిపోయిన వ్యక్తిని ఎవడు రక్షించగలడు? అగ్నిలో పడిపోయినవాణ్ని నీవు రక్షించగలవా? అయితే, తమ ప్రభువునకు భయపడుతూ ఉండేవారికి అంతస్తుపై అంతస్తుగా కట్టబడిన ఎత్తైన భవనాలు ఉన్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది అల్లాహ్ వాగ్దానం. అల్లాహ్ ఎన్నడూ తన వాగ్దానాన్ని భంగపరచడు.
39. అజ్ జుమర్ 21 - 22 మీరు గమనించరా - అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపిం చాడు. తరువాత దానిని ఊటలు, చలమలు, నదుల రూపాలలో భూమిలో ప్రవేశింపజేశాడు. తరువాత ఈ నీటి ద్వారా ఆయన రకరకాల పంటలు పండిస్తున్నాడు. వాటి రంగులు కూడ భిన్నంగా ఉంటాయి. ఆ తరువాత ఆ పంటలు పండి ఎండిపోతాయి. మళ్లీ, అవి పసుపు రంగుగా మారిపోవటాన్ని మీరు చూస్తారు. చివరకు అల్లాహ్ వాటిని పొట్టుగా మార్చివేస్తాడు. యథార్థా నికి ఇందులో బుద్ధిమంతులకు గుణపాఠం ఉంది. ఇక ఏ వ్యక్తి హృదయాన్ని అల్లాహ్ ఇస్లామ్కై తెరిచాడో, ఏ వ్యక్తి తన ప్రభువు చూపిన వెలుగులో నడుస్తున్నాడో, ఆ
వ్యక్తి (ఈ విషయాల నుండి ఏ గుణపాఠమూ నేర్చుకోని వ్యక్తిలాంటి వాడు కాగలడా?) అల్లాహ్ హితోపదేశం వల్ల ఎవరి హృదయాలు మరింత కఠినమైపోతాయో, వారికి వినాశం ఉన్నది. వారు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు.
39. అజ్ జుమర్ 23 - 26 అల్లాహ్ ఎంతో శ్రేష్ఠమైన వచనాన్ని అవతరింపజేశాడు. ఇది ఒకే పోలిక కలిగివున్న భాగాలు కల గ్రంథం. ఇందులో, విషయాలు మాటిమాటికీ పునరుక్తం చేయబడినాయి. దానిని విన్నప్పుడు, తమ ప్రభువునకు భయపడే వారి రోమాలు నిక్క బొడుచుకుంటాయి
తరువాత వారి శరీరాలూ, వారి హృదయాలూ మెత్తబడి అల్లాహ్ ధ్యానం వైపునకు మొగ్గుతాయి. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం, దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సత్యమార్గంపైకి తీసుకువస్తాడు. స్వయంగా అల్లాహ్ మార్గం చూపనివాడికి, మరొక మార్గదర్శ కుడు ఎవ్వడూ లేడు, ఇక ప్రళయం నాడు శిక్ష యొక్క తీవ్రమైన దెబ్బను తన ముఖం మీద తినేవాడి దుస్థితిని గురించి నీవేమి అంచనా వేయగలవు? అటువంటి దుర్మార్గులతో, ‘‘ఇక మీరు సంపాదించిన దానిని రుచి చూడండి’’ అని అనబడుతుంది. వారికి పూర్వం కూడ చాలమంది ప్రజలు ఇదేవిధంగా తిరస్కరించారు. చివరికి వారిపైకి శిక్ష, వారు ఊహించనుకూడ లేనటువంటి దిశ నుండి వచ్చిపడిరది. తరువాత అల్లాహ్ వారికి ఇహలోక జీవితంలోనే అవమానాన్ని రుచి చూపించాడు. పరలోక శిక్ష అయితే దాని కంటే కూడ ఎంతో తీవ్ర మైనదిగా ఉంటుంది. అయ్యో! వారు గ్రహిస్తే ఎంత బాగుంటుంది.
39. అజ్ జుమర్ 27 - 35 మేము ఈ ఖురాన్లో ప్రజల కొరకు రకరకాల దృష్టాంతాలను ఇచ్చాము, వారు స్పృహలోనికి వస్తారేమో అని. అరబ్బీ భాషలో ఉన్న ఈ ఖురాన్లో ఎలాంటి వక్రతా లేదు
వారు తమను చెడు పర్యవసానం నుండి కాపాడుకుంటారేమో అని. అల్లాహ్ ఒక దృష్టాంతం ఇస్తున్నాడు - ఒక వ్యక్తి ఉన్నాడు: అతనిని తమ తమ వైపునకు లాగే సంస్కార హీనులైన యజమానులు అనేకమంది ఉన్నారు. మరొక వ్యక్తి ఉన్నాడు: అతను పూర్తిగా ఒకే యజమానికి బానిసగా ఉన్నాడు. ఆ ఇద్దరు వక్తుల పరిస్థితి ఒకటే అవుతుందా?- ‘‘అల్ హమ్దులిల్లాహ్’’ (స్తోత్రం కేవలం అల్లాహ్కే), కాని చాలమంది అజ్ఞానంలో పడి ఉన్నారు, (ఓ ప్రవక్తా!) నీవూ మరణిస్తావు, వారూ మరణిస్తారు. చివరకు ప్రళయం నాడు మీరంతా మీ ప్రభువు సమక్షంలో మీమీ వ్యాజ్యాలను వినిపి స్తారు. ఎవడు అల్లాహ్ కు అబద్ధాన్ని ఆపాదిస్తాడో, సత్యం అతడి ముందుకు వచ్చినప్పుడు అది అబద్ధమని దానిని తిరస్కరిస్తాడో, అతడికంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారికి నరకంలో స్థానమేమీ లేదా? సత్యాన్ని తీసుకు వచ్చిన వ్యక్తీ, అది సత్యమని అంగీకరించిన ప్రజలూ మాత్రమే శిక్ష తప్పించుకుంటారు. వారికి తమ ప్రభువు వద్ద వారు కోరుకునేదంతా లభిస్తుంది. ఇది సత్కార్యాలు చేసే వారికి దొరికే ప్రతిఫలం
వారు చేసిన అత్యంత
ఘోరమైన పనులను అల్లాహ్ వారి లెక్క నుండి తీసివెయ్యటానికి, వారు చేసిన ఎంతో మంచి
పనులకు గాను వారికి ప్రతిఫలం ప్రసాదించ టానికి.
39. అజ్ జుమర్ 36 - 41 (ఓ ప్రవక్తా!) అల్లాహ్ తన దాసునికి సరిపోడా? వారు ఆయనను గురించి కాక,
ఇతరులను గురించి నిన్ను భయపెడుతున్నారు. వాస్తవానికి, అల్లాహ్ దారి తప్పించేవాడికి దారిచూపే వాడెవ్వడూ లేడు. ఆయన దారి చూపేవాడిని దారి తప్పించేవాడు కూడ ఎవ్వడూ లేడు. అల్లాహ్ మహాశక్తి మంతుడూ, ప్రతీకారం చేసేవాడూ కాడా?
ఒకవేళ నీవు వారిని, భూమ్యా కాశాలను ఎవడు సృష్టించాడు అని అడిగితే, వారే స్వయంగా, ‘‘అల్లాహ్ యే’’ అని అంటారు. వారిని ఇలా అడుగు:‘‘యథార్థం ఇదైనప్పుడు, ఒకవేళ అల్లాహ్ నాకేదైనా నష్టాన్ని కలిగించగోరితే, మీరు అల్లాహ్ ను కాదని వేడుకునే మీ దేవీలు, ఆయన కలిగించే నష్టం నుండి నన్ను కాపాడగలరా? లేదా అల్లాహ్ నాపై కనికరం చూపగోరితే, వారు ఆయన కారుణ్యాన్ని అడ్డుకోగలరా? మీ అభిప్రాయమేమిటి? కనుక వారితో ఇలా అను,‘‘నాకు అల్లాహ్ ఒక్కడే చాలు, నమ్ముకునే వారు ఆయననే నమ్ముకుంటారు.’’ వారికి స్పష్టంగా ఇలా చెప్పు, ‘‘నా జాతి ప్రజలారా! మీరు మీ ఇష్టం ప్రకారం మీ పనులు చేస్తూ ఉండండి. నా పనేదో నేనూ చేస్తూ ఉంటాను. త్వరలోనే మీకు తెలిసిపోతుంది, ఎవరి మీదకు అవమానకరమైన శిక్ష వచ్చిపడుతుందో, ఇంకా ఎవరికి ఎన్నడూ తొలగిపోని శిక్ష లభిస్తుందో.’’ (ఓ ప్రవక్తా!) మేము మానవులందరి కోసం ఈ సత్యగ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. ఇక ఎవడు ఋజుమార్గాన్ని అవలంబిస్తాడో, అతడు తన మేలు కోసమే అలా చేస్తాడు. ఎవడు మార్గం తప్పుతాడో, ఆ మార్గం తప్పటమనే కీడుకు అతడే బాధ్యుడు అవుతాడు. నీవు వారికి బాధ్యుడవు కావు.
39. అజ్ జుమర్ 42 - 44 మరణ సమయంలో ఆత్మలను వశపరచుకునేవాడు అల్లాహ్ యే
ఇంకా మరణించని వాడి ఆత్మను అతడు నిద్రావస్థలో ఉన్నప్పుడు వశపరచు కుంటాడు. ఆయన ఎవడి విషయంలో, మరణ నిర్ణయం అమలుచేస్తాడో, దానిని (అతడి ఆత్మను) ఆపి ఉంచుతాడు
మిగతావారి ఆత్మలను ఒక నిర్ణీత సమయం వరకు తిరిగి పంపివేస్తాడు. ఆలోచించే వారికి ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. అటువంటి దేవుణ్ణి వదలిపెట్టి, వారు ఇతరులను సిఫారసుదారులుగా చేసుకున్నారా? వారికి ఇలా చెప్పు, ‘‘వారికి కించిత్తు అధికారం ఉన్నా లేకపోయినా, వారికి అవగాహన ఉన్నా లేకపోయినా వారు సిఫారసు చేయగలరా?’’ ఇంకా ఇలా అను, ‘‘సిఫారసు అనేది పూర్తిగా అల్లాహ్ చేతిలోనే ఉన్నది. భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి ఆయనే. తరువాత ఆయన వైపునకే మీరు మరలింపబడతారు.’’
39. అజ్ జుమర్ 45 - 48 ఒక్క అల్లాహ్ ను గురించి మాత్రమే ప్రస్తావించటం జరిగినప్పుడు, పరలోకం పట్ల విశ్వాసం లేని వారి హృదయాలు బాధపడతాయి. ఆయనను తప్ప ఇతరులను గురించి ప్రస్తావించటం జరిగినప్పుడు, యకాయకి వారి ముఖాలు సంతోషంతో వెలిగిపోతాయి. ఇలా అను, ‘‘దైవమా! భూమ్యాకాశా లకు సృష్టికర్తా! గోచర అగోచరాలను ఎరిగినవాడా!
నీవే నీ దాసుల మధ్య వారు విభేదిస్తూ ఉన్న విషయం గురించి తీర్పు చేస్తావు.
ఒకవేళ ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న మొత్తం సంపద ఉంటే,
ఇంకా అంతే సంపదకూడ ఉంటే, వారు ప్రళయం నాటి దారుణ శిక్ష నుండి తప్పించుకోవటానికి ఈ మొత్తం సంపదను పరిహారంగా ఇవ్వటానికి సిద్ధపడతారు. అక్కడ అల్లాహ్ తరఫు నుండి వారి ముందుకు, వారు ఎన్నడూ ఊహించి కూడ ఉండనిదంతా వస్తుంది. అక్కడ తమ సంపాదన యొక్క దుష్ఫలితాలన్నీ వారికి స్పష్టంగా తెలిసిపోతాయి. వారు ఎగతాళి చేస్తూ వచ్చినదే వారిని చుట్టు ముట్టుతుంది.
39. అజ్ జుమర్ 49 - 52 ఈ మానవుడే తనకు కొంచెం కష్టం కలిగినప్పుడు, మాకు మొరపెట్టుకుంటాడు. మేము అతనికి మా తరఫు నుండి, అనుగ్రహాన్ని ప్రసాదించినప్పుడు, ‘‘నాకు ఉన్న జ్ఞానం కారణంగానే ఇది నాకు ఇవ్వబడిరది’’ అని అతడు అంటాడు. కాని అది కాదు, ఇది ఒక పరీక్ష. అయితే వారిలో చాల మంది ఎరుగరు. ఈ మాటనే వారికి పూర్వం గతించిన వారు కూడ అన్నారు. కాని,
వారు సంపాదించినదేదీ వారికి ఏ
విధంగానూ పనికి రాకుండా పోయింది.
తరువాత తమ సంపాదన యొక్క దుష్ఫలితాలను వారు అనుభవించారు. వారిలోని దుర్మార్గులు త్వరలోనే తమ సంపాదన యొక్క దుష్ఫలితాలను అనుభవిస్తారు. వారు మమ్మల్ని అశక్తులుగా చేయలేరు. అల్లాహ్ తాను కోరిన వారికి ఉపాధిని అపరిమితంగా ఇస్తాడనీ, తాను కోరిన వారికి ఉపాధిని పరిమితంగా ఇస్తాడనీ వారికి తెలియదా? ఇందులో విశ్వసించే వారికి సూచనలు ఉన్నాయి.
39. అజ్ జుమర్ 53 - 61 (ఓ ప్రవక్తా!) ఇలా అను, ‘‘మీ ఆత్మలకు అన్యాయం చేసుకున్న నా దాసులారా అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ
చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలనూ క్షమిస్తాడు.
ఆయన క్షమించేవాడు, కరుణించే వాడూను. మీ మీదకు శిక్ష రాకమునుపే, మీకు ఎవరి నుండీ సహాయం లభించని పరిస్థితి ఏర్పడక మునుపే, మీరు మీ ప్రభువు వైపునకు మరలి, ఆయనకు విధేయత చూపండి. మీకు తెలియకుండానే మీ మీదకు అకస్మాత్తుగా శిక్ష రాకముందే, మీ ప్రభువు పంపిన గ్రంథంలోని ఉత్తమమైన విషయాలను అనుసరించండి. తరువాత ఏ వ్యక్తి అయినా ఇలా అనే పరిస్థితి రాకూడదు సుమా! ‘‘అల్లాహ్ విషయంలో నేను చూపిన నిర్లక్ష్యతకు నేను ఎంతో చింతి స్తున్నాను. పైగా నేను ఎగతాళి చేసే వారిలో చేరిపోయాను.’’ లేదా ‘‘అయ్యో! అల్లాహ్ నాకు సన్మార్గం చూపి ఉంటే, నేను కూడ భయభక్తులు కలవారిలో చేరిపోయేవాణ్ణి.’’ లేదా శిక్షనుచూసి, ‘‘అయ్యో! నాకు మరొక అవకాశం దొరికితే ఎంత బాగుండును. నేను కూడ సత్కార్యాలు చేసేవారిలో కలిసి పోతాను.’’ (అప్పుడు అతనికి ఈ జవాబు దొరకకూడదు) ‘‘లేదు. నా వాక్యాలు నీ వద్దకు వచ్చాయి. కాని నీవు వాటిని తిరస్కరించావు
విర్రవీగావు. నీవు అవిశ్వాసులలోని వాడవు.’’ ఈనాడు అల్లాహ్ కు అసత్యాన్ని ఆపాదించిన వారి
ముఖాలు, ప్రళయం నాడు నల్లగా మారిపోవటాన్ని నీవు చూస్తావు. నరకంలో గర్విష్ఠులకు సరిపోయే స్థలం లేదా? దీనికి భిన్నంగా ఇక్కడ అల్లాహ్ కు భయపడిన వారికి, వారి సాఫల్యానికి దోహదం చేసిన కారణాల వల్ల, అల్లాహ్ ముక్తిని ప్రసాదిస్తాడు. వారికి ఏ కష్టమూ కలగదు. వారికి ఎలాంటి విచారమూ ఉండదు.
39. అజ్ జుమర్ 62 - 66 ప్రతి వస్తువునూ సృష్టించిన వాడు అల్లాహ్ యే. ప్రతి వస్తువునకూ సంరక్షకుడు కూడ ఆయనే. భూమిలో, ఆకాశాలలో ఉన్న నిక్షేపాల తాళపు చెవులు ఆయన వద్దనే ఉన్నాయి. అల్లాహ్ వాక్యాలను తిరస్కరించే వారే నష్టానికి గురిఅయ్యేవారు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను, ‘‘అయితే, ఓ మూర్ఖులారా! అల్లాహ్ ను కాదని మరొకరికి దాస్యం చేయమని మీరు నాకు చెబుతున్నారా?’’ (ఈ విషయాన్ని నీవు వారికి స్పష్టంగా చెప్పు. ఎందుకంటే) నీ వద్దకూ, నీకు పూర్వం గతించిన ప్రవక్తల వద్దకూ ఇలా వహీ పంపబడిరది: ‘‘ఒకవేళ మీరు షిర్కు (బహుదైవారాధన) చేస్తే, మీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి
మీరు నష్టానికి గురి అవుతారు.’’ కనుక (ఓ ప్రవక్తా!) నీవు కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించు. కృతజ్ఞులై ఉండే దాసులలో చేరిపో.
39. అజ్ జుమర్ 67 - 70 వారు అల్లాహ్ ను ఏ విధంగా గౌరవించాలో, ఆ విధంగా గౌరవించనే లేదు. (ఆయన శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే) ప్రళయం నాడు, యావత్తు భూమండలం ఆయన పిడికిలిలో ఉంటుంది. ఆకాశాలు ఆయన కుడి చేతిలో చుట్టబడి ఉంటాయి. వారు చేస్తున్న షిర్కు (బహుదైవారాధన)కు ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆ రోజున శంఖం పూరించబడుతుంది, ఆకాశాలలో, భూమిలో ఉన్న వారు అందరూ చచ్చిపడిపోతారు, అల్లాహ్ సజీవంగా ఉంచదలచుకున్నవారు తప్ప. తరువాత రెండోసారి శంఖం పూరించబడుతుంది : అప్పుడు ఒక్కసారిగా అందరూ లేచిచూడటం ప్రారంభిస్తారు. భూమి తన ప్రభువు యొక్క తేజస్సుతో వెలిగిపోతుంది. కర్మల చిట్టా తీసుకురాబడుతుంది. దైవ ప్రవక్తలూ, సాక్షులూ అందరూ హాజరు పరచబడతారు. ప్రజలకు సరిగ్గా, న్యాయంగా తీర్పు చేయబడు తుంది. వారికి ఎలాంటి అన్యాయమూ జరగదు. ప్రతి ఆత్మకూ అది చేసుకున్న కర్మల ప్రకారం పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ప్రజలు చేస్తున్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
39. అజ్ జుమర్ 71 - 72 (ఈ తీర్పు తరువాత) సత్యాన్ని తిరస్కరించినవారు, నరకం వైపు నకు గుంపులు, గుంపులుగా తోలబడతారు. చివరకు వారు అక్కడకు చేరి నప్పుడు దాని ద్వారాలు తెరువబడతాయి. దాని కాపలాదారులు వారితో ఇలా అంటారు, ‘‘స్వయంగా మీలో నుండే, మీకు, మీ ప్రభువు వాక్యాలను వినిపించి, ఎప్పుడో ఒకప్పుడు, మీరు ఈ దినాన్ని కూడ చూడవలసి వస్తుందని, మిమ్మల్ని హెచ్చరించిన ప్రవక్తలు మీ వద్దకు రాలేదా?’’ వారు, ‘‘అవును, వచ్చారు. కాని శిక్షా నిర్ణయం అవిశ్వాసుల విషయంలో రూఢ అయిపోయింది’’ అని సమాధానం చెబుతారు. ఇలా అనబడుతుంది, ‘‘నరక ద్వారాలలో ప్రవేశిం చండి. ఇక్కడ మీరు ఇక శాశ్వతంగా ఉండవలసి ఉంది. ఇది గర్విష్ఠుల నివాసం, చాల చెడ్డ నివాసం.’’
39. అజ్ జుమర్ 73 - 74 తమ ప్రభువు పట్ల అవిధేయతకు దూరంగా ఉన్నవారిని, బృందాలు, బృందాలుగా స్వర్గం వైపునకు తీసుకుపోవటం జరుగుతుంది. చివరకు వారు అక్కడకు చేరినప్పుడు, దాని తలుపులు ముందుగానే తెరువబడి ఉంటాయి. దాని నిర్వహణాధికారులు వారితో ఇలా అంటారు, ‘‘మీకు శాంతి కలుగుగాక! మీరు చక్కగా ప్రవర్తించారు. ప్రవేశించండి ఇందులోకి, శాశ్వతంగా ఉండేటం దుకు.’’ వారు ఇలా అంటారు, ‘‘మాకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన, మమ్మల్ని భూమికి వారసులుగా చేసిన దేవునికి కృతజ్ఞతలు. ఇక మేము, స్వర్గంలో ఎక్కడ కోరుకుంటే అక్కడ
నివాసం ఏర్పరచుకోగలము.’’ కనుక (సత్కార్యాలు) ఆచరించేవారికి ఎంత మంచి ప్రతిఫలం!
39. అజ్ జుమర్ 75 దైవ సింహాసనం చుట్టూ దైవదూతలు వలయంగా ఏర్పడి తమ ప్రభువును స్తుతించటాన్నీ, ఆయన పవిత్ర నామాన్ని కొనియాడుతూ ఉండటాన్నీ నీవు చూస్తావు. ప్రజల మధ్య సక్రమంగా, న్యాయంగా తీర్పు చేయటం జరుగుతుంది. ‘‘స్తోత్రం కేవలం సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్ కు మాత్రమే చెందుతుంది’’ అని ప్రకటించబడుతుంది.
No comments:
Post a Comment