73. అల్ ముజ్జమ్మిల్
ఆయతులు
: 20 అవతరణ : మక్కాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 14
ఓ దుప్పటి కప్పుకుని
పడుకునేవాడా! రాత్రివేళ నమాజులో నిలబడుతూ ఉండు, కాని కొంచెం సేపు మాత్రమే
రాత్రిలో సగభాగం లేదా దానిని కొంచెం తగ్గించుకో లేదా దానిని కొంచెం పొడిగించుకో. ఖుర్ఆన్ను నెమ్మదిగా ఆగి ఆగి పఠించు. మేము నీపై ఒక గంభీరమైన వాణిని అవతరింప జేయబోతున్నాము.
వాస్తవానికి రాత్రివేళ లేవటం మనస్సును అదుపులో ఉంచేందుకు
ఎంతో ఉపయుక్తమైనది
ఖుర్ఆన్ను శ్రద్ధగా పఠించేందుకు ఎంతో అనువైనది: ఎందుకంటే, పగటి వేళ నీకు చాలా పనులుంటాయి. నీ ప్రభువు
నామాన్ని స్మరిస్తూ ఉండు
అన్నిటినీ వదలి పూర్తిగా ఆయనకే అంకితమైపో. ఆయన తూర్పు పడమరలకు స్వామి, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. కనుక నీవు ఆయననే వకీలుగా చేసుకో. లోకులు కల్పించే మాటల పట్ల సహనం వహించి, మంచితనంతో వారి నుండి వైదొలగిపో. సత్య తిరస్కారులైన ఈ సంపన్నుల సంగతి నాకు వదలిపెట్టు, నేను చూసు కుంటాను. వీరిని కొంతకాలం ఇదే స్థితిలో ఉండనివ్వు. మా వద్ద (వీరి కొరకు) బరువైన సంకెళ్లు ఉన్నాయి, భగ భగమండే అగ్ని, గొంతులో ఇరుక్కు పోయే ఆహారం, వ్యధాభరితమైన శిక్షా ఉన్నాయి. ఇదంతా భూమీ, పర్వతాలు కంపించే రోజున జరుగుతుంది. ఆ రోజున పర్వతాలు చెల్లాచెదరై పోయే ఇసుక తిప్పలు మాదిరిగా అయిపోతాయి.
15 - 19 మేము ఫిరౌను వద్దకు ఒక ప్రవక్తను పంపిన విధంగా ఒక ప్రవక్తను మీకు సాక్షిగా నియమించి మీ వద్దకు పంపాము.(చూడండి) ఫిరౌను ఆ ప్రవక్త మాటను వినకపోవటం వల్ల మేము అతన్ని చాలా తీవ్రంగా పట్టు కున్నాము. ఒకవేళ మీరు కూడ నమ్మటానికి నిరాకరిస్తే, పిల్లలను వృద్ధులుగా చేసే ఆరోజు నుండి ఎలా బయటపడగలరు?
ఆనాటి తీవ్రత వల్ల ఆకాశం బ్రద్దలవుతుంది. అల్లాహ్ చేసిన వాగ్దానం నెరవేరితీరాలి. ఇదొక ఉపదేశం, ఇక ఇష్టమైన వారు తమ ప్రభువు వైపునకు పోయే మార్గాన్ని అవలం బించవచ్చు.
20 ఓ ప్రవక్తా! నీవు ఒక్కొక్కప్పుడు దాదాపు మూడిరట రెండు వంతుల రాత్రి, మరొకప్పుడు సగం రాత్రి, ఇంకొకప్పుడు మూడిరట ఒకవంతు రాత్రి ఆరాధనలో నిలబడి ఉంటావనీ, నీ సహచరులలో కూడ ఒక వర్గం ఇలాగే చేస్తుందనీ నీ ప్రభువుకు తెలుసు.
అల్లాహ్ మాత్రమే రేయింబవళ్ల వేళలను గురించి లెక్క కట్టగలడు.
నీవు వేళలను
కచ్చితంగా లెక్కించలేవని ఆయనకు తెలుసు
కనుక ఆయన నీపై దయచూపాడు. ఇప్పుడు నీవు ఖుర్ఆన్ను సులభంగా పఠించగలిగినంత మేరకే పఠించు. ఆయనకు తెలుసు,
మీలో కొందరు వ్యాధిగ్రస్తులు ఉండవచ్చు, మరికొందరు అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషిస్తూ ప్రయాణాలలో ఉండవచ్చు, ఇంకా కొందరు అల్లాహ్ మార్గంలో యుద్ధం చేస్తూ ఉండవచ్చు. కనుక మీరు ఖుర్ఆన్ను సులభంగా పఠించగలి గినంత పఠించండి. నమాజ్ను స్థాపించండి, జకాత్ ఇవ్వండి, అల్లాహ్ కు మంచి అప్పును ఇస్తూ ఉండండి. మీరు ఏ సత్కార్యాన్ని మీ కోసం ముందుగా పంపించుకుంటారో, దానిని మీరు అల్లాహ్ వద్ద చూసుకుంటారు. అదే చాలా శ్రేష్ఠమైనది మరియు దాని ప్రతిఫలం చాలా పెద్దది. అల్లాహ్ ను క్షమాభిక్ష కోసం అర్థిస్తూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్ గొప్ప క్షమాశీలుడు, కరుణామయుడూను.
No comments:
Post a Comment