65 అత్ తలాఖ్
ఆయతులు
: 12 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 2 ... ఓ ప్రవక్తా! మీరు గనక స్త్రీలకు విడాకులివ్వవలసి వస్తే, వారి నిర్ణీత గడువు (ఇద్దత్) కొరకు విడాకులివ్వండి, మరియు నిర్ణీత గడువు కాలాన్ని కచ్చితంగా లెక్కపెట్టండి
మీ ప్రభువైన అల్లాహ్ కు భయపడండి. (ఆ గడువు కాలంలో) వారేదైనా స్పష్టమైన చెడుకు పాల్పడితే తప్ప, మీరూ వారిని వారి ఇళ్లనుండి వెళ్లగొట్టకూడదు, స్వయంగా వారు కూడ పోకూడదు. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. ఎవడు అల్లాహ్ నిర్ణయించిన హద్దులను అతిక్రమిస్తాడో, అతడు స్వయంగా తనకు తానే అన్యాయం చేసుకుంటాడు. మీకు తెలియదు, బహుశా దీని తరువాత అల్లాహ్ ఏదైనా అనుకూల మార్గం చూపించవచ్చు. తరువాత వారి నిర్ణీత గడువు కాలం ముగిసినప్పుడు, వారిని ఉత్తమమైన రీతిలో (మీ వివాహబంధంలో) ఆపి వుంచండి లేదా ఉత్తమమైన రీతిలో వారి నుంచి విడిపొండి. మీలో న్యాయశీలురైన ఇద్దరు వ్యక్తులను సాక్షులుగా పెట్టుకోండి. (ఓ సాక్షులారా) అల్లాహ్ కొరకు ఉన్నది ఉన్నట్లుగా సాక్ష్యం చెప్పండి.
... 2 - 3 అల్లాహ్ ను, అంతిమ దినాన్ని విశ్వసిస్తున్న ప్రతివానికి ఈ విషయాలు బోధించబడుతున్నాయి. ఎవడు అల్లాహ్ కు భయపడుతూ పనిచేస్తాడో, అతనికి అల్లాహ్ కష్టాల నుండి గట్టెక్కే మార్గం చూపుతాడు. ఇంకా అతని ఊహకు కూడ అందనటువంటి మార్గం ద్వారా, అతనికి ఉపాధి ప్రసాదిస్తాడు. అల్లాహ్ ను నమ్ముకున్నవానికి అల్లాహ్ యే చాలు. అల్లాహ్ తన పనిని పూర్తి చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రతిదానికి ఒక విధి నిర్ణయించి ఉంచాడు.
4 - 5
మీ స్త్రీలలో ఎవరైనా ఋతుక్రమం విషయంలో ఆశ వదలుకుంటే వారి విషయంలో మీకేదైనా అనుమానం కలిగితే, అప్పుడు వారి నిర్ణీత గడువు మూడు మాసాలు (అని మీరు తెలుసుకోండి). ఇదే ఆజ్ఞ ఇంకా ఋతుక్రమం ప్రారంభం కాని వారికి కూడ వర్తిస్తుంది. గర్భిణీ స్త్రీల నిర్ణీత గడువు వారి కాన్పు అయ్యేవరకు ఉంటుంది.
ఎవడు అల్లాహ్ కు భయ పడతాడో, అతని వ్యవహారంలో అల్లాహ్ సౌలభ్యం కలుగజేస్తాడు. ఇది అల్లాహ్ ఆజ్ఞ, దానిని
ఆయన మీపై అవతరింపజేశాడు. ఎవడు అల్లాహ్ కు భయ పడతాడో, అల్లాహ్ అతని పాపాలను అతని నుండి దూరం చేస్తాడు
అతనికి గొప్ప ప్రతిఫలం ఇస్తాడు.
6 ... వారిని (నిర్ణీత గడువు కాలంలో) మీరు నివసించే చోటనే ఉంచండి, మీకు ఎలాంటి చోటు లభించినా సరే. వారిని ఇబ్బందులపాలు చేయటానికి వేధించకండి.
... 6 - 7 ఒకవేళ వారు గర్భవతులైతే, వారు ప్రసవించే వరకు వారి కోసం ఖర్చుచేస్తూ ఉండండి. తరువాత ఒకవేళ వారు మీకోసం (బిడ్డకు) పాలుపట్టే పక్షంలో, వారి ప్రతిఫలం వారికి ఇవ్వండి. ఉత్తమ రీతిలో (ప్రతిఫలం వ్యవహారాన్ని) పరస్పర సంప్రదింపుల ద్వారా నిర్ణయించుకోండి. కాని ఒకవేళ మీరు (ప్రతిఫల నిర్ణయంలో) ఒకరినొకరు ఇబ్బందుల పాల్జేసుకుంటే, బిడ్డకు మరొక స్త్రీ ఎవరైనా పాలుపట్టాలి. సంపన్నుడైన వ్యక్తి తన ఆర్థిక స్తోమతను బట్టి ఖర్చుపెట్టాలి. తక్కువ ఉపాధి ఇవ్వబడిన వ్యక్తి, అల్లాహ్ తనకు ఇచ్చిన ధనం నుండే ఖర్చుపెట్టాలి. అల్లాహ్ ఎవరికి ఎంత ఇచ్చాడో, దానికి మించి ఆయన అతనిపై భారం వేయడు. అల్లాహ్, పేదరికం తరువాత సంపన్న స్థితిని ప్రసాదించకపోడు.
8 - 11
ఎన్నో పట్టణాలు తమ ప్రభువు ఆజ్ఞలను, ఆయన ప్రవక్తల ఆజ్ఞలను ధిక్కరించాయి. అప్పుడు మేము వాటి ప్రజల నుండి కఠినంగా లెక్కతీసుకుని, వారిని తీవ్రంగా శిక్షించాము. వారు తాము చేసిన కర్మలను రుచి చూశారు. వారి పర్యవసానం అంతా నష్టమే. అల్లాహ్ (పరలోకంలో) వారి కొరకు కఠిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. కనుక విశ్వాసులైన బుద్ధిమంతులారా! అల్లాహ్ కు భయపడండి. అల్లాహ్ మీ వద్దకు ఒక హితబోధను పంపాడు, ఒక ప్రవక్తను పంపాడు, అతను మీకు స్పష్టమైన మార్గం చూపే అల్లాహ్ ఆయతులను వినిపిస్తున్నాడు, విశ్వసించి, సత్కార్యాలు చేసే వారిని చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకురావటానికి. అల్లాహ్ ను విశ్వసించి మంచి పనులు చేసేవాణ్ణి అల్లాహ్ సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వారు అక్కడ కలకాలం ఉంటారు. అల్లాహ్ అటువంటి వ్యక్తి కొరకు మంచి ఉపాధిని ఉంచాడు.
12 సప్తాకాశాలనూ, అలాంటివే ఎన్నో భూమండలాలనూ సృజించినవాడు అల్లాహ్ యే. వాటిపై అల్లాహ్ ఆజ్ఞ అవతరిస్తూ ఉంటుంది. అల్లాహ్ ప్రతి వస్తువుపై అధికారం కలిగి ఉన్నాడనీ, అల్లాహ్ జ్ఞానం ప్రతి వస్తువును పరివేష్టించి ఉన్నదనీ మీరు తెలుసుకోవటానికి (ఈ విషయం మీకు తెలియజేయబడుతోంది).
No comments:
Post a Comment