83 సూరహ్ అల్ ముతఫ్ఫిఫీన్

 

83 అల్ ముతఫ్ఫిఫీన్

ఆయతులు : 36                                                                           అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 6 తూనికలలో, కొలతలలో తగ్గించి ఇచ్చేవారికి వినాశం ఉన్నది.  వారు ప్రజల నుండి తీసుకునే టప్పుడు పూర్తిగా తీసుకుంటారు  వారికి కొలిచిగాని తూచిగాని ఇచ్చేటప్పుడు తగ్గించి ఇస్తారు. ఒక మహాదినంనాడు వారు బ్రతికించి తీసుకురాబడనున్నారని వారికి తెలియదా? రోజున ప్రజలందరూ సకల లోకాల ప్రభువు సమక్షంలో నిలబడతారు.

7 - 17 ఎంతమాత్రం కాదు, నిశ్చయంగా దుర్జనుల కర్మల పత్రం చెరసాల గ్రంథంలో ఉంటుంది. చెరసాల గ్రంథం అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక వ్రాయబడిన గ్రంథం. తీర్పుదినాన్ని తిరస్కరించే తిరస్కారులకు రోజున వినాశం ఉన్నది. హద్దుమీరి ప్రవర్తించే దుర్మార్గుడు తప్ప ఒక్కడూ దానిని తిరస్కరించలేడు. అతడికి మా వాక్యాలు వినిపించినప్పుడు, ‘‘ఇవి పూర్వకాలపు కట్టుకథలే’’ అని అంటాడు. ఎంతమాత్రం కాదు, అసలు వారి హృదయాలకు వారి దుష్కార్యాల తుప్పు పట్టింది. ఎంతమాత్రం కాదు,  నిశ్చయంగా    రోజున వారు తమ ప్రభువు దర్శనం లభించకుండా చేయ బడతారు. తరువాత వారు నరకంలోకి పోయి పడతారు. అప్పుడు వారితో ‘‘మీరు తిరస్కరిస్తూ ఉండినది ఇదే’’ అని చెప్పటం జరుగుతుంది.

18 - 28 ఎంతమాత్రం కాదు, నిస్సందేహంగా సజ్జనుల కర్మల పత్రం ఉన్నతస్థాయి వ్యక్తులకు సంబంధించిన గ్రంథంలో ఉంటుంది. ఉన్నతస్థాయి వ్యక్తులకు సంబంధించిన గ్రంథం అంటే ఏమిటో నీకు తెలుసా? అదొక వ్రాయబడిన గ్రంథం, దేవునికి సన్నిహితులైన దైవదూతలు దాన్ని కాపలా కాస్తూ ఉంటారు. నిస్సందేహంగా సజ్జనులు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు, ఉన్నత పీఠాలపై కూర్చుండి (స్వర్గ దృశ్యాలను) తిలకిస్తూ ఉంటారు. వారి ముఖాలలో నీకు సుఖ సంతోషాల కళాకాంతులు కనిపిస్తాయి. ముద్ర వేయబడిన, సుమధుర మధువు వారికి ఇవ్వబడుతుంది. దానిపై  కస్తూరి ముద్ర వేయబడి ఉంటుంది. ఇతరుల్ని మించిపోవాలని కోరుకునే వారు దీన్ని పొందే  విషయంలో మించిపోవటానికి కృషిచేయాలి. మధువులో తస్నీమ్కలిసి ఉంటుంది  ఇదొక సెలయేరు, దీని జలముతో పాటు దైవసాన్నిధ్యం పొందిన వారు మధువు సేవిస్తారు.

29 - 36 ప్రపంచంలో విశ్వసించినవారిని నేరస్తులు హేళన చేస్తుంటారు. వారిముందు నుండి వెళ్ళేటప్పుడు మాటిమాటికీ కళ్లు గీటుతూవారి వైపు సైగలు చేసేవారు. తమ కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్ళేటప్పుడు సంబరపడుతూ వెళ్ళేవారు. వారిని చూసినప్పుడు, ‘‘వీరు దారి తప్పారు’’ అని అనేవారు. వాస్తవానికి వారు వారిపై కాపలాదారులుగా నియమించి పంపబడలేదు. ఈనాడు విశ్వసించినవారు అవిశ్వాసులను చూసి నవ్వుతున్నారు, ఉన్నత పీఠాలపై కూర్చుండి వారి స్థితిని చూస్తున్నారు. దొరికింది కదా అవిశ్వాసులకు వారు చేస్తూవుండిన చేష్టలకు పుణ్యఫలం.

No comments:

Post a Comment