36. యాసీన్
ఆయతులు
: 83 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
36. యాసీన్ 1 - 6 యాసీన్. వివేక విలసితమైన ఖురాన్ సాక్షిగా! నీవు నిశ్చయముగా దైవ ప్రవక్తలలోని వాడవు
ఋజుమార్గంలో ఉన్నావు. (ఈ ఖురాన్) శక్తిమంతుడూ, కరుణామయుడూ అయినవాడు అవతరింప జేసినది
నీవు ఒక జాతిని హెచ్చరించేందుకు. దాని పూర్వికులు హెచ్చరిక చేయబడని కారణంగా అశ్రద్దకు గురిఅయి ఉన్నారు.
36. యాసీన్ 7 - 11 వారిలో అనేకులు శిక్షా నిర్ణయానికి అర్హులయ్యే ఉన్నారు. కనుకనే వారు విశ్వసించటం లేదు. మేము వారి మెడలలో పట్టాలు వేశాము, వాటివల్ల వారు గడ్డాల వరకు బంధించబడ్డారు. అందుకని వారు తలను ఎత్తి నిలుచున్నారు. మేము వారి ముందు ఒక గోడనూ, వారి వెనుక మరొక గోడనూ నిలబెట్టాము. మేము వారిని (ఈ విధంగా) కప్పి వేశాము, ఇక వారికి ఏమీ తోచదు. నీవు వారిని హెచ్చరించినా, హెచ్చరించకపోయినా వారికి ఒక్కటే
వారు విశ్వసించరు. నీవు హితబోధను అనుసరించేవాణ్ణి మాత్రమే, కరుణామయుడైన దేవుణ్ణి చూడకుండానే భయపడేవాణ్ణి మాత్రమే హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష, గొప్ప ప్రతిఫలమూ లభిస్తాయనే శుభవార్త అందించు.
36. యాసీన్ 12 మేము నిశ్చయంగా ఒక రోజున మృతులను బ్రతికిస్తాము. వారు చేసే పనులన్నింటినీ మేము నమోదు చేస్తూనే ఉన్నాము. వారు తమ వెనుక విడిచివెళ్ళిన చిహ్నాలను కూడా మేము నమోదు చేస్తూ ఉన్నాము. ప్రతి విషయాన్నీ మేము ఒక స్పష్టమైన గ్రంథంలో వ్రాసిపెట్టాము.
36. యాసీన్ 13 - 15 ఉదాహరణగా వారికి ఆ పట్టణవాసుల గాధను వినిపించు
అక్కడకు దైవప్రవక్తలు వచ్చినప్పటి గాథను
మేము వారివద్దకు ఇద్దరు ప్రవక్తలను పంపాము. వారు ఆ ఇద్దరినీ అసత్యవాదులు అని తిరస్కరించారు. తరువాత మేము వారికి సహాయంగా మూడో అతన్ని పంపాము. వారందరూ, ‘‘మేము మీ వద్దకు దైవ ప్రవక్తలుగా పంపబడ్డాము’’ అని అన్నారు. పట్టణవాసులు ఇలా అన్నారు, ‘‘మీరు మా వంటి కొందరు మానవులు తప్ప మరేమీ కారు. కరుణామయుడైన దేవుడు ఏ విషయాన్నీ అవతరింపజేయలేదు, మీరు కేవలం అబద్ధం పలుకుతున్నారు.’’
36. యాసీన్ 16 - 19 దైవప్రవక్తలు ఇలా అన్నారు, ‘‘మేము నిశ్చయంగా మీ వద్దకు దైవప్రవక్తలుగా పంపబడిన విషయాన్ని మా ప్రభువు ఎరుగును. స్పష్టంగా సందేశాన్ని అందజేయటం తప్ప మాపైని మరొక బాధ్యత ఏదీ లేదు.
పట్టణవాసులు ఇలా అన్నారు, ‘‘మేము మిమ్మల్ని (మాకు) ఒక దుశ్శకునంగా పరిగణిస్తున్నాము. మీరు (ఈ పనిని) మానుకోకపోతే, మేము మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపేస్తాము. మీరు మా తరఫు నుండి అత్యంత బాధాకరమైన శిక్షను పొందుతారు.’’ దానికి దైవప్రవక్తలు ఇలా అన్నారు : ‘‘మీ దుశ్శకునం స్వయంగా మీ వెంటనే ఉంది. మీకు హితబోధ
చేయటం వల్లనేగా మీరు ఇలా మాట్లాడుతున్నారు? అసలు విషయం, మీరు హద్దులను అతిక్ర మించారు.’’
36. యాసీన్ 20 - 25 ఇంతలోనే పట్టణంలోని ఒక మారుమూల ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు : ‘‘నా జాతి ప్రజలారా! దైవప్రవక్త లను అనుసరించండి. మీ నుండి ఏ ప్రతిఫలమూ కోరనివారిని, సత్యమార్గంలో ఉన్న వారిని అనుసరించండి. ఎవరు నన్ను సృష్టించారో, ఎవరి వైపునకు మీరంతా మరలిపోనున్నారో, ఆయనను నేనెందుకు పూజించకూడదు? అయనను కాదని నేను ఇతరులను ఆరాధ్యులుగా చేసుకోవాలా? వాస్తవానికి ఒకవేళ కరుణామయుడైన దేవుడు నాకేదైనా నష్టం కలిగించదలిస్తే నాకు వారి సిఫారసూ ఏ విధంగానూ ఉపయోగపడదు, వారు నన్ను విడిపించనూ లేరు. ఒకవేళ నేను అలాచేస్తే, స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి గురిఅవుతాను. నేను మీ ప్రభువును విశ్వసించాను. కనుక మీరు కూడా నా మాట వినండి.’’
36. యాసీన్ 26 - 27 (చివరకు వారు అతన్ని హత్య చేశారు) ఆ వ్యక్తితో, ‘‘స్వర్గంలో ప్రవేశించు’’ అని అనబడిరది. అతను ఇలా అన్నాడు: ‘‘నా ప్రభువు ఏ విషయాన్నిబట్టి నన్ను క్షమించి, గౌరవనీయులలోకి ప్రవేశింప జేశాడో, నా జాతి వారికి తెలిస్తే ఎంత బాగుండును!’’
36. యాసీన్ 28 - 32 ఆ తరువాత అతని జాతి మీదకు మేము ఆకాశం నుండి ఏ సైన్యాన్నీ దించలేదు. అసలు సైన్యాన్ని పంపే అవసరం మాకు లేదు. కేవలం ఒక ప్రేలుడు మాత్రమే సంభవించింది.
అంతే వారంతా ఒక్కసారిగా ఆరిపోయారు. దాసుల స్థితి కడు శోచనీయం.
వారి వద్దకు ఏ దైవ ప్రవక్త వచ్చినా, వారు అతన్ని ఎగతాళే చేశారు. వారికి పూర్వం మేము ఎన్నో జాతులను నాశనం చేసిన విషయాన్ని వారు చూడలేదా? తరువాత అవి మళ్ళీ ఎన్నడూ వారి వద్దకు తిరిగి రాని విషయాన్ని కూడా వారు గమనించలేదా? వారందరూ ఒక రోజు మా ముందు హాజరు పరచబడవలసి ఉన్నది.
36. యాసీన్ 33 - 36 వారికి మృతభూమి ఒక సూచన. మేము దానికి ప్రాణం పోశాము. దానినుండి మీరు తినే ధాన్యం ఉత్పత్తి చేశాము. మేము దానిలో ఖర్జూరం, ద్రాక్ష తోటలను పెంచాము. దానిలో నుండి ఊటలు చిమ్మేలా చేశాము, వారు దాని ఫలాలను తినాలని. ఇదంతా వారి చేతులు సృష్టించింది కాదు కదా! అలాంటప్పుడు వారు కృతజ్ఞతలు తెలుపరా? అన్ని రకాల జంటలను సృష్టించిన ఆయన పరిశుద్ధుడు. అవి భూమిలో నుండి పుట్టే వృక్షరాసులలోని వైనా సరే లేదా స్వయంగా వారి జాతి (అంటే మానవులు)లో నుండి అయినా సరే లేదా వారు అసలే ఎరుగని వస్తువులలో నుండి అయినాసరే.
36. యాసీన్ 37 - 40 వారికి, రాత్రి మరొక సూచన. మేము దానిపై నుండి పగలును తొలగించినప్పుడు వారిని చీకటి ఆవరిస్తుంది. ఇక సూర్యుడు - అతడు తన నిజస్థానం దిశగా పయనిస్తున్నాడు. ఇది మహా శక్తిమంతుడూ, గొప్ప జ్ఞానీ అయిన దేవుడు నిర్దేశించిన నియమావళి. ఇక చంద్రుడు, అతడి కొరకు మేము దశలను నిర్దేశించాము. వాటిని దాటుకుంటూ వెళ్లి, చివరకు అతడు మళ్లీ ఎండిన ఖర్జూరపు కొమ్మ మాదిరిగా మారిపోతాడు. చంద్రుణ్ణి పట్టుకోవటం సూర్యుడి తరం కాదు. అదేవిధంగా రాత్రి, పగలును దాటి పోజాలదు. అవన్నీ వేర్వేరు కక్ష్యలలో తేలియాడుతూ ఉన్నాయి.
36. యాసీన్ 41 - 44 వారికి ఇది కూడా ఒక సూచనే. మేము వారి సంతతిని నిండు నావలోకి ఎక్కించాము, తరువాత అటువంటి నావలనే వారికొరకు ఎన్నో సృజించాము. వాటిలో వారు ప్రయాణం చేస్తున్నారు. మేము తలచుకుంటే వారిని ముంచివేయగలము. అప్పుడు వారి మొర ఆలకించేవాడెవ్వడూ ఉండడు. ఏ విధంగానూ వారు రక్షింపబడలేరు. కేవలం మా అనుగ్రహమే వారిని గట్టెక్కించి ఒక ప్రత్యేక గడువు వరకు జీవితాన్ని అనుభవించే అవకాశాన్ని కలిగిస్తుంది.
36. యాసీన్ 45 - 47 మీకు ముందు రాబోతున్న పరిణామం నుండి, మీకు పూర్వం జరిగిన పరిణామం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకొనండి. బహుశా మీపై దయచూపటం జరుగుతుంది అని వారితో అన్నపుడు (వారు వినీ విననట్లు వెళ్లిపోతారు). వారి ముందుకు వారి ప్రభువు సూచనలలోని ఏ సూచన వచ్చినా దానిపట్ల వారు ఏమాత్రం శ్రద్ధ వహించరు. ఇంకా, అల్లాహ్, మీకు ప్రసాదించిన ఉపాధినుండి కొంత
అల్లాహ్ మార్గంలో కూడా ఖర్చుపెట్టండి అని వారికి చెప్పినపుడు, తిరస్కరించేవారు విశ్వసించేవారితో, ‘‘అల్లాహ్ తలిస్తే తానే స్వయంగా ఆహారమివ్వగల వారికి మేము ఆహారమివ్వాలా? మీరు పూర్తిగా మార్గం తప్పిపోయారు’’ అని అంటారు.
36. యాసీన్ 48 - 53 వారు ‘‘ప్రళయం గురించిన ఈ బెదిరింపు అసలు ఎప్పుడు నెరవేరుతుంది? నీవు సత్యవంతుడవయితే చెప్పు?’’ అని అడుగుతారు. వాస్తవానికి వారు దేనికొరకు నిరీక్షిస్తున్నారో, అది కేవలం ఒక ప్రేలుడు మాత్రమే. అది వారిని అకస్మాత్తుగా పట్టుకుంటుంది
అప్పుడు వారు (తమ ప్రాపంచిక వ్యవహారాలను గురించి) వివాదపడుతూ ఉంటారు. ఆ సమయంలో వారు మరణ శాసనం సయితమూ వ్రాయలేరు. తమ ఇళ్లకు తిరిగి పోనూ లేరు. ఆ తరువాత ఒక శంఖం ఊదబడుతుంది. అప్పుడు వారు హఠాత్తుగా తమ ప్రభువు ముందు హాజరయ్యేందుకు తమ సమాధుల నుండి బయటికి వస్తారు. భయాందోళనలతో వారు ‘‘అరే, మనల్ని మన పడకల నుండి లేపి ఎవరు నిలబెట్టారు?’’ అని అంటారు. ‘‘ఇది దయామయుడైన దేవుడు వాగ్దానం చేసిన విషయమే. దైవప్రవక్తల మాట పూర్తిగా నిజమే’’ అది భయంకరమైన ఒక ధ్వని మాత్రమే. దానితో అందరూ మా ముందు హాజరు పరచబడతారు.
36. యాసీన్ 54 - 64 ఈనాడు ఎవరికీ రవ్వంత అన్యాయమైనా జరగదు. మీరు చేస్తూ ఉండిన కర్మల ప్రకారమే మీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది - ఈనాడు స్వర్గవాసులు సుఖాలు అనుభవించటంలో నిమగ్నులై ఉంటారు. వారూ, వారి సతీమణులూ చల్లని నీడలలో, మెత్తని పీఠాలపై విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. వారు తినటానికి, త్రాగటానికీ రుచికరమైన సకల పదార్థాలు అక్కడ ఉంటాయి. వారు కోరేదల్లా వారి కొరకు సిద్ధంగా ఉంటుంది. కారుణ్య ప్రభువు తరఫు నుండి వారికి సలామ్ (శాంతి వచనం) చెప్పబడుతుంది - అపరాధులారా! ఈనాడు మీరు వేరు అయిపొండి. ఆదమ్ సంతానమా! నేను మీకు ఉపదేశించలేదా, సైతానుకు దాస్యం చెయ్యవద్దని, వాడు మీకు బహిరంగ శత్రువని, నా దాస్యమే చెయ్యండి అని, ఇదే సరైన మార్గమని? కాని, దీని తరువాత కూడా వాడు మీలోని ఒక పెద్ద వర్గాన్ని అపమార్గం పట్టించాడు. మీకు బుద్ధిలేకుండా పోయిందా? భయపడండి అని మీకు చెబుతూ ఉండిన నరకం ఇదే. ప్రపంచంలో మీరు పాల్పడిన అవిశ్వాసానికి ఫలితంగా ఇపుడు దీనికి ఇంధనం అయిపొండి.
36. యాసీన్ 65 ఈనాడు మేము వారి నోళ్లు మూయిస్తాము. వారు ప్రపంచంలో ఏమేమి సంపాదిస్తూ ఉండేవారో వారి చేతులు మాకు చెబుతాయి, వారి కాళ్లు సాక్ష్యమిస్తాయి.
36. యాసీన్ 66 - 68 మేము తలచుకుంటే, వారి కళ్లను మూసివేయగలం, అప్పుడు వారిని దారివైపునకు పరుగిడి చూడమనండి. వారికి దారి ఎలా కనిపిస్తుంది? మేము తలచుకుంటే వారిని వారి స్థానంలోనే కదలకుండా ఉంచగలం. ఇక వారు ముందుకూ నడవలేరు, వెనుకకూ తిరగలేరు. మేము దీర్ఘాయుష్షునిచ్చే, వ్యక్తి స్వరూపాన్నే మార్చివేస్తాము. (ఈ పరిస్థితులను చూసైనా) వారికి బుద్ధి రాదేమిటి?
36. యాసీన్ 69 - 70 మేము అతనికి (ఈ ప్రవక్తకు) కవిత్వం నేర్పలేదు, కవిత్వం అతనికి శోభించదు కూడా. ఇది ఒక హితబోధ మాత్రమే, స్పష్టంగా పఠనీయమైన గ్రంథం మాత్రమే - అతను
బ్రతికి ఉన్న ప్రతి మనిషినీ హెచ్చరించేందుకూ తిరస్కారులకు వ్యతిరేకంగా అభియోగం స్థాపించ బడేందుకు.
36. యాసీన్ 71 - 76 మా చేతులు రూపకల్పన చేసిన దాని నుండి ప్రజలకై మేము పశువులను సృజించాము, ఇపుడు వారు వాటికి యజమానులయ్యారు. వారు ఈ విషయాన్ని గమనించరా? మేము వాటిని వారికి ఇలా స్వాధీనపరిచాము- వాటిలో కొన్నిటిపై
వారు స్వారి చేస్తారు, కొన్నిటి మాంసాన్ని తింటారు. వాటిలో వారికి రకరకాల ప్రయోజనాలూ పానీయాలూ ఉన్నాయి. అయినా వారు కృతజ్ఞత చూపరేమిటి? ఇవన్నీ వాస్తవాలైనప్పటికీ వారు అల్లాహ్ ను కాదని ఇతరులను దేవుళ్ళుగా చేసుకున్నారు. తమకు సహాయం చేయటం జరుగుతుందని వారు ఆశలు పెట్టుకున్నారు. కాని వారు వారికి ఏ సహాయమూ చేయలేరు. అయినా ప్రజలు వారి కొరకు సైన్యం మాదిరిగా సర్వ సన్నద్ధులై ఉన్నారు. సరే కానీ నీవు మాత్రం వారు కల్పిస్తున్న మాటలకు బాధపడకు. వారి రహస్య విషయాలను బహిరంగ విషయాలనూ అన్నింటినీ మేము ఎరుగుదుము.
36. యాసీన్ 77 - 83 మేము మానవుడిని వీర్య బిందువుతో సృజించిన విషయం అతను చూడటం లేదా? అయినా అతడు బహిరంగ ప్రత్యర్థిగా నిలబడ్డాడు. ఇపుడు అతడు మాకు పోలికలు కల్పిస్తున్నాడు, తన పుట్టుకనే మరిచిపోతున్నాడు. పైగా, శిథిలమై పోయిన ఈ ఎముకలకు తిరిగి ఎవరు జీవం పోస్తారు? అని వాదిస్తున్నాడు. అతడికి ఇలా చెప్పు, ‘‘మొదట వాటిని సృష్టించిన వాడే మళ్లీ వాటికి జీవం పోస్తాడు.’’ సృష్టికి సంబంధించిన ప్రతి విషయమూ ఆయనకు తెలుసు. మీకై ఆయనే
పచ్చని వృక్షాల నుండి అగ్నిని సృష్టించాడు. మీరు దానితో కుంపట్లు రాజేసుకుంటారు. ఆకాశాలనూ భూమినీ సృష్టించగలిగిన వాడు వీరిలాంటి వారిని పుట్టించలేడా? ఎందుకు చేయలేడు, ఆయన మహా నిపుణుడైన సృష్టికర్త అయినప్పుడు? ఆయన ఏదైనా చేయదలచుకున్నప్పుడు, దాన్ని కేవలం ‘‘అయిపో’’ అని మాత్రమే ఆజ్ఞాపిస్తాడు. అంతే అది అయిపోతుంది. ప్రతి విషయానికి సంబంధించిన సర్వాధికారాలు తన చేతిలో ఇముడ్చుకున్న ఆయన ఎంతో పరిశుద్ధుడు. ఆయన సన్నిధికే మీరంతా మరలిపోవలసి ఉంది.
No comments:
Post a Comment