43. అజ్ జుఖ్‌రుఫ్
ఆయతులు
: 89 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
43. అజ్ జుఖ్‌రుఫ్ 1 - 4 హా. మీమ్. స్పష్టమైన ఈ గ్రంథం సాక్షిగా! మీరు అర్థం చేసుకోవాలని మేము దీనిని అరబ్బీ భాషలో ఖురానుగా చేశాము. వాస్తవానికి ఇది మా వద్ద ఉన్న మాతృగ్రంథం (ఉమ్ముల్ కితాబ్)లో లిఖించబడి ఉన్నది
మహో న్నతమైన స్థానం గల వివేకంతో నిండిన గ్రంథం అది.
43. అజ్ జుఖ్‌రుఫ్ 5 - 8 ఇప్పుడు మేము మీతో విసిగిపోయి (కేవలం మీరు హద్దులు మీరి పోయారనే కారణంగా) ఈ హితబోధను మీ వద్దకు పంపటం మానెయ్యాలా? పూర్వం
గతించిన జాతుల వద్దకు కూడ మేము ఎంతోమంది ప్రవక్తలను పంపాము, దైవప్రవక్త ఎవరైనా వారి వద్దకు రావటం, వారు అతనిని ఎగతాళి చేయకుండా ఉండటం అనేది ఎన్నడూ జరగలేదు. కనుక వీరికంటె ఎన్నోరెట్లు ఎక్కువ శక్తిమంతులైన వారిని మేము నాశనం చేశాము. పూర్వపు జాతుల దృష్టాంతాలు కాలగర్భంలో కలిసిపోయాయి.
43. అజ్ జుఖ్‌రుఫ్ 9 - 14 ఒకవేళ నీవు వారిని, ‘‘భూమినీ, ఆకాశాలనూ ఎవడు సృష్టించాడు?’’ అని అడిగితే, స్వయంగా వారే, ‘‘వాటిని ఆ మహాబలవంతుడే, ఆ మహా జ్ఞానియే సృష్టించాడు’’ అని అంటారు. మీ కొరకు ఈ భూమిని ఊయలగా చేసినవాడూ, అందులో
మీకై మార్గాలను ఏర్పరచినవాడూ - మీరు మీ గమ్యస్థానానికి చేరే మార్గం పొందాలని - ఒక ప్రత్యేక పరిమాణంలో ఆకాశం నుండి నీటిని దించి, దాని ద్వారా మృతభూమిని బ్రతికించినవాడు ఆయనే కదా! - ఇదే విధంగా ఒకనాడు మీరు నేలనుండి బయటకు తీయబడతారు-ఈ జంటలనన్నింటినీ పుట్టించిన వాడు ఆయనే కదా!
మీ కొరకు పడవలనూ, పశువులనూ వాహనాలుగా చేసినవాడు ఆయనే కదా! మీరు వాటి వీపులపై ఎక్కటానికి
మీరు వాటిమీద కూర్చున్నప్పుడు మీ ప్రభువు ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకొని ఇలా అనండి,
‘‘వాటిని మాకు వశపరచినవాడు పరిశుద్ధుడు. లేకపోతే, వాటిని వశపరచుకునే శక్తి మాకు లేదు. ఒక రోజున మేము మా ప్రభువు వైపునకు మరలిపోవలసి ఉన్నది.’’
43. అజ్ జుఖ్‌రుఫ్ 15 (ఇదంతా తెలిసీ, ఒప్పుకుని కూడా) వారు ఆయన దాసులలో కొందరిని ఆయనలో భాగంగా చేసేశారు.మానవుడు పరమకృతఘ్నుడు అనేది యథార్థం.
43. అజ్ జుఖ్‌రుఫ్ 16 - 18 అల్లాహ్ తన సృష్టిలో నుండి తన కొరకు కూతుళ్లను ఎన్నుకొని, మీ కొరకు కొడుకులను ప్రసాదించాడా? అసలు పరిస్థితి ఏమిటంటే
వారు కరుణామయుడైన దేవునికి అంటగట్టే సంతానమే వారిలోని ఒకడికి కలిగిందనే వార్త అందజేస్తే, అతడి ముఖం నల్లబడిపోతుంది, అతడు ద్ణుఖంలో మునిగి పోతాడు.
నగల మధ్య పెంచబడే సంతానం, వాదప్రతివాదాలలో తన అభిప్రాయాన్ని పూర్తిగా వివరించలేని సంతానం అల్లాహ్ భాగానికి వచ్చిందా?
43. అజ్ జుఖ్‌రుఫ్ 19 దయామయుడైన దేవుని ప్రత్యేక దాసులైన దైవదూతలను వారు స్త్రీలుగా నిర్ణయించారు. వారి శరీర నిర్మాణాన్ని వారు చూశారా? వారి సాక్ష్యం వ్రాయబడుతుంది
వారు దానికి సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది.
43. అజ్ జుఖ్‌రుఫ్ 20 - 25 ‘‘దయామయుడైన దేవుడు (మేము వారిని ఆరాధించకూడదని) కోరి ఉన్నట్లయితే, మేము వారిని ఎన్నటికీ పూజించి ఉండేవారం కాదు’’ అని వారు అంటారు. వారు ఈ వ్యవహారం యొక్క వాస్తవాన్ని ఏమాత్రం ఎరుగరు, కేవలం ఊహాగానాలు చేస్తున్నారు. మేము దీనికి పూర్వం, వారికి ఏదైనా గ్రంథాన్ని ఇచ్చి ఉన్నామా, దాని ప్రమాణం (ఈ దైవదూతలను పూజిం చటానికిగాను) వారి వద్ద ఉండటానికీ? లేదు, కాని వారు ఏమంటారంటే
‘‘మేము మా తాతముత్తాతలు ఒక మార్గంలో నడుస్తూ ఉండగా చూశాము
మేము వారి అడుగుజాడలలోనే నడుస్తున్నాము.’’ ఇదేవిధంగా నీకు పూర్వం మేము హెచ్చరించేవాణ్ణి ఏ పట్టణానికి పంపినా, అక్కడి సంపన్నులు ఇలానే అన్నారు, ‘‘మేము మా పూర్వీకులు ఒక మార్గంలో నడుస్తూ ఉండగా చూశాము, మేము వారి అడుగు జాడలనే అనుసరిస్తున్నాము.’’ ప్రతి దైవప్రవక్తా వారిని ఇలా అడిగాడు
‘‘మీ పూర్వీకులు నడుస్తూ ఉండగా మీరు చూచిన మార్గం కంటే సరిjైున, ఉత్తమమైన మార్గాన్ని నేను మీకు చూపినప్పటికీ మీరు ఆ పూర్వ మార్గంలోనే నడుస్తారా?’’ వారు దైవప్రవక్తలందరికీ ఇలానే సమాధానం ఇచ్చారు, ‘‘నీవు ఏ ధర్మం వైపునకు పిలవటానికి పంపబడ్డావో, మేము ఆ ధర్మాన్ని తిరస్కరిస్తున్నాము.’’ చివరకు మేము వారికి తగిన శిక్షను విధించాము. చూడండి, సత్యతిరస్కారుల గతి ఏమయిందో!
43. అజ్ జుఖ్‌రుఫ్ 26 - 30 ఇబ్రాహీమ్ తన తండ్రికీ, తన జాతి వారికీ ఇలా చెప్పిన ఆ సమ యాన్ని జ్ఞాపకం తెచ్చుకో, ‘‘మీరు పూజిస్తున్న వాటితో నాకు ఏ సంబంధమూ లేదు. నా సంబంధం కేవలం నన్ను సృష్టించిన వానితోనే ఉన్నది. ఆయనే నాకు మార్గం చూపుతాడు.’’
ఇబ్రాహీమ్ ఈ వచనాన్నే తన తరువాత తన సంతానం కోసం విడిచివెళ్లాడు, వారు దాని వైపునకు మరలేందుకు. (దీని తరువాత కూడ వారు ఇతరులను పూజించటం మొదలుపెట్టినప్పుడు, నేను వారిని రూపుమాపలేదు). కాని నేను వారికీ, వారి పూర్వీకులకూ ప్రాపంచిక జీవిత సంపదను ఇస్తూనే వచ్చాను. చివరకు వారి వద్దకు సత్యం వచ్చింది, స్పష్టంగా వివరించి చెప్పే దైవప్రవక్త కూడ వచ్చేశాడు. కాని ఆ సత్యం వారి వద్దకు వచ్చినప్పుడు, వారు, ‘‘ఇది మంత్రజాలం. మేము దానిని విశ్వసించము, తిరస్కరిస్తున్నాము’’ అని అనేశారు.
43. అజ్ జుఖ్‌రుఫ్ 31 - 35 వారు ఇలా అంటారు: ‘‘ఈ ఖురాను రెండు నగరాలలోని పెద్ద మనుష్యులలో ఏ ఒక్క పెద్ద మనిషిపైనైనా ఎందుకు అవతరించలేదు?’’ నీ ప్రభువు కారుణ్యాన్ని పంచిపెట్టేవారు వారేనా? ఈ ప్రపంచ జీవితంలో వారి బ్రతుకు తెరువు మార్గాలను మేమే వారి మధ్య పంచాము. వారిలో కొందరికి మరి కొందరిపై అంతస్తులవారిగా ఆధిక్యం ఇచ్చాము, వారు ఒకరినొకరు సేవించుకోవటానికి. నీ ప్రభువు కారుణ్యం (అంటే ప్రవక్త పదవి) వారు సమీకరించే సంపదకంటే ఎంతో విలువైనది. మానవులందరూ ఒకే మార్గాన్ని అనుసరిస్తారేమో అనే భయం లేకపోతే మేము కరుణామయుడైన దేవుణ్ణి తిరస్కరించే వారి ఇళ్లకప్పులనూ, వారు తమ మేడలపైకి ఎక్కే మెట్లనూ, వారి తలుపులనూ, వారు దిండ్లపై ఆనుకుని కూర్చునే తఖతులనూ, అన్నింటినీ వెండితో, బంగారంతో చేయించి ఉండే వారమే. ఇవి కేవలం ఐహిక జీవిత సంపదలు మాత్రమే. నీ ప్రభువు దగ్గర గల పరలోకం
కేవలం దేవుని పట్ల భయభక్తులు గల వారికే లభిస్తుంది.
43. అజ్ జుఖ్‌రుఫ్ 36 - 39 కరుణామయుని స్మరణను నిర్లక్ష్యం చేసే వ్యక్తిపై మేము ఒక షైతానును నియమిస్తాము, వాడు అతని సహచరుడవుతాడు. ఈ షైతానులు అలాంటి వారిని ఋజుమార్గంపైకి రాకుండా ఆపుతారు. వారు, ‘‘మేము సక్రమమైన మార్గంలోనే పయనిస్తున్నాము’’ అని అనుకుంటారు. చివరకు ఆ వ్యక్తి మా వద్దకు వచ్చినప్పుడు, తన వెంట ఉన్న షైతానుతో ఇలా అంటాడు, ‘‘నీకూ, నాకూ మధ్య తూర్పు పడమరల మధ్య ఉన్నంత దూరం ఉండి ఉంటే ఎంత బాగుండేది! నీవు అతి చెడ్డ స్నేహితుడవని నిరూపించుకున్నావు.’’ అప్పుడు వారితో ఇలా అనటం జరుగుతుంది: మీరు దుర్మార్గం చేశారు
కనుక ఈనాడు మీరూ, మీ షైతానులూ శిక్షను సమిష్టిగా పంచుకుంటారు అనే విషయం మీకు ఏమాత్రం లాభం కలిగించదు.
43. అజ్ జుఖ్‌రుఫ్ 40 - 45 ప్రవక్తా! నీవు చెవిటి వారికి వినిపించగలవా?అంధులకూ, స్పష్టంగా మార్గం తప్పినవారికీ మార్గం చూపగలవా? ఇప్పుడు మేము వారిని శిక్షించ వలసియే ఉన్నది
మేము నిన్ను ప్రపంచం నుండి తీసుకుపోయినా లేదా మేము వారికి వాగ్దానం చేసిన ముగింపును నీకు చూపినా, వారిపై మాకు పూర్తి అధికారం ఉన్నది. కనుక నీవు
వహీ ద్వారా నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని గట్టిగా పట్టుకో. నిశ్చయంగా నీవు ఋజుమార్గంలో ఉన్నావు. వాస్తవం ఏమిటంటే, ఈ గ్రంథం నీకూ, నీ జాతి వారికీ ఒక పెద్ద గౌరవం. త్వరలోనే మీరు దీనిని గురించి జవాబు చెప్పుకోవలసి ఉన్నది. నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలను అడిగిచూడు, మేము కరుణామయుడైన దేవుణ్ణి తప్ప ఇతర దైవాలను కూడా ఆరాధనకు నిర్ణయించామా అని.
43. అజ్ జుఖ్‌రుఫ్ 46 - 53 మేము మూసాను మా సూచనలతో ఫిరౌన్ వద్దకూ, అతని ప్రభు త్వాధికారుల వద్దకూ పంపాము.
అతను అక్కడకు పోయి, ‘‘నేను సకల లోకాల ప్రభువు యొక్క ప్రవక్తను,’’ అని అన్నాడు.
తరువాత అతను మా సూచనలను వారి ముందు పెట్టినప్పుడు, వారు ఎగతాళి చేస్తూ నవ్వసాగారు. మేము వారికి ఎన్నో సూచనలను ఒక దానిని మించిన మరొక దానిని వరు సగా చూపిస్తూపోయాము.
వారు తమ వైఖరిని మార్చుకోవాలని మేము వారిని శిక్షకు గురిచేశాము. శిక్షకు గురిఅయినప్పుడల్లా వారు, ‘‘మాంత్రికుడా! నీ ప్రభువు తరఫు నుండి నీకు లభించిన పదవి ఆధారంగా మా కొరకు ఆయనను ప్రార్థించు, మేము తప్పకుండా సన్మార్గం వైపునకు వస్తాము’’ అని అనేవారు. కాని మేము వారి మీద నుండి శిక్షను తొలగించినంతనే, వారు ఆడిన మాటను తప్పుతారు. ఒకరోజు ఫిరౌన్ తన జాతివారి మధ్యకు పోయి ఇలా ప్రకటించాడు, ‘‘ప్రజలారా! ఈజిప్టు సామ్రాజ్యం నాదికాదా, ఈ కాలువలు నా క్రింద ప్రవహించటం లేదా? మీకు కనిపించటం లేదా, శ్రేష్ఠుణ్ణి నేనా లేక నీచుడూ, అల్పుడూ, తన మాటను సైతం స్పష్టంగా వివరించలేని ఇతడా? ఇతనిపై బంగారు కంకణాలు ఎందుకు దించబడలేదు? దైవదూతల బృందం పరిచారకులుగా ఇతని వెంట ఎందుకు రాలేదు?’’
43. అజ్ జుఖ్‌రుఫ్ 54 - 56 అతడు తన జాతి వారిని తేలికగా చూశాడు. వారూ అతడు చెప్పి నట్లే విన్నారు. వాస్తవానికి వారు పాపాత్ములు. చివరకు వారు మాకు ఆగ్రహం కలిగించినప్పుడు, మేము వారికి ప్రతీకారం చేశాము. వారందరినీ కలిపి ముంచివేశాము, వారిని ముందు తరాల వారికి పూర్వికులుగా గుణపాఠం గరిపే ఒక నిదర్శనంగా చేశాము.
43. అజ్ జుఖ్‌రుఫ్ 57 - 65 మర్యమ్ కుమారుణ్ణి ఒక ఉదాహరణగా పేర్కొనగానే, నీజాతి ప్రజలు దానిని గురించి పెద్ద గొడవ చేస్తూ, మా దేవుళ్లు మంచివారా లేక అతడా? అని అనసాగారు. ఈ అభ్యంతరాన్ని వారు కేవలం పిడివాదం కోసమే నీ ముందుకు తీసుకువచ్చారు. వాస్తవం ఏమిటంటే, వారు స్వతహాగా కలహప్రియులు.
మర్యమ్ కుమారుడు ఒక దాసుడు తప్ప మరేమీ కాడు. మేము అతనిని అనుగ్రహించాము, ఇస్రాయీల్ సంతతి వారికి అతనిని మా శక్తికి నిదర్శనంగా చేశాము. మేము కోరితే మీ తరువాత భూమిపై మీ స్థానాన్ని ఆక్రమించగల దైవదూతలను మీనుండి పుట్టించగలము. నిజానికి అతను (అంటే మర్యమ్ కుమారుడు) ప్రళయానికి సూచన. కనుక మీరు దానిని శంకించకండి, నా మాట నమ్మండి. ఇదే సరిjైున మార్గం.
షైతాన్ మిమ్మల్ని దాని వైపునకు పోకుండా ఆపకూడదు. అతడు మీకు బహిరంగ శత్రువు. స్పష్టమైన సూచనలను తీసుకువచ్చిన ఈసా ఇలా అన్నాడు, ‘‘నేను మీవద్దకు వివేకం తీసుకుని వచ్చాను, మీరు విభేదాలకు లోనైన కొన్ని విషయాల వాస్తవాన్ని మీకు స్పష్టంగా వివరించటానికి వచ్చాను. కనుక మీరు అల్లాహ్ కు భయపడండి, నన్ను అనుసరించండి. యదార్థం ఏమిటంటే, అల్లాహ్ యే మీ ప్రభువూ, నా ప్రభువూనూ, ఆయననే మీరు ఆరాధించండి. ఇదే సరిjైున మార్గం. కాని (అతను చేసిన స్పష్టమైన ఈ బోధ తరువాత కూడా) వర్గాలు విభేదాలకే లోనయ్యాయి, కనుక దుర్మార్గానికి ఒడిగట్టినవారు వ్యధాభరితమైన ఒక దినాన పడే శిక్ష వల్ల సర్వనాశనం అవుతారు.
43. అజ్ జుఖ్‌రుఫ్ 66 - 78 ఇప్పుడు వారు కేవలం తమకు తెలియకుండానే తమపైకి అకస్మాత్తుగా ప్రళయం వచ్చి పడాలని నిరీక్షిస్తున్నారా? ఆ దినం వచ్చినప్పుడు- స్నేహితులందరూ భయభక్తులు కలవారు తప్ప ఒకరికొకరు శత్రువులైపోతారు. ఆ రోజున మా వాక్యాలను విశ్వసించి, మా ఆజ్ఞలకు బద్ధులై జీవితం గడిపిన వారితో ఇలా అనబడుతుంది: ‘‘నా దాసులారా! ఈనాడు మీకు ఏ భయమూ లేదు, మీకు ఏ ద్ణుఖమూ కలుగదు. మీరూ, మీ భార్యలూ స్వర్గంలో ప్రవేశిం చండి, మిమ్మల్ని ఆనందింపచేయటం జరుగుతుంది.’’ వారి మధ్య బంగారు పళ్లాలూ, గిన్నెలూ త్రిప్పబడతాయి. మనస్సు ఇష్టపడే, కళ్లకు ఇంపుగా ఉండే ప్రతి వస్తువూ అక్కడ ఉంటుంది. వారితో ఇలా అనబడుతుంది : ‘‘ఇక మీరు ఇక్కడ శాశ్వతంగా ఉంటారు. మీరు ప్రపంచంలో చేసిన కర్మలు కారణంగా మీరు ఈ స్వర్గానికి వారసులయ్యారు. మీకు ఇక్కడ పండ్లూ ఫలాలూ పుష్క లంగా లభిస్తాయి, వాటిని మీరు తింటారు.’’ ఇక అపరాధులు
వారు నరక శిక్షను శాశ్వతంగా అనుభవిస్తూ ఉంటారు. వారి శిక్ష తగ్గటం అనేది ఎన్నటికీ జరగదు
వారు అందులో హతాశులైపడి ఉంటారు. మేము వారికి అన్యాయం చేయలేదు
వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. వారు, ‘‘ఓ మాలిక్! నీ ప్రభువు మమ్మల్ని
అంతం చేస్తే బాగుంటుంది’’ అని వేడుకుంటారు. దానికి అతడు, ‘‘మీరు ఇలాగే పడి ఉంటారు. మేము మీ దగ్గరకు సత్యాన్ని తీసుకుని వచ్చాము. కాని మీలో చాలామందికి సత్యం అంటేనే గిట్టేది కాదు’’ అని సమాధానం చెబుతాడు.
43. అజ్ జుఖ్‌రుఫ్ 79 - 80 వారు ఏదైనా చర్యను తీసుకోవటానికి నిర్ణయించుకున్నారా? అలా అయితే మేము కూడా ఒక నిర్ణయం తీసుకుంటాము. మేము వారి రహస్య విషయాలనూ, వారి గుసగుసలనూ వినటం లేదని వారు అనుకుంటున్నారా? మేము అన్నీ వింటూనే ఉన్నాము. అంతేకాదు మా దూతలు వారి వద్దనే ఉండి వ్రాస్తున్నారు.
43. అజ్ జుఖ్‌రుఫ్ 81 - 83 వారితో ఇలా అను, ‘‘ఒకవేళ నిజంగానే కరుణామయునికి సంతానం ఉంటే, అందరికంటే ముందు నేనే వారిని ఆరాధించి ఉండేవాణ్ణి.’’ భూమ్యాకాశాల పాలకుడూ, సింహాసన ప్రభువూ అయిన ఆయన, వారు ఆపాదించే సకల విషయాలకు అతీతుడు, పరిశుద్ధుడునూ. సరే, మంచిది, వారిని తమ అసత్యపు ఆలోచనలలో మునిగి ఉండనీ, తమ ఆటలలో నిమగ్నులై ఉండనీ. చివరకు వారు, తమను ఏ దినం గురించి భయపెట్టటం జరుగుతుందో, ఆ దినాన్ని చూస్తారు.
43. అజ్ జుఖ్‌రుఫ్ 84 - 85 ఆకాశంలోనూ, భూమిలోనూ దేవుడు ఆయన ఒక్కడే. ఆయనే వివేకవంతుడు, జ్ఞానసంప న్నుడు
భూమ్యాకాశాల మీదా, వాటి మధ్య ఉన్న ప్రతివస్తువు మీదా అధికారం గల ఆయన ఎంతో ఉన్నతుడు. ప్రళయ గడియను గురించి తెలిసినవాడు కూడ ఆయనే. ఆయన వైపునకే మీరంతా మరలింపబడనున్నారు.
43. అజ్ జుఖ్‌రుఫ్ 86 ఆయనను త్రోసిరాజని వారు వేడుకునే దేవుళ్లకు సిఫారసు చేసే అధికారం ఏమాత్రమూ లేదు, ఎవరైనా జ్ఞానం ఆధారంగా ఇది సత్యమని, సాక్ష్యం పలికితే తప్ప.
43. అజ్ జుఖ్‌రుఫ్ 87 - 88 నీవు, ‘‘మిమ్మల్ని ఎవరు పుట్టించారు’’ అని వారిని అడిగితే, స్వయంగా వారే ‘అల్లాహ్’ అని అంటారు. అయితే వారు ఎలా మోసపోతు న్నారు? ప్రవక్త యొక్క ఈ సూక్తి సాక్షిగా! ‘‘ప్రభూ! ఈ ప్రజలు విశ్వసించేవారు కారు.’’
43. అజ్ జుఖ్‌రుఫ్ 89 మంచిది, ప్రవక్తా! వారిని మన్నించు. ‘మీకు సలామ్’ అని వారితో అను. త్వరలోనే వారికి తెలిసిపోతుందిలే.
No comments:
Post a Comment