47. ముహమ్మద్
ఆయతులు
: 38 అవతరణ : మదీనాలో
అనంత
కరుణామయుడు, అపారకృపాశీలుడు అయిన
అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
1 - 3 అవిశ్వాసానికి పాల్పడి, (ప్రజలను) అల్లాహ్ మార్గం వైపునకు పోకుండా నిరోధించిన వారి కర్మలను అల్లాహ్ నిరర్థకమైనవిగా చేశాడు. విశ్వసించి, మంచిపనులు చేసినటువంటి, ముహమ్మద్పై అవతరించినది - అది పూర్తిగా సత్యమేనని, అది వారి ప్రభువు వద్దనుండి వచ్చినదని - నమ్మినటువంటి వారి నుండి అల్లాహ్ వారి చెడుగులను దూరం చేసి, వారి స్థితిని చక్కబరిచాడు. దానికి కారణం అవిశ్వాసులు
అసత్యాన్ని అనుసరించుటయే. విశ్వాసులు ఈ విధంగా తమ ప్రభువు వద్దనుండి వచ్చిన సత్యాన్ని అనుసరించుటయే. అల్లాహ్, ప్రజలకు తమ నిజమైన స్థానం ఏమిటో తెలియజేస్తాడు.
4 - 6 కనుక మీరు ఈ అవిశ్వాసులతో తలపడినప్పుడు, వారి మెడలను ఖండిరచటమే మీరు చేయవలసిన మొదటి పని. చివరకు మీరు వారిని పూర్తిగా అణచివేసిన తరువాత, ఖైదీలను గట్టిగా బంధించండి. ఆ తరువాత (మీకు ఇలా చేసే అధికారం ఉంది). వారికి మేలైనా చేయండి లేదా వారి నుండి పరిహారం (సొమ్ము) తీసుకొని వదలివేయండి. యుద్ధంలో తన ఆయుధాలు క్రిందపడవేసే వరకు (ఇలా జరగాలి). ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్ తలచుకుంటే స్వయంగా ఆయనే వారిని ఎదుర్కొనేవాడు. అయితే మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి (ఆయన ఈ పద్ధతిని అవలంబించాడు). అల్లాహ్ తన మార్గంలో చంపబడిన వారి కర్మలను ఎంతమాత్రం వ్యర్థం చేయడు. ఆయన వారికి మార్గం చూపుతాడు, వారి స్థితిని చక్కబరుస్తాడు, తాను వారికి తెలియజేసిన స్వర్గంలో వారిని ప్రవేశింపజేస్తాడు.
7 - 12 విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు సహాయం చేస్తే, ఆయన మీకు సహాయం చేస్తాడు, మీ పాదాలను స్థిరంగా ఉంచుతాడు. ఇక అవిశ్వాసుల విషయానికి వస్తే, వారికి వినాశం తప్పదు. అల్లాహ్ వారి కర్మలను తోవ దప్పించాడు. ఎందుకంటే వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అంగీక రించలేదు. కనుక అల్లాహ్ వారి కర్మలను వ్యర్థపరిచాడు. వారికి పూర్వం గతించిన ప్రజల పర్యవసానం ఎలా జరిగిందో చూసేందుకు వారు భూమిపై సంచరించలేదా? అల్లాహ్ వారిని సమూ లంగా తుడిచిపెట్టాడు. ఇటువంటి ఫలితాలే ఈ అవిశ్వాసులకు వ్రాసిపెట్టబడి ఉన్నాయి. ఎందుకంటే, విశ్వాసు లకు రక్షకుడూ, సహాయకుడూ అల్లాహ్ యే. అయితే అవిశ్వాసులకు సహాయ కుడూ, రక్షకుడూ అనేవాడు ఎవ్వడూ లేడు. విశ్వసించి, మంచిపనులు చేసే వారిని అల్లాహ్, క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అవిశ్వాసులు కేవలం కొన్నాళ్ల ప్రాపంచిక జీవితంలోని సౌఖ్యాలను జుర్రుకుం టున్నారు. పశువులు మాదిరిగా తింటున్నారు, త్రాగుతున్నారు. వారి అంతిమ నివాసం నరకం అవుతుంది.
13 - 15 ప్రవక్తా! నిన్ను బహిష్కరించిన నగరం కంటే ఎంతో శక్తిమంత ములైన నగరాలు ఎన్నో గతించిపోయాయి. మేము వాటిని ఎవ్వరూ కాపాడలే నంతగా సర్వనాశనం చేశాము. తన ప్రభువు తరఫు నుండి ఒక స్పష్టమైన సన్మార్గం పొందినవాడు, తమ దుష్కార్యాలు మనోహరమైనవిగా కనిపించేలా చేయబడి, తమ కోరికలకు దాసులైన వారి మాదిరిగా ఎలా కాగలుగుతాడు? భయభక్తులు కలవారికి
వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క వైభవం ఇలా ఉంది, అందులో
నిర్మలమైన నీటి కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, ఏ మాత్రమూ మారని రుచిగల పాల కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, సేవించే వారికి మధురంగా ఉండే మద్యపు కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి, స్వచ్ఛమైన తేనె కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అందులో వారికొరకు అన్ని రకాల పండ్లు ఉంటాయి. ఇంకా వారి ప్రభువు తరఫు నుండి క్షమాభిక్షకూడ. (ఇలాంటి స్వర్గాన్ని తన వంతు భాగంగా పొందనున్న వ్యక్తి) నరకంలో శాశ్వతంగా ఉండిపోయే వారి మాదిరిగా పేగులను సైతం కోసివేసేటటువంటి సల సల కాగే నీరు ఇవ్వబడే వారి మాదిరిగా కాగలడా?
16 - 18 వారిలో
నీ మాటలను చెవియొగ్గి వినేవారు కొందరు ఉన్నారు. అయితే నీ దగ్గర నుండి వెళ్లిపోయిన తరువాత, జ్ఞాన భాగ్యం ప్రసాదించబడిన వారిని, ‘‘ఇంతకు ముందు అతను అన్నది ఏమిటి?’’ అని అడుగుతారు. హృదయాలపై అల్లాహ్ ముద్రవేసిన వారు వీరే.వారు తమ కోరికలకు దాసులై పోయినవారు. ఇక మార్గం పొందినవారు, అల్లాహ్ వారికి ఇంకా ఎక్కువగా మార్గం చూపుతాడు, వారికి వారి వంతు భయభక్తులను ప్రసాదిస్తాడు. ఇప్పుడు వారు ప్రళయం కొరకే ఎదురు చూస్తున్నారా, అది అకస్మాత్తుగా వారి మీద విరుచుకుపడాలని? దాని సూచనలైతే వచ్చేశాయి. స్వయంగా అదే వచ్చి నప్పుడు, ఇక వారికి హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడ మిగిలి ఉంటుంది?
19 కనుక ప్రవక్తా! బాగా తెలుసుకో, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైనవాడు ఎవ్వడూ లేడు అని. నీ పొరపాట్లకు క్షమాభిక్ష పెట్టుము అని వేడుకో, విశ్వాసు లైన స్త్రీ పురుషుల పొరపాట్లకు కూడ. అల్లాహ్ నీ కార్యకలాపాలను కూడ ఎరుగును, నీ విశ్రాంతి స్థలాన్ని కూడా ఎరుగును.
20 - 28 విశ్వాసులు ‘‘(యుద్ధానికి సంబంధించిన ఆదేశం గల) సూరా ఏదైనా ఎందుకు అవతరించదు’’
అని అంటూ ఉండేవారు. కాని యుద్ధ ప్రస్తావన గల
ఒక నిర్దిష్టమైన సూరా అవతరింప జేయబడినప్పుడు తమ హృదయాలలో వ్యాధిగల వారు, మరణం ఆవహించిన వారి మాదిరిగా నీ వైపు చూడటాన్ని నీవు గమనిస్తావు. వారి వైఖరి ఎంతో శోచనీయం. విధేయ తను పాటిస్తామనే
వారి వాగ్దానమూ, మంచి మంచి మాటలూ (కేవలం నోటి మాటలే) కాని స్పష్టమైన ఆజ్ఞ ఇవ్వబడినప్పుడు, వారు తాము అల్లాహ్ కు చేసిన ప్రమాణాన్ని నెరవేర్చటంలో తమ నిజాయితీని నిరూపించుకుని ఉంటే, అది వారికే శ్రేయస్కరమైనదిగా ఉండేది. ఇక మీ నుండి ఇంతకంటే ఏమి ఆశించవచ్చు
ఒకవేళ మీరు విముఖులైపోతే, భూమిపై మళ్లీ కల్లోలాన్ని రేకెత్తిస్తారు. పరస్పరం గొంతులు కోసుకుంటారు. అల్లాహ్ శపించినవారూ, అంధులుగానూ, బధిరులుగానూ, చేసిన వారూ వీరే. వారు ఖురాన్ను గురించి ఆలోచించలేదా? లేక వారి హృదయాలకు తాళాలు పడి ఉన్నాయా? యథార్థ మేమిటంటే, మార్గదర్శకత్వం వారికి స్పష్టపడిన తరువాత కూడ దానికి విముఖులైన వారికి షైతాను ఈ వైఖరిని అవలంబించడం సులభతరం చేశాడు, లేనిపోని ఆశల పరంపరను వారికొరకు పెంచివేశాడు. అందుకే వారు అల్లాహ్ అవతరింపజేసిన ధర్మాన్ని ద్వేషించే వారితో ‘‘కొన్ని విషయాలలో మేము మిమ్మల్ని అనుసరిస్తాము’’ అని అన్నారు. అల్లాహ్ వారి ఈ రహస్యాలోచనలను బాగా ఎరుగును. దైవదూతలు వారి ఆత్మలను వశపరచుకునేటప్పుడు, వారి ముఖాలపై, వీపులపై కొడుతూ వారిని తీసుకువెళ్లేటప్పుడు, వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలా ఎందుకు జరుగుతుందంటే, వారు అల్లాహ్ కు ఆగ్రహం కలిగించే విధానాన్ని అనుసరించారు, ఆయన ప్రసన్నుడయ్యే మార్గాన్ని అవలం బించటానికి ఇష్టపడలేదు. ఈ కారణంగానే ఆయన వారి కర్మలు అన్నింటినీ వృధాచేశాడు.
29 - 31 హృదయాలలో వ్యాధి కలవారు, తమ మనస్సులలోని కల్మషాన్ని అల్లాహ్ బహిర్గతం చేయడని అనుకుంటున్నారా? మేము తలచుకుంటే వారిని నీకు చూపిస్తాము, వారి ముఖాలనుబట్టి నీవు వారిని గుర్తిస్తావు. అసలు వారు మాట్లాడే తీరునుబట్టే నీవు వారిని గురించి తెలుసుకుంటావు. అల్లాహ్ మీ అందరి కర్మలను గురించి బాగా ఎరుగును. మేము మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాము, తద్ద్వారా మీ స్థితిని నిర్ణయిస్తాము. మీలో అల్లాహ్ మార్గంలో గట్టిగా కృషిచేసేవారు ఎవరో, స్థిరచిత్తులు ఎవరో చూస్తాము.
32 - 38 ఋజుమార్గం ఏదో స్పష్టంగా తెలిసినప్పటికీ, సత్యాన్ని తిరస్కరించి, అల్లాహ్ మార్గం నుండి (ప్రజలను) నిరోధిస్తూ, ప్రవక్తతో వివాదపడిన వారు నిజానికి అల్లాహ్ కు ఏ మాత్రం నష్టం కలిగించలేరు. పైగా అల్లాహ్ యే వారు చేసిన పనులన్నింటినీ నిష్ఫలం చేస్తాడు. విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయత చూపండి, ప్రవక్తకు విధేయత చూపండి, మీ పనులను వృధా చేసుకోకండి. అవిశ్వాసానికి పాల్పడే వారినీ, దైవమార్గం వైపునకు పోకుండా (ప్రజలను) నిరోధించే వారినీ, మృత్యువు వచ్చేవరకు సత్య తిరస్కారస్థితిపై స్థిరంగా ఉండేవారిని అల్లాహ్ ఎంతమాత్రం క్షమించడు. కనుక మీరు అధైర్యపడకండి, రాజీపడటానికి వారిని పిలవకండి. మీరే ఆధిక్యం పొందే వారు. అల్లాహ్ మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీ కర్మలను నిరర్థకం చేయడు. ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట మాత్రమే. ఒక వినోదం మాత్రమే. మీరు విశ్వసించి, భయభక్తుల వైఖరిని అవలంబిస్తే, అల్లాహ్ మీకు మీ ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన మీనుండి మీ ధనాన్ని అడుగడు. ఒకవేళ ఆయన మీనుండి మీ ధనాన్ని అడిగితే, మీ ధనం మొత్తాన్ని కోరితే, మీరు పిసినారితనం చూపుతారు. ఆయన మీ దోషాన్ని వెలికితీస్తాడు. చూడండి! అల్లాహ్ మార్గంలో ధనం ఖర్చుపెట్టండి అని మీకు పిలుపు ఇవ్వబడుతోంది. దాని విషయంలో మీలో కొందరు పిసినారితనంతో వ్యవహరిస్తారు. కాని పిసినారితనం వహించే వ్యక్తి నిజానికి తనపట్ల తానే పిసినారితనం చూపు తున్నాడు. అల్లాహ్ అయితే ఎంతో సంపన్నుడు, మీరే ఆయనపై ఆధారపడి ఉన్నవారు. ఒకవేళ మీరు విముఖులైతే, అల్లాహ్ మీస్థానంలో మరోజాతిని దేన్నయినా తీసుకువస్తాడు. వారు మీ వంటి వారై ఉండరు.
No comments:
Post a Comment