32 సూరహ్ అస్‌ సజ్‌దహ్

  

32. అస్సజ్దహ్

ఆయతులు : 30                                  అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

32. అస్సజ్దహ్  1 - 3 అలిఫ్‌. లామ్‌. మీమ్‌. నిస్సందేహంగా గ్రంథం సకల లోకాల ప్రభువు తరఫునుండి అవతరించింది. దీనిని స్వయంగా వ్యక్తియే కల్పిం చాడని వారు అంటున్నారా? కాదు, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం  నీకు పూర్వం హెచ్చరించేవారెవరూ రాని జాతికి నీవు హెచ్చరిక చేసేందుకు, బహుశా వారు మార్గదర్శకత్వం పొందుతారేమో అని.

32. అస్సజ్దహ్  4 - 9 ఆకాశాలనూ, భూమినీ, వాటి మధ్య ఉన్న సమస్త వస్తువులనూ ఆరు రోజులలో సృష్టించినవాడు, దాని తరువాత అధికార పీఠాన్ని అధిష్ఠించినవాడు అల్లాహ్ యే, ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడూ, మీకు సహాయం చేసేవాడూ ఎవడూ లేడు, ఆయన సమక్షంలో సిఫారసు చేసేవాడు కూడా ఎవడూ లేడు. అలాంటప్పుడు మీరు ఆలోచించరెందుకని? ఆయన ఆకాశం నుండి భూమి వరకు గల ప్రపంచ వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. నిర్వహణా నివేదిక  ఒక రోజున పైకి ఆయన సమ్ముఖానికి చేరుతుంది. రోజు పరిమాణం మీ అంచనా ప్రకారం వేయి సంవత్సరాలు. గోప్యంగాను, బహిరంగంగాను ఉన్న ప్రతిదానిని ఎరిగినవాడూ, శక్తిమంతుడూ, కరుణా మయుడూ ఆయనే, ఆయన వస్తువును చేసినా చక్కగానే చేశాడు. ఆయన మానవ సృష్టి ప్రారంభాన్ని మట్టితో చేశాడు. తరువాత అతని సంతతిని తుచ్ఛమైన ద్రవపదార్థం వంటి ఒక సారంతో కొనసాగించాడు. తరువాత అతనిని నఖశిఖ పర్యంతం తీర్చిదిద్దాడు. అతనిలోనికి తన ఆత్మను ఊదాడు. మీకు చెవులిచ్చాడు, కళ్ళిచ్చాడు, హృదయాలిచ్చాడు. అయినా మీరు కృతజ్ఞతలు తెలపటం చాలా తక్కువ.

32. అస్సజ్దహ్  10 - 11 ప్రజలు ఇలా అంటారు  ‘‘మేము మట్టిలో కలిసి నశించి పోయినా, మళ్లీ మేము క్రొత్తగా సృష్టించబడతామా? అసలు విషయం ఏమిటంటే వారు తమ ప్రభువును కలుసుకోవటాన్ని తిరస్కరిస్తారు. వారితో ఇలా అను, ‘‘మీపై నియమింపబడిన మృత్యుదూత మిమ్మల్ని పూర్తిగా కైవసం చేసుకుంటాడు. తరువాత మీరు మీ ప్రభువు వైపునకు మరలింపబడి తీసుకుపోబడతారు.’’

32. అస్సజ్దహ్  12 - 14 దోషులు తలలు వంచి తమ ప్రభువు సమక్షంలో నిలబడి ఉండే సమయాన్ని నీవు చూస్తే ఎంత బాగుండును! (అప్పుడు వారు ఇలా అంటారు), ‘‘మా ప్రభూ! మేము బాగా చూశాము, బాగా విన్నాము, ఇక మమ్మల్ని వెనక్కి పంపించు, మేము మంచిపనులు చేస్తాము. మాకు ఇప్పుడు నమ్మకం కలిగింది.’’ (సమాధానంగా ఇలా అనబడుతుంది). మేము కోరితే, మొదట్లోనే ప్రతి ఆత్మకూ దాని యొక్క మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఉండేవారము. కాని నేను జిన్నాతులు, మానవులు అందరినీ కలిపి నరకాన్ని నింపుతాను అని నేను చెప్పిన  నా  మాట నెరవేరింది. మీరు నాటి సమావేశాన్ని విస్మరించారు  కనుక ఇప్పుడు మీ చేష్ట యొక్క రుచిని చూడండి. మేము కూడ ఇప్పుడు మిమ్మల్ని విస్మరించాము, చవిచూడండి శాశ్వతంగా ఉండిపోయే యాతనను మీ చేష్టలకు పర్యవసానంగా.

32. అస్సజ్దహ్  15 - 20 వాక్యాలను వినిపించి హితబోధ చేసినప్పుడు సజ్దాలో పడేవారూ, తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పరిశుద్ధతను కొనియాడేవారూ, గర్వపడనివారూ మాత్రమే మా వాక్యాలను విశ్వసిస్తారు. వారి వీపులు పడక లకు ఎడంగా ఉంటాయి  తమ ప్రభువును వారు భయంతోనూ, ఆశ తోనూ వేడుకుంటారు. మేము వారికి ప్రసాదించిన ఉపాధి నుండి ఖర్చు పెడతారు. వారి కర్మలకు ప్రతిఫలంగా, కళ్లకు చలువ కలిగించే ఎటువంటి సామగ్రి వారి కొరకు దాచిపెట్టబడిరదో సామగ్రిని గురించి ప్రాణికీ తెలియదు. విశ్వాసి అయిన వ్యక్తి విద్రోహిగా మారిపోవటం సాధ్యమేనా? ఉభయులూ సమానులు కాలేరు. విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి ఉద్యానవనాలలో నివాసాలు ఉన్నాయి, వారి కర్మలకు ప్రతిఫలంగా వారి ఆతిథ్యానికి. విద్రోహ వైఖరిని అవలంబించిన వారి నివాసం నరకం. వారు దాని నుండి బయటపడ దలచినపుడల్లా, అందులోకే నెట్టబడతారు. వారితో, ‘‘మీరు తిరస్కరిస్తూ ఉండే అగ్ని బాధను ఇపుడు రుచిచూడండి’’ అని అనబడుతుంది.

32. అస్సజ్దహ్  21 - 22  పెద్ద శిక్షకు ముందు, మేము లోకంలోనే (ఏదో ఒక చిన్న) శిక్షను వారికి రుచిచూపిస్తూ ఉంటాము, బహుశా వారు (తమ తిరుగుబాటు వైఖరిని) మానుకుంటారేమో అని. తన ప్రభువు వాక్యాల ద్వారా హితబోధ చేయబడినప్పుడు, వాటిపట్ల విముఖుడయ్యే వానికంటె పరమ దుర్మార్గుడెవడు? అటువంటి అపరాధులకు మేము తప్పనిసరిగా ప్రతీకారం చేసి తీరుతాము.

32. అస్సజ్దహ్  23 - 25 ఇంతకు పూర్వం మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాము. కనుక అదే ప్రాప్తమయ్యే విషయంలో నీకు ఎలాంటి సందేహమూ ఉండనక్కర లేదు, గ్రంథాన్ని మేము ఇస్రాయీల్సంతతి వారికి మార్గదర్శకత్వంగా చేశాము. వారు సహనం వహించినపుడు, మా వాక్యాలను గట్టిగా నమ్మినపుడు, మేము వారిలో నాయకులను ప్రభవింపజేశాము, వారు మా ఆజ్ఞానుసారం మార్గం చూపేవారు. నిశ్చయంగా నీ ప్రభువే ప్రళయంనాడు (ఇస్రాయీల్సంతతివారు) పరస్పరం విభేదిస్తూ ఉన్న విషయాలను గురించి తీర్పు చెబుతాడు.

32. అస్సజ్దహ్  26 - 30 ప్రజలకు ( చారిత్రక సంఘటనలలో) మార్గదర్శకత్వమూ లభించలేదా? - వారికి పూర్వం మేము ఎన్నో జాతులను నాశనం చేశాము  వారు నివసించిన ప్రదేశాలలోనే ఈనాడు వీరు సంచరిస్తున్నారు కదా? ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. వారు వినటంలేదా? వారు దృశ్యాన్ని ఎన్నడూ చూడలేదా? - మేము ఒక బంజరు భూమి వైపునకు నీళ్లను ప్రవహిం పజేస్తూ తీసుకువస్తాము, తరువాత భూమి నుండే పంటలు పడిస్తాము, వాటిద్వారా వారి పశువులకూ మేత దొరుకుతుంది, స్వయంగా వారూ తింటారు. వారు దేనినీ చూడరా? వారు ఇలా అంటారు, ‘‘నీవు సత్యవంతుడవే అయితే, అసలు తీర్పు ఎప్పుడు జరుగుతుందో చెప్పు?’’ వారితో ఇలా అను, ‘‘తీర్పు దినం నాడు విశ్వసించటం అనేది అవిశ్వాసులకు ఏమాత్రం లాభదాయకంగా ఉండబోదు. తరువాత వారికి గడువనేది దొరకదు.’’ సరే, మంచిది వారి మానాన వారిని వదలిపెట్టు. నిరీక్షించు. వారూ నిరీక్షిస్తున్నారు.

No comments:

Post a Comment