62 సూరహ్ అల్‌ జుముఅహ్

 

62. అల్జుముఅహ్

ఆయతులు : 11                                   అవతరణ : మదీనాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 ఆకాశాలలోని ప్రతివస్తువూ, భూమిలోని ప్రతి వస్తువూ అల్లాహ్ ను స్తుతి స్తోంది. ఆయన విశ్వసమ్రాట్టు, ఎంతో పరిశుద్ధుడు, అత్యంత శక్తిమంతుడు, వివేకవంతుడు.

2 - 4 ఆయనే నిరక్షరాస్యులలో (ఉమ్మీలు) ఒక ప్రవక్తను స్వయంగా వారి నుండే లేపాడు. ప్రవక్త వారికి ఆయన వాక్యాలను వినిపిస్తున్నాడు, వారి జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు, వారికి గ్రంథాన్నీ, వివేకాన్నీ బోధిస్తున్నాడు. వాస్తవానికి దీనికి పూర్వం వారు పూర్తిగా మార్గం తప్పి ఉన్నారు. ఇంకా వారితో చేరని ఇతరుల కొరకు కూడ ( ప్రవక్త ప్రభవించబడ్డాడు). అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు, వివేకవంతుడూను. ఇది ఆయన అనుగ్రహం, తాను కోరినవారికి దానిని ప్రసాదిస్తాడు. ఆయన గొప్ప అనుగ్రహశాలి.

5 తౌరాత్గ్రంథబాధ్యతా భారం మోపబడినప్పటికీ, దానిని మోయనివారు, పుస్తకాల బరువును మోసే గాడిదను పోలి ఉన్నారు. అల్లాహ్ వాక్యాలను తిరస్కరించిన వారి పోలిక దీనికంటె కూడ ఘోరమైనది. ఇటువంటి దుర్మార్గు లకు అల్లాహ్ సన్మార్గం చూపడు.

6 - 8 వారితో ఇలా అను, ‘‘యూదులై పోయిన ప్రజలారా! ఒకవేళ మిగతా ప్రజలందరికంటే మీరు మాత్రమే అల్లాహ్ కు ప్రియమైనవారు అనే గర్వం మీకు ఉంటే, చావును కోరుకోండి. మీరు పలికే ప్రగల్భాలు, నిజమేఅయితే, పని చెయ్యండి.’’ కాని వారు తాము చేసుకున్న అకృత్యాల కారణంగా చావును ఎన్నటికీ కోరుకోరు. అల్లాహ్ దుర్మార్గులను బాగా ఎరుగును. వారికి ఇలా చెప్పు:  ‘‘ చావు  నుండి మీరు పారిపోతున్నారో, అది మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది.    తరువాత మీరు రహస్య విషయాలు, బహిరంగ విషయాలు అన్నింటినీ ఎరిగినవారి ముందు హాజరుపరచబడతారు. అప్పుడు ఆయన మీకు మీరేమేమి చేస్తూ ఉండేనారో అవన్నీ తెలుపుతాడు.’’

9 - 10 విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజుకై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తండి  క్రయవిక్రయాలను వదలిపెట్టండి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది. ఆపై నమాజు ముగిసిన తరువాత భూమిపై వ్యాపించండి, అల్లాహ్ అనుగ్రహాన్ని అన్వేషించండి  అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి, బహుశా మీకు సాఫల్యభాగ్యం కలుగవచ్చు.

11 వారు, వ్యాపారం, వినోదక్రీడలు జరుగుతూ ఉండగా చూచి, అటువైపు పరుగెత్తారు  నిన్ను నిలబడి ఉన్న స్థితిలో వదలివెళ్లారు. వారితో ఇలా అను, ‘‘వినోదక్రీడల కంటే, వ్యాపారం కంటే అల్లాహ్ వద్ద ఉన్నదే శ్రేష్ఠమైనది. అల్లాహ్ అందరికంటే మేలైన ఉపాధిప్రదాత.’’

No comments:

Post a Comment