82 సూరహ్ అల్ ఇన్ ఫితార్

 

82 అల్ ఇన్ ఫితార్

ఆయతులు : 19                                   అవతరణ : మక్కాలో

అనంత కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన  అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.

1 - 5  ఆకాశం బ్రద్దలైనప్పుడు, నక్షత్రాలు చెదిరిపోయినప్పుడు, సముద్రాలు చీల్చబడినప్పుడు, సమాధులు తెరువబడినప్పుడు - అప్పుడు ప్రతి మనిషికీ తాను ముందూ వెనుకా చేసుకున్నదంతా ఏమిటో తెలిసిపోతుంది.

6 - 12 మానవుడా! పరమదాత అయిన నీ ప్రభువును గురించి విషయం నిన్ను మోసంలో పడ వేసింది? ఆయనే నిన్ను సృష్టించాడు,  ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు, నిన్ను తగిన రీతిలో పొందికగా రూపొం దించాడు, తాను తలచిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలిచాడు. ఎంత మాత్రం కాదు, (అసలు విషయమేమిటంటే) మీరు శిక్షా ప్రతిఫలాలు లేవని తిరస్కరిస్తున్నారు. కాని మీపై కాపలాదారులు నియమించబడి ఉన్నారు, మీ చర్యలను ఒక కంట కనిపెడుతూ ఉండే గౌరవనీయులైన లేఖకులు మీపై నియమించబడ్డారు. మీరు చేసే ప్రతి పనీ వారికి తెలుసు.

13 - 19 నిశ్చయంగా సజ్జనులు సుఖసంతోషాలలో తేలియాడుతూ ఉంటారు. నిస్సందేహంగా దుర్జనులు నరకానికి పోతారు. తీర్పుదినం నాడు వారు అందులో ప్రవేశిస్తారు. ఇక అందులో నుంచి ఎంతమాత్రం బయటపడలేరు. అవును, తీర్పు దినమేమిటో నీకేమైనా తెలుసా? రోజున మనిషి కొరకూ ఏదైనా  చెయ్యటమనేది  ఎవరికీ సాధ్యం కాదు. ఆనాడు తీర్పు ఇచ్చే అధికారం పూర్తిగా అల్లాహ్ చేతుల్లోనే ఉంటుంది.

No comments:

Post a Comment