16.
అన్
నహ్ల్
ఆయతులు
: 128 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
16.
అన్
నహ్ల్ 1 - 3 అల్లాహ్ తీర్పు వచ్చేసింది. ఇక దానికొరకు తొందరపెట్టకండి. ఆయన పరిశుద్ధుడు. వారు చేస్తూవున్న షిర్కుకు అతీతుడు, ఉన్నతుడు. ఆయన ఈ ఆత్మను తనకు నచ్చిన తన దాసునిపై తన ఆజ్ఞతో దైవదూతల ద్వారా అవతరింపజేస్తాడు. (ఈ ఉపదేశంతో ప్రజలను) హెచ్చరించండి:
‘‘నేను తప్ప మీకు మరొక దేవుడు ఎవ్వడూ లేడు. కనుక మీరు నాకే భయపడండి.’’ ఆయన ఆకాశాన్నీ భూమినీ సత్యం పునాదిగా సృష్టించాడు. ఈ ప్రజలు చేసే షిర్కుకు ఆయన అతీతుడు, ఉన్నతుడు.
16.
అన్
నహ్ల్ 4 - 9 ఆయన మానవుణ్ణి స్వల్పమైన బిందువుతో సృష్టించాడు. చూస్తూ చూస్తూ ఉండగానే అతడు
ఒక బహిరంగ వివాదిగా మారిపోయాడు. ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీకొరకు దుస్తులూ ఉన్నాయి, ఆహారమూ ఉన్నది. ఇంకా రకరకాల ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఉదయంపూట
మీరు వాటిని మేపటానికి తోలుకుని వెళ్ళేటప్పుడూ, సాయంత్రం పూట వాటిని తిరిగి తోలుకొని వచ్చేటప్పుడూ అవి మీకు రమణీయంగా కనిపిస్తాయి.
ఎంతో కష్టంతో తప్ప మీరు చేరలేని ప్రదేశాలకు సయితం అవి మీకొరకు బరువును మోసుకునిపోతాయి. యథార్థ మేమిటంటే, మీ ప్రభువు ఎంతో వాత్సల్యం కలవాడు, ఎంతో కనికరించేవాడు. ఆయన గుర్రాలనూ,
కంచర గాడిదలనూ,
గాడిదలనూ సృష్టించాడు. మీరు వాటిపై స్వారీ చెయ్యటానికి, అవి మీ జీవితాలకు శోభను చేకూర్చటానికి. ఆయన ఇంకా చాలా వస్తువులను (మీ ప్రయోజనం కొరకు) సృష్టిస్తాడు. వాటిని గురించి మీకసలు తెలియనే తెలియదు. వక్రములైన మార్గాలు కూడా ఉన్నప్పుడు, సక్రమమైన మార్గం చూపటం అల్లాహ్ బాధ్యతే. ఆయన తలచుకుని ఉంటే మీ అందరికీ సన్మార్గం చూపి ఉండేవాడే.
16.
అన్
నహ్ల్ 10 - 11 ఆకాశం నుండి మీకోసం నీళ్ళను కురిపించేవాడు ఆయనే. ఆ నీటిని మీరూ తనివితీరా త్రాగుతారు, ఆ నీటివల్ల మీ పశువులకు కూడా మేత మొలుస్తుంది. ఆయన ఆ నీటిద్వారా పొలాలను పండిస్తాడు. జైతూను, ఖర్జూరం, ద్రాక్ష ఇంకా రకరకాల ఇతర పండ్లను పండిస్తాడు. ఆలోచించే వారికి ఇందులో ఒక గొప్ప నిదర్శనం ఉంది.
16.
అన్
నహ్ల్ 12 - 13 ఆయన మీ మేలు కోసం రాత్రినీ, పగలునూ సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ మీకు వశపరిచాడు.
నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞ వల్లనే మీకు వశమై ఉన్నాయి. బుద్ధిని ఉపయోగించేవారికి ఇందులో చాలా సూచనలు ఉన్నాయి. ఆయన మీకోసం భూమిలో సృష్టించిన అనేక రంగు రంగుల వస్తువులలో కూడా గుణపాఠం నేర్చుకునేవారికి నిశ్చయంగా సూచన ఉంది.
16.
అన్
నహ్ల్ 14 సముద్రాన్ని మీ సేవకోసం నియోగించినవాడు ఆయనే, దానినుండి మీరు తాజా మాంసాన్ని తీసుకుని తినేటందుకు, మీరు ధరించే ఆభరణాలను దానినుండి వెలికి తీసుకునేటందుకు. సముద్రం రొమ్మును చీలుస్తూ ఓడ పయనించటాన్ని మీరు చూస్తారు. ఇదంతా ఎందుకంటే, మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించాలనీ, ఆయనకు కృతజ్ఞులు కావాలనీ.
16.
అన్
నహ్ల్ 15 - 16 ఆయన భూమిలో పర్వతాలను మేకులుగా పాతాడు, భూమి మిమ్మల్ని తీసుకొని దొర్లిపోకుండా ఉండాలని. ఆయన నదులను ప్రవహింప జేశాడు. సహజ మార్గాలను నిర్మించాడు,
మీరు సరైన మార్గం పొందటానికి. ఆయన భూమిలో మార్గం చూపే సంకేతాలను పెట్టాడు. నక్షత్రాల ద్వారా కూడా ప్రజలు మార్గం తెలుసుకుంటారు.
16.
అన్
నహ్ల్ 17 - 19 సృష్టించేవాడూ, అసలు ఏమీ సృష్టించనివాడూ ఉభయులూ సమానులేనా? మీరు ఈ మాత్రం అర్థం చేసుకోలేరా? ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలిస్తే, లెక్కించలేరు. యథార్థమేమిటంటే ఆయన ఎంతో మన్నించేవాడూ, కరుణామయుడూను. ఆయన మీ బాహ్యాన్నీ ఎరుగును, మీ గోప్యాన్నీ ఎరుగును.
16.
అన్
నహ్ల్ 20 - 21 అల్లాహ్ ను వదలి, ప్రజలు వేడుకుంటున్న ఇతర శక్తులు ఏ వస్తువుకూ సృష్టికర్తలు కారు. వారు స్వయంగా సృష్టింపబడినవారు, నిర్జీవులే కాని సజీవులు కారు. వారు ఎప్పుడు (మళ్ళీ బ్రతికించబడి) లేపబడనున్నారో వారికెంత మాత్రం తెలియదు.
16.
అన్
నహ్ల్ 22 - 23 మీ దేవుడు కేవలం ఒక్కడే. కాని పరలోకాన్ని నమ్మని వారి హృద యాలలో తిరస్కారం తిష్ఠవేసుకొని ఉంది. వారు విర్రవీగుతున్నారు. అల్లాహ్ కు నిశ్చయంగా వారి చేష్టలన్నీ తెలుసు - దాగివున్నవి కూడా, బహిరంగముగా ఉన్నవి కూడా. అహంభావానికి గురైన వారిని ఆయన ఏమాత్రం ప్రేమించడు.
16.
అన్
నహ్ల్ 24 - 29 ఎవరైనా వారిని,
‘‘మీ ప్రభువు అవతరింపజేసినటువంటిది ఏమిటి?’’ అని అడిగితే ఇలా అంటారు: ‘‘అవండీ, అవి పాతకాలపు కట్టు కథలు.’’ ఈ మాటలను అని
వారు ప్రళయంనాడు తమ బరువును పూర్తిగా మోస్తారు.
దానికితోడు వారు అజ్ఞానం వల్ల అపమార్గం పట్టిస్తున్న వారి బరువును కూడా కొంత మోస్తారు. చూడండి! ఎంత కఠినమైన బాధ్యతను వారు తమ నెత్తిపై వేసుకుంటున్నారో! వారికి పూర్వం కూడా చాలామంది (సత్యాన్ని అణచటానికి) ఇటువంటి దుష్టపన్నాగాలనే పన్నారు. చూడండి, అప్పుడు అల్లాహ్ వారి పన్నాగపు కట్టడాన్ని పునాదులతో సహా పెకలించి పారవేశాడు. పైనుండి దాని కప్పు వారి తలలపై పడిరది. శిక్ష వస్తుందని వారికి అనుమానం కూడా లేనటువంటి దిక్కునుండి అది వారిపైకి వచ్చి పడిరది. తరువాత ప్రళయం నాడు అల్లాహ్ వారిని అవమానపరుస్తాడు, హీనపరుస్తాడు. వారితో ఇలా అంటాడు: మీరు (సత్యవాదులతో) నా భాగస్వాముల తరఫున పోట్లాడుతూ ఉండేవారు కదా! ఇప్పుడు ఆ నా భాగ స్వాములు ఎక్కడ ఉన్నారో చెప్పండి - ప్రపంచంలో జ్ఞానం లభించినవారు ‘‘అవిశ్వాసులకు ఈ రోజు (లభించేది) అవమానమూ, దౌర్భాగ్యమూను’’ అని అంటారు. అవును, తమ ఆత్మలకు అన్యాయం చేసుకుంటూ ఉన్నప్పుడు దైవదూతలు ప్రాణాలు తీసే అవిశ్వాసులకు. అప్పుడు వారు (తలబిరుసుతనాన్ని విడిచిపెట్టి) వెంటనే పూర్తిగా లొంగిపోయి, ‘‘మేము ఏ తప్పూ చేసి ఉండలేదు’’ అని అంటారు. దానికి దైవదూతలు ఇలా అంటారు: ‘‘ఎందుకు చేసి ఉండలేదు! అల్లాహ్ మీ చేష్టలను బాగా ఎరుగును. ఇక పొండి. నరక ద్వారాలలో దూరి పొండి. అక్కడనే మీరు శాశ్వతంగా ఉంటారు.’’ కనుక యథార్థం ఏమిటంటే, గర్విష్ఠులకు లభించే నివాసం చాలా చెడ్డది.
16.
అన్
నహ్ల్ 30 - 32 మరోవైపు దైవభీతి కలవారిని, మీ ప్రభువు తరఫు నుండి అవతరించినటువంటిది ఏమిటి? అని అడిగినప్పుడు, వారు ‘‘అత్యుత్తమమైనది అవతరించినది’’ అని సమాధానం చెబుతారు. ఇటువంటి సజ్జనులకు ఈ ప్రపంచంలోనూ మేలు జరుగుతుంది. ఇక
పరలోక గృహం కూడా తప్పని సరిగా వారికి
ఎంతో మేలైనదిగా ఉంటుంది. భయభక్తులు కలవారి ఇల్లు ఎంతో మంచి ఇల్లు, శాశ్వత నివాసంగా ఉండే ఉద్యానవనాలు - వాటిలో వారు ప్రవేశిస్తారు. క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ అంతా వారి అభిమతానికి అనుగుణంగానే జరుగుతుంది. భయభక్తులు కలవారికి అల్లాహ్ ఇటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు. వారు పరిశుద్ధావస్థలో ఉన్నప్పుడు దైవదూతలు వారి ప్రాణాలు తీస్తూ ‘‘మీకు శాంతి కలుగుగాక! మీ కర్మలకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి’’ అని అంటారు.
16.
అన్
నహ్ల్ 33 - 34 ప్రవక్తా! వారు ఇంకా నిరీక్షిస్తున్నారా, వారికి ఇంకా మిగిలింది ఏమిటి, దైవదూతలు వచ్చెయ్యటమో లేదా నీ ప్రభువు తీర్పు జారీ కావటమో తప్ప? వారికి పూర్వం చాలామంది ఇలానే మొండిగా ప్రవర్తించారు. తరువాత వారి విషయంలో జరిగింది అల్లాహ్ చేసిన అన్యాయం కాదు. ఆ అన్యాయం వారిదే,
దానిని వారు తమకు తామే చేసుకున్నారు. వారు చేసిన పనుల దుష్ఫలితాలు చివరకు వారినే పట్టుకున్నాయి. వారు ఎగతాళి చేస్తూ ఉండినదే వారిని చుట్టుముట్టింది.
16.
అన్
నహ్ల్ 35 - 37 ఈ ముష్రిక్కులు ఇలా అంటారు:
‘‘అల్లాహ్ కోరి ఉన్నట్లయితే మేముగానీ మా తాత ముత్తాతలుగానీ ఆయనను తప్ప మరెవ్వరినీ ఆరాధించి ఉండేవారము కాదు. ఆయన ఆజ్ఞ లేకుండా ఏ వస్తువునూ నిషేధించి ఉండేవారము కూడా కాదు.’’
ఇటువంటి సాకులనే వారికి పూర్వం వారు కూడా చెప్పేవారు.
అయితే విషయాన్ని స్పష్టంగా అందజేసే బాధ్యత తప్ప మరొక బాధ్యత కూడా ప్రవక్తలపై ఏదైనా ఉందా? మేము ప్రతి జాతిలోనూ ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా అందరికీ ఇలా హెచ్చరిక చేశాము: ‘‘అల్లాహ్ ను ఆరాధించండి. మిథ్యాదైవాల ఆరాధనకు దూరంగా ఉండండి.’’ దాని
తరువాత అల్లాహ్ వారిలో కొందరికి సన్మార్గాన్ని ప్రసాదిం చాడు. మరికొందరిని అపమార్గం లోగొన్నది.
కొంచెం భువిలో సంచారం చేసి చూడండి, తిరస్కారులకు ఏ గతి పట్టిందో - ప్రవక్తా! వారికి సన్మార్గం లభించాలని నీవు ఎంతగా కోరుకున్నా అల్లాహ్ తాను అపమార్గం పట్టించే వాడికి మళ్ళీ సన్మార్గం చూపడు. అటువంటి వారికి ఎవరూ సహాయం చేయలేరు.
16.
అన్
నహ్ల్ 38 - 40 వీరు అల్లాహ్ పేరుతో దృఢమైన ప్రమాణాలు చేసి ఇలా చెబుతారు:
‘‘చనిపోయినవాణ్ణి ఎవణ్ణీ అల్లాహ్ మళ్ళీ బ్రతికించి లేపడు.’’- ఎందుకు లేపడు? ఇది ఆయన చేసిన ఒక వాగ్దానం. దానిని నెరవేర్చటాన్ని ఆయన తన విధిగా చేసుకున్నాడు.
కాని చాలామందికి ఆ విషయం తెలియదు. అలా తప్పకుండా జరగాలి
ఎందుకంటే వారి ముందు అల్లాహ్ వారు విభేదిస్తూ ఉన్నటువంటి యథార్థాన్ని బహిర్గతం చెయ్యటానికి, సత్కతిరస్కారులు తాము అబద్ధీకులమని తెలుసుకోవటానికి. (ఇక అది సంభవించే విషయాన్ని గురించి) ఒక వస్తువును ఉనికి లోనికి తీసుకురావటానికి, దానిని ‘అయిపో’ అని ఆజ్ఞాపిస్తే చాలు, వెంటనే అది అయిపోతుంది. అంతకంటే ఎక్కువ చేయవలసిన అవసరం మాకు లేదు.
16.
అన్
నహ్ల్ 41 - 42 దౌర్జన్యాన్ని అనుభవించిన తరువాత అల్లాహ్ కోసం వలసపోయిన వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి నివాసాన్ని ఇస్తాము. పరలోక ప్రతిఫలమైతే ఇంతకంటే గొప్పగా ఉంటుంది, సహనం చూపినటువంటి, తమ ప్రభువుపై నమ్మకంతో పనిచేస్తున్నటువంటి బాధితులు (ఎంతో చక్కని ముగింపు తమ కొరకు వేచి చూస్తోందని) తెలుసుకుంటే ఎంత బాగుండును!
16.
అన్
నహ్ల్ 43 - 44 ప్రవక్తా! మేము నీకు పూర్వం కూడా ప్రవక్తలను పంపినపుడల్లా మానవులనే ప్రవక్తలుగా పంపాము. వారివైపునకు మేము మా సందేశాలను వహీ ద్వారా పంపుతూ ఉండేవారము. మీకు (మక్కావాసులు) తెలియకపోతే జ్ఞాపిక కలవారిని అడగండి. పూర్వపు ప్రవక్తలను కూడా మేము స్పష్టమైన నిదర్శనాలతోనూ, గ్రంథాలతోనూ పంపివున్నాము.
ఇప్పుడు ఈ జ్ఞాపికను నీ (ప్రవక్త)పై అవతరింప జేశాము, నీవు ప్రజల ముందు వారికోసం
అవత రింపజేయబడిన ఉపదేశాన్ని స్పష్టంగా వివరించటానికీ, (స్వయంగా) ప్రజలు కూడా ఆలోచించటానికి.
16.
అన్
నహ్ల్ 45 - 47 (ప్రవక్త సందేశానికి వ్యతిరేకంగా) అత్యంత దుష్ట పన్నాగాలను పన్నుతున్న వారిని అల్లాహ్ భూమిలో దిగబడిపోయేలా చేస్తాడనీ లేదా వారికి అనుమానం కూడా కలుగని దిక్కునుండి వారిపైకి శిక్షను తీసుకువస్తాడనీ, లేదా వారు తిరుగాడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా పట్టుకుంటాడనీ, లేదా రాబోయే ఆపదను గురించి భయపడి దానినుండి తప్పించుకోవటానికి వారు జాగ్రత్త పడుతున్న స్థితిలో వారిని పట్టుకుంటాడనీ వారికి ఏమాత్రం భయం లేకుండా పోయిందా? ఆయన
ఏమి చేయదలచుకున్నా, వారు మాత్రం ఆయనను అశక్తుడుగా చేయలేరు. వాస్తవం ఏమిటంటే, నీ ప్రభువు మృదు హృదయుడూ, కరుణామయుడూను.
16.
అన్
నహ్ల్ 48 - 50 వారు అల్లాహ్చే సృష్టింపబడిన ఏ వస్తువునూ గమనించరా, అది అల్లాహ్ సాన్నిధ్యంలో సాష్టాంగపడుతూ తన నీడను కుడి వైపునకూ ఎడమ వైపునకూ
ఎలా తిప్పుతూ ఉంటుందో? ఈ విధంగా అన్నీ వినమ్రతను ప్రదర్శిస్తున్నాయి. భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న సమస్త జీవరాసులూ, సర్వ దైవదూతలూ అల్లాహ్ ముందు సాష్టాంగపడుతున్నారు. వారు ఎంతమాత్రం తలబిరుసుతనంతో ప్రవర్తించరు. తమపైన ఉన్న ప్రభువునకు భయపడతారు. తమకు ఇవ్వబడిన ఆదేశం ప్రకారమే పనిచేస్తారు.
16.
అన్
నహ్ల్ 51 - 52 అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు: ‘‘ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోకండి. దేవుడు మటుకు ఒక్కడే. కనుక మీరు నాకే భయపడండి. ఆకాశాలలో ఉన్నదంతా, భూమిలో ఉన్నదంతా ఆయనదే. కేవలం ఆయన ధర్మం మాత్రమే (సృష్టిలో అంతటా) అనుసరింపబడుతోంది. అలాంటప్పుడు, మీరు అల్లాహ్ ను కాదని మరొకరికి భయపడతారా?
16.
అన్
నహ్ల్ 53 - 55 మీకు లభించిన అనుగ్రహం ఏదైనా అది అల్లాహ్ తరఫు నుండే లభించినది. మీకేదైనా గడ్డుకాలం దాపురించినప్పుడు మీరు మీ మొరలతో ఆయన వైపునకే పరుగెడతారు. కాని
అల్లాహ్ ఆ గడ్డుకాలాన్ని తొలగించి నప్పుడు (ఈ కనికరానికి కృతజ్ఞతగా)
మీలో ఒక వర్గం ఒక్కసారిగా తన ప్రభువునకు ఇతరులను భాగస్వాములుగా చెయ్యటం ప్రారంభిస్తుంది, అల్లాహ్ చేసిన ఉపకారానికి కృతఘ్నతగా. సరే, మంచిది, సుఖాలను అనుభవించండి. త్వరలోనే మీకు తెలిసిపోతుంది.
16.
అన్
నహ్ల్ 56 ఎవరిని గురించి వీరు ఏమాత్రమూ ఎరుగరో వారికి, మేము ఇచ్చిన ఉపాధిలో భాగాలను నిర్ణయిస్తారు. దేవుని తోడు, ఈ అబద్ధాన్ని
మీరు ఎలా కల్పించారు? అని మిమ్మల్ని తప్పనిసరిగా అడగటం జరుగుతుంది.
16.
అన్
నహ్ల్ 57 - 60 వారు దేవునికి కూతుళ్ళను కల్పిస్తారు. అల్లాహ్ పరిశుద్ధుడు. తమ కోసమేమో వారు స్వయంగా కోరుకున్నదా? వారిలో ఎవడికైనా కూతురు పుట్టినదనే శుభవార్తను అందజేస్తే అతడి ముఖాన్ని నల్లని ఛాయలు ఆవరి స్తాయి. అతడు లోలోన కుమిలిపోతాడు. ఈ దుర్వార్త విన్న తరువాత ఇక లోకులకు ఎలా ముఖం చూపాలి అని అతడు నక్కి నక్కి తిరుగుతూ ఉంటాడు. అవమానాన్ని భరిస్తూ కూతుర్ని ఇంట్లో ఉంచుకోవాలా లేక ఆమెను మట్టిలో పాతిపెట్టాలా? అని ఆలోచిస్తాడు - చూడు! వారు దేవుని విషయంలో చేసే నిర్ణయాలు ఎంత దుష్టమైనవో! పరలోకాన్ని విశ్వసించనివారే, చెడుగుణాలు ఆరోపింపదగినవారు. ఇక అల్లాహ్ -
ఆయనకు అందరికంటే ఉన్నతమైన గుణాలు ఉన్నాయి. ఆయనే అందరిపై ప్రాబల్యం కలవాడు. వివేకంలో పరిపూర్ణుడూనూ.
16.
అన్
నహ్ల్ 61 - 62 ఒకవేళ అల్లాహ్ ప్రజలను వారి మితిమీరిన ప్రవర్తనకు వెంటనే పట్టుకోదలిస్తే, భూమిపై ఏ ప్రాణినీ వదలిపెట్టడు. కాని ఆయన అందరికీ ఒక నిర్ణీత కాలం వరకు గడువు ఇస్తాడు.
ఆ కాలం వచ్చేసినప్పుడు, అది ఒక్క గడియ కూడా వెనుకా ముందూ కాజాలదు. ఈనాడు వారు అల్లాహ్ కోసం తాము తమ కోసం ఇష్టపడని వస్తువులను కల్పిస్తున్నారు. తమకోసం ఉన్నదంతా శుభమే అని వారి నాలుకలు అబద్ధం పలుకుతున్నాయి. వారికోసం ఉన్నది ఒకే ఒక వస్తువు, అది నరకాగ్ని. వారు అందరికంటే ముందు అందులోకి తప్పనిసరిగా పంపబడతారు.
16.
అన్
నహ్ల్ 63 - 64 దేవునితోడు, ప్రవక్తా! నీకు పూర్వం కూడా ఎన్నో జాతుల వద్దకు మేము ప్రవక్తలను పంపి వున్నాము.
(పూర్వం కూడా ఇలాగే జరుగుతూ ఉండేది) షైతాన్ వారి చెడ్డపనులను వారికి మనోహరమైనవిగా చేసి చూపాడు. (కాబట్టి ప్రవక్తల మాటను వారు నమ్మలేదు) ఆ షైతానే ఈనాడు వీరికి కూడా సంరక్షకుడై కూర్చున్నాడు. వీరు వేదనా భరితమైన శిక్షకు అర్హులవు తున్నారు. మేము ఈ గ్రంథాన్ని నీపై ఎందుకు అవతరింపజేశామంటే, వారు గురిఅయిన
విభేదాల యథార్థాన్ని నీవు వారికి స్పష్టం చెయ్యాలని.
ఈ గ్రంథం తనను విశ్వసించే వారికోసం మార్గదర్శకత్వంగానూ, కారుణ్యంగానూ అవతరించింది.
16.
అన్
నహ్ల్ 65 (మీరు ప్రతి వర్షాకాలంలోనూ చూస్తారు),
అల్లాహ్ ఆకాశం నుండి నీళ్ళను కురిపించాడు. నిర్జీవంగా పడివున్న భూమిలో ఒక్కసారిగా దానిద్వారా ప్రాణం పోశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి ఒక నిదర్శనం ఉన్నది.
16.
అన్
నహ్ల్ 66 మీకు పశువులలో కూడా ఒక గుణపాఠం ఉన్నది. వాటి గర్భంలో పేడ, రక్తానికి మధ్య ఉన్న ఒక వస్తువును మేము మీకు త్రాగిస్తాము. అంటే స్వచ్ఛమైన పాలు. అది త్రాగేవారికి ఎంతో కమ్మనిది.
16.
అన్
నహ్ల్ 67 (ఇదేవిధంగా) ఖర్జూరపు చెట్లు, ద్రాక్ష తీగెల నుండి కూడా మేము ఒక పదార్థాన్ని మీకు త్రాగిస్తాము. దానిని మీరు మత్తుపానీయంగా కూడా చేసు కుంటారు, పరిశుద్ధమైన ఆహారంగా కూడా. బుద్ధిని ఉపయోగించే వారికి ఇందులో
నిశ్చయంగా ఒక సూచన ఉంది.
16.
అన్
నహ్ల్ 68 - 69 చూడండి, మీ ప్రభువు తేనెటీగకు వహీద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. కొండలలో, చెట్లమీద, తడికలపై ఎక్కించబడిన తీగెలలో నీ తెట్టె లను నిర్మించుకో, అన్ని రకాల పండ్లరసాన్ని పీల్చు, నీ ప్రభువు సుగమం చేసిన మార్గాలపై నడుస్తూ ఉండు.’’
ఈ ఈగ కడుపులో నుండి రంగు రంగుల పానకం ఒకటి వెలువడుతుంది.
అందులో ప్రజల కోసం వ్యాధి నివారణ శక్తి ఉన్నది. ఆలోచించేవారికి ఇందులో కూడా నిశ్చయంగా ఒక సూచన ఉంది.
16.
అన్
నహ్ల్ 70 చూడండి, అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు. తరువాత ఆయన మీకు మృత్యువును కలుగజేస్తాడు. మీలో ఒకడు అతి నికృష్టమైన వయస్సుకు చేర్చబడతాడు, అంతా తెలిసిన తరువాత కూడా ఏమీ తెలియనివాడుగా అయ్యేందుకు.
సత్యం ఏమిటంటే అల్లాహ్ మాత్రమే జ్ఞానంలో కూడా పరిపూర్ణుడు, శక్తిలో కూడా.
16.
అన్
నహ్ల్ 71 చూడండి, అల్లాహ్ మీలో కొందరికి కొందరికంటె జీవన సామగ్రి విషయంలో ఆధిక్యం ప్రసాదించాడు. అయితే ఈ ఆధిక్యం ఇవ్వబడిన వారు తమ జీవన సామగ్రిని తమ బానిసల వైపునకు మళ్ళించరు కదా? వారు ఇద్దరూ ఈ జీవన సామగ్రిలో సమాన భాగస్తులు అయ్యేటందుకు. అల్లాహ్ ఉపకారాన్నే ఒప్పుకోవటానికి వారు తిరస్కరిస్తున్నారా?
16.
అన్
నహ్ల్ 72 - 74 అల్లాహ్ యే మీకోసం మీ జాతినుండే భార్యలను చేశాడు. ఆయనే ఆ భార్యల ద్వారా మీకు కుమారులను, మనుమలను ప్రసాదించాడు. మంచి మంచి వస్తువులను మీకు తినటానికి ఇచ్చాడు. అయితే వారు (ఇదంతా చూస్తూ కూడా ఇదంతా తెలిసికూడా) అసత్యాన్నే విశ్వసిస్తున్నారా! అల్లాహ్ ఉపకారాన్నే తిరస్కరిస్తున్నారా? అల్లాహ్ ను వదలిపెట్టి ఆకాశాల నుండిగానీ, భూమినుండిగానీ వారికి ఆహారం ఇవ్వనటువంటి వారిని ఆ పని చెయ్యగల శక్తి లేనివారినీ పూజిస్తున్నారా? కనుక అల్లాహ్ కు పోలికలను కల్పించకండి. అల్లాహ్ ఎరుగును, మీరెరుగరు.
16.
అన్
నహ్ల్ 75 అల్లాహ్ ఒక ఉదాహరణను ఇస్తున్నాడు:
ఒకడేమో బానిస - ఇతరుల యాజమాన్యంలో ఉన్నవాడు, స్వయంగా ఏ అధికారమూ లేనివాడు. ఇక రెండోవాడు - అతనికి మేము మా తరఫు నుండి
మంచి ఉపాధిని ప్రసాదిం చాము, అతడు అందులో నుండి బహిరంగంగానూ, రహస్యంగానూ బాగా ఖర్చు చేస్తాడు. చెప్పండి, వారు ఇద్దరూ సమానులేనా? - అల్ హమ్దులిల్లాహ్ (స్తోత్రం అల్లాహ్ కొరకే). కాని అనేకులు (ఈ సామాన్య విషయాన్ని) ఎరుగరు.
16.
అన్
నహ్ల్ 76 అల్లాహ్ మరొక ఉదాహరణను ఇస్తున్నాడు : ఇద్దరు మనుషులున్నారు. ఒకడు మూగవాడు, చెవిటివాడు. ఏ పనీ చెయ్యలేడు. తన యజమానికి భారమై కూర్చున్నాడు. ఆయన అతన్ని ఎక్కడకు పంపినా అతనివల్ల మంచి పని ఏదీ జరుగదు. ఇక రెండో మనిషి
- అతడు న్యాయం చెయ్యండి అని ఆజ్ఞాపిస్తాడు. స్వయంగా సన్మార్గంలో స్థిరంగా ఉన్నాడు. చెప్పండి, వారు ఇద్దరూ సమానులేనా?
16.
అన్
నహ్ల్ 77 భూమిలోనూ ఆకాశాలలోనూ దాగివున్న యథార్థాల జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉన్నది. ప్రళయం సంభవించటానికి ఎంతోసేపు పట్టదు, కేవలం రెప్పపాటు కాలం తప్ప. ఇంకా దానికంటే కూడా కొంచెం తక్కువే - యథార్థ మేమిటంటే, అల్లాహ్ అన్నీ చెయ్యగల సమర్థుడు.
16.
అన్
నహ్ల్ 78 అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృగర్భాల నుండి మీరు ఏమీ ఎరుగని స్థితిలో ఉండగా బయటికి తీశాడు. ఆయన మీకు చెవులు ఇచ్చాడు. కళ్ళు ఇచ్చాడు. ఆలోచించే మనస్సూ ఇచ్చాడు - మీరు కృతజ్ఞులు కావాలని.
16.
అన్
నహ్ల్ 79 గగనమండలంలో భద్రంగా విహరించే పక్షులను వారు ఎన్నడూ చూడ లేదా? అల్లాహ్ తప్ప వాటిని క్రిందపడకుండా నిలిపి ఉంచినదెవరు? విశ్వాసు లకు ఇందులో చాలా నిదర్శనాలు ఉన్నాయి.
16.
అన్
నహ్ల్ 80 - 83 అల్లాహ్ మీకోసం మీ గృహాలను శాంతినీ, విశ్రాంతినీ ఇచ్చే స్థలాలుగా తీర్చిదిద్దాడు.
పశువుల చర్మాలతో ఆయన మీ కోసం ఇళ్ళను చేశాడు. మీరు ప్రయాణంలో ఉన్నప్పుడూ బసచేసినప్పుడూ
ఈ రెండు స్థితులలోనూ అవి మీకు తేలికగా ఉంటాయి. పశువుల మృదు రోమాలతోనూ, ఉన్నితోనూ, వెండ్రుకలతోనూ మీ కోసం తొడుక్కునే వస్తువులనూ, వాడుకునే వస్తువులనూ
ఎన్నింటినో సృష్టించాడు. అవి జీవిత కాలం అంతా మీకు పనికొస్తాయి. ఆయన తనచే సృష్టింపబడిన ఎన్నో వస్తువులతో మీకోసం నీడను ఏర్పాటు చేశాడు. పర్వతాలలో మీకోసం ఆశ్రయ స్థలాలను నిర్మిం చాడు. మిమ్మల్ని వేడిమినుండి కాపాడే దుస్తులనూ, యుద్ధ రంగాలలో మిమ్మల్ని రక్షించే కవచాలనూ మీకు ప్రసాదించాడు. ఈ విధంగా ఆయన తన అనుగ్రహా లను మీకు పూర్తిగా ప్రసాదిస్తాడు, మీరు విధేయులౌతారేమో అని. ఇక, వారు ఒకవేళ విముఖులైతే, ప్రవక్తా! సత్యసందేశాన్ని స్పష్టంగా అందజెయ్యటం తప్ప నీపై మరొక బాధ్యత లేదు.
వారు అల్లాహ్ ఉపకారాన్ని గుర్తిస్తారు. అయినా దాన్ని తిరస్కరిస్తారు. వారిలో చాలామంది సత్యాన్ని స్వీకరించటానికి సిద్ధంగా లేరు.
16.
అన్
నహ్ల్ 84 - 88 (ఆ రోజున ఏమవుతుందో వారు కొంచెమైనా ఆలోచించారా?) అప్పుడు మేము ప్రతి సంఘం నుండి ఒక సాక్షిని నిలబెడతాము. అవిశ్వాసు లకు వాదాలు వినిపించే అవకాశం ఇవ్వటంగానీ, వారిని పశ్చాత్తాపపడండి అనిగానీ, క్షమాభిక్షను అర్థించండి అనిగానీ అడగటం జరగదు. దుర్మార్గులు ఒకసారి శిక్షను చూసిన తరువాత వారి శిక్షను తగ్గించటమూ జరగదు. వారికి ఒక క్షణంపాటు వ్యవధి ఇవ్వటమూ జరగదు. ప్రపంచంలో షిర్కు చేసిన వారు, తాము అల్లాహ్ కు భాగస్వాములుగా నిలబెట్టినవారిని చూసి నప్పుడు ఇలా అంటారు: ‘‘ప్రభూ! మేము నిన్ను వదలిపెట్టి వేడుకుంటూ ఉండిన భాగస్వాములు వీరే. అప్పుడు వారు కల్పించిన ఈ దేవుళ్ళు ‘మీరు అబద్ధం చెబుతున్నారు’ అని స్పష్టంగా సమాధానం ఇస్తారు. ఆ సమయంలో వీరంతా అల్లాహ్ ముందు వినమ్రులౌతారు. వారు ప్రపంచంలో చేస్తూ ఉండిన కల్పనలన్నీ మటుమాయమౌతాయి. స్వయంగా అవిశ్వాస మార్గాన్ని అవలం బించిన వారికీ, ఇతరులను అల్లాహ్ మార్గం నుండి నిరోధించినవారికీ మేము శిక్షపై శిక్షను విధిస్తాము, వారు ప్రపంచంలో రెచ్చగొట్టిన దుర్మార్గానికి ఫలితంగా.
16.
అన్
నహ్ల్ 89 మేము ప్రతి సంఘంలో నుండి ఒక సాక్షిని లేపి నిలబెట్టేరోజును గురించి, ప్రవక్తా! వారిని హెచ్చరించు.
ఆ సాక్షి తన సంఘానికి వ్యతిరేకంగా సాక్ష్య మిస్తాడు. వారికి
వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి మేము నిన్ను తీసుకొని వస్తాము. (ఈ సాక్ష్యం కొరకు సన్నాహంగా) మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. అది ప్రతి విషయాన్నీ స్పష్టంగా వివరిస్తుంది. విధేయులైన వారికి అది ఉపదేశం, కారుణ్యం, శుభవార్త.
16.
అన్
నహ్ల్ 90 - 93 న్యాయం చెయ్యండి అనీ, ఉపకారం చెయ్యండి అనీ, బంధువుల హక్కులు నెరవేర్చండి అనీ అల్లాహ్ ఆజ్ఞాపిస్తున్నాడు. చెడునూ, అశ్లీలతనూ, అన్యాయాన్నీ, మితిమీరి ప్రవర్తించటాన్నీ నిషేధిస్తున్నాడు. ఆయన మీకు హితబోధ చేస్తున్నాడు, మీరు గుణపాఠం నేర్చుకోవాలని. మీరు అల్లాహ్తో ఏదైనా వాగ్దానం చేసివుంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. అల్లాహ్ సాక్షిగా చేసిన ప్రమాణాలను
దృఢపరచిన తరువాత భంగపరచకండి. అల్లాహ్ మీ పనులన్నింటినీ ఎరుగును. స్వయంగా తాను శ్రమతో నూలు వడకి, తరువాత తానే దానిని ముక్కలు ముక్కలుగా చేసిన స్త్రీ స్థితి వంటిది మీ స్థితి కాకూడదు. మీరు మీ ప్రమాణాలను మీ వ్యవహారాలలో పరస్పరం మోసగించుకోవటానికి పని ముట్లుగా చేసుకుంటారు, ఒక జాతి రెండోజాతికంటే ఎక్కువగా లాభాలను పొందటానికి. వాస్తవానికి అల్లాహ్ ఈ ప్రమాణాల ద్వారా మిమ్మల్ని పరీక్షకు గురిచేస్తున్నాడు. తప్పకుండా ఆయన ప్రళయం నాడు మీ సమస్త అభిప్రాయ భేదాల తత్వాన్ని మీకు విశదం చేస్తాడు. ఒకవేళ అల్లాహ్ సంకల్పం ఇదే అయివుంటే, (అంటే మీలో ఏ భేదాభిప్రాయమూ ఉండకూడదు అని) ఆయన మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తన ఇష్టప్రకారం కొందరిని అపమార్గానికి గురిచేస్తాడు. తన ఇష్టప్రకారం కొందరికి సన్మార్గం చూపుతాడు.
తప్పకుండా మీ పనులను గురించి మిమ్మల్ని సంజాయిషీ అడగటం జరిగి తీరుతుంది.
16.
అన్
నహ్ల్ 94 - 97 (ముస్లిములారా!) మీరు మీ ప్రమాణాలను ఒకరినొకరు మోసగించుకోవటానికి సాధనాలుగా చేసుకోకండి. ఇలా చేస్తే స్థిరపడిపోయిన పాదాలు తరువాత చలిస్తాయేమో,
మీరు అల్లాహ్ మార్గం నుండి ప్రజలను నిరోధించిన అపరాధానికి దుష్ఫలితాన్ని చూస్తారేమో,
శిక్షను అనుభవిస్తారేమో. మీరు అల్లాహ్ కు చేసిన వాగ్దానాన్ని స్వల్ప లాభానికి అమ్మివేయకండి. అల్లాహ్ వద్ద ఉన్నది మీకు ఎక్కువ మేలు కలిగిస్తుంది, మీరు గనక తెలుసుకుంటే. మీ దగ్గరున్నదంతా ఖర్చు అయిపోయేదే. అల్లాహ్ వద్ద ఉన్నదే అసలు మిగిలి వుండేది. సహనంతో వ్యవహరించే వారికి మేము వారి ప్రతిఫలాన్ని వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా తప్పకుండా ఇస్తాము. పురుషుడైనా స్త్రీ అయినా సత్కర్మలు చేస్తే, విశ్వాసి అయినపక్షంలో మేము అతనిని ప్రపంచంలో పరిశుద్ధ జీవితం గడిపేలా చేస్తాము. (పరలోకంలో) అటువంటి వారికి వారి ఉత్తమ కార్యాలకు అనుగుణంగా ప్రతిఫలాలను ప్రసాదిస్తాము.
16.
అన్
నహ్ల్ 98 - 100 మీరు ఖురాను పఠనం ప్రారంభించినప్పుడు శాపగ్రస్తుడైన షైతాను బారినుండి అల్లాహ్ శరణు కోరుకొనండి. విశ్వసించి
తమ ప్రభువును నమ్ముకున్న వారిపై వాడి అధికారం సాగదు. వాడిని తమ సంరక్షకుడుగా చేసుకుని వాడి మోసానికి గురిఅయి షిర్కు చేసేవారిపైనే వాడి అధికారం సాగుతుంది.
16.
అన్
నహ్ల్ 101 - 102 మేము
ఒక ఆయత్ స్థానంలో మరొక ఆయత్ను అవతరింప జేసినప్పుడు- దేనిని అవతరింపజెయ్యాలో అల్లాహ్ కు బాగా తెలుసు - నీవు స్వయంగా ఈ ఖురానును కల్పించి వ్రాస్తున్నావు అని వారు అంటారు. అసలు
విషయం ఏమిటంటే వారిలో, చాలామందికి యథార్థం ఏమిటో తెలియదు. వారితో ఇలా అను:
దీనిని పరిశుద్ధాత్మ ఉన్నది ఉన్నట్లుగా నా ప్రభువు తరఫు నుండి క్రమక్రమంగా అవతరింపజేశాడు, విశ్వాసుల విశ్వా సాన్ని పటిష్ఠం చేసేటందుకూ, జీవితానికి సంబంధించిన వ్యవహారాలలో విధేయులకు సరిjైున మార్గం చూపేటందుకూ, వారికి సాఫల్యం, సౌభాగ్యాల శుభవార్తను ఇచ్చేటందుకూ.
16.
అన్
నహ్ల్ 103 - 105 ‘‘ఇతనికి
ఒకానొక మనిషి నేర్పుతున్నాడు’’ అని వారు నిన్ను గురించి అంటున్న విషయం మాకు తెలుసు.
వాస్తవానికి, వారు సూచిస్తున్న మనిషి మాట్లాడే భాష అన్యదేశపు భాష. ఇదేమో స్పష్టమైన అరబ్బీ భాష. యథార్థమేమిటంటే, అల్లాహ్ ఆయతులను విశ్వసించని వారికి అల్లాహ్ ఎన్నడూ
సరిjైున
విషయం వరకు చేరుకునే భాగ్యాన్ని కలుగజెయ్యడు. అటువంటి వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది. అబద్ధాలను దైవప్రవక్త కల్పించడు, అల్లాహ్ ఆయతులను విశ్వసించనివారే అబద్ధాలను కల్పిస్తున్నారు. అసలు వారే అసత్యవాదులు.
16.
అన్
నహ్ల్ 106 - 111 ఎవరైనా విశ్వసించిన తరువాత బలవంతం చెయ్యబడటం వల్ల అవిశ్వాసిగా మారినపక్షంలో, అప్పుడు
అతని హృదయం విశ్వాసం పట్ల తృప్తితో ఉంటే, (అది వేరే విషయం). కాని ఎవరైనా హృదయపూర్వకంగా అవిశ్వాసానికి పాల్పడితే అతనిపై అల్లాహ్ ఆగ్రహం పడుతుంది. అటువంటి వారందరికీ
తీవ్రమైన శిక్ష పడుతుంది. ఎందుకంటే, వారు పరలోకానికి బదులుగా ప్రాపంచిక జీవితాన్ని కోరుకున్నారు. అల్లాహ్ తన అనుగ్రహాన్ని తిరస్కరించేవారికి మోక్షమార్గం చూపడు. ఇది
ఆయన విధానం. వారి హృదయాలకూ, వారి చెవులకూ, వారి కళ్ళకూ అల్లాహ్ ముద్రవేశాడు. వారు అశ్రద్ధలో మునిగిపోయారు. అందుచేత వారు పరలోకంలో తప్పక నష్టానికి గురిఅవుతారు. దీనికి భిన్నంగా (విశ్వసించిన కారణంగా) బాధలకు గురి చెయ్యబడినప్పుడు ఇల్లూ వాకిలీ విడిచిపెట్టినవారూ, వలసపోయినవారూ దైవమార్గంలో
కష్టాలను భరించినవారూ సహనంతో వ్యవహరించినవారూ- వారికొరకు నీ ప్రభువు నిశ్చయంగా క్షమించేవాడుగా కరుణించేవాడుగా ఉంటాడు. ప్రతి ప్రాణీ తనను తాను మాత్రమే రక్షించుకునే ఆలోచనలో మునిగి ఉండేరోజున,
ప్రతి ఒక్కనికీ తాను చేసిన దానికి ప్రతిఫలం పూర్తిగా ఇవ్వబడేరోజున, ఎవరికీ ఏమాత్రమూ అన్యాయం జరగనిరోజున (వారందరి విషయంలో తీర్పు జరుగుతుంది).
16.
అన్
నహ్ల్ 112 - 113 అల్లాహ్
ఒక జనపదానికి సంబంధించిన ఉదాహరణ ఇస్తున్నాడు: ఆ జనపదం శాంతిమయమూ సంతృప్తికరమూ అయిన జీవితాన్ని గడుపుతూ ఉండేది. ప్రతి వైపునుండీ దానికి ఆహారం పుష్కలంగా చేరుతూ ఉండేది. అప్పుడు అది అల్లాహ్ కానుకలకు కృతఘ్నత చూపటం ప్రారంభిం చింది.
అప్పుడు అల్లాహ్ దాని పౌరులకు వారి అకృత్యాల రుచిని ఇలా చూపాడు: ఆకలీ భయమూ అనే ఆపదలు వారిని చుట్టుముట్టాయి. వారివద్దకు వారి జాతినుండే ఒక ప్రవక్త వచ్చాడు. కాని వారు ఆయనను తిరస్కరించారు. చివరకు వారు పూర్తిగా దుర్మార్గులై పోయినప్పుడు వారిని శిక్ష
పట్టుకున్నది.
16.
అన్
నహ్ల్ 114 - 117 కనుక
ప్రజలారా! అల్లాహ్ మీకు ప్రసాదించిన ధర్మసమ్మత మైనటువంటి, పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని తినండి, అల్లాహ్ చేసిన మేలునకు కృతజ్ఞతలు తెలుపండి, నిజంగా మీరు ఆయననే ఆరాధించేవారు అయితే. అల్లాహ్ మీకు నిషిద్ధం చేసినవి ఇవి: దానంతట అది చచ్చిన పశువు, రక్తము, పందిమాంసము, అల్లాహ్ తప్ప ఇతరుల పేరు ఉచ్చరిం పబడిన జంతువు. అయితే ఆకలికి తాళలేక గత్యంతరం లేని పరిస్థితిలో ఎవరైనా వాటిని తింటే, అతడు దైవశాసనాన్ని ఉల్లంఘించే ఉద్దేశ్యం కూడా కలిగి ఉండకపోయినట్లయితే, లేదా అవసరానికి
మించి తినకుండా ఉన్నట్లయితే- అప్పుడు నిశ్చయంగా అల్లాహ్ క్షమిస్తాడు, కరుణిస్తాడు. ఈ వస్తువు ధర్మసమ్మతం అనీ, ఆ వస్తువు నిషిద్ధం అనీ మీ నాలుకలు అబద్ధపు నిర్ణయాలను జారీ చేస్తున్నాయి. ఇటువంటి నిర్ణయాలను తీసుకొని అల్లాహ్ కు అబద్ధాన్ని ఆపాదించకండి. అల్లాహ్ కు అబద్ధాన్ని ఆపాదించేవారు ఎంత మాత్రం సాఫల్యం పొందలేరు. ప్రాపంచిక సుఖాలు మూడునాళ్ళ ముచ్చటే. చివరకు వారికి బాధాకరమైన శిక్ష పడుతుంది.
16.
అన్
నహ్ల్ 118 - 124 ఇంతకు
పూర్వం మేము నీతో ప్రస్తావించిన వస్తువులను ప్రత్యే కంగా యూదులకు నిషిద్ధం చేశాము. ఇలా వారికి అన్యాయం చేసినది మేము కాదు. వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. అయితే, అజ్ఞానం వల్ల చెడుపని చేసి తరువాత పశ్చాత్తాపపడి తమ ప్రవర్తనను సంస్కరించుకున్నవారిని నీ ప్రభువు నిశ్చయంగా పశ్చాత్తాపం, సంస్కరణల తరువాత క్షమిస్తాడు, కనికరిస్తాడు. నిజానికి ఇబ్రాహీమ్ తనకు తానే ఒక సంఘం. అల్లాహ్ కు పరమ విధేయుడు. ఆయన యందే మనస్సు నిలిపిన వాడు.
అతను ఎన్నడూ ముష్రిక్కుగా ఉండలేదు. అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండేవాడు. అల్లాహ్ అతనిని ఎన్నుకున్నాడు. అతనికి ఋజుమార్గాన్ని చూపాడు. ప్రపంచంలో అతనికి మేలును ప్రసాదించాడు. పరలోకంలో అతను నిశ్చయంగా సజ్జనులలో ఒకడుగా ఉంటాడు. తరువాత మేము ‘‘ఏకాగ్ర చిత్తుడవై ఇబ్రాహీమ్ విధానాన్ని అనుసరించు - అతను ముష్రిక్కులలోని వాడు కాడు’’ అనే వహీని నీ వద్దకు పంపాము. ఇక
సబ్బత్ విషయం, దానికి సంబంధించిన ఆదేశాలతో విభేదించిన వారిపై మేము దానిని విధించాము. వారు విభేదిస్తూ
ఉండిన అన్ని విషయాలను గురించి నిశ్చయంగా నీ ప్రభువు ప్రళయం నాడు తీర్పు చేస్తాడు.
16.
అన్
నహ్ల్ 125 - 128 ప్రవక్తా!
నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు, వివేకంతో చక్కని హితబోధతో. ప్రజలతో ఉత్తమోత్తమమైన రీతిలో వాదించు. నీ ప్రభువుకే బాగా తెలుసు,
ఆయన మార్గం నుండి తప్పిపోయిన వాడు ఎవడో, ఋజుమార్గంలో ఉన్నవాడు ఎవడో.
ఒకవేళ మీరు ప్రతీకారం చేస్తే కేవలం మీపై దౌర్జన్యం జరిగిన మేరకే ప్రతీకారం చెయ్యండి. కాని మీరు సహనం చూపితే, అది నిశ్చయంగా సహనం చూపేవారికే మంచిది. ప్రవక్తా! సహనంతో పనిచేస్తూ పో - నీకు ఈ సహన భాగ్యం అల్లాహ్ అనుగ్రహం వల్లనే కలిగింది- వారి చేష్టలకు వగవకు. వారి పన్నాగాలకు మనస్సులో ఖేదపడకు. భయ భక్తులతో పని చేస్తూ ఉదాత్తవైఖరి కలిగివుండే వారితో అల్లాహ్ ఉంటాడు.
No comments:
Post a Comment