67 సూరహ్ అల్‌ ముల్క్

 

67. అల్ముల్క్

ఆయతులు : 30                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 4 ఎవరి చేతులలో విశ్వసామ్రాజ్యం ఉన్నదో, ఆయన ఎంతో శుభకరుడు, ఎంతో మహోన్నతుడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలిగి ఉన్నాడు. మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని ఆయన చావు బ్రతుకులను సృష్టించాడు. ఆయన అత్యంత శక్తిసంపన్నుడు, అత్యధికంగా మన్నించేవాడూను. ఆయన ఒక దానిపై నొకటి ఏడు ఆకాశాలను సృజించాడు. నీవు కరుణామయుని సృష్టిలో ఎలాంటి క్రమరాహిత్యాన్నీ చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు, అందులో నీకేమైనా లోపం కనిపిస్తున్నదా? మళ్లీ మళ్లీ చూడు, నీ చూపులు అలసిపోయి విఫలమై వెనుకకు తిరిగి వస్తాయి.

5 మేము మీకు దగ్గరగా ఉన్న ఆకాశాన్ని మహోజ్వలమైన దీపాలతో అలంకరిం చాము, వాటిని, షైతానులను తరిమికొట్టే సాధనాలుగా చేశాము. షైతానుల కొరకు మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.

6 - 11 తమ ప్రభువును తిరస్కరించిన ప్రజలకు నరక శిక్ష పడుతుంది : అది చాలా చెడ్డ నివాస స్థలం. వారిని అందులోకి విసిరివేసినప్పుడు, వారికి భయంకరమైన దాని గర్జన ధ్వని వినిపిస్తుంది. అది అప్పుడు ఉద్రేకంతో ఉడికిపోతూ ఉంటుంది, తీవ్రమైన ఆగ్రహంతో బ్రద్దలవుతూ ఉంటుంది. ఏదైనా ఒక గుంపును అందులో వేసిన ప్రతిసారీ, దాని కాపలాదారులు, ‘‘మీ వద్దకు హెచ్చరించేవారు రాలేదా?’’ అని వారిని అడుగుతారు. దానికి వారు ఇలా జవాబు ఇస్తారు,  ‘‘వచ్చాడు, హెచ్చరిక చేసే అతను మా వద్దకు వచ్చాడు. కాని మేము అతనిని తిరస్కరించాము. అల్లాహ్ దేన్నీ అవతరింప జేయలేదు, నీవు మార్గభ్రష్టుడవైపోయావు అని మేము అతనితో అన్నాము.’’ ఇంకా వారు ఇలా అంటారు, ‘‘అయ్యో! మేము గనక (ఆనాడు) విని ఉంటే, లేదా గ్రహించి ఉంటే, ఈనాడు ఇలా మండే నరకాగ్ని శిక్షకు గురిఅయిన వారిలో చేరి ఉండేవారము కాదుకదా!’’ విధంగా వారే స్వయంగా తమ తప్పును ఒప్పుకుంటారు. నరకవాసులు నాశనమైపోను!

12 - 14 చూడకుండానే తమ ప్రభువుకు భయపడేవారికి, తప్పకుండా మన్నింపు, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి. మీరు మెల్లగా మాట్లాడినా లేక బిగ్గరగా పలికినా (అల్లాహ్ కు రెండూ ఒకటే). ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును. పుట్టించిన వాడికే తెలియదా? వాస్తవానికి ఆయన సూక్ష్మ గ్రాహి మరియు సమస్తమూ తెలిసినవాడూను.

15 - 23 భూమిని మీ అధీనంలో ఉంచినవాడు ఆయనే, కనుక దానిమీద తిరగండి, దేవుడు ప్రసాదించిన ఆహారాన్ని తినండి. ఆయన సాన్నిధ్యానికే మీరు మళ్లీ సజీవులై పోవలసి ఉంది. ఆకాశంలో ఉన్నవాడు మిమ్మల్ని భూమి లోకి దిగద్రొక్కడని, భూమి హఠాత్తుగా తీవ్ర కంపనాలకు గురికాదని మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశంలో ఉన్నవాడు మీపైకి రాళ్లను విసిరే పెనుగాలిని పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? అప్పుడు నా హెచ్చరిక ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. వారికి పూర్వం గతించినవారు కూడ తిరస్కరించారు  అప్పుడు నా పట్టు ఎంత తీవ్రంగా ఉండినదో చూడండి. వారు తమ మీద ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ ఎగురుతున్నాయో చూడటం లేదా?  కరుణామయుడైన అల్లాహ్ తప్ప వాటిని అలా నిలిపి ఉంచేవారెవ్వరూ లేరు.  ఆయనే ప్రతి వస్తువును కనిపెట్టి ఉండే వాడు. కరుణామయుడైన అల్లాహ్ కు ప్రతికూలంగా మీకు సహాయం చేయగల సైన్యమేదైనా మీ వద్ద ఉన్నదా? చూపించండి? అసలు విషయం ఏమిటంటే, తిరస్కారులు మోసంలో పడిపోయారు. లేదా ఒకవేళ కరుణామయుడైన అల్లాహ్ తాను ప్రసాదించే ఆహారాన్ని ఆపివేసినట్లయితే, ఇంకెవరు మీకు ఆహారమివ్వగలరు? చెప్పండి? వారసలు తలబిరుసుతనానికీ, సత్య తిరస్కా రానికీ, మూర్ఖంగా అంటిపెట్టుకొని ఉన్నారు. బోర్లాపడుతూ లేస్తూ నడిచే వ్యక్తి సరైన గమ్యానికి చేరుకుంటాడా లేక చదునైన బాటపై తలెత్తి నిటారుగా నడిచే వ్యక్తి గమ్యానికి చేరుకుంటాడా? కాస్త ఆలోచించండి. వారితో ఇలా అనండి, ‘‘మిమ్మల్ని పుట్టించిన వాడు అల్లాహ్ యే  ఆయనే మీకు వినే, చూసే శక్తులు ఇచ్చాడు. ఇంకా ఆయనే మీకు ఆలోచించే, అర్థం చేసుకునే మనస్సు కూడ ఇచ్చాడు. కాని మీరు చాల తక్కువగా కృతజ్ఞతలు తెలుపుతారు.

24 - 27 వారితో ఇలా అను, ‘‘అల్లాహ్ యే మిమ్మల్ని యావద్భూమిపై వ్యాపింపజేశాడు. ఆయన వైపునకే మీరు సమీకరింపబడతారు.’’ అప్పుడు వారు, ‘‘నీవు గనక సత్యవంతుడవే అయితే, వాగ్దానం ఎప్పుడు నెరవేరు తుందో చెప్పు’’ అని అడుగుతారు. ఇలా చెప్పు,‘‘దీనికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉంది. నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే.’’ తరువాత (వారు) దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు, తిరస్కరించిన వారందరి ముఖాలు వెల వెల బోతాయి. అప్పుడు వారితో, ‘‘మీరు మాటిమాటికి అడుగు తుండేది ఇదే’’ అని అనటం జరుగుతుంది.

28 - 30 వీరితో ఇలా చెప్పు, ‘‘మీరెప్పుడైనా విషయం గురించి ఆలోచిం చారా? అల్లాహ్ నన్నూ, నా అనుచరులనూ నాశనం చేయనూవచ్చు లేదా మమ్మల్ని కరుణించనూవచ్చు. కాని తిరస్కారులను వ్యధాభరితమైన శిక్ష నుండి ఎవరు రక్షిస్తారు? వారితో ఇంకా ఇలా అను, ‘‘ఆయన ఎంతో కరుణా మయుడు. ఆయననే మేము విశ్వసించాము   ఆయననే  మేము నమ్ము కున్నాము. ఎవరు పూర్తిగా మార్గభ్రష్టులై ఉన్నారో,  త్వరలోనే మీకు తెలిసి పోతుంది.’’ వీరికి ఇలా చెప్పు, ‘‘ఎప్పుడైనా  మీరు విషయం గురించి కూడా ఆలోచించారా? ఒకవేళ మీ బావులలోని నీరు భూమిలోపలకు ఇంకి పోతే, ప్రవహించే నీటి ఊటలను మళ్లీ మీ కోసం బయటకు తెచ్చేదెవరు?’’

No comments:

Post a Comment