84 సూరహ్ అల్ ఇన్ షిఖాఖ్

 

84 అల్ ఇన్ షిఖాఖ్

ఆయతులు : 25                                                                               అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 15 ఆకాశం బ్రద్దలైపోయినప్పుడు,  అది తన ప్రభువు ఆజ్ఞను శిరసా వహించినప్పుడు, అదే (తన ప్రభువు ఆజ్ఞను శిరసావహించటమే) దాని విధ్యుక్త ధర్మం  భూమి విస్తరింపజేయబడినప్పుడు, అది తన లోపల ఉన్నదంతా బయటికి విసరివేసి ఖాళీ అయినప్పుడు, అది తన ప్రభువు ఆజ్ఞను శిరసా వహించినప్పుడు, అదే (తన ప్రభువు ఆజ్ఞను శిరసావహించటమే) దాని విధ్యుక్త ధర్మం.  మానవుడా! నీవు భారంగా, బలవంతంగా నీ ప్రభువు వైపునకు వెళుతున్నావు, ఆయనను కలుసుకోబోతున్నావు. తరువాత, కర్మల పత్రం కుడిచేతికి ఇవ్వబడిన వ్యక్తినుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది. అప్పుడు అతను తెగ సంతోషపడుతూ తన వారి వైపునకు మరలిపోతాడు. ఇక కర్మల పత్రం వీపు వెనుకనుండి ఇవ్వబడే వ్యక్తి మాత్రం చావును పిలుస్తూ మండుతున్న అగ్నిలోకి పోయి పడతాడు. అతడు తన కుటుంబ సభ్యుల మధ్య సుఖసంతోషాలలో మునిగి ఉండేవాడు. తాను ఎన్నడూ (తన ప్రభువు వైపునకు) మరలిపోనని అతడు భావించేవాడు. మరలిపోవటం ఎందుకు జరగదు, అతని ప్రభువు అతని చర్యలను గమనిస్తూనే ఉండేవాడు.

16 - 25 కనుక, కాదు (మీరనుకునేది నిజం కానేకాదు), సంధ్యారుణిమ సాక్షిగా, రాత్రివేళ సాక్షిగా, అది సమీకరించేవి సాక్షిగా, నిండు చంద్రుడు సాక్షిగా, నేను చెబుతున్నాను, మీరు తప్పనిసరిగా ఒక స్థితినుండి మరొక స్థితికి క్రమేణా తరలిపోవలసి ఉంటుంది. అలాంటప్పుడు వీరికేమయింది విశ్వసించరు? వీరి ముందు ఖురాన్పఠించబడేటప్పుడు సజ్దా (సాష్టాంగ ప్రణామం) ఎందుకు చేయరు? పైగా అవిశ్వాసులు తిరస్కరిస్తున్నారు. కాని వాస్తవానికి  వీరు (తమ కర్మల పత్రాలలో) నమోదు చేసుకుంటున్న వాటిని అల్లాహ్ బాగా ఎరుగు. కాబట్టి వీరికి వ్యధాభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు. అయితే, విశ్వసించి సత్కార్యాలు చేసినవారికి అనంత ప్రతిఫలం ఉంది.

No comments:

Post a Comment